తెలిసిందా?

 

సంబంధిత చిత్రం

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది. అచ్చంగా నీ గురించే

 

కొంచెం సిగ్గుగా బిడియంగా నవ్వుతావు!

మల్లిమొగ్గ సాయంసంజెని చాటు చేసుకుని రెక్కలు విప్పినట్లు ఉంటుంది 

వచనకారుడివై కొత్త దీపాన్ని సొంతంగా వెలిగించుకున్నావు

నీ అక్షరాన్ని ముద్దాడిన మోహశిఖ భగ్గున మండి మరింత వెలుగైంది

ఈడ్చికొట్టే తగవుగాలికి నీ కాళ్ళమీద నీవు నిల్చుంటావు!

అరికాలి కింద నేల నిన్నునిలబెట్టి కరువుతీరా కావిలించుకుంటుంది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

ఎవరి అరల్లో వారిని సర్ది తాళం వేసాననుకున్నావు!

తాళం చెవుల గుత్తి మంత్రగత్తె కొంగుకి లాఘవంగా ముడి వేసుకుంది

నువ్వు మీ ఊళ్ళో పదిలంగా ఉన్నాననుకున్నావు!

సాగరం నుంచి సాగరానికి కొత్తవంతెన మీద యాత్ర మొదలయింది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

కానీ రాస్తున్నపుడు తెలిసింది 

నువ్వు నువ్వనుకునేది నువ్వు మాత్రమే కాదని

పరిమళం, ఐక్యరాగం, గడుసు చినుకు, కొత్త ఆశలు నీలో చేరి

నిన్ను ఖాళీ చేసాక

నువ్వంటే నువ్వు మాత్రమే కాదని

నీలో ఉన్నది నేనేనని తెలిసాక

ఇక ఈ పూట అచ్చం నీ గురించే రాయాలని ఉంది

నన్ను నేను ప్రేమించుకోవాలని ఉంది

 

 

నవమి చిలుక

Image result for parrot in tree

ఇపుడొక చిలుక కథ చెపుతాను. మరీ పంచ వన్నెల రామచిలుక కాదు కానీ రెండే వర్ణాల సొగసు చిలుక కథ చెప్తాను. పుట్టింది మొదలు ఆకాశమంతా ఎగిరి దిక్కులు కలగలిసిపోయిన శూన్యాన్ని తన గానంతో పటాపంచలు చేసింది. తన చిన్నిరెక్కలు వీచే గాలికి పుట్టిన ‘ఝంజ’ని అదాటున లోకం మీదికి విసిరి ఫక్కున నవ్వింది. ఎర్రని ముక్కు వంపు చివర్లతో ఫలాదులకి మాధుర్యాన్ని అద్దింది.

బతికి బతికి అలిసిపోయి ఎగిరి ఎగిరి సొలిసిపోయి ఓ రోజు అకస్మాత్తుగా బారుగా జాపిన రెక్కల మీద ముఖం వాల్చి ఆలోచించడం మొదలు పెట్టింది.

ఆగితే సాగదు ఈ లోకమూ…

జాయిగా కిందకి జారుతూ నేల మీద కాలూనింది. చుట్టూ కొత్తలోకం. యంత్ర భూతముల కోరలు తోమే జీవులు, రణగొణ ధ్వనుల లోహ వాహనాలు, క్షణం ఏమారితే బతకలేని లోకాన్ని చూసి దిగులుపడింది.

కానీ అది ఎంతటి సొగసు చిలుక!!

తన ఇంద్రజాలపు పెట్టె తెరిచి ఒక తోటని తీసింది. కోయిలని బతిమాలి ఒక గున్నమావిని, పిచుకలని బామాలి పసుపు వన్నె జామచెట్లని  కూడా నాటుకుంది. కబుర్ల కోసం కాకమ్మలు, దూతల వలె తెల్ల కొంగలు బారులు తీరేవి. పళ్ళూ పూలూ తీవెలతో తోట హొయలు పోతోంది. చాలు, ఇక చాలు అనుకుందా! ఓరోజు సాయంసంధ్య వేళ ఒక బలిమి పిట్ట తోట వాకిట కూత పెట్టింది.

యుగాల ఎదురుచూపు ఆర్తరావం అది. ఇలాంటి పిలుపు ఎపుడైనా విన్నదా అసలు? గున్నమావిని కూల్చి, పసుపు వన్నె జామ మధురఫలానికి మొహం తిప్పి తోటతోటనీ ఏమార్చి సత్తువ ఉడిగిన రెక్కల్లో బలాన్ని కూర్చుకుని ఎగిరొచ్చి ఆ పిలుపు ముందు వాలింది. కాసేపే! తోట వెనక్కి లాగింది. బలిమి పిట్ట – సొగసు చిలుక సంభాషణ విన్నారా ఎపుడైనా? చిలుకకే పలుకులు నేర్పేది బలిమిపిట్ట. బలిమి పిట్టకే శక్తినిచ్చేది సొగసు చిలుక. తోట వాడిపోతోంద…బలిమి సొగసులు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వాటి లేత రెక్కల మీద ఉండుండి పిడుగులు పడతాయి. తలెత్తి కూడా చూడవవి. చెరొకచెట్టు మీదా కట్టుకున్న ప్రియమైన గూళ్ళు అపుడపుడూ ఇరుకైపోతాయి. ఆరారు రుతువుల సంధికాలంలో ఏదో ఒకక్షణం తప్పిపోతుంది. దానిని చటుక్కున పట్టుకుని గూళ్ళు వదిలి ఆకాశంలో జంట గిరికీలతో పండుగ చేసుకుంటాయవి.

ఏడాదికోమారు సాయంసంధ్య వేళ  పిట్టలు ముస్తాబు అవుతాయి. తోటలు దూరమైన దురదృష్టాన నెప్పిరాగం తీగలా సాగుతుంది. వేయి యుగాల నిరీక్షణతో పిలుపు బరువవుతుంది. ఏటికేడూ అవే ప్రశ్నలు కొత్త భయాన్ని దాల్చుతాయి.

‘నాతో ఉంటావా?’ ఆత్రుతగా బెంగగా అడుగుతుంది బలిమిపిట్ట.

‘నాతోనే ఉంటావా?’ ఆత్రుతగా దిగులుగా అడుగుతుంది సొగసు చిలుక.

*******

కొన్ని మెరుపులూ మరికొన్ని మొట్టికాయలు 

(నీల నవలపై సాహితీ సమితిలో జరిగిన చర్చను గంగాధర్ గారి వాల్ నుంచి తీసుకున్నాను. నచ్చిన పుస్తకం జ్యోతి గారి వ్యాసం ఇంతకు ముందు నా వాల్ లో పోస్ట్ చేసాను కనుక ఇక్కడ రిపీట్ కాకూడదని తీసేసాను. మిగతాది యథాతథంగా)

సాహితీసమితీ వార్తా లేఖ-ఏప్రిల్ 2018

నీల నవలపై చర్చ-

సాహితీ సమితి ఏప్రిల్ నెల సమావేశం 29 వతేదీన మల్లీశ్వరి వ్రాసిన “నీల” నవల పై చర్చ జరిగింది.చర్చకు సాహితీసమితి సభ్యులు సనామ,నరసింహారావ్, శశిశేఖర్,జతిన్, రమణి, రాజ్యలక్ష్మి,రజని,ఉష,జయ,ఇందిర,T.ఇందిరా,అమరవాది నీరజ,రామారావ్, రాంబాబు ,ప్రత్యేక ఆహ్వానితులుగా జ్యోతి హాజరయ్యారు.

కె.జె.రామారావ్:

ఆంధ్రదేశంలో తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం,అనంతర పరిణామాలు – క్రింది వర్గాలలో వచ్చిన మార్పులు,మిల్లు కార్మికుల పోరాటాల నేపధ్యం లో పరిశ్రమలలో అదనపు విలువ దోపిడి,స్త్రీల పని పరిస్థితులు వాటి మెరుగుదల కొరకు జూట్ మిల్ కార్మికుల పోరాటాలు, డ్వాక్రా సంఘాలు,మైక్రో ఫైనాన్స్ వడ్డి వ్యాపారం,ప్రజల సొమ్మును పెట్టుబడిగా జరిగిన ప్రయోగం,క్రింది వర్గాల నుండి నాయకులుగా ఎదిగిన స్త్రీలు పాలక వర్గాల అనుయాయూలగా ఎదిగిరావటం,కుటుంబసంబంధాలలో ఉన్న అసమస్థితి, చంద్రకళ, ఆరంజ్యోతి,నీల,సంపూర్ణ లనేపధ్యాన్ని ఈ నవల అద్దం పట్టింది.

అట్టడుగు జీవితాన్నుండి ఎదిగిన నీల, తల్లి చంద్రకళ హత్య తో పాస్టరమ్మ దంపతుల ఆదరణ తో పెరిగి ప్రసాద్ తో వివాహం, ప్రసాద్ కు సరళ తొ ఉన్న సంబంధం తొ ఘర్షణ పడి ప్రజా సంఘాల సహకారం తో కూతురుతో బయటకు వచ్చిన నీల,చోళదిబ్బ ప్రాంతానికి వచ్చి సంపూర్ణ సహకారం తో జీవించడం,డాక్వా సంఘాల అధ్యయనం కోసం వచ్చిన పరదేశి సహకారం తోపరదేశీ ఆకర్షణ తో విశాఖ తీరప్రాంత మత్స్యకారుల జీవితాలతో పరిచయం,శ్రీకాకుళ ప్రాంతాల పర్వటన అనంతరం పరదేశి కి ఇంకొక స్త్రీ తో సంబంధం ఉందని తెలిసి అతనితో సంబంధాన్ని కాదనుకోవటం తో నవల సగభాగం పూర్తవుతుంది.

