మనలో మనం’ రాయలసీమ సదస్సు

‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు

ప్రాంతాల వారీగా, అస్తిత్వాల వారీగా స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేసుకోవడంలోబాగంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక జూన్ 27, 28 తేదీలలో రాయలసీమ సాహిత్య సదస్సును నిర్వహించింది. విశాఖ పట్నం, వరంగల్ సదస్సుల అనంతరం మరింత స్పష్టమయిన అవగాహనతో మనలో మనం ముందడుగు వేసింది. విశాఖ పట్నం సభ రచయిత్రులలోని సామూహిక కృషి తత్వాన్ని నిరూపించగా ,వరంగల్ సభ విధ్యార్దినులు, పరిశోధకులలోని సాహిత్యాభిలాషను,సాహిత్య సృజనను మెరుగు పరచుకోవడంలో వారికి గల తపననూ వెలికి తీసింది.ఇక రాయలసీమ సదస్సు, రాయలసీమలో అజ్ఞాతంగా ఉన్న అనేక మంది రచయిత్రులను వేదిక పైకి తెచ్చింది.

ఈ సదస్సు ప్రారంభ సమావేశం వి.ప్రతిమ తొలి పలుకులతో మొదలయ్యింది .పి.సంజీవమ్మ అధ్యక్షత వహించగా, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకురాలు రమాదేవి సదస్సు లక్ష్యాలను వివరించారు. అనంతపురం కృష్ణ దేవరాయ యూనివర్సిటి వైస్ చాన్సిలర్ పి.కుసుమ కుమారి కీలకోపాన్యాసం చేస్తూ రచయిత్రులు తమ భిన్న అస్తిత్వాలను కాపాడుకుంటూనే సంఘటితం కావటంలోని బలాన్ని గుర్తించాలన్నారు. తెలుగు సాహిత్యంలో కూడా “గైనో క్రిటిసిజం” (ఏ అంశాన్నైనా స్త్రీ దృష్టి లో చూడటం)  అభివృద్ది చెందాలన్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమీషన్ పునరుద్దరణకు కృషి చేస్తానని అంతేగాక కమిషన్ సభ్యుల్లో రచయిత్రులకు ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. ఈ సందర్భంగా మనలో మనం వేదిక లక్ష్యాలను కె.సుభాషిణి వివరించారు.

తొలి రోజు ముస్లిం స్త్రీల సాహిత్యం ,రాయల సీమ స్త్రీల సాహిత్యం పై పత్ర సమర్పణలు, చర్చలు జరిగాయి.

ముస్లిం స్త్రీల సాహిత్యానికి సంబందించిన సమావేశానికి కాత్యాయని విద్మహే అధ్యక్షత వహించారు. ముస్లిం స్త్రీల కవిత్వాన్ని ఖలీదా పర్విన్ సమీక్షించగా, ముస్లిం స్త్రీల కథా సాహిత్యం పై పి.షెహనాజ్ ప్రసంగించారు. ముస్లిం స్త్రీ గా రాయడంలోని సాధక బాధకాల పై ముంతాజ్ భేగం మాట్లాడారు .షాజహానా కవిత్వం పై కందాళ శోభారాణి పత్ర సమర్పణ చేశారు.

ఈ సమావేశాన్ని కాత్యాయనీ విద్మహే ముగిస్తూ “రాయలసీమలో ముస్లిం జనాభా అధికంగా వున్న కారణం చేత రాయల సీమ స్త్రీల సాహిత్యంతో పాటు ముస్లిం స్త్రీల సాహిత్యాన్ని ఈ సదస్సు లో అధ్యయనం చెయ్యాలని నిర్ణయించుకున్నాం .ముగ్గురు ముస్లిం రచయిత్రులను మొదటి సారి కలుసు కోవటం ఒక విమర్శకురాలిగా ఆనందం కలిగించింది. ఇక నుంచి మనం ప్రాంతీయ చరిత్రల సాయంతో మహా చరిత్రని నిర్మించుకోవాలి.” అన్నారు.

