వివక్షా రహిత సమాజం – ఒక ఉమ్మడి ప్రయత్నం ‘మనలో మనం’ మొట్ట మొదటి సమావేశం
ఈ సమావేశాల నిర్వహణ వ్యయాన్ని నిర్వహణ కమిటీ సభ్యులు తమ సొంత వనరులలో భరించారు. ఆర్ధిక వ్యవహారాల పారదర్శకత కోసం ఈ ఖర్చుల వివరాలను రాత పూర్వకంగా మనలోమనం రచయిత్రుల తాత్కాలిక వేదికకు నిర్వహణ కమిటీ పంపించింది.
ఈ రెండు రోజుల సమావేశాన్ని మూడు సెషన్లుగా విభజించడం జరిగింది. మొదటి సెషన్లో స్త్రీవాద సాహిత్యం గతం-వర్తమానం-భవిష్యత్తు అనే అంశంపై కాత్యాయనీ విద్మహే విషయ ప్రతి పాదన చేయగా వేమన వసంత లక్ష్మి సమన్వయ కర్తగా వ్యవహరించారు. చల్లపల్లి స్వరూపరాణి, శిలాలోలిత, నల్లూరి రుక్మిణి సారాంశ నివేదికను తయారు చేశారు. ఈ సెషన్లో వివిధ అంశాలపై చర్చ తీవ్రంగా సాగింది. స్త్రీవాద సాహిత్యం గతంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించింది కాత్యాయని విద్మహే వివరించారు. వర్తమానంలో వివిధ అస్తిత్వాలకి చెందిన రచయిత్రులు ఆయా అస్తిత్వాలకి చెందిన స్త్రీల జీవితాలను అక్షర బద్దం చేస్తున్న క్రమాన్ని చర్చించారు. భవిష్యత్తులో వివిధ అస్తిత్వాల సమన్వయంతో సామాజిక , సాహిత్య ఉద్యమాలతో మమేకం కావాలని పలువురు రచయిత్రులు అభిప్రాయపడ్డారు.
రెండవ సెషన్లో దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల సాహిత్యం విడిగా చర్చించబడ్డాయి. దళిత స్త్రీవాద చర్చకు చల్లపల్లి స్వరూపరాణి విషయప్రతిపాదన చేయగా జూపాక సుభద్ర సమన్వయ కర్తగా వ్యవహరించారు. దళిత స్త్రీల అస్తిత్వం ఎలా అణిచి వేయబడుతుందో జెండర్ వివక్షకే కాకుండా అదనంగా కుల వివక్షకు కూడా గురవడాన్ని దళిత రచయిత్రులు ప్రశ్నించారు. తాము సృష్టించిన సాహిత్యంలోని భాషమీద, వ్యక్తీకరణ మీదా అమలవుతున్న వివక్షని వివరించారు.
బహుజన స్త్రీవాదానికి సంబందించిన చర్చకు అనిశెట్టి రజిత విషయ ప్రతిపాదన చేయగా జి. విజయలక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించారు. స్త్రీ జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా వున్న తమకు ఎదురయ్యే వివక్షలన్నింటికీ వ్యతిరేకంగా సాహిత్య కృషి చేయాలని తీర్మానించారు.’బహుజన ‘ పదం అణిచివేతకు గురయ్యే అన్ని వర్గాల స్త్రీలను ప్రతిబింబిస్తుంది కాబట్టి సామాజిక వెనుకబాటుకి గురయిన తమ సాహిత్యాన్ని బి.సి. స్త్రీవాదంగా పరిగణించాలని కొందరు ప్రతిపాదించగా సభ ఆమోదించింది.
ముస్లిం స్త్రీవాదానికి సంబందించిన చర్చకి షాజహానా విషయ ప్రతిపాదన చేయగా రెహనా సమన్వయకర్తగా వ్యవహరించారు. లింగ వివక్ష కుల వేదనలతో పాటు అదనంగా మతదాడులకి, ఆర్ధిక అసమానతలకి గురయ్యే ముస్లిం స్త్రీలు దుర్భరమయిన జీవితాలని గడుపుతున్నారని చెప్పారు. ముస్లిం స్త్రీలను రచనా వ్యాసంగానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.
రెండవ సెషన్ అంతటికీ సారాంశ నివేదకులుగా ఆర్. శాంతసుందరి, కొండవీటి సత్యవతి, మందరపు హైమావతి వ్యవహరించారు.

