నాలో నీల

ఏయు తెలుగు శాఖ పీజీ విద్యార్ధి నీల గురించి రాసిన కవిత. రూపం ప్రాథమికంగా ఉన్నా ఒకటి రెండు మెరుపులు ఉండటంలో దీనిని కూడా సమీక్ష లేదా స్పందనగా తీసుకున్నాను.

కొమ్మన వారి మాటల్లో నీల

file:///C:/Users/singa/Downloads/malleswari%20garu.pdf

 

నీల

 

20.1.2018 జిల్లా కేంద్ర గ్రంథాలయం, ఏలూరు

—————————

హఠాత్తుగా కొద్దిరోజుల క్రితం తానా పురస్కారం అందుకొన్న నవలగా ‘నీల’ గురించి పాఠకలోకానికి  సమాచారం. ఏ పత్రికలోనూ సీరియల్ గా రాలేదు. 550 పుటల మేర విస్తరించిన నవల అని తెలిసే అవకాశమూ లేదు. (1986-2011) కాలాల మధ్య ఉత్తరాంధ్ర మొదలు భాగ్యనగరం వరకు కథాకాలంలో నెలకొన్న కొన్ని వాస్తవాలకు అక్షరరూపం. నిజం ఎక్కువగా, కథనాన్ని ఆశ్రయించిన నవల. కల్పన చాలా తక్కువ.

25 ఏళ్ళలో మూడు తరాల మేర విస్తరించిన కథ ఇది.

మన పొరుగున ఉన్న వేంపాడు గ్రామంలో పాతూరి పూర్ణచంద్ర రావు, అనూరాధ గారల అమ్మాయిల్లో మల్లీశ్వరి మాత్రమే రాయగలిగిన నవల. చాలామంది రచయితలకు లొంగని కథ. ఈ నవల మహిళ మాత్రమే తెలుగు పాఠకులందరి కోసం  రాయగలిగిన నవల.

ప్రణాళిక మొదలు స్పృశించిన ప్రతి అంశం వెనుక అపార పరిశోధన ఉంది. పరిశీలన ఉంది. అనితర సాధ్యమైన అధ్యయనం ఉంది. నిశితమైన విశ్లేషణ ఉంది. పరిమళించే మానవత్వం ఉంది. ఉండవలసినంత క్షమ ఉంది. పొరలు పొరలుగా విస్తరించే జీవితంలో రకరకాల సంకటాల, ఘర్షణల రహస్యాలున్నాయి. కవిత్వం ఉంది

స్త్రీ పురుషసంబంధాల్లో ఎవరు ఏమి కోరుకుంటున్నారు, స్వాభిమానం ఉన్న మహిళ ఏమికోరుకుంటుంది  అన్న విషయాలకు సంబంధించి గాఢమైన చర్చ ఉంది అన్నింటినీ మించి స్త్రీ పురుషుల మధ్య జీవితంలో లైంగిక బంధానికి – ప్రేమకు గల అంతరాన్ని చెప్పిన తీరు, ‘నీల’ను ఒకటికి రెండుమార్లు చదివేలా చేస్తుంది.

నీతి – అవినీతి అనే పడికట్టు పదాల పరిధి దాటిన నిజాయితీ ముఖ్యం. ప్రేమించడం,ప్రేమించబడడం ఉన్నతమైనవే కానీ క్షమించగలగడం సర్వోన్నతం అని గ్రహిస్తాం. క్షమించగలగడం వరకూ మనిషి ఎదిగితే జీవితానికి పరిపూర్ణత ఉంటుంది. అదేదో దేవుడు చేసిన పని మనమే చేసినట్టుగ ఉంటుంది. ఇదంతా మన గ్రహణలోకి రావాలంటే ‘నీల’ ను అధ్యయనం చేయాలి. చలం సమకాలీన సమాజంలో కంటే తర్వాతే అర్థం కావడం జరిగింది కాని మల్లీశ్వరి ‘నీల’ను సమకాలీన సమాజం పట్టించుకోవలసిన అవసరం ఉంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వెల్లివిరిసేందుకు నీలను పట్టించుకుని అధ్యయనం చేయాలి.

ఇప్పటి సమాజంలో ఒంటరిగా ఉంటున్న మహిళలు, వివాహంతో ప్రమేయం లేకుండా కేవలనమ్మకంతో సహజీవనం చేస్తున్న స్త్రీ పురుషులు, వైవాహిక బంధాన్ని గౌరవించలేక, వ్యామోహాలను కట్టడి చేసుకోలేక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో తెలియక వంచనలో, దుఃఖంతో హింసతో నలుగుతున్న జీవితాలూ నవలలో కనిపిస్తాయి.

ఈ సమాజంలో కులమతాలూ, సంపన్నులూ, సామాన్యులూ, నిరుపేదలు ఉన్నారు. నిరసనలూ, ఉద్యమాలూ, పోరుబాటలూ, పథకాలూ ఉన్నాయి. వీటి చుట్టూ అల్లుకున్న కథలూ ఉన్నాయి. 1986 డిసెంబర్ 19 న ఏలూరులో నాలుగైదు వేల కార్మికుల జీవనోపాధికి కేంద్రమైన జ్యూట్ మిల్ లాకౌట్ గురించి, అది సృష్టించిన సంక్షోభం గురించి మనలాంటి మధ్య తరగతి ప్రజలకు, మూడింట రెండు వంతుల మందికి వార్తగా మాత్రమే తెలుసు

ఓ పదిపైసలు తక్కువకు రిక్షా దొరుకుతుందంటే, ఇంట్లో పని పాటలకు విరివిగా మనుషులు దొరుకుతున్నారంటే – మనకు కలిసివచ్చే పది పైసల గురించే తప్ప దాని వెనుక దాగిన దుఃఖం, ఘర్షణ, పోరాటం మనకు తెలియవు.

ఓ రకంగా మనవి సాగుబడి జీవితాలు. బ్రతుకు తెరువును వెతుక్కుంటూ నమ్మి వచ్చిన వాళ్ళ జీవితం తెలియదు. రాజకీయ నాయకులకు మాత్రం కార్మికుల ఓట్లు కావాలి. యజమానుల నిధులూ కావాలి. నాయకులు కూడా సమస్యలను కోరినంతగా పరిష్కారాలను పట్టించుకోరు.

ఈ నేపథ్యంలో, తాగుడుకు బానిసై కుటుంబ భారం వీసం మోయని పరిశికి  కుట్టుపని చేసి గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చంద్రకళకు జన్మించిన  బిడ్డగా నీలను ఏలూరు చోళదిబ్బలో తొలిగా చూస్తాం. చివరిలో ప్రముఖ న్యాయవాది సదాశివతో జీవితాన్ని పంచుకున్న సహచరిగా చూస్తాం. ఏలూరు మొదలు రాజమండ్రి, విశాఖ తప్ప హైదరాబాద్ వరకు   నీలతో పాటే నవలలో పాస్టరమ్మ కనబడతారు

నీల, ప్రసాద్ సరళ -రాజమండ్రి

నీల పరదేశి (నీల పెట్టిన పేరు)  చేతన — విశాఖ

నీల సదాశివ వసుంధర — హైదరాబాద్  ప్రధాన భూమికలుగా రచన సాగుతుంది.

ఆరంజ్యోతి, స్టాలిన్ సూర్యం, ఆటో రాజు తొలిదశలోనూ సంపూర,్ణ రెడ్డియ్య శుభాంజలి రత్నాకర్ రాధాకృష్ణ మలిదశలోనూ ఏలూరులో మనల్ని పలకరిస్తారు. స్టాలిన్ సూర్యం పాత్ర మాత్రం చివరివరకూ పరోక్షంగా పలకరిస్తూనే ఉంటుంది. స్టాలిన్ సూర్యం,బహుశా నీలలో ఒక పార్స్వంగా ఉండిపోయిందేమో.

వైజాగ్ లో పైడమ్మ అనుభవాలు మనలను ఆర్ద్రంగా చేస్తాయి. ఉత్తరాంధ్ర జీవితంలో మనకు తెలియని మిత్తరికం సంభ్రమానికి గురిచేస్తుంది. హైదరాబాద్ లో మీనో,  అజిత, నీతూబాయి, ప్రకాష్, హవల్దార్ మత్తయ్య, సంతోషి, ప్రవీణ్ ఒక్కోళ్ళది  ఒక్కో కథ.

నవలలోని సంభాషణలు, సంఘటనలు, సన్నివేశాల కల్పనలో బలం వల్ల మనసును ఆవరించి వేస్తాయి.

అలాంటివి కొన్ని:

“ఏవల్లా మీరు చేసింది ఏవన్నా బాగుందా! అన్నీ చెప్పేకదా బాబూ నీకు కట్టబెట్టాం. ‘నీల బుద్ధిమంతురాలు, ఉన్న పళంగా ఈ పిల్ల నా ఇంటికి వస్తే చాలన్నావు’ ఏం నిలబెట్టుకున్నావు? తప్పో ఒప్పో ఏం జరిగినా కడుపులో పెట్టుకుని సాకాలి తప్ప, దిక్కు లేని పిల్లను చంటిబిడ్డతో సహా రోడ్డు మీదకు గెంటారే! ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే మీకు బాగుండేదా! గద్దరి పిల్ల కాబట్టి  చెలాయించుకొని ‘ఠట్ మీతో నాకేంటని’ బతుకుతోంది. ఇపుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తే  నా బిడ్డ మనసు ఎంత రంపపుకోత బడుతుంది” –

ఇలా రాయడం ఆషామాషీ కాదు

పాస్టరమ్మ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం కూడా చర్చికి వెళ్ళి ఆ వాక్యాలు వినాలనిపిస్తుంది.

“మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు” పాటలోని తోడు వంటి గొప్పభావం స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కానక్కరలేదు. పాస్టరమ్మ వంటివారు కూడా అట్లా నీలపక్షాన నిలబడగలరని తెలుస్తుంది. మనిషి ఎప్పుడూ తపించేది అలాంటి తోడుకోసమే. ఆ పాటకు 50 ఏళ్ళు. ఇన్నేళ్ళ తర్వాత, ‘నా తప్పొప్పులతో సహా స్వీకరించగలిగితే స్వీకరించు..అని ధైర్యంగా చెప్పగలిగే రోజు వరకు వచ్చిన పరిణామం ఈ నవలలో చూస్తాం..

“మీతో కలిసి జీవించడం ఇష్టమే, కానీ నాదొక కోరిక.  మీరు నాతో ఉన్నంత కాలం నా ఒక్కదానితోనే ఉండాలి” అంటుంది నీల సదాశివతో. కొన్ని పంక్తుల తర్వాత “నీ పీడకలలతో  నేను స్నేహం చేయనన్న నమ్మకం పెంచుకో నీలూ! నువ్వు చెప్పింది నాకు అంగీకారమే” సదాశివ అంటాడు. పాత్రల్లో పరిణతి చెందిన స్వభావానికి ఇవి స్ఫుటమైన వ్యక్తీకరణలు.

‘తెల్ల నురుగు పూల అంచున్న నీటి రంగు జార్జెట్ చీరలా ఉంది  ఈ పల్చని అల’ అన్న ప్రాదేశిక వర్ణన భావుకత ఉన్న ప్రతి ఒక్కరినీ తాకుతుంది.

మరో సన్నివేశం: “బిందె బోర్లించి దానిమీద కూచుని వెన్నెలలో తడుస్తూ సముద్రం కేసి చూస్తున్న ఒక ఆడమనిషి కనిపించింది. ఆమె ఒళ్ళో పిల్లి బద్ధకంగా మెసులుతోంది. పక్కన కూర్చున్న కుక్క తనూ దీర్ఘంగా సముద్రాన్ని చూస్తోంది.  కెరటాల హోరు తప్ప మరిక ఏ శబ్దమూ లేని నిశ్చల వర్ణచిత్రంలా ఉంది.”

ఈ పంక్తులు చదివిన తర్వాత  ఒక వర్ణచిత్రం  పాఠకుల గది  గోడమీద అలంకరింప బడుతుంది.

“ఈర్ష్య పాతాళమంత  కఠినమైనది ప్రేమ మరణమంత బలవత్తర మైనది”

అన్న అద్భుతమైన బైబిల్ వాక్యాన్ని ఒక సన్నివేశపు ముగింపులో వాడారు.ఈ వాక్యాన్ని అర్థవంతంగా వాడుకోవడంలో సన్నివేశ సాంద్రత, గాంభీర్యం కొన్ని పుటల వ్యాఖ్యానాన్ని కుదించినట్టయ్యింది

పరదేశి, పైడమ్మ కలగాపులగంగా నీల ఆలోచనల్లోకి వచ్చిన స్థితి గురించి వర్ణిస్తూ

‘జోడుదుఃఖాల సవారీ చేయలేక పోతోంది నీల’ అంటుంది రచయిత్రి.

ఇంత గాఢమైన వాక్యాలు అడుగడుగునా కనపడతాయి

సంకీర్ణ మానవ స్వభావాల్లో పొరలను, అంతరంగ ఘర్షణలను, నేపథ్యాలను ఆవిష్కరించింది ఈ నవల. రచయిత్రి శక్తి అంతా అక్షరాల్లోకి ప్రవహించి, మాటలై, వాక్యాలై  పాఠకుణ్ణి 360 డిగ్రీల్లో లోకాలను కలయజూసి కంటికి కనబడని, చెవికి వినబడని విషయాలను తెలుసుకు చావండని తరుముతాయి. ఇంతకు ముందు పరిచయం లేని శైలిలో ఆలోచనలు దట్టించిన వాక్యాలు చదువరికి జ్ఞానం ప్రసాదిస్తాయి.

చెమ్మీన్, మరణానంతరం, గణదేవత వంటి నవలలు చదివిన తర్వాత చెపుతున్న మాట ఇది, ఏదో ఒకరోజున జ్ఞానపీఠ పురస్కారం అందుకునే  ధాతునిర్మాణం  మల్లీశ్వరి అక్షరాల్లో అక్షరాలా దర్శనమిస్తోంది.

