భాండాగారం

సాహసగత్తెల సైకిల్ పోటీ

No automatic alt text available.

 

నవంబర్ నెల సప్తవర్ణలేఖ

20/10/16,
విశాఖపట్నం.

ప్రియమైన విమలా,
చినుకు ద్వారా నీ ఉత్తరం అందింది. భిన్నంగా వైవిధ్యంగా సాగిన నీ లేఖ చాలా ఆలోచనలను ఇచ్చింది. స్త్రీలు తమ ధిక్కారాన్ని ప్రకటించడానికి, తమని తాము స్థిరపరుచుకోవడానికి ఎంచుకునే పద్ధతులను చూసినపుడు వాళ్ళెంత సాహసులో కదా అని గర్వంగా ఉంటుంది. నేననుకుంటానూ స్త్రీలు ఎంతఎదిగినా, ఎదిగినచోటల్లా వాళ్ళని బలవంతానా ఒదిగించే వివక్షలు కాచుకుని ఉంటాయి అని. అంతోఇంతో చదువుకుని, తోచిన అనుభవాలు రాసుకుంటూ, సమూహాన్ని కలవరిస్తూ ఉండే నా మీద కూడా ఈ వివక్షలు పోవు. గొప్ప కవయిత్రి, కథకురాలు, ఉద్యమకారిణి అయిన నీ మీదా పోవు. మరెంత ఉన్నతస్థాయికి ఎదిగినవారి మీదైనా రూపం మార్చుకున్న భేదభావాలు వేధిస్తూనే ఉంటాయి.

మనమేం చేస్తాం మరి, సంస్కారం గల చోట మృదువుగానూ, తోలుమందపు లోకం మీద కాస్త గట్టిగానూ అరిచి చెప్పక తప్పదు కదా! మనకి తోచిన ధిక్కార పతాక ఎగురవేయక తప్పదు కదా! అట్లాంటి స్త్రీలను పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు. అటువంటి స్త్రీలలో కూడా ఏ గుర్తింపూ లేని ఇద్దరు అతిమామూలు ఆడపిల్లల పౌరుషాన్ని, అది వాళ్ళ అంతరంగాన్ని వెలిగించిన వైనాన్ని నీతో పంచుకుంటాను.

వివినమూర్తిగారు తరుచూ వాళ్ళమ్మాయి చెప్పిన ఒకమాటని కోట్ చేస్తూ ఉంటారు. ‘స్త్రీల సాధికారికత వాహనం నడపడం రావడం వల్లనే పరిపూర్ణమౌతుంది’ అని. చాలా సాధారణంగా కనిపించే ఈ వాక్యం మొత్తం మానవ ప్రగతి మూలాల్లో కీలకమైనదని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎంత నిగూఢమైన అర్థాన్ని పుణికిపుచ్చుకున్నది ఈ వాక్యం! జంతువులను లొంగదీసి మచ్చిక చేసుకుని సంచార జీవితాలను సులువు చేసుకున్న మనిషి ఈ రోజుకీ సంచారజీవే కదా. పొద్దుటినుంచీ రాత్రి ఇంటికి తిరిగివచ్చేవరకూ జనారణ్యంలో సంచరించడానికి సాయపడే వాహనాలని ముందుగా మచ్చిక చేసుకున్నది మగవారే కదా. స్త్రీలు ఇపుడిపుడే పూర్తిస్థాయి పోటీలోకి వచ్చారు. కారైనా, మోపెడ్ అయినా, సైకిలైనా మరే ఇతర వాహనాలనైనా నడిపే నైపుణ్యాన్ని కలిగి ఉండటం ఇప్పటితరం స్త్రీలకి తప్పనిసరి. దానివల్ల మొబిలిటీ పెరుగుతుంది. స్త్రీలకి లోకం విశాలమవుతుంది. ఎంతదూరమైనా వెళ్లి పని చేసుకురాగలిగిన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వాహనం నడిపే స్త్రీల నైపుణ్యం మీద చులకన భావం ఉంటుంది మగవారికి. ముఖ్యంగా పెద్దపెద్ద లారీలు, బస్సులు నడిపేవారికి మరీ ఎక్కువ. ధనమదం, అధికారఆధిపత్యం గలవారి పిల్లలు నడిపే వాహనాలు కూడా ఇటువంటి వేధింపులకి పాల్పడతాయి. మాటూరి లావణ్య హత్య కేసు ఇందుకు ఉండాహరణ. ఆడపిల్లలు మోపెడ్స్ మీద వెళ్తుంటే బాగా దగ్గరగావచ్చి కయ్యిన హార్న్ కొట్టి దడిపించడం, ఆలోస్మ్ట్ వారి వాహనాలను రాసుకుంటూ వెళ్ళడం, సమాంతరంగా నడుపుతూ కన్ఫ్యూజ్ చెయ్యడం ఎన్నోసందర్భాల్లో చూసాను. అలాంటివి చూసినపుడు చెయ్యగూడని పని చేస్తున్నవారిని వేధించినట్లుగా ఉంటుంది.
స్త్రీలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో పనిచేయడం చట్టబద్ధమైనది కాబట్టి మగవాళ్ళ కసి, అసహనం వేరే రూపాల్లో వ్యక్తం అవుతుంది. పల్లెలనుంచి నగరాల వరకూ, సైకిల్ నుంచి విమానాలవరకూ వాహనచోదకులైన మగవాళ్ళకి ఉన్న రక్షణ, ప్రోత్సాహం ఆడవాళ్ళకి ఉండదు. ఈ వాహనాల విషయమై నా చిన్నప్పటి ఒక సంఘటన చెప్తాను విమలా!

ఎనిమిదోతరగతి నుంచి పదోతరగతి వరకూ కృష్ణా జిల్లా పల్లెర్లమూడి జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదివాను. మా వూరు కొక్కిరపాడు, పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటుంది. మా వూరి నుంచి బడికి రెండుమైళ్ళ దూరం. ఉన్న రెండు సిటీబస్సులూ ఏ సమయానికి వచ్చేవో మాకు తెలీదు. అందుకే పొద్దున్న అన్నాలు తినేసి కారేజీలు కట్టుకుని బైలుదేరే వాళ్ళం. పుస్తకాలని పసిపాపల్లా పట్టుకుని చలోబడికి అనుకుంటూ ఝామ్మని కాలు సాగించేవాళ్ళం. ఈ నడక వల్ల అందరం కబుర్లు చెప్పుకోవడం, ఆటలాడుకుంటూ వెళ్ళడం బానే ఉండేది.

నేను ఎనిమిదోతరగతిలో ఉన్నపుడు నా జూనియర్ శాంతకుమారి ఒకమ్మాయి ఉండేది. తనపుడు ఏడోతరగతి చదువుతోంది. మాలపల్లిలో ఉండే డాక్టర్ భద్రయ్యగారి అమ్మాయి. మెరిసే చిక్కటి నలుపు, బుల్లిబుల్లి ఉంగరాలు తిరిగిన జుట్టు, బొద్దుగా, ఇంతెత్తుగా ఉండేది. చూపులు నిలుపుకోగలిన పిల్ల. తనుకొన్నాళ్ళకి మాతోరావడం మానేసి సైకిల్ నేర్చుకుని దానిమీద రావడం మొదలుపెట్టింది. మేము ఇంకా మైలుదూరంలో ఊసురోమనుకుంటూ పడీపడీ నడుస్తుంటే తను రయ్యిన సైకిల్మీద మమ్మల్ని దాటుకుంటూ వెళ్తూ ‘లగెత్తండి తొరగా’ అనేది. అపుడు ఇద్దరు ముగ్గురం నిజంగానే తన సైకిల్ వెనకాల పరిగెత్తి మా సంచులూ కారేజీలు తగించేసేవాళ్ళం.

తనని చూసాక ఎక్కువరోజులేం తాత్సారం చెయ్యలేదు నా మనసు. వెంటనే సైకిల్ మీద కోరిక పుట్టించేసుకుంది. అప్పటికి మా నాన్నకి ఒక సైకిల్ ఉండేది. హీరో సైకిల్. ఆయన పొలానికి వేసుకువెళ్ళేవారు, అడ్డరోడ్డు దగ్గర సైకిల్ పెట్టి లైనుబస్సులో ఏలూరు వెళ్ళివచ్చేవారు. నేను సైకిల్ నేర్చుకుంటాను అనగానే మా నాన్నగారు ఏమీ ఆలోచించలేదు. వెంటనే చాలా సంబరపడి నేర్పించారు.
ఇప్పటిలాగా అప్పట్లో అమ్మాయిలకు ప్రత్యేకమైన సైకిళ్ళు ఉండేవి కాదు. సీట్ కి హాండిల్ కి అనుసంధానంగా ఒక రాడ్ ఉండేది. సైకిల్ తోసుకుని ముందుకు వెళ్లి ఒక్కఊపు మీద రెండోవైపు కాలు వేయాలి. అది మగపిల్లలంత సులువుగా ఆడపిల్లలు వెయ్యలేకపోయేవారు. మగపిల్లలు సీటు వెనక నుంచి కాలు వేసేవారు. గుర్రాన్ని అధిరోహించినట్లు. ఆడపిల్లలకి అలా సాధ్యపడేది కాదు. ఎందుకంటే అప్పటి వస్త్రధారణ చాలా సాంప్రదాయకం. కట్టుకున్న పరికిణి చీలమండ దాటి పైకి పోకుండా సైకిల్ నడపడం అంతటి పరీక్ష మరొకటి ఉండదు.

చాలా ఇబ్బంది అయినా పట్టుబట్టి నేర్చుకున్నాను. ఒకసారి కూడా కిందబడలేదు. దెబ్బలు తగిలించుకోలేదు. తర్వాత నుంచి నేను శాంతకుమారి కలిసి సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. మేం సైకిల్ నడుపుతుంటే కొందరు అబ్బాయిలకి వెక్కిరింతగా ఉండేది. ఏవో మాటలంటూ ఉండేవారు. మేం వెళ్ళే తోవలో పొలాల మధ్యలో పనిచేసే పదేళ్ళపిల్లలు ఇద్దరు చిన్నచిన్న రాళ్ళు తీసి మా మీదకి విసిరేవారు. ఆ చోటు వచ్చిందంటే రోజూ గుబులే. అవి తప్పించుకోవడానికి వేగంగా నడుపుతూ వెళ్ళేవాళ్ళం.

మా ఊరి ఆడపిల్లలు మహా పౌరుషమంతులు. మగపిల్లలతో పోటాపోటీగా ఉండటమే కాకుండా అన్నింటిలోనూ ముందంజలో ఉండటానికి సర్వశక్తులూ ఒడ్డేవాళ్ళం. మా వూరి ఆడపిల్లలకి మిగతా ఊర్ల అబ్బాయిలకి మధ్య ఆడామగా సమానత్వంమీద చాలాతగవులు నడిచేవి. ఆ తగవులకి పరిష్కారాలు ఏంటంటే ఏవో పోటీలు పెట్టుకుని గెలుపోటములు తేల్చుకునేవాళ్ళం. ఓ రోజు అట్లాంటి తగవు ఒకటి వచ్చింది. అదేంటంటే ఎవరు బాగా సైకిల్ నడుపుతారు అన్నది.
ఆడపిల్లలు నడపగలరా? మగపిల్లలా?

ఎందుకైనా మంచిదని, ఇద్దరూ బాగానడుపుతారు అన్నాము మధ్యేమార్గంగా. మగపిల్లలు ఒప్పుకోలేదు. పదోతరగతి చదువుతున్న ఒకబ్బాయిని ముందుకు తోసి, సైకిల్ తోలకంలో వీడిని కొట్టేవాళ్ళు లేరన్నారు. అని ఊరుకోకుండా బస్తీ మే సవాల్ అని కూడా అన్నారు. సవాల్ వరకూ వచ్చాక మా ఊరి అమ్మాయిలు అసలు వెనక్కి తగ్గరు. కానీ మాకంత సీన్ లేదే! సైకిల్ నడిపేదే లింగూ లిటుకూ మంటూ నేనూ శాంత ఇద్దరమే. అపుడు మా ఊరిఅమ్మాయిలంతా నైసుగా, లయకారంగా నా వైపు శాంతవైపు చూసారు.

బరువంతా మా మీద పడిపోయిందని అర్ధం అయింది. ముందుభయం వేసింది. ఇదంతా ఎటుపోయి ఎటు వస్తుందిరా బాబూ అనుకున్నాం. ‘ఓరిదేవుడా! ఈ గండం ఎలా గట్టెక్కాలిరా నాయనా అనుకుని వాహనాధిపతులైన దేవ దేవుళ్ళందరూ మా పక్షానికి వచ్చేయాలని, ఈసారి పూజలపుడు వారికి మంచి మంచి ప్రసాదాలు చేయించి పెడతామని ప్రార్ధించుకున్నాను. తర్వాత ఒప్పుకున్నాం. ఓడితే ఓడతాం కానీ పోటీకి అయితే దిగాం కదా. అక్కడికి అదే సగం విజయం అని నచ్చజెప్పుకున్నాం.

నేను శాంత, ఒక టీమ్. ఇద్దరబ్బాయిలు ఒక టీమ్. మా నలుగురికీ పోటీ. ఇద్దరేసి ఎందుకు ఒకళ్ళు చాలు కదా అని మాకు తర్వాత సందేహం వచ్చింది. అసలువిషయం తర్వాత తెలిసింది. వాళ్ళకెంత వ్యూహం అంటే పొరపాటున ఒకబ్బాయి ఓడిపోతే ఇంకొకబ్బాయి ఉంటాడు కదా! పరువు పోకుండా ముందస్తు జాగ్రత్త అన్నమాట.

పోటీరోజు రానే వచ్చేసింది. అందరం కలిసి కొక్కిరపాడు అడ్డరోడ్డుకి వెళ్ళిపోయాం. ట్రాఫిక్ తక్కువఉండే మిట్టమధ్యాన్నం పోటీ మొదలైంది. నలుగురం సైకిళ్ళ మీద కోళ్ళఫారం వరకూ వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మా నలుగురిలో ఎవరు ముందొస్తే వాళ్ళ టీమ్ గెలిచినట్లు.
పచ్చజెండా ఊపారు.

