మమ్మల్ని మారనివ్వండి

మమ్మల్ని మారనివ్వండి (పెత్తనం కథల సంపుటం నుండి)

                  కె.యన్.మల్లీశ్వరి

            ఏ మాట కామాట చెప్పుకోవాలి. మా అమ్మ నన్నూ, మా చెల్లినీ బాగా పెంచింది. మా చెల్లి సంగతేమోగానీ నన్ను బాగా పెంచడం సమాజంలో దృష్టిలో బాగా’ పెంచకపోవడం ‘గా మారడమే బాధని కలిగిస్తోంది.

          మా అమ్మ స్త్రీవాది అని చాలా మంది అంటుంటారు. కొంతమంది పుల్లవిరుపుగా పురుషద్వేషి అని కూడా అంటారు. అమ్మ ఎంతో హుందాగా రెండింటినీ సమానంగా స్వీకరించింది తప్ప, పెంపకంలో మార్పులూ చేర్పులూ చేయలేదు.

          మా ఇంట్లో నాకెన్ని హక్కులో మా చెల్లికీ అన్నే హక్కులు . మా చెల్లికి ఎన్ని బాధ్యతలొ నాకూ అన్నే బాధ్యతలు వుండటం అందరికీ విడ్డూరంగా వుండేది. ఆ భావం అలా మారుతూ మారుతూ వచ్చి అందరూ హేళన చేసే స్థాయికి చేరింది.

           ఓ సారి మా పెద్దమ్మ, పిన్నమ్మల పిల్లలు మా యింటికి వచ్చారు. అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. నాకు ఆ సినిమా బాగా నచ్చింది .కళ్ళముందు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన స్త్రీకి ఎన్ని అవమానాలూ, కష్టాలు ఎదురయ్యాయో కళ్ళకి కట్టినట్లు చూపించారు.

          కొన్ని సంఘటనలకయితే కళ్ళ నుంచి నీళ్ళు జలజలా రాలాయి. మాటిమాటికీ ఖర్చీఫ్ తో కళ్ళు తుడుచుకోవడం చూసిన మా కజిన్ సిస్టర్ ఆశ్చర్యపోయినట్లుంది.అందుకే “ఏయ్ వంశీ ! ఆడపిల్లలా అలా ఏడుస్తావేంటి ? ఆడవాళ్ళం మేమే ఏడవడం లేదు ” అని ఏడుపు తన జన్మహక్కుగా ప్రకటింపజేసింది.

          ఆ మాటలు చెవిన పడిన వాళ్ళందరూ కిసుక్కున నవ్వారు.పదిహేడేళ్ళ నావయసుకి ఆ మాటలు అవమానకరంగా తోచాయి.

          ఉక్రోషంగా ఏదో అనబోయాను. మా అమ్మ గుర్తొచ్చింది. ఎదుటి వారి మాటలని ఆమె ఎలా స్వీకరించేదో గుర్తొచ్చింది . ఆగిపోయాను. కష్టాలకీ, కన్నీళ్ళకీ చలించే పచ్చిదనం యింకా నాహృదయంలో మిగులుంది. అది చాలా సంతృప్తిని కలిగించే విషయం.

          అసలు అమ్మ చెప్పిందనే కాదు, చిన్నప్పటినుంచీ నాకో సందేహం ఉండేది. మాగాళ్ళు ఎందుకు ఏడవకూడదు? అని. ఎవరో చెప్పారు అందరి ముందూ ఏడిస్తే ఎవరూ గౌరవింఛరని.

          నాకపుడే అర్థమయింది. ఏడిస్తే  పోయే గౌరవమూ ఓ గౌరవమేనానీ ?  అందుకే నా పాటికి నేను నా హృదయం కరిగితే కన్నీరు కారుస్తూ ప్రకృతి ధర్మాన్ని అంతే సహజంగా అనుసరిస్తున్నాను.

          సినిమా నుంచి యింటికి వస్తున్న దారిలో కూడా అందరూ నా ఏడుపు గురించి కామెంట్స్ చేస్తూనే వున్నారు. విని వాళ్లు నవ్వితే నేనూనవ్వాను……….అప్పటికి ఆపారు………..

          ఇంటికి వచ్చాక అమ్మతో చెప్పి కడుపులు పట్టుకుని నవ్వి కిందా,మీదా పడ్డారు. వాళ్ళ నవ్వుల్ని చిరునవ్వుతో  పరిశీలించి “తప్పేంటి?” అంది అమ్మ.

