ఆ(హా).సౌమ్య బ్లాగు బాగు

  • బ్లాగర్ పేరు; ఆ. సౌమ్య
    బ్లాగ్ పేరు; మాయాశశిరేఖ
    బ్లాగ్ చిరునామా; http://vivaha-bhojanambu.blogspot.in/
    పుట్టిన తేదీ; 22, అక్టోబరు
    పుట్టిన స్థలం; విజయనగరం
    ప్రస్తుత నివాసం; ఢిల్లీ
    చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
    విద్యాభ్యాసం; Ph.D in Economics
    వృత్తి, వ్యాపకాలు; పరిశోధన నా వృతి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, బొమ్మలు వెయ్యడం, సినిమాలు చూడడం నా వ్యాపకాలు
    బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; 9, జనవరి 2010
    మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); 65
    బ్లాగ్ లోని కేటగిరీలు; అనుభవాలు-జ్ఞాపకాలు, పుస్తకాలు-సాహిత్యం, పాటలు-సాహిత్యం, నా విహారం=కళలు+ప్రకృతి, తేటతెలుగు, ‘వెటకారం’, సంగీతం, సంబరాలు, మా ఇజీనారం, సినిమా సినిమా, అభిప్రాయములు, బాధ-దుఃఖం, ఖజానా, చిత్రలేఖనం, నవతరంగం, చిత్రమాలిక, అవీ-ఇవీ.
     
    1.బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
     
    2009 లో హైదరాబాదు లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఢిల్లీ వచ్చి చేరాను. అప్పుడు నా పుస్తకాలన్నిటినీ మోసుకురావడం కుదరలేదు. నా పుస్తకాలను, సాహిత్యన్ని మిస్ అవుతానన్న భావన కలిగింది. అప్పుడే బ్లాగులతో పరిచయం అయ్యింది. బ్లాగు ద్వారా తెలుగు సాహిత్యానికి దగ్గరగా ఉండొచ్చు అని అర్థమయ్యింది. మొదట్లో ఆన్లైన్ పత్రికలు, సాహిత్య బ్లాగులు, సినిమా బ్లాగులు చదివేదాన్ని. క్రమక్రమంగా బ్లాగు ప్రపంచం ఎంత పెద్దదో బోధపడింది. దాదాపు ఏడాదిపాటు బ్లాగులు చదవడం మాత్రమే చేసేదాన్ని. తరువాత నాకు రాయాలని బుద్ధి పుట్టింది. రాయడం చిన్నప్పుడు బాగా అలవాటు, సరదా. బడిలో వ్యాసరచన పోటీలకు తరచూ వెళుతూ ఉండేదాన్ని. ఎక్కువసార్లు మొదటి బహుమతే వచ్చింది. తెలుగుపైనున్న మమకారం కూడా నాకు రాయడానికి తగిన ప్రోత్సాహం. నేనేదో గొప్ప గొప్ప వ్యాసాలు రాసేయాలని కాదు. నా అభిప్రాయాలు, అనుభవాలు, కబుర్లు పంచుకుందామని సరదా.  
     
    2.బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
     
    చాలా ఉన్నాయి. నేను చాలా నేర్చుకున్నాననే చెప్పొచ్చు. రెండేళ్లల్లో నా రచనావ్యాసంగం ఎదిగిందనే చెప్పొచ్చు. రాసే పద్ధతి, భావాలను ప్రకటించే పద్ధతి మెరుగుపడింది. ఇక వ్యక్తుల విషయానికొస్తే నా రాతలను విమర్శించేవాళ్ళు చాలామంది తయారయ్యారు. నేను నిర్భయంగా రాయడం కొందరికి కొరుకుడు పడలేదు. అప్పుడే నాకు అర్థమయ్యింది బ్లాగు ప్రపంచంలో మనస్తత్వాల పరిథి ఏమిటో!! కాస్త ఆశ్చర్యం కలిగింది. అయినా నా బ్లాగు నా ఇష్టం ధోరణే నాది. దీనివల్ల నాకు ఎంతో మంచి మిత్రులు దొరికారు. నన్ను, నా రాతలను ఇష్టపడి స్నేహం చేసుకున్న మంచిమిత్రులు నాకు బ్లాగు ఇచ్చిన వరాలు.
     
