సొగసు చూడతరమా

ఉత్తరాంధ్ర మాండలికం పై 22-12-2014 తేదీన సూర్య దినపత్రిక లో వచ్చిన నా వ్యాసం.

22MAIN4uttharandhra mandalikam

‘లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబగు’ అని, వ్యాకరణ సూత్రాలకు లోబడని భాషని పామరభాషగా చిన్నయసూరి సూత్రీకరించాడు. మళ్ళీ అంతలోనే  ‘ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు’  అనడం ద్వారా పెద్దలు వాడితే పామరభాష అయినా గ్రహించవచ్చునని కొంత సడలింపునీ ఇచ్చాడు. అయినప్పటికీ ప్రజల భాష పట్ల వ్యాకరణకర్తలకీ గ్రాంధిక, ప్రామాణిక భాషా వాదులకీ చాలా కాలం చిన్నచూపే ఉండేది.

వలసవాద నాగరికతలో భాగంగా ఆధునికత భారతీయ సమాజంలోకి వచ్చిందన్నది ఒక అవగాహన. వ్యాపార ప్రయోజనాల కోసం వలసవాదులు చేసిన సంస్కరణలను అందిపుచ్చుకుని వారి మీదనే తిరుగుబాటు చేసారు భారతీయులు. ఫలితంగా రాజకీయ ఆర్ధిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి. తెలుగునాట భాషారంగంలో వచ్చిన పరిణామాలు వాజ్మయాన్ని సామాన్యప్రజలకు చేరువ చేసాయి. విద్యా సారస్వత రంగాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగే కొద్దీ భాషకి సరళీకరణ అవసరమైంది. ఆ అవసరమే వ్యావహారిక భాషోద్యమానికి కారణమైంది. గ్రాంధిక వ్యావహారిక భాషల మధ్య పోరు తీవ్రం కాక ముందే ఉత్తరాంధ్రలో మాండలిక భాషలో సాహిత్య సృజన ప్రారంభమైంది. భావ విప్లవకారుడు గానే కాక భాషా విప్లవకారుడుగా గురజాడని గుర్తించడానికి ఈ ప్రత్యేకత కూడా కారణం.

తెలుగులో సర్వ సంపన్నమైన తొలి మాండలిక రచనగా కూడా కన్యాశుల్కానికి ప్రాధాన్యత ఉంది. కన్యాశుల్కంలోని వస్తువుకు మెరుగు దిద్దింది అందులోని మాండలిక భాషా సొగసు. పాత్రోచిత మాండలికానికి కన్యాశుల్కం గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. మాటకారితనం, పదిమందిని చుట్టూ తిప్పుకోగల సామర్ధ్యం, మాటకీ చేతకీ పొంతన లేనితనం, స్వలాభాపేక్ష, ఆభ్యుదయవాదిగా ముసుగు, అమాయకపు స్త్రీల ఉద్ధరణకి పాటుపడుతున్నట్లు నటన, డాంబికం, ఆంగ్ల భాషా పటాటోపం ఉన్న ఒక గిరీశాన్ని సృష్టించడానికి ఎంత భాషా నైపుణ్యం ఉండాలి!!. యాతాం తోడుతున్న గిరీశాన్ని అగ్నిహోత్రావధాన్లు వారించినపుడు గిరీశం,    “ పని వంటి వస్తువలోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు ఊసుపోదు మొక్కలకా మంచిది. నాకా… కసరత్తూ. గవునరు తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవరాణీ వారు బీదలూ, సాదలకి ఇవ్వడానికి బట్టలు కుడతారు. ఇంగిలీషు వాడు సోమరితనం వొప్పడండి. వాళ్ళలో పెద్ద కవీశ్వరుడు షేక్ స్పియర్ యేవన్నాడో విన్నారా. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అన్నాడు. అనగా కలక్టర్ గొప్పవాడు కాదు ; జడ్జీ గొప్పవాడు కాదు. కాయక్లేశ పడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు…”    అంటాడు. ఒక్క గిరీశం పాత్ర మాత్రమే  కాకుండా మధురవాణి, రామప్ప పంతులు, లుబ్దావధాన్లు ఇట్లా ప్రతి పాత్రకీ దానిదైన విలక్షణతని కూర్చడంలో విజయనగరం లోని వివిధ వర్గాల ప్రజల భాష గురజాడకి చాలా సాయపడింది.

