పాత మిత్రులే కొత్తగా తెలిసి వచ్చే సందర్భాలు అందరికీ పరిచితాలే. ఆ తెలియరావడం నొప్పించేదిగా ఉంటే మౌనం, ధ్యానం ద్వారా కొంత అధిగమించే ప్రయత్నం చేస్తాము. ఆ తెలియడం వారి వ్యక్తిత్వపు ఔన్నత్యాన్నీ అసాధారణ సౌందర్యాన్నీ పరిచయం చేసినపుడు , వినమ్రత, తడబాటు, మోకరింపుతో మనము శుభ్రపడతాము.
కొకు సాహిత్య సమాలోచన సదస్సు సందర్భంగా నేను, కాత్యాయని గారు, వేణు, వాసిరెడ్డి నవీన్ డిల్లీ వెళ్ళాము. అక్కడ దాసరి అమరేంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. అమరేంద్ర గారు వ్యక్తీకరణతో సహా సున్నిత మనస్కుడు. లోకం పాటించే రీతి రివాజులను పక్కన పెట్టి అంతరంగంలో ధిక్కార పతాక ఎగరేసిన తాత్వికుడు. తిరుగుబాట్లు అన్నివేళలా శబ్దం చేయాల్సిన అవసరం లేదని తను సెలయేరులా ప్రవహిస్తూ తన అట్టడుగున ఉన్న చిన్ని చిన్ని గులకరాళ్ళను మెల్లగా తోసుకుపోయే పథికుడు. లోకం చక్కని మత్తులో సుఖ లాలసతతో పరవశిస్తూ జోగుతున్నపుడు, అమరేంద్ర గారూ! మీరు వంటరులై బహురూపులై మిత్రసహితులై తెల్ల మబ్బుల ఆకాశపు అంచులకి ఆవల ఏముందో వెతకడానికి వెళుతుంటారా! మాకు వీడ్కోలు చెప్పి వెళ్తున్న మిమ్మల్ని చూసినపుడు తీరం వదిలిన వంటరి నౌక ఏకాకి చప్పుడు వినిపించింది ఎందుకో!
దేవరకొండ సుబ్రమణ్యం గారు వ్యక్తీకరణతో సహా భావోద్వేగి. కోపాన్నో సంతోషాన్నో బాధనో దయనో తన వద్ద ఎక్కువ సేపు అట్టిపెట్టుకోలేని పటిక స్వచ్ఛపు పసివాడు. తన కాలమంతా మనుషులతో నింపేసుకోవాలనే తీవ్రతతో తపించి పోయే ఉత్సాహి. ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి పదిన్నర వరకూ 160 కిలోమీటర్ల కారు ప్రయాణంలో మేమెంత చెప్పినా విడువక కారు నడిపారు. సుబ్రహ్మణ్యం గారూ, ఆ రోజు రాత్రి ఎనిమిదిన్నరకి ఉమా చక్రవర్తి ఇంటి నుంచి బయటకి వస్తున్నపుడు అలసటనీ బడలికనీ పంటిబిగువున భరిస్తూ వచ్చిన మీరు తలుపు తీస్తూ కొంచెం తూలారు. మీకు డెబ్భై ఏళ్లన్నది ఆ క్షణం గుర్తొచ్చి చాలా అపరాధంగా అనిపించింది.
అమరేంద్రగారు సుబ్రహ్మణ్యంగారు తమ మంచితనంతో మమ్మల్ని ఎంత ఆశ్చర్య పరిచారో ఘటనలతో సహా చెప్పలేము..సెలయేరు ఉప్పెనై ఆతిథ్యంతో కమ్మేయడమూ, సముద్రం పిల్లకాలువై మా చేతులు నిమరడమూ మాటలతో ఎట్లా చెప్పడం ! ‘ఒక అన్వేషి – ఒక ఉద్వేగి’ ఈ మేలి కలయిక డిల్లీ లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలనీ మాకు దొరికిన ఈ అపురూప సందర్భాలు మిగతా మిత్రులకి కూడా సాకారం కావాలని మా కోరిక.
డిల్లీలో ఇంకా ఎందరో మిత్రుల్ని కలిసాము. తలశిల లక్ష్మిగారు మాకు రుచికరమైన దాల్ రొట్టెలు,వాము పూరీలు తియ్యని పరమాన్నం లాంటి మధురాహారం ఖాళీ లేకుండా సప్లై చేస్తూనే ఉన్నారు. అంత పొందికగా,అందంగా ఉన్న ఇల్లు చూసి చాలా రొజులే అయింది. లక్ష్మిగారిది కోస్తాంధ్ర ప్రాంతపు స్త్రీల కంఠస్వరం. ఉరుము వంటి ధ్వని. ప్రబంధ కవుల పాత ప్రతీకలన్నీ చెల్లాచెదరు. డిల్లీ లో ఏలూరిని విన్నట్లు అనిపించింది. మాకు అమరేంద్ర గారూ లక్ష్మి గారు ఇచ్చిన సిటిజెన్ షిప్ మేము తప్పక ఉపయోగించుకుంటాము.
అమరేంద్ర గారు ఆట పట్టించినట్లుగా నరేంద్ర మోడీ వలే కంటికి కనిపించే తిలక్ గారు వాస్తవంలో విరోధాభాస. నా వరకూ నాకైతే ఫ్రెంచి తత్వవేత్తలూ రష్యన్ రచయితలూ గుర్తొస్తారు ఈ చిద్విలాసిని చూడగానే. థాంక్ యూ తిలక్ గారూ
అక్షరాల్లోకి ఒదగనివి,హృదయ పరివర్తన లోకి మాత్రమే మార్గం చేసుకుని చేరేవి కొన్ని ఉంటాయి. వేణూ నీకు థాంక్స్ చెప్పడం నా అనవసరపు మోడెస్టీ కానీ వసంతనీ మంజీరానీ సాయిబాబా తల్లిగారినీ కలవడం దుఃఖం,భయం, బాధ నిర్వేదం కలిసిన అనుభవం. నీతో ఇంకా మాట్లాడాలి. అలివి కాక పేచీ పెట్టే భావాలను పంచుకోవాలి. ఉమా చక్రవర్తి గారితో నీ మేధో సంభాషణ, షర్మిల పరిచయం కావడం బావుంది వేణూ…
ఈ నాలుగు వాక్యాలు నేను రాసినా బహుసా కాత్యాయని గారి మనసులోనూ ఇట్లానే ఉండొచ్చు. అందుకే మా ఇద్దరి తరుపునా డిల్లీ మిత్రులకి చాలా చాలా థాంక్స్.