మూడవ సెషన్ పూర్తిగా ఉమ్మడి వేదిక ఏర్పాటులోని సాధ్యాసాధ్యాలపై చర్చ సాగింది. వివిధ దృక్పధాలకి చెందిన రచయిత్రులు తమ భావజాల వైరుధ్యాలను పరిష్కరించుకోవడం, సానుకూలత ఏర్పడిన తర్వాత ఉమ్మడి వేదిక లక్ష్యాలను నిర్ణయించుకోవడం, భౌతిక నిర్మాణాన్ని రూపొందించుకోవడం అన్న మూడు అంశాల పరిధిలో చర్చ సాగాలని మనలో మనం నిర్వహణ కమిటి ప్రతిపాదించింది.
తమ భావజాల వైరుధ్యాలను క్రమేపీ పరిష్కరించుకోవాలనే అందుకు ఈ సదస్సు తొలి అడుగు అని రచయిత్రులు భావించారు. కాత్యాయనే విద్మహే మాట్లాడుతూ ఉమ్మడివేదిక ఏర్పడినట్లయితే కార్యాచరణలో భాగంగా మొట్టమొదట దళిత, బి.సి, మైనారిటి, ఆదివాసీ స్త్రీ జీవితాన్ని చిత్రించిన సాహిత్య అధ్యయనం చెయ్యాలని ప్రకటించడం ద్వారా తమవైపు నుండి ఉమ్మడి వేదికకు సానుకూలతను తెలియజేశారు. జూపాక ఐడెంటిటీ, అలయెన్స్ ప్రాతిపదికతో ఉమ్మడి వేదిక ఏర్పాటు జరిగీతే తాము సానుకూలంగా ఉన్నట్లేనని చెప్పారు. కాత్యాయనే విద్మహే ప్రతిపాదనను అంగీకరిస్తూ తన సానుకూలతని షాజహానా తెలిపారు. బి.సి. రచయిత్రుల ప్రాతినిధ్యాన్ని గౌరవించినట్లయితే ఉమ్మడి వేదికకు అనుకూల మయిన వాతావరణం ఏర్పడింది అన్నారు.
సాహిత్య, సామాజిక, రాజాకీయ లక్ష్యాలు ఉమ్మడి వేదికకు నేపధ్యంగా ఉండాలని రచయిత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సభనుంచి పది మంది తాత్కాలిక సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటి ఏర్పడి లక్ష్యప్రకటనని సిద్ధం చేసింది.
గతానుభవాలు ఎలాంటివయినా ఆశలెపుడూ నిత్యనూతన మేనని, సవాలక్ష సమస్యల మధ్య భిన్న ఆకాంక్షల్నీ ఒక ఉమ్మడి స్వప్నాన్నీ కలగన్న రచయిత్రులు చివరికి సాధించుకోగలిగారు.
‘మనలోమనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక ఆవిర్భవించింది. ఈ వేదికకు పదిమంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీ ఏర్పడీంది. ఈ కమిటీలో జాజుల గౌరి, విష్ణుప్రియ, పి.సత్యవతి, మల్లీశ్వరి, జూపాక, సుభద్ర, పుట్ల హేమలత, అనిశెట్టి రజిత, షాజహానా, రత్నమాల, కొండవీటి సత్యవతి సభ్యులుగా ఉన్నారు.
పేరుతో ఒక నిర్మాణయుతమయిన వేదికను ఏర్పరచుకునే క్రమంలో రూపొందించుకున్న ‘మనలోమనం’ రచయిత్రుల తాత్కాలిక వేదిక చేస్తున్న లక్ష్య ప్రకటన ఇది.
స్త్రీల పట్ల అమలవుతున్న కుల, మత, జాతి, వర్గ, ప్రాంతీయవివక్ష, అసమానత, అణిచివేతలకూ,అన్ని రకాల హింసలకూ వ్యతిరేకంగా స్పందిస్తుంది, అద్యయనం చేస్తుంది.
-
సాహిత్య సృజనాత్మకతను, అవగాహనను పెంచుకోవడానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
-
ఈ వేదిక వివిధ అస్తిత్వాలకు దామాషా ప్రాతినిధ్యం కల్పిస్తుంది.
-
అదనపు అణిచివేతకు గురయ్యే సామాజిక వర్గాలకు నిర్ణాయక ప్రాతినిధ్యాన్నిస్తుంది.
