బ్లాగ్లోకపు అక్కయ్య…

   
 
 
jyothi         
 
 
 
    బ్లాగర్ పేరు;  జ్యోతి వలబోజు

బ్లాగ్ పేరు; ఎన్నని చెప్పను? ఇక్కడికి వెళితే మిగతావాటికి దారి కనిపిస్తుంది.. జ్యోతి

బ్లాగ్ చిరునామా; http://jyothivalaboju.blogspot.com

పుట్టిన తేదీ;  22nd December

పుట్టిన స్థలం; హైదరాబాదు

ప్రస్తుత నివాసం; పుట్టింది, పెరిగింది, మెట్టింది. చివరకు గిట్టాలని ఉన్నది ఇదే హైదరాబాదు..

చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)  సారీ

విద్యాభ్యాసం; B.com 2nd yr. మూడో సంవత్సరంలో సగం సబ్జెక్స్ రెండేళ్ల క్రింద రాసి పాసయ్యా. మిగతావి ఎప్పుడవుతాయో, అసలు అవుతాయో లేదో కూడా తెలీదు…

వృత్తి, వ్యాపకాలు; బ్లాగుల్లోకి వచ్చేవరకు నాకు వృత్తి అంటూ ఏమీ లేదు. సాధారణ గృహిణిని. నాకు ఇష్టమైన విషయాలను, వ్యాపకాలను బ్లాగుల్లా మార్చుకున్నా.. వంట, కుట్టుపని, పాటలు, భక్తి వగైరా..

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; సెప్టెంబర్ 14 2006

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);  మెయిన్ బ్లాగులో 950 (పాత బ్లాగ్ + కొత్త బ్లాగ్ ) అన్ని బ్లాగులు కలిపి 2500 పైనే ఉన్నాయి..

బ్లాగ్ లోని కేటగిరీలు: నా మనోభావాలు, సరదా, సాహిత్యం, సినిమా , పత్రికా ప్రచురణలు, శుభాకాంక్షలు. వంటలు, వగైరా …

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

 
నేను నెట్ పరిచయం చేసుకున్న ఆరునెలలకు  తెలుగు బ్లాగు గుంపు ద్వారా బ్లాగు గురించి తెలిసింది. అప్పటికి యాభై కంటే తక్కువ బ్లాగులు ఉన్నాయి. లేఖిని కూడా అప్పుడే ప్రారంభమైంది. బ్లాగు గ్రూపులో సరదాగా పోస్టులు పెడుతుంటే నాకంటూ బ్లాగు మొదలెట్టి అందులో నా రాతలన్ని పెడితే అందరం వచ్చి చదివి కామెంటుతాం అని మొదలెట్టించారు. అలా ఒక్కటొక్కటిగా నేర్చుకుంటూ నెల రోజుల్లోనే నాకు ఇష్టమైన వంటలను షడ్రుచులు పేరుతో బ్లాగు మొదలెట్టి రాయడం  ప్రారంభించాను. ఇలా నేర్చుకుంటున్నప్పుడే బ్లాగును మాధ్యమంగా కాకుండా నా అభిరుచులను విడివిడిగా నిక్షిప్తం చేయవచ్చు అనుకున్నాను. అలాగే చేసుకున్నాను కూడా..తర్వాత్తర్వాత జరిగిన పరిణామాల ప్రభావంతో బ్లాగును ఒక మాధ్యమంగా గుర్తించాను కాని నా బ్లాగులోని రచనలు ఎక్కువగా నాకోసమే రాసుకున్నవి అని చెప్పవచ్చు.
 

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

 

  అసలు నాకు రాయడం అలవాటు లేదు. నేను చదువుకున్నప్పుడు, పిల్లలకు చదివించినప్పుడే రాయడం. వార పత్రికలు, నవలలు చదవడం చాలా ఇష్టం. కాని ఎప్పుడు రాయాలి, రాయగలను అనుకోలేదు. బ్లాగు గుంపులో కూడా  తెలుగులో టైపింగ్ గురింఛి తెలుసుకుని నా ఆలోచనలకు అక్షర రూపమివ్వసాగాను. అది ఒక వ్యసనంలా ఇప్పటికీ నన్ను వదలడం లేదు. అసలు చెప్పాలంటే ఈ తెలుగు బ్లాగులవల్ల నాకంటే ఎక్కువ లాభం పొందినవారు లేరేమో. సరదాగా మొదలెట్టిన బ్లాగుల  నాలో ఆలోచనా సరళి, విశ్లేషణా శక్తిని పెంచాయి.  నా రాతలను మంచి రచనలుగా మార్చుకోవడానికి బ్లాగుమిత్రుల ప్రోత్సాహం కూడా తోడ్పడింది. అదే నన్ను ఈనాడు ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా నిలబెట్టింది..

