బ్లాగర్ పేరు : లలిత
బ్లాగ్ పేరు : నా స్పందన
బ్లాగ్ చిరునామా : http://naaspandhana.blogspot.in/
పుట్టినతేదీ : డిసెంబరు 17 ( అమితాబచ్చన్ గారి కోడలు ఐశ్వర్యా రాయ్ నేనూ ఒక వయసువాళ్ళమే )
పుట్టిన స్థలం : రాజమండ్రి ( పెరిగింది దగ్గరలోని అమ్మమ్మగారి ఊర్లో )
ప్రస్తుత నివాసం : రాజమండ్రి ( మూణ్ణాళ్ళ ముచ్చట – అంతకుముందు – ఆతరువాత , రాజమండ్రి దగ్గర అత్తవారి ఊరు . అంటే అటుతిప్పీ ఇటుతిప్పీ గడిచిన నా జీవితమంతా ఈ గోదారి గట్టునే )
విద్యాభ్యాసం : చా…..లా కష్టపడి బి.ఎ . పూర్తిచేసానండి . నిజవండీ బాబూ ! మా ఊరికొచ్చే ఒకే ఒక ఆర్టీసీ బస్సులో రోజూ 20 కిలోమీటర్ల( రానూ పోనూ 40 అండి) గతుకుల ప్రయాణం అంటే మాటలేంటండీ ఒళ్ళు హూనం అయిపోయేదండీ .
వృత్తి : …………. ప్రస్తుతానికి ఇది ఇలా ఖాళీగా వుండనీయండి . ఎప్పటికయినా, వృత్తి : సీరియస్(ల్) రచయిత్రి అని రాసుకోవలన్నది నా ఆశ ( అత్యాశ – దూ………….రాశ !? )
వ్యాపకాలు : అబ్బో చాలా వున్నాయండి . చదువుకునేరోజుల్లో – ఆటలు, పాటలు , సినిమాలూ, పుస్తకాలు, భావుకత్వపు రాతలు ( ఎక్కువగా ఉత్తరాల్లో ) . మూడుముళ్ళూ పడ్డాకా -కుట్లూ అల్లికలూ, చీరలమీద రంగులు పులమటం .అదేనండీ – ఫేబ్రిక్ పెయింటింగ్ అంటారుకదా ! చెత్తలోంచీ కళారూపాలు సృష్టించడం ( దీన్నే చెత్తకళ అంటారు మా వాళ్ళు) వంటి కాలక్షేపపు కళలు . బ్లాగుల్లోకొచ్చాకా -గత జ్ఞాపకాలు తిరిగొచ్చినట్టూ మరలా చదవటం, వ్రాయటం , ప్లస్ లోని నేస్తాలతో సరదా కబుర్లు – నవ్వులు . అవకాశం దొరికితే 64 కళల్లో ఆరితేరిపోవాలన్న అత్యాశ కలదాన్నండి .అలా కంగారుపడతారెందుకండీ….. ఇప్పటికి 6 అయ్యేపోయాయి ఇక మిగిలింది 4 కదండీ (నా లెక్క ప్రకారం అంతేలెండి )ఆ ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం వీణ పై సరిగమలు సాధన చేస్తున్నాను .
బ్లాగ్ మొదలుపెట్టిన తేది : సెప్టెంబర్ 2008 (అమ్మో…అపుడే అయిదేళ్ళయిపోయిందా)
మొత్తం బ్లాగుపోస్టులు : 155 (ఆ మధ్య ఎప్పుడో…. నాకే చెత్తలా అనిపించిన కొన్ని పోస్టులు దులిపి పారేసాకా మిగిలినవండి )
బ్లాగులోని కేటగిరీలు : నా అలోచనలు, పుస్తకం, సినిమా, సాహిత్యం, సరదాగా, సామాజికం , కతలు, ముచ్చట్లు ఇంకా ….అవీ ఇవీ
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు ?