          వాళ్ళు షాక్ తిన్నట్లు నవ్వులు ఆపారు. నాకెంతో ఆనందం వేసింది. వుత్సాహం వచ్చింది. మా అమ్మ  అడిగిన ఆ  ఒక్క ప్రశ్న …………….అది ప్రశ్న కాదు………..యితరులు నా గురించి మాట్లాడే మాటలకి సమాధానం.

          సగర్వంగా అమ్మ పక్కన నిల్చున్నాను. నాకప్పటికింకా తెలీదు. నేను మగాడిగా ఎలా ఉండాలో లోకం చేత బోధనలు పొందబోతున్నానని.

*                  *                  *                  *                  *                  *                  *              *

          ఇపుడు నా వయసు యిరవై ఏళ్ళు.డిగ్రీ ఫైనలియర్ లో వున్నాను. ఆరోజు అమ్మకి ఒంట్లో బాగాలేదు. నాన్న, చెల్లి నానమ్మ కి బాగాలేకపోతే చూడటానికి బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళారు. యింట్లో  పని ఒత్తిడి మూలంగా కాలేజీకి వెళ్ళేసరికి ఫస్ట్ పీరియడ్ బిగినయి పావుగంట దాటింది. అసలే బయోటెక్నాలజీ క్లాసు. ఆ సార్ మూడ్ ఎపుడు ఎలా వుంటుందో తెలీదు.

          ఆదరాబాదరా క్లాసు చేరుకున్నాను. గుమ్మం దగ్గర నిలబడి పర్మిషన్ అడిగిన నన్ను ఎగాదిగా చూసి ‘కమిన్’ అన్నారు.లోపలికి వచ్చి బెంచీ మీద కూర్చోబోతుండగా “ఏం లేటయ్యావ్ ?”  అడిగాడాయన.

          “ఈ రోజు యింట్లో పని ఎక్కువుంది అందుకే ” చెప్పాను.

          “ఏంటో నువ్వు యింట్లో చేసే అన్ని గొప్ప పనులు “వెటకారంగా అన్నాడాయన.

          మౌనం వహించాను ……..వదల్లేదు సార్…………”చెప్పూ……….” అంటూ రెట్టించాడు.

          “బట్టలు వుతికి, వంట చేశాను సార్ ” చెప్పాను.

క్లాసులో క్షణ కాలం నిశ్శబ్ధం .  ఆ తర్వాత ఫెటిల్లున పేలింది.

          క్లాసులో అమ్మాయిలూ, అబ్బాయిలూ బెంచీలు చరిచి, ఈలలు వేసి గోల చేశారు.

          సార్ మొహంలో కూడా నవ్వు.అదోరకం నవ్వు …హేళన….అవును…తెలుస్తూనే వుంది………..అమ్మ, నన్ను తనని చూసి నవ్వినట్లు నవ్వడం లేదు.

          “ఏరా అంట్లు కూడా తోమకపోయావా? మా పరువు తీస్తున్నావు కదరా!” అబ్బాయిలు ఆవేదన చెందారు…..

          “సబీనా…..చిటికెడు చాలు………..మీ పాత్రలు తళతళ……………” ఓ అమ్మాయి యాడ్ ని యిమిటేట్ చేసింది.

          “వంశీ ! నువ్వు చీపురు పట్టుకుని వూడుస్తుంటే చూడాలని వుంది. హలో ఫ్రెండ్స్, చూడాలని వుందా ?” గట్టిగా అడిగింది మరో అమ్మాయి.

          “చూడాలని వుంది” కోరస్ గా అరిచారందరూ.

          నేను ఆ అమ్మాయిని సూటిగా చూశాను. తను అలాగే నవ్వుతూ నిలబడింది.

          “మీ అమ్మగారు గానీ, నువ్వు గానీ ఎపుడూ యిల్లు వూడవలేదా? అడిగాను.

          “వూడ్చాం ..”

          “మరి అపుడూ లేని తప్పు నా విషయంలో ఎందుకు కనిపిస్తోంది ?” అడిగాను.

నేనలా ప్రశ్నించగలనని వూపించలేని క్లాసు క్షణకాలం నిశ్శబ్దమైంది. ఆ నీరవస్థితి నుండి ఆ అమ్మాయి గొంతు  కర్ణకఠోరంగా ఓ ప్రశ్న విసిరింది.