-
ప్రత్యేక అస్తిత్వాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమన్వయం చేస్తుంది.
ఈవేదిక కొన్ని నియమాలనుఊ విధించుకుంది. పారదర్శకంగా ఉండటం, జవాబుదారీతనం కలిగి ఉండటం, స్వతంత్రతను కాపాడుకోవడం మొదలైనవి.
స్త్రీవాదం లోని వివిధ అస్తిత్వాలను సమాజంతో సమన్వయం చేసే క్రమంలో ఏర్పడిన మనలోమనం రచయిత్రుల ఉమ్మడి వేదిక స్త్రీల సాహిత్యాన్ని మరింత ప్రభావితం చెయ్యాలనీ చేస్తుందనీ సమావేశంలో పాల్గొన్న డెబ్బయి మందికి పైగా కల రచయిత్రులు భావించారు. విశాఖ సమావేశంలో పాల్గొన్న రచయిత్రులు జాజుల గౌరి, విష్ణుప్రియ, పి.సత్యవతి, మల్లీశ్వరి, జూపాక సుభద్ర, పుట్ల హేమలత, అనిశెట్టి రజిత, షాజహానా, రత్నమాల, కొండవీటీ సత్యవతి, కాత్యాయనీ విద్మహే, మృణాళిని, కృష్ణాబాయి, చల్లపల్లి స్వరూపరాణి, ఆర్.శాంతసుందరి, ఘంటశాల నిర్మల, శిలాలోలిత, చంద్రలత, మందరపు హైమవతి, విమల, నల్లూరి రుక్మిణి, వేమన వసంత లక్ష్మి, పసుపులేటి గీత, కె.వరలక్ష్మి, తాయమ్మకరుణ, కె.బి.లక్ష్మి, శివ లక్ష్మి, కొలిపాక శోభారాణి, శివ లక్ష్మి, కె.సుభాషిణి, జాలాది విజయ, వారణాసి నాగలక్ష్మి, జ్వలిత, జి.విజయలక్ష్మి, మానం పద్మజ, రెహాన, నమతా రోష్ని, కె.వి.రామలక్ష్మి, కె. అనురాధ, పత్తి సుమతి, ఇ.పి.యన్.భాగ్యలక్ష్మి, ఎం.లక్ష్మి, కె.పద్మ, ఎ.సీతారత్నం, విజయభాను, బాలాదేవి, అమరజ్యొతి, సి.హెచ్.కళావతి, వి.రామలక్ష్మి, ఎం.లలిత కుమారి, జి.భవాని, జి.సీతామహాలక్ష్మి, పి.రాజ్యలక్ష్మి, జగద్ధాత్రి, ఉష తదితరులు పాల్గొన్నారు.
2009 జనవరి 11 వ తేదీన ఆవిర్భవించిన ‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక ఉమ్మడి సాహిత్య ప్రయోజనాల సాధన కోసం కార్యాచరణే ధ్యేయంగా భావించింది. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రతిష్టలు, విభేదాల జోలికి పోకుండా సమిష్టి కృషిని విశ్వసిస్తుంది. కలిసి పనిచేసే క్రమంలో తమలోని భిన్నత్వాలను గౌరవించుకునే ప్రజాస్వామిక దృక్పధం సభ్యులందరిలో ఏర్పడగలదని బలంగా నమ్మింది.
విశాఖపట్నం సభలో కాత్యాయని విద్మహే ప్రకటించినట్లుగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడివేదిక తొలి సదస్సు వరంగల్లో, జరపడానికి తాత్కాలిక కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. మహిళాధ్యయన కేంద్రం, కాకతీయ విశ్వవిద్యాలయం మరియు ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక సం యుక్త అధ్వర్యంలో వరంగల్ సదస్సు జరపాలని కమిటీ మహిళాధ్యయనం కేంద్రం ఒక అంగీకారానికి వచ్చాయి. మహిళాధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొ.టి.జ్యోతి రాణి, కాత్యాయని విద్మహే, రచయిత్రుల వేదిక కమిటి తరపున జాజుల గౌరి, అనిశెట్టి రజిత వరంగల్ సదస్సుకి సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ‘మనలో మనం’ రచయిత్రుల ఉమ్మడి వేదిక తొలి సదస్సు 2009 మార్చి 21,22 తేదీల్లో జరిగింది. దళిత, తెలంగాణా స్త్రీల సాహిత్యాన్ని అధ్యయనం ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ రాష్ట్రస్థాయి వర్క్ షాపులో అనేకమంది రచయిత్రులు, విద్యార్ధినులు పరిశోధకులు పాల్గొన్నారు.
