భాండాగారం

బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు

సదరన్ రీజనల్ లాంగ్వేజెస్ సెంటర్ (మైసూర్),తెలుగు శాఖ (కాకతీయ విశ్వ విద్యాలయం),ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ లో జనవరి 27 , 28 , 29 తేదీల్లో సమకాలీన స్త్రీల సాహిత్యం (1990 – 2010) అంశం మీద జాతీయ స్థాయి సెమినార్ జరగనున్నది.ప్రరవే ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మహాసభ ఇది.
 
ఈ సెమినార్ లో నేను బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు అన్న అంశం మీద పత్ర సమర్పణ చేస్తున్నాను. సాహిత్య సంబంధమైన విషయాలున్న స్త్రీల బ్లాగులు తెలియజేయగలరు.మీరు చెప్పే సమాచారం ద్వారా వ్యాసం సమగ్రంగా రావడానికి వీలుంటుంది..నవల,కధ,కవిత్వం,వ్యాసం,లేఖలు,దిన చర్య కధనాలు,జోకులు,ఇలాంటి అంశాలున్న బ్లాగుల్ని సూచించగలరు. తప్పనిసరిగా బ్లాగ్ కోసమే రాసిన అంశాలు ఉండాలి.  .ప్రింట్ లో వచ్చాక బ్లాగ్ లో పోస్ట్ చేసినవి కాకూడదు. బ్లాగ్ పేరు చెప్పినా లింక్ పంపినా malleswari.kn2008@gmail.com  కి గానీ,వ్యాఖ్యలలో గానీ తెలియ జేయగలరు.
 
నాకు తెలిసిన కొన్ని బ్లాగులు.
 
తెలుగు తూలిక
మనసులో మాట
వివాహ భోజనంబు
జాజిపూలు
కృష్ణప్రియ డైరీ
మా గోదావరి
తూర్పూ పడమర
గడ్డిపూలు
వెన్నెల సంతకం
తృష్ణ
మధురవాణి
నా స్పందన
జ్యోతి
sowmya writes
కొత్తావకాయ
రమ్యంగా కుటీరాన
alochanalu.wordpress
మడత పేజీ
 
ఇట్లా కొన్ని బ్లాగుల్ని పరిగణన లోకి తీసుకున్నాను .మరి కొన్నింటిని  బ్లాగు మిత్రులు సూచించగలరు.
 
(కృష్ణ ప్రియా సారీ….నీకిచ్చిన మాటని ఇట్లా నిలబెట్టుకోవాల్సి వస్తోంది.)
 
 

ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

2008 స్వాతి అనిల్ అవార్డ్ పొందిన ‘జీవితానికో సాఫ్ట్ వేర్’ అను నా నవలని ఢిల్లీ  ఐ ఐ టి  ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్ అయిన కల్లూరి శ్యామల గారు ‘software for life’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసారు.ఈ అనువాద నవలని  newaavakaaya.com  అంతర్జాల పత్రికలో 20 నవంబర్ నుంచీ మూడు ఆదివారాల పాటు ప్రచురించి తర్వాత e – book రూపంలో పాఠకులకి  అందుబాటులో ఉంచుతారు.
 
రచయిత పరిచయం లేకపోయినా కేవలం నవల పట్ల ఇష్టంతో అనువాదం చేసి నవలా వస్తువు ఎక్కువ మంది పాఠకులకి చేరాలని తపన పడే కల్లూరి శ్యామల గారికి,శ్యామల గారు సంప్రదించిన వెంటనే ప్రచురణకి తమ అంగీకారాన్ని తెలిపి వెంటనే ప్రచురించిన ఆవకాయ.కాం వారికి,ముఖ్యంగా కడప రఘోత్తమరావు  గారికి  నా ధన్యవాదాలు.
 
 

ప్రపంచీకరణ – చంద్రముఖి.

( ఇక్కడ ‘నేను’ అంటూ చెప్పినవి నా మాటలు కావు.కవి, కధకుడు,’అనేక’దశాబ్ది కవితా సంకలనకర్తల్లో ఒకరైన వంశీ కృష్ణ చెప్పినవి.)
 
