కొన్ని మెరుపులూ మరికొన్ని మొట్టికాయలు 

(నీల నవలపై సాహితీ సమితిలో జరిగిన చర్చను గంగాధర్ గారి వాల్ నుంచి తీసుకున్నాను. నచ్చిన పుస్తకం జ్యోతి గారి వ్యాసం ఇంతకు ముందు నా వాల్ లో పోస్ట్ చేసాను కనుక ఇక్కడ రిపీట్ కాకూడదని తీసేసాను. మిగతాది యథాతథంగా)

సాహితీసమితీ వార్తా లేఖ-ఏప్రిల్ 2018

నీల నవలపై చర్చ-

సాహితీ సమితి ఏప్రిల్ నెల సమావేశం 29 వతేదీన మల్లీశ్వరి వ్రాసిన “నీల” నవల పై చర్చ జరిగింది.చర్చకు సాహితీసమితి సభ్యులు సనామ,నరసింహారావ్, శశిశేఖర్,జతిన్, రమణి, రాజ్యలక్ష్మి,రజని,ఉష,జయ,ఇందిర,T.ఇందిరా,అమరవాది నీరజ,రామారావ్, రాంబాబు ,ప్రత్యేక ఆహ్వానితులుగా జ్యోతి హాజరయ్యారు.

కె.జె.రామారావ్:

ఆంధ్రదేశంలో తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం,అనంతర పరిణామాలు – క్రింది వర్గాలలో వచ్చిన మార్పులు,మిల్లు కార్మికుల పోరాటాల నేపధ్యం లో పరిశ్రమలలో అదనపు విలువ దోపిడి,స్త్రీల పని పరిస్థితులు వాటి మెరుగుదల కొరకు జూట్ మిల్ కార్మికుల పోరాటాలు, డ్వాక్రా సంఘాలు,మైక్రో ఫైనాన్స్ వడ్డి వ్యాపారం,ప్రజల సొమ్మును పెట్టుబడిగా జరిగిన ప్రయోగం,క్రింది వర్గాల నుండి నాయకులుగా ఎదిగిన స్త్రీలు పాలక వర్గాల అనుయాయూలగా ఎదిగిరావటం,కుటుంబసంబంధాలలో ఉన్న అసమస్థితి, చంద్రకళ, ఆరంజ్యోతి,నీల,సంపూర్ణ లనేపధ్యాన్ని ఈ నవల అద్దం పట్టింది.

అట్టడుగు జీవితాన్నుండి ఎదిగిన నీల, తల్లి చంద్రకళ హత్య తో పాస్టరమ్మ దంపతుల ఆదరణ తో పెరిగి ప్రసాద్ తో వివాహం, ప్రసాద్ కు సరళ తొ ఉన్న సంబంధం తొ ఘర్షణ పడి ప్రజా సంఘాల సహకారం తో కూతురుతో బయటకు వచ్చిన నీల,చోళదిబ్బ ప్రాంతానికి వచ్చి సంపూర్ణ సహకారం తో జీవించడం,డాక్వా సంఘాల అధ్యయనం కోసం వచ్చిన పరదేశి సహకారం తోపరదేశీ ఆకర్షణ తో విశాఖ తీరప్రాంత మత్స్యకారుల జీవితాలతో పరిచయం,శ్రీకాకుళ ప్రాంతాల పర్వటన అనంతరం పరదేశి కి ఇంకొక స్త్రీ తో సంబంధం ఉందని తెలిసి అతనితో సంబంధాన్ని కాదనుకోవటం తో నవల సగభాగం పూర్తవుతుంది.