అనంతరం అజిత తో కలిసి స్వచ్చంద సంస్థ లో పని చేస్తూ గతం లో వ్యక్తిగత సమస్య పరిష్కారం లో సహాయపడిన సదాశివం పరిచయంతో సదాశివం తల్లి దగ్గర స్వచ్చంద సంస్థలో పనిలో చేరి సదాశివ ఆకర్షణతో అతనికి దగ్గరవుతుంది.సదాశివంకు అనేకమంది స్త్రీలతో సంబంధము న్నదని తెలిసినా అతనికి దగ్గరవుతుంది. అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోవటం సదాశివం తో కలిసి జీవించాలనుకోవటం నీల బలహీనతను తెలియజేస్తోంది.తన తల్లి బలహీనతను క్షమించని నీల ,భర్త ప్రసాదుకు సరళతో ఉన్న సంబంధాన్ని జీర్ణించుకోలేక బయటకు వచ్చిన నీల,పరదేశి కి వేరే సంబంధం ఉన్న కారణం గా బయటకు వచ్చిన నీల సదాశివం తొ కలిసి జీవించటమనేది వివాదాస్పదమయిన నిర్ణయమే.అలాగే పరదేశిని కలవడానికి విశాఖ వెళ్ళిన నీల పరదేశి గురించి ఆలోచిస్తూ నేను అతనితో ఉండి ప్రజా ఉద్యమాలతో మమేకమైతే బాగుండు అనే పునరాలోచన ఒక్కక్షణం మెరుపులా మెరిసినా మళ్ళీ వెన్నక్కి తిరిగి రావటం ఆమె లోని అనిశ్చిత స్థితి ని తెలియజేస్తోంది.

మిల్లుకార్మికుల ఉద్యమం, డాక్వా సంఘాల, చోళదిబ్బ రాజకీయాలు,మత్స్యకారుల జీవితాల్లో పోర్టులు తెచ్చిన మార్పులు(సెజ్) అంతర్లీనంగా ప్రస్తావించినా ఉద్యమాల ఎడల సానుభూతి గల ప్రజల్లో అనుకూలతగా కన్పించినా నవల చివరికొచ్చేసరికి పాఠకులకు ఆ ఉద్యమాలు వెలుపరివారి గానే ఉంచుతాయి. అట్టడుగు స్థితిలోంచి ఎదిగి వచ్చిన నీల ప్రసాద్ తో వివాహం అనివార్యమైనా సదాశివం తో కలిసిజీవించటం,స్వచ్చంద సంస్థతోకలిసి పనిచేయటంఅనేది గమనించినప్పుడు రాష్ట్రం లో జరిగిన అనేక ఉద్యమాల వైఫల్యం వల్లబయటకువచ్చిన వారు స్వచ్చంద సంస్థలలో చేరి జీవనోపాధి వెతుక్కున్న వైనం నీల జీవితం లో జరిగిందా అనిపిస్థుంది.

ప్రజా ఉద్యమాలకు స్వచ్చంద సంస్థల కార్యాచరణ పోటీ కాక పోయినా,పాఠకులను ప్రజా ఉద్యమాల ఎడల సానుభూతి కల్గించి ఆఉద్యమాల వైపు ఆకర్షించి ఉంటే ఈ నవల ఇంకొక మలుపు తిరిగి ఉండేది.కాని అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన నీల తన సౌఖ్యం కోసం సదాశివం తో సహజీవనం అనే దానిని రచయిత ఆదర్శీకరించినట్లు కనబడుతోంది.వ్యక్తులు ఎలాజీవించినా సమూహంకోసం, సంఘంకోసం పనిచేస్తే తప్పకుండా గొప్పవారుగానే ఉంటారు.అలా కాకుండా వ్యక్తిగత సౌఖ్యం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా వాటికంత ప్రాధాన్యత ఉండదు.

సమాజంలోని సంక్షోభాన్ని పరిష్కరించే క్రమం లో వైరుధ్యాలు తీవ్రమైన దశలో జీవితాన్ని చిత్రించే నవలల్లో అమ్మ నవల, ప్రేమచంద్,శరత్, టాగూర్ నవలను ప్రత్యేకం గా చెప్పుకోవాలి. భారతదేశంలో మధ్యతరగతి విద్రోహం ,పాలక వర్గాలలో భాగమవ్వడం, క్రిందివర్గాలకు నాయకులుగా ఉన్న మధ్యతరగతి వర్గం రాజీ స్వభావం ఆ ఉద్యమాలకు వెన్నుపోటు పొడిచింది.క్రింది వర్గాలలో నాయకత్వం అభివృద్ధి కాకపోవటం ముందు చూపుతో ఉద్యమాలుకొనసాగక పోవటం వలన మన దగ్గర ఆటుపోట్లు మాత్రమే కనిపిస్తాయి. యూరప్ లోమధ్యతరగతి విద్రోహాన్ని అధిగమించి సమాజం ముందుకెళ్ళింది.కాబట్టే అక్కడ విప్లవాలు,గొప్ప నవలలూ ఆదర్శ జీవితం కనిపిస్తుందికాని.ఇక్కడ కింది వర్గాలనుండి వచ్చిన నీల వంటి వారు మధ్యతరగతి తో కలిసిపోవటం అనేది ఒక విషాదం.

శశిశేఖర్:

నేను ఈ నవల ను ముందు మాటలతో మొదలుపెడతాను.ముందుగా వారి మాటలను ఉటకించిన తర్వాత నవలను సమీక్షిస్తాను.’నీల’నవల గురించి చినవీరభధ్రుడు,స్వేఛ్ఛ,సహజీవనం గురించిచర్చిస్తే, ఎకె.ప్రభాకర్ గారు,ఒక అడుగు ముందుకు వేసి’స్వేఛ్ఛను ప్రేమించగలిగిన వాళ్ళు నీల తో కలిసి నడవగలిగిన వాళ్ళు మటుకే పేజీలు త్రిప్పి నవలలోకి జొరబడాలని హెచ్చరిక చేశారు.దీనినిబట్టి నవలలో ప్రతిపాదించబడిన అభిప్రాయాలతో ఏకీభవించని వారు సంప్రదాయవాదులుగాను తిరోగమన వాదులుగాను పరిగణింపబడతారనే అభిప్రాయాన్ని వీరిద్దరి పరిచయవాక్యాలు కలిగిస్తున్నాయి.

నిజానికి రచయిత్రి (మల్లీశ్వరి) శైలి చాలా అద్భుతంగా ఉంది. Narrative Abilities పుష్కలంగా ఉన్నాయి.ఏ రచయిత్రికీ లేని రచనా పటుత్వం మల్లీశ్వరిలో ఉన్నాయి.కవిత్వాన్ని గొప్పగా చెప్పి పాఠకులను మెస్మరైజ్ చేసే నైపుణ్యాలు ఉన్నాయి.స్చేఛ్ఛ ప్రేమ అనేవి కొత్త విషయాలు కావు.కొ.కు. తన సాహిత్యంలో స్వేఛ్ఛ గురించి మాట్లాడినా,అవి అంతర్లీనంగా జీవితంలో భాగంగా ఉంటాయి తప్ప ఎక్కడా ఈ విషయాలు చర్చకు రావు.స్వేఛ్ఛ అనేది కమ్యూనిష్టులుగాని మరెవరో గాని చెప్పింది కాదు.ఇది లిబరల్ బూర్జువా కాన్సెప్ట్. ఏ సమాజంలో అణచివేత ఉంటుందో అక్కడ స్వేఛ్ఛ కోసం పోరాటం ఉంటుంది.ఉదారవాద బూర్జువా వ్యవస్థలో వారి మనుగడ దోపిడి,మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది.ఈ నవలలో ఎలాంటి అవగాహన లేకుండా స్వేఛ్ఛ గురించి అసంబద్ధంగా రాయటం జరిగిం ది. అమలు లో ఉన్న నీతులు, నియమాలు, చట్టాలు, న్యాయాలు సహజము అనివార్యము అని భావించినంత కాలం వాటిని ఉల్లఘించటం నేరంగాను, పాపంగాను తోస్తుంది.వాటి స్వరూప స్వభావాలనుఅర్ధం చేసుకున్నప్పుడు మాత్రమే వాటి మూలాలు బోధపడతాయి.వాటి వెనక ఉన్న మార్మికత అర్ధమవుతుంది.

మానవ సంబంధాలలో ముఖ్యంగా స్త్రీ,పురుషుల లైంగిక సంబంధాలలో ఉన్న మార్మికతను సాహిత్యం చూపగలగాలి.కాని ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించటం సాహిత్యం పని కాదు ఇన్నాళ్ళు అనవసరంగా మోస్తున్” అసత్య’ భారాన్ని దించుకోగలిగిన,అమలులో ఉన్న అసంబద్దతను తిరస్కరించగలిగిన సంస్కారాన్ని సాహిత్యం ఇవ్వగలగాలి.
విషయాన్ని సరిగ్గా అర్ధం చేసికోని పక్షంలో తిరస్కార ధోరణి దానికదే ఆదర్శంగాను,పాతబరువు స్థానంలోనేతలకెత్తుకున్న కొత్త బరువుగాను అతిశయించినఆహంకారంగా పరిణమించిన నైతిక,బౌద్ధిక , గీర్వాణం గాను తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఆది లోనే దీనిని గుర్తించి మొగ్గలోనే తుంచకపోతేరోగం కంటే ప్రమాదకరమైన వైద్యంచందాన తయారవుతుంది.
తన తల్లి ఎవరితోనో సంబంధంఉందని తెలిసి దాన్ని అసహ్యించుకున్న నీల, ప్రసాద్ సరళ ల సంబంధం విషయంలో ఘర్షణకు లోనవుతుంది. ఈ ఘర్షణలో ప్రసాద్ నలిగి పోతున్నాడని ఆవేదన చెందుతుంది తప్ప సరళ గురించి సానుభూతి చూపించదు. ప్రసాద్,పరదేశి,సదాశివ_ ఈ ముగ్గురిలోను ప్రసాద్ తో నీల సంబంధం ఒక్కటే ఈ భూలోకంలో జరిగినట్లు అనిపిస్తుంది.ప్రసాద్ చెడ్డవాడు కావచ్చు కాని అర్ధం అవుతాడు.పరదేశి తో సంబంధం ఏ మోహమయ ప్రేమ జగత్తు లోనో జరిగినట్లు ఉంటుంది.పరదేశి మంచి చెడ్డలు సామాన్యులకు అంతుపట్టవు.అప్పటికి ఐదేళ్ళుగా చేతన అనే మెడికల్ స్టూడెంట్ తో సహజీవనం చేస్తున్న పరదేశి తన జీవనసహచరితో ఎటువంటి అసంతృప్తులు లేని పరదేశి నీలను చూసిన క్షణం లోనే తన పూర్వ సంబంధానికి ఉద్వాసన పలికి జీవితాన్ని మరింత ప్రేమించగలిగేందుకు నీలతో సంబంధాన్ని కోరుకుంటాడు.తనను అర్ధం చేసుకోలేనంత సంకుచిత హృదయురాలిగా చేతనను భావించటం తన అహంకారమవుతుందని ఉద్ఘాటిస్తాడు.