ఈనాడు లో వచ్చిన ఒక వ్యాసం ద్వారా కంపూకి ( కంప్యూటర్ ) తెలుగు కూడా వచ్చని తెలిసింది. ‘మా నాయనే ‘ అనుకొని ముచ్చటపడ్డా . మొదట్లో నాక్కావలిసినదాని కోసం ఎలా వెతకాలో తెలిసిందికాదు . తెలుగు అని ఇంగ్లీష్ లో అడిగితే ఏవో కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయి కానీ అవి బ్లాగులు కావు. అలాగే విసుగు విరామం లేకుండా వెతగ్గా వెతగ్గా తెవికీ, రచ్చబండ, లేఖిని , ఏదో ఒక బ్లాగు దొరికాయి. అలా తీగలాగుతూ ఒక బ్లాగునుంచీ ఇంకో బ్లాగుకు పాక్కుంటూ పోవటం అక్కడున్నవి చదవటం ‘అబ్బా… వీళ్ళంతా ఎంత మేధావులో కదా !”అని అబ్బురపడటం . బ్లాగులో కామెంట్ ఆ పోస్ట్ చదివిన వాళ్ళెవరయినా వ్రాయొచ్చని తెలీక బ్లాగులన్నీ పుస్తకం చదివినట్టూ చదివి ఊరుకునేదాన్ని . ఒకసారి ఎందుకో సరదాగా వ్యాఖ్య రాయటానికి ప్రయత్నిస్తే ‘నీకు ఈ- మెయిల్ కూడా లేదా చీ..ఫో ‘ అనేసరికి , నాకు రోషం వచ్చి మా చెల్లెల్ని అడిగితే తనే ఒక మెయిల్ తెరిచి ఇచ్చింది . పాస్వర్డ్ కూడా తననే పెట్టమన్నాను – ఏమో బాబూ అవన్నీ నాకెలా తెలుస్తాయ్ అని .
కొన్నాళ్ళు అలా చదువుతూ గడిచాకా, నాకూ ఒక బ్లాగ్ వుంటే బావుండు అనిపించింది . ఏం రాయలేకపోయినా కనీసం నా పేరుతో కామెంట్స్ అయినా పెట్టచ్చుకదా! ఒక వీడియో నాకు దారి చూపించగా నాలుగు రోజులు నానాతంటాలూ పడితే( నానంత తెలివైనదాన్ని మరి ) నాబుజ్జి బ్లాగు వెలిసింది . తిండీ నిద్రా మర్చిపోయి దాన్ని చూసుకుని ఎంత మురిసిపోయానో . ఒక బ్లాగులో నా పేరుతో కామెంట్ రాస్తే, ఆ పేరుమీద నొక్కి నా బ్లాగుకొచ్చినవాళ్ళు “ ఏదో ఒకటి రాయండి “ అనటంతో గొప్ప ఉత్సాహం వచ్చేసి , “నేనేం రాయగలనూ “ అని కొంచెం మొహమాటంగా రాసుకున్న నా మొదటి టపా *** ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు ఇది నా మొదటి పోస్టు కాబట్టి ఓమ్ గనేసయన మహా తో మొదలెట్టి సర్వ విగ్నోప శాంతయే తో అపెస్తున్న.*** ఆయ్….నవ్వకండి
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు ?
అన్నీ మంచి అనుభవాలు-జ్ఞాపకాలే . నేను సీరియస్ బ్లాగర్ ని కాదు కదండీ, ఒట్టి కామెడీ కేండేట్ ని . ఆటలో అరటిపండులా అన్నమాట . దాంతో పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏవీ ఎదురుకాలేదు . నా బ్లాగు పేరు తప్ప మిగిలిన అలంకారాలన్నీ జ్యోతి గారు చేసి పెట్టినవే . ఇప్పటికీ ఏం నేర్చుకోకుండా అది -ఇదీ అని ఆవిడని వేధిస్తూ వుంటాను . అంత చనువు స్వతంత్రం ఎలా వచ్చాయో మరి . ఏదో రాసేద్దామని కాకుండా కేవలం ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేయడం కోసమే కదా బ్లాగు మొదలుపెడుతుందీ అని, నా బ్లాగుపేరు ‘ నా స్పందన’ అని పెట్టుకున్నాను . ఏదో సామెత చెప్పినట్టూ నాలుక వున్నాకా వాగకుండానూ బ్లాగంటూ దొరికాకా బ్లాగకుండానూ ఉండలేం కదండీ. మొదట్లో కవితలు, పాటలు పుస్తకాల్లోంచి కాపీ పోస్ట్ (పేస్ట్) చేసేదాన్ని (అలవాటవ్వటం కోసవన్న మాటండి ) . ఆ తర్వాత నా సొంత గోల మొదలుపెట్టి నెలకి ఆరేడు వాయలు తక్కువకాకుండా దంచి పోసేదాన్ని .