    3.బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
     
    నచ్చినది, తోచినది సులువుగా వ్యక్తపరుచుకేందుకు మార్గం బ్లాగు. ఒక పద్ధతి ఉండక్కర్లేదు. నచ్చినట్టు రాయొచ్చు. విమర్శలు, ప్రశంసలు వెంటనే అందుతాయి. చాలామంది పెద్ద పెద్ద రచయితలను దగ్గరగా చూసే అవకాశం ఉంది. వారి రచనలను ఫాలో అయ్యే అవకాశం మెండు. పరిమితులు అంటే మనం ఉన్నాయి అనుకుంటే ఉంటాయి. లేకపోతే లేదు. నిజానికి లేవు. ఎవరో ఏదో అంటారని భయపడి మనకి మనం గిరి గీసుకుంటే ఉంటాయి.
     
    4.మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
     
    మీరే చెప్పాలి. నేను నాలా ఉన్నాను. అది ప్రత్యేకం గా కనబడుతోందో లేదో మీరే చెప్పాలి 🙂 
     
    5.సాహిత్యంతో మీ పరిచయం?
     
    అబ్బో, ఈ నాటిదా!! చిరకాలం పరిచయం 🙂 అదే బ్లాగులోకి అడుగుపెట్టడానికి కారణం కూడా. పుస్తకాలు కొనడం నాకో అలవాటు. కొన్నవి తప్పకుండా చదవడం మరో అలవాటు.  నా బ్లాగులో “నేను, నా పుస్తకాల గోల” అన్న పోస్ట్ లో సాహిత్యం తో నా అనుబంధం గురించి రాసాను.
     
     
    6.స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
     
    అయ్యాయానే చెప్పాలి. బయట ప్రపంచానికి బ్లాగు ప్రపంచం ఒక సేంపిల్. అక్కడ ఉన్న వింత పోకడలన్నీ ఇక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా బ్లాగరులంటే చులకన. స్త్రీలు నిర్భయంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చితే తట్టుకోలేరు. ఒకవేళ ఏదైనా రాసినా సంప్రదాయాలకు కట్టుబడి రాయాలి. లేకపోతే అజ్ఞాతావతారాలెత్తి హింసించడం మొదలెడతారు. అలాంటివి ఎన్నో తట్టుకుని నిలబడ్డాను. నా బ్లాగు ని కొనసాగించాలా, వద్దా అన్నది నా నిర్ణయమే అవ్వాలి తప్ప వేరే ఏ విధమైన ప్రభావాలకు లోను కాకూడదు. ఒకవేళ నా చుట్టూ గిరి గీసుకోవాలంటే అది నేనే గీసుకుంటాను. వేరేవాళ్ళు గిరి గీస్తే చెరిపేస్తాను.
     
    7.జీవన నేపధ్యం?
     
    మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. సాహిత్య, సంగీతాభిరుచులున్న కుటుంబం. అందమైన మా విజయనగరం అంటే ప్రాణం. చిన్న ఊరే కానీ భావవైశాల్యంలో పెద్దది. మరి గురజాడ, చాసో, పతంజలి వంటి ప్రముఖులకు పుట్టినిల్లు కదా! 
     
    8.ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
     
    ఇంతకాలమని ఏమీ అనుకోలేదు. సరదా ఉన్నన్నాళ్ళు, సమయం వెచ్చించగలిగినన్నాళ్ళు రాస్తాను.
     
    9.సరదాగా ఏవైనా చెప్పండి?
     
    సరదాగానా…”భారతవీరకుమారిని నేనే, నారీరతనము నేనే, భారతనారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే!”…ఇదే నా బ్లాగు ప్రవర 🙂
     
    10.సీరియస్ గా ఏవైనా చెప్పండి?
     