ఇక అనేక స్త్రీల సదా ఏకకాలంలో అనేక సంబంధాలు సాధ్యమే అన్న సదా రిలాక్స్ అయ్యేందుకు తనను కోరుకునే వారిపట్ల,వారి ప్రయివసీ పట్ల కమిట్ అయిన సదాప్రేమ కోసం తపించి,అలసి సొలసి నీల నీడన సేద తీర్చుకునేందుకు వస్తాడు.అందరూ అనుకున్నంతగా తనకంతగా సుఖమేమి దొరకలేదంటాడు.Parallel Universes, Multiple Universes గురించివివరించే క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే క్వాంటమ్ నీతిశాస్త్రమేదైనా ఉంటే అది మటుకే మనని సదాశివను అర్ధం చేయించగలదు. ఇక అజిత విషయానికొస్తేఎమోషనల్ బాండేజ్ తో వచ్చే ఏ మానవ సంబంధాన్ని భరించగలిగే శక్తి అజితకు లేదు. అజిత శీలం లేని ఆడదని ఎవరూ అనరు.కాని బాధ్యత లేని మనిషంటే ఎవరూ కాదనరేమో! మానవ స్పర్శ సోకని వట్టి శారీరక అనుభవం,కాలంతో తూచగల అనుభవం ఏ రకంగా సత్యమో ఆవిడకే తెలియాలి.ఒక అద్భుతమైన అనుభవం తాలూకూ పరిమళాన్ని నిలుపుకోలేనిఅజిత జీవితం గొప్ప విషాదం
మొత్తం మీద నీల ఒక మహత్తర ఆధునిక(ఆధునింకాతర) కాల్పనిక రచనగా తోస్తుంది.నవలకంతటికి మిగిలేవి అద్భుతమైన కవితా శకలాలే.రాజకీయ మూలాలను ప్రస్తావించకుండా కేవలం సామాజిక అంశాలను ఉద్యమాల చరిత్రను ఉటకించటం ద్వారా కెంఎన్.మల్లీశ్వరి దీనిని కాల్పనిక స్థాయికి మించి తీసుకెళ్ళలేక పోయారు.

జతిన్:

నవలకు నీల అని పేరు పెట్టడంవల్ల చర్చ అంతా నీల పాత్ర చుట్టూ తిరుగుతోంది.నీల అనేది నెపం మాత్రమే.పురాణాలు,మహాభారతంలోని ఉపకధల్లాగా ఈ నవలలో డ్వాక్రా, సారా,జూట్ మిల్ కార్మికుల ఉద్యమాలు మూడొందల పేజీల దాకా నడిచాయి .శిల్పం గురించి శశిశేఖర్ బాగా చెప్పారు.కధ నడుస్తుండగా సాధారణ పాఠకుడు కధ వెనకాలే వెడతాడు.

ఈ రచయిత్రి అనేక రచనలు చేసి చేయితిరిగిన రచయిత్రి.మధ్యలో సదాశివ కుటుంబ చరిత్ర గూర్చి 80 పేజీలు కధ నడుస్తుంది.అసలు కధ ఆపేసి ఇంకో ఎపిసోడ్ ఇక్కడమొదలవుతుంది. శిల్పపరంగా ఇది సరికాదు.నీల దళిత జీవితం నుండి రావటం దాంపత్య జీవితం గురించి,నీతి,అవినీతుల గురించి స్పష్టమైన అభిప్రాయాలు ఉండటం దానికి సంబంధం లేని విధంగాసదాశివం తల్లితండ్రుల మధ్య ఉండే సాంస్కృతిక వైరుధ్యం, తండ్రిని interial level లో ఉంచటం, సదాశివం తల్లి ప్రోఫెసర్ గా ,N.G.O. సంస్థలలో పనిచెయ్యడం కనిపిస్తుంది.నిజానికి ఎనభైల నాటి శ్రీకాకుళ ఉద్యమం తో పోల్చుకుంటే ఈరోజు వాటి స్థానంలో ఎన్.జి.ఓ ల ప్రాబల్యం ఎక్కువగాఉంది.

చిన వీరభద్రుడు,ఎ.కె.ప్రభాకర్ గార్లు నీల ప్రయాణం మార్క్సిజం పరిధి దాటి పోస్ట్ మోడర్నిజమ్ వైపు వెళ్ళినట్లు రాశారు.నీల తల్లికి,నీలకు,మినో కు కూడా స్త్రీ పురుషుల మధ్య నున్న సంబంధాలు ఎలా ఉంది అనే దగ్గరే మొదలయింది.పోస్ట్ మోడర్నిజమ్ లో ఏ విధంగా అయితే వివిధ అస్థత్వ వాదులుగా విడివిడి వ్యక్తులుగా చీలిపోయే వైనంఉంటుందో అది ఇందులో కనిపిస్తుంది.మినోకు సదాశివం తో జరిగిన చర్చలోఒక కేసుకు సంబంధించి సదాశివం కులంపైపు కాకుండా స్త్రీ వైపు వెళ్ళటాన్ని ప్రశ్నిస్తుంది మినో.మన తరం వారు మార్క్సిస్టు భావజాలంతో కొన్ని విలువలకు కట్టుబడి జీవిస్తే,మినొ లాంటిఈ నాటి తరం వాటికి తిలోదకాలిచ్చి వాళ్ళు చేసే ఆలోచనలు పురోగమనం వైపా?తిరోగమనం వైపా? అనిపిస్తుంది. ఈ నవలలో ఇదే విషయాన్ని నీల తల్లతండ్రులు జీర్ణించుకోలేని పరిస్థితి.నీల సూర్యం పాత్ర ప్రభావం తో ఏదో చెయ్యాలి అనుకోవటమే కాని ఏది చెయ్యలేక పోతుంది.అలాగే పరదేశి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోతుంది.అయినప్పటికి తనలో ఉన్న సాంప్రదాయ భావనలు కారణంగా పరదేశి ని అంగీకరించలేక పోతుంది.

నీల జీవితంలో సంపూర్ణ పాత్ర అనేది నాదృష్టిలోచాలా గొప్ప క్యారెక్టార్.అయితేనీల సంపూర్ణ ఆలోచనలను అవగాహనను పూర్తిగా అంగీకరించ లేకపోతుంది.అందువల్లనే తనకు అన్నివిధాలా సపోర్ట్ చేసినా నిలుపుకోలేకపోయింది.నీల లో సాంప్రదాయం ఉంది.అందువల్లనే సదాశివ తో జీవితాన్ని పంచుకునేటప్పుడు అంత తేలికగా సర్దుబాటు చేసుకోలేక కొన్ని షరతుల తోనే కలిసి ఉండటానికి ఒప్పుకుంటుంది.మొత్తం మీద నీల అట్టడుగు వర్గం నుంచి వచ్చి సాంప్రదాయ ప్రభావం ఉన్నప్పటికి కొంతలో కొంత తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగటమనేమార్పును అహ్వానించాలి.నిజానికి నీల పాత్ర అక్కడితో ఆగిపోలేదు.వ్యక్తిగత ఆలోచన సామాజిక కార్యాచరణ తో ముందుకు మున్ముందుకే సాగుతూనేఉంటుంది..

ఉష:

నీల నవలలో నీల చిన్నప్పుడు ఎలా ఉందో చివరివరకు అలాగేఉంది.చిన్నతనంలో తనతండ్రి ప్రవర్తన గురించి పెట్టిన పంచాయతీ లో తల్లి మొహంలో ఉన్న సంతోషం కన్నా తండ్రి మొహంలో ఉన్న వ్యతిరేకత,కోపం చాలా సహజంగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది.దానికి ఉదాహరణే మహిళా సంఘంలో తనతల్లి ప్రవర్తన గురించి తప్పుగా మాట్లాడినా పట్టించుకోకపోవటం.తన తల్లికి ఆటో రాజు తో ఉన్న సంబంధం లో ఒక రకమైన శాంతి స్వాంతన ఉందనే విషయాన్ని తరువాత తరువాత నీల గ్రహిస్తుంది.కాని నా తల్లి చేసిన తప్పును నేను చేయను.సమాజం ఇలాంటి సంబంధాన్ని ఎలా చూస్థుంది? ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బాదపడతారు అనే విషయం అనుభవపూర్వకంగాతెలియటం వల్లచాలా జాగ్రత్తగా మసలుకుంటుంది.

ప్రసాద్ కు సరళ తో ఉన్న సంబంధం తో గాయపడుతుంది. నీల పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోఅంతకన్న పరిణతి గా ఆలోచించటం సాధ్యం కాదనిపించింది.ప్రసాద్ తొ సరళ విషయంలో ఘర్షణ పడినా ఒక స్థాయి వరకు సర్దుకుంటుంది.అదే సమయంలో సరళ మీద సానుభూతి కూడా ఉంటుంది.మనిషి కుండాల్సిన నీతి,అవినీతి పరిధిల లోనే ఉండాలని తాను నీతి అనుకున్న దానిని పాటించటానికి ప్రయత్నం చేసే ఒక పాత్ర గా అన్పించింది.అజిత పాత్ర విషయానికొస్తే, అజిత సంతోషి విషయంలో నాకేంటి సంబంధం? అనే విషయంలో నేను ఏకీభవిస్తున్నాను.దానికి తనభర్త హరి మాత్రమే బాద్యుడు అవుతాడు తప్ప తనకేమి సంబంధం లేదనటం సహజమే.తనకు పరిచయం ఉన్నది,సంబంధం ఉన్నది కేవలం హరి తో మాత్రమే.అతని భార్యకు సంబంధించిన విషయంలో పూర్తి బాద్యత హరిదే.ప్రసాద్ తొ సరళ ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటేఅజిత కేవలం అవతలివ్యక్తి తొ శారీరక సంబంధాన్ని మాత్రమే కోరుకుంటుంది తప్ప ఎమోషనల్ బాండిగ్ కాదు.

