భాండాగారం

సంగమాలు సంగరాలౌతున్న వేళ

శతపత్ర సుందరి కథ పై ఎకె ప్రభాకర్ గారి ఆలోచనలు – వ్యాసరూపంలో

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

http://magazine.saarangabooks.com/2015/11/26/%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82%E0%B0%97%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8C%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6/

సొగసు చూడతరమా

ఉత్తరాంధ్ర మాండలికం పై 22-12-2014 తేదీన సూర్య దినపత్రిక లో వచ్చిన నా వ్యాసం.

22MAIN4uttharandhra mandalikam

‘లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబగు’ అని, వ్యాకరణ సూత్రాలకు లోబడని భాషని పామరభాషగా చిన్నయసూరి సూత్రీకరించాడు. మళ్ళీ అంతలోనే  ‘ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు’  అనడం ద్వారా పెద్దలు వాడితే పామరభాష అయినా గ్రహించవచ్చునని కొంత సడలింపునీ ఇచ్చాడు. అయినప్పటికీ ప్రజల భాష పట్ల వ్యాకరణకర్తలకీ గ్రాంధిక, ప్రామాణిక భాషా వాదులకీ చాలా కాలం చిన్నచూపే ఉండేది.

వలసవాద నాగరికతలో భాగంగా ఆధునికత భారతీయ సమాజంలోకి వచ్చిందన్నది ఒక అవగాహన. వ్యాపార ప్రయోజనాల కోసం వలసవాదులు చేసిన సంస్కరణలను అందిపుచ్చుకుని వారి మీదనే తిరుగుబాటు చేసారు భారతీయులు. ఫలితంగా రాజకీయ ఆర్ధిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి. తెలుగునాట భాషారంగంలో వచ్చిన పరిణామాలు వాజ్మయాన్ని సామాన్యప్రజలకు చేరువ చేసాయి. విద్యా సారస్వత రంగాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగే కొద్దీ భాషకి సరళీకరణ అవసరమైంది. ఆ అవసరమే వ్యావహారిక భాషోద్యమానికి కారణమైంది. గ్రాంధిక వ్యావహారిక భాషల మధ్య పోరు తీవ్రం కాక ముందే ఉత్తరాంధ్రలో మాండలిక భాషలో సాహిత్య సృజన ప్రారంభమైంది. భావ విప్లవకారుడు గానే కాక భాషా విప్లవకారుడుగా గురజాడని గుర్తించడానికి ఈ ప్రత్యేకత కూడా కారణం.

తెలుగులో సర్వ సంపన్నమైన తొలి మాండలిక రచనగా కూడా కన్యాశుల్కానికి ప్రాధాన్యత ఉంది. కన్యాశుల్కంలోని వస్తువుకు మెరుగు దిద్దింది అందులోని మాండలిక భాషా సొగసు. పాత్రోచిత మాండలికానికి కన్యాశుల్కం గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. మాటకారితనం, పదిమందిని చుట్టూ తిప్పుకోగల సామర్ధ్యం, మాటకీ చేతకీ పొంతన లేనితనం, స్వలాభాపేక్ష, ఆభ్యుదయవాదిగా ముసుగు, అమాయకపు స్త్రీల ఉద్ధరణకి పాటుపడుతున్నట్లు నటన, డాంబికం, ఆంగ్ల భాషా పటాటోపం ఉన్న ఒక గిరీశాన్ని సృష్టించడానికి ఎంత భాషా నైపుణ్యం ఉండాలి!!. యాతాం తోడుతున్న గిరీశాన్ని అగ్నిహోత్రావధాన్లు వారించినపుడు గిరీశం,    “ పని వంటి వస్తువలోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు ఊసుపోదు మొక్కలకా మంచిది. నాకా… కసరత్తూ. గవునరు తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవరాణీ వారు బీదలూ, సాదలకి ఇవ్వడానికి బట్టలు కుడతారు. ఇంగిలీషు వాడు సోమరితనం వొప్పడండి. వాళ్ళలో పెద్ద కవీశ్వరుడు షేక్ స్పియర్ యేవన్నాడో విన్నారా. ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అన్నాడు. అనగా కలక్టర్ గొప్పవాడు కాదు ; జడ్జీ గొప్పవాడు కాదు. కాయక్లేశ పడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు…”    అంటాడు. ఒక్క గిరీశం పాత్ర మాత్రమే  కాకుండా మధురవాణి, రామప్ప పంతులు, లుబ్దావధాన్లు ఇట్లా ప్రతి పాత్రకీ దానిదైన విలక్షణతని కూర్చడంలో విజయనగరం లోని వివిధ వర్గాల ప్రజల భాష గురజాడకి చాలా సాయపడింది.

కన్యాశుల్కం లోని మాండలిక భాష , ముత్యాలసరాలు లోని వ్యావహారిక భాష, కథల్లో రెండింటి కలగలుపు ఆనాడు భాషారంగంలో సంచలనమయ్యాయి. ఆ సందర్భంగా వ్యక్తమైన వ్యతిరేకత, చర్చలు, వాదోపవాదాలు కూడా వ్యావహారిక భాషా ఉద్యమానికి తోడ్పడ్డాయి. గురజాడ ఏర్పరిచిన మాండలిక భాషా పునాది బలమైనది కనుకనే నూట ఇరవై ఏళ్లుగా ఇక్కడి రచయితల మాండలిక రచనలు తెలుగు నాట అన్ని ప్రాంతాల వారూ ఇష్టంగా చదువుకునే ప్రామాణికతను పొందాయి.

ఒక ప్రాంతానికి పరిమితమైన ప్రజలు మాట్లాడే భాష కనుక ప్రతి మాండలికానికీ కొన్ని భౌగోళిక సాంఘిక విశిష్టతలుంటాయి. ఆ వైవిధ్యమే మాండలిక భాషా ప్రయోగాలకి రచయితలని నిబద్ధుల్ని చేస్తుంది. ఉత్తరాంధ్ర మాండలికానికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ముఖ్యమైనవి వ్యంగ్యం, హాస్యంతో కూడిన వ్యక్తీకరణ. వ్యక్తిగత సంభాషణా చాతుర్యం లోంచి పుట్టే వ్యంగ్యం సాహిత్యం లోకి వచ్చేసరికి సామూహిక  ప్రయోజనాలకి సాధనం అయింది. వ్యంగ్య రచనలు అనగానే గుర్తొచ్చే రావిశాస్త్రి, పతంజలి ఇద్దరూ సమాజం లోని చెడును నిరసించడానికి వ్యంగ్యాన్ని వాడారు. వారి వ్యంగ్యానికి వినోదం ప్రధానం కాదనీ  ఆపుకోలేని ఆగ్రహాన్ని విషాదాన్ని  దుఃఖాన్ని వ్యక్తీకరించడమే లక్ష్యమనీ మనకి తెలుస్తూనే ఉంటుంది. రావిశాస్త్రి రచనలన్నింటిలో విశాఖపట్నం మాండలికం గొప్పగా పలుకుతుంది. ముఖ్యంగా ఇక్కడి లంపెన్ వర్గాల జీవితాలను మాండలికం ద్వారానే బలంగా వ్యక్తం చేయగలిగారు.

విజయనగరం జిల్లా క్షత్రియ కుటుంబాల జీవన శైలి లోని అనేక పార్శ్వాలు పతంజలి, పూసపాటి కృష్ణంరాజు, దాట్ల నారాయణమూర్తి రాజు రచనల్లో కనిపిస్తాయి . విశ్రాంత వర్గానికి చెందిన వారి జీవితాల్లోని భేషజాలు ఆడంబరాలు నిర్వ్యాపకత్వం ఫాల్స్ ప్రిస్టేజి లాంటి అవశేషాలను వ్యంగ్యంగా చెప్పారు పతంజలి. రాజుల ఇళ్ళలో మెసిలే కాపలా కుక్క కూడా ఎలాంటి భేషజాలకు పోతుందో  ‘ వీరబొబ్బిలి ’ నిరూపిస్తుంది.     “ నేనయితే వేటకుక్కల్లోకెల్లా మేలయిన వేటకుక్కనన్నమాట. మొన్న ఆ మధ్య రెండు పులుల్ని మెడ కొరికి చంపీసేను. నేను వేటకొస్తున్నానని తెలిస్తే చాలు అడవి అడిలిపోతుంది. నేను వేట మొదలు పెట్టిన తర్వాతే ఏనుగులు భయపడి మా అడివి నుంచి పారిపోయాయి.అంతకు ముందు భయమూ భక్తీ లేకుండా తిరిగేవి. ఉడతలని మీ ప్రాంతంలో ఉంటాయో లేదో తెలీదు గానీ మా ప్రాంతంలో కద్దు. వాటిని పట్టుకోవడం భలే కష్టమనుకో. నేను అవలీలగా పట్టేస్తాను. నేను చాలా గొప్ప వేటకుక్కన్లే…”     అంటుంది ఈ నవలలో బొబ్బిలి. సమాజాన్ని తమకి అనుగుణంగా శాసిస్తున్న పోలీస్, న్యాయ, పరిపాలనా, పత్రికా వ్యవస్థల పట్ల పతంజలికి ఓపలేనంత ఆగ్రహం ఉంది. ఖాకీవనం, రాజుగోరు, అప్పన్న సర్దార్, పెంపుడుజంతువులు నవలల్లో ఆ వ్యవస్థల దుర్మార్గాన్ని చెప్పడానికి వ్యంగ్యమే అతనికి ఆయుధమైంది.

