విప్లవ కలల నేతగాడు

 

 

(అరుణతార – చలసాని సంస్మరణ సంచికలో ప్రచురితం)

ప్రసాద్ గారూ,

మీకో ప్రేమలేఖ ఇలా రాయవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. మీరు కనపడని చోటుకి ముందస్తు నోటీసు కూడా లేకుండా  దబదబ అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారని తెలిస్తే దారి కాసి గదమాయించి అయినా సరే వెనక్కి తీసుకురామా! అప్పటికి నాలుగు రోజుల కిందటే కదా నేనూ చందూ వచ్చేసరికి గదిలో మీ మదిలో పుస్తకాల మధ్య ఆలోచనల్లో ఉన్న మిమ్మల్ని కొంటె ప్రశ్నలడిగి ఏడిపించాను. ఏవన్నానో గుర్తుందా? ‘ప్రసాద్ గారూ మీరెవరినైనా ప్రేమించారా?’ అన్నాను. చందుకి కాస్త మర్యాద గుర్తొచ్చి పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటి ఆ ప్రశ్నలు అని ముసిముసి నవ్వులు నవ్వి తిట్టి మీ వంక కుతూహలంగా చూసాడు. అపుడు చూసాను కదా మీ మొహంలోని చిలక నవ్వుని. నా బుగ్గలు ముద్దాడి ‘నిన్ను ప్రేమించాను…ఈ లోకాన్ని ప్రేమించాను, మనుషుల్ని, పుస్తకాలలోని మనుషుల్నీ, విప్లవాన్ని ప్రేమించానని చెప్పి  నా ఎత్తుగడని చిత్తు చేయబోయారు. నేను వదలకుండా పోనీ ఎవరికీ ప్రేమలేఖన్నా రాయలేదా? అని కాసేపు నస పెడితే అపుడు విజయ గారికి రాసానని ఒప్పుకున్నారు. నేనొక ప్రేమలేఖ రాస్తాననీ నాకు రిప్లయ్ ఇవ్వాలనీ అడిగితే మీరు నాకు మాటిచ్చారు. నిలుపుకోవాలి మరి!

చలసానీ,

మీ లక్ష్యాలు, మీ ఆచరణ, మీ చిత్తశుద్ధి అసలివేమీ తెలీకుండానే మిమ్మల్ని ప్రేమించిన మనుషులున్నారు. అది మీకు తెలియకపోలేదు. సాహిత్యమన్నా రచయితలన్నా సభలూ సమావేశాలన్నా పెద్దగా ఆసక్తి లేని చందూని, మీ ‘మిస్టర్ మల్లిగాడిని’ ఏం మాయ చేసి మీ వశం చేసుకున్నారు? మిమ్మల్ని ఇలా సాగనంపి వచ్చి, రెండ్రోజులుగా ధరించిన బింకపు ముసుగుని విప్పి హేంగర్ కి తగిలించి పడకగది తలుపు  వేసుకుని  బావురుమని ఏడ్చిన చందు మీ గురించిన మరో  పాత సత్యానికి కొత్త ఉదాహరణ. మాట్లాడటానికి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ తన లోపల ఓవర్ ఫ్లో అవుతున్న దానిని ఆపుకోలేక  కొత్త మాటల్లోకి దిగిపోతున్నాడు చందు. ఒక రైతు వర్షించే మేఘాన్ని కావిలించుకున్నట్లుగా ఉంటుంది ప్రసాద్ గారిని కావిలించుకోవడం అంటున్నాడు. ఇంకొక్క ఏడాదో రెండేళ్లో ఈయనతో స్నేహం నడిచి ఉంటే ఇక నేనూ దిగక తప్పేది కాదు అన్నాడు. చలసానీ  వింటున్నారా? ఎవరికి వారు, చలసానితో తమ అనుబంధమే అత్యున్నతం అనుకునే స్థాయిలో హృదయాన్ని అంతలా ఎలా విశాలం చేసుకోగలిగారు?