ముగింపు: తెలుగులో స్త్రీల జీవితం నేపధ్యం గా వచ్చిన నవలగా నీలను చూసినప్పుడు,అది ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సందర్భం లో విమర్శకుల ప్రశంసలను పొందిన పరిస్థితుల్లో దీన్ని భిన్న కోణాలను దర్శించాల్సిన అవసరాన్న్ని అవశ్యకతను దృష్టిలో పెట్టుకుని చర్చను నిర్వహించడం జరిగింది.నవలను సమగ్రంగా చర్చించటం జరిగిందనే అనుకుంటున్నాము.

పొన్నపల్లి రాజ్యలక్ష్మి
9493975304

నాకు నచ్చిన ఫెమినిజం చూసాను ఈ పుస్తకంలో

Image may contain: 1 person

ఫేస్ బుక్ ఇచ్చిన మంచి మిత్రురాలు, చదువరి, తన చిన్నారి పాప గురించి బోల్డు ముచ్చట్లు చెప్పే Saraswathi PL గారు, నీల నవల గురించి తన అభిప్రాయాలు రాసారు. ఆ సందర్భంగా ఆమె రాసిన ఈ వాక్యాలు – “చివరగా నీల కూతురు మినో పాత్ర నాకు హెచ్చరికగా అనిపించింది. ఏడేళ్ళ కూతురున్న తల్లిగా భవిష్యత్తులో బిడ్డ ఆలోచనలు ఎంత ఉధృతంగా ఉంటాయి, నన్ను నేను అప్ గ్రేడ్ చేసుకోవాలీ అనిపించాయి.” అన్నారు. ఈ వాక్యాలు చదివాక, ఇక రాసేవాళ్ళు ఎంత అప్ గ్రేడ్ అవ్వాలో అనిపించింది. థాంక్యూ సరస్వతి గారూ.

 

******************

నీల:

ఏ బంధమైనా వ్యక్తి స్వేచ్చను హరించకూడదు. వ్యక్తి ఎదుగుదలకు ఆ బంధం బలం కావాలి కానీ అడ్డుకాకూడదు, బాధ పెట్టకూడదూ అనేది నేను బలంగా నమ్ముతాను. నీల చదివాక అటువంటి వ్యక్తులను చూశాను అనే తృప్తి కలిగింది.

ఈ నవల చూసినప్పుడు ఇన్ని పేజీలా అనిపించింది.మొదలు పెట్టిన తర్వాత ఏ కాస్త సమయం దొరికినా తన వద్దకు లాక్కుంది.

ముందు నీల బాల్యాన్ని చదువుతున్నప్పుడు మనసు జాలితో,బాధతో నిండి పోతుంది.తన ప్రమేయం లేకుండా పెళ్ళి బంధంలో ఇరుక్కుపోవటం, చిన్న తనంలో బిడ్డకు తల్లవ్వటం, భర్తకు వేరే స్త్రీతో సంబంధం, అదే కాకుండా తన మీద అనుమానపు నిందలు..చదువుతున్నంత సేపూ గుండె బాధతో విల విల లాడి పోతుంది.కూతురు వెళ్ళిపోదామా అన్నప్పుడు క్షణం కుడా ఆలోచించకుండా ఆ బంధాన్ని తెంచుకోవటం, విడిపోవాలన్న వూహ ఇంతవరకూ రాలేదు , ఇప్పుడు ఆలోచనా ,నిర్ణయం ఒకేసారి జరిగాయి అన్నప్పుడు ఎంతో అబ్బురంగా అనిపించాయి ఆ మాటలు.మనమే నీలై ఆ మాటలు అన్నట్లనిపించాయి.

ప్రతి కష్టంలోనూ బిడ్డను వెంటబెట్టు కోవటం నాకు బాగా నచ్చింది.తన పరిస్థితులు యధాతధంగా బిడ్డకు చూపించటం ప్రతి తల్లీ తెల్సుకోవాల్సిన విషయం.

పరదేశితో ప్రేమ చిగురించటం ఎండిన గుండె మీద పన్నీరులా అనిపిస్తుంది. She Deserve it అనిపిస్తుంది.తను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని , ఆ అమ్మాయితో చెప్పి సెటిల్ చేసుకుంటాననీ చెప్పినప్పుడు , నీల పరదేశీని వదులుకోవటం చాలా చాలా నచ్చింది. ఈ సంఘటణ ,ఏ తోడూ లేదు కదానీ ఏ ఆసరా దొరికినా పట్టుకోకుండా, తన పూర్వపు అనుభవాల నుండి తను నేర్చుకున్న పాఠంలా మెట్యూరిటీని చూపిస్తుంది.

“పొడవుగా ఉండే లోలాకులు నాకు చాలా ఇష్టం.నేను కొంచెం కదిలినప్పుడల్లా అవి నాతోపాటు కదులుతాయి. నేను కాకుండా ఇంకేవో నాతో ఉన్నాయి.నేను కొంచెం కదిలినా స్పందిస్తాయి. అవి నాకు తోడుగా ఉన్నాయన్న ఫీలింగ్ బాగుంటుంది”. ఇది చదివినప్పుడు ఆ ఒంటరితనం నాకు అనుభూతమయ్యి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇటువంటి మాటలెన్నో.

సదాశివ పాత్ర అత్యద్భుతం. నిజ జీవితంలో ఉంటారో లేదో నాకు తెలియదు. ప్రతి స్త్రీ లెదా పురుషుడు ఇటువంటి వ్యక్తి తన జీవితంలో భాగస్వామి కావాలని కోరుకుంటారు. నాకు కొన్ని పేజీలు యద్దనపూడి గారి నవల చదువుతున్నానా అనిపించాయి. అంతగా ప్రేమలో ముంచేశారు కొంతసేపు. అతని ఆసరాతో నీల తనని తాను మలచుకొనేది బాగుంది. నిజం చెప్పాలంటె అతని ప్రమేయం తక్కువే. అన్ని సౌకర్యాలూ ,స్థిమితమైన జీవితం ఉన్నా నీల అక్కడితో ఆగిపోకుండా తన ఇడెంటిటీ తోనే ముందుకు వెళ్ళటం తన సర్కిల్ ని పెంచుకోవటం చాలా బాగుంది.అలా చేసుండక పోతే నీల అసంపూర్ణమయ్యేది.

చివరగా నీల కూతురు మినో పాత్ర నాకు హెచ్చరికగా అనిపించింది. ఏడెళ్ళ కూతురున్న తల్లిగా భవిష్యత్తులో బిడ్డ ఆలోచనలు ఎంత ఉధృతంగా ఉంటాయి, నన్ను నేను అప్ గ్రేడ్  చేసుకోవాలీ అనిపించాయి. ఇందులో ప్రతి పాత్రా చాలా బాగా మలిచారు. నేను ఎక్కువగా నీల గురించే చెప్పాను. ఏ పాత్రనూ నెగెటివ్ గా చూపించక పోవటం అత్యధ్బుతం చివరకు తన భర్తతో సంభంధం ఉన్న ఆమెనూ, అతన్నీ కూడా.

ఈ పుస్తకంలో స్వేచ్చ గురించి మల్లీశ్వరి గారు చెప్పింది నాకు చాలా నచ్చింది. విడాకులు తీసుకొని ప్రపంచంలోకి అడుగుపెట్టగానే అంతులేని స్వేచ్చ. స్వేచ్చలో మనకి మనం తప్ప ఎవరూ ఉండరు. దాని బరువు మోయలేక దానికిందే పడి నలిగిపోయిన జీవితాలెన్నో”. ఇక్కడ నిజ జీవితంలో మనం చూసిన వాళ్ళు గుర్తుకు వస్తారు. అసలు స్వేచ్చ ఒక పెద్ద బాధ్యత అనిపిస్తుంది.

నాకు తెల్సిన , నాకు నచ్చిన Feminism చూశాను ఈ పుస్తకంలో. ఒక మంచి పుస్తకం చదివినప్పుడు మన ఆలోచనా పరిధి ఎంత విస్తృతమౌతుందో ఈ పుస్తకం చూపించింది.

చెలం రాజేశ్వరిలా, మీ సదాశివ…

Image may contain: 1 person, smiling

చదువరి, సమీక్షకురాలు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా, పూర్వ అధ్యక్షులు, ‘ఊహల ఊసులు’ బ్లాగర్ అయిన సంధ్య ఎల్లాప్రగడ గారు నీల నవల గురించి తన ఉద్వేగాలను ఇలా పంచుకున్నారు.

*********************

 

“లైంగిక విలువల పేరుతో పురుషులూ స్త్రీలూ, గురయ్యే హింస నుంచి విముక్తి పొందాలి” ఎంత బలంగా ఉన్నది ఈ మాట! ఈ ఒక్క మాట కోసమైనా నీల చదవాలి.

నీల ను చదివాను.

మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ హడావిడి తగ్గాకా, కొంచం టైం కుదుర్చుకొని నీల ను మొదలెట్టాను.
500 పేజీల పైనున్న ఈ నవల నన్ను ఇంతగా ఊపేస్తుందని, ఉక్కిరిబిక్కి చేస్తుందని అనుకోలేదు. అసలు పూర్తిగా చదువుతానా? అని ఒక డౌటు వుంది మొదలెట్టక ముందు.
అసలు ఈ వీక్ నాకు చాల ముఖ్యమైనది. నేను, హనీ కలసి ఉండే ప్రత్యేకమైన సమయం. ‘అమ్మ- కూతురు’ ప్రైవేట్ టైం అన్నమాట.
మళ్ళీ తను అటు-ఇటు గా ప్రయాణాలు తో బిజీ అయిపోతుంది. తర్వాత శ్రీలంక వెళ్తుంది. అందుకే ఈ నాలుగు రోజులు మేమిద్దరం ఎన్నో పనులు చేసుకుందామని, మాకిద్దరికి ఇష్టమైన, దాని చిన్నపట్నుంచి తిరిగిన చోట్లకి, Restaurants కు వెళ్లాలని చాలా ప్లాన్ చేసుకున్నాము. అలాంటి సమయంలో ఎందుకో వచ్చి నెల రోజులైనా, చూడ లేదని “నీల” ను చేతపట్టుకున్నాను.
అతిశయోక్తి కాదు కానీ, ఈ నాలుగు రోజులు ఏ పని చేస్తున్నా ఆ బుక్ నా చేతులలో అత్తుకుపోయింది. పిల్ల గోల చేసినా నా వల్ల కాలేదు.
ఆ పుస్తకం అందించిన మత్తులో ఇప్పుడు పూర్తిగా మునిగి పోయాను. ఆ వరదలో కొట్టుకుపోయాను. నీల నన్ను పూర్తిగా ఆక్రమించింది.