“ language is a complex system of speech habits.”    అంటాడు హాకెట్ అనే భాషాశాస్త్రజ్ఞుడు. మాట్లాడే అలవాట్ల సంక్లిష్టతలంటే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి చాలా ఇష్టం, గౌరవం.  ఆ సమయానికి ఆ అవసరానికి తగినట్లు ఏదొకటి మాట్లాడి సరిపెట్టే తీరు కాదు వారిది. ప్రతి మాటా గొప్ప సౌందర్యాన్ని సంతరించుకుని గానీ బైట పడదు. ఒక సామెతో జీవితానుభవమో తత్వమో ఉపదేశమో వాక్యంలో ఉండాల్సిందే. పోలీసులకూ నక్సలైట్లకూ మధ్య గిరిజనులు నలిగిపోతున్నారంటూ ఒక గ్రామ ప్రెసిడెంట్     “ ఒర్రే… మీ బతుక్కోరే చెప్పుతన్నూ.. అడివి పందులొచ్చి మేసికెలిపోతే ఊరపందుల చెవులు కోత్తారట – అలగన్నట్టగా – ఆ నచ్చలైట్లొచ్చి ఎవులు పీకలో ఒకలు తీత్తారు. ఆలూరుకొంతరా! ఆలూరుకోరు. ఆలొచ్చినారంటే పీకలు తరగడానికే వత్తారు. తీరా మోసి పీకలు దీసి ఆలు అడివి దెంగెత్తరు. ఆ సుడంతా వచ్చి మీ పీకకి చుట్టుకుంతాదిరా “      అని సవరల్నిభయపెట్టడాన్ని సువర్ణముఖి వర్ణించాడు.

భాషని సమర్ధవంతంగా ప్రయోగించాలనే లక్ష్యంతో జానపద శైలిలో పౌరాణిక భాషా స్వభావాన్ని కూడా అనుకరిస్తారు ఇక్కడి గ్రామీణులు. పురాణ సంబంధ గాధలు పాత్రలు ప్రతీకలని తమ భావోద్వేగాలకూ సందర్భాలకూ అనుగుణంగా మార్చేసుకుని భాషకి గాఢతని సృష్టించుకుంటారు. అట్టాడ అప్పల్నాయుడు రాసిన ‘బతికి చెడిన దేశం’ కథలో       “ నిజివేనిరొరే, నిజివేనిరా – బలరామనాయుడా – నిజిమేగానీ అరణ్యవోసం అయిన తరువాత అయివోద్య సింహాసనం దొరికింది రాములోరికి. రాజ్జెం దొరికింది పాండురాజు బిడ్డలికి. ఏలినవారి తోటి పోల్చుకోకురో యెర్రినాయుడో – అధికార పీఠం పోయిన అయిదేళ్ళకి మళ్ళా పీఠమెక్కీగల్రు ఆళ్ళు.”             అంటూ పురాణాలూ రాజకీయాలూ కలిపి అలవోకగా అల్లి మాట్లాడతారు.

ఉత్తరాంధ్ర మాండలికం ఏ ప్రాంతం వారు మాట్లాడినా వినసొంపుగా ఉండడానికి మరొక కారణం భావోద్వేగాల వ్యక్తీకరణలో దానికుండే లయాత్మకత… ఒక తూగు. సువర్ణముఖి  ‘ అగ్గి ’ కథలో ఒక పాత్ర రౌడీలను తిడుతూ…                ”ఆడికొక పెదపాము బొడ.. ఆడికొక చినపాము పొడ, ఆడాస్తి అగ్గైపోను . ఆడి బవనాలు బుగ్గైపోను. ఆడి గతి నిరుగతి అయిపోను.ఆది గయినం సాకలోడెత్త. ఆడికి గొయ్యి తీసి పాతియ్య. ఆది దిబ్బ మీద దీపమెత్త. ఆడికి రోజులు రోజులు చెయ్య..”        అంటూ తిట్లలో కూడా అలివి కాని అందాన్ని పొదుగుతుంది ఆ పాత్ర.

భాషాశాస్త్రపరంగా ఉత్తరాంధ్ర మాండలికాన్ని ఉత్తరాంధ్ర సాహిత్యానికి అన్వయించి చూస్తే మరి కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక రంగాల్లో ఆధిపత్య స్థితిలో ఉండడం వల్ల ఆ ప్రాంతాల భాష ప్రామాణిక భాషగా స్థిరపడింది. దీనిని భాషా శాస్త్రజ్ఞులు centripetal development గా  చెపుతున్నారు. ఈ కేంద్రీకరణలో చుట్టూ ఉన్న అనేక మాండలిక భేదాలు ఈ ప్రామాణిక భాషలోకి లాక్కోబడాలి. అయితే తెలుగు సాహిత్య సామాజిక రంగాల్లో మాండలిక భాష, ప్రామాణిక భాషలో గుర్తించదగినంతగా అంతర్లీనం కాలేదు. పైగా ప్రాంతీయ ఉద్యమాల నేపథ్యంలో మాండలిక భాషా ప్రయోగం ఆత్మ గౌరవ ప్రకటనగా కూడా స్వతంత్రతని నిలుపుకుంది. గత ఇరవై ఏళ్లుగా తెలంగాణా సాహిత్య పునర్నిర్మాణంలో ప్రామాణిక భాష కన్నా మాండలిక భాషా రచనకే సాహిత్యకారులు మొగ్గు చూపారు.

ఒక మాండలికంలో పలు భేదాలను బట్టి కూడా సాహిత్యానికి వైవిధ్యం ఏర్పడుతుంది. ఉత్తరాంధ్రలో భౌగోళిక భేదాలను బట్టి శ్రీకాకుళం. విజయనగరం, విశాఖపట్నం మాండలికాలు, కొండప్రాంతాల ప్రత్యేక మాండలికం, ఉద్దానం, మందస లాంటి చారిత్రాత్మక స్థలాల మాండలికం… ఇట్లా అసంఖ్యాకమైన భేదాలు కనిపిస్తాయి. వృత్తిని బట్టి ఏర్పడే మాండలికాల్లో ఉత్తరాంధ్రలో మత్స్యకారులు, చేనేత పనివారు, అటవీ ఉత్పత్తులు సేకరించేవారు, నెయ్యలు తయారు చేసేవారు, జీడిపిక్కల పరిశ్రమలో పని చేసేవారు మాట్లాడే భాషలోని అనంత వైవిధ్యం ఇంకా సాహిత్యంలోకి రావలిసి ఉన్నది.

ఉత్తరాంధ్రలోని పలువర్గాల మాండలికాన్ని అత్యంత సరళంగా హాయిగా వీనుల విందుగా వాడారు చాసో. ‘వెలంవెంకడు’, ‘ఎంపు’ కథల్లో వృత్తి మాండలికం, ‘బబ్బబ్బా’.. కథలో బ్రాహ్మణ సామాజిక వర్గంలోని చిన్నపిల్లలు మాట్లాడే భాష, ‘బొమ్మల పెళ్లి’ లో స్త్రీల మాండలికం వాడారు.ఉత్తరాంధ్ర గిరిజన మాండలిక విశేషాలు  భూషణం, అట్టాడ అప్పల్నాయుడు, సువర్ణముఖి కథల్లో పుష్కలంగా దొరుకుతాయి.గంటేడ గౌరునాయుడు కథల్లోని మౌఖిక జానపద ధోరణుల వలన కథలు పాఠకులకి త్వరగా సన్నిహితమవుతాయి. ఈ కథల్లోని ఉపమలు జాతీయాలూ సామెతలూ పలుకుబళ్ళూ నుడికారం లాంటివి భాషా శాస్త్ర పరిశోధకులకు నిధులవంటివి.

మాండలికభాషని సందర్భోచితంగా వాడిన కారా మాస్టారు మాండలికం రాయడం కోసం కృతకంగా ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తారు. గొట్టు మాండలికం వల్ల సాహిత్యానికి మేలు జరగదనీ ప్రజల నోళ్ళలో తరుచుగా వినబడే పదాల వాడకం వల్లన ఆ రచన పట్ల పాఠకులకి విశ్వాసం కుదురుతుందంటారు. విస్తృత సునిశిత పరిశీలన ద్వారా పాఠకుల విశ్వాసం పొందిన మాండలికాన్ని కారా మాస్టారి కథల్లో చూస్తాము. యజ్ఞం, జీవధార, నో రూం, చావు, లాంటి కథలు మాండలిక శాఖల, ఉపశాఖల విశ్వరూపాన్ని చూపుతాయి.