తొలి రోజు రెండవ సమావేశం రాయల సీమ స్త్రీల సాహిత్యంపై జరిగింది. రాయలసీమ స్త్రీల కథా సాహిత్యంపై  డా,, కె.శ్రీదేవి .ఆర్.వసుందరాదేవి  కథలపై పుష్పాంజలి మాట్లాడారు. కె.సుభాషిణి అధ్యక్ష్యత వహించారు. రాయలసీమ స్త్రీల నవలా సాహిత్యం పై పి. సంజీవమ్మ, కవిత్వంపై శశికళ. వ్యాసం పై పి.వరలక్ష్మి ప్రసంగిచారు.

రెండవరోజు తొలి సమావేశం “స్త్రీ వాద సాహిత్యం వర్తమాన అవసరాలు” అన్న అంశం మీద చర్చతో ప్రారంభమయింది. రచయిత్రులు ఎంతో బాధ్యతతో ఈ  చర్చలో పాల్గొన్నారు.

కె.సుభాషిణి: స్త్రీ వాదం ఇపుడు ఉధృతంగా ఎందుకు రావడం లేదు? మన వర్తమాన సాహిత్యావసరాలను గుర్తించలేక వివిధ మార్గాల్లోకి చీలిపోయి ప్రయాణిస్తున్నామా? ఈ చారిత్రక దశలో రచయిత్రులుగా మనం ఎలాంటి సాహిత్యాన్ని సృష్టించుకోవాలి?

దోర్నాదుల సుబ్బమ్మ: స్త్రీల అభ్యుదయాన్ని కోరుకుంటున్నాం కనుక ఈ మార్పుని తెచ్చే సాహిత్యం రావాలి. “మనలొ మనం అన్న పేరు అర్ధవంతంగా వుంది. రావాలసిన కొత్త మార్పులకు సూచనగా వుంది.

పి.సంజీవమ్మ: పనిగట్టుకుని స్త్రీ వాదం అని రాయాల్సిన అవసరం లేదు. సామాజిక చైతన్యంలో భాగంగా, అందులో ఇమిడి వున్న సమస్యగా స్త్రీవాదాన్ని గుర్తించి ఆ దిశగా రచనలు రావాలి.

పసుపులేటి పద్మావతమ్మ: ఆచరణ సాధ్యమయిన స్త్రీ వాద రచనలు రావాలి.

అనిశెట్టి రజిత: మనం స్త్రీవాద దృష్టితోనే చూడాలి. కానీ కొత్తతరం వేలెత్తి చూపుతున్న సమస్యల కోణంలో భవిష్యత్ రచనలను నిర్మించుకోవాలి.

హేమలత: మైనార్టీ స్త్రీల సాహిత్యం అన్నప్పుడు క్రైస్తవ స్త్రీల సాహిత్యంగా కూడా గుర్తించి ఆ సమస్యల్ని అధ్యయనం చేసి సాహిత్యాన్ని సృష్టించాలి.

కందాళ శోభారాణి: ఈ మధ్య మహిళా సర్పంచుల ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు ఇంకా మీ ఆడవాళ్లకి ఏంకావాలి? అంటూ మగవాళ్లు ప్రశ్నించారు. ఇలాంటి అడ్డంకులు పోయి సామాజిక చైతన్యంతో కూడా రచనలు రావాలి.

ప్రసాదినీ దేవి: జండర్ స్పృహ లేకుండా ఇపుడెవరూ సాహిత్యం సృష్టించలేరు. ఇది కంటిన్యూ కావాలి.

కె.శ్రీదేవి: ఇపుడు వస్తున్న వాదాలను, వేదనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏ అంశం మీద రచన చేసినా దానిని రచయిత్రులుగా మనం ఏ అంశాన్ని ఎంచుకున్నా స్త్రీల మీద చైతన్య ప్రభావాన్ని చూపేదిగ వుండాలి.

డా|| కె.వి. రామలక్ష్మి: కాలేజీ అమ్మాయిల జీవితాలు చాలా సమస్యలతొ నిండి వుంటున్నాయి. వారు మన కొత్త తరాన్ని నిర్మించవలసిన వాళ్ళు,  కాబట్టి వారి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్దతో రచనలు రావాలి.

పి.విజయలక్ష్మి: రాసేవాళ్లకి విస్తృతమయిన జీవితానుభవం వుంటేనే రాయాలన్న కాంక్ష బయటికి వస్తుంది. ఊహకి, నిజమైన ఆకాంక్షకి తేడావుంది.సిద్ధాంతం కోసం కాకుండా స్త్రీలు జీవితానుభవాల్లోంచి రాయాలి.

