తెలిసిందా?

 

సంబంధిత చిత్రం

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది. అచ్చంగా నీ గురించే

 

కొంచెం సిగ్గుగా బిడియంగా నవ్వుతావు!

మల్లిమొగ్గ సాయంసంజెని చాటు చేసుకుని రెక్కలు విప్పినట్లు ఉంటుంది 

వచనకారుడివై కొత్త దీపాన్ని సొంతంగా వెలిగించుకున్నావు

నీ అక్షరాన్ని ముద్దాడిన మోహశిఖ భగ్గున మండి మరింత వెలుగైంది

ఈడ్చికొట్టే తగవుగాలికి నీ కాళ్ళమీద నీవు నిల్చుంటావు!

అరికాలి కింద నేల నిన్నునిలబెట్టి కరువుతీరా కావిలించుకుంటుంది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

ఎవరి అరల్లో వారిని సర్ది తాళం వేసాననుకున్నావు!

తాళం చెవుల గుత్తి మంత్రగత్తె కొంగుకి లాఘవంగా ముడి వేసుకుంది

నువ్వు మీ ఊళ్ళో పదిలంగా ఉన్నాననుకున్నావు!

సాగరం నుంచి సాగరానికి కొత్తవంతెన మీద యాత్ర మొదలయింది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

కానీ రాస్తున్నపుడు తెలిసింది 

నువ్వు నువ్వనుకునేది నువ్వు మాత్రమే కాదని

పరిమళం, ఐక్యరాగం, గడుసు చినుకు, కొత్త ఆశలు నీలో చేరి

నిన్ను ఖాళీ చేసాక

నువ్వంటే నువ్వు మాత్రమే కాదని

నీలో ఉన్నది నేనేనని తెలిసాక

ఇక ఈ పూట అచ్చం నీ గురించే రాయాలని ఉంది

నన్ను నేను ప్రేమించుకోవాలని ఉంది

 

 

2 thoughts on “తెలిసిందా?

వ్యాఖ్యానించండి