ఉత్తరాంధ్రలో అత్యధికశాతం మహిళలు శ్రామిక వర్గానికి చెందినవారు.ఇక్కడి స్త్రీల పోరాట చైతన్యం, తర్కం, సూక్ష్మ బుద్ధి, జీవితానుభవాల సాంద్రతలను సాహిత్యం ద్వారా చెప్పిన రచయితలున్నారు. శ్రామిక, మధ్యతరగతి స్త్రీల జీవితాలను స్త్రీవాద దృష్టి కోణంతో బమ్మిడి జగదీశ్వరరావు రాసారు. స్త్రీల ప్రత్యేక మాండలికాన్ని ఒక పురుష రచయిత గ్రహించి రాయడం అతను సాధించిన భాషా విశేషం.

రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, పతంజలి వంటి  రచయితలు యాసనీ (Slang), కూటభాషని (Argot) కూడా రచనల్లో వాడటం చూస్తే మాండలిక భాషా ప్రయోగాలు సూక్ష్మస్థాయిలో కూడా జరిగాయని తెలుస్తుంది. మధ్య తరగతికి ఉండే mobility వల్ల అన్యదేశ్యాలకీ తత్సమాలకీ  విలువ పెరుగుతోంది కానీ శారీరక శ్రమ మీద ఆధార పడే వర్గాల్లో ఇప్పటికీ మాండలిక భాషకే ప్రాధాన్యం ఉంది.

ప్రభుత్వ సంస్థలు మాండలిక భాషా పద కోశాల నిర్మాణానికి నిధులు వెచ్చించినప్పటికీ అకాడెమి రద్దు వల్ల ఆ పని సగంలోనే ఆగిపోయింది. శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల మాండలిక పదకోశాలు ప్రచురించబడ్డాయి. ఉత్తరాంధ్ర మాండలికాల మీద భాషా రంగంలో కొంత కృషి జరిగింది. ఆదిభట్ల నారాయణ దాసు ‘సీమపలుకువసి’, మారేడుపల్లి రామచంద్రకవి ప్రచురించిన ‘నుడికడలి’, ప్రకాష్ చంద్ర శతవతి ‘తెలుగు పలుకుబడులు’, వి.సి.బాలకృష్ణశర్మ ‘శ్రీకాకుళం ప్రజలభాష’ అత్తలూరి నరసింహారావు ‘రావిసాఖీయం’ అలాంటి వాటిలో కొన్ని. జి.యస్ చలం  రూపొందించిన ‘కళింగాంధ్ర మాండలికం -1’ మాండలిక పదకోశాలలో ఉండవలసిన ప్రామాణికతని వాగ్దానం చేస్తోంది. అకారాది క్రమ మాండలిక పదాలే కాక రచనల నుంచి ఉదాహరణలు సంఖ్యావాచకాలు వావివరుసలు సాంస్కృతిక విశేష పదాలు భాషా సంబంధ విశేషాలను కూడా చేర్చడం ద్వారా సమగ్రతను సాధించే ప్రయత్నం చేసారు చలం. దీనికి రెండవ భాగం ప్రచురణ దశలో ఉంది. మాండలికం కోసం చేసే ఏ కృషి అయినా అది ప్రజల పక్షం వహించేది కనుక మాండలిక భాషకి ఆదరణ రాన్రానూ పెరుగుతూనే ఉంటుంది.

కె.ఎన్.మల్లీశ్వరి

Malleswari.kn2008@gmail.com

చిన్ని చిన్ని ఆశల మొలకలు

సముద్రపు ఒడ్డుకి కొట్టుకు వచ్చిన ప్రాణం లేని తాబేళ్లని,వేలాది చేపల్ని చూసి మనసు నెప్పితో నివ్వెర పోతున్నాడు అనిత,విశాఖ వర్మల  పెద్దబ్బాయి నిశాంత్ నిశ్చల్. వాళ్ళ నాన్న పని చేసే పోర్ట్ కి వెళ్ళొచ్చినపుడల్లా అక్కడి గాలి లో తేలే నల్ల ధూళి మేఘాల్ని చూసి విశాఖకి ఏమవుతోంది అంటున్నాడు భయంగా ఆందోళనగా..
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్,హైదరబాద్ లో  చదువుతున్న ఐలా బందగి ఇప్పటికే తెలంగాణా లోని కొన్ని ప్రాంతాల్లో శానిటరీ సమస్యల మీద క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. కంచు కంఠం తో అనర్ఘళంగా ఉపన్యసించ గల ఈ  అమ్మాయి గోపరాజు సుధ, కె. శ్రీనివాస్ ల కూతురు. యువజన సంఘాల్లో చురుకుగా పని చేసే ఈ తెలంగాణా బిడ్డ ఉత్తరాంధ్ర గురించీ తెలుసుకోవాలనుకుంటోంది
పదేళ్ళకే పర్యావరణం మీద కథలూ కవిత్వం చాలా బాధ్యతగా రాస్తున్నాడు కోటే విజయభాను,ఇ. బంగారు రాజుల గారాల బిడ్డ వర్దిష్ణ విభాస్ రజిత్. ఒకటో తరగతిలో ప్లాస్టిక్ వల్ల భూమికి కలిగే నష్టాల్ని స్కూల్లో విని చలించి అంతటితో ఆగిపోకుండా తను గ్రహించినదాన్ని చిత్రలేఖనం ద్వారా నలుగురికీ చూపిస్తున్నాడు. ఎక్కడ సమస్య కనపడితే అక్కడికి పరుగులు పెట్టే విభాస్ మే 27,28 తేదీల్లో విశాఖ రావడం కోసం ఇప్పటినుంచే బట్టలపెట్టె సర్దుకుంటున్నాడు.
కాలేజ్ లో  రిజర్వేషన్ల గొడవల్లో, బయట నాస్తికత్వ చర్చల్లో మైనారిటీ గొంతుని వినిపించడంలో ఏ మాత్రం జంకు లేని స్నిగ్ధవాస్,మల్లీశ్వరి,శ్రీనివాస్ ల కూతురు. పరిశ్రమలు వద్దంటే ఎట్లా !! తక్కువ హాని చేసేవి డిమాండ్ చేయాలి లేకపోతే ఆల్టర్నేటివ్ మోడల్స్ డెవలప్ చేయాలి. అంటోంది. మూసేసిన జింక్ పరిశ్రమని,ఎన్టీపీసి,స్టీల్ ప్లాంట్ చుట్టూ పక్కల ప్రజల తో మాట్లాడి వచ్చాక ఏమంటుందో చూడాలి
బీల – భూమి – సముద్రపు హోరుని నిరంతరం వింటూ ఉండే రెడ్డి రామకృష్ణ కూతురు ఆమని, రేవు బతుకుల గోసని అక్షరబద్ధం చేసిన  జి యస్ చలం కొడుకు విరూపాక్ష అచ్చపు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలు… సర్వేకి సై  అంటున్నారు
అరకు, పాడేరు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే పాతికేళ్ళ గిరిపుత్రుడు గోపాల్, ఎం.ఎ చదువుతున్నపుడే గిరిజన సంస్కృతి మీద ఆసక్తిగా పరిశోధన చేసిన కౌండిన్య, షార్ట్ ఫిల్మ్ కోసం కొండా కోనా తిరగడానికి తిరగడానికి సిద్ధపడుతున్న అర్హత్ బోధి, ఏ సమస్య మీదైనా సత్వరం స్పందించే పెద్దాడ శివరంజని,కవికుమారుడు రాజు అందరూ చిన్నా పెద్దా పిల్లలే…
గ్రీన్ క్లైమేట్ పర్యావరణ మాసపత్రిక, ప్రజాస్వామిక రచయిత్రుల వేదికల సహకారంతో భిన్న తరగతులకి చెందిన ముప్ఫై ,నలభై మంది యువ సామాజికులు విశాఖ కాలుష్యం మీద అవగాహన కోసం విశాఖ నగరంలో  మే 27వ తారీఖు,అరకు మండలం లోని నాలుగు గ్రామాల్లో గిరిజన సంస్కృతి అధ్యయనం కోసం మే 28వ తారీఖు క్షేత్ర పర్యటన చేస్తున్నారు. మే 29వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నం లోని సిరిపురం వద్దనున్న బిల్డర్స్ అసోసియేషన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసి తమ అధ్యయన సారాన్ని తమ అనుభవాలను వివరిస్తారు.
చిన్న పిల్లలు పెద్ద మనసుతో చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అందరి సలహా సహకారాలను కోరుతూ…