కొమ్మన రాధాకృష్ణ రావు

వట్లూరు

నచ్చిన పుస్తకం – నీల

జ్యోతిగారిని విడిగా ఒకటి రెండు సార్లు చూసినా తెలుసుకోవడం మాత్రం నచ్చిన పుస్తకం సమావేశంలోనే. మొన్న డిసెంబర్ ఆఖరి శనివారం ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించారు. నీల నవలా నేపథ్యం గురించి చెప్పాను. అందరం కలిసి చాలా విషయాల మీద చర్చ చేసాం. చాలా సీరియస్ వాతావరణంలో ఆ చిన్ని సాహిత్య బృందం, అనేక మంచి పుస్తకాల గురించి కలబోసుకుంటూ ఉంటారు. గత ఆరేళ్లుగా ఒక్క శనివారం కూడా మిస్సవ్వకుండా సమావేశాలు జరిగాయని తెలిసినపుడు మాత్రం సంతోషంగా, హాప్ ఫుల్ గా అనిపించింది. ఆ రోజు జ్యోతి గారి వాగ్ధాటి, క్లారిటీగా ఉన్న ఆలోచనలు – మొదటిసారిగా తెలుసుకున్నాను. జీవిత వాస్తవికత బాగా తెలిసిన మనిషి అనుకున్నాను. నచ్చిన పుస్తకం ద్వారా ఆమె అనేక పుస్తకాలను రివ్యూ చేస్తూ ఉండటం మనందరికీ తెలుసు. ఈ రోజు నీల నవల మీద విమర్శనాత్మక సమీక్ష ద్వారా కొన్ని చర్చనీయాంశాలను వెలుగు లోకి తెచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్.

మల్లీశ్వరి

******************

 

జ్యోతి

jyothy spreading light – నచ్చిన పుస్తకం

నీల” ఇప్పుడే పూర్తి చేశాను. ఒక స్త్రీ జీవితంలోని లోతుల్నీ, ఆశయాలని, కోరికలని ఆమే చేరుకున్న గమ్యాన్ని చేరవల్సిన లోతుల్ని అన్నిటినీ సుదీర్ఘంగా చర్చకు లేవదీశారు ఈరచనలో మల్లీశ్వరీ. ముఖ్యంగా మానవీయ స్వేచ్చ కోసం ఒక తపన కనిపిస్తుంది ఈ నవలలో. నీల జీవితంలో ఆమే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, కాల మాన పరిస్థితులు అన్నిటినీ చర్చిస్తూ, జూట్ మిల్ ఉద్యమం, సారా వ్యతిరీక ఉద్యమం, తెలంగాణ ఉద్యమ వాతావరణం, వీటన్నిటినీ స్పృశిస్తూ వెళ్ళారు. ఈ నవలలో వచ్చే ప్రతి స్త్రీ పాత్ర తన జీవితంలో ఒక మెరుగైన జీవనం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. అయితె ఎవరి దారి మంచిది అనే వాదన పెట్టుకోలేదు రచయిత్రీ. చంద్రకళ లాంటి పాత్రల అక్రమ సంబంధం (సమాజం పెట్టీన పేరు) కూడా ఒక పోరాట చర్యగానే చూడాలి. సరళ కూడా తనదైన రీతిలో ఒక మెరుగైన జీవనం కోసం పోరాటం చేసింది. ప్రసాద్ ను సాధించుకోవడానికి తన దారిలో కష్టపడింది. నీల భర్త ప్రసాద్ సరళతో సంబంధాన్ని నడుపుతూ తన కోసం అంటూ నీలని వివాహం చేసుకుంటాడు. సరళ లాంటి స్త్రీలను ఉపయొగించుకోవడం తప్ప చట్టబద్దమైన రక్షణ కల్పించవల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక పురుషుడిగా సమజం తనకు ఇచ్చిన వసులుబాటును తనకు అనుకూలంగా వాడుకుంటాడు. అటువంటి పురుషున్ని తన అధీనం చేసుకోవడానికి సరళ ఒక పెద్ద పోరాటమే చేస్తుంది. ఆమేలో ఆ లౌక్యం, తెలివి, లేకపోతే ఆమే జీవితం ఎప్పుడో రోడ్డుమీద పడేది. ఎందుకంటే తన జీవితానికి ఒక పురుషుని అండ అవసరం అని నమ్మిన స్త్రీ ఆమే. ఆ నమ్మకానికి అనుకూలంగానే ప్రవర్తించింది.

 

నీల భర్త నుండీ విడిపోవడంలో ఔచిత్యం ఉంది. భర్త నుండి కేవలం చట్టపరమైన రక్షణ తన పిల్లకి ఒక అండ లాంటి ఆలోచనలతో జీవితం గడిపే వ్యక్తి కాదు నీల. తనకి జీవితంలో ఏం కావాలో అప్పటికి స్పష్టమైన అవగాహన లేకపోయినా ఇప్పుడు జీవిస్తున్న జీవితం తనది కాదు అనే స్పష్టత తనలో ఉంది అది సూర్యం, వసుంధర, రవి లాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిన తన మేధ వలన కావచ్చు. నేను ఇంత కంటే మెరుగైన జీవితానికి అర్హురాలిని అని తాను నమ్మిన సిద్దాంతం వలన కావచ్చు, అందుకే గృహహింసను లలిత చెప్పినట్లుగా సర్దుకుపోలేకపోయింది. ఆరంజ్యోతి లాంటి వ్యక్తుల ప్రభావం కూడా తనకు లోపల ఉండిఉన్న కారణంగా జీవితంలో పోరాటానికే సిద్దపడి భర్త నుండి విడిపోతుంది. తనను తను మలచుకునే నేపద్యంలో శ్రమిస్తుంది. అజిత దగ్గర పనికి కుదురుతుంది. అజిత బాల్య వివాహపు నీడలోనుండి బైటపడి వంటరి స్త్రీ గా కోరి జీవిస్తుంది. అది ఆమే చాయిస్. అనాది కాలం నుండి ఈ ఒంటరిగా జీవించిన స్త్రీలు సమాజంలో మనకు కనిపిస్తారు. ఆ నాటి కాల మాన పరిస్థితులకు అనుకూలంగా ఒక మార్గాన్ని ఎన్నుకుని జీవించారు. భారత దేశంలో మీరాబాయి, అటువంటి స్త్రీయే. పాశ్చాత్య దేశాలలో జేన్ ఆస్టన్, ఎమిలి డికిన్సన్ వంటీ మహా రచయిత్రిలు తమ చాయిస్ తో ఒంటరి జీవితాన్ని ఎన్నుకున్న వారే. అజిత జీవితంలో కొన్ని అనుభవాలున్నా అవి తన జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఒక పర్సనేల్ స్పేస్ తనకోసం నిర్మించుకుని జీవితాన్ని గడీపేస్తూ ఉంటుంది. ఇక వసుంధర, సమాజంలోని స్త్రీల కోసం పరితపిస్తూ పోయే స్త్రీ. తనకు సదాశివకు మధ్య ఒక అనుబంధం ఉన్నా అది నీల సదాశివ జీవితంలో ప్రవేశించిన తరువాత అంతే గౌరవంతో తప్పుకుంటుంది. తను సరళ కాదు కాబట్టే నీల జీవితంలో ఒక మంచి అధ్యాయం మొదలవుతుంది. భర్త నుండి వేరుపడి పరదేశితో మొట్టమొదట ప్రేమలో పడీనా చేతన అనే మరో స్త్రీతో పరదేశికి సంబంధం ఉంది అని తెలిసి తనకోసం చేతనను వదిలేయడానికి సిద్దపడ్డ పరదేశితో బంధం తెంచుకుంటుంది నీల. కాని ఎందరితోనో అటువంటీ బంధాలున్న సదాశివను నమ్మి అతనితో సహజీవనాన్ని కాదనదు. ఇక్కడ పెద్ద లాజిక్ కనపడదు. ఒక కన్ప్యూషన్ లోనే పరదేశిని కాదంది అనిపించింది. తన తల్లి లా మరో స్త్రీ జీవితంలోకి ప్రవేశించడం తనకు ఇష్టం ఉండదు. కాని ఇక్కడ సదాశివ ఎందరో స్త్రీలతో కలిసి ఉన్న వ్యక్తి. అతను తనకు ఆలంబన అవుతాడని ఆమె నమ్మడం కేవలం అప్పటి భావతీవ్రత, అజిత లాంటి స్త్రీలను గమనిస్తూ సంపూర్ణ లాంటి స్త్రీల జీవితాన్ని దగ్గరగా చూస్తూ నైతికత పట్ల మారుతున్న ఆమే అభిప్రాయాలు అయి ఉండవచ్చు. సదాశివ ఆమేను ప్రేమించాడు. ప్రేమ కోసం అతని వెతుకులాట ఆమేతో అంతమయ్యిఉండవచ్చు అందుకే వసుంధర లాంటి స్త్రీ కూడా తనకు తాను వారి జీవితంలోనుండి తప్పుకుని ఒక మిత్రురాలిగా మాత్రమే ఉండిపోవడానికి మొగ్గు చూసిస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ జంట కలిసినప్పుడు జరిగే పరిణామం గా మాత్రమే చూడాలి అని నాకు అనిపించింది. తరువాత పరదేశి తో స్నేహం, ఒక మెచ్యూరిటి ఉన్న స్త్రీ తీసుకునే నిర్ణయం. ఇక్కడ నీల వసుంధర స్థాయిని అందుకోగలిగింది. దాన్ని ప్రోత్సహించిన సదాశివ తమ బంధం పట్ల, తమ పరస్పర అనుబంధం పట్ల నమ్మకం ఉన్న మంచి ప్రేమికుడు. ప్రేమను పోందాలంటే దాన్ని బంధించకూడదనే నిజం తెల్సిన భావుకుడు.

 

అయితే నీల జీవితంలో ప్రతి మార్పుకు ఆమే చుట్టూ ఉన్న వ్యక్తులే కారణం. ఆమే జీవితం ఎందరో మంచి వ్యక్తుల సమాహారం. కాని నిజ జీవితాలు ఇంత చక్కగా ఉండవు. తమను తాము తీర్చుకోవడానికి ఇన్ని అనుకూలమైన స్థితులు స్త్రీలకు సాధారణంగా దొరకవు. తల్లి చనిపోయినా పెంచి పెద్ద చేసి వివాహం జరిపించిన పాష్టరమ్మ లాంటి కుటుంబాలు చాలా అరుదు. ఒక బడుగు స్త్రీ ఉన్నతి కోసం పరితపించె వసుంధర లాంటి వ్యక్తులు అరుదు. ఏ అండ లేని ఒక బాల్య స్నేహితురాలి కోసం తపించే సంపూర్ణ లాంటి వ్యక్తులు అరుదు. అజితలకు తమ జీవిత పోరాటానికే అలుపు వచ్చే పరిస్థితులు ఇక మరో స్త్రీ భాద్యత తీసుకునే వెసులుబాటు సమాజం ఇవ్వదు. పరదేశి లాంటి వ్యక్తులు అరుదే. చేతనను నీలను పోగొట్టుకుని సమాజం వైపు మళ్ళీన అతని మంచితనం వ్యక్తిత్వం ఒక అపురూపమైన నిది. అలాగే సదాశివ. ఇంత ఆర్ద్రతతో ఒక స్త్రీని అక్కున చేర్చుకునే పురుషులు, సదాశివ తల్లితండ్రులు, ఇందరి కలయికే నీల జీవితం. ఒక స్త్రీకి సాదారణంగా ఇటువంటి వ్యక్తులు ఒక్కరు తారసపడితేనే అల్లుకుపోతుంది. నీల జీవితం నిండా ఇంత మంది గొప్ప వ్యక్తులు. ఇటువంటి సామాజిక వాతావరణంలో నీల పోరాటం ఆమేను ఎంత ఉన్నత స్థాయికి తీసుకుపోగలదో అదే జరిగింది. సమాజం నుండి ఇటువంటి చేయూత ఏ స్త్రీకి దొరికినా ఆమే జీవితం ఇంతే అద్భుతంగా ఉంటుంది. స్వేచ్చపై నిర్వచనాన్ని ఇస్తూ ఒక స్త్రీ మనసుని ఆవిష్కరిస్తూ ఆమే చుట్టు అద్బుతమైన ప్రపంచాన్ని సృష్టించారు రచయిత్రి. నీలవేణీ నీలగా మారడానికి ఈ అధ్బుతమైన ప్రపంచమే కారణం అన్నది నాకు అనిపించింది. అటువంతి పరిస్థితులు ఇంత మంది గొప్ప వ్యక్తులు ఎందరి జీవితాలలో ఒకేసారి తారసపడతారు అన్నది మాత్రం ఒక ప్రశ్నే.

 

వివాహం మీద నమ్మకం సడలిపోతున్న రోజులివి. లివింగ్ రెలీషన్స్ ని సమర్ధిస్తున్న వ్యక్తులు పెరుగుతున్నారు. అసలు ఒక రోజు తంతు జీవితాలను ప్రభావితం చేయదు. గత వారం ఒక సెమినార్ లో రిలేషన్ షిప్స్ మీదే అధ్యయనం చేస్తున్న ప్రముఖ సైక్రియాటిస్ట్, రచయిత విజయ్ నాగసాయ్ గారి తొ ఒక చర్చలో పాల్గొనాను. ఏ బంధం అయినా ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడుతుంది కాని వివాహ వ్యవస్థ కన్నా ఈ సహజీవనం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అన్న వారి వాదన కూడా ఆలోచించవల్సిన విషయం అనిపించింది. నిజానికి ఈ సహజీవనంతో ప్రెషర్ ఎక్కువగా ఉండి నలిగిపోతున్న జంటలు చాలా ఉన్నాయి అని వారు అన్నారు. సదాశివ లాంటి వ్యక్తులు ఎదురయ్యినప్పుడు పెళ్ళి అయినా, సహజీవనం అయినా ఒకే అనుభవాన్ని ఇవ్వవచ్చు. నీల తండ్రి పరశి లాంటి వ్యక్తితో పెళ్ళి అయినా సహజీవనం అయినా స్త్రీ జీవితం చంద్రకళ జీవితం లానే ఉంటుంది. బంధాలు మనుష్యులతో ఏర్పడతాయి, వారు ఆలోచన. అవగాహన, పరస్పర గౌరవాలపై అని నిలబడతాయి. ఈ ఒక్క సందేశం ఈ నవలలో పూర్తిగా రాలేదనిపించింది. పాష్టరమ్మ అనుమానాలను పరదేశీ తల్లి తండ్రులు ఆర్ధికపరమైన కాగితాలతోనే తీర్చగలిగారు. సదాశివ జీవితంలోకి వచ్చిన ప్రతి స్త్రీతో వారు ఇలాంటీ ఒప్పందానికి రాలేదు. రాలేరు కాని తన బిడ్డ జీవితం గురించి పాష్టరమ్మ అడిగినప్పుడు నీల జీవితానికి రక్ష ఉంటుంది అని కొన్ని కాగితాలను చూపించి నీలను తమ కోడలిగా స్వీకరించారు. ఇది ఒక రకమైన వివాహ ఒప్పందం లానే ఉంది. సహజీవం పట్ల కొన్ని అనుమానాలు, ఇన్సెక్యూరిటీలు ఉండడం సహజం. అదే ఇన్సెక్యూరిటి వివాహ వ్యవస్థలోనూ ఉంటుంది. అది పోవడానికి మాత్రమే చట్టబద్దత అవసరం. ఇక్కడ ఆ కాగితాలను పాష్టరమ్మ దాచి పెట్టూకుని తన బిడ్డకు అటువంటి సెక్యూరిటి చేకూర్చానని తృప్తి పడుతుంది. ఇది ఏ రకమైన బంధంలోనైనా ఆలోచించవలసిన విషయమే. ఇటువంటి భయం వ్యక్తుల ప్రెమ, ఆదరణతో తీరాలి అంతే. అందువల్లే నీల సహజీవనం వివాహ వ్యవస్థలో ఉండే సహజమైన భయాల తోనే ఏర్పడింది అని అనిపించింది తప్ప సహజీవనం వివాహం కన్న ఎదో మెరుగైన జీవనం స్త్రీకి ఇవ్వగలదు అన్న ఆలోచన నాకు కలగలేదు.