“……….నేను ఈ రోజు రెండు సంఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను.చాలా రోజుల క్రితం నాకు ఒంట్లో బాగోక హాస్పిటల్ కి వెళ్ళినపుడు వెయిటింగ్ హాల్ లో నా పక్కన ఒక పెద్ద వయసావిడ కూర్చుంది.ఒక పల్లెటూరి నుంచి ఆవిడ వచ్చినట్లు మాటల మధ్యలో తెలిసింది.చేతిలో సెల్ ఫోన్…కాసేపటికి అది మోగగానే కాల్ లిఫ్ట్ చేసి అవతలి వైపు వాళ్లకి జాగ్రత్తలు చెపుతూ…..
 
‘ఈ రోజు హాస్పటల్ లోనే ఉంచమన్నారు….నేను ఈ రాత్రికి యిక్కడే ఈళ్లకి తోడుగా ఉంటా…నువ్వొక్కదానివే ఇంట్లో ఉండాల మరి…ఇల్లు జాగర్త….తొరగా భోంచేసి పడుకో….అట్టాగే ఎనిమిదింటికి సీరియల్ చూడటం మర్చిపోకు…సీరియల్లో ‘అక్షయ’కి  ఏవౌతుందో ఏంటో…’
బెంగగా అంది ఆవిడ…..ఇది ఒక సంఘటన…
 
ఇక రెండో సంఘటన….
 
మా ఇంటికీ నేను పని చేసే బాంక్ కీ,గంటన్నర ప్రయాణం.ఉదయం ఎనిమిదిన్నరకి వెళితే సాయంత్రం ఆరింటికి బాంక్ పని ముగుస్తుంది.ఏడున్నర,ఎనిమిది మధ్యలో ఇంటికి చేరుకోవచ్చు.కానీ మిత్రులతో కాసిన్ని కబుర్లు చెప్పుకుని ఇంటికి చేరేసరికి ఎపుడూ తొమ్మిదిన్నర దాటుతుంది.’ఆఫీస్ పని కాగానే సరాసరి ఇంటికి ఎందుకు రారు?’ అన్నది నా సహచరి ప్రశ్న.’స్నేహాలు మానవ సంబంధాలకి వన్నె తెస్తాయి కాబట్టి’అన్నది నాకున్న సమాధానం.నాలుగైదేళ్లుగా నాకు చెప్పి చెప్పి విసుగెత్తి పోయిందామె.
 
ఆ రోజు మిత్రులు కలవక తొందరగా ఇంటికి వచ్చేసాను.నా సహచరి టీవీ లో చంద్రముఖి సీరియల్ చూస్తుంటే నేనూ యధాలాపంగా చూసాను.మరుసటి రోజు మిత్రుల వద్ద ఉన్నా చంద్రముఖియే గుర్తు వచ్చింది.ఇంటికొచ్చాక సీరియల్ ఏవైందో అడిగి చెప్పించుకున్నాను.మరుసటి రోజు త్వరగా ఇంటికి వచ్చేసాను….ఆ వారంలో మూడుసార్లు చంద్రముఖి చూసాను….నెల తిరిగే సరికి క్రమం తప్పకుండా చూడడం అలవాటైంది.
 
ఆ నెలంతా గడిచాక నా సహచరి నాతో అంది కదా…. ” మొత్తానికి నాలుగేళ్ళుగా నేను చేయలేని పనిని ఒక్క నెలలో ప్రపంచీకరణ చేసేసింది…”అని.
 
నిజమే కదా!!!
 
పై సంఘటన లో ముసలావిడకీ, ఈ సంఘటనలో నాకూ మధ్య పెద్ద తేడా ఏం లేదు….వ్యక్తుల వ్యక్తిత్వాలను రద్దు చేసి….’మూసలు’గా చేసే శక్తి ప్రపంచీకరణకి ఉందని చెప్పడమే నా ఉద్దేశం……..”
 
( 27 – 2 – 2011  నాడు విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో మొజాయిక్-ఎస్కే ఫౌండేషన్ వారు ‘అనేక’ దశాబ్ది కవితా సంకలన పరిచయ సభ పెట్టారు…ఈ సంకలనానికి ప్రపంచీకరణని నేపధ్యంగా తీసుకోవడం గురించి వంశీకృష్ణ మాట్లాడారు…ఆ ఉపన్యాసం లో కొంత భాగాన్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి అంగీకరించిన వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు…..
– మల్లీశ్వరి.)

