సప్తవర్ణ లేఖ – 11

(గత నాలుగు రోజుల్లో వివిధ సందర్భాల్లో నాతో మాట్లాడిన మిత్రులు చాలా సున్నితంగా ప్రస్తావించిన విషయాల సారాంశం ఒకటే. ఈ మధ్య ఏం రాస్తున్నట్లు లేవు! అని. ఆ హెచ్చరిక నాకు అర్ధమవుతూనే ఉంది. అయిదేళ్లుగా నన్నుపట్టుకుని వదలని నవల గురించీ, బోల్డంత సమయాన్ని హరించే దాని దాహం గురించీ కాసేపు గొణిగి ఊరుకున్నాను. రాయకపోతే ఏం అని మనసులో కాసేపు పెంకితనాలు కూడా పోయాను. చూస్తుంటే విమలకి రాసిన సప్తవర్ణ లేఖ కనిపించింది. ఇలా మీతో పంచుకుంటున్నాను.)

షాబీ డేస్

20/03/16
విశాఖపట్నం.
హాయ్ విమలా,
నీ ఉత్తరం అందుకున్నాను. విమెన్స్ డే సందర్భంగా నువ్వు రాసిన లేఖ నాకు కొన్ని కొత్తవిషయాలని తెలియజేసింది. ఉద్యమానుభవాల విమలతో ఇట్లా నేస్తరికం కట్టుకున్నందుకు సంతోషం వేసింది. మనిద్దరం కలిపి చినుకు సాయంతో నిర్మించుకున్న ఈ ఆవరణం అపురూపంగా ఉంది. చూస్తూ ఉండగానే ఏం కానట్టు ఏడాది గడిచిపోయింది. ఆ మధ్య కె. శివారెడ్డి గారు కూడా హెచ్చరించారు, ‘మీ లేఖలను పుస్తకంగా తేవడం మాత్రం మర్చిపోకండి’ అని. కలిసినపుడల్లా ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. రామతీర్ధగారు ఈ లేఖల స్వభావం మీద మంచి విశ్లేషణ చేసి ఇన్ని పేజీలు అని కుదించకుండా విస్తృతంగా రాస్తే చాలా విషయాలు నమోదు అవుతాయి అని చెప్పారు.
ఈ మధ్య నా చిన్నప్పటి భయాలు కొన్ని గుర్తొచ్చి వాటిచుట్టూ చాలా ఆలోచనలు చేరాయి విమలా! అట్లాంటి భయాలు కలిగించిన కొన్ని దయారహిత దినాల ( పనికిమాలిన రోజులు అనొచ్చేమో! కానీ నేనిట్లా అనువదించుకున్నాను) గురించి నీతో పంచుకోవాలని ఉంది. నాకు అయిదారేళ్ళ వయసులో అమ్మ, నాన్న, నేను హైదరాబాద్ లోని మా చుట్టాలింటికి వెళ్లాం. మా ముగ్గురుఅక్కయ్యలు మా ఊళ్లోనే నాయనమ్మ దగ్గర ఉన్నారు. నన్నొక్కదాన్నీ తీసుకువెళ్ళారనే గర్వం కాసేపు కూడా నిలబడలేదు. బస్సులో కూచోగానే ‘నలుగురు పిల్లల్నీ తీసుకువెళ్ళాలంటే మాటలా! చార్జీలు భరించలేం. మా నాలుగోది వాళ్ళ నాన్నని వదిలి ఉండలేదు. అందుకే దీన్ని తీసుకు వెళ్తున్నాం’ పక్కనున్న చుట్టాలావిడతో అంది అమ్మ. అదుగో అలా డబ్బు అనే బ్రహ్మపదార్ధం మొదటిసారిగా నా ఊహలోకి వచ్చి హడలుగొట్టడం మొదలుపెట్టింది.
నిజంగానే హడిలిపోయాను విమలా!
నన్నూ మా అక్కలను ఇలా విడదీసేశక్తి దానికి ఉన్నందుకు ఆ బ్రహ్మపదార్ధం మాకు సరిపడినంత లేనందుకు దిగులు మొదలైంది. చుట్టాలింట్లో దిగి మూడురోజులు గడిచినా హుషారు లేదు. మాలో మేము మంతనాలాడుకుని దిగులు పోగొట్టుకోవడానికి పక్కన అక్కయ్యలూ లేరు. మూడోనాటి రాత్రి అర్ధరాత్రి పెద్దపెద్ద అరుపులు వినబడితే తుళ్లిపడి నిద్రలేచాను. పక్కనే ఉన్న హాల్లో ఏదో గొడవ జరుగుతోంది. చుట్టాలతో సహా అందరూ అక్కడే ఉన్నారు. మా చుట్టాలింటి పెద్దకొడుకు తాగివచ్చి గొడవ చేస్తుంటే అందరూ నిద్రలు లేచారు.