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

 

మొదట్లోకంటే ఇప్పుడే సాంకేతికంగా తెలుగు రాయడం, బ్లాగు నిర్వహణ మొదలైనవి చాలా సులువుగా మారాయి. బ్లాగింగ్ వల్ల మన రచనలు, ఆలోచనలు పంచుకుని చదువరుల స్పందన ద్వారా వాటిలోని లోటుపాట్లు కూడా తెలుసుకుని మెరుగు పరుచుకోవచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరి బ్లాగు వాళ్ల సొంతం. ఏదైనా రాసుకోవచ్చు కాని  ఇది మనవరకే ఉంచుకోకుండా పదిమంది కాదుగాని వేలమందితో పంచుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషాలకు, దూషణలకు చోటివ్వకూడదు. ఒకరిని నొప్పించని రాతలు ఎన్నైనా రాసుకోవచ్చు. ఆలోచింప చేయవచ్చు. చర్చించవచ్చు. ఈ అవకాశం బ్లాగు ద్వారా కలుగుతుంది.

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

 

  Hmmm.. జ్యోతక్క అని గౌరవంగా, ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పిలుపుకంటే వేరే ఏమీ లేదు.. ఉంది అంటే నా బ్లాగులు చదివేవాళ్లే చెప్పాలి.

ఈ బ్లాగ్లోకానికి నేను ఏమిచ్చానో లేదో కాని మట్టి ముద్దలా ఉన్న నన్ను ఒక మూర్తిలా మార్చింది. నన్ను మొదటినుండి ఎరిగినవారికి ఈ విషయం తెలుసు.. ఇల్లు, భర్త, పిల్లలు , టీవి, కుట్లు, అల్లికలు తప్ప వేరే ప్రపంచమే తెలీని సాధారణ గృహిణిని ఐన  నాకు  ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఇచ్చింది తెలుగు బ్లాగులే.. దీని మూలంగానే వివిధ పత్రికలవాళ్లు కూడా నన్ను గుర్తించి. ప్రోత్సహించారు. నా ఈ ప్రస్ధానం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, కాలమ్నిస్టుగా నిలబెట్టింది. ఇంకా నేనేం చేస్తానో, ఎటువంటి అవకాశాలు వస్తాయో నాకు తెలీదు. కాని నా విజయాలకు పునాది మాత్రం తెలుగు బ్లాగ్లోకమే. ఈ క్రమంలో కొందరు బ్లాగ్మిత్రులు నాకు అడుగడుగునా సాయం చేసి ప్రోత్సహించారు, గౌరవించారు. సంతోషం, విజయాలలోనే కాదు  బ్లాగుల్లో జరిగిన గొడవల్లో కూడా నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పారు. వారికి  నేనెప్పుడు బుుణపడి ఉంటాను.

సాహిత్యంతో మీ పరిచయం?

 

నాకు చిన్నప్పటినుండి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇంటర్, డిగ్రీలో కూడా తెలుగునే సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా. అమ్మ మూలంగా చందమామ, వారపత్రికలు, నవలలు చదవడం మొదలైంది. కాని అసలు సాహిత్యం, పద్యరచన మొదలైన విషయాలు బ్లాగులకు వచ్చాక తెలిసింది. కొందరు పండితులైనవారు  పరిచయమై నా సందేహాలను తీర్చి నాకు అన్నివిధాల సహాయం చేసారు. దాని మూలంగానే ఆముక్తమాల్యద, విజయవిలాసం బ్లాగులను ప్రారంభించాను. మంచి సాహిత్యం అంటే ఏమిటి? ఎలాటి పుస్తకాలు చదవాలి? ఏయే పుస్తకాలు చదవాలి అని మిత్రులు చెప్పేవారు.  అలా నా సాహితీ తృష్ణ పెరుగుతూ వచ్చింది. సమయం ఉండాలి కాని నేర్చుకోవడానికి అంతు అన్నదే లేదు.. నేను నిత్య విద్యార్ధినే అనుకుంటాను.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