ఇవి పాఠకుల కధలు.

నాలుగేళ్ల కిందట దగ్గుమాటి పద్మాకర్ రాసిన ‘యూ టర్న్’ కధని ప్రశంసిస్తూ ”ఇది కధకుల కధ” అన్నారు చోరగుడి జాన్సన్. ఆ మాట నన్ను ఆకర్షించింది.ఒక కధని ప్రభావవంతంగా ఎట్లా చెప్పొచ్చో కధకులకి కూడా మార్గదర్శనం చేసిన కధగా ‘యూ టర్న్’ ని జాన్సన్ పరిగణించారు.
 
సరే…మరి పాఠకుల కధల సంగతేంటి?అన్న ప్రశ్న మొదలైంది నాలో….
 
2007 లో నేను చైతన్య స్రవంతి శిల్పంలో ప్రతి అక్షరాన్నీ చెక్కుతూ ‘ఖాళీ’ అనే కధని రాసాను.అది కధ-2007  లోకి ఎంపికైంది.ఆ కధ చదివాక ఆధునిక సాహిత్యాన్ని బాగా చదువుకున్న మా మాష్టారు అత్తలూరి నరసింహారావుగారు “ఇన్నాళ్ళకి ఒక మంచి కధ రాసావు”అన్నారు.సంతోషించాను.యాదృచ్చికంగా ఆ రోజే ఆ కధ చదివిన మా అమ్మ “ఇన్నాళ్ళూ మంచి కధలే రాసావుగా…ఇపుడేంటీ…ఇలాంటి కధ రాసావు!!!అంది.నివ్వెరపోయాను..
 
అపుడు జ్ఞానోదయమైంది.ఒక కధ రాస్తున్నపుడు మనం ఎంచుకున్న కధా వస్తువుకి టార్గెట్ రీడర్స్ ఎవరో మనకి స్పష్టంగా తెలియాలి.కధా శిల్పాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాలి.ఆ స్పష్టత ఉన్న కధలే పాఠకుల కధలు అవుతాయి.
 
కల్పనా సాహిత్యాన్ని చదువుతున్నపుడు విమర్శకురాలిగానో,కధకురాలిగానో,కాకుండా పాఠకురాలిగా ఉండడంలో ఆనందం ఉంటుంది నాకు.
 
ఈ ఆదివారమంతా పాఠకురాలిగా సంతోషపడుతూ 182 పేజీల్లో, 20 కధలున్న ఒక పుస్తకాన్ని ఏకబిగిన చదివేసాను.నోరు తిరగని పేరున్న ఒక  కధకుడు రాసిన చేయి తిరిగిన కధలున్న ఆ పుస్తకం పేరు ‘ఆ కుటుంబంతో ఒక రోజు’….ఇవి పాఠకుల కధలు అని నిరూపించడానికి పెద్ద పెద్ద సిద్ధాంతాలను వెతుక్కోవాల్సిన అవసరాన్ని తప్పించిన కధకునికి అభినందనలు.
 
ఈ కధా సంపుటిలో నాకు నచ్చిన అంశాలు…..
 

* కధా వస్తువు దేని వెనకా దాక్కోలేదు…స్పష్టత ఉంది.

* ఆస్తికత్వం పట్ల సహనం,నాస్తికత్వంతో మమేకత,మూఢ విశ్వాసాల పట్ల వ్యతిరేకత

*కష్టకాలాల్లోనూ మనుషులు నిలుపుకోవాల్సిన ఆత్మాభిమానం,పెంచుకోవాల్సిన ఆత్మ విశ్వాసం గురించి సరళంగా చెప్పడం

*ఎక్కువెక్కువ జ్ఞానం ఉన్నవారినీ,అంతంత మాత్రం  జ్ఞానం ఉన్నవారిని కూడా చదివించే గుణం ఉన్న శైలి.

*అమెరికాని కధకుడి అభ్యుదయ కోణం నుంచి చూసి కాసేపు గలగలా నవ్వుకోవడం,(దాని వెనుక ఉండే విషాదం సంగతి సరే)
*పుస్తకం ప్రింటింగ్ కి సంబంధించి అన్ని అంశాలూ ఆసక్తిగా అన్పించడం
 
కధలు చదివేపుడు ఇబ్బంది కలిగిన సందర్భాలు.
 
