జాజిమల్లి కతలు

ఈ మధ్య నేను కొల్లగొట్టిన హృదయాలు

పుడు అంతర్ముఖులమైనా మనకు సంతృప్తి నిచ్చే వాటిలో మఖ్యమయినవి మనం గెల్చుకున్నహృదయాలే. ఈ మధ్య తరచి చూసుకున్నపుడు నాహృదయానికి వెన్నెల పొడినద్దిన రెండు హృదయాలు కన్పించాయి. మీకు పరిచయం చేస్తాను.

ఓ రోజు కాలేజీకి వెళ్ళడం కోసం రోడ్డు దాటడానికి నిల్చున్నాను. ట్రాఫిక్ ఎక్కువగా వుంది. నేనలా ఎదురుచూస్తుండగా నా చేతిని ఎవరో స్పృశించినట్లయింది. తిరిగి చూశాను. తొమ్మిదేళ్ళ పాప. చిరుగులు పట్టిన దుస్తులు, అతుకులతో ఆకారం మారిన స్కూల్ బాగ్, బాగా దువ్వి రిబ్బన్లతో పైకి కట్టిన రెండు జెడలు….

రోడ్డు దాటాగానే ఓ బుల్లి సిగ్గునవ్వు నా మీదికి విసిరి చక్కాపోయింది. నా కాలేజీ , ఆ పాప గవర్నమెంట్ స్కూలు వదిలే సమయం ఒకటే. ,మళ్ళీ సాయంత్రం నన్ను చూసి ఈ సారి కొత్తగా వచ్చిన హక్కుతో చెంగున గెంతుతూ నాదగ్గరికి వచ్చి, అడగాల్సిందేం లేదన్నట్లు దర్జాగా చెయ్యి పట్టేసుకుంది. రోడ్డు దాటేసి టాటాలు చెప్పుకుని వెళ్ళిపోయాం . పదిరోజుల్లో అయిదారు సార్లు యిలా జరిగేసరికి స్నేహం ప్రారంభంమయింది. రోడ్డు దగ్గరికి రాగానే రోజూ నేను దిక్కులు చూడటం, నేనొచ్చెవరకూ వెళ్ళకుండా ఆ పాప ఎదురు చూడటంతో హృదయాలు యిచ్చి పుచ్చుకునే ప్రక్రియ ప్రారంభమయింది.

ఓ రోజు సాయంత్రం రోడ్డు దాటినా తను నాచెయ్యి వదలకుండా బజ్జీల బండి దగ్గరకి తీసికెళ్ళి గుప్పెట తెరిచి అయిదురూపాయల నాణెం చూపించి, “మధ్యలో ఆకలేసినా ఏంకొన్లెదు. మనిద్దరం కలిసి తినొచ్చని”,అంది. పిల్లలు ఎంత గొప్ప దాతలు! తమకున్నదంతా యిచ్చి సంతోషపెట్టాలనే నిర్మలత్వం. ఆ ధనవంతురాలి ప్రేమని ఆనందంగా స్వీకరించాను.

అ తర్వాత నుంచీ మా హృదయాలను వ్యక్తీకరించడంలో కొత్తదనపు అన్వేషణ తమాషాగా వుంటుంది. ఓ రోజు నేను భుజం చుట్టూ చెయ్యి చుట్టి దాటిస్తే, మరో రోజు తను నా నడుం చుట్టూ చెయ్యి చుడుతుంది. ఓ రోజు తన  స్కూల్ బాగ్ నేను మోస్తే , నా హేండ్ బేగ్ తను పట్టుకుంటుది.ఇక ఏదో ఒక రోజు ఆ పాప తన లేత పెదాలతో నా చేతులకో, బుగ్గలకో ప్రసాదించే గొప్పకానుక కోసం ఉద్వేగంగా ఎదురు చూస్తున్నాను.