అనంతరం అజిత తో కలిసి స్వచ్చంద సంస్థ లో పని చేస్తూ గతం లో వ్యక్తిగత సమస్య పరిష్కారం లో సహాయపడిన సదాశివం పరిచయంతో సదాశివం తల్లి దగ్గర స్వచ్చంద సంస్థలో పనిలో చేరి సదాశివ ఆకర్షణతో అతనికి దగ్గరవుతుంది.సదాశివంకు అనేకమంది స్త్రీలతో సంబంధము న్నదని తెలిసినా అతనికి దగ్గరవుతుంది. అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోవటం సదాశివం తో కలిసి జీవించాలనుకోవటం నీల బలహీనతను తెలియజేస్తోంది.తన తల్లి బలహీనతను క్షమించని నీల ,భర్త ప్రసాదుకు సరళతో ఉన్న సంబంధాన్ని జీర్ణించుకోలేక బయటకు వచ్చిన నీల,పరదేశి కి వేరే సంబంధం ఉన్న కారణం గా బయటకు వచ్చిన నీల సదాశివం తొ కలిసి జీవించటమనేది వివాదాస్పదమయిన నిర్ణయమే.అలాగే పరదేశిని కలవడానికి విశాఖ వెళ్ళిన నీల పరదేశి గురించి ఆలోచిస్తూ నేను అతనితో ఉండి ప్రజా ఉద్యమాలతో మమేకమైతే బాగుండు అనే పునరాలోచన ఒక్కక్షణం మెరుపులా మెరిసినా మళ్ళీ వెన్నక్కి తిరిగి రావటం ఆమె లోని అనిశ్చిత స్థితి ని తెలియజేస్తోంది.

మిల్లుకార్మికుల ఉద్యమం, డాక్వా సంఘాల, చోళదిబ్బ రాజకీయాలు,మత్స్యకారుల జీవితాల్లో పోర్టులు తెచ్చిన మార్పులు(సెజ్) అంతర్లీనంగా ప్రస్తావించినా ఉద్యమాల ఎడల సానుభూతి గల ప్రజల్లో అనుకూలతగా కన్పించినా నవల చివరికొచ్చేసరికి పాఠకులకు ఆ ఉద్యమాలు వెలుపరివారి గానే ఉంచుతాయి. అట్టడుగు స్థితిలోంచి ఎదిగి వచ్చిన నీల ప్రసాద్ తో వివాహం అనివార్యమైనా సదాశివం తో కలిసిజీవించటం,స్వచ్చంద సంస్థతోకలిసి పనిచేయటంఅనేది గమనించినప్పుడు రాష్ట్రం లో జరిగిన అనేక ఉద్యమాల వైఫల్యం వల్లబయటకువచ్చిన వారు స్వచ్చంద సంస్థలలో చేరి జీవనోపాధి వెతుక్కున్న వైనం నీల జీవితం లో జరిగిందా అనిపిస్థుంది.

ప్రజా ఉద్యమాలకు స్వచ్చంద సంస్థల కార్యాచరణ పోటీ కాక పోయినా,పాఠకులను ప్రజా ఉద్యమాల ఎడల సానుభూతి కల్గించి ఆఉద్యమాల వైపు ఆకర్షించి ఉంటే ఈ నవల ఇంకొక మలుపు తిరిగి ఉండేది.కాని అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నీల తన సౌఖ్యం కోసం సదాశివం తో సహజీవనం అనే దానిని రచయిత ఆదర్శీకరించినట్లు కనబడుతోంది.వ్యక్తులు ఎలాజీవించినా సమూహంకోసం, సంఘంకోసం పనిచేస్తే తప్పకుండా గొప్పవారుగానే ఉంటారు.అలా కాకుండా వ్యక్తిగత సౌఖ్యం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా వాటికంత ప్రాధాన్యత ఉండదు.

సమాజంలోని సంక్షోభాన్ని పరిష్కరించే క్రమం లో వైరుధ్యాలు తీవ్రమైన దశలో జీవితాన్ని చిత్రించే నవలల్లో అమ్మ నవల, ప్రేమచంద్,శరత్, టాగూర్ నవలను ప్రత్యేకం గా చెప్పుకోవాలి. భారతదేశంలో మధ్యతరగతి విద్రోహం ,పాలక వర్గాలలో భాగమవ్వడం, క్రిందివర్గాలకు నాయకులుగా ఉన్న మధ్యతరగతి వర్గం రాజీ స్వభావం ఆ ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచింది.క్రింది వర్గాలలో నాయకత్వం అభివృద్ధి కాకపోవటం ముందు చూపుతో ఉద్యమాలుకొనసాగక పోవటం వలన మన దగ్గర ఆటుపోట్లు మాత్రమే కనిపిస్తాయి. యూరప్ లోమధ్యతరగతి విద్రోహాన్ని అధిగమించి సమాజం ముందుకెళ్ళింది.కాబట్టే అక్కడ విప్లవాలు,గొప్ప నవలలూ ఆదర్శ జీవితం కనిపిస్తుందికాని.ఇక్కడ కింది వర్గాలనుండి వచ్చిన నీల వంటి వారు మధ్యతరగతి తో కలిసిపోవటం అనేది ఒక విషాదం.