 

నీల కూతురు మినో నేటి తరానికి ప్రతినిధి. స్వేచ్చ పట్ల ఆమే డెఫినేషన్స్ ఆమెవి. ప్రతి తరం ఎదుర్కునే సమస్యే ఇది. అయితే తల్లి తండ్రుల ఇటువంటి బంధాలని పిల్లలు మినో ఆమోదించినట్లు ఆమోదించరు. మరో వివాహం చేసుకున్న, మరో పురుషుడితో ఉంటున్న స్త్రీ తన సంతానం విషయంలో నీల లా నిశ్చింతగా ఉండె పరిస్థితులు చాలా తక్కువ. ఇది గమనించవల్సిన విషయం. నీల జీవితంలో అటువంతి ఒడిదుడుకులు రచయిత్రి చూపలేదు.

స్త్రీ తనను తాను ఏ రకంగా గౌరవించుకోవాలో చెప్పే నవల గా మాత్రం నీలను నేను చూశాను.

నీల – హాన్స్ ఇండియా

 

Image may contain: 1 person, smiling

 

సంక్లిష్టంగా ఉన్న ఈ నాలుగు మాటలను సరళంగా హాయిగా అనువాదం చేసిన సాంబశివరావు గారికి, హాన్స్ ఇండియా శర్మ గారికి, మిగతా హాన్స్ ఇండియాటీమ్ కి, మా వారధి గంగాధర్ గారికి థాంక్యూ

**********************

నీల నవల రాయడానికి ఇన్స్పిరేషన్?

సమాజంలో ప్రతి నిర్మాణం మారుతూ వస్తుంది. అది, స్త్రీ పురుష సంబంధం కావొచ్చు, ఉద్యమ సంబంధాలు కావొచ్చు, ఇతర మౌలికవ్యవస్థల నిర్మాణం కావొచ్చు. కొన్నిసార్లు మనం ఎంతో ఆధునికం అని నమ్మిన వ్యవస్థలు, సంస్థలు కూడా రెండు మూడుతరాలు గడిచేసరికి హింస, వివక్ష, అనిశ్చితి, అసమస్థాయిలతో నిండి సవాళ్లు విసురుతున్నాయి.వాటిని ఎప్పటికపుడు పరీక్షకి పెట్టాల్సిన అవసరంలోనుంచి కూడా ఈ నవలకి పూనుకున్నాను. అట్లాగని నేను నిర్మాణాలకి వ్యతిరేకిని కాను. ప్రజాస్వామిక భావనలు నిలబడటానికి అవసరమైన నిర్మాణాలు ఉండాలి, వాటిలోనుంచి పేట్రియార్కీ తొలిగిపోవాలి.

నవలా వస్తువు, స్థల కాలాదుల నేపథ్యం?

గత మూడు దశాబ్దాలుగా చరిత్రతో ఒక స్త్రీ చేసిన సహజీవనం స్థూలంగా వస్తువు. చరిత్ర అన్నపుడు సామాజికం ఎంతో అంత వ్యక్తిగతం కూడా. ఒక మనిషి చుట్టూ ఆవరణాన్ని నిర్మించడం నవలాకారులకి తొలి పరీక్ష. నేను పుట్టిపెరిగిన కోస్తాంధ్ర – చదువు, ఉద్యోగం, పెళ్లి ద్వారా అడుగు పెట్టిన ఉత్తరాంధ్ర – రెండు ప్రాంతాల జీవన శైలులతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. సామాజిక ఉద్యమాల సానుభూతి పరురాలిగా చేసిన క్షేత్ర పర్యటనలు, పొందిన అనుభవాలు, తెలిసికొన్న పరిణామాలు, నేర్పించిన మనుషుల నుంచి సారాన్ని తీసుకుని మళ్ళీ జీవితాలను నిర్మించాను. 1986 – 2011 నవలాకాలంగా తీసుకున్నప్పటికీ అటూ ఇటూ కలిపి దాదాపు మూడు దశాబ్దాల తెలుగు స్త్రీల ప్రస్థానాన్ని నేపథ్యంగా ఎంచుకున్నాను.

మహిళా చైతన్యాన్ని, ఉద్యమాలను నవల ఏ దృష్టికోణంతో చూసింది?

సారా వ్యతిరేకోద్యమ పూర్వ రంగం, విప్లవోద్యమం, జూట్ మిల్ మహిళా కార్మికుల పోరాటం, సారా వ్యతిరేకోద్యమం, మైక్రో ఫైనాన్స్, పొదుపు సంఘాల వల్ల వచ్చిన మార్పులు, గంగవరం పోర్ట్ నిర్మాణ వ్యతిరేక ఉద్యమం, ఎన్జీవో కార్యకలాపాలు వీటన్నిటిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం, లేదా వారే పోరాటాలను నడపడం ప్రధానంగా కనిపిస్తుంది. వీటన్నిటి భౌతిక రూపాలతో పాటు, వీటిని నడిపే మనుషుల అంతరంగ సంచలనాలు పొరలుపొరలుగా కప్పుకుని ఉంటాయి. అవి కొన్నిసార్లు తర్కానికీ మరి కొన్నిసార్లు మనం నమ్మే ప్రాపంచిక దృక్పథానికీ కూడా లొంగవు. అటువంటివాటి పట్ల సహనంగా ఉండటం, దాచిపెట్టకుండా రచనలోకి తీసుకురావడం వల్ల మానవ జీవితాల సహజత్వం చెడిపోకుండా ఉంటుంది.

నవలా నిర్మాణంలో ఏవన్నా ప్రయోగాలు చేసారా?

చేసినవన్నీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు కానీ స్త్రీ పాత్రల విషయంలో చేసిన ఒక ప్రయోగాన్ని చెప్పాలి. నవలలో ‘నీల’ పాత్రని ప్రోటగానిస్ట్ గా చూడాలనుకుకోలేదు. అంతస్సూత్రాన్ని పట్టుకుని ముందుకు నడిచే బాధ్యతని మాత్రమే ఇవ్వాలనుకున్నాను. దాని కోసం పదిరేకుల పువ్వు మాదిరి నిర్మాణాన్ని స్త్రీ పాత్రల మధ్య పాటించాను. నీల పాత్ర తొడిమె వద్ద మొదలై పుప్పొడిగా పరిమళిస్తూ లోపలే దాగుని ఉంటే, చుట్టూ అరవిరిసిన పూలరెక్కలుగా చంద్రకళ, ఆరంజోతి, పాష్టరమ్మ, సరళ, సంపూర్ణ, వసుంధర, పైడమ్మ, నీతాబాయి, అజిత, మినో పాత్రల రూపకల్పన చేసాను. భిన్నవర్ణాల ఈ పది పాత్రల వల్ల తను మాత్రమే ప్రధాన ఆదర్శంగా నమ్మింప జూసే నాయిక” అనే ఆధిపత్యం నుంచి నీలను తప్పించగలిగాను

నీల నవల మహిళలకి ఏం చెప్తుంది?

కట్టుబాటు రూపంలో ఉన్న విలువ ఎంత గొప్పదైనా కాలానుగుణంగా దాన్ని పరీక్షకి గురి చేస్తూనే ఉండాలి. ప్రధానంగా నైతిక విలువల భారం స్త్రీల మీద మరీ ఎక్కువ. అలాంటి విలువలని పాటించడంలో సాధ్యాసాధ్యాల ఎరుక, వద్దనుకున్నపుడు తిరస్కరించే సాహసం స్త్రీలు అలవర్చుకోవాలి. పురుష మేధావులు వచ్చి, సంస్కరించే వరకు ఎదురు చూడాల్సిన స్థితిలో ఇప్పటి స్త్రీలు లేరు. అదే సమయంలో వచ్చే ఫలితాలను ధైర్యంగా స్వీకరించాలి. అంటగట్టబడిన వాటిని వదిలించుకునే పోరాటం కేవల వ్యక్తిగతం కాదు. సామాజికంగా రాజకీయంగా జరగాలి. భిన్న సామాజిక నేపథ్యాల కారణంగా స్త్రీలంతా ఒకటిగా లేరు. ఆ వైరుధ్యాలను పరిష్కరించుకుని ఒక బలమైన సమూహంగా

నీల – అంజనీ యలమంచిలి

అంజనీ యలమంచిలి నా చిన్ననాటి స్నేహితురాలు, నాలుగైదేళ్ళ కిందట మళ్ళీ పరిచయంలోకి వచ్చాం. చిన్నపుడు ఇద్దరం కలిసి మెసిలిన ప్రాంతం నేపథ్యంగా రాసిన నీల గురించి పరిచయం చేయమని అడగగానే ప్రేమగా ఒప్పుకుంది. ప్రతీ సమీక్షకీ తనని తను మెరుగు పెట్టుకుంటూ ఉండే ఈ భావుకురాలికి జీవితం మీద ఉండే ప్రేమ చేతనే అక్షరాలకి అంత అందం.

 

Image may contain: 1 person

నీల’ పుస్తక పరిచయ సభలో నా ప్రసంగం
————————–

20-01-2018 సాయంత్రం
ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన
‘నీల’ పుస్తక పరిచయ సభ
నాకొక మరపురాని మధుర భావన.
రచయిత కుమార్ కూనపరాజు గారి నిర్వహణలో
చైతనవేదిక పూర్వాధ్యక్షులు, అడ్వకేట్ పి.ఎస్.చంద్ గారు అధ్యక్షతన
రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరితో పాటు లంకా వెంకటేశ్వర్లు, బాలాంత్రపు ప్రసూన,
కొమ్మన రాధాకృష్ణరావు, మంతెన సీతారామ్ వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సభలో…
‘నీల’ నవలను పరిచయం చేయడం అత్యంత సంతోషకరం.
కొంతమందికే పరిమితమైన ఆ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని
10 రోజుల తర్వాత ముఖపుస్తక మిత్రులందరితో పంచుకునే అవకాశం దొరికింది.
ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకుంటూ…
‘నీల’ పుస్తక పరిచయ పూర్తి పాఠం…

***
అందరికీ నమస్కారం… good evening all…

‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. నా కళ్ళ లోగిళ్ళు’అని
సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టుగా…
ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, మము గన్న మావాళ్లు అంతా నడయాడిన చోటు ఇది.
జాజీ, నేను చిన్ననాటి స్నేహితులుగా చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఊరు ఇది…
ఎన్నో తీయని జ్ఞాపకాల కలబోత ఈ నేల.
అలాంటి గడ్డపై, ఈ వేదికపై మేమిద్దరం కలవడం…
జాజి రాసిన ఈ నవలను ఇందరు సాహితీ మిత్రుల మథ్య నేను పరిచయం చేయడం సంతోషంగా వుంది.
ఇంగువ కట్టిన గుడ్డకూ ఇంగువ వాసన అతికినట్లుగానే…
మా తాత గారు… సాహితీమూర్తి… శ్రీ వేగుంట కనక రాంబ్రహ్మం గారి సాహిత్య వారసత్వం
ఎంతోకొంత మాకూ అబ్బిందనే అనుకొంటున్నా…
వారు రగిలించిన స్ఫూర్తి, ఆ స్పర్శ.. మనసుకంటిన ఆ తడిని తడుముకోవడం
ఈ సందర్భంగా నా కర్తవ్యంగా భావిస్తున్నా…
తరుముకొస్తున్న చిన్ననాటి జ్ఞాపకాల ఉద్విగ్నతను బలవంతంగా పక్కకు నెట్టి,
నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తా…

*** మిత్రులారా…

అధ్యక్షుల వారు ఈ పుస్తక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి చెప్పారు.
‘తానా’ 40వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందిన ఈ నవలను, మా సొంత గడ్డపై ఇందరు సాహితీవేత్తల నడుమ పరిచయం చేసే సాహసం చేస్తున్నాను…

ఇక కథలోకి వస్తే…
‘సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుందో తెలుసా నీల గారు’ అంటూ పరదేశి ప్రశ్నతో ప్రారంభమైన ఈ నవల ‘సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుందో మీకు తెలుస్తున్నట్టే వుంది నీల గారు’ అని పరదేశి పంపిన మెసేజ్ తో ముగుస్తుంది. దగ్గరదగ్గరగా 600 పేజీల ఈ నవలలో అచ్చంగా 547 పేజీలు ‘నీల’ కథ నడుస్తుంది. లెక్కకు పేజీల సంఖ్య 547 కావొచ్చు. కానీ ఇందులో మూడు తరాల చరిత్ర వుంది. మూడు తరాల జీవన విధానం వుంది. చంద్రకళ నుంచి మినో వరకు మూడు తరాల స్త్రీమూర్తుల అస్తిత్వ పోరాటం వుంది. స్వేచ్ఛ కోసం పడే ఆరాటం వుంది. 2011లో మొదలై.. 2017లో ముగిసిన ఈ నవల ద్వారా ఆరేళ్లపాటు ‘నీల’తో కలిసి ప్రయాణం సాగిస్తుంది మల్లీశ్వరి.