 

మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయిలెండి. నా తప్పో. అవతలి వాళ్ల తప్పో తెలీదు కాని  గతం గతః  అనుకుని  ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. నా రాతలతో ఎవరినీ మార్చలేను. మార్చాలనే ఉద్ధేశ్యం కూడా లేదు. అందుకే ఎవరేమన్నా వదిలేస్తున్నాను. నేను రాసేవన్ని  పత్రికలకే కాబట్టి బ్లాగు కూడా ఎక్కువ అప్డేట్ చేయడంలేదు. అసలు తెలుగు బ్లాగులోకంలో ఏం జరుగుతుందో కూడా తెలీడం లేదు.

జీవన నేపధ్యం?

 మధ్యతరగతి ఇల్లాలిని. పిల్లల పిజి చదువులకు నెట్ పరిచయం చేసుకున్నాను. తర్వాత నాలో అంతర్గతంగా ఉన్న రచనాభిలాషను పెంపొందించుకుంటూ వస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్లైపోయారు. నా అవసరం అంతగా లేదు కాబట్టి. మావారు, పిల్లల ప్రోత్సాహంతో నాకంటూ ఒక ప్రపంచం సృష్టించుకుని అందులో హాయిగా ఉన్నాను. నా మనసులోని ఆలోచనలను రచనలుగా రూపొందిస్తున్నాను..ఆంద్రభూమి దినపత్రికలో ప్రతీ ఆదివారం వంటల కాలమ్, మధ్య మధ్య వ్యాసాలు.. మాలిక పత్రికకు కంటెంట్ హెడ్ గా  బిజి బిజి ఐపోయాను.

 

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

ఇప్పటికే పత్రికకు రాయడం వల్ల బ్లాగింగ్ తగ్గింది. ఇక ఎన్నాళ్లు కొనసాగిస్తానో నాకు తెలీదు. నేను నెట్ వాడుతున్నంతకాలం బ్లాగింగ్ కొనసాగిస్తాను అనుకుంటున్నాను.అసలైతే నాకున్న ఆస్ధిపాస్తులతో పాటు నా బ్లాగులన్నింటిని నా ఆస్ధిగానే భావిస్తున్నాను. నాకేమైనా ఐతే నా బ్లాగులు ఎవరు చూసుకుంటారు. ఎవరికి అప్పజెప్పాలనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే  నా బ్లాగులన్ని నా అంతరంగంలోని ఆలోచనలు, ఇష్టాలు కాబట్టి అలా వదిలేయలేను కదా..

సాహితీ సంబంధ మైన బ్లాగర్ గానే కాక ఇంకా పలు అంశాలపై ఆసక్తి కరమైన పోస్టులు రాస్తున్నారు కదా..ముఖ్యంగా వంటల పోస్టులు ఘుమఘుమలాడుతూ ఉంటాయి…పాకశాస్త్రం లో మీ అభిరుచులు చెప్పండి…