జయ: స్త్రీ అంటేనే సమస్యల పుట్ట. స్త్రీలు అంతర్ముఖంగా కూడా సమస్యలు పరిష్కరించుకోవాలి. మహాశ్వేతా దేవి లాల్ గఢ్ మీద రచయిత్రిగా స్పందించడం చూశాక, రాయడమే కాదు ఆచరించే రచనలు చేయాలి. అన్పిస్తోంది.

అరుణ: స్త్రీలుగా రాయడం అవసరమే. కేవలం దానికే లిమిట్ అవ్వకుండా అన్ని సమస్యల మీదా రాయాలి.

టి.నళిని: మనం బానిసలకు బానిసలం కాబట్టి స్త్రీ వాదాన్ని మాత్రమే ముందుకు తీసుకుపోకుండా సామాజిక సమస్యలగురించి కూడా రాయాలి.

పి.వరలక్ష్మి: స్త్రీవాదం అనే కాదు. సాహిత్యంలోనే స్తబ్దత వచ్చింది. వూహించని విధంగా సమాజంలో మార్పులు జరుగుతున్నాయి. మార్పుని అర్ధం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నాం. లాల్ గఢ్ లో 50 %  స్త్రీలు వున్నారు. సమస్యని అర్ధం చేసుకుని రచనలు చేయాలి.

శశికళ: ప్రతిభావంతమయిన రచనలు రావాలంటే రెట్టింపు కష్టం పడాలి. ఊహాత్మకమయిన నిర్మాణం వేసుకుని ప్రతి అడుగు ముందుకు వేస్తే వాయిస్ ముందుగా పోతుంది. ఉమ్మడి పని చేయడంలోని ప్రయోజనాలను తెలిపే సాహిత్యం రావాలి.

పి.రాజ్యలక్ష్మి: స్త్రీగా సమస్యల్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం రాయాలన్నది ఈ వేదిక ద్వారా తెలుసుకున్నాను. వివిధ సంఘాలలొ పని చేయడం వల్ల సమస్యలు తెలుస్తున్నాయి. రచయిత్రులు సమాజంలో ప్రత్యక్ష సంబంధంలో ఉంటూ రచనలు చేయాలి.

పడాల సమతారోష్ని: ఎవరి అనుభవాల్నుంచి వాళ్ళు రాయడం ఇప్పటి వరకూ జరిగింది. కానీ అనుభూతుల విలువ కూడా గొప్పది. దళిత, బి.సి. క్రైస్తవ, ముస్లిం, ఆదివాసీ, స్త్రీల పట్ల సహానుభూతితొ రచనలు చేయాలి.

శివలక్ష్మి: సమాజంలో పితృస్వామ్యం ఇప్పటికీ బలంగా వుంది. దానిని వ్యతిరేకిస్తూ శాస్త్రీయ దృక్పథంతో రచనలు రావాలి.

ఖలీదాపర్విన్: మతపరంగా, కులపరంగా హక్కుల గురించిన ఆలోచన రావాలి. ముస్లిం స్త్రీ సమాజానికి సంబంధించి చర్చించుకోవలసిన అంశాలు ఎన్నో వున్నాయి. ఉమ్మడి వేదికల్లో మనగొంతుని బలంగా విన్పించడానికి షాజహానా, మిగతా ముస్లిం రచయిత్రులని చర్చలకి ఆహ్వానిస్తున్నాను. అపుడే ముస్లిం స్త్రీ సమాజానికి అవసరమయిన రచనలను సృష్టించుకోవచ్చు.

ముంతాజ్ బేగం: స్త్రీలకు అన్ని రంగాల్లో స్వేచ్ఛ, భద్రత కల్పించే వాతావరణం వుండాలి. వాటిని రచనల్లో చూపితే ఒక ఆశావహ దృక్పధం  సమాజంలో ఏర్పడుతుంది. ఆ దిశగా సాహితం  రావాలి.

పుట్ల హేమలత: స్త్రీ వాదం అగ్రవర్ణాలకే అనుకూలం అనేది అపోహ. దళిత, బి.సి. మైనార్టీ, ఆదివాసీ స్త్రీల సాహిత్యం చేరికతో స్త్రీవాదం పూర్ణమయింది. ఈ పరిపూర్ణత నుండి స్త్రీలంతా వివక్షల్ని ప్రశ్నించేలా రచనలు చేయాలి.