మా నాన్న పెద్దరికం వహించి ఏదో సర్ది చెప్పబోతున్నా గొడవ సాగుతూనే ఉంది. నేను రహస్యంగా తొంగి చూసేసరికి ఆ తాగి వచ్చినతను నూరువరహాల గుత్తిలోని ఒక పువ్వు కాడను పళ్ళ మధ్య తిప్పుతూ మొహం భీకరంగా పెట్టుకుని ఉన్నాడు. అమ్మా అమ్మా అని మెల్లగా పిలిస్తే, వాళ్ళాయన పెద్దరికాన్ని చూడనివ్వకుండా చేస్తున్నానన్న విసుగుతో వచ్చిన మా అమ్మ నన్ను పడుకోబెట్టబోయింది కానీ నేను లొంగి రాలేదు. అలా అమ్మ కుచ్చిళ్ళు పట్టుకుని సాగుతూ నేనూ హాల్లోకి వచ్చిపడ్డాను.
అపుడు గోస పెడుతున్న గొంతుతో తాగుబోతాయన వాళ్ళ అమ్మ అందీ ‘ఇట్లా తాగుతూ పోతే ఎంత డబ్బూ నాలుగురోజుల్లో హరించుకు పోతుంది కదా’ అని. ఇక మిగతా విషయాలన్నీ పోయి ఆ ఒక్కమాటే నా బుర్రకి అతుక్కుపోయింది.
వాడేస్తే డబ్బులు అయిపోతాయి.
మా ఇంట్లో ఇనపటేబుల్ టేబుల్ సొరుగులో గుండ్రని స్టీలు డబ్బాలో నాన్న దాచిన నోట్లూ చిల్లర నాణాలూ గుర్తొచ్చాయి. వాడేస్తే అయిపోతాయి కదా! అపుడెలా బతకడం! అన్న మనేద పట్టుకుంది నాకు. అదెంత తీవ్రంగానంటే పొద్దున్నకల్లా నా వంటి మీద జ్వరం విరగకాసింది.
‘రాత్రి గొడవకి ఝడుసుకుందల్లా!’ అన్నారంతా. కానీ కాదు. డబ్బు అయిపోతే ఎట్లా మరి! పాపం మా నాన్న ఏం చేస్తారు! మేవెట్లా బతకడం! అనేదే నా గుబులు. నాలుగురోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి ఎవరినో తోడు ఇచ్చి ఏలూరు మా ఇంటికి పంపేసారు.
వచ్చినరోజే మా అక్కయ్యలు నా నుంచి విషయం కూపీలాగి ‘స్టీలు డబ్బాలో డబ్బులు అయిపోతే మరెలా బతకడం అని భయంతో వచ్చిన జ్వరం అంట మామ్మా!’ అని మా నాయనమ్మతో చెపితే ఆవిడ నవ్వేసి, ‘అయిపోతే సంపాదించుకుంటాం’ అంది ధీమాగా.
అపుడు బోల్డు అనుబంధ ప్రశ్నలు వేసి డబ్బు దాని స్వరూపస్వభావాల గురించి మా నాయనమ్మ వద్ద కొంత లౌకికజ్ఞానం సంపాదించాను. నా పసిమనసుకి అంత కష్టం కలిగించిన ధనంతో నాకెపుడూ స్నేహం కుదరలేదు. సాధ్యమైనంతవరకూ తప్పుకునే తిరిగాను.
తొలిగా నా ఆలోచనను అంత మథనకి గురి చేసిన అంశం ఇంకా ఉదాత్తమైనది అయి ఉంటే బావుండేదని అనిపిస్తూ ఆ షాబీ డేస్ నుంచి కూడా ఎంతో కొంత గ్రహించాను కదా ఊరట చెందుతూ ఉంటాను.