 
మీరు నమ్ముతారో లేదో  పెళ్లికాకముందు నాకు వంట అస్సలు రాదు.  పెళ్లయ్యాక ఓకసారి మా తోటికోడలు ఉప్మా చేయమంటే రాదని చెప్పా.ఆవిడ ఒకటే నవ్వు. (అమ్మ చేసిపెడితే తిని కాలేజి కెళ్లి చదువుకోవడం అలవాటు మరి )తర్వాత అన్నీ చూపించింది.. అలా ఒక్కటొక్కటి నేర్చుకుంటూ ఉండేదాన్ని..మీరు తెలుసా పెళ్లయిన పదిహేనేళ్ల వరకు నాకు గుండ్రంగా, మెత్తని చపాతీలు చేయడం రాదు.. బ్లాగుల్లోకొచ్చాక తెలుగు రాయడం ఇంత ఈజీ అని తెలిసాక నెలరోజుల్లోనే షడ్రుచులు అనే బ్లాగు మొదలెట్టాను. అఫ్పటికి నాకు వంటలు చేయడం తెలిసినా ఇంట్లో కెమెరా లేదు కాబట్టి నేను చేసినవి ఫోటోలు తీయలేను. నెట్ లో కూడా
వంటల ఫోటోలు ఉంటాయని తెలిసి ఎంత ఆశ్చర్యపోయానో? ఒక అబ్బాయి ఆ పోటోలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, సేవ్ చేసుకోవాలో నేర్పించాడు.కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు  బ్లాగు రోజూ రాస్తుండేదాన్ని. తర్వాత ఇంకో అబ్బాయి (తర్వాత అల్లుడయ్యాడు) నన్ను వెబ్ సైట్ మొదలెట్టమని ప్రోత్సహిస్తే సరేదాని సంగతి చూద్దామని మొదలెట్టా. అప్పటికి ఓ బుల్లి కెమరా కొనుక్కుని సొంతంగా ఫోటోలు తీసి రాయడం మొదలెట్టా.
ఒకవైపు రాతలు, మరోవైపు వంటలు.. ఇష్టంగా చేస్తున్నప్పుడు ఆంధ్రభూమిలో అవకాశం వచ్చింది. ప్రతీవారం దాదాపు తొమ్మిది వంటలు చేయాలి.మరి దీనికోసం నా అన్వేషణ రెట్టింపు అయింది. దీనికి అంతర్జాలంలో కొన్ని వంటల బ్లాగులు, ఫేస్ బుక్ లో గ్రూపులు నాకు ఎంతో సహాయపడ్డాయి.నేను ఎక్కువగా ఆరోగ్యపరమైన వంటకాలు ఇష్టపడతాను.కొంచెం బద్ధకం కూడా అనుకోవచ్చు..  అందుకే వెన్న,చీజ్, సాస్ లు, వేపుళ్లు కాకుండా చాలా తక్కువ దినుసులతో,తక్కువ సమయంలో చేసుకోగలిగే వంటకాలనే చేస్తాను. రాస్తాను. ముఖ్యంగా నా పిల్లలు, వాళ్ల తోటి  పిల్లలను , అమ్మకు దూరంగా ఉన్నవారిని
కేంద్రీకరించుకుని నా వంటలను సెలెక్ట్ చేసుకుంటాను.అందుకే  ఒక వంట చేస్తుంటే నాకు ఇంకో వంట ఇలా చేయొచ్చే అని కొత్త ఐడియా వస్తుంది.. 🙂 
 
 
నిత్యచైతన్యానికి చిరునామాగా ఉండడం మీకు  ఎలా సాధ్యమైంది?
 
 
hmmm.. అదేంటోగాని నాకు మొదటినుండి ఇలా పని చేయడం, చేస్తూనే ఉండడం అలవాటు.బహుశా మా అమ్మానాన్నలనుంఢి వచ్చిన గుణమేమో. ఆరేళ్ల క్రింద అంతర్జాలానికి  వచ్చాను కదా.
ఒక్కొక్కటి నేర్చుకుంటుంటే ఆ అభిలాష ఇంకా ఇంకా తెలుసుకోమంటూ పెరుగుతూ వచ్చింది.అంతవరకు నాలో ఉన్న సందేహాలన్నింటికి కాకున్నా చాలా వాటికి జాలం ద్వారా తెలుసుకోవచ్చు అనే ఉత్సాహం  నన్ను  పరుగులెత్తించింది.బ్లాగు మిత్రులు కూడా నేను అడిగినవన్నీ చెప్పేవారు. నేను నమ్మేది, పాటించేది ఒక్కటే. ప్రతీ బంధం, అనుబంధంలో స్నేహం చాలా ముఖ్యం.
స్నేహంగా ఉంటే ఎటువంటి పొరపచ్చాలు, గొడవలు రావు. అందుకే నా పిల్లలు, భర్తతో కూడా ఒక ఫ్రెంఢ్ లా ఉంటాను.మావారు కూడా నన్ను మొదటినుంఢి తెలీదు అని ఎందుకనుకోవాలి. ప్రతీదానికి ఒక దారి ఉంటుంది. కనుక్కో అనేవారు.అది ఇప్పటికి పాటిస్తున్నాను. పిల్లలు కూడా నన్ను  ఇఫ్పటికి ఒక స్నేహితురాలిగా చూస్తాను. ఇప్పటికి మేము ఫోన్ కంటే ఆన్లైన్ లో ఎక్కువ మాట్లాడుకుంటాం..
వాళ్లు ఆపీసుల్లో, నేను ఇంట్లో. నేను చెప్పేది ఒక్కటే మనమీద మనకు నమ్మకముండాలి. ధైర్యం ఉండాలి. నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.సామాన్య వ్యక్తి కూడా అద్భుతమైన విజయాలు సాధించగలడు. ఇది అబద్ధం అన్నవారికి నేనే నిదర్శనం అంటాను..
 

