ఉదయం ఆరు గంటల సమయం చాలా సార్లు చాలా అందంగా ఉత్సాహంగా ఉంటుంది…అయితే….నిన్న అది ఓ అపురూప ప్రయాణంలో సాహితీ పరిమళాలతో గుభాలించిపోయింది. ‘మా కొద్దీ తెల్లదొరతనం’ అంటూ జాతీయోద్యమ కాలానికి ఉద్యమ గేయాన్ని అందించిన గరిమెళ్ళ సత్యన్నారాయణ పుట్టిన వూరు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారం…నిన్న అక్కడ ఉత్తరాంధ్ర కధకుల వర్క్ షాప్ మొదలైంది.విశాఖపట్నం నుంచి కాళీపట్నం రామారావు మాస్టారు అట్టాడ అప్పలనాయుడు గారు, నేను పొద్దున్నే ఆరింటికి బయల్దేరాం…
నేను ముందు సీట్లో కూచోడానికి వెళ్లబోతుంటే కారా మాస్టారు..”అప్పల నాయుడు నేనూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం నువ్వు వెనక సీట్లోకి వస్తే నీకు కధల గురించి బోల్డు సంగతులు చెపుతాను” అన్నారు…ఇక చూస్కోండి…కధల మాస్టారే పిలిచి మరీ ఇంత అదృష్టాన్ని పట్టించాక..ఆ ఉదయం ఎంత గొప్పగా మొదలైనట్టో!
”సత్యానికి నిజానికి తేడా ఏంటి?”ప్రశ్న తో మొదలు….నేను తీవ్రంగా ఆలోచనా ముద్ర అభినయించా…ఈ విషయంలో నాకు అవగాహన లేదన్ననిజం నాకు తెలుసు….కానీ ఒప్పుకోదుగా బుద్ధి…
అనేక ఉదాహరణలిచ్చాక అర్ధమైంది…సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ‘సత్యం’.అది ఎపుడూ జరిగేది…అతను దొంగతనం చేసాడన్నది ‘నిజం’..ఇది ఆ క్షణానికి జరిగింది…
ద్రౌపది నవలకి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చినపుడు కారా మాస్టారి మీద వచ్చిన విమర్శలు,వాస్తవాలు మొదలు….విరసంతో విభేదాలు…యజ్ఞం కధ నేపధ్యం, కొడవటిగంటి కుటుంబరావు తో పరిచయం రావిశాస్త్రితో స్నేహం…. ఎనభై ఏడేళ్ళ కారా మాస్టారు తన జీవితాన్ని తడుముకుంటున్న ఆ క్షణాల్లో ఎందరు సాహిత్య కారులు!! యుగకర్తలు!! వారందరి మధ్యా నేనూ నిలబడి అన్నీ గమనించనట్టు తోచింది…
కొకు,రావిశాస్త్రిల సాహిత్యం గురించి మాట్లాడుతూ రావిశాస్త్రి రచనలు తాజ్ మహల్ లా విభ్రమ కలిగిస్తే కొకు రచనలు ఆనకట్టల్లా జీవితానికి ఉపయోగపడతాయి.’అన్నారు.
‘పంచేంద్రియాలని స్పృశించే కధ రాయడం వొక టెక్నిక్…ఈ సారి ఆ రకం గా వొక కధ…ప్రయోగం కోసమైనా రాయి”అంటూ నాకు వొక సూచన చేసి..ఆ రకమైన టెక్నిక్ వాడిన కధగా పాలగుమ్మి పద్మరాజు రాసిన పడవ ప్రయాణం కధని కారులోనే చదివించేసి…ఆ కధని విశ్లేషించి చెప్పారు…
14 గంటల పాటు మాస్తారితో పూర్తి సాహిత్య చర్చలతోనే గడపడం చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది…విచిత్రం…మాస్టారు…మాస్టారులా బోధించలేదు..మిత్రుడిలాగా పంచుకున్నారు…
కధక మిత్రులారా…
కధా నిర్మాణం గురించి మాస్టారు చెప్పిన ఈ సూచన మీకూ ఉపయోగపడుతుందేమో…చూడండి..
కధలో పాత్రల మధ్య సంభాషణలని ఎపుడు పడితే అపుడు ప్రతి చిన్న విషయానికీ వాడకూడదు..భావోద్వేగాలను వ్యక్తం చేసే సందర్భాల్లో మాత్రమే వాడాలి.
గరిమెళ్ళ సత్యన్నారాయణ గారి ఊరు ప్రియాగ్రహారమా? ఇంటి పేరు చూస్తే మా జిల్లాకి చెందిన ఇంటి పేరులా అనిపించలేదు. అందుకే ఆయనది గోదావరి ప్రాంతం అనుకున్నాను.
మీకు తెలిసే ఉ౦టు౦ది
తెలుగులో “స్త్రీ”(1995లో) సినిమా పాలగుమ్మి పద్మరాజు గారి “పడవప్రయాణం” కథ ఆధారంగా మలయాళ దర్శకుడు సేతుమాధవన్ దర్శత్వంలో రూపుదిద్దుకుంది. 🙂
http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995_printer.php
ప్రవీణ్ గారూ,
ఇంత చరిత్ర మాట్లాడతారు మీకు తెలీక పోవడం ఆశ్చర్యమే…
మౌళీ,
అవునా? నాకు ఈ విషయం తెలీదు.మంచి సమాచారం చెప్పారు…థాంక్ యూ…
ఈ మధ్యే పడవప్రయాణం కథ చదివాను. పాలగుమ్మి కి గారి అంతర్జాతీయ బహుమతి తెచ్చిన గాలివాన కథ కంటే ఈ కథే నాకు నచ్చింది. ఇలాంటి కథలు రాయటం లో ఆయన దిట్ట.