గీతలు దాటుతున్న సీతలు

Posted By on July 2, 2012

మల్లీశ్వరి


”మహాసాధ్వి సీత అన్నింటినీ పరిత్యజించి భర్త అయిన రాముడి వెంట అడవులకు వెళ్ళి పధ్నాలుగేళ్ళు అన్యోన్య దాంపత్యం కొనసాగించింది. భార్యంటే యిలా వుండాలి.”
కుటుంబ ధర్మాలనూ, పాతివ్రత్య నీతులనూ స్త్రీలకి మాత్రమే బోధించే ఏ సంప్రదాయవాదో చేసిన వ్యాఖ్య కాదిది. ఆధునికతలోని సానుకూల అంశాలనూ, పెడధోరణులనూ త్వరగా వొడిసిపట్టగలిగే ముంబయి మహానగరపు హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య యిది.
ఓ విడాకుల కేసులో భార్య తన నివాసప్రాంతాన్ని వదిలి భర్తకి బదిలీ అయిన చోటుకి వెళ్ళడానికి నిరాకరించి విడాకులు కోరిన సందర్భంలో న్యాయమూర్తి కేసు వాయిదా వేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
నిజానికి యిది చాలా సంక్లిష్టమయిన అంశాలను యిముడ్చుకున్న కేసు. కుటుంబం ఒక యూనిట్‌. కలిసి జీవించడం దాని ప్రాతిపదిక. భార్యాభర్తలు ఉద్యోగనిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో సుదీర్ఘకాలం జీవించాల్సి వచ్చినపుడు కుటుంబం ఒడిదుడుకులకు లోనవుతుంది. దానిని నివారించి అన్యోన్యంగా కలిసి జీవించడం కోసం ఎవరు రాజీపడాలి అన్నది సమస్య.
ఈ అంశంలో భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ దుర్మార్గకరమయిన రీతిలో అణచివేతకి పాల్పడటం ఉండదు. యిద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత, ఆర్థిక సర్దుబాట్లకి సంబంధించిన యిలాంటి సందర్భాల్లో భర్తని ‘మెయిన్‌ బ్రెడ్‌ విన్నర్‌’గా గుర్తించి అనేకమార్లు స్త్రీలే రాజీపడటం జరుగుతోంది.
ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈ కేసులో భార్య తను నివసించాల్సినచోటు మీద తను నిర్ణయాధికారం కలిగివుండి, ఆ నిర్ణయాధికారాన్ని భర్త గౌరవించని కారణంగా విడాకులు కోరింది. ఆ నిర్ణయాధికారం న్యాయస్థానాన్ని ఎందుకు అసహనానికి గురిచేసింది? రక్తం కారేలా కొట్టాడనో, కిరసనాయిల్‌ పోసి తగలబెట్టబోయాడనో వినడానికి ఒళ్ళు గగుర్పొడిచే హింసని అనుభవించిన స్త్రీ స్వరం దీనంగా, బేలగా సమాజానికి యింపుగా ఉంటుంది. ఆ స్త్రీకి సానుభూతీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ స్త్రీల చైతన్యం రెండవదశలోకి ప్రవేశించింది. ఆ హృదయ విదారక స్వరాలతోపాటు తమ హక్కుల్ని ఎస్సర్ట్‌ చేసుకోవడానికి అడ్డుపడుతున్న వివక్షల్ని ప్రశ్నించే స్త్రీల స్వరం యిపుడు ఖంగుమంటోంది.
కానీ ఆ స్వరం సమాజానికి యింకా అలవాటు కాలేదు. సమాజంలో భాగమయిన న్యాయవ్యవస్థని నడిపించే వ్యక్తులకీ అలవాటు కాలేదని పై వ్యాఖ్య నిరూపిస్తుంది.
మిగతా వ్యవస్థలకి భిన్నంగా న్యాయవ్యవస్థ నుంచి సమాజం ఎక్కువ ఆశిస్తుంది. జాతి, మత, కుల, లింగ, వర్గ, వర్ణ, ప్రాంతీయ వివక్షలకి గురయ్యేవారిపట్ల న్యాయస్థానాలు సానుకూల వైఖరిని కలిగి ఉండాలని అనుకోవడం అత్యంత సహజమయిన విషయం.
సమాజం కొత్తదశలోకి మారుతున్నపుడల్లా వాటికి సంబంధించిన అవగాహన, చైతన్యం, ఉదార దృక్పథాల పరిచయం, శిక్షణ న్యాయవ్యవస్థకీ అవసరమే.
సమాజం నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిళ్ళను ఎదుర్కొని స్త్రీలే తమ హక్కులపట్ల చైతన్యంతో మెలుగుతున్నప్పుడు, మధ్యయుగాల నాటి నీతులను స్త్రీలపై రుద్దాలని న్యాయవ్యవస్థలే ప్రయత్నించడం మంచి సూచిక కాదు. యిందులో మరీ ప్రమాదకరమయిన విషయం, పురాణాల నుంచి యిచ్చే ఉదాహరణల ద్వారా వాటిని దైవసత్యాలుగా భ్రమింపజేసి, అనుల్లంఘనీయం చేసి స్త్రీల మీద మరింత ఒత్తిడి పెంచడం.
స్త్రీల హక్కులు కాలరాయబడటంలోని అమానుషత్వాన్నీ, అణిచివేతనీ ప్రశ్నిస్తూనే, స్త్రీలు తమ హక్కులు స్వేచ్ఛగా పొందడం మీద ఎదురవుతున్న అసహనం, నియంత్రణలని చర్చించడం మీద కూడా దృష్టి సారించాలని ఈ కేసు స్పష్టం చేసింది.

