మంచి గాయని, విమర్శకురాలు, మిత్రురాలు, మీదు మిక్కిలి చదువరి అయిన సరళ మోహన్ గారు నీల నవలపై నిష్పాక్షిక సమీక్ష చేసారు. వారికి ధన్యవాదాలు.
*****************
ఇరవై రోజుల క్రితం మొదలెట్టి రెండు రోజులలో చదవడం పూర్తిచేసానీ నీలని…547 పేజీల నీలను…ఎందుకంటే ఏకబిగిన చదవకుండా వదలబుద్దికాలేదు..ఆ రెండు రాత్రిళ్ళ నిదరలో కూడా నీల పలకరిస్తూనే ఉంది..నీల వదలలేదు ..ఆ నీల మత్తులో నుంచి బయటపడ్డాకే సమీక్ష రాయాలని ఆపాను..పుస్తకం పూర్తిచేసాకే పుస్తకంలోని చినవీరభద్రుడు గారు..ఎకే ప్రభాకర్ గారు రాసిన ముందు మాటలు ఫేస్ బుక్ సమీక్షలు చదివాను..లేకపోతే ఆ మాటలముద్రలు పడతాయని…
నీల గురించి చెప్పాలంటే ముందుగా చెప్పవలసింది మల్లీశ్వరి గారు ఈ నవలలో 547 పేజీలలో చాలా వరకు ప్రతి వాక్యం ని జాగ్రత్తగా కవితాత్మకంగా అర్ధవంతంగా జీవంతొణికిసలాడే ప్రాణమున్న శిల్పంలా చెక్కిన తీరు గురించి చెప్పాలి ..ఏవాక్యంనీ గబగబా చదివేయలేం..వాక్యంలో అర్ధాన్ని అందాన్ని ఆస్వాదిస్తూ తప్ప…ఇంత పెద్దనవలలో బంద్ లు ఉద్యమాలగురించి వివరణలలో పది పదిహేను పేజీలు మాత్రమే పైపైన చదివి తిప్పేసాను అంటే ఏరకంగా ఈ నవలని అల్లారో చూడండి
నీల బాల్యదశ యవ్వన దశ మధ్య వయసు వరకు నీలజీవిత వివరణ నీల …కానీ వీటన్నిటిలో నీల బాల్యంలోనే నాకు మరీ నచ్చుతుంది…యుక్తవయసు లో నీలకూతురు మినో ఆలోచించే పద్దతి కన్నా నీల ఆ వయసులో ఆలోచించిన పద్దతే నాకు నచ్చింది ..చిన్నపుడే అవసరమైతే పెద్దవారినే ప్రశ్నించగల సత్తా ఉన్న అమ్మాయ్.తాగినందుకు నాన్నని కొడుతుంటే చాలామంది తాగుతున్నారు కదా! నాన్ననే కొడుతున్నారెందుకు? అని అడగగలదు
ఈ నవల లో పెళ్ళి చేసుకున్న1 నీల..2 నీల అమ్మచంద్రకళ .. 3నీలను విడాకులతరువాత ఆదుకున్న సంపూర్ణ.. 4 సదాశివ తల్లి.నీతాబాయ్ …నలుగురు వివాహంతో పూర్తి సంతృప్తిగా ఆనందంగా బతకలేకపోయారు….
1 నీల విడాకులకు కారణం భర్త వివాహేతర సంబంధం…వివాహం కాకముందునుంచీ సరళతో ఉన్న శారీరక మానసికసంబంధం.పెళ్ళై భర్త పోయి ఇద్దరు పిల్లలున్న సరళ ని ఎందుకు చేసుకోవాలి..తన ఆస్తినెందుకివ్వాలనుకుని ..పల్లెటూరి పిల్ల …బాగుంది..తనేం చేసినా సర్దుకుపోతుందని కావాలని ఇష్టపడి నీలకు సరళసంగతి చెప్పకుండా దాచి పెళ్ళిచేసుకున్న ప్రసాద్ .జాలి సానుభూతి నీలమీద ఉన్న ప్రసాద్..తమ అక్రమ సంబంధం బయటపడగానే పచ్చిబాలింతరాలని కూడా చూడకుండా మానసికంగా హింసించడం జాలి కూడా లేకుండా తనని కొట్టడం తరువాత ఏడవడం చేసే ప్రసాద్ పాపపుట్టాక నీలని కూడా అనుమానించడం..సంబంధం అంటగట్టి మాటాడటం.తరువాత కొట్టడం..ఏడవడం..