శశిశేఖర్:

నేను ఈ నవల ను ముందు మాటలతో మొదలుపెడతాను.ముందుగా వారి మాటలను ఉటకించిన తర్వాత నవలను సమీక్షిస్తాను.’నీల’నవల గురించి చినవీరభధ్రుడు,స్వేఛ్ఛ,సహజీవనం గురించిచర్చిస్తే, ఎకె.ప్రభాకర్ గారు,ఒక అడుగు ముందుకు వేసి’స్వేఛ్ఛను ప్రేమించగలిగిన వాళ్ళు నీల తో కలిసి నడవగలిగిన వాళ్ళు మటుకే పేజీలు త్రిప్పి నవలలోకి జొరబడాలని హెచ్చరిక చేశారు.దీనినిబట్టి నవలలో ప్రతిపాదించబడిన అభిప్రాయాలతో ఏకీభవించని వారు సంప్రదాయవాదులుగాను తిరోగమన వాదులుగాను పరిగణింపబడతారనే అభిప్రాయాన్ని వీరిద్దరి పరిచయవాక్యాలు కలిగిస్తున్నాయి.

నిజానికి రచయిత్రి (మల్లీశ్వరి) శైలి చాలా అద్భుతంగా ఉంది. Narrative Abilities పుష్కలంగా ఉన్నాయి.ఏ రచయిత్రికీ లేని రచనా పటుత్వం మల్లీశ్వరిలో ఉన్నాయి.కవిత్వాన్ని గొప్పగా చెప్పి పాఠకులను మెస్మరైజ్ చేసే నైపుణ్యాలు ఉన్నాయి.స్చేఛ్ఛ ప్రేమ అనేవి కొత్త విషయాలు కావు.కొ.కు. తన సాహిత్యంలో స్వేఛ్ఛ గురించి మాట్లాడినా,అవి అంతర్లీనంగా జీవితంలో భాగంగా ఉంటాయి తప్ప ఎక్కడా ఈ విషయాలు చర్చకు రావు.స్వేఛ్ఛ అనేది కమ్యూనిష్టులుగాని మరెవరో గాని చెప్పింది కాదు.ఇది లిబరల్ బూర్జువా కాన్సెప్ట్. ఏ సమాజంలో అణచివేత ఉంటుందో అక్కడ స్వేఛ్ఛ కోసం పోరాటం ఉంటుంది.ఉదారవాద బూర్జువా వ్యవస్థలో వారి మనుగడ దోపిడి,మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది.ఈ నవలలో ఎలాంటి అవగాహన లేకుండా స్వేఛ్ఛ గురించి అసంబద్ధంగా రాయటం జరిగిం ది. అమలు లో ఉన్న నీతులు, నియమాలు, చట్టాలు, న్యాయాలు సహజము అనివార్యము అని భావించినంత కాలం వాటిని ఉల్లఘించటం నేరంగాను, పాపంగాను తోస్తుంది.వాటి స్వరూప స్వభావాలనుఅర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే వాటి మూలాలు బోధపడతాయి.వాటి వెనక ఉన్న మార్మికత అర్ధమవుతుంది.

