నానీ ని విందాం రండి

 

బ్లాగర్ పేరు  ;రాధిక (నాని) .అసలుపేరు  రాధిక పిన్నమనేని ,ముద్దుపేరు నాని.

బ్లాగులు   ;  సత్యప్రియ ,చిత్తరువు

బ్లాగుల చిరునామాలు   ;  http://saisatyapriya.blogspot.in/
                
                                    http://palleturipaduchu.blogspot.in/
          
పుట్టిన తేదీ  ; సెప్టెంబర్ 15

పుట్టిన స్థలం ; గాంధీనగరం ,పశ్చిమ గోదావరి జిల్లా

ప్రస్తుత నివాసం   ; గాంధీనగరం

 విద్యాభ్యాసం  ;  డిగ్రీ  .లాసెట్ లో మంచి రాంక్ వచ్చినా చేరలేదు . ఎందుకు చదవలేదు ? చదివి ఉంటే లాయర్  అయ్యేదానివి.మా అమ్మ “లాయర్” అని మేము చెప్పుకునేవాళ్ళము అని పిల్లలు అస్తమాను అంటూ ఉంటారు .నాన్నగారితో కూడా ఎందుకు చదివించలేదని? పోట్లాడుతారు 🙂

 వృత్తి ,వ్యాపకాలు;  పల్లెటూరి గృహిణి .కుట్లు ,అల్లికలు ,ఫాబ్రిక్ పెయింటింగ్ ,పుస్తకాలు ,సంగీతం ,తోటపని ,ఫోటోలు తీయడం ,కోన్ తో  మెహంది పెట్టడం ఇవన్నీకూడా చిన్నప్పటినుండీ   ఇష్టమైన వ్యాపకాలు .వాటితో పాటు ఈ ఐదేళ్ళ నుండి బ్లాగ్ రాయడం   నా వ్యాపకాలలో ఎంతో ముఖ్యమైనదైపోయింది ..

 బ్లాగ్ మొదలుపెట్టిన తేదీ ; ఆగస్ట్ 25 ,2009

 బ్లాగ్ మొత్తం పోస్ట్ లు  ;  సత్యప్రియ   –       172
                      
                                     చిత్తరువు    –        117

బ్లాగ్ లో కేటగిరీలు  ;  మా ఊరి విషయాలు,హాబీలు ,వ్యవసాయం ,మా కబుర్లు ,అవి ఇవి ,శుభాకాంక్షలు,సీరియళ్ళు  వగైరా ..వగైరా ..

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు?

బ్లాగులు  తెలుగులో కూడా రాయొచ్చని ఈనాడులో రాసిన  ఆర్టికల్  చదివాక   బ్లాగుల పై ఆసక్తి కలిగింది. 2008 చివరలో   మా ఊరుకి   బ్రాడ్ బాండ్  కనెక్షన్ వచ్చాక  అప్పటి వరకూ పోస్ట్ పైడ్ లో నెట్ వాడే మేమూ  బ్రాడ్ బాండ్ కనెక్షన్ తీసుకున్నాం.మొదట్లో సరదాగా అందరూ రాసే బ్లాగులు చదివేదానిని .తరువాత  నాకూ రాయాలనిపించింది .

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు ?

బ్లాగ్  మొదలు పెట్టేక మొదటి  పోస్ట్లో ఐతే  ఎమీ రాయలేదు .నేనూ బ్లాగ్ రాస్తున్నా అని రాసానంతే 🙂 మొదటి రెండు మూడు పోస్టుల్లో   ఏమి రాయాలో తెలియక  ఏవో పుస్తకాల్లోవి చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేదానిని ..అవిఎవరైనా పుస్తకాల్లో చదివేవే కదా అని  అలా అలా  నే రాసే పద్దతి మార్చుకున్నా .

మొదట్లో ఇలా పోస్ట్ రాయగానే అలా కామెంట్ల కోసం చూసేదానిని .నేను చదివిన బ్లాగుల్లో కామెంట్లు చూసి చూసి నాబ్లాగు లో కూడా  అలా రాసేస్తారు అనుకున్నా 🙂 ఒక్క కామెంట్ వచ్చినా ఎంతో సంబరంగా అనిపించేది .తరువాత తరువాత చాలామంది  తమ తమ కామెంట్ల తో నన్నెంతో ప్రోత్సాహించారు.ప్రోత్సాహిస్తున్నారు .
బ్లాగ్ చాలా మంచి అనుభవమే .ఇలా బ్లాగ్  రాయడం వలనే కదా ఎక్కడో పల్లెటూర్లో ఉండే నేను చక్కని  స్నేహితులను సంపాదించుకున్నాను . ఎంతో  ఆనందంగా అనిపిస్తుంది.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు ?