పోస్ట్ వేయడం ,కామెంట్స్ కోసం కాసుకు కూర్చోటం. దయగల బాబులు ఎవరన్నా ఒకటో రెండో మాటలని పోతే ‘ఆహా ఏమి నా భాగ్యము ‘ అని మురిసిపోయి ఆ వేళకి సుఖంగా నిద్రపోవటం . చర్చల్లో పాల్గొనకపోయినా , ‘ విషయం ‘ ఉన్న సీరియస్ టపాలని ,వ్యాఖ్యలనీ శ్రద్ధగా చదువుతూ, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ …నా బ్లాగులో మాత్రం ఎక్కువగా సరదా సంగతులు రాసుకునేదాన్ని. నా రా(వా)తలు బారినపడ్డ కొందరు ‘ యూ…సిల్లీ’ అని సీరియస్ గా అనేసారు. అంతేనా ….. మీరు హాస్యం బాగా వ్రాస్తున్నారు ఇంకా రాయండి, ఇలాగే రాయండి అంటూ నలుగురూ నాలుగు రాయిలతో వెంట పడేసిరికి నేను మరింత ఉత్సాహంగా వ్రాస్తూ పోయాను . చూస్తుండగానే బ్లాగొక్కటే నా వ్యాపకం అయిపోయింది . సినిమా చూసినా, పుస్తకం చదివినా , బ్రేకింగ్ (షాకింగ్) న్యూస్ విన్నా, ఏ పాత సంగతో గుర్తొచ్చినా , మనసులో సరదా ఆలోచన కలిగినా , ఎవరిమీదన్నా కోపమొచ్చినా , నిద్దర్లో కలొచ్చినా, బ్లాగులో బాదేయడం అలవాటయిపోయింది.
మూడేళ్ళు ‘యమోత్సాహం’ తో సాగిన ఈ రాత -కోతలు మెల్లగా నెమ్మదించి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయాయి . బజ్ లోనూ, ప్లస్ లోనూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టాకా బ్లాగు రాయటం, చదవటం తగ్గిపోయింది ( ఇది కాస్త సిగ్గుపడుతూ చెపుతున్న మాట) . మొదట్లో అన్నీ బ్లాగులో వ్రాయతగ్గ విషయాలే అనిపించేవి. ఇప్పుడలా అనిపించడంలేదు. ఏవన్నా చిన్నా చితకా విశేషాలున్నా అవి ప్లస్ లో షేర్ చేస్తే సరిపోతుంది. అదండీ… నా బ్లాగు చరిత్ర . వ్రాయాలనే సరదా వున్నవారికి ఇక్కడ దొరికే ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే . నాలుగు వ్యాఖ్యలు రాయాలని వచ్చిన నాతో నాలుగు పుంజీల కథలు వ్రాయించేసారు . ఈ బ్లాగులు నాకు పరిచయం కాకపోయుంటే అమూల్యమయిన కాలం ఊరికే వ్యర్ధంగా గడిచిపోయుండేది ! అపుడేనా అనిపించిన ఈ అయిదేళ్ళ కాలం నాకు కొన్ని యుగాలుగా తోచేది . సీరియస్ గా ఆలోచిస్తే నా జీవితంలో ఇది తరిగిన కాలం కాదు పెరిగినకాలం . మిమ్మల్ని నవ్విస్తూ, మీతోపాటు నవ్వుకుంటూ ఆనందాన్నీ , ఆయుషును పెంచుకున్న కాలం ( ఊ..నిజంగా సీయస్) . అన్నిటికన్నా ముఖ్యంగా- ఏ జన్మ బంధాలో అనిపించే ఎంచక్కటి స్నేహాలు, పలకరింపులు , సరదాకోసం … పెట్టుకునే గిల్లికజ్జాలు, కొన్నాళ్ళు కనిపించకపోతే ఏవయిపోయారో అన్న పరామర్శలు, కష్ట నష్టాలకి అందివచ్చే సలహలూ ,సూచనలు . ఇదిగో …నాకీ అవకాశం వచ్చిందని చెప్పగానే వచ్చి పడే అభినందనలూ, శుభాకాంక్షలు…..ఏమని చెప్పను , ఎన్నని చెప్పను . ఇవన్నీ కేవలం మన మాటలు, రాతలు చేకూర్చిపెట్టిన బాంధవ్యాలు అని తలుచుకుంటే ఎంత గర్వంగా , తృప్తిగా వుంటుందో .