    బ్లాగు ప్రపంచంలో ఉన్న కుంచితత్వం పోవాలి. అప్పుడే మహిళా బ్లాగర్లు ఇంకా స్వతంత్ర్యంగా రాయగలుగుతారు. మట్టిలో మాణిక్యాలు వెలికివస్తాయి. ఆడ, మగ ఎవరికైనాసరే ఇష్టానుసారం రాసుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి. విమర్శలు ఎప్పుడూ సమ్మతమే హద్దు మీరనంతవరకూ. 
     
    మహిళా బ్లాగర్లకు ఒక మాట: మీ బ్లాగు, మీ రచన మీ స్వంతం. ఎవరో ఏదో అన్నారని భయపడి బ్లాగు మూసేసుకోవద్దు. కారుకూతలను పట్టించుకోకండి. ఒకరు అసభ్యంగా మాట్లాడితే తరిగిపోయేది కాదు మీ వ్యక్తిత్వం. ఎదిరించి నిలబడండి. పోరాడితే పోయేదేమీ లేదు కాస్త టైము తప్ప. మీకిష్టమైన మీ బ్లాగు మిగులుతుంది.
     
    @ మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,
     
    నా బ్లాగులో నాకన్నీఇష్టమైనవే. బాగా ఇష్టమైనవాటిల్లో ఇది ఒకటి.
     
    రాధనురా నీ రాధనురా!
    నిన్న మధురవాణి బ్లాగులో రాసిన కృష్ణా! నేను…నీ రాధని! అన్న టపా చూసాక నాకు పింగళి వారు రాసిన “రాధనురా నీ రాధనురా” అన్న పాట గుర్తొచ్చింది. ఇది పెళ్ళి చేసి చూడు (1952) సినిమాలోది.
     
    రాధనురా నీ రాధనురా!
     
    రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకారాధనురా!
    వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
     
    రాధనురా నీ రాధనురా!
     
    ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
    మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
     
    రాధనురా నీ రాధనురా!
    రాధనురా నీ దాననురా!
     
    రాధ అనగానే నాకు బోలెడు సందేహాలు ఎప్పుడూ…అసలు రాధ ఎవరు? కొందరు రాధ కృష్ణుడి ప్రియురాలంటారు, అతని కన్నా పెద్దది అంటారు. రాధామాధవుల ప్రేమ అద్వితీయం అంటారు, ప్రణయానికి పర్యాయపదమంటారు. కృష్ణుడిని అనంతంగా ఆరాధించడమే రాధకి తెలిసిన పని అంటారు. రాధ పై కృష్ణుడికి అవ్యాజమైన ప్రేమ, ఎనలేని అనురాగం ఉంది అంటారు కానీ పెళ్ళి చేసుకోలేదంటారు….ఇటువంటి సందేహాలే ఎప్పుడూ. రాధ నాకు ఎప్పుడూ బోధపడలేదు. పింగళి వారి పాట విన్నాక రాధ నాకు ఇంకా చిక్కులు తెచ్చి పెట్టింది. అర్థమయింది అనిపిస్తూనే అంతు చిక్కకుండా ఉంది.
     
    ఈ పాట పింగళిగారి సాహిత్య ప్రతిభని ఆవిష్కరిస్తుంది. రాధని ఒక్కొక్కరు ఒక్కో రకంగా భావిస్తుంటారు. ఈ భావన ని పింగళి వారు నాలుగు స్థాయిలలో చెప్పారు.
     
    రాసలీలలా ఊసే తెలియని కసుగాయలకు ఆరాధనురా!
     
    ఇక్కడ ఆరాధనురా…అంటే ఆరాధ(న)నురా అని అర్థం చేసుకోవాలి.
    చిన్నపిల్లలు, రొమాన్స్ అంటే తెలియని లేత ప్రాయం ఉన్నవారికి రాధ ఆరాధన అట. రాధని చూసి అలా ఉండాలి జీవితంలో ఎప్పటికైనా అనుకుంటారు కదా. ఎంతో ఆరాధనగా రాధని తమలో మిళితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ రాధ కాబట్టి ఆడవారు మాత్రమే అనుకునేరు. కాదు, అటువంటి అనురాగాన్ని తమలో నింపుకోవాలి అని ఆడ, మగ ఇద్దరూ అనుకుంటారు అప్పుడే రెక్కలు విప్పుతున్న నవ యవ్వనంలో.
     
