భాండాగారం

అరుంధతీ రాయ్ ….

అరుంధతీ రాయ్ ….

సామాజిక సమస్యలతో సాహిత్యం ఎంతగా పెనవేసుకోవాలో ఆమె ఆచరణ చెపుతుంది. దానికి ఎంతటి చిత్తశుద్ధి,ధైర్యం,అవగాహన కావాలో ఆమె ఎదుర్కుంటున్న పరిస్తితులు చెపుతాయి.సమకాలీన సమాజంలో అత్యంత శక్తివంత మైన సాహితీవేత్తగా, సామాజిక కార్యకర్తగా, అద్భుతమైన మహిళగా ఆమె గురించి తెలీని వారు అరుదు.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వారు (జూలై 11 వ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఎమెస్కో సాహిత్య నిలయం,దోమల్ గూడ,హైదరాబాద్) అరుంధతీ రాయ్ తో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసారు.గత సంవత్సరంన్నర కాలంగా నేను ఎంత గానో ఎదురు చూసినా రోజు.కానీ అదే రోజు అనివార్యమైన ఉద్యోగ బాధ్యతల కారణంగా విశాఖ నుంచి కదిలే పరిస్తితి లేకపోవడం చాలా బాధిస్తోంది.ఏ మాత్రం అవకాశం ఉన్నా బ్లాగ్ మిత్రులు ఆ మీటింగ్ ని అటెండ్ చేయగలరని ఆశిస్తాను.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావం!

పీఠిక మనలో మనం రచయిత్రుల వేదిక ‘ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక’  గా పూర్తి స్థాయి నిర్మాణాన్నిపొందిన విధానం నేపధ్యం ఆంధ్ర జ్యోతి లో వచ్చిన ఈ కింది వ్యాసం లో చదవగలరు.

vividhamain

గత ఏడాదిగా పని చేస్తున్న ‘మనలోమనం’ రచయిత్రుల తాత్కాలిక ఉమ్మడి వేదిక 2010 ఫిబ్రవరి 28న విశాఖపట్నంలో ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’గా కొత్త నిర్మాణ రూపాన్ని తీసుకొన్నది. ఐక్యత, ఘర్షణ అన్న వైరుధ్యాల నుంచి చేవదేరిన రూపమిది. భావాల మధ్య ఘర్షణ వ్యక్తుల మధ్య ఐక్యత దీని బలం. భిన్న సామాజిక అస్తిత్వాల నుంచి విభిన్నమైన జీవితానుభవాలు, సంవేదనలు వున్న స్త్రీలు రచయితలుగా ఒక సంభాషణలోకి, ఘర్షణలోకి దిగడం ఈ భిన్న సామాజిక వర్గాల అనుభవాలను ప్రతి స్త్రీ స్వాయత్తం చేసుకోవాలన్న లక్ష్యాన్ని చేరడానికే. జండర్ సూత్రం ప్రాతిపదికగా రచయిత్రుల మధ్య ఐక్యతాభివృద్ధికి ప్రాతిపదిక అదే.

కెఎన్ మల్లీశ్వరి చొరవతో కె.అనురాధ, ఇపీఎన్ భాగ్యలక్ష్మి, నారాయణ వేణు, వర్మ సభ్యులుగా ఏర్పడిన ‘మనలో మనం’ నిర్వహణ కమిటీ 2008 డిసెంబర్ నాటికే ఆంధ్ర దేశంలో తెలుగు రచయిత్రుల ఉమ్మడి వేదిక గురించిన ఆలోచనలను, అభిప్రాయాలను సమీకరించడం మొదలుపెట్టింది. భిన్న ఆకాంక్షలున్న రచయిత్రులు ఒక ఉమ్మడి వేదిక అవసరాన్ని గుర్తించి ఒక పూనికతో 2009 జనవరి 10,11 తేదిల్లో విశాఖలో జరిగిన రచయిత్రుల సమావేశానికి హాజరయ్యారు. పితృస్వామిక అణచివేతకు, కుల మత వర్గ ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకంగా స్పందించే జీవ లక్షణంతో భిన్న అస్తిత్వాలను గురించిన స్పృహతోనే ఏకోన్ముఖంగా సాగగల ఒక స్వతంత్ర నిర్మాణం గురించిన అభిప్రాయాలు ఆ సభలో బలంగా చర్చకు వచ్చాయి.

అప్పటికప్పుడే ఒక నిర్మాణంలోకి రావడం కన్నా ఒక సంవత్సరం పాటు పని చేస్తూ, పని చేసే క్రమంలో లక్ష్యంవైపు నడకను గతి తప్పకుండా నిర్ధారించుకొంటూ ఒక విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవడం మేలని చాలామంది భావించారు. ఫలితంగా ప్రాంతాల వారీ, భిన్న సామాజిక అస్తిత్వాల వారీ ప్రతినిధులతో ఒక తాత్కాలిక కమిటీ ఏర్పడింది. మొత్తం సాహిత్యంలో స్త్రీల సాహిత్యం నిర్లక్ష్యానికి గురయితే స్త్రీల సాహిత్యంలో దళిత మైనారిటీల సాహిత్యం అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యానికి గురయిందన్న ఆవేదనతో కూడిన ఆరోపణ వచ్చిన సందర్భంలో ఏడాదిలోగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలవారీగా ఆయా ప్రాంతాల స్త్రీల సాహిత్యాన్ని సమీకరించి విశ్లేషించే పనితోపాటు మొత్తంగా దళిత, ముస్లిమ్ మైనారిటీ, బీసీ, క్రైస్తవ మైనారిటీ ఆదివాసీ స్త్రీల సాహిత్య కృషిని ప్రత్యేకంగా సమీక్షించాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారమే 2009 మార్చి నుంచి 2010 ఫిబ్రవరి వరకు వరంగల్లు, కడప, గుంటూరు, విశాఖలలో వరుసగా నాలుగు సభలు జరిగాయి.

‘వికేంద్రీకరణ’ నిర్వహణలోనైనా, అధ్యయనంలోనైనా ఎక్కువ మందిని భాగస్వాములను చేయగలుగుతుంది. ఒక్కొక్క సభకు సంబంధించిన పనులను ఆయా ప్రాంతాలకు చెందిన ఇద్దరు ముగ్గురితో కలిపి ఏర్పడిన నిర్వాహక కమిటీ చూసుకొనే విధానం ఆ సూత్రం నుంచే రూపొందింది. ఎవరు ఏ విషయం మీద మాట్లాడితే బాగుంటుందో గుర్తించి వారితో సంప్రదించి ఆయా సాహిత్యాంశాలపై వక్తలను నిర్ధారించడం దగ్గర నుంచి ఆ సద స్సు పూర్తయ్యే వరకు ఆయా కమిటీలే పూర్తి బాధ్యత వహించి పని చేశాయి. నిర్వహణ సామర్థ్యం, నిబద్ధత, ఉత్సాహం వున్నవారినెందరినో తెలుసుకొనడానికి ఈ అనుభవం చాలా ఉపయోగపడింది. అలాగే ఆయా సదస్సులలో వక్తలుగా కూడా కొత్త కొత్త వారిని తెలుసుకోగలిగాం. వేదిక మీది నుంచి మాట్లాడే అవకాశం ఏ ఒక్కరి గుత్తసొమ్మో కాదు కాకూడదు. అన్న దృష్టితోనే ఈ సభలు నిర్వహించబడ్డాయి.

ప్రాంతీయ అస్తిత్వం, భిన్న సామాజిక అస్తిత్వాలు ప్రాతిపదికగా ఆ ఏడాది కాలంలో జరిగిన ఈ నాలుగు సదస్సులు ప్రాంతీయ అస్తిత్వాల నిర్థారణలో వుంటే పరిధులను, పరిమితులను, అస్తిత్వానికి, అస్తిత్వ చైతన్యానికి వుండే భేదాలను, అస్తిత్వాల గురించిన సైద్ధాంతిక చర్చలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడ్డాయి. స్త్రీల ఉద్యమాలకు స్త్రీల సాహిత్యానికి మధ్య ఏదో ఒక మేరకు సంబంధం వుండాలని, స్త్రీల దృష్టికోణం ఆ సాహిత్యంలో ప్రధాన విలువగా వుండాలని మనం అనుకొంటున్నాం.

నిజమే కానీ స్త్రీలకు ఉద్యమాలతో ప్రత్యేకించి స్త్రీల ఉద్యమాలతో సంబంధం వుండే సామాజిక సాంస్కృతిక అవకాశాలు బయటివి కావచ్చు, తమలోపలివి కావచ్చు. ఏ మేరకు వున్నాయి? భిన్న అస్తిత్వ చైతన్యాలకు గానీ, స్త్రీవాదాన్ని గానీ అర్థం చేసుకొని స్త్రీల దృష్టికోణాన్ని అభివృద్ధి పరుచుకొనే విశాలతలోకి విస్తరించకుండా స్త్రీలను నిరోధించే శక్తుల మాటేమిటి? అంతేకాదు స్త్రీల ఉద్యమాలకు, స్త్రీలు పాల్గొనే ఉద్యమాలకు వుండే భిన్న స్వరూప స్వభావ ప్రయోజన భేదాలను బట్టి స్త్రీల దృష్టికోణం తరతమ భేదాలతో రూపొందదా? అలాగే స్త్రీల దృష్టికోణాన్ని అభివృద్ధి పరుచుకొనే ప్రక్రియలోకి స్త్రీలందరూ ఒకేసారి ప్రవేశించగలరా? ఒకే చైతన్య స్థాయికి చేరుకోగలరా? ఈ మొదలైన ప్రశ్నలిప్పుడు మనముందున్నాయి. వీటికి జవాబులు వెతుక్కొనే దిశగా ఎంత హెచ్చరికగా పని చేయాల్సిన బాధ్యత రచయిత్రులకు వున్నదో స్పష్టమైన సందర్భమిది.

కడప సదస్సులో ముస్లిం మైనారిటీ స్త్రీల సాహిత్యంపైన చర్చ జరిగిన సందర్భంలో ఎదురైన సంఘర్షణ ఇలాంటిదే. ‘మనలోమనం’లో భాగంగా వుండటానికి ఉత్సాహంగా వచ్చిన ముస్లిం రచయితలు సామాజిక అసమానతలను వ్యతిరేకించే వారే. సమకాలీన సామాజిక ఉద్యమాలలోకి చొరవగా భాగస్వాములవుతున్న వాళ్లే. ముస్లిం స్త్రీలు సంఘటితం కావాలని కూడా వాళ్లనుకొన్నారు. అయితే వాళ్ల కార్యకలాపమంతా బురఖా సంప్రదాయ పరిధికి లోబడినదే. స్త్రీల సమస్యకు మతానికి వుండే సంబంధం వాళ్ల అవగాహనకు ఇంకా రాలేదు.

అందువల్లనే బురఖాను నిరసించడంపై, ముస్లిం స్త్రీల మీద మతాధిపత్యాన్ని ధిక్కరిం చడంపై వాళ్లు వ్యతిరేకంగా స్పందించారు. ఒకే మతంలోని స్త్రీల చైతన్యస్థాయి, దృష్టి కోణాలలోని వైరుధ్య ఫలితమిది. ఇది ఏ మత సమాజంలోనైనా వుండేదే. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకొంటూ అభ్యుదయ శక్తుల పక్షాన నిలబడటం, స్త్రీల అవగాహనను అభివృద్ధి పరచడం ఈ వేదిక ముందున్న సవాల్ అని అప్పుడే అర్థమైంది.

అదేవిధంగా గుంటూరు సదస్సులో క్రైస్తవ మైనారిటీ సాహిత్య సమావేశం మరొక సవాలును ముందుకు తెచ్చింది. తొలితరం స్త్రీల రచనలు వివిధ జీవిత సందర్భాల నుంచి క్రీస్తు మహిమలను కీర్తించేవే. క్రైస్తవ మైనారిటీ అస్తిత్వ చేతనలో మతానికి సంబంధించిన విమర్శ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ స్థితిలో క్రైస్తవ మైనారిటీ స్త్రీల సాహిత్యంపై వక్తలు మాట్లాడుతున్నంతసేపూ ఇదేమి క్రైస్తవ మత ప్రచార సభనా అన్న అసహనం ఇవతలి వైపు నుంచి కొంత వ్యక్తమైంది. ఈ రకమైన అసహనం ‘మనలోమనం’ ఉమ్మడి వేదిక మూల సూత్రానికే భంగకరం. పితృస్వామిక వ్యవస్థలలో ఒకటిగా స్త్రీల జీవితాన్నే కాదు, ఆలోచనలను, సృజనాత్మక శక్తులను కూడా శాసించే శక్తి మతం అని మనకు తెలుసు.

హిందూ సమాజానికి చెందిన తొలి తరం రచయితల సాహిత్య వస్తువు శ్రావణ మాసపు మంగళ గౌరీ వ్రతాలతో, వరలక్ష్మీ వ్రతాలతో ముడి పడి వున్నదే. ఆ స్థితి నుంచి స్త్రీలు సాగించిన ప్రస్థానమంతా సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవసరమైందే. అందువల్ల ఇది మత సాహిత్యం అని నిరాకరించటం కాక స్త్రీల సాహిత్యంగా నమోదు చేయటం ముందు జరగాల్సిన పని. స్త్రీల సాహిత్య సృజన శక్తుల అభివృద్ధికి వున్న సామాజిక మత రాజకీయార్థిక అవరోధాలను గురించి విమర్శ పెట్టడం, వాటిని అధిగమించే దిశగా నూతన ప్రజాస్వామిక చైతన్యాన్ని అందించడం ఆ తరువాత చేయాల్సిన పని, అన్న అవగాహనతో పని చేసినప్పుడు అలాంటి అసహనాలకు తావుండదు.

ఈ పని అంత సులువైనదేమీ కాదు. సదస్సులో ఆయా అంశాల మీద మాట్లాడిన వాళ్లు అసలా రచనల సేకరణకే ఎంతో తండ్లాడవలసి వచ్చింది. మనకు తెలియని మన రచయిత్రులను వెతికి సాహిత్య చరిత్రలోకి, చర్చలోకి ప్రవేశ పెట్టడానికి సామూహికంగా జరిపిన ప్రారంభ ప్రయత్నాలివి. ఈ మార్గంలో జరగాల్సిన పని ఇంకెంత వుందో అర్థమవుతూ వస్తున్నది. మొదట విశాఖ సభలో ఏర్పడ్డ మనలోమనం తాత్కాలిక కమిటీలో ఆదివాసీ ప్రతినిధి స్థానాన్ని భర్తీ చేసుకోలేని స్థితిలో వున్న వాళ్లం, మొన్నటి విశాఖ సదస్సు నాటికి ఆదివాసీ రచయిత్రి అనసూయను కనుక్కోగలిగాం. ఇట్లా పని క్రమంలో ఏడాదిగా చేసిన ప్రయాణం ఇచ్చిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తు పట్ల ఆశ, నమ్మకం ఈనాడు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడటానికి దారితీశాయి.

రచనకు సమాజానికి, రచయితకు సామాజిక కార్యాచరణకు అనుసంధానాన్ని సమకూర్చుకొంటూ స్త్రీల సాహిత్యాన్ని గుణోపేతంగా అభివృద్ధి పరుచుకొనటం, రచయిత్రుల మధ్య వైరుధ్యాలు మిత్రపూరితమైనవే కానీ శుత్రుపూరితమైనవి కాదన్న అవగాహనను పెంచుతూ స్నేహపూర్వక సంభాషణకు ఎప్పుడూ తావుండే విధంగా వాతావరణాన్ని కల్పించడం ఈ వేదిక ముందున్న కర్తవ్యాలు.

– డా.చల్లపల్లి స్వరూపరాణి అధ్యక్షురాలు
– డా.కాత్యాయనీ విద్మహే ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

అలాగే వేదిక ప్రకటించిన లక్ష్య ప్రకటన కూడా  క్రింది పీఠిక లో చదువగలరు…..

పీఠిక

ఇన్ని కొప్పులు ఒక చోట కలిస్తే… ఇంతే మరి …ఇట్లానే జరుగుతుంది

రెండు కొప్పులు ఒక చోట కలిస్తే ఏమవుతుంది? చిలికి చిలికి గాలివానవుతుంది..నివారించలేని యుద్ధమవుతుంది ..చాలా మందికి వినోద కారణమవుతుంది…మన అలవాటయిన నిర్ధారణలకి అలంబనమవుతుంది…..కానీ గత సంవత్సరం నాలుగు నెలలకు పైగా తెలుగు రచయిత్రులంతా ఈ పాత,మోటు సామెతలకి భిన్నంగా తరుచుగా కలుస్తున్నారు ….అభిప్రాయాలూ కలబోసుకుంటున్నారు సమస్య ఒక్కరిదైనా  అందరు  పోరాడుతున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా ఒక నిర్మాణయుతమైన వేదికను ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పటి వరకూ ‘మనలో మనం’ రచయిత్రుల తాత్కాలిక వేదిక గా వున్న వేదిక ఫిబ్రవరి 28 తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం టి.ఎల్.ఎన్ సభా హాల్ లో జరిగిన రెండు రోజుల సదస్సులో ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ గా పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొందింది.


సుమారు 100 మంది  రచయిత్రుల సమక్షంలో చల్లపల్లి స్వరూపరాణి అధ్యక్షురాలిగా ,కాత్యాయనీ విద్మహే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు . ఇంత కాలం విస్మరించబడిన  స్త్రీల సాహిత్య చరిత్రని సమగ్రం చేసుకోవడం, స్త్రీల సాహిత్యాన్ని ప్రజా ఉద్యమాలతో అనుసంధానించడం లాంటి లక్ష్యాలతో వేదిక పని చేస్తుంది. పూర్తి వివరాలతో ఇంకో పోస్ట్ రాస్తాను