ఏలూరుకు సమీపంలోని చోళదిబ్బలో ప్రారంభమైన కథలో ముఖ్య పాత్రలు చంద్రకళ, పరంజ్యోతి. మన కథానాయకి ‘నీల’ తల్లే ఈ చంద్రకళ. చదువులేకపోయినా కష్టపడి పనిచేసి సంసారాన్ని గుట్టుగా నడుపుకొస్తున్న మహిళ. తన జీవితంలో ఇంకేదో కావాలనే తపన ఆమెలో అడుగడుగునా కనిపిస్తుంది. నీల తండ్రి పరశి (పరంధామయ్య) తాగుడుకు బానిసైన పరశి… తన సోదరి మాటలు విని భార్యను హింసిస్తుంటాడు. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ తల్లికి అండగా నిలబడుతుంది నీల. ఆటోరాజు, తన తల్లికి మధ్య వున్న సంబంధం ఏమిటో తెలియని వయసులో అయోమయంగా, కాస్త వయసు పెరుగుతున్న క్రమంలో అర్థమయ్యీ అర్థం కానట్టున్న ఆ బంధం పట్ల, తల్లి పట్ల తొలుత వ్యతిరేకత ప్రదర్శిస్తుంది. అదే సమయంలో జూట్ మిల్లు కార్మికుల ఉద్యమం నీలకు ఓ ఉత్తేజాన్నిస్తుంది. ఆ మీటింగులలో నినాదాలూ ఇస్తుంది. చంద్రకళకు ఆటోరాజు మధ్య వున్న సంబంధం తెలుసుకున్న పరిశి వారిద్దరినీ చంపి జైలు కెళతాడు. తల్లి చనిపోయి, తండ్రి జైలుకెళ్లి తమ్ముడితో కలిసి అనాధగా మారుతుంది నీల. తమ్ముడిని పిన్ని తీసుకెళితే, నీలను పాస్టర్ దంపతులు ఆదుకుంటారు. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలన్న తల్లి కోరిక నీలను వెంటాడుతూ వుంటుంది. పాస్టర్ దంపతుల సహకారంతో చదువుకుంటున్న క్రమంలో నీలను ప్రసాద్ ఇష్టపడతాడు. అందరినీ ఒప్పించి నీలను పెళ్లాడతాడు.
అమ్మలా కాకుండా, జీవితం అంతా ఒకళ్ళనే ప్రేమించి వారితోనే వుండాలన్న ఆలోచన, మూడో వ్యక్తి ప్రమేయం లేని వైవాహిక జీవితం వుండాలని నీల బలంగా కోరుకుంటుంది. ఈ రెండు కోరికలే చివరకు ఆమె జీవిత గమనాన్ని శాసిస్తాయి. కోరి పెళ్ళి చేసుకున్న ప్రసాదు పట్ల అనురాగం పెంచుకునే క్రమంలో- ఏ సంబంధమైతే తన జీవితంలో పీడకలగా మారిందో…అదే సంబంధం, మూడో వ్యక్తి ప్రమేయం సరళ రూపంలో తన జీవితంలోకి వస్తుంది. ఈ క్రమంలో ప్రసాద్ లో పెరిగిన అసహనం, శాడిజం, అనుమానాలను భరిస్తూ… ఆగిపోయిన చదువును కొనసాగించి పీజీ చేస్తుంది. లాయర్ వసుంధరతో యాదృచ్ఛికంగా జరిగిన పరిచయం గాఢమైన అనుబంధంగా మారుతుంది. వసుంధర ప్రోత్సాహంతో పుస్తక పఠనంతో పాటు పాటలు పాడటం, ప్రజా ఉద్యమాలలో పాల్గొంటుంది. ఒక బిడ్డకు తల్లవుతుంది. ఈ సందర్భంగా నీలకు ఏర్పడిన పరిచయాలు, ప్రసాద్ ప్రవర్తన, మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా ఇల్లు వదిలేస్తుంది. వసుంధర ఆశ్రయాన్ని కోరుతుంది. విడకుల ప్రాసెస్ చాలా ఒత్తిడి పెంచుతుంది. తీరా అన్నీ ముగిసి ఒంటరిగా ప్రపంచంలోకి కాలు మోపగానే చుట్టూ అంతులేని స్వేచ్చ. ఏం చేసుకోవాలో తెలీనంత స్వేచ్చ.

ఈ క్రమంలోనే తన మకాం ను చోళదిబ్బకు మారుస్తుంది నీల. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. పరంజ్యోతి కూతురు సంపూర్ణ నీకు పూర్తి అండగా నిలుస్తుంది. సంపూర్ణ ద్వారా పరిచయమవుతాడు పరదేశి. స్వయం సహాయ గ్రూపులు, వాటి తీరు తెన్నులపై సర్వే చేయడానికి విశాఖపట్నం నుంచి చోళదిబ్బకు వచ్చిన పరదేశికి నీల సహాయం చేస్తుంది. అలా మరో బంధం నీల జీవితంలోకి ప్రవేశిస్తుంది. పరదేశికి సహాయం చేసేందుకు విశాఖఫట్నం వస్తుంది. పరదేశికీ నీలకు జాలరి జన జీవన సౌందర్యానికి ప్రతీకలా పరిచయమయ్యే పాత్ర పైడమ్మ. తన చుట్టూ వున్న పరిస్థితుల రాపిడికి రాటు దేలినా, జీవితపు సున్నితత్వం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోని ధైర్యం అనిపిస్తుంది. పరదేశి, నీలల పరిచయం ప్రేమగా ఒక గాఢతను సంతరించుకునే క్రమంలో… పరదేశి జీవితంలో ఉన్న మరో అమ్మాయి ప్రస్తావన వస్తుంది. ఏ బంధమైతే తనను అనాధగా మార్చిందో, ఏ బంధమైతే తన వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందో- అదే మూడో బంధం… తన ప్రేమలోనూ కనిపిస్తుంది. మళ్ళీ జీవితంలో అలాంటి బంధాలకు సిద్ధంగా లేని నీల, విశాఖను వదిలేస్తుంది.

ఆ తర్వాత తన మజిలీ హైదరాబాద్ కు మారుతుంది. సదాశివతో పరిచయం ఇంతకుముందే వసుంధర సమక్షంలోనే జరిగివుండడంతో… అది మరింత చనువుగా మారుతుంది. ఆ చనువు కలిసి బతకాలనుకోవడం వరకూ వస్తుంది. సదాశివ తండ్రి ప్రకాష్, అతని తండ్రి మత్తయ్య, సదాశివ తల్లి నీతాబాయి, ఆమె తండ్రి సాంబశివరావు ఇలా కొన్ని పాత్రలు ఇక్కడ తారసపడతాయి. నీతాబాయి, ప్రకాష్ ప్రేమకథ వారి మధ్యనున్న అంతరాన్ని అధిగమించి వివాహంగా మారుతుంది. ఇదంతా మరింత ఆసక్తి కరంగా చెబుతారు రచయిత్రి. నీల-సదాశివ మధ్య జరిగే చిన్నచిన్న ఘటనలు వారి బంధాన్ని మరింత గాఢంగా మార్చుతుంది. ఇంతటి స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన మినో మరింత స్వేచ్ఛను కోరుకుంటుంది. తనకు కావాల్సిన స్వేచ్ఛ ఇక్కడ లభించడంలేదంటూ మదనపడుతుంది. ఇల్లువిడిచి పోతుంది. స్వేచ్ఛ గురించి నీల వేసుకున్న ప్రశ్నలే… ఇప్పుడు ఆమె కూతురు మినో వెయ్యడం కథను వర్తులం చేసింది. ఒకప్పుడు తన తల్లి కోరుకున్న సంతోషాన్ని అందుకునే స్వేచ్ఛను తాను దక్కించుకుంది. ఇప్పుడు అదే స్వేచ్ఛను, సంతోషాన్ని తన కూతురు మినో కోరుకుంటోంది.

క్లుప్తంగా ఇదీ కథ…. ఫంక్తూ ప్రేమ కథలా నవలను ప్రారంభించినా…. పైడమ్మ జ్ఞాపకాలు, గంగవరంలో జరిగిన హింస, పోలీసు కాల్పులను ప్రస్తావిస్తూ ‘ఏదోవుంది’ అనే ఆసక్తిని రేపుతూ… చదువుతున్న కొద్దీ ఈ విషయాలు ఇంకా రావేంటి అనుకునేలా ఉత్సుకతను కలిగిస్తారు. అంతేకాదు… స్త్రీ పురుషులు పెళ్లిని పక్కన పెట్టి కలిసి బతకాలనుకోవడం, ఆ క్రమంలో వచ్చే సమస్యలను, పరిష్కారాలను, ఉద్యమాల నేపథ్యంలో స్త్రీ పురుష సంబంధాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంగా ఈ నవల కనిపిస్తుంది.

నీల నవలలోని ముఖ్య పాత్ర పొందిన మానసిక పరిస్థితి ఎదిగిన క్రమం, అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం నుండి జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదుడుకులు, ఆంక్షలు, కష్టాలను దాటి ఎదిగే క్రమంలో జీవితంలో ఎలా స్థిరపడింది అన్నది కథ. పెద్ద కేన్వాస్ కలిగింది. పాత్రలతోపాటు ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. దళిత స్త్రీ జీవిత నేపథ్యం నుంచి మానవ సంబంధాలను చూసే నవల. వ్యక్తి గత స్వేచ్ఛను ఆనందించాలనే స్త్రీ వాద కోణమున్నది. వర్ణనాత్మక శైలి పాఠకులను ఆకట్టుకుంది. ఒక స్త్రీగా ఓ వ్యక్తి తనను తాను కనుగొన్న వైనం ఈ కథాంశం.

***

జాజి శైలిలో ఓ ప్రత్యేకత వుంది. వాక్యాన్ని ఒక సుందర శిల్పంగా చెక్కుతుంది. వర్ణనలు, పోలికలను అద్భుతంగా చెబుతుంది.
ఉదా:
– 11 ఏళ్ల తర్వాత చూస్తోన్న నీలకు పరదేశి ఎలా కనిపిస్తున్నాడంటే…
‘మెత్తని అలలు ఒకదానిని మరొకటి కప్పుకొని బద్దకంగా పడుకున్నట్లు ఉండే క్రాఫ్ చెరిగిపోయి నిర్లక్ష్యంగా చూస్తోంది’ అని నవల ప్రారంభంలో రాస్తారు.
అంటే… ఈ వాక్యం ద్వారా ఆ పాత్రను, ఆ పాత్ర యొక్క గాఢతను, ఆ పాత్ర యొక్క మానసిక స్థితిని పఠితులకు పరిచయం చేస్తారు రచయిత్రి.
అంతేకాదు… ఇంకాస్త ముందుకెళితే…
‘ఒకప్పుడు నిర్మలంగా కనిపించే అతని కళ్లలో ఇప్పుడు పారిజాత పూల కాడల వంటి ఎర్రజీరలు…’ అని రాస్తుంది.
– ‘ఒక బాంధవ్యానికి మరో బంధంతో పోటీ వుండదని, దేనికదిగా చూడాలని నమ్ముతాడు’(పేజీ 7)
– ‘నమ్మినప్పుడు నెప్పి ఏమీ వుండదు. నమ్మకానికి పరీక్ష ఎదురైనప్పుడే నొప్పి తెలుస్తుంది’(పేజీ 😎
– నలుగురూ నాలుగు దెబ్బలు వేసినప్పుడు ఏడవలేదు కదాని నువ్వ కూడా గట్టిగా ఒక దెబ్బ వేయొచ్చు అనుకుంటే ఎలా?’ (పేజీ 488)
– స్థిమితంగా ఒకచోట కూచుని కలవరంగా వున్న మనసుతో మాట్లాడుకోవాలని వుంది.
– సూర్యం గురించి చెబుతూ… ‘దీపావళి రోజు మగపిల్లలు గాల్లోకి గిర్రున తిప్పే దివిటీలు అతని గొంతులో ఖణఖణ మండేవి’(పేజీ 28)
– ‘అతని చెయ్యి పైకి ఉన్నప్పుడు మహావృక్షం. కిందికి వాలినప్పుడు పంచపాయల జలపాతం’(పేజీ 266)
– ‘సముద్రం చాలా అందంగా వుంటుంది. కానీ దాహం తీర్చదు’(పేజీ 281)
– ‘అతని మొహం చూసింది. ఏదో నొప్పితో సతమతమవుతున్నానడు’(పేజీ 298)
– ‘ఓటమిని పరాజితులు స్వయంగా వరించారు… నిస్సహాయంగా’
ఉదాహరణకు ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి వాక్యాలు ఇంకా చాలానే వున్నాయి.
వాక్యాన్ని ఇంత అందంగా చెప్పడం, మనసు వ్యక్తం చేయలేని భావాలను, అదిపడే సంఘర్షణను ఒక చిన్న వాక్యంలో చెప్పడం, ఆ వాక్యానికి అలంకారాలు జోడించి అలరించడం మల్లీశ్వరి సొంతం.

*** అదేవిధంగా… ఈ నవలలో అనేక ఉద్యమాలను, సమస్యలను ప్రస్తావిస్తారు.
సారా వ్యతిరేక ఉద్యమంతో మొదలుపెట్టి…
పొదుపు సంఘాలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయ సంస్థలు, వాటి పని విధానం, వాటిలో వుండే లొసుగులు, వాటిలో వుండే రాజకీయాలు, వాటి వెనుక వుండి నడుపుతున్న రాజకీయ పార్టీల నాయకుల గురించీ చెబుతారు..
ఏజెన్సీలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, శ్రీకాకుళ గిరిజన పోరాటం గురించీ మాట్లాడతారు.
బాల్య వివాహాలు, సహజీవనం, సింగిల్ విమెన్, విమెన్ ట్రాఫికింగ్, క్యాస్ట్ – జెండర్ వంటి సమస్యలనూ లేవనెత్తడం ద్వారా…దీనిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించినట్టుగా చర్చకు పెడతారు.
ఇసుక తవ్వకాలు, తెలంగాణ వాదం, గ్లోబలైజేషన్, హైదరాబాద్ మురికివాడల స్థితిపై సర్వే, – డ్వాక్రా గ్రూపుల సమస్యలపై ఏలూరులో సర్వే, ఎన్జీవోలు- వాటి తీరుతెన్నులు, కరువు తీవ్రత, ఆకలి చావులు… వంటి అనేక ఉద్యమాలు, సమస్యల ప్రస్తావన ఈ నవలలో వుంది.