మానవ సంబంధాలలో ముఖ్యంగా స్త్రీ,పురుషుల లైంగిక సంబంధాలలో ఉన్న మార్మికతను సాహిత్యం చూపగలగాలి.కాని ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించటం సాహిత్యం పని కాదు ఇన్నాళ్ళు అనవసరంగా మోస్తున్” అసత్య’ భారాన్ని దించుకోగలిగిన,అమలులో ఉన్న అసంబద్దతను తిరస్కరించగలిగిన సంస్కారాన్ని సాహిత్యం ఇవ్వగలగాలి.
విషయాన్ని సరిగ్గా అర్ధం చేసికోని పక్షంలో తిరస్కార ధోరణి దానికదే ఆదర్శంగాను,పాతబరువు స్థానంలోనేతలకెత్తుకున్న కొత్త బరువుగాను అతిశయించినఆహంకారంగా పరిణమించిన నైతిక,బౌద్ధిక , గీర్వాణం గాను తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఆది లోనే దీనిని గుర్తించి మొగ్గలోనే తుంచకపోతేరోగం కంటే ప్రమాదకరమైన వైద్యంచందాన తయారవుతుంది.
తన తల్లి ఎవరితోనో సంబంధంఉందని తెలిసి దాన్ని అసహ్యించుకున్న నీల, ప్రసాద్ సరళ ల సంబంధం విషయంలో ఘర్షణకు లోనవుతుంది. ఈ ఘర్షణలో ప్రసాద్ నలిగి పోతున్నాడని ఆవేదన చెందుతుంది తప్ప సరళ గురించి సానుభూతి చూపించదు. ప్రసాద్,పరదేశి,సదాశివ_ ఈ ముగ్గురిలోను ప్రసాద్ తో నీల సంబంధం ఒక్కటే ఈ భూలోకంలో జరిగినట్లు అనిపిస్తుంది.ప్రసాద్ చెడ్డవాడు కావచ్చు కాని అర్ధం అవుతాడు.పరదేశి తో సంబంధం ఏ మోహమయ ప్రేమ జగత్తు లోనో జరిగినట్లు ఉంటుంది.పరదేశి మంచి చెడ్డలు సామాన్యులకు అంతుపట్టవు.అప్పటికి ఐదేళ్ళుగా చేతన అనే మెడికల్ స్టూడెంట్ తో సహజీవనం చేస్తున్న పరదేశి తన జీవనసహచరితో ఎటువంటి అసంతృప్తులు లేని పరదేశి నీలను చూసిన క్షణం లోనే తన పూర్వ సంబంధానికి ఉద్వాసన పలికి జీవితాన్ని మరింత ప్రేమించగలిగేందుకు నీలతో సంబంధాన్ని కోరుకుంటాడు.తనను అర్ధం చేసుకోలేనంత సంకుచిత హృదయురాలిగా చేతనను భావించటం తన అహంకారమవుతుందని ఉద్ఘాటిస్తాడు.

ఇక అనేక స్త్రీల సదా ఏకకాలంలో అనేక సంబంధాలు సాధ్యమే అన్న సదా రిలాక్స్ అయ్యేందుకు తనను కోరుకునే వారిపట్ల,వారి ప్రయివసీ పట్ల కమిట్ అయిన సదాప్రేమ కోసం తపించి,అలసి సొలసి నీల నీడన సేద తీర్చుకునేందుకు వస్తాడు.అందరూ అనుకున్నంతగా తనకంతగా సుఖమేమి దొరకలేదంటాడు.Parallel Universes, Multiple Universes గురించివివరించే క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే క్వాంటమ్ నీతిశాస్త్రమేదైనా ఉంటే అది మటుకే మనని సదాశివను అర్ధం చేయించగలదు. ఇక అజిత విషయానికొస్తేఎమోషనల్ బాండేజ్ తో వచ్చే ఏ మానవ సంబంధాన్ని భరించగలిగే శక్తి అజితకు లేదు. అజిత శీలం లేని ఆడదని ఎవరూ అనరు.కాని బాధ్యత లేని మనిషంటే ఎవరూ కాదనరేమో! మానవ స్పర్శ సోకని వట్టి శారీరక అనుభవం,కాలంతో తూచగల అనుభవం ఏ రకంగా సత్యమో ఆవిడకే తెలియాలి.ఒక అద్భుతమైన అనుభవం తాలూకూ పరిమళాన్ని నిలుపుకోలేనిఅజిత జీవితం గొప్ప విషాదం
మొత్తం మీద నీల ఒక మహత్తర ఆధునిక(ఆధునింకాతర) కాల్పనిక రచనగా తోస్తుంది.నవలకంతటికి మిగిలేవి అద్భుతమైన కవితా శకలాలే.రాజకీయ మూలాలను ప్రస్తావించకుండా కేవలం సామాజిక అంశాలను ఉద్యమాల చరిత్రను ఉటకించటం ద్వారా కెంఎన్.మల్లీశ్వరి దీనిని కాల్పనిక స్థాయికి మించి తీసుకెళ్ళలేక పోయారు.

