Real love makes us unattached

 

“లిబరలైజేషన్ పై కమ్యూనిస్ట్ లు చూపించే అకారణ ద్వేషం కాకుండా నిమ్న కులాల అభివృద్ది క్రమంలో దాని పాత్రని, లాభనష్టాలని నిజాయితీగా అంచనా వేసే ప్రయత్నం జరిగింది.” నీల నవలని సమీక్ష చేస్తూ Narukurti Sridhar గారు రాసిన వాక్యం ఇది. లిబరలైజేషన్ మీద కమ్యూనిస్టులకి ఉన్నది అకారణ ద్వేషమా? అన్న ప్రశ్న ఇమ్మీడియేట్ గా వస్తుంది. నవలలోని రెండు మూడు అంశాల మీద చర్చనీయాంశమైన సమీక్ష చేసారు. శ్రీధర్ గారి అనుమతితో వారి ఫేస్బుక్ వాల్ నుంచి సమీక్షని పోస్ట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ ది రివ్యూ శ్రీధర్ గారు.

*************

నీల (Real love makes us unattached )

 

‘నీల’ నవల చదివి చాలా రోజులయిపోయింది. ఆ పుస్తకం గురించి ఏమైనా రాద్దామనుకుంటూనే రోజులు గడిపేస్తున్నాను. సమీక్ష రాసేటంతటి జ్ఞానం, విషయం నా దగ్గర లేవు. అందుకే రాయడానికి కొంచెం భయం కూడా. చాలాకాలం తరువాత చదివిన పెద్ద తెలుగు నవల. అసలు చదవగలనా! ఎన్నో పుస్తకాలకి పట్టించిన గతినే (మధ్యలోనే ఆపేయడం) పట్టిస్తానా! అని అనుకున్నాను . కానీ ఈ పుస్తకం చదివిస్తుంది. ఎంతగా అంటే సెలవులకి వచ్చిన కావ్య నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేంత వరకూ. ‘నీల’ లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉండరు. అసలు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నీల ఎదుర్కొన్న మథనం మాత్రం అందరిదీ. అంటే స్త్రీలది మాత్రమే కాదు, పురుషులది కూడా. స్త్రీ పురుష సంబంధాలలో ఉండాల్సిన స్వేచ్చ, లింగభేదం లేకుండా అందరికీ చెందినదే.

 

అస్థిత్వవాదపు రచనలు ఎంత బాగున్నా, మౌలికమైన విలువలని వదులుకోకుండా, అర్థం లేని పక్షవా/పాతానికి గురికాకుండా ఉన్నప్పుడు మాత్రమే గొప్ప రచనలవుతాయి. నిస్సందేహంగా ‘నీల’ అలాంటి రచనే. దీనిలో ఎవరూ దుర్మార్గులు కారు. వారికి అర్ధమైన సమాజపు విలువల పరిధిలోనే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆఖరికి ‘నీల’ని కూడా హీరోయిన్ అనలేము. ఈ నవలలో అన్నిటికన్నా నచ్చింది రచయిత్రికి మనుషుల పైన ,మానవ సంబంధాల పైన ఉన్న అపారమైన ప్రేమ. మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతూనే వాటిలోని అనివార్యతని కూడా విశ్లేషించడం ఆవిడ పరిణతిని సూచిస్తోంది. భార్యలని అనుమానించి వారిని కొట్టే ‘పరిసి’, ‘ప్రసాదుల’కి కూడా ఈ నవలలో మానవీయ పార్శ్వం ఉంది.

 

ఒక దిగువతరగతికి చెందిన అమ్మాయి అంచెలంచెలుగా జీవితంలోనూ, సంస్కారంలోనూ ఉన్నతమైన స్థానాన్ని పొందే క్రమంలో సుమారు నాలుగు దశాబ్దాల పాటు చేసిన ప్రస్థానం మాత్రమే కాదు ఈ నవల.. నాలుగు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల సామాజిక పరిణామం కూడా. లిబరలైజేషన్ పై కమ్యూనిస్ట్ లు చూపించే అకారణ ద్వేషం కాకుండా నిమ్న కులాల అభివృద్ది క్రమంలో దాని పాత్రని, లాభనష్టాలని నిజాయితీగా అంచనా వేసే ప్రయత్నం జరిగింది. రచనాశైలి కొడవటిగంటిని గుర్తుకు తెస్తుంది. చాలాచోట్ల వాక్యం కవితాత్మకం అవుతుంది. రచయిత్రికి సోషల్ వర్క్ మీద ఉన్న ప్రేమ అక్కడక్కడ రచనని పక్కదోవ పట్టించినా, ప్రీచింగ్ లేకపోవడం వల్ల బోరు కొట్టించలేదు.

 

బిందూతో నేను చాలాసార్లు అంటుంటాను. ‘భార్యాభర్తల మధ్య ప్రేమ, బాధ్యతల కంటే ముఖ్యంగా ఉండాల్సింది ఆకర్షణ, గౌరవం.’ నేనెంత బద్ధకస్తుడినయినా, తనెంత ఇందిరాగాంధీ అయినా మా ఇద్దరిమధ్య ఆ రెండూ ఉన్నాయి కాబట్టే సజావుగా నడిపిస్తున్నామని అనుకుంటాను. ఈ నవలలో ఎన్నో అద్భుతమైన వాక్యాలు ఉన్నా నన్ను బాగా ఆకట్టుకుంది ఈ వాక్యం “ప్రేమ స్నేహం అప్పుడప్పుడూ తొణికిపోవచ్చు. గౌరవించే మనుషులని ఎప్పటికీ వదులుకోవాలనిపించదు” ‘Real love makes us unattached’ అంటాడు వివేకానందుడు (‘రాజయోగ’లో అని గుర్తు). నిజానికి ఆకర్షణ, గౌరవం ఉంటే కలిసుండడానికి పెళ్ళే అవసరం లేదు. కాని అంతటి స్వేచ్చని పొందడానికి మనుషులపైనా, జీవితం పైనా అపారమైన ప్రేమ, గౌరవం ఉండాలి. అప్పుడా ప్రేమ – వ్యక్తులకో, సమూహాలకో దేశాలకో పరిమతమవ్వదు. అదసలు సాధ్యమా!! ఏది ఏమయినా ‘నీల’ తప్పక చదవాల్సిన పుస్తకమే. నీలతో పాటు సంఘర్షించాలిసిందే! ఆ catharsis అనుభవించాల్సిందే.

 

p.s. ఇది సినిమా సమీక్షలా ఉంటే అది నా తప్పే…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s