భాండాగారం

సప్తవర్ణ లేఖ – 2

డిసెంబర్ నెల 2014 లో విమల  రాసిన సప్తవర్ణ లేఖ -2 చినుకు సాహిత్య మాసపత్రికలో… ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి

Chinuku December Set -2014 saptavarna lekha (2)

సప్త వర్ణ లేఖ – 1

పిట్ట వచ్చి చెట్టుని కొట్టేస్తే…

15-10-2014,

విశాఖపట్నం.

ప్రియమైన విమలా,

గత నాలుగు రోజులుగా కొన్ని వందల హృదయాలు ఎలా ఉన్నావంటూ తోచిన మార్గాల్లో పలకరింపులు పంపాక ఇక ఎవరినైనా ఎలా ఉన్నారంటూ అడగడం నాకే బోలుగా వినిపిస్తోంది. కొన్ని నక్షత్రాల వెలుగు జిలుగుల్లో, జాజిమల్లెల ఫ్రాగ్రెన్స్ తో  ఉల్లాసంగా ఉత్సాహంగా లేఖా పరంపర మొదలు పెట్టాలనుకున్నాను. కానీ కాసిన్ని కన్నీళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాను. సప్తవర్ణలేఖ కదా వివర్ణం కానిది ఏదైనా సరే ఆహ్వానించాలి మరి.

11వ  తారీఖు శనివారం ఎప్పట్లాగే నిద్రలేచి ఆకాశంలో ఏనుగు మబ్బుల్ని చూసి పోదురూ బడాయి అని మూతి విరిచి కాలేజికి వెళ్ళిపోయాను. టివి ఛానెల్స్ నీ పేపర్లనీ చూసి తుఫాను హోరు కన్నా మీ జోరు లావైంది కొంచెం  తగ్గమని మందలించాను కూడా. కాస్త చల్లగా మరి కాస్త వేడిగా ఉన్న వింత గాలులు భయపెట్టినట్లున్నాయి కాలేజి వారు మధ్యాన్నం నుంచీ అందరినీ ఇళ్ళకి పంపేసారు. ఇలా సడెన్ గా ఇళ్ళకి పంపినపుడు పిల్లల కన్నా మాకే ఎక్కువ సంబరం. కానీ బైట పడకూడదు కాబట్టి మెల్లగా అసలు ఉత్సాహమే లేనట్లు ఇంటికొచ్చి రాగానే ముసుగు తీసేసి  మా పిల్లతో కలిసి చిన్నపాటి నృత్యమే చేసాను. గాలిలో చల్లదనం మోపైంది. వెచ్చగా ఇంత వండుకుని తిని పుస్తకం పట్టుకున్నాను. ఈ లోకంలోకి వచ్చేసరికి కరెంట్ పోయింది. ఇన్వర్టర్ లోటు తెలియనివ్వలేదు. ఆ రాత్రి మామూలుగానే గడిచింది.

ఆదివారం ఉదయం దడదడ బడబడ శబ్దాలతో మెలకువ వచ్చింది. కిటికీలకి పెట్టిన బోల్టులు కూడా కదిలిపోతూ ఉన్నాయి. వాటికి గట్టి తాళ్ళు కడుతూ కనిపించాడు చందు. తలుపు తీసుకుని నిద్రమొహంతో కారిడార్ లోకి అడుగు పెట్టానో లేదో బలమైన గాలి తెర ఒకటి కమ్మేసింది. నాకు తెలీకుండానే పక్కింటి గుమ్మం వైపు నెట్టివేయబడ్డాను. అవీ ఇవీ ఆసరా చేసుకుని ఇంట్లోకి వచ్చి పడ్డాను. అది మొదలు 24 గంటల పాటు ఇంటి తలుపులు తీసే సాహసం చేయలేకపోయాము.

నాకు వూహ తెలుస్తున్న వయసులో దివి సీమ ఉప్పెన వచ్చినప్పటి భయానక  వాతావరణం ఇప్పటికీ గుర్తుంది. మా నాన్న పొట్టలో దూరిపోయి పడుకుని ఆయన్ని ఎటూ కదలనివ్వకుండా అంటిపెట్టుకుని తిరగడం, ఇంటిల్లపాదీ బిక్కుబిక్కుమని ఒక చోట చేరి రాత్రంతా గడపడం తరువాత పేపర్లలో హృదయవిదారక మైన దృశ్యాలు చూసి ఝడుసుకుని నాలుగు రోజులు జ్వరం తెచ్చుకోవడం గుర్తొచ్చాయి.