కన్యాశుల్కం లోని మాండలిక భాష , ముత్యాలసరాలు లోని వ్యావహారిక భాష, కథల్లో రెండింటి కలగలుపు ఆనాడు భాషారంగంలో సంచలనమయ్యాయి. ఆ సందర్భంగా వ్యక్తమైన వ్యతిరేకత, చర్చలు, వాదోపవాదాలు కూడా వ్యావహారిక భాషా ఉద్యమానికి తోడ్పడ్డాయి. గురజాడ ఏర్పరిచిన మాండలిక భాషా పునాది బలమైనది కనుకనే నూట ఇరవై ఏళ్లుగా ఇక్కడి రచయితల మాండలిక రచనలు తెలుగు నాట అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా చదువుకునే ప్రామాణికతను పొందాయి.

ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రజలు మాట్లాడే భాష కనుక ప్రతి మాండలికానికీ కొన్ని భౌగోళిక సాంఘిక విశిష్టతలుంటాయి. ఆ వైవిధ్యమే మాండలిక భాషా ప్రయోగాలకి రచయితలని నిబద్ధుల్ని చేస్తుంది. ఉత్తరాంధ్ర మాండలికానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి వ్యంగ్యం, హాస్యంతో కూడిన వ్యక్తీకరణ. వ్యక్తిగత సంభాషణా చాతుర్యం లోంచి పుట్టే వ్యంగ్యం సాహిత్యం లోకి వచ్చేసరికి సామూహిక  ప్రయోజనాలకి సాధనం అయింది. వ్యంగ్య రచనలు అనగానే గుర్తొచ్చే రావిశాస్త్రి, పతంజలి ఇద్దరూ సమాజం లోని చెడును నిరసించడానికి వ్యంగ్యాన్ని వాడారు. వారి వ్యంగ్యానికి వినోదం ప్రధానం కాదనీ  ఆపుకోలేని ఆగ్రహాన్ని విషాదాన్ని  దుఃఖాన్ని వ్యక్తీకరించడమే లక్ష్యమనీ మనకి తెలుస్తూనే ఉంటుంది. రావిశాస్త్రి రచనలన్నింటిలో విశాఖపట్నం మాండలికం గొప్పగా పలుకుతుంది. ముఖ్యంగా ఇక్కడి లంపెన్ వర్గాల జీవితాలను మాండలికం ద్వారానే బలంగా వ్యక్తం చేయగలిగారు.

విజయనగరం జిల్లా క్షత్రియ కుటుంబాల జీవన శైలి లోని అనేక పార్శ్వాలు పతంజలి, పూసపాటి కృష్ణంరాజు, దాట్ల నారాయణమూర్తి రాజు రచనల్లో కనిపిస్తాయి . విశ్రాంత వర్గానికి చెందిన వారి జీవితాల్లోని భేషజాలు ఆడంబరాలు నిర్వ్యాపకత్వం ఫాల్స్ ప్రిస్టేజి లాంటి అవశేషాలను వ్యంగ్యంగా చెప్పారు పతంజలి. రాజుల ఇళ్ళలో మెసిలే కాపలా కుక్క కూడా ఎలాంటి భేషజాలకు పోతుందో  ‘ వీరబొబ్బిలి ’ నిరూపిస్తుంది.     “ నేనయితే వేటకుక్కల్లోకెల్లా మేలయిన వేటకుక్కనన్నమాట. మొన్న ఆ మధ్య రెండు పులుల్ని మెడ కొరికి చంపీసేను. నేను వేటకొస్తున్నానని తెలిస్తే చాలు అడవి అడిలిపోతుంది. నేను వేట మొదలు పెట్టిన తర్వాతే ఏనుగులు భయపడి మా అడివి నుంచి పారిపోయాయి.అంతకు ముందు భయమూ భక్తీ లేకుండా తిరిగేవి. ఉడతలని మీ ప్రాంతంలో ఉంటాయో లేదో తెలీదు గానీ మా ప్రాంతంలో కద్దు. వాటిని పట్టుకోవడం భలే కష్టమనుకో. నేను అవలీలగా పట్టేస్తాను. నేను చాలా గొప్ప వేటకుక్కన్లే…”     అంటుంది ఈ నవలలో బొబ్బిలి. సమాజాన్ని తమకి అనుగుణంగా శాసిస్తున్న పోలీస్, న్యాయ, పరిపాలనా, పత్రికా వ్యవస్థల పట్ల పతంజలికి ఓపలేనంత ఆగ్రహం ఉంది. ఖాకీవనం, రాజుగోరు, అప్పన్న సర్దార్, పెంపుడుజంతువులు నవలల్లో ఆ వ్యవస్థల దుర్మార్గాన్ని చెప్పడానికి వ్యంగ్యమే అతనికి ఆయుధమైంది.