    వలపున కుమిలే ప్రణయజీవులకు వల్లమాలిన బాధనురా!
     
    పై స్థాయి దాటి ప్రేమలో పడ్డవారు/ఉన్నవారికి రాధ ఒక బాధ. ప్రణయానికి, విరహానికి తేడా తెలీనంత ప్రేమలో కూరుకుపోయి బాధపడుతుంటారట. దగ్గరగా ఉన్నప్పుడు ప్రణయం, దూరంగా ఉన్నప్పుడు విరహం రెండూ ఎంతో బావుంటాయి. “విరహం కూడా సుఖమే కాదా, విరహము చింతన మధురము కాదా” అని కూడా పింగళి వారే అన్నారు. “ప్రేమా, పిచ్చీ ఒకటే” అని అనురాగం సినిమాలో భానుమతి పాడతారు. ఇది ఆ స్థాయి అన్నమాట. ఇక్కడ ఆ”రాధ”న కాస్తా బాధగా మారుతుంది, అది తియ్యటి బాధ.
     
    ఎంతో తెలిసిన వేదాంతులకే అంతు దొరకని గాధనురా!
     
    తరువాతి స్థాయి….అన్ని తెలిసి, జీవిత సారం గ్రహించిన వేదాంతులకు రాధ అంతు తెలియని గాధ ట. ఇది నాకెలా అర్థమవుతున్నాదంటే…జీవితంలో ఎంతో ప్రేమని అనుభవించి, ప్రేమ పై తనివి తీరక…ఇంకా కావాలనుకుంటూ, ఎప్పటికీ సంతృప్తి కలగక వేదాంత ధోరణికి చేరి ఈ ప్రేమ కి అంతులేదా అనుకుంటారేమో! అప్పుడు వాళ్ళకి రాధ అలా అనంతంగా మాధవుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అని సందేహంతో అంతులేని గాధ గా మిగిలిపోతుంది (ఇది నా కవి హృదయం)
     
    మధురానగరి మర్మమెరిగిన మాధవ నీకె సుబోధనురా!
     
    ఇది పతాక స్థాయి….మానవుని జ్ఞానానికి చిట్టచివరి మెట్టు అహం బ్రహ్మాస్మి అనుకోవడం (దీనిపై విశ్వాసం ఉన్నవారు)…..అటువంటి స్థాయికి చేరుకున్నవాడు శ్రీకృష్ణుడే కాబట్టి…ఓ మాధవా, మధురా నగరం మూలమూలలా తెలిసినవాడవు నీకు నేను బాగా తెలిసినదానను…నా గురించి నీకు తప్ప ఎవరికీ గొప్పగా తెలీదు అంటోంది రాధ.
     
    పింగళి వారు ఎంత చమత్కారులో కదా…కాదేదీ కవితకనర్హం అని…రాధని తీసుకుని మానవ జీవిత సారాంశాన్ని ఎంత చక్కగా చెప్పారో!
     
    పాటను వినాలనుకునేవారు ఇక్కడ వినవచ్చు.
     
     

34 thoughts on “ఆ(హా).సౌమ్య బ్లాగు బాగు

  1. బాగుంది … సీరియస్ పత్రికల్లో వచ్చే ఇంటర్వ్యు కన్నా సీరియస్ గ ఉంది .. మీరు చెప్పినట్టు బ్లాగ్స్ లో కొంత మంది ఇబ్బంది పెడుతున్నారని రాయడం మానేసిన వారు కుడా ఉన్నారు .. అల చేస్తే మీరు వారి నిర్ణయాన్ని గౌరవించినట్టు అవుతుంది .. ఎవరి అభిప్రాయాలూ వారివి నచ్చితే చదవాలి లేక పోతే లేదు కానీ కొందరు బ్లాగ్ దడలు మాకు నచ్చినట్టు రాయక పొతే సహించేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు . బ్లాగ్ లో నచ్చితేనే కామెంట్ పబ్లిష్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలు. బయపడి … బ్లాగ్ రాయడం మనాల్సిన అవసరం లేదు .