ఇన్వర్టర్ ఆగిపోయింది. టివి మూగబోయింది. సెల్ ఫోన్ల సిగ్నల్స్ పోయాయి. మూసుకున్న తలుపులూ కిటికీల మధ్య క్షణాల లెక్కవేత. గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల మధ్య ఇళ్ళలో క్షణాలు యుగాలయ్యాయి. భయపెట్టేవి మాత్రం అందంగా ఉండవా విమలా ?

స్నిగ్ధ అంది ‘’అమ్మా! ఏం జరుగుతోందో చూడొద్దా ‘’ అని. నాలోనూ ఏదో ఆకర్షణ. సరేలెమ్మని  బాల్కనీ తలుపు తీసి గ్రిల్స్ ని గట్టిగా పట్టుకుని నిల్చున్నాం. మా ఇంటి పక్కనే కొండ ఉంది తెలుసు కదా? మామూలు రోజుల్లో  వర్షం వచ్చినపుడు కొండవైపు చూస్తే సాలీని దారాల వంటి నీటి చుక్కల వరుస అలా సన్నగా జలతారు తెరల మాదిరిగా కదిలిపోతూ   కనిపించేది. అలాంటిది  ప్రొక్లైనర్ తన భారీ ఇనుపహస్తంతో విసురుగా కళ్ళాపి జల్లినట్లు చిందరవందర జల్లులు. గాలి స్పర్శకే కాదు చూపుకూ అందడం తెలిసి వచ్చింది. నష్టం ఏదో జరుగుతోందని తెలుసు. ఊహలు ముందుకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి. గాలి ఎడాపెడా తనతో తనే కలియబడి ఉండచుట్టుకుని ఈల వేస్తూ గుండ్రంగా పైకి లేచినపుడల్లా చెట్ల ఆకులు కొమ్మలూ ఆ సుడిలోకి దూకేవి.

‘’అమ్మా! రేకుల ఇళ్ళ వాళ్ళ సంగతి ఏంటి !! ఇడ్లీ బళ్ళు,బడ్డీ కొట్లు వాళ్ళు ఎట్లా ఉండి ఉంటారు! కొండవాలు ఇళ్ళుఖాళీ చేసారో లేదో , అమ్మా చూడు చూడు కాకి గూడు పడిపోయి గుడ్లు చితికి పోయాయి,అమ్మా ఎదురింటి వాళ్ళ సింటెక్స్ డ్రమ్ము గాలిలోకి లేచింది, అంటూ స్నిగ్ధ ఆర్తనాదాలు చేస్తూ విలవిలలాడుతుంటే  పేరు గుర్తు రావడం లేదు కానీ శరత్ నవలలో ఒక దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.   అందులో నాయకుడు ఓడ ప్రయాణం చేస్తున్నపుడు తుఫాను రావడం సముద్రపు అల్లకల్లోలం, తాడెత్తునలేచిన అల ముందు, ప్రకృతి ముందు మనిషి అల్పుడై పోవడం, ఆ స్థితి ఎట్లా ఉంటుందో అనుభవం లోకి వచ్చింది.

హుదుద్ తుఫాను తీరాన్ని తాకడానికీ దాటడానికీ మధ్య నంగనాచి నిశ్శబ్దం. గంట సేపు మాత్రమే. వంటిగంట తర్వాత గాలి దిశ మార్చుకుని వ్యతిరేకంగా వీచడం మొదలైంది. విశాఖలోని మిగతా మిత్రులు, బంధువులు, కుటుంబీకుల క్షేమం కోసం ఆత్రుత, అసలు మాకు ఏం జరుగుతోందో ఎవరైనా చెపితే బావుండునని ఆశ, కానీ తెలిసే మార్గం లేదు. అపార్ట్ మెంట్స్ కూలిపోతున్నాయని పునాదులు కదిలిపోతున్నాయనీ ఎవరో పుకారు మోసుకొచ్చారు. కొబ్బరి మట్టలు రాలినపుడూ, మావిడి కొమ్మ ఫెళ్ళున విరిగినపుడూ, సందు చివరి హోర్డింగ్ కి అతికించిన బానర్ తపతప కొట్టుకుని హోర్డింగ్ నే  వంచేసినపుడూ కరెంట్ వైర్లూ కేబుల్ వైర్లూ చిక్కుముళ్ళు పడి విద్యుత్ స్తంబాలని కూలదోసినపుడూ ఉలికులిక్కిపడుతూ మా అపార్ట్ మెంట్ కూడా కదులుతుందా అని భయపడుతూ చూసుకునేవాళ్ళం . అప్పటివరకూ ఈ విపత్తు అంతా మా వీధికే అనుకున్నాము.

సోమవారం ఉదయాన్నే కలత నిదుర వదిలించుకుని ఆరింటికల్లా బైటకి వచ్చి చూస్తే తెల్లటి వెలుగులో శిధిల విశాఖ, అబ్బూరి చెప్పిన దగ్ధనౌక విశాఖ, ఈ వీధి ఆ వీధి పిచ్చిగా తిరుగుతూ అయ్యయ్యో  మోడువారిన  కైలాసగిరి, ఇటు చూడు కళ తప్పిన అంధ్రవిశ్వకళాపరిషత్తు , అటు చూడు ఆ కూడలి మద్దిలపాలెమేనా!! జూ లో చెట్లన్నీ ఎవరు నరికారు!! విశాఖ నగరానికి ఆకుపచ్చని ఒడి పరిచిన కొండలన్నీ ఆకులు దూసిపోసినట్లు బోసిపోయాయి. కొండవాలు ఇళ్ళకి పరుగులు పెడితే రేకులు ఎగిరిపోయిన మొండి గోడల ఇళ్ళ ముందు పడిన చెట్టు కొమ్మల్నీ చెత్తనీ రేకుల్నీ  నిర్వికారంగా శుభ్రం చేసుకుంటూ, మార్గం చూపిస్తూ శ్రామికజనం.

హుదుద్ అంటే ఏదో భాషలో పిట్ట అని అర్ధం అట ! మరి పిట్టే వచ్చి చెట్లను కొట్టేయడం ఏవన్నా బావుందా విమలా!? సోమవారం సాయంత్రానికి ఏదోలా మార్గం చేసుకుని వర్మ ఇంటికి చేరుకున్నాము. మిత్రుడు  నారాయణ వేణు కూడా అదే సమయానికి అక్కడికి చేరుకున్నాడు. పిల్లాజల్లలాదిగా అందరం రోడ్డు మీదకి చేరాము.

ముని మాపు వేళ… నాలుగు వైపులా కూలిపోయిన చెట్లు, ఎదురుగా శిధిలమైన పార్కు. ఇళ్ళ మీద పడిన చెట్లని తొలగించడానికి నానా తంటాలూ పడుతున్న కుర్రాళ్ళ మాటలూ, సన్నగా ముసురుకుంటున్న చీకట్లు, అదో రకం ఉక్కపోత.  గుండెల్లో గుబులు దిగులు, 48 గంటలుగా అలవాటైన సన్నని గాలి హోరు వంటి భ్రాంతి మధ్య ఒక దృశ్యం చూసాను విమలా!!

వందలాది కాకులూ కొంగలూ గోరువంకలూ నేను గుర్తుపట్టలేని జాతుల పిట్టలనేకం రకరకాల అరుపులతో అయోమయంగా ఆకాశంలో గిరికీలు కొడుతున్నాయి, మధ్య మధ్య విరిగిన కొమ్మల మీదా ఒరిగిన విద్యుత్ స్తంభాల మీదా వాలబోయి పట్టు దొరక్క గోలగోలగా అరుస్తూ గూళ్ళ కోసం వెతుక్కుంటున్నాయి. నాకే గానీ శక్తి ఉంటే వాటి కోసం క్షణాల్లో పూలవనాలో, దట్టమైన అడవులో నిర్మించి ఉండనా!? చప్పున పక్కకి తిరిగి చాటుగా కళ్ళు తుడుచుకోవడం తప్ప ఈ నిష్క్రియాపరురాలు ఏమి చేయగలిగింది!. ప్రియాతి ప్రియమైన గురజాడా! దేశమంటే మట్టి కాదు మనుషులని ఎరుక చెప్పినపుడు అవును కదా అనుకున్నాము. మరి  నగరమంటే ఒట్టి మనుషులేనా!

నారాయణ వేణు తన  సోదరి పెంచిన పిచ్చుకల ముచ్చట ఒకటి చెప్పారు. చిన్నతనాన్ని వెలిగించి ఇపుడు దాదాపుగా కనుమరుగైపోతున్న సమయంలో ఎలానో మరి రెండు పిచ్చుకలు రోజూ తన సోదరి వాళ్ళింటికి వచ్చేవట. వాటికి గంట్లూ బియ్యం గింజలూ వేసి, మట్టి మూకుళ్ళలో నీరు పోసి వాటిని సాకి రెండింటిని కాస్తా ఇరవై  చేసారట. తుఫాను రోజు అవి బుద్ధిగా రెండు ఇళ్ళ మధ్య ఖాళీగా ఉన్న గట్టు మీద కూచునే ఉన్నాయట. చూస్తూ ఉండగానే రాకాసి గాలి తోసుకురావడంతో చెల్లాచెదురై ఎగిరిపోయాయి. రెక్కలు సరిగ్గా చాచుకుని ధీమాగా ఎగరడం రాని నాజూకు పిట్టలు కదా పిచ్చుకలు. ఎగరలేక ఏ గాలివాలుకి పడి కొట్టుకుపోయాయో మరుసటి రోజు తిండి సమయానికి తొమ్మిదే వచ్చాయట. పిల్లల వలే పెంచిన పక్షులు ఏమయ్యాయోనని ఆమె బెంగపడుతోంది.

మురళినగర్ లో ఉండే చందు వాళ్ళ పుట్టింటికి చేరుకునే సరికి అదొక విషాదం. రాత్రంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపామని అత్తయ్య మావయ్య చెపుతుంటే చందు కళ్ళల్లో నీళ్ళు. ఇద్దరమూ గిల్టీతో మాటలు మరిచిపోయాము. మా వైవాహిక జీవితం తొలి దశాబ్దానికి, దానికి ఉండే అనేక రంగుల జ్ఞాపకాలకి మూలమైన రెండతస్తుల మేడ మీది గది కుప్పకూలిపోయింది. గది తలుపులూ కిటికీలు పై కప్పు, లోపల ఉండే సామాను. ఆనవాలు దొరకని శిధిలాల కుప్ప మా ప్రేమ మందిరం.

సరే… అందరూ చెప్తున్నట్లు విషాదం గురించి కన్నా దాని నుంచి కోలుకోవడం గురించి మాట్లాడమే ముఖ్యం. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో నేర్చుకున్నంత కృతకంగా ఆత్మవిశ్వాస ప్రకటనలు చేయలేము కదా. వేగం అలవాటైన లోకానికి ప్రతీది వేగంగానే జరగాలి. విపత్తులు కురిపించిన విషాదమూ వేగంగానే సమసిపోవాలి. ఏం జరగనట్లు హుందాగా మెలగాలి . లేకపోతే రేసులో వెనకబడిపోమూ! బేలనో అబలనో ఏమైనా అనుకో విమలా కాస్త ఊరట దొరికేవరకూ కరువుతీరా ఏడవాలని ఉంది. ఎప్పట్లా నగరమూ కాలుష్యమూ మానవ తప్పిదాలూ అంటూ ఎగిరిపడాలని అస్సలు లేదు. బిడ్డల్ని కొట్టి మళ్ళీ తనే దగ్గరకి లాక్కుని దుఃఖించే అమ్మలా అనిపిస్తోంది విశాఖ నగరం.

చందు అంటే నాకు ఆకర్షణ కలగడానికి తను విశాఖలో పుట్టి పెరగడం కూడా ఒక కారణం అని చెప్తే తను చాలా ఉడుక్కునేవాడు. ఈ చోటంటే అంత పిచ్చి నాకు. వ్యక్తిగత నష్టం పెద్దగా నొప్పించేది కాదు కానీ ఇక బతికినంతకాలం విషాద నేపథ్య గానంలా కోల్పోయిన వాటిని వెంటేసుకు తిరగక తప్పదేమోనన్న దిగులూ, అంతలోనే శ్రమించే ఇక్కడి ప్రజల తత్వం మీదా, సాంకేతికతని సమర్ధవంతంగా వాడే నవతరం మీది ఆశా, పునర్ నిర్మాణం మీద భరోసాని ఇస్తున్నాయి.

ఎంతో మంది సాహితీ మిత్రులు, చిన్నప్పటి  స్నేహితులు, బంధువులూ, పూర్వ విద్యార్ధులూ మా క్షేమం తెలుసు కోవడం కోసం తపన పడ్డారు. నీకు రాస్తున్న ఈ లేఖ ద్వారా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మిగతా సమాజమూ మన  ప్రియ సాహిత్యం గురించి ఏవైనా చెప్పవూ విమలా!

డిల్లీ సదస్సు తర్వాత డిల్లీ నుంచి ఆగ్రా వస్తున్నపుడు బస్సులో మనందరం పాడుకున్న విప్లవ జానపద గేయాలూ ప్రేమపాటలూ…గుర్తున్నాయా? గొంతెత్తి పాడటం నాకు ఎపుడూ సిగ్గుగా ఉండేది. ఆ రోజు  ఏదో  కొత్త శక్తి వచ్చినట్లే నీతో గొంతు కలిపి పాడాను. బహుసా నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు.

సాహిత్యంలో నీ రెండవ రాకడ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను… ఈ విషయమై నిన్ను  ప్రత్యేకంగా మూవ్ చేసిన అంశాలు ఏవన్నా ఉన్నాయా విమలా? ఎందుకంటే ఇపుడు కథలూ కవిత్వమూ రెండింటి మీదా సమాన మైన ప్రేమతో కొత్త ఉత్సాహంతో రాస్తున్నావనిపిస్తోంది.

నీ నుంచి రాబోయే ఉత్తరం కోసం నెల రోజులు ఎదురు చూడాలి. ఎదురు చూపులు మనం కోరుకున్నవే కనుక ముద్దుగానే ఉంటాయి. ఉండనా మరి?

మల్లీశ్వరి.

 

 malleswari

malleswari (1)

malleswari (2)

విశేఖర్ గారూ…

విశేఖర్ గారూ,
 
‘ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతుల్లో చనిపోయింది ‘అన్న మీ పోస్ట్ మీద వచ్చిన వ్యాఖ్యల్లో మల్లి అన్న పేరు మీద వచ్చిన వ్యాఖ్య నేను రాసింది కాదు.కానీ హారంలో చూస్తే మల్లి పేరుతో నేను రాసే  నా వ్యాఖ్యల లిస్టు లో అది చేరిపోయింది.ఇదెలా సంభవమో నాకు అర్ధం కాలేదు.
 
ఆ వ్యాఖ్య.
 
”రాజు గారు, ఇంత చరిత్ర చదివారు కదా, ప్రపంచం లోని సంపద సృష్ట్టిలో స్రీల కాంట్రిబ్యుషన్ ఎమీటీ? ఇంకొక మాట మీరు అన్ని వర్గాల మహిళలను ఒకే గాటన కట్టేసి మాట్లాడితే దానికి అర్థం లేదు. నీత అంబాని కూడా మహిళనే ఆమే తో పొలం పనులు చేసి కొనే మహిళల తో పోల్చి, ఇద్దరు స్రీ లే కదా అని వాదన చేస్తే అది ఒట్టి వాదనగా మిగిలిపోతుంది. వాస్తవానికి వారి ద్దరి మధ్య నక్కకు నాగలోకనికి ఉన్న తేడా ఉంట్టుది.”
 
అట్లాగే నేను చేయని  ఇంకొక వ్యాఖ్య కూడా వేరే బ్లాగ్ లోకి వెళ్ళింది.
మనం చేయని వ్యాఖ్యలు మన  వ్యాఖ్యల లిస్టు లో చేరడం అన్నది సాంకేతిక సమస్యల వల్ల జరుగుతుందా?లేదా ఎవరన్నా మిస్ యూజ్ చేసే ఆస్కారం ఉందో తెలీడం లేదు.
మీ బ్లాగ్ లో వ్యాఖ్య పెట్టే విధానం చాలా కష్టంగా ఉంది.ప్రయత్నించినా కుదరలేదు..మీ మెయిల్ ఐడి తెలీక పోస్ట్ వేయాల్సి వచ్చింది.
ఎనే వే …మీ పోస్ట్, దాని మీద చర్చ బాగా నడిచింది.అభినందనలు. 

అత్యుత్తమ ప్రేమలేఖ

ప్రియుడికి ప్రియురాలు  ఇలా ఒక  ప్రేమలేఖ రాసింది….