నాలుగు గోడల మధ్య నుంచీ ఒక విశాల ప్రపంచంలోకి నా ఉనికిని తీసుకెళ్ళిన ఈ బ్లాగులన్నా , తోటి బ్లాగరులన్నా నాకెంతో ఇష్టం, గౌరవం . మీ నవ్వులే నాకు ప్రశంస లయ్యాయి . కాలక్షేపం కోసం వ్రాసిన రాతలే నాకూ కాసింత గుర్తింపును తెచ్చాయి ‘మీ శైలి బావుంది -మా పత్రికలో వేస్తాం సరదాగా వుండే కథలు రాసి పంపండి ‘ అని స్వయంగా ఒక వారపత్రిక సబ్ ఎడిటర్ గారు ఫోన్ లో చెపుతుంటే ఆనందంతో ఎగిరి గంతులేసిన క్షణాల్లో నాకు మీరంతా గుర్తొచ్చారు . …..నిజంగా! “సుజాత గారూ ఇలా ఫోన్ చేయమని మెసేజ్ వచ్చిందండీ , నాకేం తెలీదుకదండీ ఎలా?” నేను నసుగుతుంటే , ఏం పర్లేదు ముందు ఫోన్ చేసి మాట్లాడండి అంటూ ధైర్యం చెప్పి నన్ను ముందుకు తోసారు . నేను సంకోచిస్తూ ఆగిపోయినప్పుడల్లా ఎవరో ఒకరు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు . ఇదిగో ఇప్పుడు కల్పన గారు మీరు రాయగలరు అంటూ సారంగ లో నాకు చోటిచ్చారు . అసలు ,నాకేం తెలుసనీ ….అన్నీ ఒట్టి బెకబెకలు . గట్టిగా ఈదితే నాలుగు బారలు నా ప్రపంచం , తలెత్తి చూస్తే కనపడే దోసెడు ఆకాశం అంతేగా . మా ఊరు, ఇల్లు, పిల్లలు, కుటుంబం, ఇరుగిల్లు పొరిగిల్లు . అసలేం వుంటాయ్ నేను వ్రాయటానికీ మీరు చదవటానికీ . అయినా చదివారు , మెచ్చుకున్నారు , ప్రోత్సహించారు .
ఒక సంగతి చెపితే మీరస్సలు నమ్మరేమో ! ఇంతకుముందు నేను యమా సీరియస్స్ . అంటే పుట్టుకతో కాదు …మధ్యలో పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోయానన్నమాట . ఎవరితోనూ కలవటానికి ఇష్టపడకుండా ‘నాదంతా ఓలోకం- నేనెంతో ప్రత్యేకం ‘ అన్నట్టుండేదాన్ని. దానికే ఈ పాడు ప్రపంచం పొగరని పేరు పెట్టింది . “ ఏం మాట్లాడదు మనసులో ఏం వుందో తెలీదు “అన్నది నా మీద మావాళ్ళకి ఉన్న పెద్ద కంప్లైంట్ …..ఇంటికొచ్చిన వారిని పలకరించడం చాతకాక , చాలా సేపు వంటగదిలోనో, బాత్రూం లోనో వుండిపోయేదాన్ని, బాగా అలవాటయిన వాళ్ళతో తప్ప కొత్తవాళ్లతో నాకు మాటలుండేవి కాదు . ఎవరేం చెప్పినా వింటూ బ్రహ్మానందం టైపులో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూకూర్చునేదాన్ని . ఇక సిగ్గు, మొహమాటం అయితే టన్నులకొద్దీ మోస్తూ తిరిగేదాన్ని. ఎప్పుడయితే బ్లాగు మొదలు పెట్టానో ఇక అప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అవును ఒక బ్లాగ్ నా జీవితాన్నే మార్చేసింది ఇప్పుడు మనిషిని చూస్తే మాట్లాడించ బుద్దేస్తుంది . ఎదురుగా ఎవరూ లేకపోయినా నాతో నేనే మాట్లాడేసుకుంటున్నాను. విసిగిపోయి అబ్బా..చాల్లే వెధవ సోది అని నన్ను నేనే కసురుకుంటున్నాను ఇతరుల బ్లాగుల్లో వ్యాఖలు రాస్తున్నప్పుడే మెల్లగా మొహమాటం, బిడియం, వంటివి వదిలిపోయాయి. మనసులో భావాలను అక్షరాల్లోకి మార్చి అలా చల్లుకుంటూ పోతుంటే ఎన్నేళ్ళుగానో మోస్తున్న బరువంతా మెల్ల మెల్లగా తరిగిపోయింది /కరిగిపోయింది. పగిలిన పత్తి కాయలా అయిపోయాన్నేను. కలా, నిజమూ కాని ఈ ప్రపంచలో నా అభిప్రాయానికీ, ఇష్టానికీ, నవ్వుకూ, విచారానికీ అన్నిటికీ చోటుంది. ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందేపాట అని ఆనందంగా గంతులేస్తుంటే ఇక మనల్ని అడ్డేవాళ్ళు లేరన్న ధైర్యంతో చిన్నప్పటి అల్లరి మళ్ళీ నా జట్టు కట్టేసింది . ఒక్కోసారి ‘ ఏంటా అల్లరి ’ అని నన్ను నేనే విసుక్కొని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది ( ప్లస్ లో నండీ- బ్లాగులో పెద్దమనిషి తరహాలో కొంచెం పద్ధతిగా వుంటాం లెండి) .
