అక్కడన్నీ మగబోర్డులే

మనసంతా హయిగా…నాకు నచ్చే ప్రోఫెసర్.కాత్యాయినీ విద్మహే

  

నవంబర్ 15,16 తేదీల్లో నాగార్జున విశ్విద్యాలయం , గుంటూరు లో ‘మనలోమనం’ రచయిత్రుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. కోస్తాంధ్ర , బిసి, క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యం’ పై 25 కి పైగా రచయిత్రులుమాట్లాడారు. ఆ వివరాలన్నీ వివిధ పత్రికలకి పంపిన సమీక్షల్లో వస్తాయి కాబట్టి సదస్సులోనాకు బాగ గుర్తుండిపోయిన విషయాల్లో కొన్నింటిని మీతో పంచుకుంటాను.  

యూనివర్సిటీ స్పోర్ట్స్ హాస్టల్ లో రచయిత్రులకి వసతి కల్పించారు. యాభైమంది వరకూ హాస్టల్ లో ఉన్నాం. తరచుగా రచయిత్రులందరం కలవడం మూలంగా మా మధ్య ఆత్మీయానుబంధం ఏర్పడింది. దీని మూలంగానే అభిప్రాయ భేదాల పట్ల ఆబ్జెక్టివ్ గా ఉండగలిగే  సహనం అలవడింది. సదస్సుకి 130 వరకూ హాజరయ్యారు. 90 మంది వరకూరచయిత్రులు, మిగతా వారు విధ్యార్ధినులు,ఇతరులు. ఈ సదస్సు సందర్భంగా కాత్యాయినీ విద్మహే, రత్నమాలలను మరింత సన్నిహితంగా  చూడగలిగాను. వారి వ్యక్తిత్వం ఎప్పటి కప్పుడు విభ్రమ గొలుపుతూనే ఉంటుంది. అభిప్రాయాల పట్ల స్పష్టత ,ప్రజాస్వామికంగా వ్యవహరించడం భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ ప్రశాంతంగా ఉండటం,నచ్చని విషయాలను నిక్కచ్చిగా,మృదువుగా ఏకకాలంలో చెప్పగలగడం మా అందరిలో ఎలాంటి భేషజాలం లేకుండా హాయిగా కలిసిపోవడం కాత్యాయనీ విద్మహేలో చూశాను. మొదటి రోజు సదస్సు విరామంలో అందరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నపుడు నేను కాత్యాయిని గారితో అన్నాను ”మీకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందని” మిగతారచయిత్రులు కూడ సరదా పడ్డారు. ఎందుకంటే ఎన్నోసందర్భాల్లో,క్లిష్టమైన పరిస్థితుల్లో సమస్య లొచ్చినపుడు, పరిస్థితి మా చేయి దాటినపుడు ఆమెకి ఫోన్ చేసి విషయాన్ని ఆమె మీదకి వదిలేసే వాళ్ళం. అపుడెపుడూ చిన్నపాటి కోపం కూడ చూపించేవారు కాదు. తన సానుకూల దృక్పధంతో ఆమె ‘మనలోమనం’ కు ఎన్నోమేళ్ళు చేసారు.  అలాంటి కాత్యాయిని గారికి కూడ నవంబర్ 16న కోపమొచ్చిందోచ్……  ఒకామె (పేరు చెప్పను)  పత్రం చదువుతూ ఎంతకీ మైక్ వదలక పోతే “అమ్మాతల్లీ ఇక వదిలేయి” అంటూ తన ముందున్న కొత్త కుర్చీకి ఉన్నచిరిగి పోయిన పాలిథీన్ కవర్ ని  పర్ మని లాగేస్తూ మా అందరికీదొరికిపోయారు. చుట్టూవున్నఅయిదారుగురం ఆ ముగ్ధ మనోహర అసహనాన్నిచూసి జోకులేసుకుని నవ్వుకున్నాం(సదస్సులో పత్రాలు వినకుండా నవ్వుకుంటారా? అని తిట్టకండి మైకాసురులని క్షమించడం ఎవరి తరం ?)  

రత్నమాల గారికి వివిధ ఉద్యమాల పట్ల, సంస్థల పట్ల ఉన్న అవగాహన నుంచి నేను చాల విషయాలు నేర్చుకుంటున్నాను. ‘అస్థిత్వ ఉద్యమాలకి తల్లిలాంటిది.’ అని ఆమెని చాలమంది ప్రశంసిస్తుంటారు. ఉద్యమాలతో ఆమె మమేకమయిన తీరు చూస్తేఅది నిజమేననిపిస్తుంది. మనలోమనం మూలంగా వీరిద్దరితోనూ  సాన్నిహిత్యం పెరిగింది.  