ఇన్ని అంశాలను ఒకే నవలలో చెప్పాలంటే… వీటన్నింటి పట్ల ఎంత లోతైన అధ్యయనం, పరిశీలన లేకపోతే రాయగలుగుతారు. ఒక అంశానికి అక్షర రూపం ఇవ్వాలంటే ఎంతో స్టడీ చేయాలి. వాటితో మమేకమై జీర్ణం చేసుకోవాలి. ఆ కృషి ఈ నవలలో కనిపిస్తుంది. ప్రతి అక్షరం వెనుక కనిపిస్తుంది. గోంగూర, మటన్ కూరను గుమగుమలాడిస్తూ నోరూరించేలా వండగలిగిన చాకచక్యం, పైడమ్మ చేపల కూర గుమగుమల్లా ఈ నవలలోని ప్రతి సన్నివేశం పాఠకులు రుచి చూస్తారు.

***

నవలకు పునాది వాస్తవిక జీవితమే. వాస్తవిక జీవితాన్ని ఆధారంగా చేసుకునే నవలలో పాత్రలు, సంఘటనలు, కథాసంవిధానం వుంటుంది. సమకాలీన సమాజపు లోతును విస్తృతంగాను, రమ్యంగాను, చిత్రించడానికి నవలా ప్రక్రియకున్నంత అవకాశం మరే ఇతర సాహితీ ప్రక్రియలకు లేదు. రచయిత్రే చెప్పినట్టుగా… ఒక కథ పరిధికి మించిన లోతైన, విస్తృతమైన క్యాన్వస్ వున్నందునే ఈ ఇతివృత్తాన్ని నవలగా ఎంపిక చేసుకున్నారు.
ఫ్రెంచి నవలా రచయిత మపాసాచెప్పినట్టుగా ‘నవల కర్తవ్యం మనల్ని ఆనందింపజేయడం కన్నా… అందులోని సంఘటనల ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఆలోచించేటట్లు చేయగల్గటమే’. ఆ పనిని ఈ నవల ద్వారా మల్లీశ్వరి చేయగలిగారు.

‘ఎక్కడైతే ఆధారపడటం వుంటుందో అక్కడ స్వతంత్ర్యం వుండదు. వ్యక్తిత్వం వుండదు’.
అందుకే… ‘సంకెళ్లలో నలిగిన స్త్రీ తిరుగుబాటు అనే ఆయుధంతో తన స్థానాన్ని దక్కించుకోవాలి’అని ఉద్బోధిస్తాడు చలం.
‘జీవితాన్నుంచి, సంఘాన్నుంచి అపజయాన్ని అంగీకరించవద్దు. మరణంలో, మర్యాదలో, జడత్వంలో, మామూలులో శరణ్యం పొందవద్దు. రణభూమిలోకిరా, గాయమయ్యిందా? అవయవాలే ఖండాలయినాయా? రక్తమంతా నేలపాలయిందా? హృదయమే ముక్కలయిపోయిందా పర్వాలేదు. ఆ సంసార మృత్యువుకన్నా అదేనయం’ అంటాడు చలం తన ‘మ్యూజింగ్స్’లో.

అందుకే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ వ్యక్తిత్వం అనగానే చలం గుర్తొస్తారు ఎవరికైనా…
అలాగే… కుటుంబం, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి రాస్తే… కొడటిగంటి,
సమాజం, శ్రామికులు, అభ్యుదయం వంటి విషయాలను తడిమితే శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, కుందుర్తి వంటి ప్రముఖులు స్ఫురణకొస్తారు.
ఎందుకంటే… వారి రచనల్లో వున్న సామాజిక స్పృహే అందుకు కారణం. వారు తమ రచనల ద్వారా లేవనెత్తిన అనేక అంశాలు నేటికీ మన కళ్లముందు సజీవంగా కదలాడుతున్నాయి. సమాజంపై వారి ముద్ర శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే వారింకా చిరంజీవులుగా మన మధ్య వున్నారు.
అలాగే… ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక విషయాలను, ఉద్యమ రూపంలో వున్న పలు సమస్యలను నుడివి, తడిమి ఈ నవలలో చొప్పించారు రచయిత. పూలచండులో దారంలా… అనేక అంశాలను ఈ నవలలో గుదిగుచ్చారు.
మన చుట్టూ వున్న సమస్యలను పట్టించుకున్నప్పుడు, ఆ సమస్యలకు స్పందించినప్పుడే మనిషి సంఘజీవి అవుతాడు. ఈ సంఘంలో బాధ్యత గల వ్యక్తిగా, ఒక రచయితగా మల్లీశ్వరి స్పందించారు గనుకే…
ఇదొక ప్రేమకథగానో… స్త్రీవాద రచనగానో మిగిలిపోకుండా…
సామాజిక స్పృహ కలిగి, పదికాలాల పాటు నిలిచిపోగలిగిన నవలగా ‘నీల’ను సృష్టించింది రచయిత.
ఒక అధ్యాపకురాలిగా తన అనుభవము, పరిశీలన, పరిశోధన, పరిణితి చెందిన వ్యక్తిత్వం- ‘నీల’కు ప్రాణం పోశాయని నేను భావిస్తున్నా…
అంతేకాదు… కొత్త రచయితలకు ఈ నవల ఒక స్ఫూర్తి. ఒక కథలో సామాజిక అంశాలను నేర్పుగా ఎలా చొప్పించి మెప్పించాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు మల్లీశ్వరి.

చివరిగా…
నా చిన్ననాటి నేస్తం రాసిన నవలను పరిచయం చేసే అవకాశం కల్పించిన జాజికి, ఇతర మిత్రులకు నా కృతజ్ఞతలు. ఇంతకుముందు కథలు, నవలలపై మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడినా… ఒక సభావేదికగా, ఇందరు సాహితీ మిత్రుల నడుమ మాట్లాడటం ఇదే మొదటిసారి. నా తొలి ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరించాలని కోరుతూ….

థ్యాంక్యూ…

మీ అంజనీ యలమంచిలి

నీల – శ్రుతకీర్తి

వెనుకటి తరాల సాహిత్యాన్నే కాకుండా వర్తమాన సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుంటూ తన విశ్లేషణలతో అందరినీ ఆకట్టుకుంటున్న కొత్త స్వరం శ్రుతకీర్తి. ఒక వాక్యం పట్టుకు చూస్తే చాలు మేలిమి తెలిసిపోతుంది. తను, క్రమేణా కవిత్వంలోకి ఫిక్షన్ లోకి వేగంగా ప్రవహించాలని, దానివల్లనే ఇక సాహిత్యపు దప్పిక తీరుతుందని ప్రేమగా చెప్పాలనిపిస్తుంది. ‘నీల’ ఎవరికి చేరాలని కోరుకున్నానో వారికి చేరుతోందని తెలియజెప్పిన శ్రుతకీర్తి సమీక్ష.

ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఒక గొప్ప నవలగా “నీల”ను చెప్పొచ్చు.

మారుమూల పల్లెలో వెనుక పడిన కుటుంబంలో పుట్టిపెరిగిన సాధారణమైన నీలవేణి మెట్రోనగరంలో శక్తివంతమైన ప్రతిభాశాలిగా ఎదిగిన క్రమమూ, 1986 నుండి 2011 వరకు ఆమె జీవిత ప్రయాణమే ‘నీల’. ఈ నవలలో జీవం వుంది. ఎన్నో జీవితాల అనుభవసారం వుంది. ప్రతి పాత్రా కథలో భాగంగా మాత్రమే పరిచయం అవదు. తన అంతరంగాన్నీ , జీవన క్రమాన్నీ పరిచయం చేసి వెళ్తుంది. కథాకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాంఘిక, ఆర్థిక ,రాజకీయ అంశాలు వివిధ పాత్రల కథల్లో ఇమిడిపోయి వుంటాయి. కేవలం సామాజిక అంశాలకో, వ్యక్తి గత అంశాలకో ప్రాధాన్యత ఇవ్వకుండా అన్నీ కలుపుతూ బ్యాలెన్సింగ్ గా ఒక సంపూర్ణమైన పుస్తకాన్ని అందించిన మల్లీశ్వరి గారిని ఎంత అభినందించినా తక్కువే.

ప్రస్తుతం ఎవరికి తోచిన నిర్వచనాలు వారిస్తూ కొంచం ఎక్కువగానే దుర్వినియోగం అవుతున్న పదం “స్వేచ్ఛ”. అందుకే ఏమో స్వేచ్ఛను వెతికి చూపించడానికి 550 పేజీల్లో అడుగడుగునా ప్రయత్నించారు మన జాజిమల్లి. స్వేచ్ఛకు ఏ ఒక్క నిర్వచనమో ఇవ్వలేము, వ్యక్తికీ వ్యక్తికీ సైతం ఇది మారుతుంది. ఒకరికి స్వేచ్ఛ అనిపించింది మరొకరికి విశృంఖలత్వం అవొచ్చు, ఒకరికి బంధనం అనుకున్నది మరొకరికి ఆనందం కావచ్చు. ఎవరికి కావాల్సిన స్పేస్ వారు నిర్ణయించుకోవాల్సిందే అని చాలా పాత్రల ద్వారా ఎవరి పరిధిలో వారు కోరుకున్న స్వేచ్ఛనూ, దాని ఫలితాలనూ చూపించారీ పుస్తకంలో.

అందరూ చదివి ఎంజాయ్ చేయాల్సిందే అని కథ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నేనే నీలగా మారి సదా ప్రేమలో, సదాగా మారి నీల ప్రేమలో మునిగి పోయి వున్న ఈ స్థితిలో ఎక్కువ మాట్లాడాలని కూడా లేదు. ప్రేమ ఒక్కటే కాదు వాళ్ళ ఆలోచనలూ, ఆశయాలూ, మెరుగైన ప్రపంచం కోసం పడే నిరంతర తపనా అన్నీ గొప్పవే. అంత అద్భుతమైన వ్యక్తులు నీలూ, సదాలు. “సముద్రం ఎందుకు వెనక్కి వెలుతుందో తెలుసా నీలగారూ?” అని ప్రశ్నించే పరదేశిని నీల చూసినంత అబ్బురంగా చూడటం, అతని హృదయభారాన్ని మనమూ షేర్ చేస్కోడము బాగుంటుంది. కాసేపే కనిపించి మాయమైన స్టాలిన్ సూర్య నీల ఆలోచనల్లో దీపమై మనల్నీ వెలిగిస్తూనే ఉంటాడు.సారా వ్యతిరోకోద్యమంలో ఆరంజ్యోతి ధిక్కారస్వరం అబ్బుర పరుస్తుంది. పొదుపు ఉద్యమంలో, రాజకీయంలో, కాంట్రాక్టు పనుల్లో సంపూర్ణ సాహసమూ, ప్రయోగాలూ చదువుతుంటే కొన్ని బాధపెట్టే కోణాలున్నప్పటికీ మహిళల ముందడుగుగా చూసి ముచ్చటేస్తుంది. పేర్చి పెట్టుకున్నవన్నీ కోల్పోయినా మనుషులు ఎందుకు బతుకుతారో, ఎందుకు బతుకాలో చెప్పిన ప్రవక్త పైడమ్మ. తనకు జరిగిన అన్యాయం వేరే వాల్లకు జరుగొద్దని ఎన్జీవో స్థాపించిన అజిత, నీలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఎన్జీవోల పనితీరు, సామాజిక పరివర్తనలో వాటి భాగస్వామ్యం, వాటి లోపాలను లోతుగా చర్చించారిక్కడ రచయిత్రి. కలలు కన్న ఆదర్శాల కోసం పంటి బిగువున కష్టాలను ఓర్చుకుని, ఆ సహనం కోసం మౌనంలోకి మరలిపోయిన నీతాదేవి మరో అపురూపమైన స్ర్తీ. సాధారణ వ్యక్తులైన ప్రసాద్ , సరళలు పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తన మార్చుకుంటూ పోయినా వాళ్ళను అసహ్యించుకోలేము. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమని పంచే పాస్టరు మామయ్యా, పాస్టరమ్మలు గుండెచెమ్మని వెలికి తీస్తారు. ఇలా అందరూ మనసులో నిలిచిపోయే వాళ్లే..!!

ప్రతి చిన్న ప్రవర్తన వెనుక కారణాలను అన్వేషించే , ప్రశ్నించే నీల ద్వారా రచయిత్రి మనకు అర్థవంతమైన , లోతైన వివరణలు ఇస్తూ వెళ్తారు. నేను బాగా కనెక్ట్ అయిన అలాంటి కొన్ని మాటలు మీకోసం.

‘మంచికీ చెడ్డకీ కొలమానం ఎట్లా అంటే, అది మనుషుల్ని సారాంశంగా చూడటంలోనే తెలుసుకుంది నీల. అందమైన పాఠంలా కాక విధిలేని పరిస్థితుల్లో తప్పని గుణపాఠంగా నేర్చుకుంది.’ ఇలా బాధనుండి జీవితం నుండి నేర్చుకునే పాఠాలతో ఎదిగిన మనుషులు ఎంత అపురూపమో..!

‘ఒకే జీవితంలో అనేక జనన మరణాల తర్వాత కూడా జీవితం నుంచి పిండుకోవాల్సిన సారవంతమైన ప్రేమ ఏదో మిగిలే ఉంది.’.ఎంత భరోసా ఇచ్చే మాట..!

” నలుగురూ నాలుగు దెబ్బలు వేసినపుడు ఏడవలేదు కదాని నువ్వూ దెబ్బ వేయకేం?” ఇంతకంటే మనసును కదిలించే వేడ్కోలు వుంటుందా..!

‘ఏదైనా ఒక విషయం గురించో, ఒక మనిషి గురించో పదేపదే మాట్లాడి, తిట్టి, ద్వేషించేవారి అంతరంగాల్లో వాటి పట్ల ఉన్న వల్లమాలిన ప్రేమని గుర్తించింది.’ తము చెయ్యలేని పని ఎదుటోల్లు చేస్తే ఎంత అక్కసో..!