ఒకప్పుడు తెలిసినవాళ్ళనయినా పలకరించడానికి బిడియపడే నేను సరాసరి ఒక ప్రముఖ రచయిత్రి ని నేను మీ అభిమానిని అని పరిచయం చేసేసుకుని, మొదటి పరిచయంలోనే నాకు మీ ఇంటర్వ్యూ కావాలని అడిగేంత ధైర్యం చేసేసానంటే గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది ( జంధ్యాల సైట్ లో ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూ నేను చేసిందేనోచ్ ) . ఎందరో మహానుభావుల పరిచయ భాగ్యం కలిగింది .కొందరు రచయితలని స్వయంగా కలిసి మాట్లాడే అవకాశం దొరికింది . ఇంకో విషయం ….బ్లాగులోకి రావడం వల్ల నేను ఇతరులని మనస్ఫూర్తిగా ప్రశంసించడం / అభినందించడం నేర్చుకున్నాను ( దీనిక్కూడా మొహమాటమే అంతకుముందు) . బ్లాగుల్లోనే కాదు బయట కూడా అందరితో కలుపుగోలుగా వుండటం అలవాటయింది..ఒక్క ముక్కలో చెప్పాలంటే నా రాతలవల్ల తెలుగు బ్లాగులకి ఒరిగిందీ, జరిగిందీ ఏం లేకపోయినా బ్లాగులోకి రావటం వల్ల నా వ్యక్తిత్వంలో ఇదివరకూ ఉన్న లోపాలు సవరించుకొని మంచి లక్షణాలు అలవర్చుకునే అవకాశం నాకు దొరికింది. దానివల్ల వ్యక్తిగతంగా నాకు చాలా మేలు జరిగింది .
బ్లాగింగు వలన వుండే సానుకూల అంశాలు , పరిమితులు :
నాకు చాలా గొప్పగా అనిపించే విషయం : పరిచయం కావటానికి ఏ మాత్రం ఆస్కారం లేని మనమంతా ఇక్కడ ఇలా కలిసి ఆలోచనలు వెలిబుచ్చుకోవటం ,విజ్ఞానాన్ని పంచుకోవటం, కబుర్లు కథలు చెప్పుకొని హాయిగా నవ్వుకోవటం, కష్ట సుఖాల్లో తోడ్పాటు అందించుకుంటూ …. పరస్పర ప్రోత్సాహంతో ఎంతో కొంత ముందుకెళ్ళగలగడం . మనసులో భావాలను ఎప్పటికప్పుడు బయట పెట్టేసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది . ఎక్కడో ఏదో ఘోరం జరుగుతుంది. ఆ వార్త మనల్ని చాలా ఆలోచింప చేస్తుంది . దాని గురించి మాట్లాడేస్తే మనకి ఉపశమనం కానీ , ఎవరితో చర్చిస్తాం . మనచుట్టూ మనుషులే కానీ మన గోల వినే సమయం సందర్భం వాళ్ళకి కలిసిరావాలి . బ్లాగులో ఒక టపా కొట్టేస్తే సగం భారం దిగిపోతుంది. ఎంతలేదన్నా ఒకరో ఇద్దరో మనతో గొంతు కలుపుతారు . చర్చ జరుగుతుంది. దాంతో సమస్య పరిష్కారం అయిపోతుందని కాదు కానీ, సమాజం లో జరిగే మంచి చెడులకు స్పందించకుండా జడత్వంతో ఉండిపోవడం కంటే ఇది చాలా మెరుగు కదా . మనం రాసిన కవితో, కథో పత్రికలో వస్తుంది. గెంతుకుంటూ వెళ్ళి కనపడ్డవారికల్లా ఈ వార్త చెపుతాం. అయితే ఏంటీ అన్నట్టు చూస్తారా! …ఉత్సాహం మొత్తం మట్టికొట్టుకుపోతుంది. అదే వార్త బ్లాగులో చెపితే అభినందనలు వెల్లువెత్తుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆ ఆనందం విలువ తెలిసినవాళ్ళు ఉంటారు . వాళ్ళ అభినందనల్లో నిజాయితీ వుంటుంది . నా వరకూ నాకు , బ్లాగుల్లో దొరికిన ప్రోత్సాహంతోనే పత్రికల వరకూ నా కథలు తీసుకెళ్ళగలిగాను . నా దృష్టిలో ఎంతో గొప్పవారైన కొందరు వ్యక్తుల అభినందనలు అందుకోగలిగాను. పరిమితులు : అతి కూడదని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదండీ . ఎవరికి వారే తమ పరిమితులు తెలుసుకు మసులుకుంటే అందరికీ ఆహ్లాదం, ఆనందం.
