నీల’తో నా స్వరం మల్లీస్వరమే!
- హేమమాలిని అవధానం
*************
ఎప్పుడెప్పుడు చదువుతానా అని ఎంతగానో ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది.
‘నీల’ నాచేతికొచ్చింది. అబ్బురంగా చూశాను.
‘నీల’ను తాకుతున్న సీతకోకచిలకమ్మ, తనలో వున్నన్ని వర్ణాలు, నీడలు, ఇందులో వున్నాయని గర్వంగా నిల్చుంది. కిందనే కె.ఎన్.మల్లీశ్వరి గారి పేరు చూడగానే ‘జాజిమల్లె’ల కథా సౌరభాలు చుట్టుముట్టాయి. తన రచనలు నాలో ఎప్పుడూ ఆసక్తిని రేపి, అనుభూతులను పంచిన నేస్తాలే. ‘తానా బహుమతి’ని పొందిన నవల ఎలాంటి కథను నింపుకుందో అనే నా ఉత్సుకతను పెంచేలా ‘నీల’ ముఖచిత్రం కనపడింది. ‘నేనన్నిటికీ అతీతురాలిని’ అని తనలోతాను పరవశిస్తూ చిరునవ్వును చిందిస్తున్న చిరుదీపికలా ‘నీల’ ముఖప్రవాహం. ఆనందంతో నిండిన ఆమె వదనం కథలో మలుపుల వెనుక సుఖాంతాన్ని ప్రతిబింబిస్తోంది అనిపించింది. ప్రచురణకర్తల ముందుమాటలు, విమర్శక మిత్రుల విశ్లేషణలు పదపదమంటూ కథనంపై ఆసక్తిని మరింతగా పెంచాయి.
అక్షరాల వెంట నా కనులు నడకను మొదలుపెట్టాయి. మొదట్లోని చిరునడక, మెల్లిగా వేగం హెచ్చి, పరుగందుకొంది. కథలో కొన్నిచోట్ల ప్రేక్షకురాలిగా, కొన్నిచోట్ల పాత్రల మాటలు నావే అన్నట్లుగా, కొన్నిపాత్రలలో నేనే అన్నట్లుగా సమాంతరంగా నడిచాను. కొన్నిచోట్ల గొంతు పూడుకుపోయి, ఊపిరాడక, కన్నీటిపొర అడ్డొచ్చి అక్షరాలు అలుక్కుపోయాయి. ఈ బాధను భరింపలేమంటూ కొన్ని కన్నీటి చుక్కలు నన్ను వీడాయి.
‘నీల’ వ్యక్తిత్వ వికాసంలో బాల్యం, ఆలోచనా తీరు, ఉద్యమ వెల్లువ, వైవాహిక జీవితాన ముళ్ళగాట్లు, ప్రేమలు వాటి పయనాలు, వేటికవే ప్రత్యేక భాష్యాలే. తను స్వేఛ్ఛను వెతుక్కొన్న తీరు, సాహచర్యపు సరిగమలు, తనని తాను ఆవిష్కరించుకొన్న తీరు అద్భుతం. చంద్రకళ, ఆరంజోతి, పాస్టరమ్మ, సరళ, వసుంధర, సంపూర్ణ, అజిత, మినోల వ్యక్తిత్వాలు, తత్వవేత్తలకు తగ్గని పైడమ్మ జీవనసారం అన్నీ అనంతాలే.
‘నీల’ జీవితంలో చంద్రోదయం పరదేశి, సూర్యోదయం సదాశివ, చీకటి నింపిన ప్రసాదు, దిగంత రేఖ సూర్యం, అన్నింటా జీవశక్తితో వెలుగును సానబెట్టుకున్న ‘నీల’ నిజంగా వెలుగు జిలుగే.
ఏది స్వార్ధం? ఎక్కడ న్యాయం? ఏది ప్రేమ? ఎక్కడ ద్వేషం?
ఏది పగ? ఎక్కడ క్షమ? ఏది స్వేచ్ఛ? ఎక్కడ అధికారం?
ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు నింపుకున్న నవల నిండుగా వుంది. ‘నీల’. ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలనూ ప్రతిబింబించింది. ఏకబికిన నన్ను పంక్తులదారిలో, పేజీల వెంట ఉరుకులెత్తించిన ఈ నవల చదవడం ముగించాక మనసున ఓ ఆనందం, హృదయానికో తృప్తి అనిర్వచనీయ భావన. ‘నీల’ను వెలువరించిన మల్లీశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ’నీల’ సాహితీ వినీలాకాశంలో ఎప్పటికీ మెరిసే ఓ నక్షత్రమే.