మీరెంత విస్తరించారో తలుచుకుంటున్న కొద్దీ గుండెలు అవిసిపోతున్నాయి. మీరు చటుక్కున మాయం అయ్యారన్న విషయం తెలిసి మా అమ్మనాన్నలు అత్తమామలు మా అక్కయ్యలు నా చిన్నప్పటి స్నేహితులు సాహితీ మిత్రులు ఇంత మంది నన్ను పరామర్శించడం చూస్తే ఒక మనిషితో అనుబంధం అంటే వారి సమస్తంతో సహా ప్రేమించడం అన్నది ఆచరణలో ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. అంత శక్తి ఓపిక ఎలా వచ్చాయి? ముఖ్యంగా అహాన్ని రద్దు చేసుకోగల అంతటి హృదయాన్ని ఏ పదార్ధంతో తయారు చేసుకున్నారో ఇక ఇపుడు పరిశోధించాలి.  మీరు విస్తరించినంత మేరా ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి  మీ పనులు, మీ జ్ఞాపకాలు, వినా మార్గం లేనందుకు, ఉందేమో మరి ఇంకా మా ముందుకు రానందుకు దుఃఖంగా ఉంది. కృష్ణాబాయి గారితో చెప్పానూ చెదిరిన మనస్సు నుంచి వచ్చే అక్షరానికి కుదురు ఉండదు అని. అదే రాసి చూడు అన్నారామె. అచ్చం ఆమె వంటి మీరు, మీ వంటి ఆమె.

ఫ్రెండూ,

ఆరుద్ర అంటే పెద్దగా పడదు కదా మరి ఆరుద్ర సంపుటం కోసం నన్ను విసుక్కున్నారు ఎందుకూ! నిజ్జంగా నిజం ఫ్రెండూ ఆ 9 నంబర్ సంపుటం నేను తీసుకు వెళ్ళలేదు. సరే మీకు మనసు మనసులో ఉండదు కదా అని మన నారాయణ వేణు గారి పుస్తకం తెచ్చి మీకిస్తే అది మీది కాదని చెప్పి వేణుకి ఫోన్ చేసి పుస్తకం పంపించి వేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసి పుస్తకం ఇవ్వమని అడిగారు. చాదస్తం కాదా మరి! నేను అలిగానేమోననీ నేను మొహం మాడ్చుకున్నానేమోనని పదేపదే ఫోన్లు చేసి ‘ఒరేయ్ మల్లీ నాకు పుస్తకాల కన్నా మనుషులే ముఖ్యం. ఏవీ అనుకోబాకు’ అంటుంటే ఫ్రెండూ! అసలకి మీమీద కోపం వస్తుందా ఎవరికైనా?

చివరిసారి ఎపుడు చూసానూ అని పెద్దగా ఆలోచించలేదు. మిమ్మల్ని కలిసిన ప్రతి సందర్భమూ ఒక పండుగే కదా! మీ మహాప్రస్థానానికి మూడు రోజుల ముందు నేను లోపలి గదిలో పని చేసుకుంటున్నాను. కాలింగ్ బెల్ పని చేయడం లేదు. ముందు గది తలుపు కొట్టినట్లున్నారు వినిపించలేదు. అపుడు ఇంటి వెనుక వైపు వచ్చి పెరట్లో నిలబడి తలుపుకొట్టి పిలిచారు. మీ గొంతు వినగానే పరుగున వచ్చి తలుపు తీసానే గానీ మీకు అంత ఇబ్బంది కలిగించినందుకు ఎంత నొచ్చుకున్నానో అంత అబ్బురపడ్డాను. ఏం ఫ్రెండూ చివరి జ్ఞాపకాన్ని నా కోసం ఘనంగా పదిలపరచడానికా ఆ రోజు మీరు అంత ఆరాటపడ్డారు !

వ్యక్తి పూజలు కూడదు నిజమే. కానీ విప్లవ వాహకులు వ్యక్తులే కదా, వారు ఎంతటి సంస్కార వంతులైతే విప్లవానికి అంతటి సానుభూతిని సంపాదించి పెట్టగలరు కదా…ఇది రాస్తుంటే  కొకు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి మనుషుల్లో సంస్కారం పెరిగేకొద్దీ నేరాలు తగ్గుతాయనీ అపుడు చట్టం చేయాల్సిన పనిని సంస్కారమే చేస్తుందనీ అంటాడు. ఆ సంస్కారం చేతనే కదా తాళాలు లేని ఇంటిని సాధ్యం చేసుకున్నారు, ఆ సంస్కారం చేతనే కదా పోలీసులు లేని రాజ్యం కోసం విప్లవ కలల నేతగాడుగా మారారు.

సీపీ

మీరు పరిచయం అయిన తొలినాళ్ళలో ఏయు అసెంబ్లీ హాల్ లో కిక్కిరిసిన ఒక సభలో మనిద్దరం వెనుక వరుసలో జనాల మధ్య కూచుని ఉండగా అల్లంత దూరం లోని వేదిక మీద నుంచి సినారె ‘ అదుగో ఆ మూలన కూచున్న మూల పురుషుడు.’ అంటూ చతురోక్తులతో మిమ్మల్ని ప్రశంసించినపుడు మీ గురించి కొత్తగా తెలిసినట్లనిపించింది. ఆ తెలియరావడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇంకా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూ ఉంటుంది.