సానుకూల అంశాలూ ……. మనం ఏమైనా మనకు నచ్చినవి ,చూసినవి రాసుకోవచ్చు.అభిప్రాయాలు వెంటనే తెలుసుకోవచ్చు . ఇలా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు  . బ్లాగ్ వలనే కదా నేనూ రాయగలను,నా రాతలు కొద్దిమందైనా చదువుతారు అనితెలిసింది .కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి …ఏర్పడుతున్నాయి .తెలియనివి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను.

పరిమితులు … మన బ్లాగ్ మనిష్టం ఏమైనా రాయొచ్చు ,అననుకోకుండా   ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనుకుంటాను.

 మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత ?

ప్రత్యేకత ఉందని  ఏమీ అనుకోను.పల్లెటూరులో ఉండే నేను కూడా ఓ బ్లాగర్ ని ,నేనూ రాస్తాను ,రాయగలను అది చాలు నాకు.

సాహిత్యం తో మీ పరిచయం ?

సాహిత్యం ! ఇంత పెద్ద పదాలు వద్దులెండి . కానీ నాకు చిన్నప్పటినుండి చదవడం చాలా ఇష్టం .మా ఇంట్లో అందరూ బాగా  చదువుతారు.

మా ఊరు చాలా చిన్నది కావడంతో ఉళ్లో మా తాతయ్యల ఇళ్ళు,అత్తయ్య ఇళ్ళు అన్నిదగ్గర దగ్గరగా ఉంటాయి .మా చిన్నప్పుడు 80లు 90ల టైంలో విక్లీ ల్లో సీరియళ్ళు బాగా వచ్చేవి.ఆ సీరియళ్ళ కోసమే  జ్యోతి,ప్రభ,పత్రిక ,భూమి ఇలా అందరూ తలో పత్రికా కట్టేవారు .ఇంకా  పిల్లల కోసం బాల జ్యోతి ,చందమామ వచ్చేవి.ఆ పుస్తకాలు  ఆ ఇంటికీ ,ఈ ఇంటికీ తిప్పడం మా పిల్లల వంతనమాట .అలా తీసుకెల్తూ   చదవడం కుడా అలవాటు చేసుకున్నాం. సీరియళ్ళు ఉండే  పేజీలు జాగ్రత్తగా  అమ్మా వాళ్ళు బైండింగ్ లు కూడా చేయించారు.ఇప్పటికీ ఉన్నాయవి. అలా చేసిన బైండింగ్ పుస్తకాల్లో  యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల ఒకటి . చాలా చాలా ఇష్టమైన నవల .చాలా సార్లు చదివాను.ఇంకా చంటబ్బాయ్ ,రెండురెళ్ళారు ,డబ్బు డబ్బు డబ్బు ఇలా చాలా ఉన్నాయి ఇప్పటికీ .

మా అమ్మమ్మగారిది పెద్ద ఉమ్మడి కుటుంబం.మా బుల్లెమ్మమ్మ (మూడో అమ్మమ్మ) దగ్గర చాలా నవల్స్  ఉండేవి. పదో తరగతి సెలవల్లో అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు  నవల్స్ చదవడం అలవాటైంది .ఆ సెలవల్లో యండమూరి,యద్దనపూడి ,అరికపుడి కౌసల్యాదేవి,కొమ్మనాపల్లి  ఇంకా చాలా మంది నవలలు చదివేను .ఆర్ సంధ్యా దేవి నవలలు కూడా వదల్లేదు .అవి చదువుతుంటే అమ్మమ్మ అస్తమానూ నవలలే అని ,చిన్న పిల్లలు నవలలు చదవకూడదని తిట్టేది .ఆవిడ వస్తుంటే  తలగడ కింద దాచేసేదానిని 🙂 ఇప్పటికీ  నవల ఏదైనా చదువుతున్నప్పుడు  ఎవరైనా వస్తే  ఫ్రీగా ఉండదు.

ఇప్పుడు బ్లాగ్ వలన మంచి మంచి పుస్తకాల గురించి తెలుస్తుంది .కుదిరినప్పుడల్లా వాటిల్లో ఒక్కో పుస్తకం కొని చదువుతున్నా .

స్త్రీ గా రాయడం వలన మీకు ఇబ్బందులు  ఏవైనా ఎదురయ్యాయా?