“ language is a complex system of speech habits.”    అంటాడు హాకెట్ అనే భాషాశాస్త్రజ్ఞుడు. మాట్లాడే అలవాట్ల సంక్లిష్టతలంటే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి చాలా ఇష్టం, గౌరవం.  ఆ సమయానికి ఆ అవసరానికి తగినట్లు ఏదొకటి మాట్లాడి సరిపెట్టే తీరు కాదు వారిది. ప్రతి మాటా గొప్ప సౌందర్యాన్ని సంతరించుకుని గానీ బైట పడదు. ఒక సామెతో జీవితానుభవమో తత్వమో ఉపదేశమో వాక్యంలో ఉండాల్సిందే. పోలీసులకూ నక్సలైట్లకూ మధ్య గిరిజనులు నలిగిపోతున్నారంటూ ఒక గ్రామ ప్రెసిడెంట్     “ ఒర్రే… మీ బతుక్కోరే చెప్పుతన్నూ.. అడివి పందులొచ్చి మేసికెలిపోతే ఊరపందుల చెవులు కోత్తారట – అలగన్నట్టగా – ఆ నచ్చలైట్లొచ్చి ఎవులు పీకలో ఒకలు తీత్తారు. ఆలూరుకొంతరా! ఆలూరుకోరు. ఆలొచ్చినారంటే పీకలు తరగడానికే వత్తారు. తీరా మోసి పీకలు దీసి ఆలు అడివి దెంగెత్తరు. ఆ సుడంతా వచ్చి మీ పీకకి చుట్టుకుంతాదిరా “      అని సవరల్నిభయపెట్టడాన్ని సువర్ణముఖి వర్ణించాడు.

భాషని సమర్ధవంతంగా ప్రయోగించాలనే లక్ష్యంతో జానపద శైలిలో పౌరాణిక భాషా స్వభావాన్ని కూడా అనుకరిస్తారు ఇక్కడి గ్రామీణులు. పురాణ సంబంధ గాధలు పాత్రలు ప్రతీకలని తమ భావోద్వేగాలకూ సందర్భాలకూ అనుగుణంగా మార్చేసుకుని భాషకి గాఢతని సృష్టించుకుంటారు. అట్టాడ అప్పల్నాయుడు రాసిన ‘బతికి చెడిన దేశం’ కథలో       “ నిజివేనిరొరే, నిజివేనిరా – బలరామనాయుడా – నిజిమేగానీ అరణ్యవోసం అయిన తరువాత అయివోద్య సింహాసనం దొరికింది రాములోరికి. రాజ్జెం దొరికింది పాండురాజు బిడ్డలికి. ఏలినవారి తోటి పోల్చుకోకురో యెర్రినాయుడో – అధికార పీఠం పోయిన అయిదేళ్ళకి మళ్ళా పీఠమెక్కీగల్రు ఆళ్ళు.”             అంటూ పురాణాలూ రాజకీయాలూ కలిపి అలవోకగా అల్లి మాట్లాడతారు.

ఉత్తరాంధ్ర మాండలికం ఏ ప్రాంతం వారు మాట్లాడినా వినసొంపుగా ఉండడానికి మరొక కారణం భావోద్వేగాల వ్యక్తీకరణలో దానికుండే లయాత్మకత… ఒక తూగు. సువర్ణముఖి  ‘ అగ్గి ’ కథలో ఒక పాత్ర రౌడీలను తిడుతూ…                ”ఆడికొక పెదపాము బొడ.. ఆడికొక చినపాము పొడ, ఆడాస్తి అగ్గైపోను . ఆడి బవనాలు బుగ్గైపోను. ఆడి గతి నిరుగతి అయిపోను.ఆది గయినం సాకలోడెత్త. ఆడికి గొయ్యి తీసి పాతియ్య. ఆది దిబ్బ మీద దీపమెత్త. ఆడికి రోజులు రోజులు చెయ్య..”        అంటూ తిట్లలో కూడా అలివి కాని అందాన్ని పొదుగుతుంది ఆ పాత్ర.

