భాండాగారం

నవమి చిలుక

Image result for parrot in tree

ఇపుడొక చిలుక కథ చెపుతాను. మరీ పంచ వన్నెల రామచిలుక కాదు కానీ రెండే వర్ణాల సొగసు చిలుక కథ చెప్తాను. పుట్టింది మొదలు ఆకాశమంతా ఎగిరి దిక్కులు కలగలిసిపోయిన శూన్యాన్ని తన గానంతో పటాపంచలు చేసింది. తన చిన్నిరెక్కలు వీచే గాలికి పుట్టిన ‘ఝంజ’ని అదాటున లోకం మీదికి విసిరి ఫక్కున నవ్వింది. ఎర్రని ముక్కు వంపు చివర్లతో ఫలాదులకి మాధుర్యాన్ని అద్దింది.

బతికి బతికి అలిసిపోయి ఎగిరి ఎగిరి సొలిసిపోయి ఓ రోజు అకస్మాత్తుగా బారుగా జాపిన రెక్కల మీద ముఖం వాల్చి ఆలోచించడం మొదలు పెట్టింది.

ఆగితే సాగదు ఈ లోకమూ…

జాయిగా కిందకి జారుతూ నేల మీద కాలూనింది. చుట్టూ కొత్తలోకం. యంత్ర భూతముల కోరలు తోమే జీవులు, రణగొణ ధ్వనుల లోహ వాహనాలు, క్షణం ఏమారితే బతకలేని లోకాన్ని చూసి దిగులుపడింది.

కానీ అది ఎంతటి సొగసు చిలుక!!

తన ఇంద్రజాలపు పెట్టె తెరిచి ఒక తోటని తీసింది. కోయిలని బతిమాలి ఒక గున్నమావిని, పిచుకలని బామాలి పసుపు వన్నె జామచెట్లని  కూడా నాటుకుంది. కబుర్ల కోసం కాకమ్మలు, దూతల వలె తెల్ల కొంగలు బారులు తీరేవి. పళ్ళూ పూలూ తీవెలతో తోట హొయలు పోతోంది. చాలు, ఇక చాలు అనుకుందా! ఓరోజు సాయంసంధ్య వేళ ఒక బలిమి పిట్ట తోట వాకిట కూత పెట్టింది.

యుగాల ఎదురుచూపు ఆర్తరావం అది. ఇలాంటి పిలుపు ఎపుడైనా విన్నదా అసలు? గున్నమావిని కూల్చి, పసుపు వన్నె జామ మధురఫలానికి మొహం తిప్పి తోటతోటనీ ఏమార్చి సత్తువ ఉడిగిన రెక్కల్లో బలాన్ని కూర్చుకుని ఎగిరొచ్చి ఆ పిలుపు ముందు వాలింది. కాసేపే! తోట వెనక్కి లాగింది. బలిమి పిట్ట – సొగసు చిలుక సంభాషణ విన్నారా ఎపుడైనా? చిలుకకే పలుకులు నేర్పేది బలిమిపిట్ట. బలిమి పిట్టకే శక్తినిచ్చేది సొగసు చిలుక. తోట వాడిపోతోంద…బలిమి సొగసులు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వాటి లేత రెక్కల మీద ఉండుండి పిడుగులు పడతాయి. తలెత్తి కూడా చూడవవి. చెరొకచెట్టు మీదా కట్టుకున్న ప్రియమైన గూళ్ళు అపుడపుడూ ఇరుకైపోతాయి. ఆరారు రుతువుల సంధికాలంలో ఏదో ఒకక్షణం తప్పిపోతుంది. దానిని చటుక్కున పట్టుకుని గూళ్ళు వదిలి ఆకాశంలో జంట గిరికీలతో పండుగ చేసుకుంటాయవి.

ఏడాదికోమారు సాయంసంధ్య వేళ  పిట్టలు ముస్తాబు అవుతాయి. తోటలు దూరమైన దురదృష్టాన నెప్పిరాగం తీగలా సాగుతుంది. వేయి యుగాల నిరీక్షణతో పిలుపు బరువవుతుంది. ఏటికేడూ అవే ప్రశ్నలు కొత్త భయాన్ని దాల్చుతాయి.