సరళని కూడా తనలానే హింసించడం చేస్తున్నాడని తెలిసాక ఆ బంధం నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది..తను బయటకు వస్తే వారిద్దరన్నా బాగుంటారనుకుని…
2 నీల తల్లి చంద్రకళ భర్త తాగుడు…కుటుంబ బాధ్యత తీసుకోకపోవడం…తో వివాహేతరసంబంధం కి వెళుతుంది..
3 సంపూర్ణ కు మానసికంగా అమాయకుడైన భర్త…పిల్లలు .తనకి ఆకర్షణ హోదాగల గొప్పజీవితం మీద..దానికోసం తనకు అందుబాటులో ఉన్న వనరులు వాడుకోడం తప్పు కాదనుకుంటుంది..నాగరికంగా అందంగా ఉన్న డ్వైక్రా గ్పూపు అతను చంద్రకాంత్ సహాయంతో అతని ఎడల ఆకర్షణా ఉంటుంది..సంఘంలో అతని సాయంతో ఎదుగుతుంది .
4 సదాశివ తల్లిదండ్రులు నీతాబాయ్ ప్రకాష్ ఒకరినొకరు ప్రేమించి నీలాబాయ్ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్ళి చేసుకుని కూడా నీతాబాయ్ భర్త దగ్గరఆర్ధిక అసమానతలు…పెరిగిన వాతావరణం అత్తింట లేక ఎడ్జస్ట్ అవలేక పుట్టింటికి వెళ్ళిపోయి తన భర్తనే పుట్టింటికి పిలుచుకుంటుంది…అతనికది తీరని కోత..
నీల జీవితం సదాశివ తో కలిసి చేసే సహజీవనం చాలాబాగున్నట్లు చూపారు…సదాశివ తన భార్య కిష్టమైతే ఎలాటి మొహమాటాలు లేకుండా నీల అంతకుముందు ప్రేమించిన పరదేశితో శారీరకంగా గడుపు అని చెప్పేటంత మంచివాడే…మరి మానసికంగా ఆందోళనెందుకు పడతాడో?నీలతిరిగొచ్చేదాకా! ..అలాగే సదాశివ ప్రతిసంవత్సరం వసుంధరతో రెండురోజులు గడుపుతానంటే నీలకెంత అభద్రతో చదివాక సహజీవనాలలో కలిసిజీవించే ఆదర్శవాదులకు !కూడా బోలెడన్ని దిగుళ్ళు బెంగలు.. ఎన్నిఅభద్రతలు వేటాడుతాయో పక్కాగా తెలుస్తుంది..
పెళ్ళి సహజీవనాలలో భద్రత కొద్దోగొప్పో ఉండేది పెళ్ళిలోనే…కనీసం మగవాడు కొన్నిటికన్నా జవాబుదారిగా నన్నాఉంటాడు..పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఎంత శాతం విఫలమో ప్రేమ పెళ్ళిళ్లూ అంతే…సహజీవనాలు అన్ని నీలలాగా ఎట్టిపరిస్ధితులలోనూ ఉండవు…అసలు ఆర్ధికఅసమానతలు లేని..ఆర్ధికస్వాతంత్ర్యం ఉన్నవారికే అంటే ఐతే దిగువ ఆర్ధికతరగతి లేదా ఎగువ ఆర్ధిక తరగతి..సమాన ఆర్ధిక తరగతులు ..స్వయం ప్రతిపత్తి ఉంటే సహజీవనాలు పనికివస్తాయే తప్ప డిపెండ్ అయే స్ధితి ఉండి సహజీవనాలలోకి వెళ్తే పరిస్ధితులేంటో నీలలో అసలెక్కడా చర్చింపబడలేదు. పైగా సహజీవనాలంటే బలేగుంటాయన్నంత బాగా వర్ణించారు….అంత ఈజీ గా నీలకెదురైనంత మంచి వ్యక్తులు సామాజిక భద్రత ఆర్ధిక ఉన్నతి ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి తో ఉండగలిగే పరిస్ధితులూ నూటికో కోటికో ఒక్కరికి దక్కుతాయ్…నీలలాటి పరిస్ధితి ఉన్నవారికి ..