రెండు నెలల కిందట విజయనగరం మీటింగ్ కి వెళ్ళినపుడు కొంచెం సమయం దొరగ్గానే చాగంటి తులసి గారింటికి వెళ్ళాను. చాసో భార్య తొంభై సంవత్సరాల పండిన జాంపండు. తెల్లగా సన్నగా కాస్తంత పొట్టిగా ,మాట్లాడుతున్న పంచదార చిలకలా కన్పించారు. చూడంగానే ముద్దొచ్చి, దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ఒళ్ళో చేతులు వేయగానే నా బుగ్గలు తడిమి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు గలగలా మాట్లాడటం మొదలు పెట్టారు. నా చూపుని ఆమె మొహం మీద నుంచి పక్కకి మరలనివ్వని కనికట్టు మాటల విద్య తెలిసిన ఆ గువ్వపిట్ట  ‘నీపేరు నాకు నచ్చింది’ అంటూ పది సార్లు పిలిచి సంతోషపడ్డారు.

మీటింగ్ సమయం అవుతుందని అయిష్టంగా బయలుదేరుతుంటే చేతులు పట్టుకుని వదలకుండా సవరదీస్తూ ” మళ్ళీ ఎప్పుడు వస్తావో చెపితేగానీ వదలనని ‘ ఒకటే పట్టుబట్టారు. తులసిగారొచ్చి చేతులు బలవంతంగా విడదీసి మీటింగ్ టైమవుతొంది వెళ్ళనివ్వు అని చిన్నగా కోప్పడ్డారు.” రెండు వారాల్లో తప్పకుండా వస్తానని చెప్పి రెండు నెలలయినా వెళ్ళకపోయేసరికి ఆమె నామీద శాశ్వతంగా అలిగి వెళ్ళిపోయారు . నేను పొందిన వెంటనే కోల్పోయిన ఆ హృదయం నన్ను నాలుగు రోజులుగా వెంటాడుతోంది.

ఎపుడూ తెరిచి వుంచేవీ,గొప్ప సంతృప్తి నిచ్చేవి, పెద్దగా ఏమీ ఆశించనవీ అయిన ముసలి,. పేద , పసి హృదయాలను మనం నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ- సులువుగా తెరవబడినవీ, ప్రలోభపెట్టేవీ, మనసు కష్ట పెట్టేవీ అయిన డబ్బు ,అధికారం, యవ్వన హృదయాల లోతుల్ని మధించాలని తపించిపోతుంటాం కొంచెం బాలెన్స్ చేసుకుందామా?

16 వ్యాఖ్యలు

16 thoughts on “జాజిమల్లి కతలు

  1. పాప నుండి బహుమతి అందుకునే వుంటారని అనుకుంటున్నా.ఇలాంటి విలువైన వాటిని వదిలేసి ఏవేవో ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నాం .
    అనుబంధాన్ని చెప్పిన మీ మాటలు మరింత అందంగా వున్నాయి

  2. మనిషి కి రెండో బాల్యం వృద్దాప్యం. బాల్యంలో ఇంద్రధనస్సూ, వెన్నెలా, అరమగ్గిన జామ పండు వాసనా, తులసి ఆకు మీది మంచు ముత్యాల హారాలూ వుంటే,వృద్దాప్యంలో వెన్నెల మాటు చీకటి,గత జ్ఞాపకాల తలపోతల పరిమళం , సాయంసంధ్య లో సుదూరంగా సాగిపోయే నదీ గమనాన్ని చూసినప్పుడు అలుముకునే దిగులు వుంటాయి. పిల్లలు తండ్రులని ద్వేషించి తాతలని ప్రేమిస్తారు. పిల్లలని ప్రేమించే వారికి వృద్దులని అక్కున చేర్చుకోవడం కూడా అంతే ఇష్టమైన కార్యం. ది పిక్చర్ ఆఫ్ ది డోరియన్ గ్రే సినిమాలోని తొలి చిత్రంలా బాల్యం కాంతులీనుతూనే ఉంటుంది . అందుకేనేమో ఇస్మాయిల్ తాను సదా బాలకుడు అన్నది.
    కానీ మనం పిల్లల లోకం లోకి వెళ్ళం..మన ప్రపంచం లోకి వృద్దులను రానివ్వం…సూర్యోదయాన్నీ సూర్యాస్తమయాన్నీ నిరాకరించి నడి గ్రీష్మపు ఉక్కపోతలోకి జీవితాన్ని మనమే నెట్టుకుంటాం.. జాజి మల్లి ఈ కత ద్వారా చాలా హృదయాలు కొల్ల గొట్టింది. అభినందనలు.
    . వంశీ క్రిష్ణ

  3. మల్లీశ్వరి గారు..