‘నాతో ఉంటావా?’ ఆత్రుతగా బెంగగా అడుగుతుంది బలిమిపిట్ట.

‘నాతోనే ఉంటావా?’ ఆత్రుతగా దిగులుగా అడుగుతుంది సొగసు చిలుక.

*******

అక్క వెళ్ళిపోయింది

అక్క వెళ్ళిపోయింది

నలుగురిని ముగ్గురు చేస్తూ..
రెండేళ్ళ కిందటి జాజిమల్లి పాఠకులకి మా నలుగురక్కాచెల్లెళ్ళ పై నేను రాసిన కథలు గుర్తు ఉండే ఉంటాయి. ఒక ఖాళీని తడుముకునే ప్రయత్నం చేస్తుంటే అక్క వ్యక్తిత్వపు హిమవన్నగం దొరికింది మాకు. దానినే పుస్తక రూపంలో మిత్రులందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. పిడిఎఫ్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచుతున్నాను
మల్లీశ్వరి

  prayanam final

పండువెన్నెల

Cover Page _ Modified

 ”…రెండురోజుల కాలానికే ఇంతశక్తి ఉంటే తరుచుగా పిల్లలకీ రచయితలకీ మధ్య అనుబంధం ఏర్పడితే అద్భుతాలు జరిగితీరుతాయి. సాహిత్యసభలు అంటే తలపండిన పదిమంది ఒకచోట చేరి ఒకరిగురించి మరొకరు పొగుడు కోవడంగా మారిపోయిన సందర్భం ఇది. ఆ సభలు చూసినపుడల్లా రచయితల టార్గెట్ ఏంటి అన్న సందేహం ఊపేస్తూనే ఉంటుంది. సన్మానాలు,సత్కారాలు, పుస్తకావిష్కరణలు, పుస్తకసమీక్షలు, కవిత, కథాపఠనాల పేరిట పదేపదే అదే గుప్పెడు గుంపు కూడినపుడు సాహిత్యజీవుల చివరాఖరి నాటకం చూస్తున్న దిగులు కలుగుతుంది.

సమాజాన్ని సమూలంగా మార్చేస్తున్నామన్న భ్రమలలోనుంచి ముందుగా రచయితలే బైటపడాలి. ‘మేము రాసేది మాకోసమే లేదా మా గుప్పెడుమందికోసమే అది మా ఇష్టం’ అన్నవారితో పేచీ ఏమీలేదు. వారితో ఆనందంగా విభేదించి తప్పుకోవచ్చు. కానీ సాహిత్యం సమాజచలనానికి ప్రత్యక్షదోహదాన్ని ఇస్తుంది అని బలంగా నమ్మిన రచయితలు మాత్రం తమ ఎజెండా మార్చుకోవలసి ఉంది. దానికోసం అనేక ప్రయోగాలు చేయవలసి ఉంది…” ( పండువెన్నెల – ముందుమాట నుంచి ) – మల్లీశ్వరి, కత్తిపద్మ, నిశాంత్

‘బెమ్మోచ్చవం నాకు సేన నచ్చీసినాది.’

10502130_1532170283672466_8872186814400156413_n

నాను ఇలగ అనీసినానో నేదో వూరోల్లంత గొల్లువెట్టీసినారు. ‘ఓలమ్మా! ఈ మల్లమ్మకి ఏటయిపోనాది! ఒడుపెరిగిన దాయి గదా తట్టుకుని ఒడ్డున పడిపోతాది అనీసుకున్నాం…సివరికి మల్లమ్మకి కూడా దెబ్బడిపోనాది. పిచ్చి మాటలాడేస్తోంది ఏటి సేస్తుము!’  అనీసి అక్కుర్లు బుక్కుర్లై ముక్కులు సీదేసినారు. మరి కొందరు నేస్తులయితే ఇకటాలు మొదలు పెట్టీసినారు. ‘నెంబర్ 10 బస్సు ఎక్కించీ మందువా!’  అనీసి. మరి కొందరు జూదగత్తెలు పందెం విసిరినారు నా మీదకి. ‘ఇంకోపాలి దయిర్నంగా చూసి సిలకలాగా నవ్వుకుని వచ్చీసినావంటే నీకు లచ్చ కాదు పది లచ్చలు ఇస్తుము’  అనీసి.