          నా నవనాడులూ స్తంభించాయి. నోటమాట రానట్లు కొయ్యబారి నిల్చుండిపోయాను. చూసిచూసి ఆ అమ్మాయి తన బలహీనతల ఆయువుపట్టు మీద ఎలా దెబ్బ తీస్తోందోతెలుస్తోంది.

          సార్ అప్పటికి తేరుకున్నారు. “గాళ్స్ ! స్టాప్ టాకింగ్ ………వంశీ ! సిడౌన్ ”

కరుకుగా అన్నాడాయన.

          ఆ రోజు క్లాసులు ఎలా జరిగాయో గుర్తులేదు. క్లాసులు ముగుయగానే గబాగబా యింటికి వచ్చేశాను.

          అప్పటికి అమ్మ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని భోజనం చేస్తొంది. నన్నలా పెంచినందుకు అమ్మ మీద కోపం ప్రకటిద్దామని అనుకున్నాను. కానీ ప్రేమగా చూసే ఆమె చూపులు, ముఖాన సదా ప్రశాంతత నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు.

          “చారు ఎంత బాగా పెట్టావురా నాన్నా! యిన్నాళ్ళు అలవాటైనా నేనే నీ అంతబాగా పెట్టలేను…………”  ఆప్యాయంగా అంది అమ్మ.

          ఏమ్మాట్లడలేదు నేను,

భోజనం ముగించి వచ్చిన నా పక్కన కూర్చుంది అమ్మ.

          “ఏం జరిగింగి…………? ” చేతి మీద మృదువుగా తట్టి అడిగింది. ఏదో జరిగి వుంటుందన్నది కూడాఎంత బాగా గ్రహిస్తుందో అమ్మ.

          జరిగిందంతా ఆక్రోశంతో వెలిగక్కాను.

          “ఇంతకీ ఆ అమ్మాయి ఏవందో చెప్పలేదు నువ్వు “అంది అమ్మ. తలదించుకున్నాను. నోరు పెగలడంలేదు . అతి కష్టం మీద తమాయించుకుని జీర ధ్వనిస్తున్న స్వరంతో.

          “నువ్వు మగాడివా కాదా?అంది ” అన్నాను. గలగలా నవ్విందామె. విచిత్రంగా చూశాను. ఆమె నవ్వు చూస్తుంటే క్రమంగా దిగులు మేఘాలు కరిగిపోతున్నాయి.

          “మగాడికన్నా ముందు మనిషిని అని చెప్పు  నాన్నా ! యింటి పనులు చేసుకోవడం తప్పు కాదనీ, చేయడం రాకపోవడమే తప్పని చెప్పు.డాలర్ల కోసం విదేశాలకి వెళ్ళి అక్కడ అన్ని పనులూ తామే చేసుకోవడం ఎలా తప్పు కాదో యిది అంతకన్నా వున్నతమైనదని చెప్పు” ఆమె మాటలు నాకు ఎనలేని ఉత్తేజాన్నిచ్చాయి.

          తాత్కాలికంగా నాలో ఏర్పడిన నైరాశ్యం తొలిగిపోయింది.

మర్నాడు క్లాసుకి వెళ్ళేసరికి బోర్డు మీద ఆకతాయిలు ఎవరో ” నువ్వు మగాడివి కాదా ?” అని పెద్ద అక్షరాలతో రాసారు.

          నేను లేచి బోర్డు వైపు నడిచి చాక్ పీస్ చేతిలొకి తీసుకున్నాను. అప్పటికే మూడు వంతులు నిండిన క్లాసు వూపిరిబిగబట్టి నా వంకే చూస్తోంది.

          ముందు నేను అని రాసి, దానిని కొట్టేసి మనం మనుష్యులం అని రాసి వచ్చి కూర్చున్నాను.

          రాత్రి పదిన్నర.

          డాబా మీద చల్లని గాలి వీస్తోంది .నేను ఎమ్మెస్సీ బయోటెక్ పూర్తి చేసి రీసెర్చ్ నిమిత్తం గేట్ ఎగ్జామ్ కి ప్రిపేరవుతున్నాను. నా పి.జి. క్లాస్ మేట్స్ యిద్దరు నా దగ్గరికి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వచ్చారు. డాబా మీదకి పాకిన సన్నజాజి తీగలోంచి విచ్చుకున్న జాజులు మత్తెక్కిస్తున్నాయి. వెన్నెల చిక్కనయింది.