 సరదాగా ఏవైనా చెప్పండి?

 

ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూసి భయపడకండి, ఖంగారు పడకండి. కోపం తెచ్చుకోకండి. జస్ట్ లైట్ తీసుకోండి.ఎవరైనా ఎక్కువ గొడవ చేస్తే  గో టూ హెల్ అనండి అంతే. చూడండి. ఎంత తేలిగ్గా ఉంటుందో..:) అలాగని జీవితాన్ని లైట్ తీసుకోకండి..

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

 ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. రేపటి ఉదయం చూస్తామో లేదో తెలీదు. మరి ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్నిఎవరినీ నొప్పించకుండా మీకు నచ్చినట్టుగా గడపండి…. చేయండి…

నచ్చిన పోస్ట్

http://jyothivalaboju.blogspot.in/2009/12/blog-post_22.html

24 thoughts on “బ్లాగ్లోకపు అక్కయ్య…

  1. ధన్యవాదాలు మల్లీశ్వరిగారు, చాలా కాలం తర్వాత నా బ్లాగు ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. నా గురించి అందరికి తెలిసిన విషయాలే ఐనా మీతో కాస్సేపు ముచ్చటించఢం బాగుంది..

    • జ్యోతి గారూ,
      ఓపికగా ముఖాముఖి ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు.మన ఎదుగుదలలో ఉండే కష్టనష్టాలు మనందరం కలిసి మాట్లాడుకోవడం బావుంది.

  2. బావుందండి మీ పయనం జ్యోతిగారూ. ఇక్కడకి వచ్చిన కొత్తల్లో ఏ చిన్న సందేహం వచ్చి ఎన్నిసార్లు అడిగినా విసుగనేది లేకుండా సలహా చెప్పేవారు.. మీలోని ఆ ‘సహనమే’ నాకు బాగా నచ్చేది.

  3. జ్యోతి గారు.. మీరు బ్లాగ్ లోకపు మహిళ లకి..ఎంతో స్ఫూర్తి. అంతకన్నా ఏం చెప్పినా తక్కువే! అభినందనలు.

    ఇంకా ఇంకా వ్రాస్తూ ఉండాలి అని కోరిక . వంటలు ఆపేసి సాహిత్యం గురించి బాగా పరిచయం చేయండి. ముందు తరం వారికి చాలా ఉపయోగపడతాయి.

    • వనజగారు ధాంక్స్ అండి. వంటలు ఆపడమా?? కష్టమండి. వాటిని కూడా సాహిత్యంలాగే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక సాహిత్యం ఎక్కువగా అంటే వ్యాసాలు రెగ్యులర్ గా రాస్తున్నాను. మీరు చూస్తున్నారుగా. కధలు మొదలెట్టడానికి ఇంకా ధైర్యం చాలడం లేదు..స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట.. చూద్దాం దాని సంగతి ఏమవుతుందో.

  4. ఈ టపా కి మేటరు జ్యోతి గారు నా టపా నించి కాపీ కొట్టినట్టున్నారు సుమీ!

    జేకే!

    శుభాకాంక్షలు జ్యోతీ గారు!

    వీరి మరో బ్లాగ్ముఖీయం చదవదలచు కుంటే లింకు ఇక్కడ నొక్క వలె!

    http://varudhini.blogspot.sg/2011/12/blog-post_21.html

    చీర్స్
    జిలేబి.

  5. జిలేబీగారు నిజమేనండి.. కాపీ కొట్టినట్టున్నా..మీరు ఆ పోస్ట్ చాలా కష్టపడి రాసారు నాకు తెలుసు.. లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజును మరుపురానిదిగా చేసి నన్ను నాకు మళ్లీ పరిచయం చేసాను కాని ఈసారి నాకు పుట్టినరోజునాడు శుభాకాంక్షలు చెప్పలేదెందుకని.??

    • కృష్ణప్రియగారు .

      అసలైతే బ్లాగులవల్లే నేను రాయగలను, ఆలోచించగలను, విశ్లేషించగలను అని నాకు తెలిసింది. లేకుంటే అందరు గృహిణులలా ఇల్లు, పిల్లలు, పూజలు, వంట , టీవీ సీరియళ్లు తప్ప వేరే లోకం తెలిసేది కాదు..

Leave a reply to జ్యోతి స్పందనను రద్దుచేయి