అసలా మాటకొస్తే నీలకు తారసపడినవారంతా ఏదో ఒకరకంగా మంచివారే….ప్రసాద్ కూడా సరోజతో తన వివాహేతరసంబంధం యాక్సెప్ట్ చేసి నీల నిర్వికారంగా తనకి వళ్ళప్పచెప్తే బాగానే ఉండేవాడే..సరోజ మంచిదే…కానీ నీల యంత్రం కాదు…సూర్యం..ఆరంజ్యోతి…పోరాటమెలా చేయాలో చూపినా తమ్ముడు సూర్యంకోసం మైండ్ పోగొట్టుకున్న ఆరంజ్యోతి నీలలో అభద్రత ని నింపింది…
చిన్నపుడే ప్రశ్నించే నీల పెద్దైపోయేకొద్దీ .చాలాచోట్ల పోరాటమే మరచిపోయింది ..తన తల్లి దండ్రుల జీవితం చూసి తల్లి వివాహేతరసంబంధం మూలాన తను అనాధలా బతకవలసిన పరిస్ధితులలో తనజీవితం ఉన్నంతలో ఎలాగోలా సర్దుకుపోడానికి ప్రయత్నించే క్రమంలో ఫాదర్ దగ్గర గడిపేలా బాల్యం తననుతను మలచుకుంటుంది ..వివాహానికి కట్టుపడాలని గట్టిగా అనుకుని సర్దుకుని గడిపేయాలనే చూసింది ..ప్రసాద్ తో…వల్లకాని పరిస్ధితులలో బయటకు వచ్చేస్తుంది…సంపూర్ణ లాటి అండ దొరకడం కూడా అందరికీ కష్టమే…పరదేశి మంచివాడు..కానీ చేతనతో ఐదేళ్ళ లైవ్ రిలేషన్ షిప్ ఉందని తెలుసుకుని నేను నీతో కంటిన్యూ అవలేనని చెప్తుందే కానీ అంత ప్రేమించింది మరల ఎపుడూ మిత్తరికం నిలుపుకోవాలనే చూసినట్లనిపించదు…నీతాబాయ్ మంచిది..అజిత మంచిది..సదాశివ మంచివాడు…పైడమ్మ మంచిది….ఇలా అందరు మంచివారే …కానీ మనుషులు…కనక బలహీనతలూ ఉన్నవారిగా చూపిస్తారు..
మినో మాటలు నవల చివరిలో ఆమె ఆలోచనా ధోరణి సదాశివతో మాటలాడే పధ్దతి…ధిక్కారం…ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండబోతుందో తేటతెల్లం చేసింది….
ఏదైనా నవలని కొన్నిచోట్ల ఇంకొంత కుదించినా బాగుండేదనిపించింది…శైలి ఆపకుండా చదివించినా సరే! పరదేశి పాత్ర ఐపోయేదాకా స్పీడ్ గా ఇంటరెస్టింగ్ గా చదువుతాం…తరువాత కధనం లో అంతకుముందు భాగంలో ఉన్న బిగీ పట్టు తగ్గింది…నీతాబాయ్ ప్రకాష్ ల ప్రేమకధ మరీ అంత వివరణ అవసరం లేదేమో ననిపించింది…పైడమ్మ పాత్ర నాకు చాలా నచ్చిన పాత్ర…అజిత పాత్ర అత్యాధునికంగా ఆలోచించే పాత్ర ..
కొన్నిఅవసరమైన చోట్ల మరీ క్లుప్తంగా ముగించారు అని నాకనిపించింది…..పరదేశి రీ ఎంట్రీ..నవలలో మరింత వివరిస్తే బాగుండేది…
సరళ మోహన్