*కొన్ని కధల్లో ఆదర్శాలను యాంత్రికంగా అమలు చేసినట్లు అన్పించడం
*అభ్యుదయ ధోరణి కలిగిన కధల్లోనూ బ్రాహ్మణ పరిభాషని వదులుకోలేకపోవడం
*కధా వస్తువు రిపీట్ కావడం
 
 
 
 
 

కధతో ఒక రోజు

సాహిత్యాన్ని అభిమానించేవాళ్ళు,కధలంటే ప్రాణం పెట్టేవాళ్ళు…సంవత్సరానికి  ఓ రోజు కలిసే చోటది…అది హైదరాబాద్ కావొచ్చు,విశాఖ కావొచ్చు,డిల్లీ కావొచ్చు,బెంగుళూర్ కావొచ్చు. అందులోనూ ఈసారి కధ సాహితి 20ఏళ్ల  పండుగ కూడానూ…
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సాహిత్యకారులతో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నవంబర్ 21వ తారీఖు కళకళలాడింది.
ఉదయం 9 గంటలనుంచీ సాయంత్రం 6 గంటల వరకూ కధావరణంలోగడపడం,అంతమంది సాహిత్యకారులను ఒక చోట కలవడం,
పలకరించుకోవడం,సాహిత్యాన్ని కలబోసుకోవడం…ఫ్రెష్ అయినా భావన కలిగింది.
నేను హరగోపాల్ సాహిత్య ఉపన్యాసాన్ని వినడం  అదే మొదటిసారి .ఇరవయ్యేళ్ళ కధాసాహితి సంపుటిలో ఉన్న కధల లోని సామాజికత మీద మాట్లాడారు.సంక్లిష్టమైన కోణాలని కూడా శ్రోతలకి బాగా కమ్యూనికేట్ అయ్యేలా చెప్పారు.కధల మాస్టారు కాళీపట్నం ఓపిగ్గా నింపాదిగా 20 నిమిషాల పైన మాట్లాడారు.గుడిపాటి ఈ సదస్సుని అటెండ్ చేయడానికి తనకి ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ సాహిత్య,రాజకీయ అంశాల మధ్య ఉండాల్సిన సున్నితమైన రేఖని విశ్లేషించారు.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి ”కొత్త రచయితలు ప్రయోగాలజోలికి పోకుండా వస్తువు మీద దృష్టి పెట్టాలని పదేపదే చెప్పారు. ఈ అభిప్రాయంతో నాకు విభేదం ఉంది. కధావస్తువు తనంత తానే శిల్పాన్ని వెతుక్కుంటుంది అన్న మాటని నేను నమ్ముతాను.
కధ-2009 లోనూ ఇరవయ్యేళ్ళ కధసాహితి సంపుటిలోనూ ఉన్న సుమారు పాతిక మంది కధా రచయితలు తమ తమ కధల నేపధ్యాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఎంతో ఆసక్తిగా,ఇష్టంగా మనం చదివే కధల వెనుక ఉన్న నేపధ్యాన్ని చదివినపుడు మరింత తెలుసుకున్న భావం కలిగింది.
సుమారు 200 మందికి పైగా సాహిత్యకారులు ఈ సదస్సుకి వచ్చారు.అందులో నేను గుర్తు పట్టిన వాళ్ళు,నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించిన సాహితీ బంధువులు వీళ్ళు…..
ప్రొ:హరగోపాల్, కె శ్రీనివాస్, కాళీపట్నం రామారావు, కె.శివారెడ్డి, అబ్బూరి ఛాయాదేవి, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, గుడిపాటి, ఏ.వి.జగన్నాధ శర్మ, శ్రీపతి, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్, కొలకలూరి ఇనాక్, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు, ఆర్.కె., వి.చంద్రశేఖరరావు, మధురాంతకం నరేంద్ర, వాడ్రేవు వీరలక్షీదేవి, కొడవటిగంటి వరూధిని, ఆర్.శాంతసుందరి, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, సతీష్ చంద్ర, దగ్గుమాటి పద్మాకర్, కుప్పిలి పద్మ, సి.సుజాత, వంశీ(డైరక్టర్), వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు, కాట్రగడ్డ దయానంద్, ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్, గొరుసు జగదీశ్వర రెడ్డి, కొండేపూడి నిర్మల, ఘంటసాలనిర్మల, జాజుల గౌరీ, దర్భశయనం శ్రీనివాసాచార్య, అక్కిరాజు భట్టిప్రోలు, యాకూబ్, పెన్నా శివరామకృష్ణ, సి.మృణాలిని, తుమ్మల రామకృష్ణ, కె.వరలక్ష్మి, కె.వి.కూర్మనాద్, జి..యస్.రామ్మోహన్, వేగుంట మోహనప్రసాద్(మో), యాళ్ళ అచ్యుతరామయ్య, మల్లిపురం జగదీశ్, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, సురేష్, బి.పద్మావతి, అరుణ్ సాగర్, పరకాల సుధాకర్, బా రహంతుల్లా, జి.యస్.చలం, పగడాల నాగేందర్, సం.వె.రమేష్, జెన్నీ, కె.యస్.రమణ, తాయమ్మ కరుణ, శ్రీశ్రీవిశ్వేశ్వరరావు, ప్రమీల, రెహనా, శ్రీనివాస్, ముళ్ళపూడి శ్రీనివాస్, వారణాసి నాగలక్ష్మి, శివలక్ష్మి , సమతా రోష్ని, నంబూరి పరిపూర్ణ, దాసరి అమరేంద్ర, అజయప్రసాద్. వర్మ, నారాయణ వేణు, అక్బర్,  ఉదయమిత్ర, డా:నరేంద్రనాద్, జైని మల్లయ గుప్త, వి.రాజారాంమోహన్రావు, ఎన్.రవి, రమేష్ హజారే, నున్నానరేష్, బి మురళీధర్, మనసు ఫౌండేషన్ నాయుడు, పి.చిన్నయ్య, దేశి రాజు, అమర్నాద్, అమరజ్యోతి, శ్రీధర్ ,కాళీపట్నం సుబ్బారావు, వేముగంటి మురళీ కృష్ణ, బ్రహ్మయ్య, ఆర్.రామకృష్ణ, వెలుగు రామినాయుడు, సీత, సుధాకర్ రెడ్డి, శివరావు, చైతన్య,