          వాళ్ళేదో అడుగుతున్నారు. నేను తల వంఛుకుని చెపుతున్నాను. కాసేపటికి అర్థమయింది వాళ్ళు వినడం లేదని. నేను తలెత్తి చూశాను.

          వాళ్ళ దృష్టి చదువు మీద లేదు. పక్కనున్న డాబామీద వుంది. నేనూ అటువైపు చూశాను. అప్పటి వరకూ ఆత్రుతగా నా వైపే చూస్తున్న పక్కింటి ఆమె మొహం వికసించింది.     

      లైటు కాంతిలో ఆమె మొహంలోని ఆహ్వానం స్పష్టంగా కనిపిస్తోంది. మనసంతా బాధగా మారిపోయింది ఇరవి ఏడేళ్ళ యవ్వనంతో,వుద్రేకంతో మిడిసిపడుతోందామె.నా క్లాస్ మేట్స్ యిద్దరూ కళ్ళప్పగించి ఆమె వంక ఆబగా చూస్తు న్నారు. కానీ ఆమె చూపు వారి మీద లేదు.

          “ఓకే మనం నా రూంకి  వెళ్ళి చదువుదాం …………..” చకచకా బుక్స్ సర్దుతుంటే వాళ్ళు నా వంక ఆశ్చర్యంగా చూశారు.

          “రేయ్ వంశీ !   ఎంత మంచి ఛాన్సురా ! మిస్ కాకు ” ఒకతను అన్నాడు.మనసులోంచి కలుగుతున్న జుగుప్సని అణిచిపెట్టి………………

          “ప్లీజ్ అలా మాట్లాడోద్దు “స్పష్టంగా చెప్పాను.

          “ఏంట్రా ? అంత బాధ పడుతున్నావ్ ? మనమేమన్నా ట్రై చేసామా? ఆమేగా లైన్లోకొచ్చింది…………” అన్నాడు యింకొకతను.

          ఆమె వంక చూసాను. నన్ను చూడగానే ఆమెలో ఏదో అనురాగం కట్టలు తెంచుకోవడం కనిపిస్తోంది. వూహూ…ఆమె మీద వాంఛ ఏమీ కలగడం లేదు.

          “పదండి …..” ముందుకి నడవబోయాను. వాళ్ళు కదలలేదు.

          “వంశీ ! పెళ్ళి చేసుకుని పెళ్ళాన్ని అనుభవించడం కాదురా మగతనమంటే……యిలాంటి వాళ్ళ దగ్గరే  మన మగతనం నిరూపించుకోవాలి ” మగతనానినికి భాష్యం చెపుతున్న అతన్ని చూడగానే అసహ్యం కలిగింది.

          ఆవేశం తారాస్థాయికి చేరింది.

          “మగతనమంటే అసహాయ స్థితిలో వున్న వాళ్ళని లొంగదీసుకోవడమా? నీకు ఆమె పిలుపులో ఆమె శరీరం కనిపిస్తోంది. నాకు ఆమె మనసు కనిపిస్తోంది.తాగి తందనాలాడుతూ అర్థరాత్రిళ్ళు యింటికొచ్చే ఆమె భర్త           నిరాదరణ కనిపిస్తోంది. ప్రేమకోసం, అనురాగం కోసం మొహం వాచిన ఆమె జీవితం కనిపిస్తోంది.   చిన్నపుడు పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చెయ్యందించి సాయం చెయ్యమా? ఆమే అంతే. చిన్నపిల్ల లాంటిదే! భర్త దగ్గర పొందలేని ప్రేమని యితరుల దగ్గర పొందాలనుకుంటుంది. అంతే తప్ప అది శరీరాల వ్యామోహం కాదు. ఆమెని అనుభవించడం మూలంగా మన మగతనపు కీర్తి ఏ చరిత్ర పుటలకీ ఎక్కదు.

          ఇలాగనీ ఈ సమస్యని యిలా వదిలేయను.నేనూ, అమ్మా ఆమెతో మాట్లాడుతాం. తన జీవితాన్ని దిద్దుకోగల ధైర్యాన్ని ఆమెకి యిస్తాం”చెప్పాను. వాళ్ళిద్దరూ నిరుత్తరులై విన్నారు.