    మీ “జాజిమల్లి” పుస్తకాన్ని నిన్ననే చదవడం పూర్తి చేశాను. మీ “జాజిమల్లి” ని చదువుతుంటే నిజంగా ప్రతి ఒక్కరికి తమ చిన్ననాటి సంగతులే గుర్తుకు వస్తాయనడం లో అతిశయోక్తి లేదు. మీరు రాసిన కథల్లో దాదాపు చాలా వాటిల్లో జీవిత వాస్తవికత కనిపించింది. ఎన్నాళ్ళ నుంచో కథలు ఎలా రాయాలా అని తంటాలు పడుతున్న నా లాంటి యువత కు ఒక చిన్న తాళం చెవి ని ఇచ్చినట్లు అనిపించింది మీ జాజిమల్లి. మీ కొల్లగొట్టిన హృదయాలలో పసిపాప, నాయనమ్మ౨౦౧౦, గిరిజన విద్యార్ధి చంద్ర మౌళి గురించి మీరు చెప్పిన కథలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. మీ జాజిమల్లి ని చదువుతుంటే మీరే మాట్లాడుతున్నట్లు ముచ్చటగా ఉంది గాని, అసలు ఒక్క కథ కూడా చదువుతున్నానన్న భావనే కలగలేదు. నాకైతే మీ డైరి ని చదువుతున్నానేమో అన్న భావన కలిగింది. ముఖ్యంగా మీ చిన్ననాటి జ్ఞాపకాలు చదువుతున్న వారితో పంచుకున్న తీరు బాగుంది. మీ “టాక్ టైం” కథ కొత్త సంస్కృతి ని దృష్టి లో పెట్టుకుని రాసారేమో అనిపించింది. మొత్తానికి మీ పుస్తకం చదువుతుంటే “అగ్గిపుల్ల, కుక్కపుల్ల, సబ్బుబిళ్ళ” కాదేది కవితకు అనర్హం అన్నట్లు, కథ రాయడానికి కూడా ఏది కూడా అనర్హం కాదని అనిపించింది.

    నేడు మనిషి తన మూలాలను మరిచిపోతున్నాడు. వేగవంతమైన జీవితం లో మరింత వేగంగా ముందుకు దూసుకుపోతున్నాడు. గత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి కూడా సమయం దొరకనంత వేగంగా, యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అలాంటి ఈ కాలం లో మీ “జాజిమల్లి” లాంటి పుస్తకాలు ఎడారి లో ఒయాసిస్సులా నేటి ప్రజలకు దొరకడమే ఒక అదృష్టం. కథలు అనేవి ఎక్కడి నుంచో పుట్టుకు రావని, మన జీవితం లోని మధురిమలు, అపశ్రుతులు కూడా కథలకు వస్తువులేనని చెప్పకనే చెప్పినట్లు ఉంది మీ “జాజిమల్లి”. మొత్తానికి మీ జాజిమల్లి మీ పుస్తకం లో చెప్పినట్లు గానే జాబిలి అంత చల్లదనాన్ని, జిలేబి అంత తీయదనాన్ని పంచింది.

    మీ పుస్తకాన్ని నాకు బహుమతి గా ఇచ్చి చదివించిన మా మేడం జగద్దాత్రి గారికి కూడా నా ధన్యవాదాలు.

    ఇట్లు

    కె. బాబు
    ఆంధ్ర విశ్వవిద్యాలయం
    విశాఖపట్నం

  4. మల్లీశ్వరి గారు,
    ఒక పెన్నిధి చేజారిపోయినా మరో పెన్నిధి వచ్చి మీ చేయి పట్టుకుంది, అదృష్టవంతులు.
    మీ మాటలు/టపాలు నాకు చాలా నచ్చాయి. మీకు నా అభినందనలు.

వ్యాఖ్యానించండి