జాజిమల్లి పుట్టిన రోజు

”నాభావాలను నేనిపుడు ఎక్కువమందితో పంచుకోవచ్చు. ఇక్కడ నాభావాలకి కత్తిరింపులుండవు, ప్రచురణకోసం తిప్పలుండవు. ఈ బ్లాగింటిని నా భావాలతో , అనుభూతులతో సౌందర్యవంతం చేస్తా. స్వేచ్చ నవలలో ఓల్గా చెప్పినట్ట్లు నా ఉనికి సమాజ చలనానికి ఏ కొంచెమయినా ఉపయోగపడటం కోసం ఈ బ్లాగు ను వారధి చేస్తా.”
నా తొలి పోస్ట్ లో రాసుకున్న వాక్యాలివి.
నేను ఈ సంవత్సర కాలంగా బ్లాగ్ పట్ల ఒకటి రెండు సందర్భాల్లో తప్ప చాలా కమిటెడ్ గా వున్నా..నేను బ్లాగ్ మీద కొంత సమయం పెట్టడం పట్ల సాహితీ మిత్రులకి కొంత చిన్న చూపు వుండేది.కధలు నవలలు విరివి గా రాయడం మానేసి బ్లాగింగు కి ఎడిక్ట్ అయిపోతానేమోనని.”అంతర్జాలం  ఒక మాయా జాలం.జాగ్రత్త”  అని నన్ను హెచ్చరించిన మంచికంటి లాంటి మిత్రులు వారానికి ఒకటి రెండు పోస్ట్స్ రాసేస్తూ….తెగ బిజీ అయిపోయారు.