జతిన్:

నవలకు నీల అని పేరు పెట్టడంవల్ల చర్చ అంతా నీల పాత్ర చుట్టూ తిరుగుతోంది.నీల అనేది నెపం మాత్రమే.పురాణాలు,మహాభారతంలోని ఉపకధల్లాగా ఈ నవలలో డ్వాక్రా, సారా,జూట్ మిల్ కార్మికుల ఉద్యమాలు మూడొందల పేజీల దాకా నడిచాయి .శిల్పం గురించి శశిశేఖర్ బాగా చెప్పారు.కధ నడుస్తుండగా సాధారణ పాఠకుడు కధ వెనకాలే వెడతాడు.

ఈ రచయిత్రి అనేక రచనలు చేసి చేయితిరిగిన రచయిత్రి.మధ్యలో సదాశివ కుటుంబ చరిత్ర గూర్చి 80 పేజీలు కధ నడుస్తుంది.అసలు కధ ఆపేసి ఇంకో ఎపిసోడ్ ఇక్కడమొదలవుతుంది. శిల్పపరంగా ఇది సరికాదు.నీల దళిత జీవితం నుండి రావటం దాంపత్య జీవితం గురించి,నీతి,అవినీతుల గురించి స్పష్టమైన అభిప్రాయాలు ఉండటం దానికి సంబంధం లేని విధంగాసదాశివం తల్లితండ్రుల మధ్య ఉండే సాంస్కృతిక వైరుధ్యం, తండ్రిని interial level లో ఉంచటం, సదాశివం తల్లి ప్రోఫెసర్ గా ,N.G.O. సంస్థలలో పనిచెయ్యడం కనిపిస్తుంది.నిజానికి ఎనభైల నాటి శ్రీకాకుళ ఉద్యమం తో పోల్చుకుంటే ఈరోజు వాటి స్థానంలో ఎన్.జి.ఓ ల ప్రాబల్యం ఎక్కువగాఉంది.

చిన వీరభద్రుడు,ఎ.కె.ప్రభాకర్ గార్లు నీల ప్రయాణం మార్క్సిజం పరిధి దాటి పోస్ట్ మోడర్నిజమ్ వైపు వెళ్ళినట్లు రాశారు.నీల తల్లికి,నీలకు,మినో కు కూడా స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు ఎలా ఉంది అనే దగ్గరే మొదలయింది.పోస్ట్ మోడర్నిజమ్ లో ఏ విధంగా అయితే వివిధ అస్థత్వ వాదులుగా విడివిడి వ్యక్తులుగా చీలిపోయే వైనంఉంటుందో అది ఇందులో కనిపిస్తుంది.మినోకు సదాశివం తో జరిగిన చర్చలోఒక కేసుకు సంబంధించి సదాశివం కులంపైపు కాకుండా స్త్రీ వైపు వెళ్ళటాన్ని ప్రశ్నిస్తుంది మినో.మన తరం వారు మార్క్సిస్టు భావజాలంతో కొన్ని విలువలకు కట్టుబడి జీవిస్తే,మినొ లాంటిఈ నాటి తరం వాటికి తిలోదకాలిచ్చి వాళ్ళు చేసే ఆలోచనలు పురోగమనం వైపా?తిరోగమనం వైపా? అనిపిస్తుంది. ఈ నవలలో ఇదే విషయాన్ని నీల తల్లతండ్రులు జీర్ణించుకోలేని పరిస్థితి.నీల సూర్యం పాత్ర ప్రభావం తో ఏదో చెయ్యాలి అనుకోవటమే కాని ఏది చెయ్యలేక పోతుంది.అలాగే పరదేశి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోతుంది.అయినప్పటికి తనలో ఉన్న సాంప్రదాయ భావనలు కారణంగా పరదేశి ని అంగీకరించలేక పోతుంది.