దయ కరుణ లేకుండా జీవితం కొన్ని క్రూరమైన రోజులను ‘అనుభవించు’ అంటూ అంటగట్టే ఉంటుంది కదా విమలా!. తెలిసోతెలియకో విధిలేకో, నమ్మకంలేకో, మరెందుకో అలాంటిరోజులు మనమీదుగా నడిచిపోయే ఉంటాయి…‘అబ్బా ఎలాంటికాలం తల్లీ! పగవాడికి కూడా రాకూడదు’ అనిపించిన రోజుల్లో నన్ను కాపాడిన నిబ్బరం, వివేచన, సహనం నాకు అత్యంత విలువైనవి. వాటి జ్ఞాపకాలు మళ్ళీ అలాంటివి ఎదురైనపుడు ఎదుర్కొనే క్రమాన్ని సులువు చేస్తాయి. ‘మనం పోగొట్టుకున్న ధనం కన్నా మనం పోగొట్టుకున్న మనం విలువ చాలా ఎక్కువ’ అన్నది చిన్నప్పటి ఫాసినేటింగ్ కొటేషన్. అందుకే ఎలాంటి షాబీ డేస్ లో కూడా నన్ను నేను నిలుపుకోవడానికే ముందుగా పోరాటం మొదలుపెడతాను.
నా జీవితంలోవే కాకుండా నా చుట్టూ మెలిగినవారి జీవితాల్లోని ఉండకూడని రోజులు కూడా నన్ను కలవరపెడతాయి. ఏలూరులో నేను ఆరు, ఏడు తరగతులు చదివేపుడు మా క్లాసులో విజయకుమారి అని మాలవారి అమ్మాయి ఉండేది. తను క్రిస్టియన్. మిగతావాళ్ళు బీసీ ఓసీలు – హిందువులు. ఓ సారి మా తరగతిలో చాలామంది పిల్లలు మా ఆహ్వానం మీద కట్టగట్టుకుని మా ఊరొచ్చారు. విజయకుమారి కూడా వచ్చింది. మా ఊళ్ళో మా తరగతికి చెందిన అందరి ఇళ్ళకూ వెళ్లాం.
అపుడు ఏ రకమైన ప్రశ్నలూ, ఆలోచన, లేకుండానే అందరం కలిసి విజయకుమారికి బొట్టు పెట్టేసి, జడలు బట్టలూ అవీ మాలాగా మార్చేసి ఎవరైనా ఆరాగా చూస్తే మా గుంపు మధ్యభాగంలో తనని దాచేసి నానా హడావిడి చేసాం. మొత్తానికి మా సంబరంలో తను కూడా పాల్గొనాలన్న ఆరాటమే తప్ప ఇంకే జ్ఞానమూ తెలీని దుర్మార్గపు రోజది. ఆఖరు అంకం మా ఇంట్లో. చావిట్లో అందరినీ వరసగా కూచోబెట్టి కాయితంలో పకోడీలు పెట్టి ఇస్తున్న మా నాయనమ్మ విజయకుమారిని చూసి ‘పిల్లా! మీరేవిట్లూ?!’ అనేసింది పిడుగుపాటుగా.
నాకు చాలా కోపం వచ్చింది.
ఎందుకు?!
నాకు అప్పటికి కులమతాలను వాటి అమానుషత్వాన్ని అర్ధం చేసుకునే వాతావరణంలో లేను. కానీ ఆ ప్రశ్న అడగడంలో అహంభావం, దానికి సమాధానం చెప్పలేక ఆ నీలికలువ కళ్ళు నీళ్ళతో నిండిపోవడం నన్ను కలవరపరిచాయి విమలా! అపుడు మా నాయనమ్మతో పోట్లాడాను. మా ఫ్రెండ్ ని అట్లా అడుగుతావా?! అని. మొదటిసారి మా ఇంట్లో పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ తిరుగుబాటు. ఆ పకోడీలు అక్కడే పారేసాను. విజయకుమారి మాత్రం పొట్లంగట్టి తెచ్చింది. ఇద్దరం కలిసి మా పక్కస్థలంలో ఉన్న గడ్డివాము పక్కన కూర్చుని ఏమీ చెప్పుకోకుండానే ఓ…మని ఏడ్చుకున్నాము.
కాసేపటికి ఏడుపు ఆగి వెక్కులు పెడుతున్నపుడు విజయకుమారి పకోడీల పొట్లం విప్పి ఒకటి తీసుకుని సగం కొరికి తిని మిగిలిన సగం నాకు ఇచ్చి ‘ఇది తింటే నువ్వు అంటు పాటించనట్లు…’ అంది పౌరుషంగా.