నేలమీద ఆన్చిన కాలుని పైకి తీసుకుని ఫెడల్ మీద కాలేసి బలంగా తొక్కాం. రెండునిమిషాలు గడిచేసరికి అబ్బాయిలు సీట్లోంచి లేచి హాండిల్ మీద బరువేసి గాల్లోకి లేచిన కోడిపుంజుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేం వెనకబడిపోయాం. వెనకనుంచి మా వాళ్ళు అరుపులు.

అపుడు మేమిద్దరం మొహమొహాలు చూసుకుని పక్కన పక్కనే వెళ్తూ చేతులు చరుచుకుని కళ్ళతోనే ఏం చెయ్యాలో చెప్పేసుకున్నాం. శక్తి అంతా ఉపయోగించి ఫెడల్ తొక్కుతూ సైకిల్ హాండిల్ మీద చేతులు తీసేసాం. చేతులు బార్లా చాపి హాండిల్ బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోయాం. నీకూ నాకూ పందెం. హాండిల్ పట్టుకోకుండా తిరిగి రావాలి అంది శాంతకుమారి. ఓకే చెప్పేసాను. వేగం కొంచెం తగ్గినా హాండిల్ పట్టుకుని అదుపు చేయాల్సి వస్తుంది కాబట్టి వేగం అసలు తగ్గకూడదు.

టైటానిక్ సినిమాలో నాయికానాయకుల్లాగా చేతులు బార్లా జాపుకుని కోళ్ళఫారం వరకూ వెళ్ళిపోయాం. మలుపు తిరిగేపుడు మాత్రం ఒకసారి హాండిల్ బాలెన్స్ చేసుకుని, అక్కడ మగపిల్లలిద్దరినీ దాటేసాం. వాళ్ళు సీట్లోంచి లేచి ఒగర్చుకుంటూ చెమటలుకక్కుతూ వస్తుంటే మేమిద్దరం రెక్కలు జాయిగా చాపి ఎగిరే కొంగల్లాగా ఉల్లాసంగా తేలుకుంటూ ముందుకు వచ్చేసాం.

శాంతకుమారి నా కన్నా ముందు ఉంది. ఎంత ప్రయత్నించీ నేను తనని దాటలేకపోయాను. మేమిద్దరం ముందు రావడం గమనించిన మా ఊరమ్మాయిలు ఉత్సాహం పట్టలేక అరుస్తున్నారు. ఒక్కనిమిషం గడిచి ఉంటే శాంతకుమారి గెలిచేది. కానీ అలా జరగలేదు. తను బాగా స్లో అయ్యి నేను తనని అందుకునే వరకూ ఆగింది. ఇద్దరం పక్కపక్కనే వెళ్తుండగా,

“ఏం ఆగిపోయావ్?” అడిగాను.

“నేను గెలవడం ఏంటి జాజీ?! మనం గెలవాలి గానీ. ఇద్దరం ఒకేసారి వెళ్దాం. తొరగా పా… వాళ్ళొచ్చేత్తన్నారు.” అంటూ చెయ్యి చాపింది.
మిటుక్కుమంది మనసు. తన చెయ్యి అందుకోకుండా ఇంకా వేగం తగ్గించి సైకిల్ దిగేసి తనని ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను. శాంతకుమారి కూడా సైకిల్ ఆపేసి ఆందోళనగా వెనక్కి చూస్తూ అయోమయంగా నా వంక చూసింది.

పడతా లేస్తా వచ్చిన అబ్బాయిలు మేమిద్దరం రోడ్డు మీద పంచాయితీ పెట్టడం చూసి సైకిళ్ళు ఆపేసి,

“ఏం ఆగిపోయారు?” అన్నారు.

“మేం గెలవడం ఏంటి మనం గెలవాలి గాని. పాండి అందరం ఒకేసారి వెళ్దాం.” అన్నాను.

తనని అందుకున్న నన్ను చూసి శాంతకుమారి సంతోషంగా నవ్వింది.

ఇది విమలా, నీ లేఖ గుర్తు తెచ్చిన జ్ఞాపకం. మళ్ళీ లేఖలో కలుద్దాం.
ఉంటానిక
జాజి

కర్రోళ్ళ కోడలి కత

17/08/16,
విశాఖపట్నం.

ప్రియమైన అమ్మాయీ
కొండకోనల అంచుల మీద నడిచి వచ్చిన మనసుకి ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో తెలియని తత్తరపాటుగా ఉంది. చిత్రకూటమి యాత్ర నుంచి వచ్చాక నిజానికి రాయడానికి బోల్డన్ని విశేషాలు ఉంటాయి కదా. కానీ మనసు కిక్కిరిసిపోయి ఉంది. ఆరంభ సంశయం గురించి తెలుసు కదా! సంశయం విషయానికి సంబంధించి కాదు. అది ఎలా మొదలుపెట్టాలో తెలియనితనం నుంచి. ఉక్కిరిబిక్కిరి చేసే అంశాలకి ఒక కొస తగిలించలేని అసహాయత నుంచి. తీర్థ్ ఘర్ జలపాతాల హోరుకి మనసు ముందుకు తోస్తుంటే అక్షరం భయపడి వెనక్కి లాగుతోంది. ఇటువంటి భయసంశయాల మధ్య కనీసం ఉత్తరంగానైనా పలకలేని స్థబ్దతలో కూరుకుపోయి ఉన్నాను.
చిత్రకూట్ జలపాతపు నీటిపువ్వుల పాయలన్ని అలజడులు నిద్ర పోనీయడం లేదు. బాగా ధ్వనించే అనేక విషయాల మధ్య సన్నగా చిన్నవిషయం నీళ్ళలో చేపపిల్లలా మెల్లగా కదలాడుతోంది. అది నీతో ఈ ఉత్తరంలో పంచుకోవాలని అనుకున్నాను. ఆ విషయం నాకు భయమో బాధో మరే తామస భావమో కల్పించలేదు కానీ ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ చుట్టుముట్టాయి. చందు నాకు పరిచయం అయి పాతికేళ్ళు. మేమిద్దరం పెళ్లి చేసుకుని 20 ఏళ్ళు. మాది ప్రేమ వివాహం, కులాంతరం. కులాంతర వివాహం కావడం వల్ల మేము బాధ పడ్డామా, లోకం మరీ గేలి చేసిందా అని తిరిగి చూసుకుంటే బోల్డన్ని బాధల్ని గడిచివస్తున్న జీవితం తూకం వేస్తుంది. ఆ!.. అవో పెద్ద బాధలా! అని ఇపుడు అనిపిస్తుంది. రెండిళ్ళలోనివారు, వారిని ఆవరించుకుని ఉన్న బంధుగణం, స్నేహితులూ తప్ప మా గురించి లోకానికేమి పని?
ఇపుడు ఈ 2016 లో, మా కులాంతర వివాహం, కుటుంబంలోని ఒక ధార్మిక క్రతువుకి అడ్డం పడటం నా పెదాలపై సన్నటి నవ్వుని పూయించింది. అందులో పెద్దగా విషాదం లేదు కానీ ఇంకా ఎప్పటికి మారేను లోకం అన్న విసుగు ఉన్నది. చందు వాళ్ళ చిన్నాన్న గారి అబ్బాయి పెళ్లి నిశ్చయం అయింది. తనకి తండ్రి లేడు. తల్లితండ్రుల స్థానంలో అన్నావదినలైన నేను చందు పీటల మీద కూచోవాలి. ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటానా లేదా అన్నది వేరే విషయం. కానీ వేరే కులపు స్త్రీని వివాహం చేసుకున్నందున చందు దీనికి అనర్హుడు అని ఒక చుట్టాలాయన తత్వ గ్రంథాలు తిరగేసి తేల్చి చెప్పడం ఆయన బంధువులందరిలో అగ్రగణ్య స్థానంలో ఉండడం వల్ల దాని మీద చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంలో కులమూ పిత్రుస్వామ్యమూ కట్టగట్టుకుని ఉండటం, లోకం చాలా ముందుకు వెళ్ళిపోయిందని నేను అంతో ఇంతో నమ్ముతున్న దశలో ఇటువంటి ప్రాధమిక స్థాయి చర్చ జరగడం ఆశ్చర్యపరిచింది విమలా!.
మరి ఇన్నేళ్ళుగా నేనూ చందూ కులాంతర వివాహం వల్ల వచ్చిన ఒత్తిళ్లను ఎలా అధిగమించాం అన్న ఊహతో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను విమలా! నాకు వెంటనే కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. యధాతధంగా కాదు గానీ సారాంశంగా చెపుతాను…‘మనుషుల్లో మానసిక విలువల పెరుగుదల వల్ల చాలా సమస్యలు పరిష్కరింపబడతాయనీ అపుడు చట్టం చేసే పనిని సంస్కారమే చేస్తుందనీ’ అంటాడు కొకు. అటువంటి సంస్కారవంతులైన పెద్దవారు మా కుటుంబాలలో ఉండటం వల్ల మేము త్వరగా కోలుకోగలిగాం అనిపిస్తుంది.
అతి మామూలుమనుషులే… ఛాదస్తాలూ సాంప్రదాయాలూ బలంగా నమ్మే మనుషులే మా రెండు కుటుంబాల వాళ్ళూ. మా పెళ్లిరూపంలో అకస్మాత్తుగా వచ్చిపడిన ఉపద్రవాన్ని వాళ్ళు సంస్కారవంతంగా డీల్ చేసారు కనుకనే గత 20 ఏళ్లుగా మా ఎదురుగా వాళ్ళెవరూ ఏ కులాన్నీ ఓన్ చేసుకుని మాట్లాడటం నేను వినలేదు.
విమలా నీకు తెలుసా నేను చందూ ఇంట్లో చెప్పాపెట్టాకుండా ఇంచగ్గా కృష్ణాబాయి గారు, వేణుగోపాలరావు గారు, మా అత్తలూరి మాస్టారు, మిగతా ఫ్రెండ్స్ సాయంతో గుళ్ళో పెళ్ళిలాంటి తంతు అయిందనిపించాం. ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసులో ఏవో సంతకాలు పెట్టినట్లు గుర్తు. కానీ ఆ కాయితాలు కూడా తీసుకోలేదు. ఇళ్ళ నుంచి బహిష్కారాలు ఉంటాయని ఊహించి పెళ్ళికి ముందే విశాఖ లోని ప్రహ్లాదపురంలో మూడుగదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాం. అద్దె నాలుగువందలు. అపుడు నా జీతం 1300. చందుకి ఇంకా ఉద్యోగం లేదు అప్పటికి. పెళ్ళయితే అయింది గానీ ఆ వార్త ఇరుకుటుంబాలకీ ఎలా చేరవేయాలా ఆ షాక్ ని వాళ్ళెలా తట్టుకుంటారా అన్నది అన్నింటి కన్నా పెద్ద టాస్క్ అయింది.
చివరికి ఏదోలా వార్తలు వెళ్ళాయి. తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారన్న పేరు మా నాన్నగారిది. మా నాయనమ్మా తాతయ్యలు చనిపోయినపుడు కూడా చలించని ఆయన, మా పెళ్లివార్త వినగానే మొహం మీద టవల్ కప్పుకుని భోరున ఏడ్చి ‘నాన్నకూతురు ఇంత మోసం చేసిందా!’ అనేసి వీధిగుమ్మంలోకి వెళ్లిపోయారట. ఇక ఇటువైపు వస్తే, కబురు వినగానే ‘ఆ పిల్ల ఎవరో నీకు ఏదో మందు పెట్టేసి ఉంటుందిరా’ అనేసి మా అత్తయ్య ఘొల్లుమన్నారట. మొత్తానికి కాస్త స్థిమితంగా నిలబడింది మాత్రం మా అమ్మా, మా మావయ్య. మా అమ్మయితే మరీను. ఎంత వివరంగా వివేచనతో ప్రవర్తించిందో ఇప్పటికీ గుర్తే.
ద్వారకానగర్ లోని హోటల్ అనంత్ లోని రెస్టారెంట్ లో మొదటిసారి మావయ్యని కలిసాను. చందు కూడా ఉన్నాడు. నాకు భయంగానూ కుతూహలంగానూ ఉంది. ఆయన ఏవన్నా అన్నా పట్టించుకోవద్దని చందు చెప్పి ఉన్నాడు. ఆయనే కాదు ఇరువైపు పెద్దవాళ్ళూ ఎన్ని అన్నా మనమే సర్దుకుపోదాం అని ఒట్లు కూడా పెట్టుకుని ఉన్నాం. కనుక నేను బోల్డు తిట్లు కాయడానికి నన్ను నేను సంసిద్ధం చేసుకుని ఉన్నాను. ఆయన పోర్ట్ లో ఏదో ఆఫీసర్ హోదాలో కూడా ఉన్నారు. నేనా ఒక పల్లెటూరిపిల్లని. ఎలాగురా నాయనా ఈ గండం గట్టెక్కేది అనుకుంటూ చందు చెప్పినట్లు పొందిగ్గా చీరె కట్టుకుని బుద్ధిమంతురాలిలాగా వెళ్లాను.
ఆయన్ని చూడగానే నాలో ఉల్లాసం పిల్లకెరటమై పొంగింది. యాభై ఏళ్ళకి చందు ఎలా ఉంటాడో ఆయన అచ్చం అలా ఉన్నారు. సంభ్రమంతో నోరు తెరుచుకుని చూస్తుండిపోయాను. చందు చేయి పట్టుకు లాగాక అపుడు తేరుకుని ఇద్దరం కాళ్ళకి దండం పెట్టాం. నాలుగు కుర్చీల టేబుల్ వద్దకి వచ్చాక చందు నాకెదురుగా ఆయన పక్కన కుర్చీలో కుర్చోబోతే వారించి నా పక్కన కూచోమని సైగ చేసారు. మా ఇద్దరినీ కాసేపు పరిశీలించి చూసి కాసేపు పొడిదగ్గులు దగ్గి గొంతు సవరించుకుని ‘ఇట్లా చెప్పకుండా చేయడం ఏవన్నా బావుందా?’ ఇద్దరినీ ఉద్దేశించి మెల్లని స్వరంతో అన్నారు. ఆ చిన్నమాటకే నాకు చాలా పశ్చాత్తాపం కలిగి కరిగి నీరైపోయాను. ఆ ఒక్కమాట తప్ప రెండు దశాబ్దాలలో మా వివాహానికి సంబంధించి ఒక్క పొల్లు మాట అన్నది లేదు. ఆ రోజే చివర వచ్చేసే ముందు నా చేతులు పట్టుకుని నాలుగు మంచిమాటలు చెప్పారు. ఆ సమయంలో నెయిల్ పాలిష్ తో మిలమిల మెరుస్తూ సూదిగా వాడిగా షేప్ చేసి ఉన్న నా చేతిగోళ్ళను చూసి ‘ఇంత పొడవు పెంచడం అవసరమా?’ అన్నారు. అప్పటికే ఆయన మృదుత్వానికి ఫ్లాటయిపోయి ఉన్న నేను ‘అస్సలు అవసరం లేదు’ అని డిసైడ్ అయిపోయి ఆయన్ని సంతోషపెట్టడమే పరమలక్ష్యంగా ఇంటికి వెళ్ళగానే గోళ్ళు కత్తిరించేసుకున్నాను. రాజకీయ విలువలకి సంబంధించినవి అయితే ఎవరేం చెప్పినా నా అంతట నేను స్థిరంగా నిలబడిపోతాను. అయితే చిన్నచిన్నవిషయాల్లో మాత్రం పెద్దవాళ్ళని సంతోషపెట్టడానికే నేనూ చందూ ప్రయత్నించేవాళ్ళం.
నేను మందు పెట్టి ఉంటానని ఝడుసుకున్న అత్తయ్య మొదటిసారి నేను ఇంటి గుమ్మం ముందు నుంచోగానే రెండుమెట్లు దిగివచ్చి యాపిల్ పళ్ళ వంటి నిగనిగలాడే బుగ్గల్లో విశాలమైన నవ్వులు నింపుకుని నా రెండు చేతులూ పట్టుకుని ‘ఏమమ్మా?’ అంటూ పలకరించి బుగ్గలు ముద్దాడారు. పెద్దయ్యాక అంతటి ప్రేమ ప్రకటనలు మా ఇంట్లో కూడా అలవాటు లేని నేను అపుడే ఆమె మీద మనసు పారేసుకున్నాను. ఇక కాలం గడిచాక మా నాన్నగారు చందుతో తన బాధలు పంచుకునే సాన్నిహిత్యంలోకి వెళ్ళిపోయారు. ఎంతో సమయం, వ్యయం, ఎమోషన్స్, శ్రమ వెచ్చించి మా బంధాలను పునరుద్ధరించుకోగలిగాం. ఇదంతా అవసరమా అని ఎపుడూ అనుకోలేదు. చాలా అవసరం అని బలంగా ఇప్పటికీ నమ్ముతాం.
ఉత్తరాంధ్రలో కాళింగులు స్థానీయముద్ర కలిగిన ప్రత్యేక సామాజికవర్గం. మా పెళ్లి అయ్యేవరకూ చందు కులం నాకు సరిగ్గా తెలీదు. తర్వాత ఆసక్తితో తెలుసుకున్నాను. కులాలకి ఉండే సాంస్కృతిక కోణాల పట్ల ఆసక్తి అది. చందు తమాషాకి ‘మేము అశోకుడంతటివాడినే ఎదిరించాం. కళింగయుద్ధం చేసిన వీరులు మా పూర్వీకులు’ అని గొప్పలు చెప్పేవాడు. తర్వాత చరిత్ర చదివినపుడు చాలాకాలం కిందటి వరకూ కాళింగులు సంచార జాతి అనీ కొండొకచో దారిదోపిడి వారి జీవనవిధానమని తెలిసి ‘ఓరి పిడుగా నువ్వు దారిదోపిడీ దొంగవా?!’ అని చందుని బాగా ఆట పట్టించేదాన్ని. కాళింగులలో కూడా కింతలి, బూరగాని అనే తెగలు ఉంటాయి. చలసాని ప్రసాద్ గారు చందు కనపడగానే కావిలించేసుకుని ‘ఇదుగో శీనూ.. కింతలి అంటే ఏంటో తెలుసా?’ అంటూ ఒక కథ చెప్పేవారు. కళింగ యుద్ధంలో చనిపోయిన వారి తాలూకు యవ్వనవంతులైన భార్యలు తరువాతి కాలంలో ఒంటరిగా జీవించలేక ‘కిం.. తాళి?’ అని విలపించేవారని, వారి పట్ల కరుణతో వివాహం చేసుకుని సోషల్ రిఫార్మ్ కి పునాదులు వేసిన వారు కింతలి కాళింగులు అయ్యారని చెప్పగానే చందు మనోరంజనం పువ్వులా వికసించిపోయేవాడు.
కాళింగ స్త్రీలు సౌందర్యవంతులని పేరు. కందగడ్డ వంటి ఎర్రటి ఎరుపువర్ణం. నున్నని పారదర్శకమైన చర్మ కాంతి కుదిమట్టంగా వత్తయిన తలకట్టుతో ప్రత్యేకంగా ఉంటారు. చందు వాళ్ళ స్వగ్రామం పలాస దగ్గరున్న వరదరాజపురం తరుచుగా వెళ్ళేవాళ్ళం. అపుడు నన్ను చూడటానికి చాలామంది వచ్చేవారు. చందు ఏదో దేశం చదువుకోడానికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకుని వచ్చాడని కతలు కతలుగా చెప్పుకునేవారు. నన్ను విచిత్రంగా చూసి కాస్త ముక్కూ మూతీ విరిచి “శీను బాగా తేటు… మల్లిక నలుపు’ అని అనేవారు. ‘నుదురు ఎత్తుగా ఉంటే అదృష్టం అనీ మల్లిక చెయ్యెత్తు మనిషి అనీ కళగా ఉంటుందని అత్తయ్యమావయ్య నా మీద మాట పడనివ్వకుండా మురుసుకునేవారు.
పలాస పరిసరాల్లోని పల్లెల్లో ఉండే వాళ్ళ చుట్టాల ఇళ్ళకు తరుచుగా వెళ్ళేవాళ్ళం. పొడవుగా కంపార్ట్ మెంట్స్ లాగా ఉండే అతి చిన్నఇళ్ళలోని వారి విశాలమైన హృదయాల్లో నాకు చాలా త్వరగా చోటిచ్చారు. పండు ముదుసలి స్త్రీల పట్ల సహజంగా నాకుండే అపారమైన ప్రేమ వల్ల వాళ్ళతో గంటలు గంటలు కూచుని వాళ్ళు చెప్పే కబుర్లు వినేదాన్ని. ఉత్తరాంధ్ర మాండలికం నాకు ఎలా పట్టుబడిందన్నది చాలామంది అడిగేవారు. ఇదుగో ఇలా వారి ముచ్చట్లలోంచి జాల్వారే జీవభాషని ఇష్టంగా దోసిలి పట్టాను. నిజానికి చందు కన్నా కూడా వారి చుట్టాల ఆనుపానులన్నీ నాకే బాగా తెలుసు. వూర్లో పదడుగుల వెడల్పున్న మట్టిరోడ్డుకి అటూ ఇటూ వట్టి నేలమీదే వారి సరసన గొంతుకు కూర్చుని, నీళ్ళుజల్లడం వలన ధూళి అణగారిన ఆ నేలమీద వేసిన ఆకుల్లో భోజనాలు చేసేదాన్ని. అక్కడ పుట్టి పెరిగి, పట్టణాలలో మెట్టి, చుట్టపుచూపుగా వచ్చిన పడుచులు లోపలిగదుల్లో ఎత్తుపీటల మీద నాజూకుగా మెతుకులు లెక్కబెట్టుకుని కొరుకుతుంటే నేను మాత్రం వీధిలో అందరి మధ్య కూచుని, వేడివేడి అన్నం మధ్యలో గుంట చేసి పొగలు గక్కే గూనపులుసు వేసుకుని ఇంతేసి వాటం ముద్దలు గుటుక్కుమనిపించేదాన్ని. సగ్గుబియ్యంతో చేసిన తియ్యటి పాయసాన్ని ఆకులో వేసుకుని జుర్రేదాన్ని. పెళ్ళిళ్ళూ పేరంటాలలో నడుంకట్టి అమ్మలక్కల మధ్య చేరి తెగ పనులు చేసేసేదాన్ని. దాంతో కలవరాలన్నీ సర్దుకుని నన్ను వాళ్ళలో కలిపేసుకున్నారు. సాహిత్య సంవాదాల్లో భాగంగా ఇదివరలో కొందరు నువ్వు ఉత్తరాంధ్ర దానివి ఎలా అవుతావు అన్నపుడు నా ఒంటిని అతుక్కున్న చర్మం లేచిపోయినంత నెప్పి కలిగేది. ఇపుడు అదేం లేదు. ఎందుకంటే ఇపుడు అస్తిత్వం నా సమస్య కాదు. ఉనికిని ఎవరైనా సవాల్ చేయొచ్చు గానీ ప్రాణప్రదమైన ప్రేమని ఎవరైనా సవాల్ చేయగలరా?!
ఎపుడూ లేనిది అకస్మాత్తుగా కులచర్చ మొదలుకావడం నాలో ఈ జ్ఞాపకాలను కదిలించింది. నో రిగ్రెట్స్… ఇదియునూ నా మంచికే. ఈ నాలుగు మాటలూ రాయించినందుకు చర్చ మొదలు పెట్టిన చుట్టాలాయనకు చాలా థాంక్స్.
నీ కథల పుస్తకం మీద విశాఖలో జరిగిన చర్చ గురించి మాట్లాడాలి. అది మళ్ళీ వచ్చే ఉత్తరంలో రాస్తాను. నీ రిప్లయ్ లో ఏయే కొత్త అంశాలను టచ్ చేస్తావోనన్న కుతూహలంతో…
– మల్లి

 

Image may contain: 1 person, smiling, text

Image may contain: 2 people, text

Image may contain: 1 person, text

సప్తవర్ణ లేఖ – 11

(గత నాలుగు రోజుల్లో వివిధ సందర్భాల్లో నాతో మాట్లాడిన మిత్రులు చాలా సున్నితంగా ప్రస్తావించిన విషయాల సారాంశం ఒకటే. ఈ మధ్య ఏం రాస్తున్నట్లు లేవు! అని. ఆ హెచ్చరిక నాకు అర్ధమవుతూనే ఉంది. అయిదేళ్లుగా నన్నుపట్టుకుని వదలని నవల గురించీ, బోల్డంత సమయాన్ని హరించే దాని దాహం గురించీ కాసేపు గొణిగి ఊరుకున్నాను. రాయకపోతే ఏం అని మనసులో కాసేపు పెంకితనాలు కూడా పోయాను. చూస్తుంటే విమలకి రాసిన సప్తవర్ణ లేఖ కనిపించింది. ఇలా మీతో పంచుకుంటున్నాను.)

షాబీ డేస్

20/03/16
విశాఖపట్నం.
హాయ్ విమలా,
నీ ఉత్తరం అందుకున్నాను. విమెన్స్ డే సందర్భంగా నువ్వు రాసిన లేఖ నాకు కొన్ని కొత్తవిషయాలని తెలియజేసింది. ఉద్యమానుభవాల విమలతో ఇట్లా నేస్తరికం కట్టుకున్నందుకు సంతోషం వేసింది. మనిద్దరం కలిపి చినుకు సాయంతో నిర్మించుకున్న ఈ ఆవరణం అపురూపంగా ఉంది. చూస్తూ ఉండగానే ఏం కానట్టు ఏడాది గడిచిపోయింది. ఆ మధ్య కె. శివారెడ్డి గారు కూడా హెచ్చరించారు, ‘మీ లేఖలను పుస్తకంగా తేవడం మాత్రం మర్చిపోకండి’ అని. కలిసినపుడల్లా ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. రామతీర్ధగారు ఈ లేఖల స్వభావం మీద మంచి విశ్లేషణ చేసి ఇన్ని పేజీలు అని కుదించకుండా విస్తృతంగా రాస్తే చాలా విషయాలు నమోదు అవుతాయి అని చెప్పారు.
ఈ మధ్య నా చిన్నప్పటి భయాలు కొన్ని గుర్తొచ్చి వాటిచుట్టూ చాలా ఆలోచనలు చేరాయి విమలా! అట్లాంటి భయాలు కలిగించిన కొన్ని దయారహిత దినాల ( పనికిమాలిన రోజులు అనొచ్చేమో! కానీ నేనిట్లా అనువదించుకున్నాను) గురించి నీతో పంచుకోవాలని ఉంది. నాకు అయిదారేళ్ళ వయసులో అమ్మ, నాన్న, నేను హైదరాబాద్ లోని మా చుట్టాలింటికి వెళ్లాం. మా ముగ్గురుఅక్కయ్యలు మా ఊళ్లోనే నాయనమ్మ దగ్గర ఉన్నారు. నన్నొక్కదాన్నీ తీసుకువెళ్ళారనే గర్వం కాసేపు కూడా నిలబడలేదు. బస్సులో కూచోగానే ‘నలుగురు పిల్లల్నీ తీసుకువెళ్ళాలంటే మాటలా! చార్జీలు భరించలేం. మా నాలుగోది వాళ్ళ నాన్నని వదిలి ఉండలేదు. అందుకే దీన్ని తీసుకు వెళ్తున్నాం’ పక్కనున్న చుట్టాలావిడతో అంది అమ్మ. అదుగో అలా డబ్బు అనే బ్రహ్మపదార్ధం మొదటిసారిగా నా ఊహలోకి వచ్చి హడలుగొట్టడం మొదలుపెట్టింది.
నిజంగానే హడిలిపోయాను విమలా!
నన్నూ మా అక్కలను ఇలా విడదీసేశక్తి దానికి ఉన్నందుకు ఆ బ్రహ్మపదార్ధం మాకు సరిపడినంత లేనందుకు దిగులు మొదలైంది. చుట్టాలింట్లో దిగి మూడురోజులు గడిచినా హుషారు లేదు. మాలో మేము మంతనాలాడుకుని దిగులు పోగొట్టుకోవడానికి పక్కన అక్కయ్యలూ లేరు. మూడోనాటి రాత్రి అర్ధరాత్రి పెద్దపెద్ద అరుపులు వినబడితే తుళ్లిపడి నిద్రలేచాను. పక్కనే ఉన్న హాల్లో ఏదో గొడవ జరుగుతోంది. చుట్టాలతో సహా అందరూ అక్కడే ఉన్నారు. మా చుట్టాలింటి పెద్దకొడుకు తాగివచ్చి గొడవ చేస్తుంటే అందరూ నిద్రలు లేచారు.
మా నాన్న పెద్దరికం వహించి ఏదో సర్ది చెప్పబోతున్నా గొడవ సాగుతూనే ఉంది. నేను రహస్యంగా తొంగి చూసేసరికి ఆ తాగి వచ్చినతను నూరువరహాల గుత్తిలోని ఒక పువ్వు కాడను పళ్ళ మధ్య తిప్పుతూ మొహం భీకరంగా పెట్టుకుని ఉన్నాడు. అమ్మా అమ్మా అని మెల్లగా పిలిస్తే, వాళ్ళాయన పెద్దరికాన్ని చూడనివ్వకుండా చేస్తున్నానన్న విసుగుతో వచ్చిన మా అమ్మ నన్ను పడుకోబెట్టబోయింది కానీ నేను లొంగి రాలేదు. అలా అమ్మ కుచ్చిళ్ళు పట్టుకుని సాగుతూ నేనూ హాల్లోకి వచ్చిపడ్డాను.
అపుడు గోస పెడుతున్న గొంతుతో తాగుబోతాయన వాళ్ళ అమ్మ అందీ ‘ఇట్లా తాగుతూ పోతే ఎంత డబ్బూ నాలుగురోజుల్లో హరించుకు పోతుంది కదా’ అని. ఇక మిగతా విషయాలన్నీ పోయి ఆ ఒక్కమాటే నా బుర్రకి అతుక్కుపోయింది.
వాడేస్తే డబ్బులు అయిపోతాయి.
మా ఇంట్లో ఇనపటేబుల్ టేబుల్ సొరుగులో గుండ్రని స్టీలు డబ్బాలో నాన్న దాచిన నోట్లూ చిల్లర నాణాలూ గుర్తొచ్చాయి. వాడేస్తే అయిపోతాయి కదా! అపుడెలా బతకడం! అన్న మనేద పట్టుకుంది నాకు. అదెంత తీవ్రంగానంటే పొద్దున్నకల్లా నా వంటి మీద జ్వరం విరగకాసింది.
‘రాత్రి గొడవకి ఝడుసుకుందల్లా!’ అన్నారంతా. కానీ కాదు. డబ్బు అయిపోతే ఎట్లా మరి! పాపం మా నాన్న ఏం చేస్తారు! మేవెట్లా బతకడం! అనేదే నా గుబులు. నాలుగురోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి ఎవరినో తోడు ఇచ్చి ఏలూరు మా ఇంటికి పంపేసారు.
వచ్చినరోజే మా అక్కయ్యలు నా నుంచి విషయం కూపీలాగి ‘స్టీలు డబ్బాలో డబ్బులు అయిపోతే మరెలా బతకడం అని భయంతో వచ్చిన జ్వరం అంట మామ్మా!’ అని మా నాయనమ్మతో చెపితే ఆవిడ నవ్వేసి, ‘అయిపోతే సంపాదించుకుంటాం’ అంది ధీమాగా.
అపుడు బోల్డు అనుబంధ ప్రశ్నలు వేసి డబ్బు దాని స్వరూపస్వభావాల గురించి మా నాయనమ్మ వద్ద కొంత లౌకికజ్ఞానం సంపాదించాను. నా పసిమనసుకి అంత కష్టం కలిగించిన ధనంతో నాకెపుడూ స్నేహం కుదరలేదు. సాధ్యమైనంతవరకూ తప్పుకునే తిరిగాను.
తొలిగా నా ఆలోచనను అంత మథనకి గురి చేసిన అంశం ఇంకా ఉదాత్తమైనది అయి ఉంటే బావుండేదని అనిపిస్తూ ఆ షాబీ డేస్ నుంచి కూడా ఎంతో కొంత గ్రహించాను కదా ఊరట చెందుతూ ఉంటాను.
దయ కరుణ లేకుండా జీవితం కొన్ని క్రూరమైన రోజులను ‘అనుభవించు’ అంటూ అంటగట్టే ఉంటుంది కదా విమలా!. తెలిసోతెలియకో విధిలేకో, నమ్మకంలేకో, మరెందుకో అలాంటిరోజులు మనమీదుగా నడిచిపోయే ఉంటాయి…‘అబ్బా ఎలాంటికాలం తల్లీ! పగవాడికి కూడా రాకూడదు’ అనిపించిన రోజుల్లో నన్ను కాపాడిన నిబ్బరం, వివేచన, సహనం నాకు అత్యంత విలువైనవి. వాటి జ్ఞాపకాలు మళ్ళీ అలాంటివి ఎదురైనపుడు ఎదుర్కొనే క్రమాన్ని సులువు చేస్తాయి. ‘మనం పోగొట్టుకున్న ధనం కన్నా మనం పోగొట్టుకున్న మనం విలువ చాలా ఎక్కువ’ అన్నది చిన్నప్పటి ఫాసినేటింగ్ కొటేషన్. అందుకే ఎలాంటి షాబీ డేస్ లో కూడా నన్ను నేను నిలుపుకోవడానికే ముందుగా పోరాటం మొదలుపెడతాను.
నా జీవితంలోవే కాకుండా నా చుట్టూ మెలిగినవారి జీవితాల్లోని ఉండకూడని రోజులు కూడా నన్ను కలవరపెడతాయి. ఏలూరులో నేను ఆరు, ఏడు తరగతులు చదివేపుడు మా క్లాసులో విజయకుమారి అని మాలవారి అమ్మాయి ఉండేది. తను క్రిస్టియన్. మిగతావాళ్ళు బీసీ ఓసీలు – హిందువులు. ఓ సారి మా తరగతిలో చాలామంది పిల్లలు మా ఆహ్వానం మీద కట్టగట్టుకుని మా ఊరొచ్చారు. విజయకుమారి కూడా వచ్చింది. మా ఊళ్ళో మా తరగతికి చెందిన అందరి ఇళ్ళకూ వెళ్లాం.
అపుడు ఏ రకమైన ప్రశ్నలూ, ఆలోచన, లేకుండానే అందరం కలిసి విజయకుమారికి బొట్టు పెట్టేసి, జడలు బట్టలూ అవీ మాలాగా మార్చేసి ఎవరైనా ఆరాగా చూస్తే మా గుంపు మధ్యభాగంలో తనని దాచేసి నానా హడావిడి చేసాం. మొత్తానికి మా సంబరంలో తను కూడా పాల్గొనాలన్న ఆరాటమే తప్ప ఇంకే జ్ఞానమూ తెలీని దుర్మార్గపు రోజది. ఆఖరు అంకం మా ఇంట్లో. చావిట్లో అందరినీ వరసగా కూచోబెట్టి కాయితంలో పకోడీలు పెట్టి ఇస్తున్న మా నాయనమ్మ విజయకుమారిని చూసి ‘పిల్లా! మీరేవిట్లూ?!’ అనేసింది పిడుగుపాటుగా.
నాకు చాలా కోపం వచ్చింది.
ఎందుకు?!
నాకు అప్పటికి కులమతాలను వాటి అమానుషత్వాన్ని అర్ధం చేసుకునే వాతావరణంలో లేను. కానీ ఆ ప్రశ్న అడగడంలో అహంభావం, దానికి సమాధానం చెప్పలేక ఆ నీలికలువ కళ్ళు నీళ్ళతో నిండిపోవడం నన్ను కలవరపరిచాయి విమలా! అపుడు మా నాయనమ్మతో పోట్లాడాను. మా ఫ్రెండ్ ని అట్లా అడుగుతావా?! అని. మొదటిసారి మా ఇంట్లో పెద్దవాళ్ళ మీద చిన్నవాళ్ళ తిరుగుబాటు. ఆ పకోడీలు అక్కడే పారేసాను. విజయకుమారి మాత్రం పొట్లంగట్టి తెచ్చింది. ఇద్దరం కలిసి మా పక్కస్థలంలో ఉన్న గడ్డివాము పక్కన కూర్చుని ఏమీ చెప్పుకోకుండానే ఓ…మని ఏడ్చుకున్నాము.
కాసేపటికి ఏడుపు ఆగి వెక్కులు పెడుతున్నపుడు విజయకుమారి పకోడీల పొట్లం విప్పి ఒకటి తీసుకుని సగం కొరికి తిని మిగిలిన సగం నాకు ఇచ్చి ‘ఇది తింటే నువ్వు అంటు పాటించనట్లు…’ అంది పౌరుషంగా.
గభాలున తీసుకుని తినేసి కలకలలాడిన విజయకుమారి మొహాన్ని చూసి పొట్లంలోని మిగతావి కూడా కొరికి ఇస్తేనే తింటానన్నాను. ఆ తర్వాత ఈ అంటరానితనాన్ని పోగొట్టడానికి మా వంతుగా మేము ఒక బృందంగా ఏర్పడి నేనూ విజయకుమారి, మాదిగవాళ్ళ మత్తేసు ఇంకో నలుగురైదుగురం కలిసి రేగుపళ్ళు మొక్కజొన్న కండెలు లాంటి వాటిని వాళ్ళు కొరికి ఇస్తే మిగతావాళ్ళు తినాలి అనే ప్రోగ్రాం కొన్నాళ్ళు నడిపాము. అలాగే అందరమూ విజయకుమారి మత్తేసుతో సహా ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడవాలి అన్న కార్యక్రమం కూడా నిర్వహించాం. మా టీచర్లకి తెలిసిన రోజున ఒకాయన మమ్మల్ని తిట్టిపోశాడు కానీ మిగతావాళ్ళు నవ్వి ‘ పిచ్చిపిల్లలారా! ఎప్పటికి మారేను లోకం!’ అని నిట్టూర్చారు.
ఒక దుర్మార్గపు రోజుని అమాయకత్వపు సమానత్వంలోకి తీసికెళ్ళగలిగినందుకు విజయకుమారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటానెప్పుడూ.
ఈ మధ్య వేముల రోహిత్ తల్లిగారైన వేముల రాధిక విశాఖపట్నం మీటింగ్ కి వచ్చారు విమలా! మహిళాచేతన కార్యదర్శి కత్తి పద్మ ఉన్నారు కదా.. తను తీసుకు వచ్చారు. ఆమెతో కలిపి ఒక పూటంతా గడిపాను. చాలా కబుర్లు చెప్పుకున్నాము. రోహిత్ చిన్నప్పటి విషయాలు చెప్పుకున్నాము. రోహిత్ తమ్ముడు చైతన్య పేరులోనే కాక నిజంగా చైతన్యవంతంగా ఉన్నాడు. వారి జీవితాల్లో అకస్మాత్తుగా వచ్చి పడిపోయిన ఆత్మీయుని మరణం ఒక ఎత్తు అయితే, రోహిత్ లక్ష్యాలను ఆశయాలను భుజాలకి ఎత్తుకున్న అనేకమంది ఆశలను రాజకీయంగా ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యతని కూడా వాళ్ళు స్వీకరించారు.
అంతకు ముందు ఎరుగని కొత్త రాజకీయాలను హాండిల్ చేయడంలో వారికి వస్తున్న సమస్యలను, వాటిని అధిగమించడంలో ఉన్న ఇబ్బందులను ప్రస్తావిస్తే నిబ్బరంగా ఉన్నట్లే కనిపించారు. ప్రధానంగా ఏ రాజకీయపార్టీనీ ఏ ప్రజాసంఘాన్నీ ఏ మీడియాసంస్థనీ నమ్మి, వారి వెనుక వెళ్ళమని రోహిత్ చట్టం రావడం కోసం బేషరతుగా అందరి సాయం కోరతామని చెప్పారు. బాధితులకి న్యాయాన్ని సాధించడంలో చివరికంటా తోడు ఉంటామన్న నమ్మకాన్ని ఒక్క ప్రజాసంఘమూ ఇవ్వలేకపోయిందా అని మనసు కలుక్కుమన్నా సరే ఇప్పటి పరిస్థితుల్లో వారి ముందు ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం నన్ను ఆలోచనలో పడేస్తోంది విమలా!
కథల పుస్తకం వేస్తున్నావుగా విమలా! నీకు అభినందనలు. నువ్వు అరుదైన కవి కథకురాలివి. సమాజంతో ప్రజలతో, నీతో – నీ అనుభవాలు కథలుగా ఒకేచోట చదవడం అద్భుతమైన అనుభవం అవుతుంది ఖచ్చితంగా.
నువ్వు కోసుకొచ్చిన కొన్ని నక్షత్రాలు / నీ వేలి కొసల నుంచి జారే క్షణాల కోసమూ
నువ్వు మోసుకొచ్చిన కాసిన్ని కన్నీళ్లు / మాకు చెప్పే కథలని వినడం కోసమూ
ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి త్వరగా నీ లేఖ చదవాలని ఆశపడుతూ…
ప్రేమతో
మల్లి28feb11

విప్లవ కలల నేతగాడు

 

 

(అరుణతార – చలసాని సంస్మరణ సంచికలో ప్రచురితం)

ప్రసాద్ గారూ,

మీకో ప్రేమలేఖ ఇలా రాయవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. మీరు కనపడని చోటుకి ముందస్తు నోటీసు కూడా లేకుండా  దబదబ అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతారని తెలిస్తే దారి కాసి గదమాయించి అయినా సరే వెనక్కి తీసుకురామా! అప్పటికి నాలుగు రోజుల కిందటే కదా నేనూ చందూ వచ్చేసరికి గదిలో మీ మదిలో పుస్తకాల మధ్య ఆలోచనల్లో ఉన్న మిమ్మల్ని కొంటె ప్రశ్నలడిగి ఏడిపించాను. ఏవన్నానో గుర్తుందా? ‘ప్రసాద్ గారూ మీరెవరినైనా ప్రేమించారా?’ అన్నాను. చందుకి కాస్త మర్యాద గుర్తొచ్చి పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటి ఆ ప్రశ్నలు అని ముసిముసి నవ్వులు నవ్వి తిట్టి మీ వంక కుతూహలంగా చూసాడు. అపుడు చూసాను కదా మీ మొహంలోని చిలక నవ్వుని. నా బుగ్గలు ముద్దాడి ‘నిన్ను ప్రేమించాను…ఈ లోకాన్ని ప్రేమించాను, మనుషుల్ని, పుస్తకాలలోని మనుషుల్నీ, విప్లవాన్ని ప్రేమించానని చెప్పి  నా ఎత్తుగడని చిత్తు చేయబోయారు. నేను వదలకుండా పోనీ ఎవరికీ ప్రేమలేఖన్నా రాయలేదా? అని కాసేపు నస పెడితే అపుడు విజయ గారికి రాసానని ఒప్పుకున్నారు. నేనొక ప్రేమలేఖ రాస్తాననీ నాకు రిప్లయ్ ఇవ్వాలనీ అడిగితే మీరు నాకు మాటిచ్చారు. నిలుపుకోవాలి మరి!

చలసానీ,

మీ లక్ష్యాలు, మీ ఆచరణ, మీ చిత్తశుద్ధి అసలివేమీ తెలీకుండానే మిమ్మల్ని ప్రేమించిన మనుషులున్నారు. అది మీకు తెలియకపోలేదు. సాహిత్యమన్నా రచయితలన్నా సభలూ సమావేశాలన్నా పెద్దగా ఆసక్తి లేని చందూని, మీ ‘మిస్టర్ మల్లిగాడిని’ ఏం మాయ చేసి మీ వశం చేసుకున్నారు? మిమ్మల్ని ఇలా సాగనంపి వచ్చి, రెండ్రోజులుగా ధరించిన బింకపు ముసుగుని విప్పి హేంగర్ కి తగిలించి పడకగది తలుపు  వేసుకుని  బావురుమని ఏడ్చిన చందు మీ గురించిన మరో  పాత సత్యానికి కొత్త ఉదాహరణ. మాట్లాడటానికి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ తన లోపల ఓవర్ ఫ్లో అవుతున్న దానిని ఆపుకోలేక  కొత్త మాటల్లోకి దిగిపోతున్నాడు చందు. ఒక రైతు వర్షించే మేఘాన్ని కావిలించుకున్నట్లుగా ఉంటుంది ప్రసాద్ గారిని కావిలించుకోవడం అంటున్నాడు. ఇంకొక్క ఏడాదో రెండేళ్లో ఈయనతో స్నేహం నడిచి ఉంటే ఇక నేనూ దిగక తప్పేది కాదు అన్నాడు. చలసానీ  వింటున్నారా? ఎవరికి వారు, చలసానితో తమ అనుబంధమే అత్యున్నతం అనుకునే స్థాయిలో హృదయాన్ని అంతలా ఎలా విశాలం చేసుకోగలిగారు?

మీరెంత విస్తరించారో తలుచుకుంటున్న కొద్దీ గుండెలు అవిసిపోతున్నాయి. మీరు చటుక్కున మాయం అయ్యారన్న విషయం తెలిసి మా అమ్మనాన్నలు అత్తమామలు మా అక్కయ్యలు నా చిన్నప్పటి స్నేహితులు సాహితీ మిత్రులు ఇంత మంది నన్ను పరామర్శించడం చూస్తే ఒక మనిషితో అనుబంధం అంటే వారి సమస్తంతో సహా ప్రేమించడం అన్నది ఆచరణలో ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. అంత శక్తి ఓపిక ఎలా వచ్చాయి? ముఖ్యంగా అహాన్ని రద్దు చేసుకోగల అంతటి హృదయాన్ని ఏ పదార్ధంతో తయారు చేసుకున్నారో ఇక ఇపుడు పరిశోధించాలి.  మీరు విస్తరించినంత మేరా ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి  మీ పనులు, మీ జ్ఞాపకాలు, వినా మార్గం లేనందుకు, ఉందేమో మరి ఇంకా మా ముందుకు రానందుకు దుఃఖంగా ఉంది. కృష్ణాబాయి గారితో చెప్పానూ చెదిరిన మనస్సు నుంచి వచ్చే అక్షరానికి కుదురు ఉండదు అని. అదే రాసి చూడు అన్నారామె. అచ్చం ఆమె వంటి మీరు, మీ వంటి ఆమె.

ఫ్రెండూ,

ఆరుద్ర అంటే పెద్దగా పడదు కదా మరి ఆరుద్ర సంపుటం కోసం నన్ను విసుక్కున్నారు ఎందుకూ! నిజ్జంగా నిజం ఫ్రెండూ ఆ 9 నంబర్ సంపుటం నేను తీసుకు వెళ్ళలేదు. సరే మీకు మనసు మనసులో ఉండదు కదా అని మన నారాయణ వేణు గారి పుస్తకం తెచ్చి మీకిస్తే అది మీది కాదని చెప్పి వేణుకి ఫోన్ చేసి పుస్తకం పంపించి వేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసి పుస్తకం ఇవ్వమని అడిగారు. చాదస్తం కాదా మరి! నేను అలిగానేమోననీ నేను మొహం మాడ్చుకున్నానేమోనని పదేపదే ఫోన్లు చేసి ‘ఒరేయ్ మల్లీ నాకు పుస్తకాల కన్నా మనుషులే ముఖ్యం. ఏవీ అనుకోబాకు’ అంటుంటే ఫ్రెండూ! అసలకి మీమీద కోపం వస్తుందా ఎవరికైనా?

చివరిసారి ఎపుడు చూసానూ అని పెద్దగా ఆలోచించలేదు. మిమ్మల్ని కలిసిన ప్రతి సందర్భమూ ఒక పండుగే కదా! మీ మహాప్రస్థానానికి మూడు రోజుల ముందు నేను లోపలి గదిలో పని చేసుకుంటున్నాను. కాలింగ్ బెల్ పని చేయడం లేదు. ముందు గది తలుపు కొట్టినట్లున్నారు వినిపించలేదు. అపుడు ఇంటి వెనుక వైపు వచ్చి పెరట్లో నిలబడి తలుపుకొట్టి పిలిచారు. మీ గొంతు వినగానే పరుగున వచ్చి తలుపు తీసానే గానీ మీకు అంత ఇబ్బంది కలిగించినందుకు ఎంత నొచ్చుకున్నానో అంత అబ్బురపడ్డాను. ఏం ఫ్రెండూ చివరి జ్ఞాపకాన్ని నా కోసం ఘనంగా పదిలపరచడానికా ఆ రోజు మీరు అంత ఆరాటపడ్డారు !

వ్యక్తి పూజలు కూడదు నిజమే. కానీ విప్లవ వాహకులు వ్యక్తులే కదా, వారు ఎంతటి సంస్కార వంతులైతే విప్లవానికి అంతటి సానుభూతిని సంపాదించి పెట్టగలరు కదా…ఇది రాస్తుంటే  కొకు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి మనుషుల్లో సంస్కారం పెరిగేకొద్దీ నేరాలు తగ్గుతాయనీ అపుడు చట్టం చేయాల్సిన పనిని సంస్కారమే చేస్తుందనీ అంటాడు. ఆ సంస్కారం చేతనే కదా తాళాలు లేని ఇంటిని సాధ్యం చేసుకున్నారు, ఆ సంస్కారం చేతనే కదా పోలీసులు లేని రాజ్యం కోసం విప్లవ కలల నేతగాడుగా మారారు.

సీపీ

మీరు పరిచయం అయిన తొలినాళ్ళలో ఏయు అసెంబ్లీ హాల్ లో కిక్కిరిసిన ఒక సభలో మనిద్దరం వెనుక వరుసలో జనాల మధ్య కూచుని ఉండగా అల్లంత దూరం లోని వేదిక మీద నుంచి సినారె ‘ అదుగో ఆ మూలన కూచున్న మూల పురుషుడు.’ అంటూ చతురోక్తులతో మిమ్మల్ని ప్రశంసించినపుడు మీ గురించి కొత్తగా తెలిసినట్లనిపించింది. ఆ తెలియరావడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఇంకా కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూ ఉంటుంది.

కమ్యూనిస్టులు అంటే చాలా మందికి లానే నాకూ గొప్ప గౌరవం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ తరం వారంటే మరీనూ. ఎందుకంటే సగటు మానవుల కంటే భిన్నంగా ఆచరణలో బలంగా ఉంటారనీ, త్యాగాల బాటలో అలవోకగా అడుగులు వేస్తారనీ. సందేహమే లేదు. డబ్బు, అధికారం, హోదా వంటి అనేక ఆధిపత్యాలను జయించిన అపురూప మానవుల సమక్షం ఎంత హాయిగా ఉంటుందో నేను మీ వద్ద, మీ వంటి మరి కొందరి వద్ద  గ్రహించాను. అయితే అలాంటి వాళ్ళలో కూడా మీరు వేరు సీపీ . ఆధిపత్యాలను జయించి మామూలు వ్యక్తులకి సాధ్యం కాని ఆచరణ బలంతో, జ్ఞాన సంపన్నతతో మిలమిలలాడే వ్యక్తులకు ఒక నైతిక తీక్షణత ఉంటుంది. అది చాలా సందర్భాల్లో అది నైతిక ఆధిపత్యంగా మారడం, అజ్ఞానులను(?), బలహీనులను చిన్న చూపు చూడటం గ్రహించినపుడు ఉసూరుమంటాం. కానీ చెప్పాగా సీపీ మీరట్లా కాదు. మీరసలు పూర్తిగా వేరే. జ్ఞాన, నైతిక ఆధిపత్యాలను కూడా జయించి మీరు మనుషుల్ని ప్రేమించారు.

నాకు మీరు ఇలా అర్ధం కాక ముందు ఏడిపించడానికే అయినా ప్రసాద్ గారూ మీరు రాన్రానూ అజాతశత్రువులా మారుతున్నారు అంటే ఒప్పుకునేవారు కాదు. అబ్బే! నేను అజాత శత్రువుని ఏంటి ! అదేం తిట్టు! అనేవారు. మీరు నమ్మి ఆచరించిన రాజకీయాల పట్ల మీ నిక్కచ్చితనం ఎంతటిదో పలు సభల్లోనూ పలు సందర్భాల్లోనూ నేను చూసాను కాబట్టి రాజకీయ విలువల పట్ల మీకున్న నిబద్ధత వల్లనే మనుషుల పట్ల అంతటి ప్రేమ  సాధ్యపడిందేమో అనిపిస్తుంది.

ప్రసాద్ గారూ,

2009 లో రచయిత్రుల సదస్సు ఒకటి పెడుతున్నామని అందరం కలిసి మాలో మేము సంభాషించుకుంటామని ఆ సదస్సుకి ఒక పేరు పెట్టడం కోసం ఆలోచిస్తున్నామని చెప్పినపుడు మీరు చటుక్కున ‘మనలో మనం’ అనండి బావుంటుంది. తుమ్మల వేణు గోపాలరావు గారి పుస్తకం పేరు అది అన్నారు. ఆ పేరు చాలా నచ్చింది మాకు. తర్వాత ‘మనలో మనం’ అన్న పేరుతో తాత్కాలికంగా రాష్ట్ర వ్యాప్త రచయిత్రుల వేదిక ఆవిర్భవించడం ఏడాది పాటు జరిపిన సభల అనంతరం నిర్మాణంతో కూడిన  ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ గా అది రూపాంతరం చెందడం జరిగింది. ఈ ప్రయాణంలో మీ భాగస్వామ్యం పరిమితం అయినప్పటికీ మనలోమనం అన్న పేరు మీ వల్ల కూడా ఒక అపురూప జ్ఞాపకంగా మిగిలింది  నాకు.

మిమ్మల్ని ఇలా ఈ ఇరుకైన వ్యక్తిగత పరిధి లోకి లాక్కొచ్చి మాట్లాడటం క్షంతవ్యం కాని నేరమంటారేమో మీ సహచరులు.  ఏం చేయను సీపీ మీరు లేని లోకంలో ఒకటే తత్తరపాటుగా ఉంది. నాలుగు రోజులన్నా పట్టదా సర్దుకోవడానికి! హడావిడిగా దుఃఖాన్ని దులిపేసుకుని కార్యోన్ముఖులు కావడం మంచిదే కానీ ఈ దుఃఖం, ఈ ఖాళీ ఎప్పటికీ తీరేది కాదు కనుక హృదయంలో దానికొక అర నిచ్చి అక్కడ దాపెట్టాలి. అదే పనిలో ఉన్నా. తిరిగిరాని జవాబు కోసం ఎదురు చూస్తూ –

మీ

మల్లిగాడు

16/08/2015

గులాబ్ జామూన్ల వంటి పిల్లలు.

 

 

 

gulab jamun recipe

19/04/2015,

విశాఖపట్నం.

హెలో విమలా,

మనం ఉత్తరాలు రాసుకుని చాలా చాలా రోజులైపోయినట్లుంది కదూ! ఈ మధ్యంతా తీరికలు లేకపోవడం సంగతి అటుంచి మార్చి నెలలో మనం జమిలిగా మంచి బహుమతిని పొందాం కదా! చూసావా మధురాతి మధురం మన కొండఫలం ఇచ్చిన తియ్యదనం. వీరలక్ష్మి గారూ మీరలా సప్తవర్ణాల్లో భాగమై ఈ కాలమ్ లో తళుక్కున మెరవడం  చాలా బావుంది. మనమంతా చాలా విషయాల్లో ఒకలాంటి వాళ్ళమే కదా అందుకే మీ లేఖ మా పరంపరలో కుదురుగా అమిరిపోయింది. విమలా మనకు ఈ సర్ప్రైజ్ ని ఇచ్చినందుకు ఆమెకి మరీ మరీ థాంక్స్ చెపుదాం.

 

ఈ మధ్య ఇల్లు మారాము విమలా, లాసన్స్ బే కాలనీ లోకి వచ్చాము. ఆంద్ర యూనివర్సిటీకి దగ్గర. రోజూ వెళ్లి రావడం నాకూ పాపకీ సులువుగా ఉంటుందని. ఇహన ఇల్లు మారడంలో బోల్డన్ని భావోద్వేగాలు ఉంటాయి. అవి మరెప్పుడన్నా చెపుతాలే.  లాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని మెట్ల మీద కూచుని  నీకు లేఖ టైప్ చేస్తున్నానా, నా వంటి ప్రేమికురాలిని ఉత్తినే వదులుతుందా ప్రకృతి! ఎదురుగా కొబ్బరి చెట్టు గలగలా మంటూ పిలిచింది. ఆ! పోదువూ బడాయి మమ్మల్ని మాత్రం పిలవదా ఏంటి అనుకుంటున్నావా అమ్మాయీ…నిజమేలే. ఈ చెట్లూ పుట్టలూ పిట్టలు   గొప్ప చాతుర్యం కలవి . ఒక కొబ్బరి కొమ్మ కొంచెం వంగి అడ్డంగా చాపలాగా పరుచుకుంది. దాని మీద వరుసగా మూడు పిట్టలు. ఒకటి కాకమ్మ, రెండు చిలకమ్మ, మూడు వడ్రంగి పిట్టమ్మ! ఓసి! ఏమి వీటి స్నేహమూ, వీటి వైనమూ…స్వజాతి కాకపోయినా రెక్కలు రెక్కలు రాచుకుంటూ ఇంత సొంపుగా కూచున్నాయీ!

 

ఈ మధ్య విశాఖలో పిట్టలు చెట్ల మీద అపార్ట్ మెంట్లు కట్టుకుంటున్నాయి. మా పిట్టమ్మలకి ఇపుడు ఇళ్ళ కొరత కదా! అందుకే అవీ టెక్నాలజీని వాడుతున్నాయి.  మా తోటికోడలు వాళ్ళింట్లో పెద్ద మావిడి చెట్టు ఉంది. ఘనమైన చెట్టులే. హుద్ హుద్ కూడా ఏమీ చేయలేకపోయింది. ఇపుడు రాత్రి పదింటికి వెన్నెల్లో ఆ చెట్టు చూసామంటే ఇంద్ర ధనుస్సు మరింత  వంపు దీరి  వరుసలుగా మారి చెట్టు మీద తిష్ట వేసిందా అనిపిస్తుంది. కింది వరుస కొమ్మల్లో పిచ్చుకలు, మధ్యలో ఒక వరుస చిలుకలు, ఆ పైన కాకులూ, బులుగు రంగు పిట్టలూ, నడి నెత్తిన కొంగలూ కూడబలుక్కుని సఖ్యంగా వేటి వరుసని అవి మీరకుండా రాత్రుళ్ళను వెళ్ళమార్చుకుంటున్నాయి . ఇలాంటపుడే పిట్టల వంటి పిల్లలు గుర్తొస్తారు.

 

పిల్లల్ని మనమే పెంచుతున్నామని మనకెంత అహమో!  మన గొప్పలూ మన ఆదర్శాలూ  తీరని మన లక్ష్యాలూ, చివరాఖరుకి మన కళలు కూడా బస్తాల కొద్దీ వాళ్ళ మీద పడేసి వాళ్ళు గానీ మోయలేకపోయారో, ఎంత విలవిల లాడుతామో. పిల్లల్ని మనం పెంచుతున్నామన్నది పాక్షిక సత్యం. వాళ్ళు పెరుగుతుంటారు చుట్టూ ఉన్న గాలిని పీల్చుకుంటూ…మనం స్వచ్చమైన గాలిని ఇవ్వాలని తాపత్రయ పడతాం. ఆ క్రమంలో ఒకోసారి కాలుష్యాన్నీ ఇస్తామేమో తెలీకుండా. కానీ మన మాయోపాయాలన్నీ కనిపెట్టి కూడా సులువుగా క్షమించి వేస్తారు. దొరికిన కొద్ది స్పేస్ లో వరుసలలో కుదురుకున్న పిట్టల వలే ఆ సమయాలను వెళ్ళమార్చుకుంటారు. కానీ విమలా ప్రతి రాత్రి చివరా ఒక సూర్యుడు ఉంటాడు కదా! అది అర్ధం చేసుకోకుండా  వెలుగు అలికిడికి కోలాహలంగా లేచి రెక్కలు బార్లా చాపి ఎగురుతూ పోయే చైతన్యాన్ని చూసి పిల్లల్ని కంటాం కానీ వారి తలరాతల్ని కాదు కదా తలపోతలతో నిట్టూర్చుతుంటాము.

 

పిల్లల తాలూకు ఈ కామన్ కష్టాల సంగతి అటుంచితే ఈ మధ్య కళాకారులు, బుద్ధిజీవులు, సమాజాన్ని తమ చైతన్యంతో ముందుకు తీసుకు పోగల ప్రభావ వర్గాల వారి పిల్లలు కొందరు నాకు తెలీకుండానే నా ఆలోచనా ప్రపంచంలోకి వచ్చి చేరారు. దేశాన్నే కుదిపేసిన ఒక విప్లవకారుడి అరెస్ట్ సందర్భంలో టీన్స్ లో ఉన్న అతని కూతురు అతన్ని చూసి గర్వపడే తీరాలని మన విలువలు అంత నిక్కచ్చిగా ఎలా శాసిస్తున్నాయి!! చక్కని అమ్మాయి కదా  విమలా, తొలి యవ్వనపు మిసమిసలతో తనకి అర్ధమైన తన ప్రపంచంతో సాగిపోవాలనుకునే పిల్ల కదా, అకస్మాత్తుగా ఓ రోజు పోలీసు పద ఘట్టనలతో ఇల్లు మార్మ్రోగిపోయి, అప్పటి వరకూ పిల్ల చుట్టూ ఆవరించి ఉన్న రక్షణ శ్రేణులన్నీ తునాతునకలై పోయి నిలువనీడ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, తన ఈడు స్నేహితులందరూ అపనమ్మకంతో చూసి తప్పుకు తిరుగుతుంటే వెయ్యి కళ్ళతో కాదు వేయి ముళ్ళతో లోకం కాసే కాపలాకి గాయాల పాలైన పిల్లని ఆరాధనగా చూసి ‘ నిన్ను చూస్తే అచ్చం నాన్నని చూసినట్లే ఉంది’. అన్నామనుకో. అవును ధైర్యం చెప్పడానికే అంటాం. గర్వ పరచడానికే అంటాం. నిలబెట్టడానికే అంటాం. కానీ  ‘ అది నా దురదృష్టం ‘ అని టకీమంటూ ఆ పిల్ల నుంచి  ప్రతిస్పందన వచ్చిందనుకో  నా మనసెందుకు చేదెక్కిపోయింది! అట్లా అనకూడదు అంటూ ఏదో చెప్పడానికి నేనెందుకు ప్రయత్నించాను ! అది తల్చుకుంటే నాకిప్పటికీ సిగ్గుగానే ఉంది. రేపో మాపో మనసు గట్టి పరుచుకుని ఓపికని సాగదీసుకుని దెబ్బలకి రాటు దేలి తత్వం గ్రహించాక ఆ అమ్మాయి సుశిక్షితురాలు అయిపోవచ్చు. మరి కాకపోతే, శక్తి లేకపోతే !! ‘ఇదంతా నేనెందుకు మోయాలీ!’ అనేస్తే !

 

కొంచెం దిగులుగానే ఉంటుంది విమలా! పండిత పుత్ర పరమ శుంఠ లాంటి సామెతలూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ వంటి లోకోక్తులూ వింటున్నపుడు. పిల్లల్ని మన నుంచి విడదీసి చూసుకోవడం ఇంత కష్టమా అనిపిస్తుంది. మర్రి చెట్టు లాంటి తల్లో తండ్రో ఉన్న పిల్లలకి వారి నుంచి తమని తాము పెకలించుకుని వ్యక్తులుగా ఎదగడం మరీ కష్టం. ఒక గొప్ప నటుడి కొడుకు తన జీవితాంతం తండ్రిని పదేపదే స్మరించడం సుఖంగానే ఉండొచ్చు. ఎందుకంటే అందులో ఆర్ధిక కోణం ప్రధానంగా ఇమిడి ఉంటుంది కనుక. యధా పెద్దలూ తధా పిల్లలూగా పేచీలు లేకుండా సాగిపోయే మనుషుల గురించి గొగోల్ అసంపూర్ణ నవల డెడ్ సెల్స్ బాగా చెపుతుంది. ఆ నవలలో ఒక సన్నివేశంలో తండ్రి చనిపోతూ కొడుకుని పిలిచి అప్పగింతలు పెడుతుంటాడు. ఈ లోకంలో తల్లిని గానీ భార్యని గానీ అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములు మిత్రులూ బంధువులూ ఎవరినీ దేనినీ నమ్మొద్దని కేవలం డబ్బుని మాత్రమే నమ్మమని చెపుతాడు. తర్వాత గొగోల్ ఆ తండ్రి,కొడుకుల గురించి ఒక మాట అంటాడు ‘ అతడు వేసిన విత్తనం గొప్ప సారవంతమైన క్షేత్రంలో పడింది’ అని. కొడుకు వ్యక్తిత్వపు సమస్తాన్నీ ఏక వాక్యంలో ఆవిష్కరించాడు గొగోల్.

 

జీవితేచ్ఛ అంతిమంగా ఉనికి దగ్గరకే చేరుతుంది. అందుకే మన ఉనికి మనకి అమేయంగా ఉండాలి. అది ఎంతటి ఉత్తమ త్యాగపూరిత ఆదర్శాలలోనైనా దాని కోసమే, మన ఉనికిని గౌరవంగా నిలుపుకోడానికే ఎన్నెన్ని పోరాటాలు చేస్తామో! పిల్లలూ అంతే. ఫలానా వారి అమ్మాయనో ఫలానా వారి అబ్బాయనో ఉండే టాగ్ ని విదిలించుకుంటూ ఉంటారు. సమాజం అంటగడుతూ ఉంటుంది. బేలలైన పిల్లలు ఆ బరువు కింద కుదేలై కొన ఊపిరితో మూలుగుతుంటారు. మరి కొందరుంటారు చిచ్చర పిడుగులు. వాళ్ళు మాత్రం ఏ నీడలోనూ ముడుచుకోరు. తనని ఎదగనివ్వని మర్రి చెట్టు పైన యుద్ధ ప్రకటన చేస్తారు. అంతర్ బహిర్లోక యుద్ధరావాలతో హోరెత్తి పోతూ ఉంటారు. వాళ్ళ పాటి కదే న్యాయం.

రాక్షస వంశంలో పుట్టి ఎగస్పార్టీ వాళ్ళని కీర్తించిన ప్రహ్లాదుడంటే మనకి తగని ముచ్చట. మన పిల్లలు మాత్రం మనం నిర్దేశించిన కొలతల్ని మీరి అడుగు పక్కకి జారినా క్షమించలేము. మహారాజు బిడ్డ మహారాజే అవ్వాలని లేదు. సమస్తాన్నీ త్యజించి అన్వేషకుడు ఆవొచ్చు. గొప్ప విప్లవకారుల కుటుంబంలో పుట్టిన బిడ్డ త్యాగాలకి రోసి ‘చిన్నీనా బొజ్జకి శ్రీరామా రక్షా’ అనుకోవచ్చు. పిల్లలు అనుకోవడాలన్నిటినీ పెద్దల ప్రమాణాల్లోంచి చూడటం వలన ఎంత అశాంతి !

 

చాలా కాలం  వరకూ స్నిగ్ధ విషయంలో నాకొక ఆశాభంగం ఉండేది విమలా.!  నేను చదివినంత తపనతో, దాహంతో పుస్తకాలు చదవనందుకూ, అట్లా చదవక పోవడం మీద పిసరంత పశ్చాత్తాపం కూడా లేనందుకు. నాకు తెలుస్తూనే ఉండేది నా విలువని ఆ పిల్లలో వెతుకుతున్నానేమోనని, ‘నాలాగా డాన్స్ చేయగలవా, నాలాగా లెక్కలు బాగా చేయగలవా, నాలాగా నవ్వు మొహంతో ఉండగలవా అని నేను నిన్ను అడగడం లేదు కదమ్మా’ అంటూ నవ్వుతూ నవ్వుతూనే జ్ఞానోదయం కలిగించాలని చూస్తుంది ఆ పిల్ల.

 

ఇంకా కొందరు బంగారు బిడ్డలు ఉంటారు. ఎవరు చూసినా అక్కున చేర్చుకోవాలనిపించే వాళ్ళు. మొన్న యూనివర్సిటీలో  జె ఆర్ ఎఫ్ స్కాలర్ ఒకబ్బాయి కలిసాడు.  పుట్టుకతోనే  75 శాతం అంధత్వం. కళ్ళ ముందు లీలగా ఆకారాలు కనపడతాయి తప్ప రంగులతో సహా దేనినీ గుర్తించ లేడు. మరి ఎలా చదువుతావు నాయుడూ అంటే జేబులోంచి పుటాకార దర్పణం తీసి చూపించాడు . మైనస్ 25. ఆ దర్పణాన్ని ఒక కంటికి మాత్రమే ఆనించి చదవాల్సిన అక్షరాలను మొహానికి అతి దగ్గరగా చేర్చుకుని ఒక్కో పదాన్నీ ప్రత్యేకంగా చూసుకుంటూ అట్లా కొన్ని వేల పేజీలు  చదువుతూ, చదివినపుడల్లా పార్శ్వభాగంలో వచ్చే నెప్పిని తగ్గించుకోడానికి మందులు వాడుతూ, ఈ రోజు  పిహెచ్.డి వరకూ రాగలిగాడు. ఎలా ఇదంతా ! అంటే ‘ మా నాన్నకి నేను డాక్టర్ ని అవ్వాలని ఉండేది మేడమ్…అది కుదరదని చెప్పి ఇలా డాక్టర్ అవ్వాలనుకున్నా..మంచి ఉద్యోగంలో చేరి మా నాన్నని సంతోష పెడతా అన్నాడు. నాయుడిని ఇంత వరకూ నడిపింది వాళ్ళ నాన్న కోరికే. చాలా మంది తండ్రులకి పిల్లల మీద ఉండేటువంటి కోరికే. పరిస్థితులో పట్టుదలో శ్రమించడానికి వెనుక నడిపే ఆలంబనో మొత్తానికి నాయుడు దానిని తన హృదయంలోకి తీసుకున్నాడు. అట్లా దృష్టిని విశాలం చేసుకున్నాడు.

అసలట్లా కాదు.

నాయుడనే కాదు.

పిల్లలే  బహు తియ్యనివారు.

విమలా! ఇక్కడ ఎండలు బాగా ముదిరాయి. ఉక్కపోత. ఉన్నట్లుండి నిస్సత్తువని ప్రదానం చేస్తుంది శరీరం. ఈ ఎండాకాలం  మహా కానిది సుమా. మల్లె పూలూ మావిడి పళ్ళూ లేకపోతే ఎండాకాలాన్ని క్షమించడం ఎట్లా చెప్పు?

ప్రేమతో, మల్లీశ్వరి

 

 

 

 

 

 

పాపకి అమ్మ రాస్తున్న విముక్తి ఉత్సవం.

( 2013 డిసెంబర్ 22 న స్నిగ్దకి రాసిన ఉత్తరం.)

పాపాయీ!! కడవల కొద్దీ వసంతాన్ని పదిహేడేళ్ళుగా మాలో నింపుతూ ఉన్నందుకు గానూ ముందుగా ఈ అందమైన రోజున నీకు కృతజ్ఞతలు చెప్పుకోనీ..

జాగ్రత్తలన్నీ ఆంక్షలుగా అర్ధమయ్యే వయసులో ‘నాకు నచ్చినట్లు ఉండే హక్కు లేదా!అన్నీ మీ ఇష్టాలేనా! ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళే స్వేఛ్చ లేదా?’అనే నీ చిటిపొటి ఆక్రోశాలన్నీ ఇంకొక్క ఏడాదిలో సమసిపోతాయిలే.వచ్చే ఏడాది సరిగ్గా ఈ రోజుకి చట్టాలు గుర్తించే స్వతంత్రురాలివి…
ఉన్న ఒక్కగానొక్క మురిపాల మొలకకి బాల్యం నుంచి విముక్తి ఉత్సవం చేయడానికి మీ నాన్నకి ఎట్లానూ మనసు రాదు.పాలు తాగే ప్రాయంలో కడుపు నొచ్చి నువ్వేడుస్తుంటే భుజానేసుకుని బావురుమన్న మీ నాన్న గట్టి నిశ్చయంతో నీ వయసుని అక్కడే ఆపేసుకున్నాడు మరి .ఆ అభేధ్య రక్షణ వలయం లోనిది ప్రేమ అంటాడు నాన్న అనుమానంగా చూస్తావు నువ్వు. ఏదేమైనా జీవితాంతం ఆ భుజం మీది యువరాణివి మాత్రం నీవే.
ఇక నేనే కదా నీ లేత పెద్దరికాన్ని గుర్తించి లోకంతో ఒంటరి సావాసానికి కిటుకులు చెప్పాలి. నేరాలతో ఘోరాలతో అవినీతితో అత్యాచారాలతో భయపెట్టే ఈ లోకాన్ని ఆశతో స్థైర్యంతో విశ్వాసంతో ప్రేమించడమెలాగో నేర్పాలి
నేనూ నాన్నా కలిసి ప్రపంచాన్నంతా సెల్ పిట్టలా మార్చి నీ అరచేతిలో పెట్టాలి.నువ్వొక రివ్వున ఎగిరే పిట్టవై జగమంతా చుట్టడానికి నీకొక స్కూటీనివ్వాలి.అంతు తెలీని ఆకాశంలో రంగురంగుల పతంగువై ఎచటెచటికో ఎగురుతు పోయే నీ వైపు కళ్ళు విప్పార్చి చూస్తూ కొసని పదిలంగా పట్టుకోవాలి.
ఇక నీ గురించి నీకే కొంచెం చెపుతాను
నువ్వు చాలా మంచిపిల్లవి. మమ్మలెపుడూ చెడ్డవాళ్ళని చేయని మంచి పిల్లవి. చాటుకి తీసికెళ్ళి తొడపాశాలు పెట్టే, గుడ్లురిమి మీది మీది కొచ్చి చెళ్ళుచెళ్ళున చరిచే, చదువూ చదువూ చదువూ అనే గింగుర్ల స్వరంతో నీ బుర్రని ఖాళీ చేసే అమ్మానాన్నలుగా మమ్మల్ని మార్చని చిన్నారివి.
అసలకి నిన్ను పెంచడం ఎంత సులువుగా ఉంటుందంటే… చేత్తో పట్టుకోడానికి వంపు తిరిగిన కాడ ఉన్న చిన్న వెదురు బుట్టలో మెత్తని పక్క పరిచి దూదిలాంటి పిల్లిపిల్లని పడుకోబెట్టి చులాగ్గా చెయ్యూపుకుంటూ నడుస్తున్నట్లుంది.ఒకోసారి మాత్రం చిత్రమైన సందేహం… ఇంతకీ పిల్లిపిల్లవి నువ్వా నేనా అని.!
ఈ రోజు నీకో చిన్న బహుమతిని ఇస్తున్నాను ఈ బహుమతి పధకాన్ని నువ్వు పుట్టగానే రచించాను. నీ ప్రతి పుట్టిన రోజు నాడూ తప్పనిసరిగా ఆ రోజే ఒక ఫోటో స్టూడియోకి తీసుకు వెళ్లి ఫోటోలు తీయించడం నీకు తెలుసు అవన్నీ నీకు ఆల్బం చేసి ఇన్నేళ్ళ తర్వాత ఇవ్వాలనుకున్నానని మాత్రం నీకు తెలీదు .కానీ నేను అనుకోలేదు టెక్నాలజీ ఇంత పెరిగిపోతూ నా కళాత్మకతా స్థాయిని దాటిపోయిందని. రంగుహంగుల క్లిక్కుల ముందు, ఫోటోల పట్ల ఏ మాత్రం సౌందర్య స్పృహ లేని ఈ పాతకాలపు అమ్మ ఇస్తున్న రంగు వెలిసిన కాగితం ముక్కల్లో నిన్ను చూడటం మహాపరాధమే.కానీ పాపాయీ ఈ జ్ఞాపకాలను మణిపూసలుగా మార్చే శక్తి… నిన్ను సొంతం చేసుకోకుండా, ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేయకుండా స్నేహితురాలి వలె నీ పక్కన నడిచిన ఈ అమ్మ ప్రేమకి ఉంది.
మాకు తగినట్లుగా నువ్వు లేవని కాదు గానీ నీకు తగినట్లుగానే నువ్వు లేని కొన్ని విషయాలు గుర్తొచ్చినపుడల్లా విచారంగా ఉంటుంది. పుస్తకాలు చదవవు సంగీతం…ప్మ్చ్… నృత్యం…. కాళ్ళల్లో స్ప్రింగులు ఉన్నట్టు గెంతుతూ ఉంటే మాకు ముచ్చటే కానీ…ఏమి ఆనందమూ !
మా గొప్ప కోసం కాదు తల్లీ…ఎపుడూ మనుషుల్లోనే అన్నీ దొరకవు. మన ఏకాంతంలో మనతో మనం సంభాషణ చేసుకోడానికి పుస్తకమో పాటో బొమ్మలు వేసుకోవడమో ఏదొకటి ఉండొద్దూ!!సరే ఈ మధ్య క్లాస్ రూంలో మీ పడుచుపిల్లల గుసగుసల మధ్య నుంచి ఏరుకొచ్చినట్లున్నావు చేతన్ భగత్ ని. తెగ చదవడం చూసి ఒకరికిద్దరా అని నాన్న బెంబేలెత్తి పోతున్నాడు.నేనేమో అటొచ్చీ ఇటొచ్చీచూసి మురిసిపోతూనే చదువులభారం వద్దనుకున్న తల్లి విలువల భారం మాత్రం మోపవచ్చునా అన్న విచికిత్స లో పడుతున్నాను.
ఆపేస్తానిక… ఇక్కడ నుంచీ ఒక్కో ఫోటో దాచుకున్న నీ పూలనవ్వుల పరిమళాలలోకి ప్రయాణమవ్వు.
స్నిగ్ధా!! పుట్టిన రోజు జేజేలు.

1472857_258511667633049_1921190134_n
నేను పుట్టగానే నాలుగోసారీ ఆడపిల్లేనా అని ఏడ్చిన అమ్మమ్మ నువ్వు పుట్టగానే మళ్ళీ మొహం చిన్న చేసుకుని “అసలకే వేరే కులం అబ్బాయిని చేసుకున్నావు… అందులోనూ ఆడపిల్ల పుట్టిందీ… వాళ్ళ నాన్న రంగు కూడా వచ్చినట్లు లేదు… నిలబడే రంగేనా అని వారం రోజుల పిల్లని అటూ ఇటూ తిప్పి చూస్తుండేది..నాకు బాగానే కోపం వచ్చి చాల్లే ఇక ఊరుకో అని అమ్మమ్మని కసిరేసానులే.ఇక నువ్వు పోట్లాడొద్దు
580858_258511890966360_647894137_n
ఆరో నెలలో తీసాము ఇది.. తొనలు తిరిగిన కాళ్ళతో బంతిలాగా ఉండే నువ్వు మీ తాతయ్య కోపాన్ని బాగా తగ్గించేసి ఎవరూ చూడనపుడు నిన్ను ఎత్తుకుని తెగ ముద్దులాడే వరకూ లాక్కొచ్చేసావు.
1511369_258511944299688_1337007591_n
మొదటి పుట్టిన రోజు సందడిలో అందరూ ఈ పిల్ల మహా బుద్ధిమంతురాలు తినిపించనక్కరలేకుండా చక్కగా పూరీలతో సహా తినేస్తోంది అని కితాబునిచ్చారు.
1520730_258512047633011_956234384_n
రెండో ఏడాది నిండాక… సాయంకాలం ఆరు గంటలు…అరగంటలో సినిమా హాలు లోకి వెళ్ళాలి. నాన్న తన బజాజ్ చేతకాశ్వాన్ని దౌడు తీయిస్తున్నాడు. ఫోటో తీయాలి ఆపమని నేనూ, ఇదేం పిచ్చి! రేపు తీద్దాం లే!అని నాన్నా… హోరాహోరీ నడిచాక నేనే గెలిచి ఒక్క పరుగు లో స్టూడియోలోకి వచ్చి పడ్డాము.పిలకలు మరీ నెత్తి మీదకి ఉన్నాయి చక్కగా దువ్వమని స్టూడియో అబ్బాయి చెప్పాడు. అతనికేం తెలుసు పాపం అలా తప్ప ఇంకెలా వేసినా కయ్యిమని ఆరున్నొక్క రాగం అందుకుంటావని.
1526190_258512127633003_1229119953_n
నిన్ను చక్కని ఫోజులో ఫోటో తీద్దామని నిన్ను మాటల్లో పెట్టడానికి ఫోటోగ్రాఫర్ పాపా నీ చెప్పులు బావున్నాయి నాకు ఇస్తావా అన్నాడు. నా గుండె గుభిల్లుమంది. దానికో కథ ఉంది కదా.. అంతకు వారం కిందటే చిన్నమ్మీ నిన్నలా చెప్పులడిగి నందుకు గానూ ఆ కొత్త చెప్పుల కవర్ ఎవరికీ దొరకకూడదని నాలుగు రోజుల పాటు పక్కలో వేసుకునే పడుకున్నావు !!