దళిత, తెలంగాణా రచయిత్రులు సృష్టించిన సాహిత్యాన్ని సేకరించి అధ్యయనం చెయ్యడం, కొత్త తరం రచయిత్రులను గుర్తించి ప్రొత్సహించడం, విద్యార్ధినుల్లో పరిశోధకుల్లో స్త్రీల సాహిత్యం పట్ల అవగాహనను పెంచి వారిలో రచనాసక్తిని కలుగజేయడం లక్ష్యాలుగా ఈ సదస్సు పని చేసింది.
కొండవీటి సత్యవతి తొలి పలుకులతో సదస్సు ప్రారంభమయింది. ప్రారంభసమావేశానికి ప్రొ.టి. జ్యోతి రాణి అధ్యక్షత వహించగా అనిశెట్టి రజిత సదస్సు లక్ష్యాలను వివరించారు. కాత్యాయనీ విద్మహే అవగాహనా పత్రాన్ని సమర్పించారు.
దళిత స్త్రీల సాహిత్యంపై జరిగిన సమావేశానికి జాజుల గౌరి అధ్యక్ష్యత వహించడమె కాకుండా దళిత కథ, కవిత్వంపై ప్రసంగించారు. దళిత స్త్రీ వ్యాస-ప్రక్రియపై కందాళ శోభారాణి, జూపాక సుభద్ర కవిత్వంపై పాతశ్రీ లక్ష్మి, గెద్దాడ కస్తూరి కథపై సుమలత పత్ర సమర్పణ చేశారు.
తెలంగాణ స్త్రీల సాహిత్యంపై జరిగిన సమావేశానికి ముదిగంటి సుజాతా రెడ్డి అధ్యక్ష్యత వహించారు. తెలంగాణ స్త్రీల నవలపై గీతాంజలి తెలంగాణా స్త్రీల కథలపై నిదాన కవి నిశ్చల, వ్యాసంపై ఎ.జ్యోతి, కవిత్వంపై అనిశెట్టి రజిత పత్ర సమర్పణ చేయగా అనిశెట్టి రజిత దీర్ఘ కవిత ‘ఓ లచ్చవ్వా’ పై జనగాం రజిత అనే విద్యార్ధిని స్థూల విశ్లేషణ చేసింది.
ఈ రెండు సమావేశాలు దళిత, తెలంగాణా స్త్రీల సాహిత్యాన్ని ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నానికి నాంది పలికాయి. ముఖ్యంగా పత్రసమర్పకుల్లో విధ్యార్ధినులు ఉండటం స్త్రీల సాహిత్యంపై, ప్రస్తుత పరిణామాలపై వారికున్న అవగాహన కొత్త ఆశల్ని రేకెత్తించాయి.
మార్చి 22 వ తేదీన ‘మనలో మనం’ రచయిత్రుల వేదిక సర్వ సభ్య సమావేశం జరిగింది. చర్చలు విస్తృత స్థాయిలో జరిగాయి. అద్యయన అవసరాల దృష్ట్యా ఎకడమేషియన్ గా కాత్యాయని విద్మహేను బి.సి. వర్గ స్త్రీల విస్తృతి దృష్ట్యా కె.వరలక్ష్మిని కమిటీలోకి తీసుకోవడం జరిగింది.
తెలంగాణా, మాదిగ దండోరా ఉద్యమాలపై స్పష్టమయిన అభిప్రాయాల్ని ప్రకటించాలని కొన్ని వర్గాల వారు డిమాండ్ చేసిన విషయాన్ని మల్లీశ్వరి ప్రస్తావిస్తే ఉమ్మడి వేదిక లక్ష్య ప్రకటనని గుర్తు చేశారు
తెలంగాణా, మాదిగ దండోరా ఉద్యమాలతో సహా అదనపు అణిచివేతకు గురయ్యే వర్గాలన్నింటి పట్ల వేదిక సంఘీభావం కలిగి వుందనీ కొత్తగా ఏర్పడే అస్తిత్వ సమస్యల్ని అర్ధం చేసుకొని సమన్వయ పరిచే స్పేస్ వేదికకు వుందని స్పష్టం చేశారు.