‘ చాటుగా చేసే దౌర్జన్యాల్లో కనీసం సంఘభీతి ఉంటుంది. తప్పేమో అన్న స్పృహ ఉంటుంది. బాహాటంగా చేసేవి, దౌర్జన్యానాకి గురయినవారిని పూర్తిగా బెదరగొడతాయి.’ భయపడే వాళ్ళను మరింత భయపట్టడం నిజమే కదా..!

‘ ఈ అంచు నుంచి ఆ అంచుకి ప్రశ్నల ప్రయాణంలో విపరీతమైన అలసట. తట్టుకోలేక రెండు అరలు తయారు చేసుకున్నది. పుస్తకాలు చదువుతూ ఉద్యమగీతాలు పాడే నీల, సామాన్య గృహిణి నీల రెండు అరల్లో కలవరం లేకుండా సర్దుకుంది’. ఇది కదా అస్తిత్వాన్ని కాపాడుకోడానికి చేసే పోరాటం..!

బాగా బతకడానికి డిజర్వ్ అయి ఉన్నాను అనే నీలకు సదా చెప్పిన రెండు మాటలు ” మీలో ఉన్న మిమ్మల్ని గుర్తించటం లేదని అనిపించింది. మానవ సంబంధాలు ఏవైనా అవి స్నేహాలైనా, ఉద్యోగ సంబంధాలైనా మనుషుల్లో ఉండే వికాసాన్ని విస్తృతం చేయాలి, వేగవంతం చేయాలి. మీ విచక్షణ, అవగాహన ప్రాతిపదికగా సాగాలి. మీకు ఏది ముఖ్యమో ఏది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిని చేస్తుందో దాని కోసం మీ ఎంపికలు ఉండాలి. ఇది స్వార్థం కాదు. మనుగడకు అవసరమైన ఆదిమ జ్ఞానం.”

‘పదిమంది అండ ఉండాలనుకోడం మానవసహజం. ఒక్కరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోడం బేలతనం. ముందు మనకు మనం ఉండాలి. ఆ ధైర్యం నుంచి, స్తిమితం నుంచి మనుషులను కోరుకోవాలి.’ తన సందేహాలకు తనే సమాధానాలిచ్చుకున్న నీల మాటలివి.

‘మానవ సంబంధాలు ఎంత క్రూరమైనవో, అంత ఆర్ద్రమైనవి. మనుషులు తమ సంస్కారంతో, నూతన విలువలతో అన్నిటినీ ప్రేమభరితం చేయగలరు. అటువంటి మనుషులే, సాటి మనుషుల మీద ప్రేమతో పెద్ద యుద్ధాలు చేయగలరు. మనుషుల్ని ఎంత చివరికి వెళ్ళి ప్రేమించవచ్చో తెలుసుకున్నాక దేన్నైనా, ఎవర్నైనా క్షమించగలం’ .

ఇలా పుస్తకం నిండా చాలా ఆలోచనాత్మకమైన, కవితాత్మకమైన వాక్యాలు ఎన్నో వున్నాయి. అవన్నీ ఇవ్వలేక పోతున్నానిక్కడ. చినవీరభద్రుడు గారు రాసిన అద్భుతమైన ముందుమాటలో మళ్ళీ మళ్ళీ చదువుకునేలా అన్నీ వచ్చేసాయి చదవడం మిస్ అవొద్దు మరి.

స్వేచ్ఛగురించి నీల వేసుకున్న ప్రశ్నలే తన 19 ఏళ్ల కూతురు మినో వేయడం ఈ కథకి కొనసాగింపు.

“ఇక ఇప్పటి తన నుంచి కొత్తతనను నిర్మించుకోవాలి, తనలాంటి నీలవేణులకు జీవిత ప్రస్థానాన్ని సులువు చేయాలి” అనుకుంటున్న నీలకి మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం ..!!

నీల : కొన్ని ఆలోచనలు

యువకవి, మిత్రుడు బాలసుధాకర మౌళి, నీల నవలపై రాసిన స్పందనవ్యాసం

 

నీల : కొన్ని ఆలోచనలు

 

Image may contain: 1 person, sitting, glasses and beard

 

ఒక విశాలమైన జీవితాన్నే కాదు, ఆ జీవితంతో ముడిపడి వున్న అనేక విస్తృత జీవితశకలాలనూ పరిచయం చేసిన గొప్ప నవల నీల. గొప్పని మించి యింకో పదం వెతుక్కుంటున్నాను. ఒక్క ఆరంజోతి పాత్ర చాలు లేదా ఒక్క పైడమ్మ పాత్ర చాలు నీల నవల ఎంత విశాలమైన దారిలో నడిచిందో చెప్పడానికి. సదాశివ పాత్రొక్కటి చాలు. బతుకు దాని సకల అంశాలనూ దోసిట్లోకి తీసుకొని మన ముందు ఒంపినట్టుంది నవల. అతిశయోక్తి కాదు. నవలలో సంభాషణలు తారాస్థాయికి చేరాయి. జీవితానుభవంలోంచి పైడమ్మ మాట్లాడుతుంటే మనకెదురైన అనేకమంది పైడమ్మలు కళ్ల ముందుకొస్తారు. అవును నేనూ పైడమ్మలని చూశాను. తీరమ్మీద తిరుగాడిన పైడమ్మలలో, నెత్తళ్ల తట్ట నెత్తినెట్టుకుని వూళ్లోకొచ్చిన పైడమ్మలలో సముద్రజీవితాన్ని వెతుక్కున్నాను. సముద్ర బతుకు కనిపించింది.

వ్యక్తిత్వమున్న నవలిది.

ఒక్క నీల అనే కాదు పాత్రలన్నీ వాటి వాటి వ్యక్తిత్వాలతో, సహజ గుణాలతో స్పష్టంగా నిలిచాయి.

ఏ పాత్ర ఆడాల్సిన మాటలు ఆ పాత్రల చేత ఆ స్వభావంలోంచి బతుకుతున్న నేల భాషలోంచి రచయిత్రి మాట్లాడించడం
రచన సజీవత్వానికి నిదర్శనం.

ప్రతి సన్నివేశంలో, సందర్భంలో మూడ్ ని అద్భుతంగా create చేశారు. మూడ్ క్రియేషన్ కోసం పరిశరాలను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. గొప్ప గాఢతతో, గొప్ప సంలీనంతో రాశారు. నవల ఆశాంతం గొప్ప ఎనర్జీ ప్రవహించింది.

జీవిత వాస్తవికతను సంభాషణల్లోకి, తార్కికబద్ధమైన ఆలోచనల్లోకి అనువదించారు.

ఈ నవలంతా చాలా కాన్సస్ గా ఎక్కడా పట్టుతప్పిపోకుండా ఒక్క వాక్యంలోనూ కూడా రాస్తున్న దానినుంచి పక్కకి ఒరక్కుండా నిర్వహించారు.

నీల చదివి జీవితం పట్ల అపరిమిత ప్రేమని, జ్ఞానాన్ని పొందచ్చని నా నమ్మకం.

వాక్యాన్ని వాక్యాన్ని గొప్ప పొందికతో రాశారు. వాక్యాల్లో కావాల్సినంత కవిత్వమూ, గాఢతా వుంది.

ఒక నవల చదివింతర్వాత పాత్రలు నిద్రలోనూ వెంటాడాలి. నిద్రపోనివ్వని నవలిది.

చిన్న చిన్న ఘటనల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య వైషమ్యాలని స్పష్టంగా చెప్పిన నవలిది.

వ్యవస్థమూలాల్లోకి చొరబడి లోపల తిష్టవేసిన హిందుత్వ భావజాలాన్ని బట్టబయలు చేసిన నవల. లేకపోతే చంద్రకళని ఇరుగుపొరుగు ఎందుకు తిట్టాలి. ఆటోరాజుతో చంద్రకళ ప్రేమ గొప్పది కాదా? చంద్రకళని మనం తిరస్కరించగలమా ?! మన చుట్టూ మనం ఎంతమంది చంద్రకళలని చూడలేదు. పురుషాధిపత్యమూ హిందుత్వదాడే కదా.
స్త్రీలు పోరాడగలరని కొన్ని లక్షలసార్లు గొంతెత్తి చెప్పిన నవలిది. జీవిత సహజస్వభావాన్ని అక్షరీకరించిన నవలగానూ దీన్ని అభినందించాలి మనం.

సంఘం విధించిన పతివ్రతాగుణాన్ని నిక్కచ్చిగా నిలబడి ప్రశ్నించిన నవల.

చంద్రకళ చావుని గురించిన సందర్భం వచ్చినప్పుడల్లా ‘మైదానం రాజేశ్వరి’ని గుర్తుచేసుకున్నాను. చంద్రకళలు రాజేశ్వరులు అయ్యేదానికి ఇంకెన్ని గట్లు దాటాలో అన్పించింది. రాజేశ్వరులు అయ్యే చంద్రకళలు ఈ రచయిత్రి చేతిలో పడితే ఏ అవగాహనలోంచి చంద్రకళలను రూపొందిస్తారని వొక ఉత్కంఠ ఎదురుచూపు నాది. నీల ఆ గమనంలో వుంది.

చంద్రకళ మరణం తర్వాత సంభాషణల్లో స్త్రీల అసలు అంతరంగాలని సరిగ్గా ఆవిష్కరించారనిపించింది. స్త్రీల అంతరంగ అన్వేషణ చేశారు. స్త్రీల సైకాలజీలని నవలంతా గొప్పగా ప్రెజెంట్ చేశారు.

చంద్రకళ కోణంలోంచి రచయిత్రి మాట్లాడుతున్నంతసేపూ జీవితాన్ని, దాన్ని స్వరూపాన్ని ఒడిసిపట్టారనిపించింది.

సంభాషణలు, సంభాషణల మధ్య కనెక్సన్స్ చాలా పరిశీలనతో, చాకచక్యంగా రచయిత్రి రాశారు.

జీవితమంతా అక్షరాల్లోకి, ఆవేదనల్లోకీ తర్జుమా అయింది.

స్వేచ్ఛ మీద వసుంధర మాటలు మరిచిపోలేనివి.

నవలలో పోలికలు గాని, వర్ణనలు గాని, ప్రతీకలు గాని, రూపకాలు గాని నవలకి గొప్ప బలాన్నిచ్చాయి.

ఏ పాత్ర నిర్మాణమూ బలహీనంగా లేదు.
అయితే రచయిత్రి చేతిలోని పనే కదా.. స్టాలిన్ సూర్యంని చివరలో కలపాల్సింది అని ఆశ ఇప్పటికీ వుంది. అయితే నవలకి స్టాలిన్ సూర్యం ఇచ్చిన వొక రకమైన టెంపో పోద్దేమో అని కూడా ఆలోచిస్తున్నాను. ఏ పాత్రా మరుగున పడే పాత్ర కాదు. మరీ ముఖ్యంగా ఆరంజోతి, నీల అమ్మ చంద్రకళ, ఆరంజోతి కూతురు సంపూర్ణ, పాష్టరమ్మ, సరళ.. చిన్న పాత్రలే అయినా లక్ష్మీకాంతం, నీల పక్కింటి అక్క.. ఎందుకంటే అవి మన చుట్టూ వున్నవే కాబట్టి. రచయిత్రి నైపుణ్యంతో ఆ పాత్రలను గుర్తుండిపోయేట్టు మలిచారు.

నీలతో పాటూ పాప వుండి తన కష్టాల్లో రాటుదేలాలని నీల అనుకోవడం సరైనదే అని నా నమ్మకం కూడా.

కులసమస్యని చర్చకి తీసుకొచ్చారు. అంబేద్కర్ స్పృహని కూడా. సంపూర్ణమైనట్టనిపించింది.

‘నీల’లో విషాద చాయలూ, జీవితేచ్ఛ వుండటం సహజంగా నప్పింది. జీవితంలోదే నవలలోకి తర్జుమా అయింది.

నీల మాటల్లో.. గాఢమైన ప్రేమకి డిజర్వ్ అయివుండటం, మంచి జీవితానికి డిజర్వ్ అయివుండటం – అర్హమైన వాక్యాలనిపించాయి.

నవల ముగిసేక ఎవరినీ తప్పు పట్టాలని అన్పించలేదు. కాస్తా వేదనయితే మిగిలి వుంది.

గొప్ప తాత్వికత, గొప్ప వ్యక్తితత్వం వున్న నవల.

గొప్ప ఎనర్జిటిక్ గా, తాత్వికతతో construction ఏమాత్రం దెబ్బతినకుండా అత్యంత ఇష్టంతో వాక్యాన్ని వాక్యాన్ని గుండెలోపలి నుంచి తీసి రచయిత్రి కాగితం మీద పరిచారు. అసలు ఎంత విశ్లేషణ చేశారు! ఇది సాధారణమైన పనేం కాదు. రచయిత్రి జీవితానుభవం, సూక్ష్మ పరిశీలనులు, అట్టడుగు బతుకుల పట్ల అచంచలమైన ప్రేమ లేకపోతే ఈ నవల ఇట్లా రూపుకట్టదు. మార్క్సిజం స్పృహలోంచి వచ్చిన నవల. ప్రజాస్వామిక విలువల పునాధి మీంచి లేచిన నవల. జీవితసౌరభం పొదిగివున్న నవల నీల.

చోళదిబ్బలో మార్పులను చూపించిన రచయిత్రి, అక్కడ ఇప్పుడు నడుస్తున్న కార్మిక పోరాటాలనూ, ఘర్షణని కూడా ఇస్తే బాగుండు కదా అని అన్పించింది. ఎదురుచూశాను.

నవలలో, జీవితంలో మనకెదురయ్యే సహజసిద్ధమైన హాస్యమూ నవ్విస్తుంది. వయసుడిగిన ఆరంజోతి పాత్ర నుంచి వచ్చిన హాస్యానికి నవ్వు, ఏడుపూ కలిసి వస్తాయి.

పాత్రల్లో ఎదుగుదల వుండటం గొప్ప నవల అనడానికి తార్కాణం.

నీల పాత్ర పరిణామశీలత వున్న పాత్ర. అన్ని పాత్రల్లో కూడా ఆ పరిణామశీలత వుంది. నవల్లో విప్లవోద్యమ స్పృహని రచయిత్రి అందించారు. ఇప్పుడు దేశమంతా ఉత్తరాంధ్రా వైపు, ఉత్తరాంధ్రా పోరాటాల వైపు చూస్తుందని రచయిత్రి నవలలో ఉటంకించారు. నీల భవిష్యత్తు కార్యాచరణపై ఆ సూచనివ్వడం నవల కొనసాగింపుని సూచిస్తుంది.