మల్లీశ్వరి గారి నవలలు కానీ, కథలు గాని నేను చదవలేదు పూర్వం. తనను ఫేస్బుక్ లో ఫాలో అవుతూ వారు రాస్తున్నవి చూడటం తప్ప. ఆవిడ రచయిత్రి అని తెలుసు కానీ, నవలలు చూడలేదు వ్యాసాలు తప్ప.
సమకాలీన సాహిత్యంతో నేను పొత్తు కుదుర్చుకునే ప్రహసనం లో ఉన్నాను(catching up kinda).
తానా అవార్డు గెలిచిన ఈ నవల మిత్రులు నాకు పంపారు. అవి నాకు అంది నెల పైన అయ్యింది. అలా నేటి సాహిత్యం ను కదిపిన,కుదిపిన ‘నీల’ నాకు అందింది.

ఎవరికి వారు తమ జీవితమును మలుచుకోవాలి. అందుకు కొన్ని నిర్దిష్టమైన సూత్రాలు పెట్టుకోవాలా? జీవితాన్ని క్రమపద్ధతిలో మలుచుకోవాలని తృష్ణ ఎంతమందికి ఉంటుంది? అన్ని సమకూర్చ పడినవారికి ఉండకపోవచ్చును, కానీ అందరికి జీవితం వడ్ఢించిన విస్తరి కాదు. మనం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. అంతే కాని సమాజము విధించిన సంకెళ్ళలలో మనని మనం కోల్పోకూడదు.
ఆ నిర్ణయించుకున్న మార్గంలో వెళితే మనకు ఫలితాలు దొరుకుతాయని ఈ నవలలో చెప్పారు మల్లీశ్వరి గారు.

మల్లి గారు మీ మిజో మా అమ్మాయి ని గుర్తుకువచ్చింది చాలా. మా అమ్మాయిని చదువుకని నిర్బందించినది లేదు. తన విజయాలు తనవే. అవి దాని చాయస్ పూర్తిగా. యాక్టివిష్టు గా టంపుకు వ్యతిరేకంగా పోరాడుతుంటే కుదిరినంత కు కూడా వున్నాను ఇక్కడ్నుంచి. రీసర్చ్ అని శ్రీలంక వెడతామన్నా మరోటన్నా సమర్డించటమే మా పని.
నిజంగా పిల్లల భావాలను స్వేఛ్చగా వదిలేస్తే వారికి కావలసిన, వారి చుట్టూ ఉండవలసిన వాతావరణాన్ని వారే సృష్టించు కుంటారు. నీలకు లేని ఆ వెసలుబాటు మిజోకు కలిగించారు. అలాంటిదే గనుక నిజజీవితంలో ఉంటే, మార్పు తప్పక వస్తుంది అన్న నమ్మకము కలిగింది చదివాక.

అజిత లాంటి వారిని కూడా లైఫ్ నేను చూసాను. లైఫ్ ని బంధించకుండా స్వేచ్ఛగా ఉండటం. అలాంటి వారిని చుస్తే నాకు చక్కట్టి మోహనరాగపు కీర్తన విన్నట్లుగా ఉంటుంది. మేమంతా లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ అనే సిద్ధాంతంలో బ్రతికే మధ్యతరగతి మందహాసాలం. అజిత అలాకాదు, చెలం కలం నుంచి వచ్చిన నాయకి లా ఉంటుంది. ఎవరు అభిమానించరు అలాంటివారిని?

పరదేశి కూడా ఓకే..

కానీ, సదాశివ …” ఎలా అండీ…ఎక్కడ ఉంటారండీ ఇలాంటివారు? ఉన్నది ఉన్నట్లుగా, నిజంగా, నికార్సైన నిజాలను పరిస్థితిని అలానే తీసుకొనే వాళ్లు? చూడాలను వుంది ఒక్కసారన్నా.
ఉంటె ఎంత బాగుంది. మీ ఇంటర్వ్యూ చూశాను.చెలం రాజేశ్వరిలా, మీ సదాశివ అన్నారు. బాగుంది… నిజమే కదా. నేడు మీకు రాజేశ్వరిని నేటి సమాజంలో చూడొచ్చు. రేపటి రోజున సదాశివ ను కూడా చూస్తామేమో….

మీ నవల గురించి “వీరభద్రుడు” గారు లాంటి వారే చెప్పారు ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా అనవసరం.
నేను చాలా ఆలోచించాను ఇలా చేతయి చేతకాని నా రాతలతో మిమ్ముల విసిగించాలా అని…కానీ, నీల నన్ను నిలవనీయలేదండి. అందుకే నేను చదివానని అట్టెండ్స్ కాకుండా, నన్ను చాలా డిస్టర్బ్ చేసిందని మీకు చెప్పాలని…. ఏంటో.. నాకే తెలియదు..

మీరు గిరిజనుల జీవితాల మీద రాస్తానన్నారు. ప్లీజ్ తప్పక రాయండి.

మాలాంటి జడులను చైతన్య కలిగించేలా మీరు ఇంకా రాయాలి.
గుండె గొంతులోకి వచ్చి ఇంకా చెప్పక తప్పదనట్లు గా మీకు మేము చెప్పాలి. తెలుగు కు, తెలుగు మాట్లాడే వారికి దూరంగా ఉంటూ, తెలుగు చదివి, నేటి జీవితాలు, మార్పులు తెలుసుకోవాలనుకునే నాలాంటి వారికి సమకాలీన ప్రపంచం తెలిసేలా రాయాలి.
మీకు నిజంగా వేల అభినందనలు కూడా తక్కువే… అయినా నా ఒక్క ఈ అభినందన కాదనకండి ప్లీజ్ !!

(నా దగ్గర మీ మైల్ ఐ.డీ. లేదు. వుంటే మీకు మైల్ చేసెదాన్నండి)
అభిమానంగా
సంధ్య.

No automatic alt text available.

 

నీల’తో నా స్వరం మల్లీస్వరమే!

నీల’తో నా స్వరం మల్లీస్వరమే!

  • హేమమాలిని అవధానం

 

*************

ఎప్పుడెప్పుడు చదువుతానా అని ఎంతగానో ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది.
‘నీల’ నాచేతికొచ్చింది. అబ్బురంగా చూశాను.
‘నీల’ను తాకుతున్న సీతకోకచిలకమ్మ, తనలో వున్నన్ని వర్ణాలు, నీడలు, ఇందులో వున్నాయని గర్వంగా నిల్చుంది. కిందనే కె.ఎన్.మల్లీశ్వరి గారి పేరు చూడగానే ‘జాజిమల్లె’ల కథా సౌరభాలు చుట్టుముట్టాయి. తన రచనలు నాలో ఎప్పుడూ ఆసక్తిని రేపి, అనుభూతులను పంచిన నేస్తాలే. ‘తానా బహుమతి’ని పొందిన నవల ఎలాంటి కథను నింపుకుందో అనే నా ఉత్సుకతను పెంచేలా ‘నీల’ ముఖచిత్రం కనపడింది. ‘నేనన్నిటికీ అతీతురాలిని’ అని తనలోతాను పరవశిస్తూ చిరునవ్వును చిందిస్తున్న చిరుదీపికలా ‘నీల’ ముఖప్రవాహం. ఆనందంతో నిండిన ఆమె వదనం కథలో మలుపుల వెనుక సుఖాంతాన్ని ప్రతిబింబిస్తోంది అనిపించింది. ప్రచురణకర్తల ముందుమాటలు, విమర్శక మిత్రుల విశ్లేషణలు పదపదమంటూ కథనంపై ఆసక్తిని మరింతగా పెంచాయి.

అక్షరాల వెంట నా కనులు నడకను మొదలుపెట్టాయి. మొదట్లోని చిరునడక, మెల్లిగా వేగం హెచ్చి, పరుగందుకొంది. కథలో కొన్నిచోట్ల ప్రేక్షకురాలిగా, కొన్నిచోట్ల పాత్రల మాటలు నావే అన్నట్లుగా, కొన్నిపాత్రలలో నేనే అన్నట్లుగా సమాంతరంగా నడిచాను. కొన్నిచోట్ల గొంతు పూడుకుపోయి, ఊపిరాడక, కన్నీటిపొర అడ్డొచ్చి అక్షరాలు అలుక్కుపోయాయి. ఈ బాధను భరింపలేమంటూ కొన్ని కన్నీటి చుక్కలు నన్ను వీడాయి.