ఈ రెండు రోజుల సదస్సులో నన్ను బాధించిన సంఘటన ఒకటి ఉంది.  క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యం అన్న సెషన్లో ఒకామె క్రైస్తవ మైనార్టీ రచయిత్రుల కవితలు ,కీర్తనలు అన్న అంశం పై మాట్లాడారు. అందులోఎక్కువ భాగం మతపరమైన కవితలు, కీర్తనలు మాత్రమే తప్ప మతం స్త్రీల పట్ల చూపే వివక్ష గురించి కానీ ,మెజార్టీ మతస్థులు మైనార్టీ మత స్త్రీలపై దాడులకిసంబంధించిన సాహిత్యం ఏ మాత్రం లేదు.  ఇది అందరికీ నిరాశ కలిగించింది. మరి కొందరికి తీవ్రమైన అసహనం కలిగింది.  వారు ఏ మాత్రం దానిని దాచుకోకుండా ముఖ కవళికల ద్వారాప్రకటించారు. నాకు అర్ధం కానిదేమంటే అసలు అంత అసహనం ఎందుకు కలగాలి? అందరికీ నిరాశ కలిగించినప్పటికీ ఆ పత్రం పట్ల అందరం ఆ పత్రం పట్ల ఎందుకు సంయమనంతో వ్యవహరించాలో నా అవగాహనలోకి వచ్చింది. దానికి కారణాలు ఏంటంటే  

1.  క్రైస్తవ మైనార్టీ రచయిత్రులు తొలిరోజుల్లో ఏసాహిత్యాన్నిసృష్టించారో దానినే ఆ పత్ర సమర్పకురాలు చదివారు. అందులోఉన్నమంచి చెడుల్నిమనం విశ్లేషించాలి.  

2. శైశవ దశ లో ఉన్నక్రైస్తవ మైనార్టీ స్త్రీ ల సాహిత్యం పట్ల మనకి సహనం , ప్రేమ , సహానుభూతి ఉండాలి తప్ప మన ఙానానికి (?) సరితూగలేనందుకు విరుచుకుపడటం  ఆధిపత్యధోరణి నే సూచిస్తుంది. ఙానాధిపత్యం కూడా తక్కువ చెరుపు చేయదు.  

3. హిందూ మత వివక్షకి గురయిన దళితులకి తిండీ, బట్ట, గుడీ, బడి ఇచ్చిన క్రైస్తవ మతం వారి జీవితం లోని ప్రతి పార్శ్వంతో బలంగా ముడిపెట్టబడి వుంటుంది. తొలి తరం రచయిత్రులు ఎంతమంది  అలాంటి మత భావనలనుంచి బయటపడి రాయగలరు?  

4. మైనార్టీ మత చిహ్నాల పట్ల  వారి సంస్కృతి పట్ల మెజార్టీ మతస్థులు ఎలా వ్యవహరించాలి? క్రైస్తవ సాహిత్యం చెవుల బడినందుకే మనకంత ఒళ్ళు జలదరించినట్లయితే ఎన్నోఏళ్ళుగా బాధించే పాఠాల్ని బోధిస్తున్నఉపాధ్యాయులని వింటున్న మైనార్టీమతవిద్యార్ధులు హిందూ మత సంస్కృతి పట్ల ఇంకెంత అసహనాన్నిప్రకటించాలి?  

5. స్త్రీలని వివక్షకి గురి చేసే మత చిహ్నాలు,సంస్కృతుల పట్ల మొట్ట మొదటి అంతర్గత స్థాయిలో చర్చజరగాలితప్ప తీవ్ర అసహనాన్ని ప్రకటించే నైతిక హక్కు మెజార్టీ మతస్థులకి లేదు.  

 నాకున్న పరిమిత సమయంలోనూ ఈ విషయాన్ని ఎక్కువ మందితో చర్చించాను. చాలా మంది అంగీకరించడం  ఊరట కలిగించే విషయం.  

16 వ తేదీ ఉదయం స్పోర్ట్స్ హాస్టల్ నుంచి ఫాకల్టీ  క్లబ్ కి బ్రేక్ ఫాస్ట్ కి వస్తున్నపుడు , ఫాకల్టీ క్లబ్ కి ఎదురుగా నాకో విచిత్రమైన విషయం కనిపించింది. నేను వెంటనే లోపలికి పరుగెత్తి కబుర్లలో మునిగిననా స్నేహితురాళ్ళ ముందు నిలబడి గొప్ప విషయం కనిపెట్టిన ఉద్వేగంలో  ‘అక్కడన్నీమగ బోర్డులే’ అని అన్నాను. అందరూ కిసుక్కుమని నవ్వారు. “బోర్డుల్లో కూడా ఆడామగా ఉంటాయా అమ్మాయీ నువ్వు మరీ విచిత్రం” సమతా రోష్ని ఓ మొట్టి కాయ ప్రసాదించింది.  