మహిళా బ్లాగరుగా మీ ప్రత్యేకత :
అత్తగారి కథలు రాసుకోగలగటం
సాహిత్యంతో మీ పరిచయం :
నా అదృష్టం కొద్దీ చాలా చిన్నప్పుడే పుస్తకాలతో స్నేహం కుదిరందండోయ్ . మా లోగిట్లో అందరికీ పుస్తకాలు చదివే అలవాటుండేది . విప్లవ సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంధాలు ఇలా ఏవో ఒకటి . మా మావయ్య అలమారాలో( అమ్మ తమ్ముడు) ఇంగ్లీష్ నవలలు ఉండేవి . పలచని కాగితాల్లో నలుసుల్లాంటి చిన్న చిన్న అక్షరాలతో దిబ్బ రొట్టెల్లా ఇంతింత లావుండేవి . అమ్మో అంత ఇంగ్లీషు ఎలా చదువుతారో అని భయపడేదాన్ని. ఒకసారి బాగా డబ్బులు అవసరం పడి (మొరమరాల ఉండలు తినాలనిపించి ) కొట్లో తూకానికి వెయ్యబోతే వాడు తీసుకోలేదు పొట్లాలు కట్టడానికి పనికి రావని. దాంతో నాకు ఇంగ్లీష్ నవలల మీద అయిష్టం పెరిగిపోయింది .మా లోగిట్లో ఒక వాటాలో సరోజిని అత్తయ్య లైబ్రరీ నడిపేవారు .పావలా అద్దె కట్టకుండా నాలుగు బీరువాల నవలలు నమిలి పారేసాను .
ఆ పక్కవాటాలో చంటి మావయ్య దగ్గర సోవియట్ ( కమ్యూనిస్టు సాహిత్యం అనుకుంటా) రచయితలతో పాటు శ్రీ.శ్రీ, చలం, ఆరుద్ర వంటి దిగ్గజాలు పరిచయం అయ్యారు . అర్ధం కాకపోయినా పట్టుకున్న పుస్తకం పూర్తయ్యేవరకూ వదలకూడదన్న పట్టుదలతో కంటికి కనిపించినవన్నీ చదివేయడమే. వీక్లీ కొనుక్కునే చుట్టాలింటికి వెళ్ళి వచ్చేప్పుడు , బరువనుకుంటే రెండు జతల బట్టలు వదిలేసయినా సరే ఓ కట్ట వీక్లీలు తెచ్చేసుకుని పడీ పడీ చదివేయటం . ఆ వయసుకి వాటినించీ ఏం నేర్చుకోవాలో తెలియకపోయినా …అక్షరాలనీ, ఆ భావలనీ కళ్ళతో తోడుకుని మనసులో ఒంపేసుకోటంలో గొప్ప ఆనందం వుండేది. మా జట్టంతా పోటీలు పడి చదివేవాళ్ళం ( మా లోగిట్లో పేద్ద పిల్లలమంద వుండేది . ఏం చేసినా అందరం కలిసే చేయటం – చివాట్లు తన్నులూ కూడా పక్షపాతం లేకుండా వడ్డించేవారులెండి పెద్దలు) .
నా దగ్గర బహుమతిగా వచ్చిన పుస్తకాలు కూడా ఎక్కువే వున్నాయి . మధ్యలో దాదాపు పదేళ్ళు సాహిత్యానికి దూరంగా వుండిపోయాను . బ్లాగుల్లోకొచ్చాకా కరువు తీరా చదువుకో గల్గుతున్నాను. సరదాగా ఓ సంగతి : నా పెళ్ళికి మా బుల్లి మావయ్య , స్త్రీవాద కవితా సంకలనం బహుమతిగా ఇచ్చారు . నేను కొత్త ముచ్చటలో పడి ఆ పుస్తకాన్ని అటకెక్కించాను. ఎప్పుడో అయిదారేళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలతో వేగుతున్నప్పుడు ఆ పుస్తకం చదివి పేజీకొకటి చప్పున వేడి నిట్టూర్పులు విడిచి చేతులు కాల్చేసి ఆకులు అందించినట్టూ ఇదేం పని బుల్లిమావయ్యా అని మనసులో మధనపడి , ఆ పుస్తకాన్ని మళ్ళీ అటకమీద పెట్టేసి, మాలతీ చందూర్ గారి వంటల పుస్తకం లో తలపెట్టేసాను ప్రశాంతంగా.