విలువుల వున్న తల్లిదండ్రుల కూతురుగా మినో జీవితం వూహించొచ్చు. పందొమ్మిదిలో వున్న మినో జీవితం నవలకి కొనసాగింపు. మినో మీద నాకు బెంగ లేదు.

స్త్రీపురుష సంబంధాలు మిత్రత్వంతో సాగాలని, ఆరోగ్యకర సాహచర్య స్నేహాలుగా వర్ధిల్లాలని ఆ గ్రహింపులోంచి వచ్చిన ఒక ప్రత్యేకమైన నవలగా నీల మిగులుద్ది.

స్త్రీలు, పురుషులు ఎట్లా బతకాలో ఈ నవల ద్వారా ఒక సూచన రచయిత్రి ఇచ్చారు. మార్పుకి దోహదపడటం రచయిత చేసే గొప్ప పని అని మనం అనుకుంటున్నప్పుడు ఈ రచయిత్రి చేసిన పని అదే.

చివరిగా రచయిత వ్యక్తిత్వమే రచన అందించే స్పృహలో ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నాను కాబట్టి ‘నీల’ని హృదయానికి హత్తుకుంటున్నాను.

15/01/2018

మానవసంబంధాల్లోని విషాదానికీ అద్భుతానికీ ఒకగుర్తు – నీల

http://pustakam.net/?p=20002

 

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు

దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే కష్టమే. అందులోనూ జాజిమల్లితో పాటు ఆరేళ్ళు ప్రయాణించిన నీల. ఎన్నో మానసిక విశ్లేషణలని చెక్కు చెదరని పద బంధనం తో అక్షర రూపం కల్పించినపుడు, నామ మాత్రపు విశ్లేషణని మించింది ఏదో పంచుకోవాలన్న తపన నుంచి కొన్ని భాగాలుగా యీ పుస్తకాన్ని చదువుతూ అర్థం చేసుకోవలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా నీల మీదుగా నా లోకి ప్రవహించిన అక్షరస్పర్శకి పులకరింతలాంటి పలవరింత.
మొదటి పేజీ నుంచి వంద పేజీ ల ప్రయాణం చేసే వరకు, పరదేశి, సదాశివం, ఆటో రాజు మనకి ఎంతో పరిచయస్తుల లిస్ట్ లో చేరిపోతారు. సూర్యం మీద నీల కు వున్నంత ప్రేమ మనలో చేరిపోతుంది. నీల తల్లి చంద్రకళ, ఆరంజోతి పాత్రలమనసు లోతులు ఉలు స్వేటర్ అల్లినట్టు క్లిష్టత కలిసిన వెచ్చదనం నన్ను తాకింది.

The lines I love to quote

* సదాశివం నీల తో “నలుగురు నాలుగు దెబ్బలు వేసినపుడు ఏడవ లేదు కదాని నువ్వూ దెబ్బ వేయకేం?”

* దుఖపు నదుల్లో ఈతలు కొట్టడం నేర్చిన వారికి ఒడుపు తెలీదా ఒడ్డుకు రావడానికి.

* ఆమె (ఆరంజోతీ) మాటలు వున్నాయి అంటే అపుడే బొడ్డు పేగు కోసిన బిడ్డ లంత నగ్నం గా వుంటాయి.

*****””. *********. ********

నీల తల్లి చంద్రకళ కి చదువుకోక పోయినా, కష్టపడి పనిచేసి జీవితాన్ని వున్నంతలో కళాత్మకం గా జీవించాలనే తపన. కానీ తండ్రి పరశి లో తాగుడూ, వాగుడూ, భార్యని హింసించడం తప్ప మరో మాట వుండదు. ఆటో రాజు పట్ల తల్లి ఆకర్షితురాలవ్వడాన్ని చాయా మాత్రం గా నీల జ్ఞాపకాలుగా నేర్పుగా కథనం లో చొప్పించింది రచయిత్రి. నీల ప్రతి స్పందనని కూడా వర్ణిస్తూ ఆ సమయం లో (జెయింట్ వీల్ లో జంటగా) వాళ్ళిద్దరూ చాలా అందం గా కనిపించారు అని చెప్పడం తప్పొప్పులని మించిన మనో ప్రపంచం నీల పాత్రలో వుందని మనకు చెప్పడం అనుకోవచ్చు.

భార్యకూ ఆటో రాజుకూ మధ్య సంబంధాన్ని పసిగట్టిన పరశి వాళ్ళిద్దరినీ చంపి జైలుకు వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. అదే సమయం లో నీలకు జీవితాంతం వెంటాడే సంఘర్షణ కు పునాది ఏర్పడుతుంది. మా అమ్మ లా కాకుండా, జీవితం అంతా ఒకళ్ళనే ప్రేమించి తోడుగా వుండాలి అన్న ఆలోచన, మూడో వ్యక్తి ప్రమేయం లేని వైవాహిక జీవితం – యీ రెండూ ఆమె జీవిత గమనాన్ని శాశించే శక్తులవుతాయి.

నీలకి దగ్గరుండి పెళ్ళి జరిపించిన పాశ్తర్ ఇంకా అతని భార్యా – ఈ రెండు పాత్రలూ మనుషుల్లోని మతాతీత మానవత్వాన్ని నిరూపిస్తాయి. గ్రామాల్లోని ప్రజల సమస్యల్లో క్రైస్తవ మిషనరీల దయా పూరిత చొరవని చూపిస్తుంది.

కోరి పెళ్ళి చేసుకున్న ప్రసాదు, గ్రహణ చాయలా ఆవరించే సరళ, ఆమె తల్లి లక్ష్మి కాంతం, ప్రసాదు ప్రవర్తన లోని శాడిస్టు చాయలు, వీటి మధ్య చదువు కొన్సాగించాలని నీల లోని ఎడతెగని ఘర్షణ, లాయర్ వసుంధర ప్రోత్సాహం – ఒక సామాన్య స్త్రీ జీవితం లోని అన్ని చాయల్ని రచయిత్రి స్పృశిస్తుంది.

ఈ 101-200 పేజీల్లో లాయర్ వసుంధర నీల తో మాట్లాడే యీ పేరా ఒక సామాజిక హెచ్చరిక:

“నానా రకాల (గృహ) హింసల నుంచి విముక్తి కోసమే అయినా మనుషులు విడిపోవడానికి సాయం చేయడం ఏవంత గర్వం గా వుండదు నీలా! వారికున్న ఉక్కిరిబిక్కిరి తనం లోంచి బైట పడెయ్యాలని చూస్తాం. విడకుల ప్రాసెస్ చాలా ఒత్తిడి పెడ్తుంది. తీరా అన్నీ ముగిసి ప్రపంచం లోకి కాలు మోపగానే చుట్టూ అంతులేని స్వేచ్చ. ఏం చేసుకోవాలో తెలీనంతటి స్వేచ్చ. బాగా పలవరించి పోతాం. కానీ స్వేచ్చ కూడా చాలా డిమాండ్ చేస్తుంది. మనకి అలవి గాకుండా వుంటుంది.

స్వేచ్చ లో మనకి మనం తప్ప ఎవరూ వుండరు. ఇష్టపడి వరిస్తాం కదా జాగ్రత్తగా హాండిల్ చేసుకోవాలి.

ఒదిగి వుండటమూ లేకపోతే తెగించేయడమూ – ఈ రెండిటి మధ్యా జీవిచే కళ ఒకటి వుంటుంది నీలా! నువు బాగా ఎదగాలి. ఎదగడం అంటే నలుగురిలో ప్రముఖం గా వెలిగిపోవడం కాదు. మన చిన్ని లోకం లో అదే…. మన అంతరంగం లో మనం ఎదగాలి. అపుడూ చాలా అందంగా మారి పోతాం”

 

***†************. ********* ************

పరదేశి కీ నీలకీ జాలరి జన జీవన సౌందర్యానికి ప్రతీకలా పరిచయమయ్యే పాత్ర పైడమ్మ .
పైడమ్మ ఒక ఫెమినైన్ అంతశ్చేతన అనిపిస్తుంది. తన చుట్టూ వున్న పరిస్థితుల రాపిడికి రాటు దేలినా, జీవితపు సున్నితత్వం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోని ధైర్యం అనిపిస్తుంది. నా చిన్నప్పుడు కాకినాడలో అడ్డకట్టు చీర, ముక్కున బుళాకి, పాయలోకి దూర్చిన కొప్పుతో ప్రకృతి లో భాగం గా ఇమిడిన ఆదిమత్వం కనిపించింది.
సముద్రం లోట నాకేటి కనపడతాదని అడిగినారు తవరు. నానేటి సెప్పగల్తు!సముద్రానికి సముద్రం లోపట ఏటి కనపడతాది”
కొడుకు గురించి చెప్తూ “ఆడి ఒళ్ళు అల్లదిగో ఆ నల్లరాతి కొండ మాదిరి. కానాడి మనసు మాత్తరం సేప మెత్తన”
వలలు పైకి లాగినాక ఏటగాళ్ళంతా ఏ సేప పడినాది అదెంత బరువు తూగుతాది అని కొట్టీసుకుంతంతే మావోడు మాత్త్రం వలలోపటి పిల్ల సేపల ఊపిరి ఆగే లోపు ఆటిని తీసి సముద్రం లోకి ఇసిరే వాడంత”.
పిల్ల చేపలు బరువు తూగక అమ్ముడు పోక కుళ్ళబెట్టి పారేసే కంటే, భవిష్యత్తులో ఉపయోగపడే పెద్ద చేపలయ్యే అవకాశాం వుంటుంది. ఒక మనిషికి పర్యావరణ సాన్నిహిత్యం, పరిసరాల అవగాహన రావడానికి చదువులే అవసరం లేదు. ఇలంటి జీవన సాంగత్యం వుంటే చాలు.
“ఈ సముద్రం నాకు బిడ్డల్లేని అప్ప మాదిరి. నా బిడ్డని దాని మురిపానికి అర్పించినానని మనసు రాయి సేసుకున్నా. “
డెబ్భైల్లో కాకినాడలో వుండటం వల్లనేమో, పైడమ్మ పాత్ర ప్రతి పదమూ నా ఎదురుగా నిలబడి సంభాషించినట్టే అనిపించింది. ఆ పాత్ర నుంచి బైటపడి మళ్ళీ కథ చదవడం కొనసాగించేందుకు ఒక వారం పట్టింది.

******************

పరదేశి, నీలల పరిచయం ప్రేమగా గాఢతని సంతరించుకునే సందర్భం లో అతను మరో అమ్మాయి గురించి ప్రస్తావించడం తో మళ్ళీ జీవితం లో భావ సంఘర్షణకి సిద్ధం గా లేని నీల, విసాఖ వదిలి హైదరాబాద్ రావడం తో పరదేశి పాత్ర పూర్తి తెరమరుగయ్యి, నెరేషన్ సదాశివ మీద ఫోకస్ అవుతుంది.
ఇందులో సదాసివ తండ్రి ప్రకాష్, అతని తండ్రి మత్తయ్య, సదాశివ తల్లి నీతాబాయి, ఆమె తండ్రి సాంబశివరావు ఇలా ఎన్నో పాత్రల్ని ఇముడ్చుకుంటూ, పాత సికిందరా బాద్ ని కథా గమనం లో చొప్పిస్తూనే, కథని ముందుకు తీసుకెళ్తూ, నీల ఆర్థికం గా మానసికంగా భావపరంగా స్థిమిత పడటాన్ని ఒక పట్టు సడలని కథా గమనం గా సాగి పోయింది.

నీల కూతురు మినో, సదాశివకి సహజ స్నేహిత. రెందు సముద్రాల హోరులో కూడా తన గొంతు విప్పుకునే జలపాతం. ఆధునికత పట్ల ఎంత అవగాహన వున్నా కూడా నీల, సదాశివా ల ని కుదిపేసే మార్పుకి ప్రతీక. దాన్ని కూడా పరస్పర అవగాహన ఆలంబనలతో సున్నితంగా ఏక్సెప్ట్ చేయిస్తుంది రచయిత్రి.

నీలని కూతురిలా చూసుకున్న పాష్టరమ్మనీ, , అలాగే నీలని పెళ్ళాడిన ప్రసాద్, ఇష్టపడిన పరదేశీ పాత్రల్ని కూడా అసంపూర్ణం గా వదిలెయ్యకుండా పీటముడులుగా బిగుసుకునే అంతస్సంఘర్షణలని తిరిగి అంతే నిష్పాక్షికంగా జీవితం లో అంగీకరించగలిగే ఎదుగుదలని పాత్రలకి ఇచ్చింది.
ఈ క్రమంలో ఎన్నో మానసిక విశ్లేషణలు చేస్తూ, నీలూ సదా శివల మధ్య ఒక బాలెన్స్డ్ బంధవ్యాన్ని, కండిషనల్ నుంచి అన్ కండిషనల్ టుగెదర్ నెస్ అంటే ఆ వ్యక్తులిద్దరూ ఎంత మెచ్యూర్డ్ గా వుండాలో ఓపికగా సన్నివేశాల్ని క్రియేట్ చేసిన నైపుణ్యం రచయిత్రిది.

చివరి వరకూ తల్లి చంద్రకళా, ఆమె ఇష్టపడిన ఆటో రాజుల నీడలు నీలని వెంటాడటం మానవు. ఆ భయాల్నీ, భావ ఘర్షణనీ ఎప్పటికప్పుడు మోస్తూనే, ఆ వత్తిడి కి లొంగకుండా ” I deserve better Life” అనుకునే నీల సంఘర్షించె ప్రతి ఒక్కరి మనసు తూలిక. ఆ నమ్మకం ఎంత అందాన్నీ, ఆర్ద్రతనీ మనలో నింపుతుందో ఆ నమ్మిక వున్నవారికే తెలుస్తుంది.