ఇయ్యన్నీ ఇనేసి నాను జవజవలాడిపోనాను. ఈ  లోకంలోట దర్మము నశించుట గాకపోతే ఆళు సెప్పేది నాను ఇనీయాలి గానీ నాను సెప్పేది ఆళు ఇనుకోరా?! అదే అనీసినాను.

అల్లప్పటికి అందరికీ ఒంటి మీనకి తెలివి వచ్చీసి ‘ యానికే నీకు బెమ్మోచ్చవం నచ్చీసినాది ఒక్క పాయింటు సెప్పుమీ మావు  ఆలకిస్తాం.’ నిలదీసి అడిగినారు.

నానపుడు సద్దుకుని కూకుని ఇలగ సెప్పినాను.

నానూ నా సెందుమావ కలిసి బెమ్మోచ్చవానికి పోయినాము. హాలు లోపట సల్లగా సుకంగా పత్తెంగా ఉండేతలికి అయిదో నిమిషాన నాను నిద్రలోకి జారుకున్నాను. మరల్లపుడు పదో నిమిషమో పదకొండో నిమిషమో నాకు ఎరికనేదు గానీ గొల్లున నవ్వులు వినపడేతలికి ఉలిక్కిపడి లేసినాను. అందరి మొకాలట ఎలుగు నవ్వులు. ఈ  నవ్వులన్నీ  నాను  మిస్సయిపోయాను గావాల అనీసి కళ్ళు గట్టిగా తెరిచి తెరకి అతికించినాను. అల్లప్పటికి నాకు బోధపడినాది. అసలు ఇషయం తెర మీదట కాదు నా పక్కన ఉన్నది అని. ఇకటదారి మా సెందుమావ నా పక్కన కూకుని పేల్సినాడు మాటలు…ఇహన సూడండే! హాలుహాలంత నవ్వుల్తో అవ్వాయి సువ్వాయిల్నాగా ఎగిసిపడినారు. ఓలమ్మా మరి కంటి మీద కునుకు పడితే ఒట్టు.

ఒక్క చణం సెందుమావ పల్లకుంతే నేనే గాదు పెజలు బరాయించుకోనేకపోయినారు. ఏదొకటి అనుమీ, ఒక డవిలాగ్ విసురుమీ అనీసి బోల్డు ఇజ్ఞప్తులు పంపినారు.  మరిహన ఏటి సేస్తాడు నా మావ! పెజల మానపేనాలు రచ్చించటం కోసం సెందుమావ బాద్దెత బుజానేసుకుని అందరిని ఒడ్డున పడేసినాడు. నాను కూడా ఇతోదికంగా నాలుగు మాటలు మా మావకి అందించి సాయపడినాను. హాలు లోపట నుండి బైటకు వచ్చేతలికి అల్లందరూ క్యూలు కట్టి మావకి షేకు హాండులిచ్చి ‘మీరే గనక నేకపోయి ఉంటే ఈ రోజు మావు ఏటయిపోయి ఉందుము…మా పేనాలు నిలువునా రచ్చించారు’. అనీసి పండగలు పబ్బాలకి మమ్మల్ని భోజికి రమ్మని పిలుపులు సేసి మరీ ఎల్లినారు.

దయగల తల్లుల్లాలా తండ్రుల్లాలా! ఇహన ఇప్పుడు సెప్పండి నాకు బెమ్మోచ్చవం సేన నచ్చీసినాది అంటే అందులోట ఏటి తప్పున్నాది??!!