భాషాశాస్త్రపరంగా ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉత్తరాంధ్ర సాహిత్యానికి అన్వయించి చూస్తే మరి కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక రంగాల్లో ఆధిపత్య స్థితిలో ఉండడం వల్ల ఆ ప్రాంతాల భాష ప్రామాణిక భాషగా స్థిరపడింది. దీనిని భాషా శాస్త్రజ్ఞులు centripetal development గా  చెపుతున్నారు. ఈ కేంద్రీకరణలో చుట్టూ ఉన్న అనేక మాండలిక భేదాలు ఈ ప్రామాణిక భాషలోకి లాక్కోబడాలి. అయితే తెలుగు సాహిత్య సామాజిక రంగాల్లో మాండలిక భాష, ప్రామాణిక భాషలో గుర్తించదగినంతగా అంతర్లీనం కాలేదు. పైగా ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో మాండలిక భాషా ప్రయోగం ఆత్మ గౌరవ ప్రకటనగా కూడా స్వతంత్రతని నిలుపుకుంది. గత ఇరవై ఏళ్లుగా తెలంగాణా సాహిత్య పునర్నిర్మాణంలో ప్రామాణిక భాష కన్నా మాండలిక భాషా రచనకే సాహిత్యకారులు మొగ్గు చూపారు.

ఒక మాండలికంలో పలు భేదాలను బట్టి కూడా సాహిత్యానికి వైవిధ్యం ఏర్పడుతుంది. ఉత్తరాంధ్రలో భౌగోళిక భేదాలను బట్టి శ్రీకాకుళం. విజయనగరం, విశాఖపట్నం మాండలికాలు, కొండప్రాంతాల ప్రత్యేక మాండలికం, ఉద్దానం, మందస లాంటి చారిత్రాత్మక స్థలాల మాండలికం… ఇట్లా అసంఖ్యాకమైన భేదాలు కనిపిస్తాయి. వృత్తిని బట్టి ఏర్పడే మాండలికాల్లో ఉత్తరాంధ్రలో మత్స్యకారులు, చేనేత పనివారు, అటవీ ఉత్పత్తులు సేకరించేవారు, నెయ్యలు తయారు చేసేవారు, జీడిపిక్కల పరిశ్రమలో పని చేసేవారు మాట్లాడే భాషలోని అనంత వైవిధ్యం ఇంకా సాహిత్యంలోకి రావలిసి ఉన్నది.

ఉత్తరాంధ్రలోని పలువర్గాల మాండలికాన్ని అత్యంత సరళంగా హాయిగా వీనుల విందుగా వాడారు చాసో. ‘వెలంవెంకడు’, ‘ఎంపు’ కథల్లో వృత్తి మాండలికం, ‘బబ్బబ్బా’.. కథలో బ్రాహ్మణ సామాజిక వర్గంలోని చిన్నపిల్లలు మాట్లాడే భాష, ‘బొమ్మల పెళ్లి’ లో స్త్రీల మాండలికం వాడారు.ఉత్తరాంధ్ర గిరిజన మాండలిక విశేషాలు  భూషణం, అట్టాడ అప్పల్నాయుడు, సువర్ణముఖి కథల్లో పుష్కలంగా దొరుకుతాయి.గంటేడ గౌరునాయుడు కథల్లోని మౌఖిక జానపద ధోరణుల వలన కథలు పాఠకులకి త్వరగా సన్నిహితమవుతాయి. ఈ కథల్లోని ఉపమలు జాతీయాలూ సామెతలూ పలుకుబళ్ళూ నుడికారం లాంటివి భాషా శాస్త్ర పరిశోధకులకు నిధులవంటివి.