నాకు స్త్రీవాద సాహిత్యంతో పరిచయం కలిగింది నీలిమేఘాలతోనే . కారణం విడమర్చి చెప్పలేను కానీ , ఆ లేత వయసుకి ఆ ఖా….రం పడలేదు . ఇప్పుడు చదివినా కొన్ని భావాలు మరీ ఏకపక్షంగా ఉన్నాయనిపిస్తాయి . రంగనాయకమ్మ, ఓల్గా దొరికితే ఎంతో ఇష్టంగా వారి వెంట చివరి వరకూ వెళ్ళి …అబ్బే ఈ మార్గం నాకు నచ్చలేదు అని విబేధిస్తూ వెనక్కి మళ్ళేస్తాను . వ్యక్తి స్వేచ్చ ముఖ్యమే . దాని కోసం కుటుంబ వ్యవస్థని చిన్నా భిన్నం చేయటం నాకు నచ్చదు . చిన్నా పెద్దా అన్ని విషయాల్లోనూ నాదంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవటం, అలాగే ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ అటువైపునుంచి కూడా ఆలోచించగలగడం పుస్తకాలు చదవడం వల్లనే అలవడింది . సమానత్వం సాధించడం అంటే స్త్రీ ప్రకృతి సిద్దమయిన తన ప్రత్యేకతలను కోల్పోయి తాను కూడా పురుషునితో సమానమయిన కాఠిన్యాన్ని సంతరించుకోవటం కాదేమో అని నాకనిపిస్తుంది . అయ్ బాబోయ్….నేనేంటి ఇంత సీరియస్ గా ……. తూచ్…తూచ్… సాహిత్య ప్రక్రియల్లో కథ నాకు చాలా ఇష్టమయినది . ఎప్పటికయినా నా పేరుతో నిలిచిపోయే ఒక్క మంచి కథ రాయాలనేది నేను ఏర్పరుచుకున్న లక్ష్యం
జీవన నేపధ్యం :
మా నాన్నగారిది దేశం అంతా తిరిగాల్సిన ఉద్యోగం . దాంతో నేను అమ్మమ్మ దగ్గరే వుండిపోవాల్సొచ్చింది. మద్రాసు , కేరళ లో ఉండేప్పుడు సెలవుల్లో తీసుకెళ్ళేవారు. హైదరాబాద్ లో మూడేళ్ళు చదివాను . వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మా ఊరొచ్చేసి వ్యవసాయం లో పడ్డారు . మా ఊర్లో టెంత్ మాదే ఫస్ట్ బేచ్ . “మిలట్రీ రాజుగారమ్మాయి పెద్ద పరీచ్చ పేసయ్యేరంట “అని ఊరంతా కోడై కూసింది . అమ్మాయిలని కాలేజ్ కి పంపటం కూడా నాతోనే మొదలయింది. ” ఎందుకమ్మా…..రోజూ పయాణం సేసి నలిగిపోతన్నారు. మీకు సదువెందుకూ మానేసి ఇంట్లో నీడ పట్టున కూకోండమ్మా ” అని కండక్టరు డ్రయివరుతో సహా అందరూ బ్రతిమాలేవారు. నేను వినలా…. !
నాన్నగారి ప్రోత్సాహంతో టైపనీ, హిందీ పరిక్షలనీ అవకాశం వున్నంతవరకూ అన్నీ వెలగబెట్టేసాను . సోషియాలజీ లో పి. జీ చెయ్యాలనుకున్నాను నా అలక్ష్యం వల్ల సాగలేదు. పక్కూరు లో ఓ బుద్ధిమంతుడున్నాడు పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు . అని పెద్దవాళ్ళు పందిట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే , నేను సిగ్గులు ఒలకపోసుకుంటూ వాళ్ళ ముందునుంచీ తుర్రుమని పరిగెట్టా సినిమాటిక్ గా . అంతే…. పిప్పి..ప్పీ…డుం.డుం..డుం. సోగ్గాడు- పండంటికాపురం – పిల్లా పాప – పాడీ పంటా – నిత్యకళ్యాణం పచ్చతోరణం . నా జీవితం నల్లేరుమీద బండి నడకలా సురక్షితంగా, సుఖంగా సాగిపోతున్నా …… చుట్టూ ఉన్న ముళ్ళకంపలాంటి సమాజాన్ని, గాయపడుతున్న తోటివారిని చూసి భయపడుతూ/బాధపడుతూ వుంటాను. పిల్లలతోపాటు నాభయం కూడా పెరుగుతుంది. వాళ్ళని మాతో పాటు పల్లెటూర్లో ఉంచుకోలేం కదా ! ఉన్నదానితో తృప్తిగా గడిపేసే రోజులు కావుగా ఇవి .