1509143_258512184299664_476211131_n
నాలుగో ఏటికి బాగా చిక్కిపోయావు. ఎవరన్నా పలకరిస్తే మూతి అలా చిన్న వంకర తిప్పి సిగ్గునవ్వులు నవ్వుతూ ఉండేదానివి.
1457518_258512274299655_345908886_n
ఐదో ఏడు నాయనమ్మ తాతయ్య చిన్న సందడి చేసారు ఆ రోజు నాకు బాగా జలుబు దగ్గు… బోల్డు పనుల మధ్య నిన్ను పట్టించుకోకపోయినా క్షమించేసావు
1497816_258512427632973_362183830_n
ఆరేళ్ళు నిండేసరికి జుట్టు ఒత్తుగా బుట్ట లాగా వచ్చేసింది. ఈ కేశాలంకరణ లో నిన్ను చూడటం నాకు ఇష్టంగా ఉండేది. అక్షరాలు గుండ్రంగా రాయడం నేర్పించడం కోసం ఒక్క వారం రోజులు పాటు నేను కాలేజీ నుంచి రాగానే నీ దగ్గర కూచునేదాన్ని. జన్మానికంతటికీ నేనో మీ నాన్నో పట్టుదలగా ఏవైనా చెప్పడం…ఆ సందర్భం ఒకటే కదా… ఇంట్లో కూడా చదువు ఇష్ట పూర్వకంగా ఉండాలని నిర్బంధం కాకూడదనీ మా నియమం.చదువుకోమని గట్టిగా చెప్పిన రోజంటూ మరి లేదు కదా. అయినా గానీ ఏం చేసుకోవాలో తెలీనన్ని మార్కులు తెచ్చుకుంటున్నావు.
988842_258512480966301_1768344587_n
ఏడో సంవత్సరపు జ్ఞాపకాలు కాస్య్హ మసకబారాయి.
1513267_258512587632957_1342426339_n
ఎనిమిదో ఏడు మురళీ నగర్ లోని సూర్యోదయా పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నావు అపుడు. రమణి అత్త నీకోసం లంగా మీద డిజైన్ చేయించిపెట్టింది. నీ మీద బోల్డు బరువు మోపడం మొదలైంది.
1527101_258512657632950_257239278_n
తొమ్మిదో పుట్టిన రోజునాడు నేనిచ్చిన బహుమతి నీకు బాగా నచ్చింది. గులాబీ రంగు తగరపు కాయితంలో దాచిపెట్టిన, తొలిగా ఊడిన నీ పాలపన్ను… పుట్టువెంట్రుకలు తీయించినపుడు చాటుగా తీసి దాచుకున్న పక్షి ఈక లాంటి సిగపాయ, పొట్లాలు కట్టి చిన్ని దంతపు భరిణెలో పెట్టి ఇచ్చాను
1524818_258512737632942_1711612491_n
 నాన్న లేకుండా వచ్చిన నీ పుట్టిన రోజు ఇది.ఆ లోటు తెలీకూడదని తాతయ్య నాయనమ్మ అత్త, మావయ్య, సాహితీ, బాబాయి,లక్ష్మిపిన్ని,నాన్న స్నేహితులూ ఇంటికి వచ్చి నీకు బోల్డు బహుమతులు ఇచ్చి వెళ్ళారు నాన్న అనబడే రిమోట్ కంట్రోల్ సాయంతో… ఏం ఉపయోగం!!పడుకోబోయే ముందు నాన్నే ఉండి ఉంటేనా!! అనేసావు
1451992_258512884299594_1866720722_n
ఈ సంవత్సరం దిగిన ఫోటోలు బాగోలేదని నాకు తెలీకుండా చింపేసావు.కోపం వచ్చింది..దానికి మించి బాధ కలిగింది. ఆ దగ్గరి తేదీల్లో జరిగిన ఒక ఫంక్షన్ ఫోటోని ఇక్కడ పెట్టాను
1526904_258513027632913_1338532046_n
ఇది కూడా రెండో ఏడాది ఫోటో లాగా గొడవల ఫోటో. రాత్రి భోజనాలకి మన కుటుంబాల వాళ్ళంతా బైటకి వచ్చాం. మైకేల్ షూమాకర్ మాదిరి మీ నాన్న కారు రయ్యిరయ్యిమని పోనిస్తుండగా ఫోటో తీయించే గొడవ మొదలయింది స్టూడియోలోనే తీయించాలనే చాదస్తం ఏంటి అని నాన్న, ఏమో నేనంతే అని అమ్మ వాదులాడుకుని జగదంబ జంక్షన్ సిగ్నల్ దగ్గర కారు ఆగగానే నానమ్మ సైగని అందుకుని అదేదో సినిమాలోలాగా అటో డోరు ఇటో డోరు టపటప తెరిచేసి మనిద్దరం రోడ్డు పక్కనే ఉన్నఫోటో స్టూడియోలోకి ఒకటే పరుగు
1017203_258513244299558_1507092341_n
 ముందటి ఏడాది గొడవతో బుద్ధిగా నాయనమ్మ వాళ్ళింట్లో…
1505630_258513474299535_1849814205_n
ఇండో అమెరికన్ స్కూల్లో చాలా చురుకైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నావు. అప్పటికి పది రోజుల ముందే వక్తృత్వపు పోటీలో నీకు ప్రధమ బహుమతి వచ్చింది ఏ వ్యాస రచన లోనే రావోచ్చుగా కుదురుగా ఉండేది.. ఎందుకొచ్చిన వక్తృత్వాలు ఇంత గొంతేసుకుని అరవడానికి కాప్పోతే… అంటూ నాన్న జండర్ వివక్ష చూపించి కయ్యానికి కాలు దువ్వాడు. ముందటి ఏడాది నా బుద్ధిమంతతనాన్ని చూసి గుండె కరిగి నాన్న స్వయంగా స్టూడియోకి తీసుకువెళ్ళి ఫోటో తీయించాడు
1532023_258513670966182_2137144571_n
వర్మ అంకుల్ అనిత ఆంటీ నిన్ను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు.చలిగాలిలో మీరంతా నృత్యాలు చేసారు
1476437_258513754299507_131175231_n
ఎడతెగకుండా పారే స్నేహ ప్రవాహాల నది వర్మ అనితల ఇల్లు. ఇక అది మనిల్లు కూడా అయింది ఎపుడూ పది మందికి తక్కువ కాకుండా ఉండే ఇక్కడ పనీ ఎక్కువే ప్రేమా ఎక్కువే. చర్చలూ సమావేశాలూ స్నేహితులూ మంచిభోజనాలు..ఆప్యాయతలు ఇల్లంటే ఇలా కదా ఉండాలి… అంతే మరిక నువ్వూ నేనూ నాన్న రెండ్రోజులు కనపడకపోతే ఎనభై ఏళ్ల వర్మ తల్లిగారు మొదలు మూడేళ్ళ అనిత మేనగోడలు వరకూ గోపాలపట్నం వారేరీ అంటూ కలవరిస్తూనే ఉంటారు కదా!నా లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకున్న అనిత ఈ ఏడు నిన్ను స్టూడియోకి తీసుకెళ్ళింది

988823_258513817632834_2135800293_n
ఇక ఈ రోజు తల్లీ నేను చెప్పాలా!!లోకమంతా ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే గత పది రోజులుగా చీర కొనుక్కుంటానని నువ్వూ అపుడే చీరలేంటి ఇంత చిన్నపిల్లవి అని మీ నాన్నా వాదులాట.. పంచాయితీ వర్మ అంకుల్ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆడపిల్లల విషయాలు నీకెందుకు నువ్వూరుకో అని అనిత ఒక కసురు కసిరాక అపుడు గొడవ తెగి సమస్య సెటిల్ అయింది. పొద్దున్నే నువ్వు చీర కట్టుకుని నాన్న వద్దకి రాగానే పాపం నాన్న… సంభ్రమం ఒక వైపు భయమేదో ఇంకో వైపు.. ఏంటో ఈ తండ్రులు!!నీ బెస్టీ నిశాంత్ ఈ ఫోటో ఇపుడే తీసాడు. సిద్ధూ ఇక కాచుకో విముక్తి ఉత్సవాలు ఏడాది పొడుగూతా చేస్తాము. స్వేచ్చ అంటే స్నేహితులూ సినిమాలూ నచ్చిన అలంకరణలే కాదు. నీ నిద్ర నువ్వే లేవడము కూడా… ఆల్ ద బెస్ట్

చందుకి ప్రేమలేఖ

 

10593187_339391956211686_6969809013156318554_n

చంద్రమా
నాలుగు రోజులనుంచీ ఒకటే ఆలోచన… ఈ రోజుకి నీకేం బహుమతి ఇవ్వాలా అని. పాతూరి పూర్ణచంద్రరావు,అనూరాధలకి కూడా చెప్పా పెట్టకుండా పద్దెనిమిదేళ్ళ కిందట నన్ను నేనే నీకు జీవితకాలపు బహుమతిగా (జోకులెయ్యకేం.. ప్లీజ్.. ) ఇచ్చుకున్నాక కొత్తగా ఏమివ్వగలనన్న నిస్సహాయత ఒకటి.

అయినా సరే ప్రేమగానో తప్పనిసరిగానో నన్ను నాకు ధారాళంగానే తిరిగి ఇచ్చావు కదా.. అక్కడ నిలబడి ఇట్లా ఆలోచిస్తున్నా.. విను మరీ!

పొరుగింటి మీనాక్షమ్మలాగా ముద్దూముచ్చట్ల గురించీ నగలూ చీరెల గురించీ నిన్ను సాధించి పోసి, అట్లా నీ అహాన్ని సంతృప్తి పరిచే బహుమతిని ఇవ్వాలనే ఉన్నది

రాత్రిళ్ళు ఆలస్యంగా వొస్తేనో ,స్నేహితులూ బంధువులతో గడిపితేనో వందసార్లు ఫోన్ చేసి ‘పెళ్ళాం పిల్లా ఇల్లూ పట్టరా’ అంటూ ఇల్లు పీకి పందిరేసే ప్రేమని బహుమతిగా ఇవ్వాలనే ఉన్నది

చందూ , ఏయ్ఓయ్ ,ఏరా ఒరే అన్న గీర పిలుపులు కట్టిపెట్టి ఒద్దికగా చీర కొసలు వేలికి చుట్టుకుంటూ ,వీలయితే తలుపు చాటు చేసుకు నిలబడి గోముగా ‘ఏవండీ’ అంటూ నాటకీయతని బహుమతిగా ఇవ్వాలనే ఉన్నది

కానీ ఏం చేసేది !
నువ్వు మరీ బంగారు తండ్రివి!

బైటపని , ఇంటిపని , వంటపని ,పిల్లపని ఇష్టంగా చేసే స్వీట్ హొమ్ బుచ్చిబాబువి
ఎవరు సాయానికి పిలిచినా బిరబిరా ప్రవహించి వొంట్లో రక్తాన్ని కూడా తోడిచ్చేసే దానకర్ణుడివి
నవ్వో, దయో, అందమో, కారుణ్యమో పలకరిస్తే చాలు చప్పున కళ్ళు తడిదేర్చుకునే నీటిమేఘానివి

ఇల్లాంటి నీకు నేనేం కానుక చేస్తాను గానీ…
అపుడెపుడో ‘సాయం’కాలం జన సమ్మర్ధంలో ఒక తోవ చేసుకుని నేను నీ భుజం మీద చేయి వేసుకుని ధీమాగా నడుస్తుంటే ఆ కాలం ఆగకూడదని మరి నాలుగు వీధులు ఎక్కువ తిరిగాం కదా. అల్లాగే మరి నాలుగు దశాబ్దాలు స్నేహితులకి మల్లే స్వేచ్చగా కలిసి నడుద్దామన్న ఊహని బహుమతిగా ఇస్తున్నాను
ప్రియచందూ…
పుట్టినరోజు శుభాకాంక్షలు

(2014 ఆగస్ట్, 05  నాడు ఫేస్ బుక్ లో రాసిన పోస్ట్. ఈ మధ్య నా బ్లాగ్ ని చూసి పశ్చాత్తాపం కలిగింది. అక్కడా ఇక్కడా జల్లేసినట్లు ఉన్న నా జ్ఞాపకాలు ఇక్కడ సేవ్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను.)

అతని పాదాల వెంట నడచి వచ్చిన చినుకులు

అతని పాదాల వెంట నడచి వచ్చిన చినుకులు
తధాగతా!
లేదని అనుకున్నది లేకపోవడం కాదని, ఉన్నది ఎపుడూ ఉండడం కాదని నాకెందుకు చెపుతావు పదేపదే! అసలకి నేనేమన్నా అడిగానా నా చేయి చూడు. చిన్ని బిక్షా పాత్ర అయినా కనిపించిందా? ఇచ్ఛ వాడుతున్న జీవితాన్ని నిర్లిప్తంగా చూస్తూ నిర్మోహాన్ని సాధన చేస్తూ చెట్టు నీడన కూచున్నాను. అలుపుతో తల నేలకి వంచి విశ్రమించాను. అలజడి లేని నా ఏకాంతం లోకి ఎవరో చొరబడ్డారు. అప్పటికీ నేనేం లేవలేదు. ఎవరొస్తారు! ఎవరు రాగలరు అఖండంగా వెలిగే ఈ నిస్తంత్రీ వనాలలోకి.
గాలి గుసగుసగా వార్తని చెవిన వేసింది. అతడు ఆగతుడు తధాగతుడు వస్తున్నాడు…నిజమా నా స్వామి రాకడ సంభవమా!! రేలపూల మాటు నుంచి మూల మలుపున తధాగతుని పాదాల సవ్వడి. అపుడు చూసాను… ‘అతను నడిచే దారిలో ఆకాశం వంగి నక్షత్రాలను వెదజల్లింది.’ మేఘమాల దారి కాసి కరిగి నీరై అతని పాదాల వెంబడి చినుకులై అనుసరించింది. గాలి ఊపిరి బిగబట్టింది. చివ్వున లేవబోయీ కూలబడ్డాను! ఇంత ఆశ పనికి రాదని తెలిసి, తల్లి దృష్టిని లాక్కునే పిల్ల వలే రోదన స్వరంతో అల్లంత దూరం నుంచి అరిచాను. ‘తధాగతా! కొత్తగా పొడమిన ఈ ఆశని ఏం చేయాలి’ ?
మధ్యేవాది నా స్వామి. నా పన్నాగమును కనిపెట్టీ నన్ను చూడబట్టాడు. నిశ్చేష్టినై వడవడ వణుకుతున్న పెదవుల మాటున వెల్లువెత్తే మాటల్ని గట్టిగా అట్టిపెట్టాను. పెదవి దాటినదే మాట కాదని తెలిసినవాడు తధాగతుడు. ఎదురుగా నిలిచి నన్ను విన్నాడు. అట్లా ఇట్లా వినడం కాదు నిడుపాటి తన చెవులను హృదయానికి అతికించుకుని మరీ విన్నాడు. విని ఇంతే చెప్పాడు. ‘కొన్ని ఆశలు తీర్చుకోవాలి. కొన్ని ఆశలు ఓర్చుకోవాలి. కొన్ని ఆశలు వదులుకోవాలి’. నా స్వామిని గడప ఇవతల నిలబెట్టి నేను వెర్రినై విశ్వమంతా నిండేలా వెక్కి వెక్కి ఏడ్చాను. దుఃఖానికి హేతువు ఉంది. హేతువుకి నివారణ ఉంది. నివారణా మార్గాన్ని ఈ నాడు బోధిసత్వుని పలుకుల నుంచి గ్రహించాను.
(వినయ పిటకము చదువుతూ ఒక వడిలో కొట్టుకు పోతూ…)

సప్తవర్ణ లేఖ – 5

వాడ్రేవు వీరలక్ష్మి గారూ,

నేనూ విమలా ఉత్తరాల్లో ఏవో వూసులాడుకుందాము అనుకున్నపుడు ఊహించలేదు. ఇంత మంచి ప్రేమలేఖ జమిలిగా అందుకుంటామని !! మీరన్నట్లు మన దూరాలను కలిపే దారాలు ఒకటే. మీ లేఖ చదివి మనసు పొంగిపోయింది. తూర్పు నుంచి మీరట్లా అలవోకగా సుతారంగా విసిరిన వెన్నెల పూలు ఇక చాలా రోజులు వెలుగు పరిమళాన్ని వెదజల్లుతాయి ఈ కాలమ్ కి మీ లేఖ ఒక మంచి చేర్పు. థాంక్ యూ

Chinuku March Set -2015 saptavarna lekha (1)