జాజుల గౌరి: దళిత సమస్య అంటే రెండు కులాల సమస్య కాదు. యాభైమూడు ఉపకులాల సమస్యకూడా. నేను కేవలం స్త్రీవాదిని కాదు. బ్రతుకు కోసం, మెతుకుకోసం, విముక్తికోసం రచనలు చేయాల్సిన పరిస్థితి మాది.

మల్లీశ్వరి: స్త్రీవాదం ఆగిపోయినట్లు అపోహ కలగడానికి కారణం విస్తరణకి సంబందించి ఆచరణలో ఉన్న అడ్డంకులు. స్త్రీ వాదాన్ని వ్యక్తి వాదపుకోణంలో కాకుండా బలమయిన సామాజిక, రాజకీయ ఉద్యమంగా నిర్మించే సాహిత్యం రావాలి.

రత్నమాల:  స్త్రీ వాద సాహిత్యం విస్తరించాలి.అనుభవమే కాదు, పరిశీలన కూడా కావాలి. రచయిత్రులకి ఆబ్జెక్టివిటీ ముఖ్యం. సహానుభూతి వుండాలి. కానీ ఆదర్శీకరించకూడదు. ఎవరి అవసరాల కోసం వారు మాత్రమే కాక ఉమ్మడి పోరాటాలు అవసరం.

వి.ప్రతిమ: స్త్రీ వాదం ఆగిపోలేదనడానికి నిదర్శనం మనలో మనం వేదిక. సామాజిక స్థాయి నుంచి రాయడం, స్త్రీల రాజకీయ జీవితాలను, లైంగిక జీవితాలను అక్షర బద్ధం చేయడం రచయిత్రులుగా ఇపుడు మన కర్తవ్యం.

కాత్యాయనీ విద్మహే: అనుభూతులను రాయాలంటే దృక్పధం ఉండాలి. మనకి ఒక దిశ నివ్వడానికి సైద్ధాంతిక అవగాహన ముఖ్యం. ఇక శిల్పపరంగా కూడా ఎదగాలి. పి.సత్యవతి ఇల్లలకగానే కథని ఎన్నో సమావేశాల్లో చెప్పాను. జానపద బాణీలో సాగే మౌఖిక తరహా కథ. రత్నమాల చెప్పినట్లు అనుభవం, పరిశీలన, మమేకతతో కూడిన రచనలు రావాలి.

చర్చ ముగిసిన తర్వాత రచయిత్రులు “మనలొ మనం” వేదిక భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. ఈ చర్చలో కాత్యాయనీ విద్మహే ముఖ్యమయిన ప్రతిపాదన చేశారు. స్త్రీల సాహిత్యచరిత్రని నిర్మించడమంటే ముందుగా డాక్యుమెంటేషన్ అవసరం ఉంది. అందుకే ఇక ప్రతి సం|| జనవరి నుంచి డిసెంబరు వరకు అన్ని ప్రక్రియల స్త్రీ సాహిత్యాన్ని ఎవరికి వారు స్పందించి “మనలో మనం” వేదికకు పంపాలి. ఆయారచనలను ప్రక్రియా పరంగా విభజించి స్థూలంగా ఆ సంవత్సరంలో వచ్చిన సాహిత్యం పై విమర్శకులతో  అద్యయన వ్యాసాలు రాయించి పుస్తక రూపంలో భద్ర పరచాలి. ఈ నిర్వహణ బాధ్యతను వేదిక కాత్యాయనీ విద్మహేకు అప్పగించింది. సహ నిర్వాహకులుగా కె. రామలక్ష్మి, పి. రాజ్యలక్ష్మి ఆర్. శశికళ, అరుణ ఎ.సీతారత్నం పేర్లను వేదిక ప్రతిపాదించింది.

అదనపు అణచివేతకు గురయ్యే వర్గాలను గుర్తించడంలో భాగంగా “మనలో మనం” కమిటీలోకి ముస్లిం మైనార్టీకి సంబంధించి రెండవ సభ్యురాలిగా ఖలీదా పర్విన్ ను రచయిత్రుల సభ ఎంపిక చేసింది. అదే విధంగా క్రైస్తవ మైనార్టీ అస్తిత్వానికి  ప్రతినిధిగా హేమలలితను సభ ఎంపిక చేసింది.