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని ?
అలా అడిగేస్తే ఏం చెపుతావండీ ….. ఏమో , ఇదే నా బ్లాగులో పెట్టే చివరి పోస్ట్ కావచ్చు, ఎవరన్నా బ్రతిమాలితే ఇంకో ఆర్నెల్లు ఉండి పోవచ్చు . తీరా బ్లాగు మూసేసి పోయాకా మళ్ళీ మీరంతా గుర్తొస్తే వెంటనే పరిగేట్టుకు వచ్చీయొచ్చు అదండీ .
సరదాగా ఏవన్నా చెప్పండి : బాగా చిన్నప్పుడు మనం ఆడమన్నట్టల్లా ఆడటానికి ఒక గేంగ్ ని వెంట తిప్పుకునేదాన్ని , మరి ఏ కాలం లో అయినా గేంగ్ లీడర్ కి చాలా కష్టాలుంటాయండీ . వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తూ వుండాలి లేపోతే పచ్చి కొట్టేసి పార్టీ పిరాయించేస్తారు. రోజూ సేమ్యా అయిసులు కొని పెట్టాలి . తీర్థాలప్పుడు జీళ్ళు తినిపించి, రంగులరాట్నం ఎక్కించాలి, మన ఖర్మ కాలి ఎవరి వీధిలో అయినా సినిమా వేస్తుంటే వాళ్ళందరికీ టికెట్లు మనమే కొని పెట్టాలి …ఇలాంటి బోల్డు ఖర్చులుంటాయి. అవన్నీ ఎలా వస్తాయ్ …తాతయ్యంటే భయం, అమ్మమ్మని అడిగావనుకోండి మహా అయితే పావలా ఇస్తారు . మన ఖర్చుకి పది రూపాయలన్నా కావాలి. ఇక తప్పక అప్పులు చేయాల్సొచ్చేది. అప్పులోళ్ళు మీ తాతయ్యతో చెపుతాం అని బెదిరిస్తే విధిలేని పరిస్తితుల్లో తాతయ్య జేబు కొల్లగొట్టాల్సి వచ్చేది ( మధ్యాహ్నం భోజనానికొస్తూ మిల్లునించీ జేబు నిండా చిల్లరేసుకొచ్చేవారు. అబ్బా…డబ్బుల మిల్లు కాదండీ , రైసు మిల్లు ) ఇంకా తీరని అప్పులుంటే పండక్కి అమ్మ వచ్చినపుడు తీర్చేసేది లెండి. ఎలా తెలిసేదో వాళ్ళు బస్సు దిగి కాళ్ళు కడుక్కునేసరికే వీధి వాకిట్లో అప్పులోళ్ళు క్యూ కట్టేసేవారు . నేను ధాన్యం గాది కింద దాక్కునిపోయేదాన్ని. మనం చేసిన ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా మరి ఆ మాత్రం భయం లేకపోతే ఎలా . వారానికోసారి రామిండ్రీ నించీ పేపర్ తెప్పించుకుని వారవంతా అదే తిప్పి తిప్పి చదివే తాతాయ్యొకరు నాకు ఫూలన్ దేవి అని పేరు పెట్టారు అప్పట్లో . కొత్త పేరు బావుందే అని మురిసిపోయాను పిచ్చి మాలోకాన్ని . ఆత్మ కథల్లో మాత్రమే రాసుకోవలిసిన అతిగొప్ప రహస్యం ఇది. మీకంటేనా అనిపించి ఇక్కడ చెప్పేసాను. మీరింకెక్కడా చెప్పకండి హుష్….గప్చుప్.
సీరియస్ గా ఏవన్నా చెప్పండి : ఇంకానా , ….అంటే పైన చెప్పినవన్నీ సరదాకనుకున్నారా …భలేవోరే !
మీ బ్లాగ్ లో మీకు నచ్చిన టపా : నిజానికి నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు . మళ్ళీ మళ్ళీ చదివేంత విషయం వున్నవి ఏం లేవు . అయినా అడిగారు కాబట్టి ఇవి చూడండి
http://naaspandhana.blogspot.in/2011/01/blog-post.html http://naaspandhana.blogspot.in/2010/02/blog-post_26.html http://naaspandhana.blogspot.in/2010/01/blog-post_27.html http://naaspandhana.blogspot.in/2010/01/blog-post_09.html http://naaspandhana.blogspot.in/2009/08/blog-post_28.html
చివరిగా ……మనసారా మీతో మరిన్ని మాటలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి ” ఆయ్…సేనా టేంక్సండీ ” .