“నీ మూలంగా కలిగిన
చాలా బాధ
చాలా కోపం
చాలా భయం కలిసి నన్ను రెండు గంటల సేపు నీకు పది పేజీల  ఉత్తరం రాయించాయి….
కానీ…
నీ మూలంగా కలిగిన
ఒక్క ప్రేమ మాత్రం ఆ ఉత్తరాన్ని క్షణంలో చింపించేసింది.
ఇన్నాళ్ళలో నేను నీకు రాయగలిగిన అత్యుత్తమ  ప్రేమలేఖ ఇదే….”

విష్ణుప్రియకో ప్రేమలేఖ.

విష్ణూ,
బావున్నావా?
చాలా రోజులైంది కదా మనం ఉత్తరాలు రాసుకుని…నిన్న ఒక పుస్తకం చదివాక నాకూ ఉత్తరం రాయాలనిపించింది…ఎవరికి రాయాలి?…ఇదొక పెద్ద ప్రశ్న.ఒకప్పటిలా ఇపుడు ఉత్తరం అత్యవసరం కాదు కదా….కాలాన్నీ,హృదయాన్నీ,ఖర్చు పెట్టి చేసే విలువైన వ్యక్తీకరణ కదా…నీ చెంత చేరిన ఉత్తరాన్ని చూసీ చూడనట్టు ఓరకంటితో చూస్తే ఊరుకుంటుందా?అలవోకగా చదివి విసిరేస్తే ఒప్పుకుంటుందా?
 
నా ఆలోచనల్ని,అనుభూతుల్ని,సంతోష దుఃఖాల్నీ…అంతెందుకు ….నా హృదయాన్నే తన రెక్కలకు కట్టుకుని వచ్చి నీ ఒళ్లో వాలే గువ్వపిట్ట కదా ఉత్తరం!!….ఆ గువ్వని లాలిస్తావనీ,ముద్దు చేస్తావనీ,అది మోసుకొచ్చిన హృదయాన్ని హత్తుకుని అక్కడ పుట్టిన ప్రేమని మళ్ళీ నాకు పంపుతావనేగా నీకు  ఉత్తరం రాయడం…..
 
‘ఆ పిల్ల పేరు తలిస్తే చాలు…నీ మొహంలో వెయ్యి మతాబాల వెలుగు కనిపిస్తుంది’ అంటాడు చందు….’వెయ్యి మతాబాలెందుకు ఒక్క నిండు చందురుడి వెన్నెల విరగ కాస్తే చాలదా?’ అంటాను నేను….
 
ఆ పిల్లవి నువ్వే….
 
నువ్వంటే… నీ ఆకర్షణ అంటే….మన తొలి పరిచయమే….ఆ రోజు తిరుపతిలో అంత గొప్ప గొప్ప మర్యాదస్తులైన రచయితల మధ్యలోకి అమీర్ లాగా  దూసుకొచ్చి  నన్ను రాజేశ్వరిని చేసావు కదా!!! నీ స్కూటీయే మనకి రెక్కల గుర్రమైంది.మనిద్దరినీ మోసుకు పోయి ఎయిర్ బైపాస్ రోడ్డులోని స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మెట్ల మీద దింపింది…అపుడే కదా ఆ మెట్లని మైదానంలా మలిచి…అరగంటని  సెకండ్లతో సహా కొలిచి….మన మధ్య ఉన్న అపరిచయాన్ని తరిమి తరిమి కొట్టాం…..
 
మనం రాసుకున్న తొలి ఉత్తరాలు గుర్తున్నాయా?అందులో మనం రచించిన పధకాలు గుర్తున్నాయా? తిరుపతి నుంచి నువ్వూ,విశాఖ నుంచి నేనూ బయల్దేరి మనకెవ్వరూ తెలీని విజయవాడ  వీధుల్లో చెట్టపట్టాల్ వేసుకుని ఓ రోజంతటినీ బతికించాలనుకోవడం గుర్తుందా? సంవత్సరానికి రెండుమూడు సార్లు వేదిక మీటింగుల్లో కలిసినపుడు అటు బాధ్యత ఇటు స్నేహం మధ్య పరుగులు తీస్తూ కోర కోర చూపుల్ని, దోర దోర నవ్వులతో విసిరి కొట్టడం గుర్తొస్తోందా?
 
ఫోన్ చేసినపుడల్లా ‘ఎట్లున్నవ్ మల్లీ?’ అంటావు మృదువుగా….
 
ఎలా ఉంటాం?? నువ్వైనా,నేనైనా,అసలెవరమైనా ఎలా ఉంటాం?…..
 