నాన్నగారూ, పుట్టినరోజు జేజేలు

ఈ రోజు పాతూరి పూర్ణచంద్రరావు అలియాస్ పూర్ణయ్యగారి కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలని గత పది రోజులుగా గట్టి నిశ్చయంతో ఉన్నాను. డెబ్భై నాలుగేళ్ళు నిండి డెబ్భై అయిదులోకి ప్రవేశిస్తున్న నా జీవనశిల్పికి నాలుగు అక్షరమాలలు అల్లుదామని ఇట్లా లాపీ ముందు కూచున్నాను. నేనంటే నేనంటూ దూసుకొస్తున్న ఆలోచనలను వరుసలో పెట్టలేక సతమతమవుతుంటే ఎందుకో చప్పున దుఃఖం ముంచుకొచ్చింది. ఏం ఆయన వయసు వెనక్కి పరిగెత్తకూడదా! ఇంత అన్యాయంగా ఏటికేడూ పరిపూర్ణతలోకి పయనించాలా! వద్దు గాక వద్దు. నేను పూర్ణయ్య గారి గారాలపట్టిగా ఉండగానే కాలం అక్కడే ఆగిపోవాలి. ఆయన వద్ద పదిలంగా ఉన్న బాల్యాన్ని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలి.

డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పక్కనే నడిచినపుడు ‘మీ అన్నయ్యా?!’ అని స్నేహితులు అడిగితే ఆరడుగుల ఆ  అందగాడిని చూసి ‘నాన్నగారూ మురళీమోహన్ మిమ్మల్ని సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు వద్దన్నారు?’ అని చిరుకోపంగా అప్పటికి నూటపదోసారైనా కొత్తగానే అడిగాను. చర్మం ముడతలు దేలి గూళ్ళు పట్టు సడలి జుత్తు పండిపోయినా ఇప్పటికీ హీరో అంటే మా నాన్నగారే! స్నిగ్ధ అంటుంది ఈ లోకంలో అందరి కన్నా మా నాన్నే గొప్ప అని. అపుడు నేనంటానూ ‘నీ మొహంలే సిద్దూ మా నాన్నగారి కన్నానా?’అని. ఎవరి నాన్న వాళ్లకి గొప్ప అని అనిపించనివ్వనంతగా ప్రేమిస్తారేంటో ఈ తండ్రులు!

ఇన్నేళ్ళ జీవితంలో నచ్చినవీ నచ్చనివీ బోల్డు ప్రేమలేఖలు అందుకున్నానా…

జాబిలిలోని చల్లదనం

జిలేబిలోని తియ్యదనం

కలిసి మా జాజి అని నాన్నగారు నా చిన్నపుడే చెప్పినంత బాగా ఇంకెవరూ చెప్పలేక పోయారు J సారీ చందూ

పల్లెటూరి రైతుకి ఉండే ఈస్థటిక్స్ తో బోల్డు వర్ణనలు చేసేవారు. చిన్నపుడు ఏం తోచకపోతే అక్కాచెల్లెళ్లు నలుగురం ఆయన చుట్టూ చేరి, నేనైతే నాన్నకూతురిని కదా మరీ హక్కుతో నాన్నగారూ నా చెవుల గురించి చెప్పండి, కళ్ళు గురించి చెప్పండి అనగానే ‘తాటికాయ ముచ్చు వద్ద చెక్కాక పైకి తేలిన తాటిముంజెలా ఉంటాయి నీ కళ్ళు’ అంటుంటే నోరావలించి వినేవాళ్ళం. ప్రేమ, గారాబాల సిరులొలికే బాల్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతేని రుణపడిఉన్నాము. అది మేము తీర్చలేనిది, మీరు ఆశించనిది.

నాన్నగారూ,

మేమిప్పటికీ మీ సందిట దాగున్న బిడ్డలం.

మీరు చిరకాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి.

మీకు పుట్టినరోజు జేజేలు  12919062_572998596184353_1685750104_nDSCN0242DSCN0241

మనసున మల్లెల మాలలూగించే మాస్టారు.