    • రాజకుమార్,జయ,శైలజ చందు,తృష్ణ,జిలేబి,ఇందు,శశికళ…స్పందించినందుకు ధన్యవాదాలు.
      మురళి గారూ,సౌమ్యా,మీరు, ప్రస్తావించిన అంశాలనే ఎక్కువ మంది మహిళా బ్లాగర్లు కూడా ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నారు.

      • మలీశ్వరి గారు మీకు ముందు పెద్ద thanks చెప్పాలి. ఇంత మంచి అవకశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు చేపట్టిన పని ఎంతో మంచిది. మహిళా బ్లాగర్ల మనసు విప్పి చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నారు. చాలా సంతోషం. once again thanks a lot.

      • నిజంగా ఇంత మంది మహిళా బ్లాగర్లు స్పందించి తమ అభిప్రాయాలను ఇంత ఓపెన్ గా ఇంత ఓపిక గా చెప్తారని అనుకోలేదు.శుభారంభాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సౌమ్యా…

  2. బాగుంది సౌమ్యా,
    ఆడా మగా అని గిరులు, గీతలు లేకుండా..అందరూ అన్ని అంశాల మీద స్వేచ్చగా రాసుకునే అవకాశం ఉండాలి. కామెంట్ మాడరేషన్ పెట్టుకుని చెత్త వ్యాఖ్యల్ని ఏరి పారేయాలి

  3. >>నా చుట్టూ గిరి గీసుకోవాలంటే అది నేనే గీసుకుంటాను. వేరేవాళ్ళు గిరి గీస్తే చెరిపేస్తాను.>> మీ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. అభినందనలు సౌమ్యా.

  4. అమ్మ నా తల్లి మా అమ్మే, మా సౌమ్యే…ఎంత బాగా వ్యాఖ్యానించారో చెత్త వ్యాఖ్యలగురించి. అదిసర్లే గానీ మరి ఇష్టాలు చెప్పినప్పుడు ఇంకేవేనా చెప్తారేమోనని చూసాను…అదే మీకిష్టమయిన వంటలేవీ పేర్కొనబళ్లేదే అనీ. విజీనారాన్ని విడిచిపెట్టినా ఇంట్రూలో మర్చిపోనందుకు కూడా సంతోషించా. కామెంట్ మోడ్రేషన్ పెట్టుకుంటే అక్కడ డైరెక్టుగా పోవు గానీ మనకి తెలిసిపోతుంది కదా. చుట్టూ గిరులు గీస్తే చెరిపేసుకుని నా గిరి నేనే గీసుకుంటా అన్నంత దమ్ము చూపించాలని గాఠిగా చెప్పినందుకు విజినారం ఉక్కుపిడుగు సౌమ్యా కి వీరతాళ్ళు…బోళ్ళు.

    • సుధగారూ thanks.
      విజయనగరాన్నీ నేనెక్కడ విడిచిపెట్టానండీ !! అమ్మో, ఆ మాట కలలో కూడా అనుకోలేను నేను. 🙂 అది నా జీవితంలో ఓ భాగం. నిత్యం తలుచుకుంటూనే ఉంటాను. వీలైనప్పుడలా వెళుతూనే ఉంటాను.

      >అక్కడ డైరెక్టుగా పోవు గానీ మనకి తెలిసిపోతుంది కదా<<. మనం మనోభావాలు చాలా విలువైనవండీ. వాటికి గాయపరచాలంటే ఆ మాటలకు ఒక స్థాయి, శక్తి ఉండాలి. ఈ అనవసరపు కామెంట్లకి ఆ స్థాయి ఉందంటారా? ఆలోచించండి 🙂

      బోళ్ళు వీరతాళ్లకు అలమలం :))

  5. బాగు బాగు మాయాశశిరేఖ గారి అంతరంగం..
    << ఒకవేళ నా చుట్టూ గిరి గీసుకోవాలంటే అది నేనే గీసుకుంటాను. వేరేవాళ్ళు గిరి గీస్తే చెరిపేస్తాను.
    చప్పట్లు గట్టిగా.. 🙂

వ్యాఖ్యానించండి