అక్క వెళ్ళిపోయింది

అక్క వెళ్ళిపోయింది

నలుగురిని ముగ్గురు చేస్తూ.. రెండేళ్ళ కిందటి జాజిమల్లి పాఠకులకి మా నలుగురక్కాచెల్లెళ్ళ పై నేను రాసిన కథలు గుర్తు ఉండే ఉంటాయి. ఒక ఖాళీని తడుముకునే ప్రయత్నం చేస్తుంటే అక్క వ్యక్తిత్వపు హిమవన్నగం దొరికింది మాకు. దానినే పుస్తక రూపంలో మిత్రులందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. పిడిఎఫ్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచుతున్నాను

మల్లీశ్వరి

prayanam final

 

cover page

cover page

కొంటె నవ్వుల కోడలు పిల్ల

బ్లాగర్ పేరు : లలిత

బ్లాగ్ పేరు : నా స్పందన

బ్లాగ్ చిరునామా : http://naaspandhana.blogspot.in/

పుట్టినతేదీ : డిసెంబరు 17 ( అమితాబచ్చన్ గారి కోడలు ఐశ్వర్యా రాయ్ నేనూ ఒక వయసువాళ్ళమే  )

పుట్టిన స్థలం : రాజమండ్రి ( పెరిగింది దగ్గరలోని అమ్మమ్మగారి ఊర్లో )

ప్రస్తుత నివాసం : రాజమండ్రి ( మూణ్ణాళ్ళ ముచ్చట – అంతకుముందు – ఆతరువాత , రాజమండ్రి దగ్గర అత్తవారి ఊరు . అంటే అటుతిప్పీ ఇటుతిప్పీ గడిచిన నా జీవితమంతా ఈ గోదారి గట్టునే )

విద్యాభ్యాసం : చా…..లా కష్టపడి బి.ఎ . పూర్తిచేసానండి . నిజవండీ బాబూ ! మా ఊరికొచ్చే ఒకే ఒక ఆర్టీసీ బస్సులో రోజూ 20 కిలోమీటర్ల( రానూ పోనూ 40 అండి) గతుకుల ప్రయాణం అంటే మాటలేంటండీ ఒళ్ళు హూనం అయిపోయేదండీ .

వృత్తి : …………. ప్రస్తుతానికి ఇది ఇలా ఖాళీగా వుండనీయండి . ఎప్పటికయినా, వృత్తి : సీరియస్(ల్) రచయిత్రి అని రాసుకోవలన్నది నా ఆశ ( అత్యాశ – దూ………….రాశ !? )

వ్యాపకాలు : అబ్బో చాలా వున్నాయండి . చదువుకునేరోజుల్లో – ఆటలు, పాటలు , సినిమాలూ, పుస్తకాలు, భావుకత్వపు రాతలు ( ఎక్కువగా ఉత్తరాల్లో ) . మూడుముళ్ళూ పడ్డాకా -కుట్లూ అల్లికలూ, చీరలమీద రంగులు పులమటం .అదేనండీ – ఫేబ్రిక్ పెయింటింగ్ అంటారుకదా ! చెత్తలోంచీ కళారూపాలు సృష్టించడం ( దీన్నే చెత్తకళ అంటారు మా వాళ్ళు) వంటి కాలక్షేపపు కళలు . బ్లాగుల్లోకొచ్చాకా -గత జ్ఞాపకాలు తిరిగొచ్చినట్టూ మరలా చదవటం, వ్రాయటం , ప్లస్ లోని నేస్తాలతో సరదా కబుర్లు – నవ్వులు . అవకాశం దొరికితే 64 కళల్లో ఆరితేరిపోవాలన్న అత్యాశ కలదాన్నండి .అలా కంగారుపడతారెందుకండీ….. ఇప్పటికి 6 అయ్యేపోయాయి ఇక మిగిలింది 4 కదండీ (నా లెక్క ప్రకారం అంతేలెండి )ఆ ప్రణాళికలో భాగంగానే ప్రస్తుతం వీణ పై సరిగమలు సాధన చేస్తున్నాను .

బ్లాగ్ మొదలుపెట్టిన తేది : సెప్టెంబర్ 2008 (అమ్మో…అపుడే అయిదేళ్ళయిపోయిందా)

మొత్తం బ్లాగుపోస్టులు : 155 (ఆ మధ్య ఎప్పుడో…. నాకే చెత్తలా అనిపించిన కొన్ని పోస్టులు దులిపి పారేసాకా మిగిలినవండి )

బ్లాగులోని కేటగిరీలు : నా అలోచనలు, పుస్తకం, సినిమా, సాహిత్యం, సరదాగా, సామాజికం , కతలు, ముచ్చట్లు ఇంకా ….అవీ ఇవీ

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు ?

ఈనాడు లో వచ్చిన ఒక వ్యాసం ద్వారా కంపూకి ( కంప్యూటర్ ) తెలుగు కూడా వచ్చని తెలిసింది. ‘మా నాయనే ‘ అనుకొని ముచ్చటపడ్డా . మొదట్లో నాక్కావలిసినదాని కోసం ఎలా వెతకాలో తెలిసిందికాదు . తెలుగు అని ఇంగ్లీష్ లో అడిగితే ఏవో కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయి కానీ అవి బ్లాగులు కావు. అలాగే విసుగు విరామం లేకుండా వెతగ్గా వెతగ్గా తెవికీ, రచ్చబండ, లేఖిని , ఏదో ఒక బ్లాగు దొరికాయి. అలా తీగలాగుతూ ఒక బ్లాగునుంచీ ఇంకో బ్లాగుకు పాక్కుంటూ పోవటం అక్కడున్నవి చదవటం ‘అబ్బా… వీళ్ళంతా ఎంత మేధావులో కదా !”అని అబ్బురపడటం  . బ్లాగులో కామెంట్ ఆ పోస్ట్ చదివిన వాళ్ళెవరయినా వ్రాయొచ్చని తెలీక బ్లాగులన్నీ పుస్తకం చదివినట్టూ చదివి ఊరుకునేదాన్ని . ఒకసారి ఎందుకో సరదాగా వ్యాఖ్య రాయటానికి ప్రయత్నిస్తే ‘నీకు ఈ- మెయిల్ కూడా లేదా చీ..ఫో ‘ అనేసరికి , నాకు రోషం వచ్చి మా చెల్లెల్ని అడిగితే తనే ఒక మెయిల్ తెరిచి ఇచ్చింది . పాస్వర్డ్ కూడా తననే పెట్టమన్నాను – ఏమో బాబూ అవన్నీ నాకెలా తెలుస్తాయ్ అని  .

కొన్నాళ్ళు అలా చదువుతూ గడిచాకా, నాకూ ఒక బ్లాగ్ వుంటే బావుండు అనిపించింది . ఏం రాయలేకపోయినా కనీసం నా పేరుతో కామెంట్స్ అయినా పెట్టచ్చుకదా! ఒక వీడియో నాకు దారి చూపించగా నాలుగు రోజులు నానాతంటాలూ పడితే( నానంత తెలివైనదాన్ని మరి ) నాబుజ్జి బ్లాగు వెలిసింది . తిండీ నిద్రా మర్చిపోయి దాన్ని చూసుకుని ఎంత మురిసిపోయానో . ఒక బ్లాగులో నా పేరుతో కామెంట్ రాస్తే, ఆ పేరుమీద నొక్కి నా బ్లాగుకొచ్చినవాళ్ళు “ ఏదో ఒకటి రాయండి “ అనటంతో గొప్ప ఉత్సాహం వచ్చేసి , “నేనేం రాయగలనూ “ అని కొంచెం మొహమాటంగా రాసుకున్న నా మొదటి టపా *** ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు ఇది నా మొదటి పోస్టు కాబట్టి ఓమ్ గనేసయన మహా తో మొదలెట్టి సర్వ విగ్నోప శాంతయే తో అపెస్తున్న.*** ఆయ్….నవ్వకండి 

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు ?

అన్నీ మంచి అనుభవాలు-జ్ఞాపకాలే . నేను సీరియస్ బ్లాగర్ ని కాదు కదండీ, ఒట్టి కామెడీ కేండేట్ ని . ఆటలో అరటిపండులా అన్నమాట . దాంతో పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏవీ ఎదురుకాలేదు . నా బ్లాగు పేరు తప్ప మిగిలిన అలంకారాలన్నీ జ్యోతి గారు చేసి పెట్టినవే . ఇప్పటికీ ఏం నేర్చుకోకుండా అది -ఇదీ అని ఆవిడని వేధిస్తూ వుంటాను . అంత చనువు స్వతంత్రం ఎలా వచ్చాయో మరి . ఏదో రాసేద్దామని కాకుండా కేవలం ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేయడం కోసమే కదా బ్లాగు మొదలుపెడుతుందీ అని, నా బ్లాగుపేరు ‘ నా స్పందన’ అని పెట్టుకున్నాను . ఏదో సామెత చెప్పినట్టూ నాలుక వున్నాకా వాగకుండానూ బ్లాగంటూ దొరికాకా బ్లాగకుండానూ ఉండలేం కదండీ. మొదట్లో కవితలు, పాటలు పుస్తకాల్లోంచి కాపీ పోస్ట్ (పేస్ట్) చేసేదాన్ని (అలవాటవ్వటం కోసవన్న మాటండి ) . ఆ తర్వాత నా సొంత గోల మొదలుపెట్టి నెలకి ఆరేడు వాయలు తక్కువకాకుండా దంచి పోసేదాన్ని .