నా వరకూ “నీల” జాజి మల్లి కి మానస పుత్రిక. పుస్తకం ముగించాక ముచ్చటగా నాతో ప్రయాణించిన స్నేహ భావాలు అకస్మాత్ గా ముగిసాయేమో నన్న బెంగ కలిగింది. ఆధునికత ఎంతటి భీభత్సాన్ని అంతర్గతం గా మోస్తుందో అన్న విశ్వరూపం దాగుంది ఇందులో. ప్రతి మనసులో ఓదార్పు కి ఎంత ఆకలి క్షోభిస్తుందో, దాన్నుంచి మానవ సంబంధాల అణిచివేతలూ, తిరుగుబాటులు, ఆర్థిక అవగాహనలు, అంతశ్చేతన పిలుపులు — వీటన్నిటి ఎన్ సైక్లోపిడియా యీ ‘నీల’

నీల

నీల నవలపై కె. గంగాధర్ గారి సమీక్ష

నీల…నీల…నీల…
———————–
‘నీల’ త్వరగానే పూర్తి చేశాను. చాలా కాలంగా మంచి నవల చదవని లోటు తీరింది. స్త్రీ పురుష సంబంధాల మీద అంటే వివాహవ్యవస్థ మీద ఓ చర్చ ప్రారంభమైతే బావుణ్ణని చాలాసార్లు అనుకునేవాళ్ళం. చలం గారు మరికొంత కాలం ఆశ్రమ జీవితానికి వెళ్ళుండకపోతే, మరెవరైనా అందుకునే వరకూ కొనసాగించివుంటే, ఈ చర్చ అప్పుడే ప్రారంభమై వుండాల్సింది. కమ్యూనిస్టులకు సత్తా వుండి కూడా, వేరే ఎజెండా వల్ల సాహసించలేకపోయారు. ఒకరిద్దరు పరిమిత స్థాయిలో చర్చించారు. 

ఏలూరు జూట్ మిల్లు జీవితాన్ని కథావస్తువుగా ఓ నవల వస్తే బాగుంటుందని నేనూ ఏలూరు మిత్రులు అనుకునేవాళ్ళం. నాకు 1967 నుండి 1992 నెల్లిమర్ల కాల్పుల వరకూ జూట్ కార్మిక వ్యవహారాలతో బాగా సంబంధముంది. నవలలో ప్రస్తావించిన స్త్రీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే సమ్మె, మంచి ఎత్తుగడ. నవలకి సరైన కాలాన్ని ఎంచుకొన్నారు. దాదాపుగా రచయిత సృష్టించిన పాత్రలన్నీ రక్తమాంసాలతో సజీవంగా నాకు పరిచితులే. 

ఆ తర్వాతి కాలంలో మైక్రోఫైనాన్స్, డ్వాక్రాలు, ఇందిరాగాంధీ పాలన తర్వాత ఆడవాళ్ళని బైటికి లాక్కొచ్చిన అతి పెద్ద సందర్భం. వాళ్ళ జీవితాలను నిశ్శబ్ద తటాకంలో పెద్ద బండరాయిలా అల్లకల్లోలం చేసేసింది. కొందరు పూర్ణలు తయారయినా నష్టమే ఎక్కువ జరిగింది. నవల కొనసాగింపుకు అది కూడా మంచి ఘటన. మల్లీశ్వరి గారి నవలలో హీరోయిన్ నీల, నేనూ ఏలూరువాళ్ళం. 30 సంవత్సరాల తేడాతో మా ఇద్దరి సామాజిక నేపథ్యాలూ ఇంచుమించు ఒకటే. రెండు మూడు దశాబ్దాల తేడాతో స్థితిగతులు మారేటంత అభివృద్ధి మా ఊర్లో జరగకపోవడంతో, ఈనవల అర్ధం కావడానికి నేను గతం లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అందుకు నేను, ఏలూరు ను అభివృద్ధి కి ఆమడ దూరం లో వుంచిన స్థానిక రాజకీయ నాయకులకు ఎంతైనా క్రుతజ్ఞుడను.
నీల రక్తమాంస పరిపుష్టమైన పాత్ర. జూట్ మిల్లు కార్మికుల కుటుంబాలలో వుండే వాతావరణం, పాత్రల స్వరూప స్వభావాలు, రచయిత్రి బాగా పట్టుకున్నారు. మా పేటల్లో వాడే పారిభాషిక పదాలు కూడా జూట్ పరిశ్రమకు సంబంధించినవే. పోరీలు(షిఫ్ట్ లు), అగ్రిమెంట్ లు, బోనస్, లేఆఫ్, లాకౌట్ లాంటివి . చివరి మాట మాత్రం కార్మికులను భయబ్రాంతులను చేసేది. అక్కడి రాజకీయ వాతావరణం కూడా తీవ్రంగా నే వుండేది. నీల తల్లికి ఆటో డ్రైవర్ తో వున్న చనువు తండ్రి నరిసి కి నచ్చదు. నీలకు కూడా అసౌకర్యంగానే వుంటుంది. తన తండ్రి వటవ్రృక్షం లా వుండాలని కోరుకునే నీల, పసితనం లోనే, మంచి చెడుల ఎంపీకకు కొలమానం మనుషులను చూసే పద్ధతి లోనే వుంటుందని తెలుసుకుంటుంది.

చంద్రకళ హత్యకు కారణమైన సామాజిక స్థితిగతులు ,మానవ సంబంధాలు నేనెరుగుదును. ఏమాత్రం కల్పన అవసరం లేకుండానే రచయతకి ఈ నవల లోని పాత్రలు తారసపడి వుంటాయి. ఆ కాలానికి నీలను, నీల లాంటి అభాగ్యులను ఆదరించేపాటి మానవతా వాదులకు కొదువ లేదు. మిల్లు కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డ సూర్యం లాంటి సామాజిక కార్యకర్తలను కార్మిక అవసరాలు సృష్టించుతూనే వుంటాయి..ఐతే తడిక మీద వాలిన పిచ్చకలను మురిపెంగానూ,పారే నీటిని ఉత్సాహంగానూ చూసే సూర్యం పాత్రను అర్ధంతరంగా ఎందుకు ముగించారో నాకర్ధం కాలేదు. ఆరంజోతి పాత్రను మరింత మానవీయంగా చూపించడానికే రచయత ఈ పాత్రను ముగించి వుండాలి.
నీలకు ప్రసాద్ తో వివాహం జరిగి రాజమండ్రి చేరుతుంది. సరళ తో ప్రసాద్ కున్న స్నేహం ఆమోదించలేక పోతుంది.బాల్యం నుండే తనకెంతో ఇష్టమైన చదువు రాజమండ్రిలోనే పూర్తి చేస్తుంది. అక్కడ లాయర్ వసుంధర, రవి లాంటి పాత్రలు నీల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి సహకరిస్తాయి. ప్రసాద్ సరళను పెళ్ళిచేసుకోవడాన్ని నిరసిస్తూ నీల బిడ్డతో సహా రోడ్డున పడుతుంది. బ్రతకడం కోసం అయిన అనుభవాలలోని చేదును భరించలేక, నీల తిరిగి ఏలూరు చేరుతుంది. 

అవి మహిళా సాధికారత పేరుతో ప్రభుత్వం, బ్యాంకులూ దిగువతరగతి మహిళలను లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టిన కాలం. డ్వాక్రా, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉదృతంగా కార్యక్రమాలు ప్రారంభించాయి. ఇంటి పనులు చేసుకుంటూ, వేన్నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు చిన్నచిన్న కుట్లు,అల్లికలూ చేసుకునే మహిళలు, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాలం. నిశ్చల తటాకంలో పెద్ద బండరాయి పడ్డట్టు మహిళల జీవితాల్లో ఇది చాలా అల్లకల్లోలం రేపాయి. వారి సామాజిక, బౌద్ధిక జీవితాలు పెనుమార్పులకు గురయ్యాయి. గ్రామాల్లో వున్న చోటా నాయకులు ఈ మహిళలకు నాయకత్వం వహిస్తూ ఆ క్రమంలో ఆర్ధిక, రాజకీయాలలో ఒక మెట్టు పైకెగబాకారు.
వీటికి ప్రతినిధులు రత్నకర్, శుభాంజలి, సంపూర్ణలు. పూర్ణక్క ఎవరో తమకోసం ఆడించిన, నాటకంలో పాత్రధారి మాత్రమేనని నీల బాధపడుతుంది. పూర్ణక్కకు సహకరించే క్రమంలో, పరదేశి నీల జీవితంలో ప్రవేశిస్తాడు. పరదేశి తనకు ఆలంబనగా వుంటాడని నీల భావిస్తుంది. తను జీవితంలో కోల్పోయిన ప్రేమనంతా , పరదేశి నుండి తిరగి పొందాలని ఆశిస్తుంది. పరదేశి నుండి ప్రేమను ఆశించడం తప్పే ఐతే ఆ తప్పే చేయాలనుకుంటుంది. అతని జీవితంలో చేతన తో వున్న లవ్ రిలేషన్ గురించి తెలుస్తుంది.

మూడోవ్యక్తి ప్రమేయం వున్న ప్రేమ బంధానికీ భయపడి, మళ్ళీ పూర్ణక్క గూటికే చేరుతుంది .
తన గురువు ,లాయర్ వసుంధర సలహాపై ,నీల హైదరాబాద్ చేరుతుంది. ఒక సామాజిక కార్యక్రమంలో ప్రముఖ లాయర్ సదాశివతో పరిచయమౌతుంది .సదాశివ కార్మిక హక్కుల కోసం పనిచేసే లాయర్. ప్రత్యేక తెలంగాణ నాయకుడు కూడా. సంపన్న కుటుంబానికి చెందిన అతని తలిదండ్రులు విధ్యాధికులు. తల్లి పనిచేస్తున్న యూనివర్సిటీ ప్రాజెక్ట్ లో పని చేయడానికి నీలను ఒప్పిస్తాడు సదాశివ. నీల తన జీవితాన్ని గురించి చెప్తూ ‘తనకూ,బిడ్డకూ బ్రతికే హక్కు’ వుందని చెప్పడం, సదాశివను బాగా ఆకర్షిస్తుంది. 

సదాశివ నీల తొ సహజీవనం కోసం ప్రతిపాదిస్తాడు. నీలకు వచ్చే లాంటి పీడకలలతో స్నేహం చేయనని హామీ ఇస్తాడు. నీలకు జీవితం బాగా అర్ధమౌతుంది. ఆడా,మగా సంబంధాలలో సార్వజనీన విలువ లేమీ వుండవనీ, స్త్రీ గా వుండడం కంటే మనిషిగా రూపొందడమే ధన్యమని భావిస్తుంది. తన స్నేహితురాలు వస్తుందని ,రెండు రోజులు తనతో వుంటుందని సదాశివ చెప్పడంతో షాక్ అవుతుంది నీల. దానికి సమాధానం గా వ్యక్తిగత విషయాల బరువు తగ్గించుకుని సమాజం వైపు చూడమని చెప్తాడు సదాశివ.

సదాశివ నుండి వేరుపడడానికి నిర్ణయించుకున్న నీల, అజిత దగ్గరకు వెళ్తుంది. “మీరిద్దరూ పరస్పరం విశ్వాసం పెంచుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారనీ అనుకుంటున్నారు . ఇటువంటి పరిస్థితుల్లో నీ నిర్ణయం తప్పు” అంటుంది అజిత.

సదాశివ చెప్పిన స్నేహితురాలు తనకెంతో ఇష్టమైన వసుంధరే అని తెలిసి, నీల రాజీ పడుతుంది.
సదాశివ ప్రజలకోసం పని చేస్తాడనీ పరస్పర స్నేహాల్లో అనేక విషయాలుంటాయనీ, లైంగిక సంబంధాలు అతి చిన్న విషయమనీ చెప్తుంది వసుంధర. సదాశివతో తన ప్రవర్తన కు పశ్చాత్తాపపడుతుంది 28 ఏళ్ళ నీల.

రచయిత నీల పాత్రను అత్యంత శ్రద్ధగా మెట్టు మెట్టుగా నిర్మించారనిపిస్తుంది. పాత్రలన్నీవాస్తవంలోనే వున్నాయి. నరిసి, చంద్రకళ, ఆరంజోతి, సంపూర్ణ, పరదేశి, పైడమ్మ అంతా పాజిటివ్ పాత్రలే. వ్యతిరేక స్వభావాలు కలిగిన ప్రసాద్, సరళలు ఆయా పరిస్థితులలో అలా ప్రవర్తించారని నీల భావించడం లో మరింత ఔచిత్యం వుంది. ఈ నవలలోని పాత్రలన్నీ కథనం కోసం అవసరమే కానీ మత్తయ్య దంపతులు, ప్రకాష్-నీతూభాయ్ లు లేకపోయినా నవల ఔచిత్యానికి భంగం కలగదనిపించింది. కానీ వ్రృద్ధ దంపతులైన వీరు యాత్రలతో కాలక్షేపం చేస్తూ, యాత్రలలోఒకగది లో పడుకునే అలవాటు వల్ల ఇంటిదగ్గర కూడా ఒకే గదిలో వుంటున్నారని రచయిత రాసినపుడు సమంజసంగా అనిపించింది. మానవ సంబంధాలు ఎంత క్రూరమైన వో అంత ఆర్ధ్రమైనవి. మనుషులు తమ సంస్కారంతో, నూతన విలువలతో అన్నింటినీ ప్రేమభరితo చేయగలరు. సాటి మనుషుల మీద ప్రేమతో యుద్దాలు కూడా చేయగలరు……… ‘నీల’ ను స్రుష్టించిన మల్లీశ్వరి గారూ అభినందనలు.

 — with Jaji Malli Jaji.

 

కరుణా టీచర్

ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నేను రాసిన కరుణా టీచర్ కథ పబ్లిష్ అయింది. ఏడాదిన్నర తర్వాత రాసిన కథ.

ఏదో పొరపాటు వల్ల బాక్స్ ఐటమ్స్ లో ఇచ్చిన వాక్యాలు టెక్స్ట్ లో మిస్సయ్యాయి.

‘కరుణ మాట్లాడుతుంటే మిగతా ముగ్గురూ అబ్బురంగా విన్నారు.’ పేరాకి ముందు మొదటి బాక్స్ ఐటం రావాలి.

“ఉలిక్కిపడి అద్దం ముందు నుంచి కదిలింది.” పేరాకి ముందు రెండో బాక్స్ ఐటం రావాలి.

లోకానికంతా ఇట్లా చేర్చుకుని చదవమని చెప్పలేం కానీ వీలైన చోట చెపుదామని ఈ ప్రయత్నం.