12049372_505455532938660_4853252411669319510_n

దాదాపు పాతికేళ్ళ కిందట తెలుగు యూనివర్సిటీ లో సంప్రదాయ నవ్యసాహిత్యం పాఠాలు చెప్పిన బాలాంత్రపు రజని కాంతారావు గారు,ఎంతటి వారో కూపస్థ మండూకాల వంటి మాకేమి తెలుసు ! ఓ పెద్ద వయసు ఉపాధ్యాయుడు ఆయన. మేమేమో అన్నీ మాకే తెలుసునని విర్రవీగే కుర్రపిల్లలం . క్లాసు రూములో మా అల్లరికి అంతే ఉండేది కాదు. ఆయనేమో తన్మయంగా పాడుకుంటూ పాటల మధ్య పాఠాలు చెపుతూ ఉండేవారు. ఆయన నుంచి ఏమి గ్రహించామో ఇపుడు విడదీసి చూసుకుని చెప్పడం చాలా కష్టం. నన్ను చూడగానే ప్రతి రోజూ ( నేను మల్లీశ్వరిని కదా ) మనసున మల్లెల మాలలూగెనే అని పాడుతుంటే చుట్టూ స్నేహితుల మధ్య గర్వంగా ఉండటం బాగా గుర్తుంది. మా క్లాసుకి వచ్చిన మొదటి రోజు సఫారీ సూట్ వేసుకుని, ఫేస్ పౌడర్ నీట్ గా రాసుకుని జేబు వద్ద ఎర్రగులాబీ పెట్టుకుని వచ్చారు.ఆ రోజంతా అదే మాట్లాడుకున్నాం. తర్వాత నాకు వీలైనపుడల్లా మా యూనివర్సిటీ తోటలోని ఎర్ర గులాబీ ఆయన చొక్కా జేబుపైన అలంకరణగా పెడుతుంటే ఏ రోజూ వద్దన్నది లేదు.

ఆ మధ్య మాటల్లో హేమచంద్ర గారు ఓ మాటన్నారు. పెద్దవాళ్ళ విషయంలో ఆలస్యం మంచిది కాదు అని. అవును పాతికేళ్ళ ఆలస్యం అసలు క్షమార్హమే కాదు. ఏడు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొన్న ఉక్కపోత విజయవాడ చేరి చుట్టుగుంట మీదుగా సీతారాం పురం చేరుతూ గులాబీ పూల కోసం వెతికి ,దొరకక ఉసూరుమని ఒట్టి చేతులతో రజని వద్దకు వెళ్లాను.

పాఠాలు చెప్పిన రజని దొరకలేదు.

రెండు మూడేళ్ళ పసి పిల్ల వాడు కనిపించాడు అవును.అప్పట్లాగే అలంకరణ శ్రద్ధ. రంగుల డిజైన్ పొట్టి లాల్చీ మణికట్టుకు పూసల దారం కట్టుకుని బుద్ధిగా కుర్చీలో కూచుని ఉన్నారు. ఉరుక్కుంటూ దగ్గరకి వెళ్ళానా ! నన్ను గుర్తు పట్టలేదు  😦 మనసున మల్లెల మాలలూగలేదు. చేతిలో గులాబీ పూవూ లేదు. జ్ఞాపకాల వంతెన మీద నా ఒంటరి ప్రయాణం. శతపత్ర సుందరి గురించి చెప్పి పాడమని హేమచంద్ర గారు సరోజ గారు చెపితే చెప్పినపుడుల్లా నీకెందుకు నేను పాడతానుగా అన్నట్లు తలూపుతూనే ఉన్నారు. చివరకి రెండు లైన్లు పాడగానే మింగకుండా పదిలంగా బుగ్గన దాచుకున్న జ్వరం మాత్ర అడ్డు పడి ఆగిపోయారు.
96 ఏళ్ల పసివాడికి ఇపుడు కొడుకు తండ్రిగా మారాడు. కోడలు తల్లిగా మారింది ‘ ఏదీ నాన్నా ఓ సారి నవ్వు అనగానే అచ్చపు పాల నవ్వు. నవ్వుతుంటే ఆ పసితనానికీ, దానికి ఉన్న స్వచ్ఛతకీ మనసు పరవశించి పోయింది. ఆయన మలి బాల్యానికి వాత్సల్యపు ఆజానుబాహువు హేమ చంద్ర గారు, వెన్నెలవెల్లువ ప్రసూన గారు రక్షకులు. నా అలక్ష్యం వల్ల రజని జ్ఞాపకాల్లో నేను మిగలలేదని అనిపించి బిక్కమొహం వేసినపుడు ఈ దంపుతులిద్దరూ మళ్ళీ తల్లిదండ్రులై నన్ను అక్కున చేర్చుకున్నారు. పరంపరకి భరోసానిస్తూ చేతిలో చెయ్యి వేసి హత్తుకున్నారు.