గభాలున తీసుకుని తినేసి కలకలలాడిన విజయకుమారి మొహాన్ని చూసి పొట్లంలోని మిగతావి కూడా కొరికి ఇస్తేనే తింటానన్నాను. ఆ తర్వాత ఈ అంటరానితనాన్ని పోగొట్టడానికి మా వంతుగా మేము ఒక బృందంగా ఏర్పడి నేనూ విజయకుమారి, మాదిగవాళ్ళ మత్తేసు ఇంకో నలుగురైదుగురం కలిసి రేగుపళ్ళు మొక్కజొన్న కండెలు లాంటి వాటిని వాళ్ళు కొరికి ఇస్తే మిగతావాళ్ళు తినాలి అనే ప్రోగ్రాం కొన్నాళ్ళు నడిపాము. అలాగే అందరమూ విజయకుమారి మత్తేసుతో సహా ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడవాలి అన్న కార్యక్రమం కూడా నిర్వహించాం. మా టీచర్లకి తెలిసిన రోజున ఒకాయన మమ్మల్ని తిట్టిపోశాడు కానీ మిగతావాళ్ళు నవ్వి ‘ పిచ్చిపిల్లలారా! ఎప్పటికి మారేను లోకం!’ అని నిట్టూర్చారు.
ఒక దుర్మార్గపు రోజుని అమాయకత్వపు సమానత్వంలోకి తీసికెళ్ళగలిగినందుకు విజయకుమారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటానెప్పుడూ.
ఈ మధ్య వేముల రోహిత్ తల్లిగారైన వేముల రాధిక విశాఖపట్నం మీటింగ్ కి వచ్చారు విమలా! మహిళాచేతన కార్యదర్శి కత్తి పద్మ ఉన్నారు కదా.. తను తీసుకు వచ్చారు. ఆమెతో కలిపి ఒక పూటంతా గడిపాను. చాలా కబుర్లు చెప్పుకున్నాము. రోహిత్ చిన్నప్పటి విషయాలు చెప్పుకున్నాము. రోహిత్ తమ్ముడు చైతన్య పేరులోనే కాక నిజంగా చైతన్యవంతంగా ఉన్నాడు. వారి జీవితాల్లో అకస్మాత్తుగా వచ్చి పడిపోయిన ఆత్మీయుని మరణం ఒక ఎత్తు అయితే, రోహిత్ లక్ష్యాలను ఆశయాలను భుజాలకి ఎత్తుకున్న అనేకమంది ఆశలను రాజకీయంగా ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యతని కూడా వాళ్ళు స్వీకరించారు.
అంతకు ముందు ఎరుగని కొత్త రాజకీయాలను హాండిల్ చేయడంలో వారికి వస్తున్న సమస్యలను, వాటిని అధిగమించడంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తావిస్తే నిబ్బరంగా ఉన్నట్లే కనిపించారు. ప్రధానంగా ఏ రాజకీయపార్టీనీ ఏ ప్రజాసంఘాన్నీ ఏ మీడియాసంస్థనీ నమ్మి, వారి వెనుక వెళ్ళమని రోహిత్ చట్టం రావడం కోసం బేషరతుగా అందరి సాయం కోరతామని చెప్పారు. బాధితులకి న్యాయాన్ని సాధించడంలో చివరికంటా తోడు ఉంటామన్న నమ్మకాన్ని ఒక్క ప్రజాసంఘమూ ఇవ్వలేకపోయిందా అని మనసు కలుక్కుమన్నా సరే ఇప్పటి పరిస్థితుల్లో వారి ముందు ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం నన్ను ఆలోచనలో పడేస్తోంది విమలా!
కథల పుస్తకం వేస్తున్నావుగా విమలా! నీకు అభినందనలు. నువ్వు అరుదైన కవి కథకురాలివి. సమాజంతో ప్రజలతో, నీతో – నీ అనుభవాలు కథలుగా ఒకేచోట చదవడం అద్భుతమైన అనుభవం అవుతుంది ఖచ్చితంగా.
నువ్వు కోసుకొచ్చిన కొన్ని నక్షత్రాలు / నీ వేలి కొసల నుంచి జారే క్షణాల కోసమూ
నువ్వు మోసుకొచ్చిన కాసిన్ని కన్నీళ్లు / మాకు చెప్పే కథలని వినడం కోసమూ
ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి త్వరగా నీ లేఖ చదవాలని ఆశపడుతూ…
ప్రేమతో
మల్లి28feb11