18 thoughts on “గీతలు దాటుతున్న సీతలు

    • భాస్కర్ గారూ,
      ఆ కేస్ మొత్తంలో న్యాయమూర్తి వ్యాఖ్యలే ఆందోళనకరంగా ఉన్నాయి…అందుకే అది ప్రధాన అంశం అయింది…మీ స్పందనకి ధన్యవాదాలు.

  1. This a complexed case in my view. Can husband apply for divorce if she gets transfered to remote destination? But in such cases, wife deserts her present job and move to the destination along with her husband though she doesn’t face any divorce threat from her husband. The contraditions comes visible if wife files divorce case against her husband in refusal to move to the new destination along with her husband.

    • praween gaaroo,
      meeru cheppindi nijame.
      నేను ఈ వ్యాసంలో ఎక్కడా భార్యాభర్తల తప్పొప్పులను అంచనా వేయలేదు…ఇందులో హక్కుల సమస్య కన్నా బాధ్యతల్ని నిర్వహించడంలో వ్యక్తుల మధ్య ఉండాల్సిన సమన్వయం విషయంలో స్త్రీలు ఎక్కువసార్లు రాజీ పడతారు…అట్లా కాకుండా పురుషుడు రాజీ పడాలని స్త్రీ కోరడం అసహజమేమీ కాదు…కానీ న్యాయ వ్యవస్థకి ఎందుకు అసహనం కలిగింది అన్నదే ప్రశ్న…కుటుంబాలను నిలబెట్టాల్సిన బాధ్యత నిరంతరమూ స్త్రీలదే…అది న్యాయమూర్తి చెప్పడానికి ప్రయత్నించారన్న భావన ఆయన ఉదాహరించిన వాక్యాల ద్వారా కనిపించింది…అందుకే దాని మీద నిరసనలు వెల్లువెత్తాయి…లౌకిక దృష్టి కలిగి ఉండాల్సిన న్యాయస్థానాలు మత సాహిత్యపు ఉదాహరణల ద్వారా విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది

  2. న్యాయమూర్తి గారికి బోలెడన్ని ప్రశ్నలు :

    1. రాముడు వెల్లిన కారణం , ఈ కెసులొ భర్త వెల్తానన్న కారణం ఒకటేనా?

    2. సీత లా కాకుం డా ఊర్మిళ లా ఉండమని తీర్పు ఇస్తే ? 🙂

    3. మరి ఇప్పుదు యెవరి భర్త అయినా జైల్లొ ఉంటె వారి భార్య యెక్కడ ఉండాలి ???

    4. అప్పట్లొ సీతకి వెరె పనులేమి ఉన్నాయో కాని, ఈమెకి ఉద్యొగమ్ అనేది ఒకటుంటే ?

    5. జడ్జి రామయణం ఒక్కతే చదివారా, లా కుడా చదువుకొన్నారా ?

  3. రంగనాయకమ్మ గారు వ్రాసిన “తులసి దళం కాదు, గంజాయి దమ్ము” పుస్తకం చదవండి: http://kinige.com/kbook.php?id=1010
    చేతబడులకి అనుకూలంగా కోర్ట్‌లు ఇచ్చిన తీర్పుల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఈ రోజే నేను ATM కార్డ్ నంబర్ ద్వారా పుస్తకం కొని, డౌన్‌లోడ్ చేసి చదివాను.

వ్యాఖ్యానించండి