చెప్పాపెట్టాకుండా ఊరెళ్ళిపోయిన అమ్మ కోసం బెంగపడే అయిదారేళ్ళ పసిపిల్లల్లా ఉంటాం….
ఒక చేత్తో సునామీని, ఇంకోచేత్తో  భూకంపాన్నీ  పట్టుకుని కదం తొక్కే మా ఉత్తరాంధ్ర మహిళల్లా ఉంటాం….
పొగరెక్కి చుక్కల్ని కాళ్ళతో తన్నబోయి పట్టుతప్పి చంద్రవంక ఊయల నుంచి జారి పడిన నిస్సహాయుల్లా ఉంటాం….
పువ్వుల్నీ,పిల్లల్నీ,వెన్నెలనీ,వేకువనీ…చాటుగా తెంపి కలలసంచుల్లో దాచుకునే అమాయకపు దొంగల్లా ఉంటాం….
 
కదా….
 
ఇన్నింటి మధ్యా…నా కోసం నువ్వులా, నీ కోసం నేనులా ఉండి ఎన్నాళ్ళయిందో కదా….
అందుకే…నువ్వూ,నేనూ కొంచెం కొంచెం కాలవిత్తుల్ని పొదుపు చేద్దాం…అవకాశాల వానలు కురవగానే నాటుదాం….
మార్చ్ 29 నాటికి  చిన్న ఆశల మొలకైనా రాదా…మనిద్దరం దాని నీడన కూచుని వూసులాడుకోడానికి…..
 
ప్రేమతో…..
నీ 
మల్లి. 
 
( విదేహ
 ప్రేమలేఖలు …అన్న పుస్తకం చదివాక ). 

కల్పనా …..ఏక్ పల్…

  ప్రియమైన కల్పనా!
 
ఎలా ఉన్నావు?మాటల్లో రాతల్లో తప్ప మనిద్దరం ఎపుడూ కలుసుకోక పోయినా అనకాపల్లికీ అమెరికాకీ ఉన్నంత దూరం మాత్రం మన మధ్య లేదనుకుంటున్నాను. నువ్వు రాసిన ఏక్ పల్ కధని నీ బ్లాగ్ లో చదివాను.
 
సాహిత్యం అనగానే ఎకోలెక్స్ వీరుల్లా కత్తి చేత పట్టి ఖండ ఖండాలుగా ఛేదించే  మా ఉత్తరాంధ్ర మౌఖిక విమర్శకులు నీ కధ చదవగానే  గుర్తొచ్చారు. ఒక్క క్షణం నేనూ ఉబలాటపడ్డాను.
 
కానీ నువ్వు మృదువుగా, హాయిగా , ఇంచగ్గా  ప్రేమ కధ కదా రాసావు ……..కత్తులకీ ప్రేమలకీ పొసగదులే….ప్రేమని ప్రేమతోనే కదా జయించాలి?అందుకే కధ చదవగానే నాకు అన్పించిన నాలుగు మాటలు ప్రేమగా చెపుతా.
 
ఒక స్వేచ్చాయుత  మానవ సంబంధం గురించి ధైర్యంగా కధ రాసినందుకు ముందుగా నీకు అభినందనలు.
 
స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధంలోని స్వేఛ్చ రాహిత్యాన్ని గుర్తించి కూడా ‘ఏక్ పల్’ కే ఎందుకు విలువ ఇచ్చావు కల్పనా? ఏ మానవ సంబంధం లోనైనా ప్రేమ మౌలికమా? స్వేఛ్చ మౌలికమా? వర్తమానంలో ఆ ఒక్క క్షణం ప్రాధాన్యత దానిదే…కానీ ప్రతి క్షణానికీ ఉండే పర్యవసానాన్ని కూడా మనిషి ఉహిస్తాడు. దానికి అనుగుణంగానే భవిష్యత్తుని నిర్మించుకుంటాడు.
 
నిజమే ప్రేమ ఒక సునామీ…. చెప్పకుండానే ముంచెత్తేస్తుంది. కానీ  విచక్షణ అనేది సునామీ హెచ్చరిక కేంద్రం అనుకోకూడదా?  కనీసం మునిగి పోకుండా జాగ్రత్త పడతాం. 
 