‘నీల’ వ్యక్తిత్వ వికాసంలో బాల్యం, ఆలోచనా తీరు, ఉద్యమ వెల్లువ, వైవాహిక జీవితాన ముళ్ళగాట్లు, ప్రేమలు వాటి పయనాలు, వేటికవే ప్రత్యేక భాష్యాలే. తను స్వేఛ్ఛను వెతుక్కొన్న తీరు, సాహచర్యపు సరిగమలు, తనని తాను ఆవిష్కరించుకొన్న తీరు అద్భుతం. చంద్రకళ, ఆరంజోతి, పాస్టరమ్మ, సరళ, వసుంధర, సంపూర్ణ, అజిత, మినోల వ్యక్తిత్వాలు, తత్వవేత్తలకు తగ్గని పైడమ్మ జీవనసారం అన్నీ అనంతాలే.
‘నీల’ జీవితంలో చంద్రోదయం పరదేశి, సూర్యోదయం సదాశివ, చీకటి నింపిన ప్రసాదు, దిగంత రేఖ సూర్యం, అన్నింటా జీవశక్తితో వెలుగును సానబెట్టుకున్న ‘నీల’ నిజంగా వెలుగు జిలుగే.
ఏది స్వార్ధం? ఎక్కడ న్యాయం? ఏది ప్రేమ? ఎక్కడ ద్వేషం?
ఏది పగ? ఎక్కడ క్షమ? ఏది స్వేచ్ఛ? ఎక్కడ అధికారం?
ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు నింపుకున్న నవల నిండుగా వుంది. ‘నీల’. ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలనూ ప్రతిబింబించింది. ఏకబికిన నన్ను పంక్తులదారిలో, పేజీల వెంట ఉరుకులెత్తించిన ఈ నవల చదవడం ముగించాక మనసున ఓ ఆనందం, హృదయానికో తృప్తి అనిర్వచనీయ భావన. ‘నీల’ను వెలువరించిన మల్లీశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ’నీల’ సాహితీ వినీలాకాశంలో ఎప్పటికీ మెరిసే ఓ నక్షత్రమే.

No automatic alt text available.

పి. సత్యవతి గారికి నచ్చిన పుస్తకం

Image may contain: 2 people, including Jaji Malli Jaji, people sitting and indoor

 

భిన్న దృష్టికోణాలను ఆసక్తిగా చూడగల నిబ్బరం సత్యమ్మ నైజం. నీల నవలని మీరు అర్థం చేసుకున్న తీరు, నాకు రిలీఫ్ ని ఇచ్చింది. ఇంత ఓపికగా సమీక్ష చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. Sathyavathi Pochiraju garu.

*******************

నచ్చిన పుస్తకం

సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో తెలిసిన మనిషి

నీల

బహుమతి పొంది, చర్చలోకి వచ్చిన ఒక పుస్తకం పైన అందరికీ ఆసక్తి వుంటుంది. అలాగే నాకు కూడా. అందుకే చదువుతాను.. అది నన్ను పట్టుకుంటే ఎవరికైనా చెప్పాలని ఆత్రపడతాను. ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా మళ్ళీ చదువుతాను.. నీల గురించి ఎక్కువమందితో పంచుకోవాలని. ఈ 540 పేజీల నవల ఎక్కడా విసుగు పుట్టకుండా చదివించింది నాచేత. పుస్తకం అంతా మనుషులు తమను తాము నిలబెట్టుకునే క్రమంలోని వైవిధ్యం.. ముఖ్యంగా స్త్రీలు. వాళ్ళు పితృస్వామ్యం సృష్టించిన మూసలు కారు. ఎవరి పరిధిలో ఎవరి చైతన్యంతో వారు నిలబడడానికి పోరాటం చేస్తున్న స్త్రీలు ఆంధ్రప్రదేశంలోని పాతిక సంవత్సరాల ఉద్విగ్న భరితమైన రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక పరిణామాల నేపధ్యం. ఊపందుకుంటున్నఅస్తిత్వఉద్యమాలు, ప్రేమికుల సహచరుల మధ్య స్వేచ్చతో కూడిన గౌరవం కోసం చేసిన ప్రయత్నాలు. విస్తృతమైన కాన్వాస్ మీద చిత్రించిన సాంఘిక జీవన చిత్రం ఇది. ఈ నవల వ్రాయడం వెనక రచయిత కృషి, శ్రద్ధ, తపన, అధ్యయనం, అవగాహన తెలిసిపోయింది.

కథలకు కవిత్వానికి వచ్చిన పాఠకాదరణ, గుర్తింపు నవలలకు రాకపోవడానికి, వస్తూన్న నవలల సంఖ్య తక్కువ కావడమో లేక అవి సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునే పాఠకులు ఆశించే ప్రమాణాలను అందుకోక పోవడమో ఏ కారణమో కాని అప్పుడప్పుడూ వచ్చే గుర్తించవలసిన నవలల ప్రస్తావన కూడా నలుగురు కలిసిన వేళల నోటిమాటల ద్వారా కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం లేదేమో అన్పిస్తుంది. బహుళ ప్రచారంలో వున్న పత్రికల్లో పుస్తక సమీక్షలకు కొలతలుంటాయి. అంగుళాల లెక్కన. ముఖ పుస్తక పరిచయాలకు కూడా పైకి కనపడని సమీకరణాలుంటాయి.

జీవితం మొదటి కొసకే నిప్పు అంటుకున్న పిల్ల నీల. కుంచెలలో, కలాల్లో పంచవన్నెలూ, చల్లగాలులూ సుందర సోయగాలూ పోయే పల్లెటూరుకాదు ఆమె వుండేది. చీకట్లో గోతులతో దోమలు ముసిరే మురుగు కాలవల ఆలవాలం ఆమె వుండే చిన్నఇల్లు. ఏలూరును ఆనుకుని వుండే చోళదిబ్బ. తాగి వేధించే తండ్రి, కుట్టుపనితో కుటుంబానికి ఆసరా అయిన తల్లి, ఎక్కడా జీవితంలో ప్రేమకూ ఆదరణకూ కనీసపు ఆనందానికీ నోచుకోని ఆ తల్లి, ఒక చిన్న ప్రేమ నెలవు వెతుక్కున్న నేరానికి భర్త చేత హత్య చెయ్యబడి ఆ మచ్చను నీలమీద వొదిలి పోయింది. అప్పటి నించీ నీల జీవన పోరాటం మొదలైంది. తన జీవితమే ఒక పోరాటంగా బ్రతికిన నీల ప్రజా పోరాటాలను జీవితంలో బాగం చేసుకునే దాకా ఎదిగింది. పాతిక సంవత్సరాల ఉమ్మడి అంధ్రప్రదేశ చరిత్రతో పాటు నీల జీవిత గమనాన్ని ఆమె ఆలోచనల్లో ఆచరణలో వచ్చిన పరిణామాలనూ పెనవేసుకుంటూ సాగింది నవల.

ఇది నాయిక కేంద్రక నవల కాదు. ఒక జీవితం చుట్టూ కూడా అల్లిన నవల కూడా కాదు. ఇందులో చాలామంది స్త్రీ పురుషుల జీవితం వుంది. వాళ్ళు దానిని మలుచుకున్న తీర్లల్లో భిన్నత్వం వుంది.ఎవరి జీవితమూ వ్యక్తిత్వమూ నలుపు తెలుపు కాదు. వాళ్ళంతా జీవమున్నమనుషులు. జీవితాన్ని వారికి అనువైన తీరులో నిర్మించుకున్న వారు. అయితే రచయితకు గానీ పాఠకులకు గానీ కొన్నిపాత్రలు సన్నిహితంగా వస్తాయి. ఇంకొన్నిటిని చూసి జాలిపడతాం, వాటిలోని మానవ స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. అట్లా అర్థం చేయించడంలో రచయిత్రి సమతుల్యాన్ని సాధించింది. అందుకే పుస్తకం చివరిపేజీల్లో ఒకచోట “మనుషుల్ని ఎంత చివరికి వెళ్లి ప్రేమించవచ్చో తెలుసుకున్నాక…. తను గెలిచిన మజిలీలో నిలబడి గతాన్ని దయగా చూడ గలుగుతోంది.” అంటుంది నీల గురించి.

తల్లిని హత్య చేసి తండ్రి జైలుకి పోతే బంధువులెవరూ దగ్గరకు తియ్యని నీలని పాస్టర్ దంపతులు అక్కున చేర్చుకుని ఇంటర్ మొదటి సంవత్సరం దాకా చదువుకోనిచ్చారు. అందుకు కృతజ్ఞతగా ఆమె వాళ్లకి ఎంతో పని చేసి పెట్టేది. పొందికగావుండేది. పాస్టర్ దంపతులు ఆమెను అనాధగా చూడలేదు స్వంత బిడ్డలా చూసుకున్నారు. అందుకే వాళ్లకు స్థాన చలనం వచ్చినప్పుడు ఆమె భద్రత కోసం నీలని కావాలని కోరుకుని అడిగినవాడికి ఇచ్చి పదిహేడేళ్లకే పెళ్లిచేసి బాధ్యత నిర్వహించారు. అట్లా 1991 లో రాజమండ్రికి కాపురానికి వచ్చింది నీల. తన కన్న పన్నెండేళ్ళు పెద్దవాడైన అతను నిజంగా తనని మనసుతో కోరుకున్నాడని, అనాధ అయిన తనకు ఒక ఇల్లు అమరిందని ఇంక తన బ్రతుకు అతనితోనే ముడి వేసుకు పోయిందనీ తల్లిలా కాక తను ఒక్కరితోనే జీవితంలో ఇమిడిపోవాలనీ నిశ్చయించుకున్న నీల జీవితం అట్లా కొనసాగలేదు.

ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ వొంటరిగా రాలేదు. బోలెడు గతాన్ని దాచిబెట్టుకు వచ్చాడు. పైగా ఆమె తల్లి మచ్చను అతను మర్చిపోలేదు. ఆమె సంసారం నిప్పుల కొలిమి అయింది. పద్దెనిమిదేళ్ళకే తల్లి అయిన నీలకి ఆమె భర్త ప్రసాద్ గతం వర్తమానం అన్నీ ఒక్కొక్కటే అర్థం అయి బ్రతుకుని ఉక్కిరి బిక్కిరి చేసాయి. అయినా అందులోనే ఇమడడానికి అతన్ని సంతోష పెట్టడానికి చేతనైనన్ని విధాలుగా ప్రయత్నించింది. సునామీలను ఎదుర్కుంది. మానసిక శారీరక హింస అనుభవించింది.