హేమలత దళిత క్రైస్తవ స్త్రీ సాహిత్యానికి, క్రైస్తవ మైనారిటీ స్త్రీ సాహిత్యానికి ఉన్న తేడాను గుర్తించి సాహిత్యాధ్యయనం చెయ్యాలన్నారు. మత భయం, రాజ్య భయం రీత్యా చర్చ్ లు క్రైస్తవ స్త్రీలకు చేస్తున్న అన్యాయాన్ని చెప్పలేకపోయామనీ ఇక పై సాహిత్యం ద్వారా చెప్పదల్చుకున్నామని అన్నారు. అగ్రకులాలు అన్న మాట బదులు ‘ప్రాబల్యకులాలు ‘ లేదా ‘ఆధిపత్యకులాలు ‘ అన్న మాటలను ఉపయోగించాలని ఆమె ప్రతిపాదించగా సభ ఆమోదించింది.
ఎన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జరిగినప్పటికీ ‘ మనలో మనం’ రచయిత్రుల వేదిక తొలి సదస్సు నిరాఘాటంగా జరిగింది. వివక్షారహిత సమాజమే ధ్యేయంగా, సాహిత్య, సామాజిక కార్యాచరణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వరంగల్ సదస్సులో పాల్గొన్న రచయిత్రులు జాజుల గౌరి, విష్ణుప్రియ, మల్లీశ్వరి, పి.సరస్వతి, అనిశెట్టి రజిత, కె.వరలక్ష్మి, పుట్ల హేమలత, రత్నమాల, కొండవీటి సత్యవతి, కాత్యాయనీ విద్మహే, తోట జ్యోతి రాణి, ముదిగంటి సుజాతా రెడ్డి, కొండేపూడి నిర్మల, శిలాలోలిత, ఘంటశాల నిర్మల, వి.ప్రతిమ, నల్లూరి రుక్మిణి, గీతాంజలి, ది.యల్.సుహాసిని, శివలక్ష్మి, తాయమ్మ కరుణ, రాణి పులోమజా దేవి, హేమలలిత, శాంతి ప్రభోధ, సమతా రోష్ని, డా.. కె.స్వరూప, ప్రొ.వి.శోభ, ఎ.జ్యోతి, కామేశ్వరి, పల్లం మాధవీలత, అరుణ, మంగళ, డా. సులోచన, కె.రాణీ ప్రసాద్, కందాళ శోభారాణి, శ్యామల, నిదానకవి నిశ్చల, పాత శ్రీలక్ష్మి, రజిత , సుమలత, డి.శోభారాణి, మార్గరేట్ ఇంకా అనేక మంది విద్యార్ధినులు, పరిశోధకులు పాల్గొన్నారు.
తెలంగాణా, మాదిగ దండోరా ఉద్యమాలపై స్పష్టమయిన అభిప్రాయాల్ని ప్రకటించాలని కొన్ని వర్గాల వారు డిమాండ్ చేసిన విషయాన్ని మల్లీశ్వరి ప్రస్తావిస్తే ఉమ్మడి వేదిక లక్ష్య ప్రకటనని గుర్తు చేశారు
వెంకటేశ్వరరావు గారూ,
మీ వ్యాఖ్య అర్ధం కాలేదు.
మీ వ్యాసం లోనే పైన పేర్కొన్న ( ఫోటో పైన కింది నుండి రెండవపేరా లో ) వాఖ్యం ఉంది. అది నాకు అర్ధం కాకే, దానిలో పెట్టాను మేడం.
దార్ల గారూ,
బావున్నారా?
మొన్న వరంగల్ సభని మీరు మిస్ అయ్యారు.మిమ్మల్ని మేము మిస్ అయ్యాము.
ఇక వ్యాఖ్య…గురించి.
అణచివేతకి గురయ్యే అస్తిత్వాలను గుర్తించడం,ఉప అస్తిత్వాలకి నిర్ణాయక ప్రాతినిధ్యం లభించేలా సభ్యులందరూ కృషి చేయడం కూడా వేదిక లక్ష్యాల్లో భాగమే.
అందుకే ప్రత్యేక తెలంగాణా పట్లా,మాదిగ దండోరా పట్లా వేదిక నిర్ద్వంద్వంగా అనుకూల వైఖరినే కలిగి ఉంటుంది.ఆ రోజు సభలో అదే విషయం నేను స్పష్టంగా చెప్పాను.అది రికార్డ్ అయి కూడా ఉంది.