ఎప్పుడో  బ్లాగ్ రాయడం మొదలెట్టిన కొత్తల్లో ఒకటి రెండు కామెంట్ల వలన కాస్త ఇబ్బందిగా అనిపించింది  కానీ  ఇప్పుడేమీ లేదు.

జీవన నేపధ్యం?

నాన్నగారిది వ్యవసాయ  ఉమ్మడి కుటుంబం .నాన్నగారు పియుసి  చదివి వ్యవసాయంలోకొచ్చేసేరు. అమ్మ ఇంటర్ మొదటిసంవత్సరం మాత్రమే చదివింది.ఇద్దరూ పుస్తకాలు బాగా చదువుతారు .నాన్నగారు మా చిన్నప్పుడు కొత్త సినిమా పాటలు ఏవి రిలీజైనా ఆ కాసెట్లు ,అలాగే అన్నమయ్య సంకీర్తనలు, ఎం ఎస్ సుబ్బలక్ష్మి కీర్తనల కేసెట్లు చాలా శ్రద్దగా రికార్డు చేయించి తెచ్చేవారు. కాస్తో  కూస్తో సంగీతాభిరుచి మాఅక్కాచెల్లెళ్ళకుందంటే అది అమ్మా ,నాన్నగారి వలనే .

పెళ్ళయ్యాక  ఆ ఉమ్మడి కుటుంబం నుండి ఇంకో ఉమ్మడి కుటుంబమైన మా అత్తయ్యగాంటికి వెళ్ళాను.అదీ మా ఊరిలోనే ..ఒకే వీధిలో 🙂 మా బావ BBM చదివి హైదరాబాదు లో రెండేళ్ళు ఉద్యోగం చేసి ఆ పట్నం  పొల్యుషన్  తట్టుకోలేక  వ్యవసాయం  అంత ఉత్తమం లేదని వచ్చేసేరు .తనకి కంప్యూటర్  అంటే చాలా ఇష్టమవడంతో మా అమ్మాయి పుట్టగానే కొన్నారు.అంటే ఆయన ఇష్టం వలన నేనిలా మీముందున్నానన్నమాట:)

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

నాకు రాయాలనిపించినన్ని  రోజులూ ….. రాయగలిగినన్ని రోజులూ ….

సరదాగా ఏమైనా చెప్పండి?

సరదాగా అంటే!….నేను  బ్లాగ్ రాయడం మొదలుపెట్టినప్పుడు  ,గూగులమ్మ  చెప్పినట్టు అన్నీ ఫాలో అయిపోయి  బ్లాగ్ ఓపెన్ చేసేసా  ..పైన  చెప్పేగా అలా పోస్ట్ రాసేసి పోస్ట్ చేసా. రెండు మూడు   రోజులు అస్తమానూ కూడలిలో కి వచ్చిందేమో అని  దాన్ని   ఓపెన్ చేసి చూడటమే .దాన్ట్లో  ఎక్కడా నా బ్లాగ్ కనపడకపోతే నా బ్లాగ్  ఏమన్నా తేడాగా ఉందేమో అందుకే రాలేదేమో అని మళ్ళి  ఇంకో బ్లాగ్ అలా ఓ పది  బ్లాగ్లు ఓపెన్ చేసేసా …నా ఇష్టమొచ్చిన పేర్లతో .ఆఖరిగా మా అమ్మాయి పేరు తో సత్యప్రియ   ఓపెన్ చేసాక    ఎవరి బ్లాగ్ లోనో చూసాను  కూడలి లో కనపడాలంటే దానికి మెయిల్ చేయాలని .ఇదా సంగతి! అనుకుని మెయిల్ చేసా .  కూడలికి లంకె వేయండి అంటే కాసేపు అర్ధమవలేదు .రంకె వేయడంలా లంకె  వేయడమేంటో   అనుకున్నా 🙂

సీరియస్ గా ఏవన్నా చెప్పండి?

నేనంత సీరియస్ విషయాలు చెప్పలేనండి

28 thoughts on “నానీ ని విందాం రండి

 1. రాధిక గారూ
  మీ పోస్ట్స్ లో రాసే విషయాలు,
  మాంత్రికుడి దుర్భిణీ యంత్రం లాంటి మీ కెమెరా కన్ను నుంచి జాల్వారే చిత్రాలు చూసాక అనుకోని అతిధిలాగా అయినా మీ వూరు వచ్చేయాలని ఉంది
  అభినందనలు

 2. రాధిక గారి బ్లాగులో ఫోటోలు చూసి, వారు వ్రాసే కబుర్లు చదివి ఆదర్శవంతమైన పల్లెటూరు గాంధి నగరం చూడాలనిపిస్తుంది. పల్లెలో జీవితం గడపాలనే నిర్ణయిం తీసుకున్న దంపతులిద్దరికీ అభినందనలు.