అయితే ఈ యుద్ధ కాలంలోనే ఆమె డిగ్రీ ప్రయివేటుగా చదువవుకోగలిగింది. సారా ఉద్యమంలో పాటలు పాడింది. లాయర్ వసుంధరతో పరిచయం అయింది. బయటి ప్రపంచాన్ని కొంత చూసింది. ఎం.ఎ లో కూడా చేరింది. భర్త అనుమానాలనీ అతను చేసే అవమానాలనూ పీకల మీదకు వచ్చే దాకా ఓర్చుకుని, తట్టుకుని చివరికి, ఇద్దరు స్త్రీలమధ్య నలిగిపోతున్న భర్తకు స్వేచ్చ ఇచ్చి తానూ ఆ బంధంలో నుంచీ తప్పుకున్నది. రాజమండ్రిలో ప్రసాద్ తో చేసిన ఆరేళ్ళ కాపురం, చిన్నప్పుడు అంటుకున్న నిప్పుతోనే పరుగు. ఎమ్మే చదివినా నీలకు సరైన ఉద్యోగం రాలేదు. పాస్టర్ మామయ్య చనిపోగా పాస్టరమ్మ ఎక్కడో కర్ణాటకలో కష్టాలు పడుతోంది. మళ్ళీ తను పుట్టి పెరిగిన చోళ దిబ్బకే 1997లో తిరిగి వచ్చింది నీల. తల్లి మరణానికి ముందు జ్యూట్ మిల్ కార్మికుల ఆందోళనలో నాయక పాత్ర వహించిన ఆరంజోతికి, తమ్ముడు స్టాలిన్ సూర్యం అదృశ్యం, నీల తల్లి చంద్రకళ హత్యతో మతి చెడిపోయింది. ఆరంజోతి తమ్ముడు స్టాలిన్ సూర్యం అంటే నీలకు గౌరవం. అతన్ని పోలీసులు ఏం చేసారో అని ఆరంజోతి అల్లాడి పోయింది. మతి చెడిపోయింది. పోరాటాలకి ఎప్పుడూ ముందు వుండే ఆమె రెక్కలు కత్తిరింప బడ్డాయి.

ఆమె కూతురు సంపూర్ణ నీలని ఆదరించి ఇల్లు ఇచ్చి బ్రతుకు తెరువుకు ట్యూషన్లు కుదిర్చింది. సంపూర్ణ ఇప్పుడు, గొడవలు జరిగితే కోళ్ళగంప చాటున దాక్కునే పిరికి పిల్ల కాదు. డ్వాక్రా సంఘాలకి పొదుపుసంఘాలకి నాయకురాలు. బుద్దిమాంధ్యపు భర్తనూ మానసికంగా ఎదగని కొడుకునూ మతిచెడిన తల్లినీ చూసుకుంటూనే ఊరి రాజకీయాల్లోకి వచ్చింది. అధికార పక్షం ఎంఎల్ ఎ ప్రాపకం సంపాదించింది. స్త్రీలను కూడగట్టింది.

సంపూర్ణ అంటే వ్యక్తిగా నీలకి ఇష్టం. కానీ ఆమె రాజకీయాలు ఒక్కొక్కసారి నీలకి నచ్చేవి కావు. భర్త రెడ్డయ్యతో ఆమె ప్రవర్తన, ఆరంజోతిని ఆమె చూసుకునే తీరులో మానవీయత కనిపిస్తుంది. అక్కడ కుల రాజకీయాలు మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, స్త్రీలకు అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకునేందుకు అనుసరించే దారుణమైన మార్గాలు, అన్నీ కళ్ళకు కట్టిస్తుంది రచయిత్రి. అయితే ఈ పొదుపు అప్పుల వల్ల స్త్రీలు కూడా ఆర్ధికరంగంలో ప్రవేశించడం, తనఖా ఏమీ లేకుండా వాళ్లకి అప్పు దొరకడం ఆ అప్పు తీర్చుకోడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోడం అంతా అక్కడొచ్చిన మార్పుగా గ్రహించింది నీల. ఒక పొదుపు సంస్థకు వాయిదా చెల్లించలేక బియ్యం బస్తాలో దూరి దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్న నిండు గర్భిణి చావు, దానిని రాజకీయం చేసిన సంఘటన అప్పట్లో పత్రికల్లో వచ్చే వార్తలే.

అప్పుడే పొదుపు సంఘాల మీద పరిశోధనకు వచ్చిన పరదేశి ఆమెకు స్నేహితుడయినాడు. అతనితో కలిసి బెస్త గ్రామాలను బెస్త వారినీ సముద్రాన్నీ దగ్గరగా చూసింది. సముద్రం ఎందుకు వెనక్కి పోతుందో అర్థమవుతోంది. ప్రసాద్ తో ఆమె జీవితం ఒక అనుకోని సంఘటన. కానీ పరదేశీని ఇష్టపడింది. అతనితో సాహచర్యాన్ని కోరుకున్న నీలకి అతనికీ ఒక గతం వుందని తెలిసింది. అతనే చెప్పాడు తను ఒక స్నేహితురాలితో రిలేషన్ షిప్ లో వున్నానని ఆమెతో బ్రేక్ అవుతానని. ప్రసాద్ తో అనుభవాల తరువాత పరదేశికి దగ్గర కావద్దనుకుంది నీల. కానీ చోళదిబ్బలో రాజకీయాలు పెద్దవాళ్ళ ప్రయోజనాలకు సంపూర్ణను బలిపశువు చెయ్యడం, తను ఎదగడానికి దాన్ని కూడా సహించిన సంపూర్ణ ప్రవర్తన నచ్చడం లేదు నీలకి. ఏదోపని మీద అక్కడకు వచ్చిన లాయర్ వసుంధర సాయంతో ఆమె 2000 సంవత్సరంలో హైదరాబాద్ మహా నగరం వచ్చి అక్కడ అజిత ఎన్జీవోలో నెలకి ఎనిమిది వేల జీతానికి ఒక ఉద్యోగంలో చేరి పాపతో కలిసి ఒక్కతే వుంటూ ఊపిరి పీల్చుకుంది.

అక్కడ నించీ ఆమెకి ప్రఖ్యాత లాయర్ సదాశివతో పరిచయం, అతని తల్లితండ్రులు నీతాబాయి ప్రకాష్ ల కథ, సింగిల్ వుమన్ గా అజిత జీవితంతో ధైర్యంగా తలపడుతున్న తీరు, నీల తరువాతి తరంలోకి వచ్చిన నీల కూతురు మినో అభిప్రాయాలు, తరాల మధ్య సంఘర్షణ, సదాతో నీల సహజీవనం, నీల అభిప్రాయాలలో ప్రపంచాన్ని చూసే తీరులో చైతన్యంతో కూడిన తాత్వకమైన మార్పులు, మానసిక సంఘర్షణలు, మళ్ళీ పరదేశితో కలిసి బెస్త గ్రామాల సందర్శన అక్కడ గంగవరం మొదలైన చోట్ల జరుగుతున్న అభివృద్ది తాలూకు విధ్వంసం, విస్తాపన అన్నీ నీల జీవితంపైన ప్రసరిస్తున్న ప్రభావాలు, మొత్తం పదకొండు సంవత్సరాల చరిత్ర. నవల అక్కడే ప్రారంభం అయి ఒకచుట్టూ తిరిగి అక్కడే ముగుస్తుంది. నవలలో కొన్ని వాక్యాలు మనసుకు పట్టుకుంటాయి. పాస్టరమ్మ ప్రేమని గురించి చెప్పినవి. రెక్కలు ఊడిన పక్షి గమ్మున వుండి తిరిగి రెక్కలు పొందడం, ప్రేమ గురించి సహజీవనం గురించి వ్యాఖ్యలు .

“ముందు మనకి మనం వుండాలి ఆ ధైర్యం నుంచీ స్థిమితం నుంచీ మనుషులను కోరుకోవాలి”

సముద్రంతో పైడమ్మ “ఒలె! అప్పా! నచ్చత్రాలు భూమండలము పుట్టినప్పుడు పుట్నావు. ఇన్ని తాపులు కాసినావు. రాచ్చసులంటి పడవల్ని బుజానేసుకుని మోసినావు. సెత్త సేదారాలన్నీ లోపట దాసుకున్నావు. నీ లోపట సంపదలు సత్తువలు తీసి మాకిచ్చినావు. ఇంకా ఈ జీవరాశికి ఎంత కాలం సాకిరీ సేత్తావు? బుడింగిన మునిగి మాయమౌదారని అనిపించట్లేదే నీకు?”

“ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైనవి సార్వజనీనమైన విలువలేవీ వుండవని తన జీవితం నుండే కనపడుతోంది నీలకి. స్త్రీగా వుండడం కన్నా మనిషిగా రూపొందడం కోసమే బ్రతకాలన్న భావం లీలగా తోస్తున్నది”

“నీ రక్షణలో నీ ప్రేమలో నన్నునేను కోల్పోతున్నాననిపించింది. మళ్ళీ నన్నునేను కూడగట్టుకోవాలని పించింది. నాకు కావలసింది నా ప్రయాణం ఆగక పోవడం.”

“నాకు నీ మీద కృతజ్ఞత వుంది సదా ! కానీ నేను నీ సహచరి నైనందుకు ఎప్పుడో ఒకప్పుడు నా మీద నీకు కూడా కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి”

“నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రేమలన్నీ ఏదో ఒక రూపంలో బందిఖానాలే. అట్లా కాకుండా మనుషుల కుండే అన్నిరకాల స్వేచ్చల్నీ గౌరవిస్తూ ప్రేమించుకోడం మంచి విలువ. దానర్థం లోకం అపోహ పడినట్లు అనేక లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోడం కాదు…” వసుంధర చెప్పిన ఈ వాక్యం సుదీర్ఘ మైనది, ఆలోచింపజేసేది.

ప్రేమించడమే విలువైన పాస్టరమ్మ, అధికారం డబ్బూ పరపతీతో పాటు కుటుంబ సభ్యులను కూడా ప్రేమించే సంపూర్ణ, నీల మదిలో చిరకాలం నిలిచి పోయిన స్టాలిన్ సూర్యం, ఒంటరి మహిళగా జీవితపు సవాళ్ళను ఎదుర్కునే అజిత, మంచి లాయర్ అయిన వసుంధర, సరళ జీవన పోరాటం, నూతన తరం ఆవేశాలతో, ఆదర్శాలతో మినో, అందరినీ చుట్టుకుంటూ స్వేచ్చని మాత్రమే కాక సాహచర్యాన్ని కూడా కోరుకున్న నీల, అంతులేని ఒద్దికకీ అనంతమైన స్వేచ్చకీ మధ్య జీవించే కళ ఒకటున్నదని తెలుసుకున్న నీల, సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో అర్థం చేసుకున్న నీల, పరమం అంటూ ఏమీ వుండదని తెలుసు. కానీ ఇప్పటికి ఇది మనుషులు చేరుకోవలసిన ఒక స్థితి అనిపిస్తుంది.