పోస్ట్ వేయడం ,కామెంట్స్ కోసం కాసుకు కూర్చోటం. దయగల బాబులు ఎవరన్నా ఒకటో రెండో మాటలని పోతే ‘ఆహా ఏమి నా భాగ్యము ‘ అని మురిసిపోయి ఆ వేళకి సుఖంగా నిద్రపోవటం . చర్చల్లో పాల్గొనకపోయినా , ‘ విషయం ‘ ఉన్న సీరియస్ టపాలని ,వ్యాఖ్యలనీ శ్రద్ధగా చదువుతూ, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ …నా బ్లాగులో మాత్రం ఎక్కువగా సరదా సంగతులు రాసుకునేదాన్ని. నా రా(వా)తలు బారినపడ్డ కొందరు ‘ యూ…సిల్లీ’ అని సీరియస్ గా అనేసారు. అంతేనా ….. మీరు హాస్యం బాగా వ్రాస్తున్నారు ఇంకా రాయండి, ఇలాగే రాయండి అంటూ నలుగురూ నాలుగు రాయిలతో వెంట పడేసిరికి నేను మరింత ఉత్సాహంగా వ్రాస్తూ పోయాను . చూస్తుండగానే బ్లాగొక్కటే నా వ్యాపకం అయిపోయింది . సినిమా చూసినా, పుస్తకం చదివినా , బ్రేకింగ్ (షాకింగ్) న్యూస్ విన్నా, ఏ పాత సంగతో గుర్తొచ్చినా , మనసులో సరదా ఆలోచన కలిగినా , ఎవరిమీదన్నా కోపమొచ్చినా , నిద్దర్లో కలొచ్చినా, బ్లాగులో బాదేయడం అలవాటయిపోయింది.

మూడేళ్ళు ‘యమోత్సాహం’ తో సాగిన ఈ రాత -కోతలు మెల్లగా నెమ్మదించి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయాయి . బజ్ లోనూ, ప్లస్ లోనూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టాకా బ్లాగు రాయటం, చదవటం తగ్గిపోయింది ( ఇది కాస్త సిగ్గుపడుతూ చెపుతున్న మాట) . మొదట్లో అన్నీ బ్లాగులో వ్రాయతగ్గ విషయాలే అనిపించేవి. ఇప్పుడలా అనిపించడంలేదు. ఏవన్నా చిన్నా చితకా విశేషాలున్నా అవి ప్లస్ లో షేర్ చేస్తే సరిపోతుంది. అదండీ… నా బ్లాగు చరిత్ర . వ్రాయాలనే సరదా వున్నవారికి ఇక్కడ దొరికే ప్రోత్సాహం గురించి ఎంత చెప్పినా తక్కువే . నాలుగు వ్యాఖ్యలు రాయాలని వచ్చిన నాతో నాలుగు పుంజీల కథలు వ్రాయించేసారు . ఈ బ్లాగులు నాకు పరిచయం కాకపోయుంటే అమూల్యమయిన కాలం ఊరికే వ్యర్ధంగా గడిచిపోయుండేది ! అపుడేనా అనిపించిన ఈ అయిదేళ్ళ కాలం నాకు కొన్ని యుగాలుగా తోచేది . సీరియస్ గా ఆలోచిస్తే నా జీవితంలో ఇది తరిగిన కాలం కాదు పెరిగినకాలం . మిమ్మల్ని నవ్విస్తూ, మీతోపాటు నవ్వుకుంటూ ఆనందాన్నీ , ఆయుషును పెంచుకున్న కాలం ( ఊ..నిజంగా సీయస్) . అన్నిటికన్నా ముఖ్యంగా- ఏ జన్మ బంధాలో అనిపించే ఎంచక్కటి స్నేహాలు, పలకరింపులు , సరదాకోసం … పెట్టుకునే గిల్లికజ్జాలు, కొన్నాళ్ళు కనిపించకపోతే ఏవయిపోయారో అన్న పరామర్శలు, కష్ట నష్టాలకి అందివచ్చే సలహలూ ,సూచనలు . ఇదిగో …నాకీ అవకాశం వచ్చిందని చెప్పగానే వచ్చి పడే అభినందనలూ, శుభాకాంక్షలు…..ఏమని చెప్పను , ఎన్నని చెప్పను . ఇవన్నీ కేవలం మన మాటలు, రాతలు చేకూర్చిపెట్టిన బాంధవ్యాలు అని తలుచుకుంటే ఎంత గర్వంగా , తృప్తిగా వుంటుందో .

నాలుగు గోడల మధ్య నుంచీ ఒక విశాల ప్రపంచంలోకి నా ఉనికిని తీసుకెళ్ళిన ఈ బ్లాగులన్నా , తోటి బ్లాగరులన్నా నాకెంతో ఇష్టం, గౌరవం . మీ నవ్వులే నాకు ప్రశంస లయ్యాయి . కాలక్షేపం కోసం వ్రాసిన రాతలే నాకూ కాసింత గుర్తింపును తెచ్చాయి ‘మీ శైలి బావుంది -మా పత్రికలో వేస్తాం సరదాగా వుండే కథలు రాసి పంపండి ‘ అని స్వయంగా ఒక వారపత్రిక సబ్ ఎడిటర్ గారు ఫోన్ లో చెపుతుంటే ఆనందంతో ఎగిరి గంతులేసిన క్షణాల్లో నాకు మీరంతా గుర్తొచ్చారు . …..నిజంగా! “సుజాత గారూ ఇలా ఫోన్ చేయమని మెసేజ్ వచ్చిందండీ , నాకేం తెలీదుకదండీ ఎలా?” నేను నసుగుతుంటే , ఏం పర్లేదు ముందు ఫోన్ చేసి మాట్లాడండి అంటూ ధైర్యం చెప్పి నన్ను ముందుకు తోసారు . నేను సంకోచిస్తూ ఆగిపోయినప్పుడల్లా ఎవరో ఒకరు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు . ఇదిగో ఇప్పుడు కల్పన గారు మీరు రాయగలరు అంటూ సారంగ లో నాకు చోటిచ్చారు . అసలు ,నాకేం తెలుసనీ ….అన్నీ ఒట్టి బెకబెకలు . గట్టిగా ఈదితే నాలుగు బారలు నా ప్రపంచం , తలెత్తి చూస్తే కనపడే దోసెడు ఆకాశం అంతేగా . మా ఊరు, ఇల్లు, పిల్లలు, కుటుంబం, ఇరుగిల్లు పొరిగిల్లు . అసలేం వుంటాయ్ నేను వ్రాయటానికీ మీరు చదవటానికీ . అయినా చదివారు , మెచ్చుకున్నారు , ప్రోత్సహించారు .

ఒక సంగతి చెపితే మీరస్సలు నమ్మరేమో ! ఇంతకుముందు నేను యమా సీరియస్స్ . అంటే పుట్టుకతో కాదు …మధ్యలో పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోయానన్నమాట . ఎవరితోనూ కలవటానికి ఇష్టపడకుండా ‘నాదంతా ఓలోకం- నేనెంతో ప్రత్యేకం ‘ అన్నట్టుండేదాన్ని. దానికే ఈ పాడు ప్రపంచం పొగరని పేరు పెట్టింది . “ ఏం మాట్లాడదు మనసులో ఏం వుందో తెలీదు “అన్నది నా మీద మావాళ్ళకి ఉన్న పెద్ద కంప్లైంట్ …..ఇంటికొచ్చిన వారిని పలకరించడం చాతకాక , చాలా సేపు వంటగదిలోనో, బాత్రూం లోనో వుండిపోయేదాన్ని, బాగా అలవాటయిన వాళ్ళతో తప్ప కొత్తవాళ్లతో నాకు మాటలుండేవి కాదు . ఎవరేం చెప్పినా వింటూ బ్రహ్మానందం టైపులో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూకూర్చునేదాన్ని . ఇక సిగ్గు, మొహమాటం అయితే టన్నులకొద్దీ మోస్తూ తిరిగేదాన్ని. ఎప్పుడయితే బ్లాగు మొదలు పెట్టానో ఇక అప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అవును ఒక బ్లాగ్ నా జీవితాన్నే మార్చేసింది  ఇప్పుడు మనిషిని చూస్తే మాట్లాడించ బుద్దేస్తుంది . ఎదురుగా ఎవరూ లేకపోయినా నాతో నేనే మాట్లాడేసుకుంటున్నాను. విసిగిపోయి అబ్బా..చాల్లే వెధవ సోది అని నన్ను నేనే కసురుకుంటున్నాను ఇతరుల బ్లాగుల్లో వ్యాఖలు రాస్తున్నప్పుడే మెల్లగా మొహమాటం, బిడియం, వంటివి వదిలిపోయాయి. మనసులో భావాలను అక్షరాల్లోకి మార్చి అలా చల్లుకుంటూ పోతుంటే ఎన్నేళ్ళుగానో మోస్తున్న బరువంతా మెల్ల మెల్లగా తరిగిపోయింది /కరిగిపోయింది. పగిలిన పత్తి కాయలా అయిపోయాన్నేను. కలా, నిజమూ కాని ఈ ప్రపంచలో నా అభిప్రాయానికీ, ఇష్టానికీ, నవ్వుకూ, విచారానికీ అన్నిటికీ చోటుంది. ఇక్కడ మనం ఆడిందే ఆట, పాడిందేపాట అని ఆనందంగా గంతులేస్తుంటే ఇక మనల్ని అడ్డేవాళ్ళు లేరన్న ధైర్యంతో చిన్నప్పటి అల్లరి మళ్ళీ నా జట్టు కట్టేసింది . ఒక్కోసారి ‘ ఏంటా అల్లరి ’ అని నన్ను నేనే విసుక్కొని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది ( ప్లస్ లో నండీ- బ్లాగులో పెద్దమనిషి తరహాలో కొంచెం పద్ధతిగా వుంటాం లెండి) .

