భాండాగారం

చమ్కీపూల గుర్రపు గాలప్

http://epaper.andhrajyothy.com/news?cat=sunday&day=20151025#26

dr-afsar

 

 

వర్తమానకథల్ని చదవడమే తప్ప వాటిని ఆలోచనలలోకి తీసుకుని ఏవైనా రాయడం నాకు అలవాటు తప్పిపోయింది. కొద్దిగా ఆలస్యంగా మిత్రులు అఫ్సర్ ఇటీవల రాసిన కథ చదివాను. పుస్తకం పక్కన పడేసినా కథ నన్ను పట్టుకునే ఉంది. సమయానికి తగు కథ అయినందువల్ల ఇది నా ఆలోచనలని వదలకుండా పట్టుకుని ఉందా అన్న సందేహాన్ని ఈ నాలుగు రోజులుగా పోషిస్తూ వచ్చాను. కావొచ్చు . దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన పరమత అసహనాన్ని అడ్రెస్ చేస్తూ రాసిన కథ కదా అందరి దృష్టినీ తన వైపు లాక్కోవడం సహజం.

కానీ ఇందుకే కథలు ఆకర్షించగలవా! వస్తు కాల స్పృహ ఒకటే కథని రక్తి కట్టించగలదా? దానిని మించినది ఏదో ఈ కథలో ఉంది. నాలుగు రోజులుగా లోకాన్ని మరిపించి నన్ను తన అక్షరాల్లో కట్టేసుకున్న బుచ్చిబాబు ఏవంటున్నాడు!  ‘ఉద్రేకంతో ఆవేశంతో అంతరంగ జగత్తులో ఒక కల్లోలం జరగాలి. ఆ కల్లోలం నిలిచిపోవాలి. అందులో మునిగి గుటకలు వేస్తూ మధ్య ఊపిరి తీసుకోడానికి పైకి లేచి బాహ్య జగత్తులోకి తొంగిచూడాలి’  బహుశా ఆ తొంగి చూపు లోనుంచేనేమో అఫ్సర్ కి అపూ దొరికింది. ఊహకి ఏకాంత యుద్ధాన్ని ఇచ్చి, ఎంత సేపు పోరాడి ఉంటాడో ఈ సైనికుడు చివరికి  ఒక శాంతిదూతగా అపూని మన ముందు నిలబెట్టాడు.

అవును ఇందరు మేధావులు. కళాకారులు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు పోట్లాడుతున్నారు చిన్నబోతున్నారు నేలకొరుగుతున్నారు. దళసరి చర్మాలను కప్పుకున్న భద్ర జీవులం. మనకి అర్ధమయ్యేలా చెప్పడానికి ఈ కథకుడికి ఎంత యాతనో! ముల్లుని ముల్లుతోనే తీయాలనుకోలేదు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనుకోలేదు. ముళ్ళూ వజ్రాల కఠినత్వానికి ఎదురుగా పూవువంటి పసి హృదయాన్ని నిలబెట్టాడు. తనకి భిన్నంగా ఉన్నవాటిని అర్ధం చేసుకుని ప్రేమించే శక్తిని  పసివాళ్ళే పొందగా లేనిది మనం సాధించాలేమా అని ప్రశ్నిస్తున్నాడు.

అపూగా మారిన నేను గర్వపడ్డాను. అపూ తల్లిగా మారి చైతన్యాన్ని పొందాను. అపూ తండ్రిగా నేను నిజానికి సిగ్గుతో చితికిపోవాలి. కానీ అఫ్సర్ గారూ నాకు నిస్సహాయంగా అనిపించింది. లోకం నిండా సురేష్ లే. ఎటు మెసిలితే అటు వారే. మన ఉద్యోగ స్థలాల్లో, వినోద స్థలాల్లో,  మన మిత్రుల్లో, మన బంధువుల్లో కొత్త హడావిడి. కనీసపు కామన్ సెన్స్ తో  నాలుగు మాటలు మాట్లాడితే వంద దాడులకి సిద్దపడి ఉండాలి. పట్నపురోడ్ల మీది బెదురుగొడ్డుల్లా మనది కాని చోటులో నివాసం ఉండటం ఎంత కష్టం. కానీ నిలువనీడ లేని చోట నిల్చున్న చోటనే పరిగెత్తాలి కదా. ఆ పరిశ్రమ నుంచి ఇలా నాలుగక్షరాలను పోగేద్దాం.

ఇక్కడ  మన మాటలు అట్టడుగు స్వరాలు. నాభి నుంచి పెకలించాలి.

ఇక చమ్కీ పూల గుర్రపు గాలప్  హస్తిన వరకూ వినిపించాలి.

