నవమి చిలుక

Image result for parrot in tree

ఇపుడొక చిలుక కథ చెపుతాను. మరీ పంచ వన్నెల రామచిలుక కాదు కానీ రెండే వర్ణాల సొగసు చిలుక కథ చెప్తాను. పుట్టింది మొదలు ఆకాశమంతా ఎగిరి దిక్కులు కలగలిసిపోయిన శూన్యాన్ని తన గానంతో పటాపంచలు చేసింది. తన చిన్నిరెక్కలు వీచే గాలికి పుట్టిన ‘ఝంజ’ని అదాటున లోకం మీదికి విసిరి ఫక్కున నవ్వింది. ఎర్రని ముక్కు వంపు చివర్లతో ఫలాదులకి మాధుర్యాన్ని అద్దింది.

బతికి బతికి అలిసిపోయి ఎగిరి ఎగిరి సొలిసిపోయి ఓ రోజు అకస్మాత్తుగా బారుగా జాపిన రెక్కల మీద ముఖం వాల్చి ఆలోచించడం మొదలు పెట్టింది.

ఆగితే సాగదు ఈ లోకమూ…

జాయిగా కిందకి జారుతూ నేల మీద కాలూనింది. చుట్టూ కొత్తలోకం. యంత్ర భూతముల కోరలు తోమే జీవులు, రణగొణ ధ్వనుల లోహ వాహనాలు, క్షణం ఏమారితే బతకలేని లోకాన్ని చూసి దిగులుపడింది.

కానీ అది ఎంతటి సొగసు చిలుక!!

తన ఇంద్రజాలపు పెట్టె తెరిచి ఒక తోటని తీసింది. కోయిలని బతిమాలి ఒక గున్నమావిని, పిచుకలని బామాలి పసుపు వన్నె జామచెట్లని  కూడా నాటుకుంది. కబుర్ల కోసం కాకమ్మలు, దూతల వలె తెల్ల కొంగలు బారులు తీరేవి. పళ్ళూ పూలూ తీవెలతో తోట హొయలు పోతోంది. చాలు, ఇక చాలు అనుకుందా! ఓరోజు సాయంసంధ్య వేళ ఒక బలిమి పిట్ట తోట వాకిట కూత పెట్టింది.

యుగాల ఎదురుచూపు ఆర్తరావం అది. ఇలాంటి పిలుపు ఎపుడైనా విన్నదా అసలు? గున్నమావిని కూల్చి, పసుపు వన్నె జామ మధురఫలానికి మొహం తిప్పి తోటతోటనీ ఏమార్చి సత్తువ ఉడిగిన రెక్కల్లో బలాన్ని కూర్చుకుని ఎగిరొచ్చి ఆ పిలుపు ముందు వాలింది. కాసేపే! తోట వెనక్కి లాగింది. బలిమి పిట్ట – సొగసు చిలుక సంభాషణ విన్నారా ఎపుడైనా? చిలుకకే పలుకులు నేర్పేది బలిమిపిట్ట. బలిమి పిట్టకే శక్తినిచ్చేది సొగసు చిలుక. తోట వాడిపోతోంద…బలిమి సొగసులు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వాటి లేత రెక్కల మీద ఉండుండి పిడుగులు పడతాయి. తలెత్తి కూడా చూడవవి. చెరొకచెట్టు మీదా కట్టుకున్న ప్రియమైన గూళ్ళు అపుడపుడూ ఇరుకైపోతాయి. ఆరారు రుతువుల సంధికాలంలో ఏదో ఒకక్షణం తప్పిపోతుంది. దానిని చటుక్కున పట్టుకుని గూళ్ళు వదిలి ఆకాశంలో జంట గిరికీలతో పండుగ చేసుకుంటాయవి.

ఏడాదికోమారు సాయంసంధ్య వేళ  పిట్టలు ముస్తాబు అవుతాయి. తోటలు దూరమైన దురదృష్టాన నెప్పిరాగం తీగలా సాగుతుంది. వేయి యుగాల నిరీక్షణతో పిలుపు బరువవుతుంది. ఏటికేడూ అవే ప్రశ్నలు కొత్త భయాన్ని దాల్చుతాయి.

‘నాతో ఉంటావా?’ ఆత్రుతగా బెంగగా అడుగుతుంది బలిమిపిట్ట.

‘నాతోనే ఉంటావా?’ ఆత్రుతగా దిగులుగా అడుగుతుంది సొగసు చిలుక.

*******

వ్యాఖ్యానించండి