ఒకప్పుడు తెలిసినవాళ్ళనయినా పలకరించడానికి బిడియపడే నేను సరాసరి ఒక ప్రముఖ రచయిత్రి ని నేను మీ అభిమానిని అని పరిచయం చేసేసుకుని, మొదటి పరిచయంలోనే నాకు మీ ఇంటర్వ్యూ కావాలని అడిగేంత ధైర్యం చేసేసానంటే గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది ( జంధ్యాల సైట్ లో ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి ఇంటర్వ్యూ నేను చేసిందేనోచ్ ) . ఎందరో మహానుభావుల పరిచయ భాగ్యం కలిగింది .కొందరు రచయితలని స్వయంగా కలిసి మాట్లాడే అవకాశం దొరికింది . ఇంకో విషయం ….బ్లాగులోకి రావడం వల్ల నేను ఇతరులని మనస్ఫూర్తిగా ప్రశంసించడం / అభినందించడం నేర్చుకున్నాను ( దీనిక్కూడా మొహమాటమే అంతకుముందు) . బ్లాగుల్లోనే కాదు బయట కూడా అందరితో కలుపుగోలుగా వుండటం అలవాటయింది..ఒక్క ముక్కలో చెప్పాలంటే నా రాతలవల్ల తెలుగు బ్లాగులకి ఒరిగిందీ, జరిగిందీ ఏం లేకపోయినా బ్లాగులోకి రావటం వల్ల నా వ్యక్తిత్వంలో ఇదివరకూ ఉన్న లోపాలు సవరించుకొని మంచి లక్షణాలు అలవర్చుకునే అవకాశం నాకు దొరికింది. దానివల్ల వ్యక్తిగతంగా నాకు చాలా మేలు జరిగింది .

బ్లాగింగు వలన వుండే సానుకూల అంశాలు , పరిమితులు :

నాకు చాలా గొప్పగా అనిపించే విషయం : పరిచయం కావటానికి ఏ మాత్రం ఆస్కారం లేని మనమంతా ఇక్కడ ఇలా కలిసి ఆలోచనలు వెలిబుచ్చుకోవటం ,విజ్ఞానాన్ని పంచుకోవటం, కబుర్లు కథలు చెప్పుకొని హాయిగా నవ్వుకోవటం, కష్ట సుఖాల్లో తోడ్పాటు అందించుకుంటూ …. పరస్పర ప్రోత్సాహంతో ఎంతో కొంత ముందుకెళ్ళగలగడం . మనసులో భావాలను ఎప్పటికప్పుడు బయట పెట్టేసుకోవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది . ఎక్కడో ఏదో ఘోరం జరుగుతుంది. ఆ వార్త మనల్ని చాలా ఆలోచింప చేస్తుంది . దాని గురించి మాట్లాడేస్తే మనకి ఉపశమనం కానీ , ఎవరితో చర్చిస్తాం . మనచుట్టూ మనుషులే కానీ మన గోల వినే సమయం సందర్భం వాళ్ళకి కలిసిరావాలి . బ్లాగులో ఒక టపా కొట్టేస్తే సగం భారం దిగిపోతుంది. ఎంతలేదన్నా ఒకరో ఇద్దరో మనతో గొంతు కలుపుతారు . చర్చ జరుగుతుంది. దాంతో సమస్య పరిష్కారం అయిపోతుందని కాదు కానీ, సమాజం లో జరిగే మంచి చెడులకు స్పందించకుండా జడత్వంతో ఉండిపోవడం కంటే ఇది చాలా మెరుగు కదా . మనం రాసిన కవితో, కథో పత్రికలో వస్తుంది. గెంతుకుంటూ వెళ్ళి కనపడ్డవారికల్లా ఈ వార్త చెపుతాం. అయితే ఏంటీ అన్నట్టు చూస్తారా! …ఉత్సాహం మొత్తం మట్టికొట్టుకుపోతుంది. అదే వార్త బ్లాగులో చెపితే అభినందనలు వెల్లువెత్తుతాయి. ఎందుకంటే ఇక్కడ ఆ ఆనందం విలువ తెలిసినవాళ్ళు ఉంటారు . వాళ్ళ అభినందనల్లో నిజాయితీ వుంటుంది . నా వరకూ నాకు , బ్లాగుల్లో దొరికిన ప్రోత్సాహంతోనే పత్రికల వరకూ నా కథలు తీసుకెళ్ళగలిగాను . నా దృష్టిలో ఎంతో గొప్పవారైన కొందరు వ్యక్తుల అభినందనలు అందుకోగలిగాను. పరిమితులు : అతి కూడదని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదండీ . ఎవరికి వారే తమ పరిమితులు తెలుసుకు మసులుకుంటే అందరికీ ఆహ్లాదం, ఆనందం.

మహిళా బ్లాగరుగా మీ ప్రత్యేకత :

అత్తగారి కథలు రాసుకోగలగటం 

సాహిత్యంతో మీ పరిచయం :

నా అదృష్టం కొద్దీ చాలా చిన్నప్పుడే పుస్తకాలతో స్నేహం కుదిరందండోయ్ . మా లోగిట్లో అందరికీ పుస్తకాలు చదివే అలవాటుండేది . విప్లవ సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంధాలు ఇలా ఏవో ఒకటి . మా మావయ్య అలమారాలో( అమ్మ తమ్ముడు) ఇంగ్లీష్ నవలలు ఉండేవి . పలచని కాగితాల్లో నలుసుల్లాంటి చిన్న చిన్న అక్షరాలతో దిబ్బ రొట్టెల్లా ఇంతింత లావుండేవి . అమ్మో అంత ఇంగ్లీషు ఎలా చదువుతారో అని భయపడేదాన్ని. ఒకసారి బాగా డబ్బులు అవసరం పడి (మొరమరాల ఉండలు తినాలనిపించి ) కొట్లో తూకానికి వెయ్యబోతే వాడు తీసుకోలేదు పొట్లాలు కట్టడానికి పనికి రావని. దాంతో నాకు ఇంగ్లీష్ నవలల మీద అయిష్టం పెరిగిపోయింది  .మా లోగిట్లో ఒక వాటాలో సరోజిని అత్తయ్య లైబ్రరీ నడిపేవారు .పావలా అద్దె కట్టకుండా నాలుగు బీరువాల నవలలు నమిలి పారేసాను .

ఆ పక్కవాటాలో చంటి మావయ్య దగ్గర సోవియట్ ( కమ్యూనిస్టు సాహిత్యం అనుకుంటా) రచయితలతో పాటు శ్రీ.శ్రీ, చలం, ఆరుద్ర వంటి దిగ్గజాలు పరిచయం అయ్యారు . అర్ధం కాకపోయినా పట్టుకున్న పుస్తకం పూర్తయ్యేవరకూ వదలకూడదన్న పట్టుదలతో కంటికి కనిపించినవన్నీ చదివేయడమే. వీక్లీ కొనుక్కునే చుట్టాలింటికి వెళ్ళి వచ్చేప్పుడు , బరువనుకుంటే రెండు జతల బట్టలు వదిలేసయినా సరే ఓ కట్ట వీక్లీలు తెచ్చేసుకుని పడీ పడీ చదివేయటం . ఆ వయసుకి వాటినించీ ఏం నేర్చుకోవాలో తెలియకపోయినా …అక్షరాలనీ, ఆ భావలనీ కళ్ళతో తోడుకుని మనసులో ఒంపేసుకోటంలో గొప్ప ఆనందం వుండేది. మా జట్టంతా పోటీలు పడి చదివేవాళ్ళం ( మా లోగిట్లో పేద్ద పిల్లలమంద వుండేది . ఏం చేసినా అందరం కలిసే చేయటం – చివాట్లు తన్నులూ కూడా పక్షపాతం లేకుండా వడ్డించేవారులెండి పెద్దలు) .