అచట పుట్టిన చిగురు కొమ్మైన…

దేవినేని జయశ్రీ,మధుసూదన్ రావు దంపతులు  తమ బంధువుల అమ్మాయి పెళ్ళికి ‘మనసున మనసై’ అనే పుస్తకం వేసి వారికి పెళ్లి కానుకగా అందించారు.ఆ పుస్తకంలో నార్ల వెంకటేశ్వరరావు,పి.సత్యవతి, శ్రీ రమణ,జాస్తి రమాదేవి,సోమరాజు సుశీల గారి కధలతో పాటు నేను రాసిన జాజిమల్లి బ్లాగ్ కధల సంపుటి నుంచి ‘చిటికీసర చెట్టుకి కాసిన తియ్యమామిడి పండు’కధని కూడా తీసుకుని ప్రచురించారు.వారికి బ్లాగ్ ముఖంగా ధన్యవాదాలు.
ఆ సంపుటి పై బాపు గారి చేతిరాత సమీక్షా లేఖ జాజిమల్లి లో పోస్ట్ చేయడానికి మధుసూదన్ గారు పంపారు…వారికి కృతజ్ఞతలు…
అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ…మాదిరిగా బాపు గారి నుంచి వచ్చే చిన్న ప్రశంసలో కూడా ఎన్నెన్ని వర్ణాలో కదా!!..

హలో బ్లాగున్నారా?

ప్రపంచ సాహిత్యంపై ఆసక్తి, పరిశీలన, అవగాహనలతో విశ్లేషణ చేయగల విమర్శకులు రామతీర్ధ జాజిమల్లి బ్లాగ్ గురించి మే 21వ తేదీ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో   ఇలా అన్నారు.  
 

కధలకు పరిమళం అద్దిన జాజిమల్లి

మే 14 తేదీ ప్రజాశక్తి దినపత్రిక ‘సవ్వడి’ సాహిత్య పేజీలో చెరుకూరి సత్యనారాయణ గారు జాజిమల్లి కధల్ని సమీక్షించారు.(మాటర్ పై క్లిక్ చేయగలరు)
 

పల్లీ వొలిచి పప్పులు చేతిలో పెట్టేశాక కూడా..

జాజిమల్లి కధల పై  పి.సత్యవతిగారు ఏం చెప్పారు?
ఏప్రిల్ నెల చినుకు సాహిత్య మాసపత్రిక ఏడవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో ‘వెన్నాడే పరిమళం’అంటూ ఆమె రాసిన దానిని జాజిమల్లి కధలపై సమీక్ష అని అనబుద్ది కావడం లేదు…
సత్యవతిగారూ మీ కధల టెక్నిక్ ఎందుకంత గొప్పగా ఉంటుందో నాకు మళ్ళీ అర్ధమైంది.నా బాల్యపు అనుభవాల్లోంచి మీ బాల్యం లోకి పెనవేసుకుంటూ చేసిన ప్రయాణం ఆ క్రమంలో మీ వ్యాఖ్యానం మనసుని తడి చేసాయి…ఎక్కడ కొంచెం మంచి కనిపించినా గుండెలకి హత్తుకునే ‘అమ్మ'(గోర్కీ అమ్మ గుర్తొచ్చింది)కదా మీరు.
మరి ‘కొలకలూరి పిల్ల కతలు’ ఎపుడూ రాయబోతున్నారు?
గత వేసవిలో మీ బ్లాగ్ లో నేను ఒక వ్యాఖ్యలో బెదిరించినట్లు…..”మీరు మీ అనుభవాలను రికార్డ్ చెయ్యకపోతే నేను ఏ వాయిస్ రికార్డర్ అయినా తీసుకుని వచ్చేస్తాను…అసలే నడివేసవి…అందులోనూ బ్లేజ్ వాడ…ఆపై  మల్లీశ్వరి…రిస్క్ ఎందుకు చెప్పండి?”

ఊసుల పరిమళాలు.

ఏప్రిల్ మొదటివారం ఈనాడు ఆదివారం అనుబంధంలో,వేణువు బ్లాగర్ వేణుగారు జాజిమల్లి బ్లాగ్ కధలను పరిచయం చేసారు.
(మాటర్ పై క్లిక్ చేయండి.)
 
జనవరిలో నవ్య వార పత్రికలో రామ్మోహన్ గారు జాజిమల్లి బ్లాగ్ కధల్ని సమీక్షించారు.
(మాటర్ పై క్లిక్ చేయండి.)

జాజిమల్లి కధలపై బీనాదేవి సమీక్ష

మార్చ్ 2012 ఈ భూమి మాస పత్రికలో జాజిమల్లి కధలను బీనాదేవి గారు సమీక్షించారు.
(పేపర్ కటింగ్ పై క్లిక్ చేయండి.)

మనసుని తట్టే ఈ కాలపు కధలు.

జాజిమల్లి బ్లాగ్ కధలను  కధా రచయిత్రి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత అబ్బూరి చాయాదేవి గారు వార్త ఆదివారం అనుబంధం లో సమీక్షించారు.
(పేపర్ కటింగ్ పై క్లిక్ చేయండి)