“కావాలంటే చూడండీ….” అంటూ కిటికీ లోంచి చూపించాను. ఎదురుగా విశాలమైన ప్లే గ్రౌండ్ రోడ్డు పక్కన వరసగా కొన్ని బోర్డులు.  

1. NDSF                 National Dalit Students Federation  

పేరుకు తగ్గట్టు……రత్నమాల

  

2. AISF                   All India Students Federation  

3. ABVP                 Akhila Bharata Vidhyardhi Parishad  

4. BCSF                 Backward Caste Students Federation  

5. MSF                   Madiga Students Federation  

6. TNSF                 Telugunadu Students Federation  

7. SFI                     Students Federation of India  

8. NSUI                  National Students Union of India  

9. PDSU                 Progressive Democratic Students Union  

10. STSF                Schedule Tribe Students Federation  

11. SIO                   Students Islamic Organization of India  

12. PDSO               Progressive Democratic Students Organization  

 “అవును నిజం ఇన్ని మగ బోర్డుల మధ్య ఒక్క ఆడ బోర్డు కూడా లేదే!” అంటూ అంతా గల గలమని నవ్వారు. కానీ ఆ నవ్వుల వెనుక ఈ సారి కొంచెం విషాదం… విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్ధి హక్కుల పోరాట సంఘాలన్నీ వివిధ అస్థిత్వాలని ఇముడ్చుకున్నాయి. చివరికి ఉప అస్థిత్వాలు కూడ పోరుబాటపట్టాయి. కానీ సమాజంలో మౌలిక అస్థిత్వ మయిన జెండర్ వివక్షకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధినులకి చైతన్యం లేకపోవడం , సామూహిక స్థాయిలో ప్రయత్నాలు లేకపోవడం ఆశ్చ్రర్యం కలిగిచింది.  

“మనలోమనం”రచయిత్రుల ఉమ్మడి వేదికపట్ల రచయిత్రులకున్న హోప్ చూస్తుంటే ఈ ప్రయత్నం స్త్రీవాద రచనలు ఉధృతంగా వచ్చిన రోజుల్లోనే జరిగి ఉంటే బావుండుననిపించింది. ఏ ఎంజీవో సంస్థలకీ , కులమత సంఘాలకీ, పత్రికలకీ పార్టీలకీ , వ్యక్తులకీ అతీతంగా పారదర్శకంగా  నిజాయితీ, నిబద్ధతతో ఒక సంస్థ నడిస్తే అది ఎంత మందికి ఉత్తేజాన్నివ్వగలదో ఈ సదస్సులు ఋజువు చేస్తున్నాయి. ఇది జీర్ణించుకోలేని కొన్ని శక్తులు రచయిత్రుల స్వతంత్రనీ, స్వేచ్చనీ తమ గుప్పెట్లో పెట్టుకోడానికి నిరంతరాయంగా పని చేస్తూనే ఉన్నాయి. అన్నీ గమనిస్తూనే దేనికీ చలించకుండాపనిచేసుకుంటూ… పోవడమే అన్నింటికీ సమాధానంగా ‘మనలోమనం’ భావించింది.  

నవంబర్ 15 వ తేదీన సదస్సు లక్ష్యాలు వివరిస్తూరత్నమాల ఇదే విషయాన్నిప్రస్తావించారు.మనలోమనంతో విభేదించిన కొందరు ధైర్యంగా ఎదురుగా నిలిచి  ప్రశ్నించారు. కానీ మరికొందరు ‘మనలోమనం’ తో ఉన్నాఅమంటూనే వెనుకఈ వేదికను విచ్చిన్నం చేయడానికి సకల ప్రయత్నాలు చేసారు, చేస్తూనేఉన్నారు.  

తెలుగు సాహిత్యంలోని సమకాలీన రచయిత్రులందరూ ప్రలోభాలతో తమ వ్యక్తిత్వాలను తాకట్టు పెడతారనుకోవడం వారి అవగాహనారాహిత్యం. సిద్ధాంత పరమయిన వ్యతిరేకత, సంస్థల పట్ల అనాసక్తత,సంస్థకార్యకలాపాల్లో విశ్వాశం లేక పోవడం , వ్యక్తిగత అయిష్టత , రచయిత్రులు సృజనాత్మకత రచనలకే పరిమతం కావాలన్న అభిప్రాయం ఇలాంటి కారణాలతో సంస్థకు దూరంగా ఉండే రచయిత్రులను అర్ధం చేసికోవచ్చు. కానీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడంవారిలోఅభద్రతను ,ఆందోళను సూచిస్తోంది.  

 అణచివేతకు గురయిన వివిధ అస్థిత్వాలకి చెందిన రచనలు గురించి తెలుసుకుంటే అందులోనూ మరుగునపడిన స్త్రీల రచనలు చదువుతుంటే ఇంతకాలం ఈసాహిత్య గురించిన పరిచయమే లేదు అనిపించింది.  

 చివరిగా యూనివర్శిటీ పగటి భోజనం చాలా బావుంది.గుంటూరు  గోంగూర పచ్చడి తిని తరించాం. వేడి వేడి ఉల్లిగారెలు , చక్రపొంగలి, నోరూరించాయి.  వీడ్కోలు తీసుకునేటప్పుడు అందరి మనసులూ భారమైనా ఫిబ్రవరి చివరి వారం లో ‘ఉత్తరాంధ్ర, ఆదివాసి స్త్రీల సాహిత్యం పై విశాఖ పట్నం లో జరగబోయే సదస్సు ఆశలు రేపింది. మనలో మనం తాత్కాలిక వేదిక ఆ సమయం లోనేపూర్తి స్థాయి నిర్మాణాన్ని కూడా ప్రకటించబోతోంది. దాని మీద కసరత్తులు కూడ ప్రారంభిచాం.

5 వ్యాఖ్యలు

5 thoughts on “అక్కడన్నీ మగబోర్డులే

  1. ఇన్ని విషయాలపై పోరాడుతున్న ఇన్ని సంస్థల మధ్య, ఎంతో ముఖ్యమైన జెండర్‌ వివక్ష సమస్య గురించి పోరాడే ఒక్క సంస్థ కూడా లేదని మీరన్న విషయం చాలా స్పష్టంగా, అర్థవంతంగా వుంది. అయితే, ఆ బోర్డులని మగ బోర్డులని అనడంలో అర్థం మాత్రం కనబడలేదు. ఏదో అనేశారు అనే అనిపించింది. ఎందుకంటే, ఆ సంస్థలలో ఆడ వాళ్ళు కూడా వుంటారు కాబట్టి, అవి మగ బోర్డులు కావు. అవి స్త్రీ వివక్ష గురించి పోరాడని సంస్థలు. వేరే విషయాల మీద, స్త్రీ,పురుష తేడా తీసుకు రాకుండా పోరాడే సంస్థలు. స్త్రీ వివక్ష పోకుండా, ఆ సంస్థలు చేసే పోరాటాలు పని చెయ్యవని అంటారా, అది వేరే చర్చ అవుతుంది. అన్ని అస్తిత్వాల మధ్య మీరు చెప్పే అస్తిత్వం లేదంతే. అంత మాత్రాన అవి మగ బోర్డులెలా అయ్యాయో అర్థం కావు.

    ఇంకో చిన్న విషయం. ఇటువంటి సీరియస్‌ విషయం రాస్తూ, చివర్లో గోంగూర పచ్చడీ, ఉల్లి గారెలూ, చక్రపొంగలీ లాంటి మాటలు, విషయం లోని గాఢతని తగ్గిస్తాయి. ఈ సందర్భానికి ఈ మాటలు సరైనవి కావనే అనిపించింది.

    – పాఠకుడు

  2. ఇప్పుడే, పై కామెంటు పోస్టు చేశాక, పక్క బాక్సులో ఈ కింద లైన్లు చూశాను:

    “మీ వ్యాఖ్య అంగీకారం కొఱకు ఎదురుచూస్తున్నది
    4:36 పూర్వాహ్నం వద్ద జనవరి 26, 2011 ”

    బండి ‘ర’ ప్రయాగం! చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు ‘ఱ’ వాడాలో, ఎప్పుడు ‘ర’ వాడాలో ఎలా తెలుస్తుంది? “ఎదుఱుచూస్తున్నది” అని రాయకూడదా?
    ఈ బండి ‘ర’ విషయంలో మీ అభిప్రాయం ఏమిటీ?

    పాఠకుడు

  3. వాటిని మగ బోర్డులని అనడంలో అర్థం నాకు కూడా కనబడలేదు. ఉదాహరణకి National Dalit Students Federation లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉండచ్చు కదా!

వ్యాఖ్యానించండి