నా దగ్గర బహుమతిగా వచ్చిన పుస్తకాలు కూడా ఎక్కువే వున్నాయి . మధ్యలో దాదాపు పదేళ్ళు సాహిత్యానికి దూరంగా వుండిపోయాను . బ్లాగుల్లోకొచ్చాకా కరువు తీరా చదువుకో గల్గుతున్నాను. సరదాగా ఓ సంగతి : నా పెళ్ళికి మా బుల్లి మావయ్య , స్త్రీవాద కవితా సంకలనం బహుమతిగా ఇచ్చారు . నేను కొత్త ముచ్చటలో పడి ఆ పుస్తకాన్ని అటకెక్కించాను. ఎప్పుడో అయిదారేళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలతో వేగుతున్నప్పుడు ఆ పుస్తకం చదివి పేజీకొకటి చప్పున వేడి నిట్టూర్పులు విడిచి చేతులు కాల్చేసి ఆకులు అందించినట్టూ ఇదేం పని బుల్లిమావయ్యా అని మనసులో మధనపడి , ఆ పుస్తకాన్ని మళ్ళీ అటకమీద పెట్టేసి, మాలతీ చందూర్ గారి వంటల పుస్తకం లో తలపెట్టేసాను ప్రశాంతంగా.

నాకు స్త్రీవాద సాహిత్యంతో పరిచయం కలిగింది నీలిమేఘాలతోనే . కారణం విడమర్చి చెప్పలేను కానీ , ఆ లేత వయసుకి ఆ ఖా….రం పడలేదు . ఇప్పుడు చదివినా కొన్ని భావాలు మరీ ఏకపక్షంగా ఉన్నాయనిపిస్తాయి . రంగనాయకమ్మ, ఓల్గా దొరికితే ఎంతో ఇష్టంగా వారి వెంట చివరి వరకూ వెళ్ళి …అబ్బే ఈ మార్గం నాకు నచ్చలేదు అని విబేధిస్తూ వెనక్కి మళ్ళేస్తాను . వ్యక్తి స్వేచ్చ ముఖ్యమే . దాని కోసం కుటుంబ వ్యవస్థని చిన్నా భిన్నం చేయటం నాకు నచ్చదు . చిన్నా పెద్దా అన్ని విషయాల్లోనూ నాదంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవటం, అలాగే ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తూ అటువైపునుంచి కూడా ఆలోచించగలగడం పుస్తకాలు చదవడం వల్లనే అలవడింది . సమానత్వం సాధించడం అంటే స్త్రీ ప్రకృతి సిద్దమయిన తన ప్రత్యేకతలను కోల్పోయి తాను కూడా పురుషునితో సమానమయిన కాఠిన్యాన్ని సంతరించుకోవటం కాదేమో అని నాకనిపిస్తుంది . అయ్ బాబోయ్….నేనేంటి ఇంత సీరియస్ గా ……. తూచ్…తూచ్…  సాహిత్య ప్రక్రియల్లో కథ నాకు చాలా ఇష్టమయినది . ఎప్పటికయినా నా పేరుతో నిలిచిపోయే ఒక్క మంచి కథ రాయాలనేది నేను ఏర్పరుచుకున్న లక్ష్యం

జీవన నేపధ్యం :

మా నాన్నగారిది దేశం అంతా తిరిగాల్సిన ఉద్యోగం . దాంతో నేను అమ్మమ్మ దగ్గరే వుండిపోవాల్సొచ్చింది. మద్రాసు , కేరళ లో ఉండేప్పుడు సెలవుల్లో తీసుకెళ్ళేవారు. హైదరాబాద్ లో మూడేళ్ళు చదివాను . వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మా ఊరొచ్చేసి వ్యవసాయం లో పడ్డారు . మా ఊర్లో టెంత్ మాదే ఫస్ట్ బేచ్ . “మిలట్రీ రాజుగారమ్మాయి పెద్ద పరీచ్చ పేసయ్యేరంట “అని ఊరంతా కోడై కూసింది . అమ్మాయిలని కాలేజ్ కి పంపటం కూడా నాతోనే మొదలయింది. ” ఎందుకమ్మా…..రోజూ పయాణం సేసి నలిగిపోతన్నారు. మీకు సదువెందుకూ మానేసి ఇంట్లో నీడ పట్టున కూకోండమ్మా ” అని కండక్టరు డ్రయివరుతో సహా అందరూ బ్రతిమాలేవారు. నేను వినలా…. !

నాన్నగారి ప్రోత్సాహంతో టైపనీ, హిందీ పరిక్షలనీ అవకాశం వున్నంతవరకూ అన్నీ వెలగబెట్టేసాను . సోషియాలజీ లో పి. జీ చెయ్యాలనుకున్నాను నా అలక్ష్యం వల్ల సాగలేదు. పక్కూరు లో ఓ బుద్ధిమంతుడున్నాడు పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు . అని పెద్దవాళ్ళు పందిట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే , నేను సిగ్గులు ఒలకపోసుకుంటూ వాళ్ళ ముందునుంచీ తుర్రుమని పరిగెట్టా సినిమాటిక్ గా . అంతే…. పిప్పి..ప్పీ…డుం.డుం..డుం. సోగ్గాడు- పండంటికాపురం – పిల్లా పాప – పాడీ పంటా – నిత్యకళ్యాణం పచ్చతోరణం . నా జీవితం నల్లేరుమీద బండి నడకలా సురక్షితంగా, సుఖంగా సాగిపోతున్నా …… చుట్టూ ఉన్న ముళ్ళకంపలాంటి సమాజాన్ని, గాయపడుతున్న తోటివారిని చూసి భయపడుతూ/బాధపడుతూ వుంటాను. పిల్లలతోపాటు నాభయం కూడా పెరుగుతుంది. వాళ్ళని మాతో పాటు పల్లెటూర్లో ఉంచుకోలేం కదా ! ఉన్నదానితో తృప్తిగా గడిపేసే రోజులు కావుగా ఇవి .

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని ?

అలా అడిగేస్తే ఏం చెపుతావండీ ….. ఏమో , ఇదే నా బ్లాగులో పెట్టే చివరి పోస్ట్ కావచ్చు, ఎవరన్నా బ్రతిమాలితే ఇంకో ఆర్నెల్లు ఉండి పోవచ్చు . తీరా బ్లాగు మూసేసి పోయాకా మళ్ళీ మీరంతా గుర్తొస్తే వెంటనే పరిగేట్టుకు వచ్చీయొచ్చు అదండీ .

సరదాగా ఏవన్నా చెప్పండి : బాగా చిన్నప్పుడు మనం ఆడమన్నట్టల్లా ఆడటానికి ఒక గేంగ్ ని వెంట తిప్పుకునేదాన్ని , మరి ఏ కాలం లో అయినా గేంగ్ లీడర్ కి చాలా కష్టాలుంటాయండీ . వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తూ వుండాలి లేపోతే పచ్చి కొట్టేసి పార్టీ పిరాయించేస్తారు. రోజూ సేమ్యా అయిసులు కొని పెట్టాలి . తీర్థాలప్పుడు జీళ్ళు తినిపించి, రంగులరాట్నం ఎక్కించాలి, మన ఖర్మ కాలి ఎవరి వీధిలో అయినా సినిమా వేస్తుంటే వాళ్ళందరికీ టికెట్లు మనమే కొని పెట్టాలి …ఇలాంటి బోల్డు ఖర్చులుంటాయి. అవన్నీ ఎలా వస్తాయ్ …తాతయ్యంటే భయం, అమ్మమ్మని అడిగావనుకోండి మహా అయితే పావలా ఇస్తారు . మన ఖర్చుకి పది రూపాయలన్నా కావాలి. ఇక తప్పక అప్పులు చేయాల్సొచ్చేది. అప్పులోళ్ళు మీ తాతయ్యతో చెపుతాం అని బెదిరిస్తే విధిలేని పరిస్తితుల్లో తాతయ్య జేబు కొల్లగొట్టాల్సి వచ్చేది ( మధ్యాహ్నం భోజనానికొస్తూ మిల్లునించీ జేబు నిండా చిల్లరేసుకొచ్చేవారు. అబ్బా…డబ్బుల మిల్లు కాదండీ , రైసు మిల్లు ) ఇంకా తీరని అప్పులుంటే పండక్కి అమ్మ వచ్చినపుడు తీర్చేసేది లెండి. ఎలా తెలిసేదో వాళ్ళు బస్సు దిగి కాళ్ళు కడుక్కునేసరికే వీధి వాకిట్లో అప్పులోళ్ళు క్యూ కట్టేసేవారు . నేను ధాన్యం గాది కింద దాక్కునిపోయేదాన్ని. మనం చేసిన ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా మరి ఆ మాత్రం భయం లేకపోతే ఎలా . వారానికోసారి రామిండ్రీ నించీ పేపర్ తెప్పించుకుని వారవంతా అదే తిప్పి తిప్పి చదివే తాతాయ్యొకరు నాకు ఫూలన్ దేవి అని పేరు పెట్టారు అప్పట్లో . కొత్త పేరు బావుందే అని మురిసిపోయాను పిచ్చి మాలోకాన్ని . ఆత్మ కథల్లో మాత్రమే రాసుకోవలిసిన అతిగొప్ప రహస్యం ఇది. మీకంటేనా అనిపించి ఇక్కడ చెప్పేసాను. మీరింకెక్కడా చెప్పకండి హుష్….గప్చుప్.