స్నిగ్ధ వాళ్ళమ్మ

12404309_530098317141048_1332212735_n
లేత తీవెల చూపులతో మనసుల్ని కట్టి పడేసే మా పాపాయిని, (సరేలెండి ఇంకేమి పాపాయి! పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ) ప్రూనింగ్ చేసిన చెట్టువలె పెంచలేదని మా బంధు మిత్ర సపరివారగణంలో చాలామందికి నా మీదా చందు మీదా కంప్లయింట్. ‘చాలా తెలివైనది…మీరు శ్రద్ధ పెట్టి ఉంటే ఐఐటి కొట్టి ఉండేది. కెరీర్ చాలా ముఖ్యం…అది మీరు పట్టించుకోరు…బ్లా బ్లా బ్లా…’ అబ్బా! ఎంత బోర్. ఇపుడెట్లా ఉందో అదే అసలు స్నిగ్ధ. ఇన్నీ కవుర్లు చెప్పి ‘తయారీ స్నిగ్ధ’ ని లోకానికి ఇవ్వడమా? దేశభక్తి కన్నా హీనమైన పాపం. ఆత్మలోకంలో దివాలా. ఏం పిల్లలు డాక్టర్లో, ఐఐటి ఇంజినీర్లో మాత్రమే కావాలా? ‘జీవించే కళ’ తెలిసి లోకానికి భారం కాని పిల్లలు ఒద్దా!
ఇదిట్లా ఉంటే…
డిసెంబర్ 21వ తేదీ రాత్రి పదకొండున్నరకి మా అమ్మ నన్ను కంటే, డిసెంబర్ 21 అర్ధరాత్రి 1.05 కి (తెల్లవారితే 22వ తేదీ) నేను స్నిగ్దని కన్నాను. ‘రెండు గంటలు నువ్వో అదో ఎడ్జస్ట్ చేసుకుని, ఏదో ఒక తేదీలో పుట్టి ఉంటే ప్రతి ఏడాదీ నాకీ డబుల్ ధమాకా తప్పి ఉండేది కదా’ అంటూ ఉంటాడు చందు. పుట్టినరోజుల సరదాలు నాకేమీ లేవు కానీ నాస్తికత్వం వల్ల పండుగలూ ఉత్సవాలూ ఖాళీ అయిన జీవితాల్లోకి వద్దన్నా వచ్చి ఆక్రమించేవి ఇలాంటివే కనుక స్నిగ్ధ అస్సలు మిస్ కాదు.
చిన్నప్పటి నుంచీ క్రితం ఏడాది వరకూ పుట్టినరోజు అంటే దానికి, జస్ట్… కలల తీరం. అట్లాంటిది ఈ ఏడాది ఏమైందో ఏమో నా చిన్నితల్లి డిసెంబర్ 22 ని కాలదన్ని 21 వ తేదీని తన చేతుల్లోకి తీసుకుంది. కూతురు నవ్వితేనే మైమరచి పోయే నాన్నని సపోర్ట్ తీసుకుని రోజంతటినీ అలంకరించింది. స్నేహితుల సాయంతో అచ్చం అమ్మానాన్నా వండినంత కాన్ఫిడెంట్ గా వంటచేసి నా స్నేహితులతో సహా అందరికీ వడ్డించింది. ట్రెజర్ హంట్ వంటి కథలు రాసే అమ్మని ట్రెజర్ హంట్ ఆడించి బహుమతులు అందించింది. యూనివర్సిటీ యూత్ ఫెస్ట్ లో తన నృత్యాన్ని నేను చూడలేక బాధ పడ్డానని గ్రహించి అదే నృత్యం మా అందరి ముందూ చేస్తుంటే, అప్పటికే ఆనందంతో సోలిపోతున్న నేను ఆ బుజ్జినెమిలి ఆటని అడ్డుకుని గట్టిగా కావిలించుకున్నాను.