నీల జీవితంలో సంపూర్ణ పాత్ర అనేది నాదృష్టిలోచాలా గొప్ప క్యారెక్టార్.అయితేనీల సంపూర్ణ ఆలోచనలను అవగాహనను పూర్తిగా అంగీకరించ లేకపోతుంది.అందువల్లనే తనకు అన్నివిధాలా సపోర్ట్ చేసినా నిలుపుకోలేకపోయింది.నీల లో సాంప్రదాయం ఉంది.అందువల్లనే సదాశివ తో జీవితాన్ని పంచుకునేటప్పుడు అంత తేలికగా సర్దుబాటు చేసుకోలేక కొన్ని షరతుల తోనే కలిసి ఉండటానికి ఒప్పుకుంటుంది.మొత్తం మీద నీల అట్టడుగు వర్గం నుంచి వచ్చి సాంప్రదాయ ప్రభావం ఉన్నప్పటికి కొంతలో కొంత తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగటమనేమార్పును అహ్వానించాలి.నిజానికి నీల పాత్ర అక్కడితో ఆగిపోలేదు.వ్యక్తిగత ఆలోచన సామాజిక కార్యాచరణ తో ముందుకు మున్ముందుకే సాగుతూనేఉంటుంది..

ఉష:

నీల నవలలో నీల చిన్నప్పుడు ఎలా ఉందో చివరివరకు అలాగేఉంది.చిన్నతనంలో తనతండ్రి ప్రవర్తన గురించి పెట్టిన పంచాయతీ లో తల్లి మొహంలో ఉన్న సంతోషం కన్నా తండ్రి మొహంలో ఉన్న వ్యతిరేకత,కోపం చాలా సహజంగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది.దానికి ఉదాహరణే మహిళా సంఘంలో తనతల్లి ప్రవర్తన గురించి తప్పుగా మాట్లాడినా పట్టించుకోకపోవటం.తన తల్లికి ఆటో రాజు తో ఉన్న సంబంధం లో ఒక రకమైన శాంతి స్వాంతన ఉందనే విషయాన్ని తరువాత తరువాత నీల గ్రహిస్తుంది.కాని నా తల్లి చేసిన తప్పును నేను చేయను.సమాజం ఇలాంటి సంబంధాన్ని ఎలా చూస్థుంది? ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బాదపడతారు అనే విషయం అనుభవపూర్వకంగాతెలియటం వల్లచాలా జాగ్రత్తగా మసలుకుంటుంది.

ప్రసాద్ కు సరళ తో ఉన్న సంబంధం తో గాయపడుతుంది. నీల పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోఅంతకన్న పరిణతి గా ఆలోచించటం సాధ్యం కాదనిపించింది.ప్రసాద్ తొ సరళ విషయంలో ఘర్షణ పడినా ఒక స్థాయి వరకు సర్దుకుంటుంది.అదే సమయంలో సరళ మీద సానుభూతి కూడా ఉంటుంది.మనిషి కుండాల్సిన నీతి,అవినీతి పరిధిల లోనే ఉండాలని తాను నీతి అనుకున్న దానిని పాటించటానికి ప్రయత్నం చేసే ఒక పాత్ర గా అన్పించింది.అజిత పాత్ర విషయానికొస్తే, అజిత సంతోషి విషయంలో నాకేంటి సంబంధం? అనే విషయంలో నేను ఏకీభవిస్తున్నాను.దానికి తనభర్త హరి మాత్రమే బాద్యుడు అవుతాడు తప్ప తనకేమి సంబంధం లేదనటం సహజమే.తనకు పరిచయం ఉన్నది,సంబంధం ఉన్నది కేవలం హరి తో మాత్రమే.అతని భార్యకు సంబంధించిన విషయంలో పూర్తి బాద్యత హరిదే.ప్రసాద్ తొ సరళ ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటేఅజిత కేవలం అవతలివ్యక్తి తొ శారీరక సంబంధాన్ని మాత్రమే కోరుకుంటుంది తప్ప ఎమోషనల్ బాండిగ్ కాదు.

ముగింపు: తెలుగులో స్త్రీల జీవితం నేపధ్యం గా వచ్చిన నవలగా నీలను చూసినప్పుడు,అది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సందర్భం లో విమర్శకుల ప్రశంసలను పొందిన పరిస్థితుల్లో దీన్ని భిన్న కోణాలను దర్శించాల్సిన అవసరాన్న్ని అవశ్యకతను దృష్టిలో పెట్టుకుని చర్చను నిర్వహించడం జరిగింది.నవలను సమగ్రంగా చర్చించటం జరిగిందనే అనుకుంటున్నాము.

పొన్నపల్లి రాజ్యలక్ష్మి
9493975304

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s