పతంజలి గారు చనిపోయాక ఆయన సాహిత్యం మళ్ళీ చదువుతున్నపుడు  నా రచనల పట్ల నాకు విముఖత ఏర్పడింది.కలం మూసేశాను. ఓ సంవత్సరంన్నర   ఏవీ రాయలేదు…ఆనంద్  పోరు పెట్టి  బ్లాగ్ మొదలు పెట్టించి సాంకేతిక సాయం అందిస్తూ వస్తున్నాడు.అటువంటి సమయంలో నేను బ్లాగ్ లో రాస్తున్న చిన్న చిన్న కధలకి సాహిత్యవిలువలున్నాయనీ అదొక ప్రక్రియగా డెవలప్  చేయమని తన అద్భుత మైన వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన వారు కె.శ్రీనివాస్ గారు…

పి.సత్యవతిగారు,దగ్గుమాటి పద్మాకర్,వర్మ శివలక్షి,రోష్ని విజయభాను,ఎప్పటికపుడు తమ విలువైన అభిప్రాయాలు సూచనలు ఇచ్చేవారు.
నా బ్లాగ్ పోస్ట్స్ మీద పాఠకుడు చాలా విలువైన విమర్శలు చేసారు…ఆ  విశ్లేషణల ముందు  ఒక్క ప్రశంస లేకపోయినా ఏమీ అన్పించదు…నిజమైన సాహిత్య ప్రేమికుడు పాఠకుడు..ఈ మధ్య పోస్ట్స్ రాస్తున్నపుడు మరింత బాధ్యతతో అలోచిస్తున్నానంటే పాఠకుడి లాంటి విమర్శకులే కారణం.
కేక్యూబ్ వర్మ,గాజుల మల్లిక్, చాలా ఆత్మీయంగా బ్లాగ్స్ లో పలకరిస్తారు..రంగనాయకమ్మ వీడియోలని బ్లాగ్ లో పెట్టడంలో కె క్యూబ్ చాలా ఓపికగా సాయం చేసారు.
భావన,సుజాత,జ్యోతి,కృష్ణప్రియ,కొత్తపాళీ,నూతక్కి,తార,చిన్ని,నాగార్జున వేణు,పద్మార్పిత,పద్మప్రియ,సునీతా,శిరీష,రాఘవ,కుమార్.ఎన్,ఇంకా చాలా మంది బ్లాగ్ మిత్రులు తరుచుగా నా బ్లాగ్ కి వచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ మధ్య  పి.సత్యవతి గారు ఓ మాట అన్నారు.”తెలుగు రచయితలు ఇంటర్ నెట్ సాహిత్యాన్ని కూడా చదవాలి. కంప్యుటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ”ఆ మాటలు నిజమే అని ఈ సంవత్సరంలో నేను గ్రహించాను.

ఈ పోస్ట్, పోస్ట్  చేయడానికి ముందు చదివిన మిత్రురాలు ”వోట్ ఆఫ్ థాంక్స్ లా రాసావేంటి?” అంది. నవ్వొచ్చింది.నిజమే కానీ ఎపుడూ రచయితలాగానే కాకుండా అపుడపుడు మాములుగా కూడా మాట్లాడాలనిపిస్తుంది కదా….

రేపే నా బ్లాగ్ పుట్టిన రోజోచ్…

ఈ మధ్య అఫ్సర్ గారు ఇంటర్ నెట్లో తెలుగు సాహిత్యం ,బ్లాగ్ సాహిత్యాల గురించి ఓ ప్రశ్నావళి పంపారు.తీరిక లేకపోవడం సంగతి  పక్కన పెడితే వెబ్ పత్రికలను ఇతర బ్లాగ్స్ ని చదవడం లో నేను వెనక పడే వున్నాను.అందుకే వెంటనే స్పందించలేకపోయాను. జాజిమల్లి బ్లాగ్ పెట్టి ఒక సంవత్సరం అయింది.ఈ సంవత్సరంలో నా బ్లాగ్ నుంచి,ఇతర బ్లాగ్స్ నుంచి, బ్లాగర్స్ నుంచి నేనేం తెలుసుకున్నానో ఓసారి సమీక్షించుకునే ప్రయత్నమే ఈ పోస్ట్.