‘ఈ అమ్మా కూతుళ్ళ ప్రేమని తట్టుకోలేం’ ఏడిపిస్తారు చాలా మంది. సమస్యే లేదు ఆ పిల్లతో నాది నిర్నిబంధమైన ప్రేమ.
చేతిలో ఉన్న వందనోటుని గడవాల్సిన నెలాఖరుని చూసుకుని, పది రూపాయలకు డజను జాంపళ్ళు కొని నా కడుపున పడిన పిల్లకి ఇవ్వాల్సిన ఆహారం విషయంలో లెక్కలు వేసాను, ఎల్లుండి కంటానగా ఈ రోజు వరకు లెక్కలేనట్లు బస్సుల్లోనూ స్కూటర్ మీదా ఉరుకులు పరుగులు పెట్టాను. అందరూ ఉండి, విశాలమైన ఇళ్ళు ఉండి, కులాంతర ప్రేమ వివాహపు ఒత్తిళ్ళ వల్ల నా పాప ఎవరూ లేని చోట, నేనూ నా చందు, మా అమ్మ మాత్రమే ఉన్న పరిమిత లోకంలో కళ్ళు తెరిస్తే చూస్తూ ఊరుకున్నాను.
అయితేనేం…
పుట్టకముందే మమ్మల్ని క్షమించి, కేరుమంటూ ఏడుస్తూ పుట్టి మమ్మల్ని నవ్వించిది. ఆ క్షమ ఆ దయ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది…‘మీ అమ్మ ఇంటి పట్టున ఉండదు, నీతో ఎక్కువ టైం ఉండదు’ ఇట్లా ఎవరన్నా గిల్లబోయినా, టైంపాస్ చెయ్యబోయినా నా కన్నా ముందే అడ్డుపడిపోయి గొప్ప ఆరాధనతో నన్ను కావిలించేసుకుని ‘మా అమ్మ ఇట్లా ఉంటేనే నాకిష్టం’ నవ్వుతూనే చెప్పేస్తుంది. ఇంత ఫెవికాల్ బంధం కదా! ‘మీ అమ్మా నాన్నల్లో ఎవరంటే నీకు ఎక్కువిష్టం? అని నిన్న కూడా ఎవరో అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా ‘మా నాన్నే ఇష్టం’ అంది. ‘అదృష్టవంతుడివోయ్!’ అన్నాను కాస్త కుళ్ళుకుని. ‘నువ్వూ అదీ వేరు కాదనీ దాని ఉద్దేశం, నీతో విడదీయరాని స్నిగ్దకి నేనంటే ఇష్టం. అదీ విషయం’ అంటూ కాస్త సంతోషంగా కాస్త నిష్టూరంగా తత్వం బోధపరిచాడు చందు.
మరిలాంటి చిన్నికన్నమ్మ పుట్టి ఈ రోజుకి 19ఏళ్ళు. మా చేతుల పోషణను మించి ఎదుగుతున్న ఈ మొక్క, వట వృక్షం కావాలని అమ్మానాన్నలని స్నేహితులను దాటి తన దయ క్షమలను లోకంలోకి విస్తరించాలనీ కోరుకుంటూ, చిన్నారి చిలుకా! పుట్టినరోజు శుభాకాంక్షలు.