మాండలికభాషని సందర్భోచితంగా వాడిన కారా మాస్టారు మాండలికం రాయడం కోసం కృతకంగా ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తారు. గొట్టు మాండలికం వల్ల సాహిత్యానికి మేలు జరగదనీ ప్రజల నోళ్ళలో తరుచుగా వినబడే పదాల వాడకం వల్లన ఆ రచన పట్ల పాఠకులకి విశ్వాసం కుదురుతుందంటారు. విస్తృత సునిశిత పరిశీలన ద్వారా పాఠకుల విశ్వాసం పొందిన మాండలికాన్ని కారా మాస్టారి కథల్లో చూస్తాము. యజ్ఞం, జీవధార, నో రూం, చావు, లాంటి కథలు మాండలిక శాఖల, ఉపశాఖల విశ్వరూపాన్ని చూపుతాయి.

ఉత్తరాంధ్రలో అత్యధికశాతం మహిళలు శ్రామిక వర్గానికి చెందినవారు.ఇక్కడి స్త్రీల పోరాట చైతన్యం, తర్కం, సూక్ష్మ బుద్ధి, జీవితానుభవాల సాంద్రతలను సాహిత్యం ద్వారా చెప్పిన రచయితలున్నారు. శ్రామిక, మధ్యతరగతి స్త్రీల జీవితాలను స్త్రీవాద దృష్టి కోణంతో బమ్మిడి జగదీశ్వరరావు రాసారు. స్త్రీల ప్రత్యేక మాండలికాన్ని ఒక పురుష రచయిత గ్రహించి రాయడం అతను సాధించిన భాషా విశేషం.

రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, పతంజలి వంటి  రచయితలు యాసనీ (Slang), కూటభాషని (Argot) కూడా రచనల్లో వాడటం చూస్తే మాండలిక భాషా ప్రయోగాలు సూక్ష్మస్థాయిలో కూడా జరిగాయని తెలుస్తుంది. మధ్య తరగతికి ఉండే mobility వల్ల అన్యదేశ్యాలకీ తత్సమాలకీ  విలువ పెరుగుతోంది కానీ శారీరక శ్రమ మీద ఆధార పడే వర్గాల్లో ఇప్పటికీ మాండలిక భాషకే ప్రాధాన్యం ఉంది.

ప్రభుత్వ సంస్థలు మాండలిక భాషా పద కోశాల నిర్మాణానికి నిధులు వెచ్చించినప్పటికీ అకాడెమి రద్దు వల్ల ఆ పని సగంలోనే ఆగిపోయింది. శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల మాండలిక పదకోశాలు ప్రచురించబడ్డాయి. ఉత్తరాంధ్ర మాండలికాల మీద భాషా రంగంలో కొంత కృషి జరిగింది. ఆదిభట్ల నారాయణ దాసు ‘సీమపలుకువసి’, మారేడుపల్లి రామచంద్రకవి ప్రచురించిన ‘నుడికడలి’, ప్రకాష్ చంద్ర శతవతి ‘తెలుగు పలుకుబడులు’, వి.సి.బాలకృష్ణశర్మ ‘శ్రీకాకుళం ప్రజలభాష’ అత్తలూరి నరసింహారావు ‘రావిసాఖీయం’ అలాంటి వాటిలో కొన్ని. జి.యస్ చలం  రూపొందించిన ‘కళింగాంధ్ర మాండలికం -1’ మాండలిక పదకోశాలలో ఉండవలసిన ప్రామాణికతని వాగ్దానం చేస్తోంది. అకారాది క్రమ మాండలిక పదాలే కాక రచనల నుంచి ఉదాహరణలు సంఖ్యావాచకాలు వావివరుసలు సాంస్కృతిక విశేష పదాలు భాషా సంబంధ విశేషాలను కూడా చేర్చడం ద్వారా సమగ్రతను సాధించే ప్రయత్నం చేసారు చలం. దీనికి రెండవ భాగం ప్రచురణ దశలో ఉంది. మాండలికం కోసం చేసే ఏ కృషి అయినా అది ప్రజల పక్షం వహించేది కనుక మాండలిక భాషకి ఆదరణ రాన్రానూ పెరుగుతూనే ఉంటుంది.

కె.ఎన్.మల్లీశ్వరి

Malleswari.kn2008@gmail.com

వ్యాఖ్యానించండి