కమ్యూనిస్టులు అంటే చాలా మందికి లానే నాకూ గొప్ప గౌరవం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ తరం వారంటే మరీనూ. ఎందుకంటే సగటు మానవుల కంటే భిన్నంగా ఆచరణలో బలంగా ఉంటారనీ, త్యాగాల బాటలో అలవోకగా అడుగులు వేస్తారనీ. సందేహమే లేదు. డబ్బు, అధికారం, హోదా వంటి అనేక ఆధిపత్యాలను జయించిన అపురూప మానవుల సమక్షం ఎంత హాయిగా ఉంటుందో నేను మీ వద్ద, మీ వంటి మరి కొందరి వద్ద  గ్రహించాను. అయితే అలాంటి వాళ్ళలో కూడా మీరు వేరు సీపీ . ఆధిపత్యాలను జయించి మామూలు వ్యక్తులకి సాధ్యం కాని ఆచరణ బలంతో, జ్ఞాన సంపన్నతతో మిలమిలలాడే వ్యక్తులకు ఒక నైతిక తీక్షణత ఉంటుంది. అది చాలా సందర్భాల్లో అది నైతిక ఆధిపత్యంగా మారడం, అజ్ఞానులను(?), బలహీనులను చిన్న చూపు చూడటం గ్రహించినపుడు ఉసూరుమంటాం. కానీ చెప్పాగా సీపీ మీరట్లా కాదు. మీరసలు పూర్తిగా వేరే. జ్ఞాన, నైతిక ఆధిపత్యాలను కూడా జయించి మీరు మనుషుల్ని ప్రేమించారు.

నాకు మీరు ఇలా అర్ధం కాక ముందు ఏడిపించడానికే అయినా ప్రసాద్ గారూ మీరు రాన్రానూ అజాతశత్రువులా మారుతున్నారు అంటే ఒప్పుకునేవారు కాదు. అబ్బే! నేను అజాత శత్రువుని ఏంటి ! అదేం తిట్టు! అనేవారు. మీరు నమ్మి ఆచరించిన రాజకీయాల పట్ల మీ నిక్కచ్చితనం ఎంతటిదో పలు సభల్లోనూ పలు సందర్భాల్లోనూ నేను చూసాను కాబట్టి రాజకీయ విలువల పట్ల మీకున్న నిబద్ధత వల్లనే మనుషుల పట్ల అంతటి ప్రేమ  సాధ్యపడిందేమో అనిపిస్తుంది.

ప్రసాద్ గారూ,

2009 లో రచయిత్రుల సదస్సు ఒకటి పెడుతున్నామని అందరం కలిసి మాలో మేము సంభాషించుకుంటామని ఆ సదస్సుకి ఒక పేరు పెట్టడం కోసం ఆలోచిస్తున్నామని చెప్పినపుడు మీరు చటుక్కున ‘మనలో మనం’ అనండి బావుంటుంది. తుమ్మల వేణు గోపాలరావు గారి పుస్తకం పేరు అది అన్నారు. ఆ పేరు చాలా నచ్చింది మాకు. తర్వాత ‘మనలో మనం’ అన్న పేరుతో తాత్కాలికంగా రాష్ట్ర వ్యాప్త రచయిత్రుల వేదిక ఆవిర్భవించడం ఏడాది పాటు జరిపిన సభల అనంతరం నిర్మాణంతో కూడిన  ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ గా అది రూపాంతరం చెందడం జరిగింది. ఈ ప్రయాణంలో మీ భాగస్వామ్యం పరిమితం అయినప్పటికీ మనలోమనం అన్న పేరు మీ వల్ల కూడా ఒక అపురూప జ్ఞాపకంగా మిగిలింది  నాకు.

మిమ్మల్ని ఇలా ఈ ఇరుకైన వ్యక్తిగత పరిధి లోకి లాక్కొచ్చి మాట్లాడటం క్షంతవ్యం కాని నేరమంటారేమో మీ సహచరులు.  ఏం చేయను సీపీ మీరు లేని లోకంలో ఒకటే తత్తరపాటుగా ఉంది. నాలుగు రోజులన్నా పట్టదా సర్దుకోవడానికి! హడావిడిగా దుఃఖాన్ని దులిపేసుకుని కార్యోన్ముఖులు కావడం మంచిదే కానీ ఈ దుఃఖం, ఈ ఖాళీ ఎప్పటికీ తీరేది కాదు కనుక హృదయంలో దానికొక అర నిచ్చి అక్కడ దాపెట్టాలి. అదే పనిలో ఉన్నా. తిరిగిరాని జవాబు కోసం ఎదురు చూస్తూ –

మీ

మల్లిగాడు

16/08/2015

3 thoughts on “విప్లవ కలల నేతగాడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s