*                  *                  *                  *                  *                  *                  *                *

          నా రీసెర్చ్ ముగిసి అతి పెద్ద సంస్థలొ సైంటిస్ట్ గా జాబ్ దొరికింది. చిన్న వయసులోనే  అభివృద్ధిలొకి  వచ్చానని అందరూ అభినందించే వారు . కానీ నాకు ఎపుడూ అనిపించేది. ద్వంద్వ విలువలకి దూరంగా వుండటం, జీవితం పట్లా, మనుషులపట్లా అవగాహన కలిగివుండటం మూలంగానే ప్రస్తుత జీవితాన్ని గడపగలుగుతున్నానని.

          కానీ అమ్మ అంటూ వుంటుంది. యిది యిక్కడితో అయిపోలేదు. ఒక సిద్ధాంతాన్ని, కొత్త విలువల్ని నమ్మి జీవితం సాగించాలంటే అది నిరంతర పోరాటాం అని.

          నిజమే ! ….యిప్పటికీ చాలా మంది చిన్నప్పటి నుంచీ నన్ను ఎరుగున్న వాళ్ళు కూడా నన్ను ఏడిపించటానికి ఆడంగి వెధవ అని తిడుతుంటారు .ఆడ శబ్దం తిట్టుగా మారినందుకే బాధ కలుగుతుంది. నన్ను కొందరు స్త్రీ పక్షపాతి అన్న బిరుదుతో పిలిచేవారు. నిజానికి అదేం లేదు. నాకు ఆడా, మగా అన్న తేడా లేదు.

          ఇక ఇపుడు తరచుగా ఆలోచనలు నా కాబోయె జీవిత సహచరిణి మీదకి వెళ్తునాయి, ప్రేమించ తగ్గ అమ్మాయి నాకు తారసపడలేదు.

          ఓ రోజు నాన్న ఫ్రెండ్ కూతూరికి అపెండిసైటీస్  వచ్చి హాస్పిటల్ లో జాయినయింది . ఆపరేషన్ అయిన నాలుగు రోజులకి నాన్నకి తెలిసి, చూడటానికి వెళుతూ నన్నూ రమ్మన్నారు. తను నాకు తెలుసు. యిది వరకు రెండు మూడు సార్లు కలిశారు.

          నన్ను చూడగానే అ  అమ్మాయి కళ్ళు తళుక్కుమనడం నాదృష్టిని దాటి పోలేదు.

          నాన్న కాసేపు మాట్లాడి ఏ వుద్దేశంతోనో, నన్ను ఈ అరగంట తనతో మట్లాడి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

          “చెప్పండి విశేషాలు ?” వుత్సాహంగా అంది తను.

          చిరునవ్వు నవ్వాను. ఆ అమ్మాయి మైమర్చిచూడటం ఒకింత ఇబ్బందిని కలిగించింది.

          “మంచి జాబ్ లో సెటిలయ్యారు , పెళ్ళెప్పుడు?  ” అడిగింది.

          “నాకు నచ్చిన అమ్మాయి దొరికాక ……………” చెప్పాను.

తన కాసేపు మొహమాటపడి “నా గురించి ఎపుడయినా ఆలోచించారా?అంది.

          తన వుద్దేశం అర్థమయింది.

          “మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ?” ఓపెన్ గా అడిగాను. అప్పటికి ధైర్యం వచ్చినట్లుంది “మనిద్దరి యీడు జోడూ బావుంటుంది “అంది.

          కొంచెం నవ్వొచ్చింది.మనం ఒకరి అభిప్రాయం మరొకరు తెలుసుకోనేలేదు.అపుడే యీడూ జోడూలోకి వచ్చారా ? ” అన్నాను.

          “ఇపుడు తెలుసుకుందాం ” వుత్సాహంగా అంది.

          “సరే అయితే ముందు నేనో ప్రశ్న అడుగుతాను.ముందుగా మీ జీవిత భద్రత గురించి ఏం ప్లాన్ చేసుకున్నారు ?” అడిగాను.

          “ప్రత్యేకంగా భద్రత ఏముంది? భర్త ఆదరణే కదా భద్రతనిచ్చేది ……..” అంది.

          పెదవి విరిచాను.

          “నేనేమన్నా తప్పుగా అన్నానా ?” విస్మయంగా అంది.

          “భర్త ఆదరణ కరువైతే “అన్నాను.