 3. రాధికగారూ, మీ సత్యప్రియ బ్లాగు చాలా బాగుంటుందండీ! చేదుబీరకాయలూ, తాటి ముంజలూ, కొబ్బరి పీచు బొమ్మలూ, కొబ్బరి చెట్టును కావలించుకుని పైపైకెక్కే ఉడుతలూ, సూర్యోదయలూ సూర్యాస్తమయాలూ…కెమెరా కళ్ళలో చాలా ఒడుపుగా బంధించేస్తారు మీరు. గోదారి స్వచ్ఛతంతా పట్టిచ్చిన ఈ కబుర్లకి..మీకూ మలీశ్వరి గారికీ కృతజ్ఞతలు.

 4. రాధిక గారు,
  మీ బ్లాగ్ నేను రెగులర్గా చదువుతానండి .ముఖ్యం గా చిత్తరువు తప్పకుండా చూస్తాను. మీ అంత బాగా ఫొటోలు తీయటం ఎప్పుడు నేర్చుకుంటానో అనుకుంటాను ఎప్పుడూ .

  మీ గురించి బాగా చెప్పారు.

 5. రాధిక గారు, మీ కబుర్లన్నీ కూడా మీ పక్కనే పొలంలోనో, తెల్లవారు ఝామున చెరువు గట్టంబడి వెల్తూనో, మీ పెరట్లో చెట్ట్లు, పూలు, పక్షుల మధ్యనో,మీ పండగల్లో సంబరాల్లో నేను కూడా మీ ఊళ్ళో తిరుగుతున్నట్లుగానో, మీ లోగిలిలో మీ ముగ్గులు చూసుకుంటూ గోడకానుకుని మీ పక్కనే కూచుని చేయి చేయి పట్టుకుని వింటున్నట్లే ఉంటుంది.

  చక్కని ఇంటర్వ్యూ.మీ కబుర్ల కోసం ఇంకా ఇంకా ఎదురుచూస్తూనే ఉంటాను.

  జాజి మల్లి గారూ ఇంత చక్కని నానీలు వినిపించినందుకు థాంక్యూ.

 6. మీ ముఖాముఖి కూడా మీ బ్లాగ్ లాగే స్వచ్చంగా ఆహ్లాదంగా ఉందండీ రాధిక గారు… నాకు చాలా ఇష్టమైన బ్లాగ్ మరియూ బ్లాగర్ గురించి మరికొంత తెలుసుకునే ఆవకాశం కలిగించినందుకు థాంక్స్ జాజిమల్లి గారు. రాధిక గారి బ్లాగ్ అమ్మ పాటలా అందంగా ఉంటుంది. నాక్కూడా మీకనిపించినట్లే ఒక్కసారైనా వాళ్ళ ఊరు చూడాలని అనిపిస్తుంటుంది. అఫ్ కోర్స్ ఫోటోల్లో ఇప్పటికే చాలావరకూ చూపించేశారనుకోండి 🙂

 7. రాధిక గారు చూడబోతే మనిద్దరి జివితాలకి చాలా పోలికలున్నాయ్ . మనం ఒకే కొమ్మ పిట్టలం అన్నమాట.
  ఇద్దరం పక్క పక్క క్లాసుల్లో కూర్చొని చదువుకున్నా అక్కడ కలగని పరిచయం ఇక్కడ కలగడం ఎంత ఆశ్చర్యమో కదా!
  మీరు బ్లాగులో పెట్టే ఫొటోలు చాలా బావుంటాయి .

 8. రాధిక గారూ, మీ బ్లాగు, ఆ ఫోటోలు, మీరు వ్రాసే పద్ధతి అన్నీ నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెస్తుంటుంది.
  ఈ మాట చూడండి.
  “రంకె వేయడంలా లంకె వేయడమేంటో?”
  భలే ఉంది. ఇంకా వ్రాయండి.

 9. రాధికగారి ఇంటర్వ్యూ వారి స్వచ్చమైన మాటల్లో ఆద్యంతం చదివించింది. పల్లెటూళ్లు పచ్చని ప్రకృతికి, స్వచ్చమైన మనుషులకి చిరునామాలే కదా.. రాధికగారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనిపించేలా ఉంటుంది వారి బ్లాగు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s