కథ ముగిసే సరికి. ఇవన్నే కాక పశ్చిమ గోదావరిలో కందా బందాగా నూరే పచ్చళ్ళు, ఆలగోలు బాలగోలుగా అరిచే జనం, దాపుడుకోకలు, గుంపు సింపులు. చీకటి గుయ్యారాలు – తెలుగు పలుకుబళ్ళు.

సాధారణంగా ముందుమాటలు చదివి పుస్తకం చదివితే ఆ మాటలు పాఠకులను ప్రభావితం చేస్తాయి. అందుకని నేను పుస్తకం చదివాకనే ముందుమాటలు చదువుతాను. అట్లా చదివినప్పుడు ఈ నవలకు విపులమైన విశ్లేషణతో కూడిన వాడ్రేవు చినవీరభద్రుడు గారు వ్రాసిన ముందుమాట ముందే చదవాల్సిందేమో అనిపించింది. ఏకే ప్రభాకర్ గారిది కూడా.

( మే 2018 చైతన్య మానవి లొ ప్రచురితం )

**********

నీల – కవితానంతం

 

అర్థవంతమైన సాహిత్య ప్రయోగాల సాహసి ‘అనంతు’, నీల నవలలోని కవిత్వాన్ని ఇలా ఏరి కూర్చారు.

***************

నీల’ నవలలో నాకు నచ్చిన కవితలు 
………………………………………………….
1
అకస్మాత్తుగా
కాలికింద
పటుక్కున పగిలిన
పిట్టగుడ్డు
మనసు
*

2
లంగాపైని పూలన్నీ
రాలిపడేలా 
పరిగెత్తినా
తాళం వేసిన
తలుపులు
పలకవు.
*

3
ఆనందం వంతెన కింద
చీకట్లో
రహస్యంగా
పారే నది 
కనిపిస్తోంది 
మాటల్లో
*

4
అతని నవ్వు
ఎక్కడెక్కడి పిట్టలో
వచ్చి 
చెట్టు మీద వాలితే 
వినేంత అందం
*

5
ఆకాశం 
క్రిస్మస్ చెట్టు
*

6
ఆమె గొంతులో
కోడిపుంజులు
రివ్వున ఎగిరాయి
*

7
నీడని
నేను నడుపుతున్నానా?
నీడ
నన్ను నడుపుతోందా?
*

8
రుతువులు గడిచాయి
ఏ వర్ణమూ దొరకలేదు 
ఒంటరి వర్ణంతో
ఆమె
*

9
ప్రశ్న
మనసులో పుట్టి
మనసులో దాక్కోదు
అది బహిరంగమైనది
బయటికి దూకేయాలనే
తాపత్రయం
*

10

కొన్ని కలలు
మనసుని
ఎంత ఉదారంగా
మార్చాయో
కొలవడం
ఎలా సాధ్యం?
*

11

కలలో 
ఆమె వ్యవహారం
చాలా 
ఉదారం
*

12

కొందరు
గడుసు చినుకుల మల్లే
గుసగుసగా
దరి చేరకుండా
రాలుతుంటారు
*

13
వాన ఇవ్వని
మబ్బుల సంచారంలో
లోకం 
మసకబారుతోంది
*

14
ఈ ఒక్క రాత్రీ
పది రాత్రుల పొడవైపోయి
పది పగళ్ళన్నీ
నిమిషాలలోకి
కురచనైపోతే
ఎంత బాగుండునో
*

15
ఖాళీ చేయి
గాలిలో
ఊగే
పసి కొమ్మ

Real love makes us unattached

 

“లిబరలైజేషన్ పై కమ్యూనిస్ట్ లు చూపించే అకారణ ద్వేషం కాకుండా నిమ్న కులాల అభివృద్ది క్రమంలో దాని పాత్రని, లాభనష్టాలని నిజాయితీగా అంచనా వేసే ప్రయత్నం జరిగింది.” నీల నవలని సమీక్ష చేస్తూ Narukurti Sridhar గారు రాసిన వాక్యం ఇది. లిబరలైజేషన్ మీద కమ్యూనిస్టులకి ఉన్నది అకారణ ద్వేషమా? అన్న ప్రశ్న ఇమ్మీడియేట్ గా వస్తుంది. నవలలోని రెండు మూడు అంశాల మీద చర్చనీయాంశమైన సమీక్ష చేసారు. శ్రీధర్ గారి అనుమతితో వారి ఫేస్బుక్ వాల్ నుంచి సమీక్షని పోస్ట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ ది రివ్యూ శ్రీధర్ గారు.

*************

నీల (Real love makes us unattached )

 

‘నీల’ నవల చదివి చాలా రోజులయిపోయింది. ఆ పుస్తకం గురించి ఏమైనా రాద్దామనుకుంటూనే రోజులు గడిపేస్తున్నాను. సమీక్ష రాసేటంతటి జ్ఞానం, విషయం నా దగ్గర లేవు. అందుకే రాయడానికి కొంచెం భయం కూడా. చాలాకాలం తరువాత చదివిన పెద్ద తెలుగు నవల. అసలు చదవగలనా! ఎన్నో పుస్తకాలకి పట్టించిన గతినే (మధ్యలోనే ఆపేయడం) పట్టిస్తానా! అని అనుకున్నాను . కానీ ఈ పుస్తకం చదివిస్తుంది. ఎంతగా అంటే సెలవులకి వచ్చిన కావ్య నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేంత వరకూ. ‘నీల’ లాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉండరు. అసలు ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ నీల ఎదుర్కొన్న మథనం మాత్రం అందరిదీ. అంటే స్త్రీలది మాత్రమే కాదు, పురుషులది కూడా. స్త్రీ పురుష సంబంధాలలో ఉండాల్సిన స్వేచ్చ, లింగభేదం లేకుండా అందరికీ చెందినదే.

 

అస్థిత్వవాదపు రచనలు ఎంత బాగున్నా, మౌలికమైన విలువలని వదులుకోకుండా, అర్థం లేని పక్షవా/పాతానికి గురికాకుండా ఉన్నప్పుడు మాత్రమే గొప్ప రచనలవుతాయి. నిస్సందేహంగా ‘నీల’ అలాంటి రచనే. దీనిలో ఎవరూ దుర్మార్గులు కారు. వారికి అర్ధమైన సమాజపు విలువల పరిధిలోనే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆఖరికి ‘నీల’ని కూడా హీరోయిన్ అనలేము. ఈ నవలలో అన్నిటికన్నా నచ్చింది రచయిత్రికి మనుషుల పైన ,మానవ సంబంధాల పైన ఉన్న అపారమైన ప్రేమ. మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతూనే వాటిలోని అనివార్యతని కూడా విశ్లేషించడం ఆవిడ పరిణతిని సూచిస్తోంది. భార్యలని అనుమానించి వారిని కొట్టే ‘పరిసి’, ‘ప్రసాదుల’కి కూడా ఈ నవలలో మానవీయ పార్శ్వం ఉంది.

 

ఒక దిగువతరగతికి చెందిన అమ్మాయి అంచెలంచెలుగా జీవితంలోనూ, సంస్కారంలోనూ ఉన్నతమైన స్థానాన్ని పొందే క్రమంలో సుమారు నాలుగు దశాబ్దాల పాటు చేసిన ప్రస్థానం మాత్రమే కాదు ఈ నవల.. నాలుగు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల సామాజిక పరిణామం కూడా. లిబరలైజేషన్ పై కమ్యూనిస్ట్ లు చూపించే అకారణ ద్వేషం కాకుండా నిమ్న కులాల అభివృద్ది క్రమంలో దాని పాత్రని, లాభనష్టాలని నిజాయితీగా అంచనా వేసే ప్రయత్నం జరిగింది. రచనాశైలి కొడవటిగంటిని గుర్తుకు తెస్తుంది. చాలాచోట్ల వాక్యం కవితాత్మకం అవుతుంది. రచయిత్రికి సోషల్ వర్క్ మీద ఉన్న ప్రేమ అక్కడక్కడ రచనని పక్కదోవ పట్టించినా, ప్రీచింగ్ లేకపోవడం వల్ల బోరు కొట్టించలేదు.

 

బిందూతో నేను చాలాసార్లు అంటుంటాను. ‘భార్యాభర్తల మధ్య ప్రేమ, బాధ్యతల కంటే ముఖ్యంగా ఉండాల్సింది ఆకర్షణ, గౌరవం.’ నేనెంత బద్ధకస్తుడినయినా, తనెంత ఇందిరాగాంధీ అయినా మా ఇద్దరిమధ్య ఆ రెండూ ఉన్నాయి కాబట్టే సజావుగా నడిపిస్తున్నామని అనుకుంటాను. ఈ నవలలో ఎన్నో అద్భుతమైన వాక్యాలు ఉన్నా నన్ను బాగా ఆకట్టుకుంది ఈ వాక్యం “ప్రేమ స్నేహం అప్పుడప్పుడూ తొణికిపోవచ్చు. గౌరవించే మనుషులని ఎప్పటికీ వదులుకోవాలనిపించదు” ‘Real love makes us unattached’ అంటాడు వివేకానందుడు (‘రాజయోగ’లో అని గుర్తు). నిజానికి ఆకర్షణ, గౌరవం ఉంటే కలిసుండడానికి పెళ్ళే అవసరం లేదు. కాని అంతటి స్వేచ్చని పొందడానికి మనుషులపైనా, జీవితం పైనా అపారమైన ప్రేమ, గౌరవం ఉండాలి. అప్పుడా ప్రేమ – వ్యక్తులకో, సమూహాలకో దేశాలకో పరిమతమవ్వదు. అదసలు సాధ్యమా!! ఏది ఏమయినా ‘నీల’ తప్పక చదవాల్సిన పుస్తకమే. నీలతో పాటు సంఘర్షించాలిసిందే! ఆ catharsis అనుభవించాల్సిందే.

 

p.s. ఇది సినిమా సమీక్షలా ఉంటే అది నా తప్పే…