‘ఏక్ పల్’ జీవితం ఐతే మాట్లాడక పోదును. కానీ అది కధ కదా………అనుభూతుల  గొడవ కాదు కదా……మనమేం చెపుతున్నామో   అందరూ వింటున్నారు కదా…….ప్రేమ సంబంధాల చుట్టూ ఉండే ఎన్నో డైమన్షన్స్ ని,   వాటి సంఘర్షణలని ఏం కానట్టు తోసేసి ‘ఏక్ పల్’ కే ప్రాధాన్యత నిచ్చావన్న  కినుక తో స్పందించాను తప్ప ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఏ సంబంధమైనా అది వారి సమస్య తప్ప మనకేలా? ఎవరికైనా ఏలా?
 
తన్హాయి మొదలు పెట్టినట్లున్నావు. లోటు  పూరిస్తావని  ఆశిస్తున్నాను . 
                                                                                           ప్రేమతో…….
                                                                                              మల్లీశ్వరి.

ఒక స్నేహితురాలి పశ్చాత్తాపం

ప్రియమైన రమణీ……….. ఎలా వున్నావు? నాతో మాటలకి పది సార్లు ప్రయత్నించి విఫలమయి మూగవోయిన నిన్ను, ఇప్పుడిట్లా అర్ధరాత్రి పలకరించాలనిపించడం నాకే వింతగా వుంది. మరేం లేదు ఇంకా ఏ మూలో మిగిలున్న హృదయంతో వంద మిస్డ్ కాల్స్ మధ్య మిస్ చేసుకున్న నిన్నూ, బహుశా కోపంతోనో బాధతోనో దూరంగా ఉండిపోయిన నిన్నూ క్షమించమని అడగాలని వుంది . ఇంకా నీ చేయి పట్టుకుని మన బాల్యంలోకి పారిపోవాలని వుంది. నాపై నువ్వు నీపై నేను అల్లుకున్న కవితలు గుర్తు తెచ్చుకోవాలని వుంది “నీ పద మంజీర మృదుసవ్వడి నా చెవి సోకగ పులకించే నా మది …..”అంటూ తొమ్మిదో తరగతిలో నేను నీ గురించి చెప్పిన కవితకు మొన్నమొన్నటి వరకూ నవ్వుతూనే వున్నావుగా ….. ఆ నవ్వుల్ని ఓ సారి గుర్తు తెచ్చుకో……. లెక్కల క్లాసులో బిక్కమొహం వేసే నన్ను ఓదారుస్తూ , “కాంపోజిట్ లెక్కలు కంపు , జనరల్ లెక్కలు జిడ్డు” అంటూ నాకు నచ్చని ప్రతీది నీకు నచ్చకుండా చేసుకోడానికి హృదయానికి ఎంత తర్ఫీదుని ఇచ్చేదానివో కదా! ఆ ఔదార్యాన్నిఓ సారి స్పృశించు……. పల్లెర్లమూడి హైస్కూల్ లో “చలన చిత్రముల వలన లాభమా?నష్టమా?”డిబేట్ కి స్టేజి మీదకి నే వెళుతుంటే యుద్దరంగానికి పంపినంత ఉత్తేజాన్ని ఒంపావు కదా ఆ స్నేహాన్ని మళ్ళీ పరిమళించు ఇపుడు నేనూ నీతో వస్తా ఇద్దరం కలిసి సోషల్ క్లాసులో దేవదానం మాస్టారి ‘జపాన్’ఉచ్చారణ చుట్టూ అల్లిన మాటలమూటల్ని విప్పుదాం. కాసిన్ని అల్లరి నవ్వుల్ని ఏరుకుందాం…….. “ఉసిరి చెట్టు కింద పసిరిక పాము కరవకనేమి?కారణమేమి?” అంటూ పాడుతూ పెట్టిన పరుగులు తల్చుకుందాం. డ్రిల్ మాస్టారి అంతర్యాన్ని పరిశోదిద్దాం. కంబైండ్ స్టడీ లో పుస్తకాలను విసిరికొట్టి దెయ్యాల గురించి చెప్పుకున్న గుసగుసల్ని మళ్ళీ విందాం. ఈ సారి భయాన్ని జయిద్దాం ఈ సారి నిజంగానే భయాల్ని జయిద్దాం బాల్య ద్వీపం లోకి చేసే ఈ ప్రయాణం లో నాలో నేను లేనేమోనన్న భయాన్ని నువ్వూ నీలో నేను మిగలలేదేమోనన్నభయాన్ని నేనూ జయిద్దాం మళ్ళీ మళ్ళీ స్నేహంలో పడుతూనే వుందాం