          “మీమీద నమ్మకం వుంది “అంది.

          “ప్చ్….. అది చాలదు …….అసలు అది కాదు విషయం…….మీ ఆర్థికావసరాలు తీర్చుకునే వుద్యోగం…………బిజినెస్ ఏదో వుండాలిగా.”

          “నాకు యింట్లో వుండి భర్తా , పిల్లలని చూసుకోవడం యిష్టం “అంది తను.

          “నేను వుద్యోగం చేస్తున్నా, ఎన్ని పనులున్నా యింటి పనులు నేనే చేసుకుంటూ వుంటాను….”

          ఆమె మొహం వికసించింది.

          “అలాగా! అయితే మరీ అదృష్టవంతురాలిని నేను ” అంది.

          “మరి మీరు యింట్లో వుండి ఏం చేస్తారు ?'” అని నేననగానే తెల్ల మొహం వేసింది . నేను కొనసాగించాను.

          వుద్యోగం చేసి, నా యిష్టప్రకారం యింటి పనులు చేసుకుని మిమ్మల్ని పోషించి , మనపిల్లల్ని పోషించి, నేను అన్ని బాధ్యతలు నిర్వహిస్తుంటే మరి మీరేం చేస్తారు?” సూటిగా అడిగాను . ఆమె మొహం నల్లబడింది

          “భార్యాబిడ్డల్ని పోషించడం భర్త బాధ్యత. దానికి కూడా లెక్కలు కడుతున్నారా ? యిది మగాడి పౌరుషానికి సంబంధించిన విషయం .ఆడదాని సంపాదనని ఆశించేవాడు మగాడే కాదు ” అవేశంగా అందామే.

          మళ్లీ తగిలింది దెబ్బ , నాకు నేనే కన్సోల్ చేసుకున్నాను. యిప్పటికిప్పుడు యీ అమ్మాయిని చైతన్య పరచడం సాధ్యమయ్యే విషయం కాదు.

          “భార్య భర్తల మధ్య డబ్బుకి అతీతమయిన బంధం వుంటుంది . కానీ మీరు” ఆరోపణగా అందామె.

          “ఈ సృష్టిలొ అలాంటిది నేనింతవరకూ చూడలేదు” అన్నాను.

          ” మీరింత డబ్బు మనుషులనుకోలేదు ” తట్టుకోలేనట్లుంది. అనేసింది.

          “మనకి ఒంట్లో ఓపిక వునంతవరకూ కష్టపడాల్సిందే. యిందులొ ఆడామగా తేడా లేదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి కుటుంబ బాధ్యతలని సరిసమానంగా మోస్తూ మీ హక్కుల్ని మీరు అనుభవించడం మీద అవగాహన లేదు మీకు ……..మేం……..మగాళ్ళం…….మారతామని అంటున్నాం…………మమ్మల్నీ మారనివ్వండి. మాతో సహకరించండి…. మేం స్వేచ్ఛగా ఏడవడానికీ , సున్నితంగా ఆలోచించండానికీ , అన్ని పనూలూ చేసుకోడానికీ అడ్డు పడకండి” నా ఆవేదనో, ఆక్రోశమో ఆమెని ఆలోచనలో పడేసింది.

          కాసేపు యిద్దరం మౌనంగా గడిపాం.

          “నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని చెప్పి వెనుతిరగుతుంటే ఆమె విస్మయంగా చూసిండి . నేను అంత తొందరగా నా భావావేశాన్ని అణుచుకున్నందుకు కాబోలు.

          నేను మారానని నాకు అనిపించింది. అమ్మ స్వాంతన పొందనవసరం లేకుండానే ఓ విమర్శని తేలిగ్గా ఎదుర్కొన్నాను కాబట్టి…..!

4 వ్యాఖ్యలు

4 thoughts on “మమ్మల్ని మారనివ్వండి

    • మల్లిక్ గారూ,
      ఈ కధ లో అమ్మ స్వభావాన్ని చక్కగా విశ్లేషించారు.కానీ ‘ఆనంద్ వాళ్ళ అమ్మ’ పోస్ట్ లో
      మీ వాక్యాలే అమ్మ అయి ఓదార్చిన తీరు చాలా ఆర్ద్రం గా ఉంది.నిజం…అగ్రిమెంట్ గుర్తుండే..
      మీరలా…నేనిలా…

వ్యాఖ్యానించండి