“మనలో మనం” తదుపరి ప్రాంతీయ సదస్సు కోస్తాంధ్రలో నిర్వహించాలనీ సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్య జరగాలనీ వేదిక నిర్ణయించింది. కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం, క్రైస్తవ, బి.సి స్త్రీల సాహిత్యంపై అధ్యయనం చేసి స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేయడానికి తన వంతు కృషి జరగాలని  వేదిక భావించింది. కోస్తాంధ్ర సదస్సుకు సమన్వయకర్తలుగా పుట్ల హేమలత, సమతారోష్ని, పి.రజ్యలక్ష్మి హేమలలిత, వ్యవహరిస్తారు.

నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల స్త్రీలపై జరుగుతున్న భౌతిక దాడులను గురించి సదస్సులో చర్చ జరిగింది. అణగారిన వర్గాల  స్త్రీలపై జరిగేదాడులు మిగతా స్త్రీలపై జరిగే దాడుల స్వభావంలో వుండే తేడాలను గుర్తించి సభ విడివిడిగా రెండు తీర్మానాలను చేసింది.

  1. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, నేపథ్యం నుంచి దళిత, బి.సి. మైనార్టీ, ఆదివాసీ స్త్రీలపై కొనసాగుతున్న అమానుష దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో స్పందించి సత్వరమే చర్యలు చేపట్టాలి.
  2. ఇటీవల  కాలంలో రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్న భౌతిక దాడులు, యాసిడ్ దాడుల పట్ల “మనలో మనం” రచయిత్రులు ఉమ్మడి వేదిక తీవ్రంగా ఆందోళన చెందుతున్నది సమాజాభివృద్ధికి ఇది సరయిన సూచనే కాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.

వేదిక చేస్తున్న డిమాండ్లు:

  1. దాడి జరగడానికి ముందు నేరం జరిగే పరిస్థితుల్ని గుర్తించి తత్సంబంధిత ఫిర్యాదులకు ప్రతిస్పందించాలి.
  2. స్త్రీలపై భౌతిక దాడులను ప్రేరేపించే సాంస్కృతిక విచ్చలవిడితనాన్ని అదుపు చేయడంతో పాటు సమస్యకు మూలమయిన అన్ని కారణాలను గుర్తించి అధ్యయనం చేయాలి.
  3. భౌతిక దాడులకు పాల్పడిన నిందుతుల్ని ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేయడం సమస్యకు పరిష్కారం కాదని గుర్తించాలి.

రాయలసీమ సదస్సులో పాల్గొన్న రచయిత్రులు:
జాజుల గౌరి, మల్లీశ్వరి, పుట్ల హేమలత, అనిశెట్టి రజిత, కొండవీటి సత్యవతి, కాత్యాయనీ విద్మహే, రత్నమాల , హేమలత, ఖలీదా పర్విన్, పి. కుసుమకుమారి పి. సంజీవమ్మ, దోర్నాదుల సుబ్బమ్మ, పుష్పాంజలి. ప్రసాదినీదేవి., ఆర్. శశికళ, పి.వరలక్ష్మి, పి. షెహనాజ్, ముంతాజ్ బేగం, పడాల సమతారోష్ని, పి. శివలక్ష్మి. డా|| కె.శ్రీదేవి, దాసరి శిరీష, పి.జయ, పి.రాజ్యలక్ష్మి, కందాళ శోభారాణి, ఎన్. శిరీష, ఆయేషా, పి. పద్మావతమ్మ, మేరీ విజేత, డా|| పి. విజయలక్ష్మి, కె. వనజాక్షి,  డా|| కె.వి. రామలక్ష్మి, డా|| టి. నళిని, యన్. రామసుబ్బమ్మ, మాధవి, కృపాలత, రాచపాలెం లక్ష్మి, గంగారత్నం, వి.సుభాషిణి, అరుణ, డా|| జి.విజయభారతి. డా|| బి.డిమార్గరేట్, నీలిమ, ఎస్. నారాయణమ్మ, పి.కొండమ్మ, టి. నాగప్రసూన, టి. విజయదుర్గ, పి.సుమలత, కె.మహేశ్వరి, మరికొందరు విద్యార్ధినులు పాల్గొన్నారు.
సదస్సు సమన్వయ కర్తలు: వి.ప్రతిమ, కె.సుభాషిణి

వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి