

file:///C:/Users/singa/Downloads/malleswari%20garu.pdf
నీల
20.1.2018 జిల్లా కేంద్ర గ్రంథాలయం, ఏలూరు
—————————
హఠాత్తుగా కొద్దిరోజుల క్రితం తానా పురస్కారం అందుకొన్న నవలగా ‘నీల’ గురించి పాఠకలోకానికి సమాచారం. ఏ పత్రికలోనూ సీరియల్ గా రాలేదు. 550 పుటల మేర విస్తరించిన నవల అని తెలిసే అవకాశమూ లేదు. (1986-2011) కాలాల మధ్య ఉత్తరాంధ్ర మొదలు భాగ్యనగరం వరకు కథాకాలంలో నెలకొన్న కొన్ని వాస్తవాలకు అక్షరరూపం. నిజం ఎక్కువగా, కథనాన్ని ఆశ్రయించిన నవల. కల్పన చాలా తక్కువ.
25 ఏళ్ళలో మూడు తరాల మేర విస్తరించిన కథ ఇది.
మన పొరుగున ఉన్న వేంపాడు గ్రామంలో పాతూరి పూర్ణచంద్ర రావు, అనూరాధ గారల అమ్మాయిల్లో మల్లీశ్వరి మాత్రమే రాయగలిగిన నవల. చాలామంది రచయితలకు లొంగని కథ. ఈ నవల మహిళ మాత్రమే తెలుగు పాఠకులందరి కోసం రాయగలిగిన నవల.
ప్రణాళిక మొదలు స్పృశించిన ప్రతి అంశం వెనుక అపార పరిశోధన ఉంది. పరిశీలన ఉంది. అనితర సాధ్యమైన అధ్యయనం ఉంది. నిశితమైన విశ్లేషణ ఉంది. పరిమళించే మానవత్వం ఉంది. ఉండవలసినంత క్షమ ఉంది. పొరలు పొరలుగా విస్తరించే జీవితంలో రకరకాల సంకటాల, ఘర్షణల రహస్యాలున్నాయి. కవిత్వం ఉంది
స్త్రీ పురుషసంబంధాల్లో ఎవరు ఏమి కోరుకుంటున్నారు, స్వాభిమానం ఉన్న మహిళ ఏమికోరుకుంటుంది అన్న విషయాలకు సంబంధించి గాఢమైన చర్చ ఉంది అన్నింటినీ మించి స్త్రీ పురుషుల మధ్య జీవితంలో లైంగిక బంధానికి – ప్రేమకు గల అంతరాన్ని చెప్పిన తీరు, ‘నీల’ను ఒకటికి రెండుమార్లు చదివేలా చేస్తుంది.
నీతి – అవినీతి అనే పడికట్టు పదాల పరిధి దాటిన నిజాయితీ ముఖ్యం. ప్రేమించడం,ప్రేమించబడడం ఉన్నతమైనవే కానీ క్షమించగలగడం సర్వోన్నతం అని గ్రహిస్తాం. క్షమించగలగడం వరకూ మనిషి ఎదిగితే జీవితానికి పరిపూర్ణత ఉంటుంది. అదేదో దేవుడు చేసిన పని మనమే చేసినట్టుగ ఉంటుంది. ఇదంతా మన గ్రహణలోకి రావాలంటే ‘నీల’ ను అధ్యయనం చేయాలి. చలం సమకాలీన సమాజంలో కంటే తర్వాతే అర్థం కావడం జరిగింది కాని మల్లీశ్వరి ‘నీల’ను సమకాలీన సమాజం పట్టించుకోవలసిన అవసరం ఉంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వెల్లివిరిసేందుకు నీలను పట్టించుకుని అధ్యయనం చేయాలి.
ఇప్పటి సమాజంలో ఒంటరిగా ఉంటున్న మహిళలు, వివాహంతో ప్రమేయం లేకుండా కేవలనమ్మకంతో సహజీవనం చేస్తున్న స్త్రీ పురుషులు, వైవాహిక బంధాన్ని గౌరవించలేక, వ్యామోహాలను కట్టడి చేసుకోలేక ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నారో తెలియక వంచనలో, దుఃఖంతో హింసతో నలుగుతున్న జీవితాలూ నవలలో కనిపిస్తాయి.
ఈ సమాజంలో కులమతాలూ, సంపన్నులూ, సామాన్యులూ, నిరుపేదలు ఉన్నారు. నిరసనలూ, ఉద్యమాలూ, పోరుబాటలూ, పథకాలూ ఉన్నాయి. వీటి చుట్టూ అల్లుకున్న కథలూ ఉన్నాయి. 1986 డిసెంబర్ 19 న ఏలూరులో నాలుగైదు వేల కార్మికుల జీవనోపాధికి కేంద్రమైన జ్యూట్ మిల్ లాకౌట్ గురించి, అది సృష్టించిన సంక్షోభం గురించి మనలాంటి మధ్య తరగతి ప్రజలకు, మూడింట రెండు వంతుల మందికి వార్తగా మాత్రమే తెలుసు
ఓ పదిపైసలు తక్కువకు రిక్షా దొరుకుతుందంటే, ఇంట్లో పని పాటలకు విరివిగా మనుషులు దొరుకుతున్నారంటే – మనకు కలిసివచ్చే పది పైసల గురించే తప్ప దాని వెనుక దాగిన దుఃఖం, ఘర్షణ, పోరాటం మనకు తెలియవు.
ఓ రకంగా మనవి సాగుబడి జీవితాలు. బ్రతుకు తెరువును వెతుక్కుంటూ నమ్మి వచ్చిన వాళ్ళ జీవితం తెలియదు. రాజకీయ నాయకులకు మాత్రం కార్మికుల ఓట్లు కావాలి. యజమానుల నిధులూ కావాలి. నాయకులు కూడా సమస్యలను కోరినంతగా పరిష్కారాలను పట్టించుకోరు.
ఈ నేపథ్యంలో, తాగుడుకు బానిసై కుటుంబ భారం వీసం మోయని పరిశికి కుట్టుపని చేసి గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చంద్రకళకు జన్మించిన బిడ్డగా నీలను ఏలూరు చోళదిబ్బలో తొలిగా చూస్తాం. చివరిలో ప్రముఖ న్యాయవాది సదాశివతో జీవితాన్ని పంచుకున్న సహచరిగా చూస్తాం. ఏలూరు మొదలు రాజమండ్రి, విశాఖ తప్ప హైదరాబాద్ వరకు నీలతో పాటే నవలలో పాస్టరమ్మ కనబడతారు
నీల, ప్రసాద్ సరళ -రాజమండ్రి
నీల పరదేశి (నీల పెట్టిన పేరు) చేతన — విశాఖ
నీల సదాశివ వసుంధర — హైదరాబాద్ ప్రధాన భూమికలుగా రచన సాగుతుంది.
ఆరంజ్యోతి, స్టాలిన్ సూర్యం, ఆటో రాజు తొలిదశలోనూ సంపూర,్ణ రెడ్డియ్య శుభాంజలి రత్నాకర్ రాధాకృష్ణ మలిదశలోనూ ఏలూరులో మనల్ని పలకరిస్తారు. స్టాలిన్ సూర్యం పాత్ర మాత్రం చివరివరకూ పరోక్షంగా పలకరిస్తూనే ఉంటుంది. స్టాలిన్ సూర్యం,బహుశా నీలలో ఒక పార్స్వంగా ఉండిపోయిందేమో.
వైజాగ్ లో పైడమ్మ అనుభవాలు మనలను ఆర్ద్రంగా చేస్తాయి. ఉత్తరాంధ్ర జీవితంలో మనకు తెలియని మిత్తరికం సంభ్రమానికి గురిచేస్తుంది. హైదరాబాద్ లో మీనో, అజిత, నీతూబాయి, ప్రకాష్, హవల్దార్ మత్తయ్య, సంతోషి, ప్రవీణ్ ఒక్కోళ్ళది ఒక్కో కథ.
నవలలోని సంభాషణలు, సంఘటనలు, సన్నివేశాల కల్పనలో బలం వల్ల మనసును ఆవరించి వేస్తాయి.
అలాంటివి కొన్ని:
“ఏవల్లా మీరు చేసింది ఏవన్నా బాగుందా! అన్నీ చెప్పేకదా బాబూ నీకు కట్టబెట్టాం. ‘నీల బుద్ధిమంతురాలు, ఉన్న పళంగా ఈ పిల్ల నా ఇంటికి వస్తే చాలన్నావు’ ఏం నిలబెట్టుకున్నావు? తప్పో ఒప్పో ఏం జరిగినా కడుపులో పెట్టుకుని సాకాలి తప్ప, దిక్కు లేని పిల్లను చంటిబిడ్డతో సహా రోడ్డు మీదకు గెంటారే! ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే మీకు బాగుండేదా! గద్దరి పిల్ల కాబట్టి చెలాయించుకొని ‘ఠట్ మీతో నాకేంటని’ బతుకుతోంది. ఇపుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తే నా బిడ్డ మనసు ఎంత రంపపుకోత బడుతుంది” –
ఇలా రాయడం ఆషామాషీ కాదు
పాస్టరమ్మ పాత్ర ఎంత గొప్పగా ఉంటుందంటే, మనం కూడా చర్చికి వెళ్ళి ఆ వాక్యాలు వినాలనిపిస్తుంది.
“మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు” పాటలోని తోడు వంటి గొప్పభావం స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కానక్కరలేదు. పాస్టరమ్మ వంటివారు కూడా అట్లా నీలపక్షాన నిలబడగలరని తెలుస్తుంది. మనిషి ఎప్పుడూ తపించేది అలాంటి తోడుకోసమే. ఆ పాటకు 50 ఏళ్ళు. ఇన్నేళ్ళ తర్వాత, ‘నా తప్పొప్పులతో సహా స్వీకరించగలిగితే స్వీకరించు..అని ధైర్యంగా చెప్పగలిగే రోజు వరకు వచ్చిన పరిణామం ఈ నవలలో చూస్తాం..
“మీతో కలిసి జీవించడం ఇష్టమే, కానీ నాదొక కోరిక. మీరు నాతో ఉన్నంత కాలం నా ఒక్కదానితోనే ఉండాలి” అంటుంది నీల సదాశివతో. కొన్ని పంక్తుల తర్వాత “నీ పీడకలలతో నేను స్నేహం చేయనన్న నమ్మకం పెంచుకో నీలూ! నువ్వు చెప్పింది నాకు అంగీకారమే” సదాశివ అంటాడు. పాత్రల్లో పరిణతి చెందిన స్వభావానికి ఇవి స్ఫుటమైన వ్యక్తీకరణలు.
‘తెల్ల నురుగు పూల అంచున్న నీటి రంగు జార్జెట్ చీరలా ఉంది ఈ పల్చని అల’ అన్న ప్రాదేశిక వర్ణన భావుకత ఉన్న ప్రతి ఒక్కరినీ తాకుతుంది.
మరో సన్నివేశం: “బిందె బోర్లించి దానిమీద కూచుని వెన్నెలలో తడుస్తూ సముద్రం కేసి చూస్తున్న ఒక ఆడమనిషి కనిపించింది. ఆమె ఒళ్ళో పిల్లి బద్ధకంగా మెసులుతోంది. పక్కన కూర్చున్న కుక్క తనూ దీర్ఘంగా సముద్రాన్ని చూస్తోంది. కెరటాల హోరు తప్ప మరిక ఏ శబ్దమూ లేని నిశ్చల వర్ణచిత్రంలా ఉంది.”
ఈ పంక్తులు చదివిన తర్వాత ఒక వర్ణచిత్రం పాఠకుల గది గోడమీద అలంకరింప బడుతుంది.
“ఈర్ష్య పాతాళమంత కఠినమైనది ప్రేమ మరణమంత బలవత్తర మైనది”
అన్న అద్భుతమైన బైబిల్ వాక్యాన్ని ఒక సన్నివేశపు ముగింపులో వాడారు.ఈ వాక్యాన్ని అర్థవంతంగా వాడుకోవడంలో సన్నివేశ సాంద్రత, గాంభీర్యం కొన్ని పుటల వ్యాఖ్యానాన్ని కుదించినట్టయ్యింది
పరదేశి, పైడమ్మ కలగాపులగంగా నీల ఆలోచనల్లోకి వచ్చిన స్థితి గురించి వర్ణిస్తూ
‘జోడుదుఃఖాల సవారీ చేయలేక పోతోంది నీల’ అంటుంది రచయిత్రి.
ఇంత గాఢమైన వాక్యాలు అడుగడుగునా కనపడతాయి
సంకీర్ణ మానవ స్వభావాల్లో పొరలను, అంతరంగ ఘర్షణలను, నేపథ్యాలను ఆవిష్కరించింది ఈ నవల. రచయిత్రి శక్తి అంతా అక్షరాల్లోకి ప్రవహించి, మాటలై, వాక్యాలై పాఠకుణ్ణి 360 డిగ్రీల్లో లోకాలను కలయజూసి కంటికి కనబడని, చెవికి వినబడని విషయాలను తెలుసుకు చావండని తరుముతాయి. ఇంతకు ముందు పరిచయం లేని శైలిలో ఆలోచనలు దట్టించిన వాక్యాలు చదువరికి జ్ఞానం ప్రసాదిస్తాయి.
చెమ్మీన్, మరణానంతరం, గణదేవత వంటి నవలలు చదివిన తర్వాత చెపుతున్న మాట ఇది, ఏదో ఒకరోజున జ్ఞానపీఠ పురస్కారం అందుకునే ధాతునిర్మాణం మల్లీశ్వరి అక్షరాల్లో అక్షరాలా దర్శనమిస్తోంది.
కొమ్మన రాధాకృష్ణ రావు
వట్లూరు