‘నేనెందుకు బ్లాగ్ తెరిచేను’,’నా గురించి’ నా మొదటి పోస్ట్స్.ముగ్గురు నలుగురు అభినందనలు తెలిపారు.బానే ఉంది అనుకున్నా.తర్వాత ”ఇక్కడన్నీ మగ బోర్దులే” రాసాను.ఇక చూడాలి విమర్శలు…కళ్ళు గిర్రున తిరిగాయి. ఆ పోస్ట్ లో మలక్ పేట్ రౌడీ ‘మచ్చుకి రెండు ఝలక్ లు’ అంటూ కామెంట్ పెట్టి…అంతే పరార్…మళ్ళీ ఇటు వైపు తొంగి చూడలేదు.బహుశా నా బ్లాగ్ మలక్ కి ఝలక్ యిచ్చినట్లుంది.
ప్రింట్ మీడియా లో డిప్లొమాటిక్ విమర్శ లకి  అలవాటుపడిన నాకు ఇక్కడ కొంత అయోమయంగా అన్పించింది….ఇప్పటికీ…అంతే…ఈ మధ్య ఓ రోజంతా తీరిక చేసుకుని బ్లాగ్ ప్రపంచం అంతా చుట్టాను….ఈ మార్తాండ ఎవరో….ఆ ఒంగోలు శీను ఎవరో…ఎవరు చూసినా కత్తి మీద కత్తి గట్టడం ఏంటో, రకరకాల సంఘాలు ఎందుకో  ఏమీ అర్ధం కాలా…కొత్తపాళీని వదలలేదు జ్యోతి,సుజాత,సౌమ్యల్ని వదలలేదు… ఎందుకబ్బా ఇలా కొట్టేసుకుంటున్నారు ఎక్కడ మొదలైంది గొడవ అనుకుని ఎంత వెతికినా ఏ  సమాచారం తెలియలేదు…అపుడపుడు నా బ్లాగ్ కి వచ్చి కామెంట్స్ చేసే తార గారు అక్కడ కన్పించేసరికి కొంచెం ఆసక్తిగా వెతికా….వుహూ…ఏమీ తెలియలేదు…
అందుకే నా సూచన ఏంటంటే బ్లాగర్ల జీవిత చరిత్రలు అని మొదలుపెట్టేసి మొత్తం సమాచారమంతా ఒక చోట చేరిస్తే నాలాంటి ఔత్సాహిక బ్లాగర్లకి చాలా ఉపయుక్తంగా వుంటుంది అని మనవి చేసుకుంటున్నా…

.ఒడ్డున కూర్చుని తగవులు చూడడం నాకేం బాధ లేదు కానీ ఏంటో  ఆ తిట్లే పరమ భీకరం గా ఉంటున్నాయి…కొంచెం అందంగా తిట్టుకోవచ్చుగా ‘మడిసన్నాక కుసింత కలాపోసన ఉండాలి ..లేప్పోతే…’ ఎంచగ్గా ఈ మధ్య ఏదో పత్రిక లో మంచి మంచి సినిమా తిట్లు ఇచ్చారు కూడా….మనకి ఎలాగూ గొప్ప తెలుగు తిట్లు వున్నాయి.కాస్త గ్రాంధికం లో తిట్టుకోవాలంటే బోల్డు తెలుగు పద్యాలున్నాయి…నేను సాయం చేస్తా గానీ బాబ్బాబు…కాస్త అందంగా తిట్టుకోండి

ఇక నా బ్లాగ్ గొడవలోకి వచ్చేస్తా…అక్టోబర్ 30 కి నా బ్లాగ్ పెట్టి సంవత్సరం..71  పోస్ట్స్ రాసా… 605 కామెంట్స్,23,000  హిట్స్ వచ్చాయి.61 కామెంట్స్ తొలగించాల్సిన భాష,భావాలు కలిగి వున్నాయి…అందుకే వాటిని అప్రూవ్  చెయ్యలేదు ముఖ్యంగా ఎపుడూ చక్కగా కామెంట్స్ చేసే నాగార్జున గారు తెలిసో తెలియకో ఓ సారి రెండు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు…అవి తొలగించా.అలాగే తెలంగాణా మీద నేను రాసిన పోస్ట్స్ కి అదుపు తప్పిన విమర్శలు కొన్ని వచ్చాయి.అవీ తొలగించా.

అలాగే నా బ్లాగ్ నడవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న సాహితీ మిత్రుల గురించి, సహ బ్లాగర్ల గురించి,బ్లాగ్ మూలంగా నాకు జరిగిన మేలు గురించీ
రేపటి పోస్టులో రాస్తాను..

రేపే నా బ్లాగ్ పుట్టినరోజోచ్….