5 thoughts on “సప్తవర్ణ లేఖ – 11

  • విమల చాలా మంచి కవయిత్రి, కథకురాలు. చాలాకాలం విప్లవోద్యమంలో పని చేసారు. ఆమె రాసిన వంటిల్లు, సౌందర్యాత్మక హింస కవితలు డిగ్రీ తెలుగు సిలబస్ లో ఉన్నాయి నీహారిక గారూ. మీ సూచన తప్పక గుర్తు పెట్టుకుంటాను

 1. మీ లేఖ పేరుకి తగ్గట్టే రకరకాల జ్ఞాపకాల వర్ణాలతో మెరుస్తోంది.

  “నువ్వు కోసుకొచ్చిన కొన్ని నక్షత్రాలు / నీ వేలి కొసల నుంచి జారే క్షణాల కోసమూ”

  ఈ పదాల్లో సప్తవర్ణాలూ చాలా బాగా మెరిశాయి 🙂

  ~లలిత

 2. @ ఇక మిగతా విషయాలన్నీ పోయి ఆ ఒక్కమాటే నా బుర్రకి అతుక్కుపోయింది.

  అది సిసింద్రీ బుర్ర కదా మరి 🙂

  అసలీ డబ్బులగురించి నాకేం గుర్తుందబ్బా అని ఆలోచిస్తే !!!

  మా అమ్మ ఇద్దరికీ కాన్వెంటు ఫీజు కట్టలేము, అమ్మాయి బాగా చాడువుతుడి కదా గవర్న్మెంట్ స్కూల్ కి పంపాలని అనుకొనే వారు. మా నాన్న కి తెలవకుండా ఒక రెండ్రోజులు పంపించారు కూడా. మూడోరోజు కాన్వేటు పంతులు పంపిన ఉత్తరమో ఇంకేదో..నాన్నకి సంగతి తెల్సి నా చదువు కాన్వెంటు కి చేరింది .. కాని ఆ రెండ్రోజులు ఇప్పటికీ జ్ఞాపకం. సంతోషంగ స్కూల్ కి వెళ్ళిన రోజులు . అక్కడ టీచర్స్ స్ట్రిక్ట్ గా ఉండరు. ఆటలకు చాలా టైం ఉన్దెది. ఆదివారం సెలవు.. ఒక ఇద్దరు పంతుళ్ళు తర్వాత నన్ను గుర్తు పట్టేవాళ్ళు కూడా .

  మా తాతౌయ్య ఒక సారి పంట డబ్బులు లెక్కపెట్టుకుంటూ బుల్లి బుల్లి డబ్బుల పోత్త్హాలు సర్దడం చూసి ఆ వారం లో మా వీధిలో టముకు వేసా,ఇంట్లో వాల్లకి జాగ్రత్తగా సర్డుకోవాలని తెల్సింది కాని, నాకు మాత్రం ఎప్పుడు డబ్బుల్లెకున్నా అప్పటి కట్టలు కంటిముంది కనిపించి కాస్త భయం తగ్గేది అనుకుంటా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s