సీరియస్ గా ఏవన్నా చెప్పండి : ఇంకానా , ….అంటే పైన చెప్పినవన్నీ సరదాకనుకున్నారా …భలేవోరే !

మీ బ్లాగ్ లో మీకు నచ్చిన టపా : నిజానికి నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు . మళ్ళీ మళ్ళీ చదివేంత విషయం వున్నవి ఏం లేవు . అయినా అడిగారు కాబట్టి ఇవి చూడండి

http://naaspandhana.blogspot.in/2011/01/blog-post.html http://naaspandhana.blogspot.in/2010/02/blog-post_26.html http://naaspandhana.blogspot.in/2010/01/blog-post_27.html http://naaspandhana.blogspot.in/2010/01/blog-post_09.html http://naaspandhana.blogspot.in/2009/08/blog-post_28.html

చివరిగా ……మనసారా మీతో మరిన్ని మాటలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన మల్లీశ్వరి గారికి ” ఆయ్…సేనా టేంక్సండీ ” .

మంజులనాదం

మంజు యనమదల

బ్లాగర్  పేరు; మంజు యనమదల 

బ్లాగ్ పేరు; కబుర్లు కాకరకాయలు 

బ్లాగ్ చిరునామా;http://naalonenu-manju.blogspot.in/
పుట్టిన తేదీ;21.1.1971
పుట్టిన స్థలం;జయపురం, కృష్ణాజిల్లా
ప్రస్తుత నివాసం;గుడివాడ
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)

విద్యాభ్యాసం;ఇంజనీరింగ్ (స్పెషల్ తెలుగులో ఎమ్ ఏ చేసి పి హెచ్ డి చేయాలనుకున్నా )
వృత్తి, వ్యాపకాలు; సాఫ్ట్ వేర్ క్వాలిటి మానేజర్, అది ఇది అని లేకుండా దొరికిన పుస్తకాలు అన్ని చదవడం, పాటలు వినడం, సరదాగా బొమ్మలు వేయడం, ఒకప్పుడు పాటలు కూడా బాగానే పాడేదాన్ని లెండి…అప్పట్లో పాడుతా తీయగా లేదుగా లేక పొతే నేను టి వి లో కనిపించేదాన్నేమో సరదాకే లెండి :)… వంట చేయడం, బ్లాగులో నాకు అనిపించింది రాయడం… ఇలా చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
 బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;తేది గుర్తు లేదు జనవరి 2009 లో
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి); 500 కి దగ్గరలో

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు? 

మా ట్రస్ట్ గురించి ఎలా ఫ్రీ గా పబ్లిసిటి చేయాలా అని నా స్నేహితులని సలహా అడిగితే  బ్లాగుల గురించి చెప్పారు అలా తెలుసుకుని ట్రస్ట్ కి ఒక బ్లాగు ఓపెన్ చేసి తరువాత నా కబుర్లు కాకరకాయలు మొదలు పెట్టాను…సలహాల కోసం సలహాలు చిట్కాలు అని మరొక బ్లాగు ఓపెన్ చేసాను….ఇదీ నా బ్లాగు సంగతి…నా బ్లాగుని అందంగా తీర్చి దిద్దడంలో మొదట జ్యోతిగారు సలహాలనిచ్చారు .. తరువాత అవి ఇవి పెట్టడంలో చంద్రశేఖర్, శరత్, లక్ష్మిపతినాయుడు సహకరించారు…. టపాలు రాయమని ఎక్కువగా చెప్పింది శ్రీకాంత్..రాయడం మొదలెట్టాక అందరి వ్యాఖ్యల ప్రోత్సాహం మరువలేనిది…అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు అలానే ఆదరిస్తున్నారు…. ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు…

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు? 

మొదట్లో నాకు జరుగుతున్న అనుభవాలు, నా అలొచనలు రాస్తూ ఎవరైనా చూస్తారా అసలు అని అనుకునే దాన్ని…చూస్తే చూడని లేక పొతే లేదు అని నాకు అనిపించినవి రాస్తూ పోతుంటే…అలా నా రాతలను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారని తెలిసి భలే సంతోషం వేసింది…చాలా మంచి స్నేహితులు, అభిమానులు, తమ్ముడు ఈ బ్లాగు ద్వారా దొరికారు. రాసే ప్రతి టపాలో నన్ను నేను చూసుకుంటున్నట్లు గా ఉంది… నా మనసులోని భావాలే మీ రాతల్లో ఉంటున్నాయి…ఈ మాటలు చాలామంది అంటున్నారు…. ఇంతకంటే ఏమి కావాలి??
టపా రాసిన ప్రతి సారి ఇదే చివరిదేమో అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది…అనిపించిన దాన్ని రాయడమే నాకు తెలిసింది. చాలా టపాలకు స్పందన నా మనసులోనిది మీరు రాశారు అని అంటూ ఉంటారు చాలా మంది. సంతోషంగా అనిపిస్తుంది ఆ మాటలు విన్నప్పుడు.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు? 

మనకు అనిపించినవి ముఖ పరిచయం లేక పోయినా అందరితో పంచుకోవచ్చు…అనిపించింది బాధైనా సంతోషమైనా ఏదైనా మనకు నచ్చినట్లు వచ్చినట్లు రాసుకోవచ్చు… ఒక్కోసారి మన రాతలు విమర్శలకు గురి కావచ్చు…లేదా పొగడ్తలు కురియవచ్చు…మనని మనం తెలుసునే ప్రయత్నం చేసుకోవచ్చు…మొదట్లో రాయాలంటే భయంగా అనిపించేది…అయినా ధైర్యం చేసి ఎవరు ఏం అనుకుంటే నాకేంటి నాకు అనిపించింది నాకు వచ్చిన భాషలో రాయడం మొదలెట్టేసాను…. ఇదిగో ఇలా ఈ రోజు మీ ముందు ఉన్నానంటే మరి ఇది బ్లాగు సానుకూల అంశమే కదా..!! నొప్పింపక తానొవ్వక అన్నట్లు ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు…ఇది పరిమితేమో మరి… !!

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత? 

నాకు అనిపించిన కబుర్లు కాని కవితలు కాని అనుభవాలు కాని రాస్తూ ఉంటాను…అమ్మ మనసు అమ్మాయి మనసు పడే తపనను…అది ఇది అని లేకుండా అన్ని రాస్తూ ఉంటాను…అందుకే మహిళా బ్లాగర్ గా నాకంటూ ప్రత్యేకత ఏం ఉందో నాకు తెలియదు…

కాకపొతే అందరు అంటూ ఉంటారు మీరు చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా ఉంటుంది అని….!!
దేనికైనా తొందరగా స్పందించే మనసు… ఆ మనసు మాటలు మాత్రమే రాస్తాను….మహిళగా కాకుండా మనిషిగా నాకు అనిపించింది రాస్తూ ఉంటాను.

సాహిత్యంతో మీ పరిచయం? 

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా చాలా ఇష్టం…రెండో తరగతి నుంచే సీరియల్స్ చదివేదాన్ని .. చిన్నప్పటినుంచి ఇష్టంతో చదివిన పుస్తకాలు బోలెడు…వాటితో పాటుగా అమ్మమ్మ తిట్టినా…స్నేహితులు పోట్లాడినా…అలా రాయడం మొదలు పెట్టి…ఉత్తరాలతో పలకరింపులు….చిన్న చిన్న కవితలతో మొదలై ఏదో ఇలా బ్లాగులో నా ఆలోచనలను, అనుభూతులను, అనిపించిన దాన్ని రాయడం మొదలు పెట్టాను. చందమామ తో కాకుండా ముందుగా రాధాకృష్ణ సిరియల్ తో నా పుస్తక పఠనం మొదలు అది ఇది అని లేకుండా అన్ని చదివేస్తూ ఉంటాను ఇప్పటికి.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా? 

కొన్ని సార్లు కాస్త అలోచించి రాయాల్సి వస్తుంది…ఇప్పటి వరకు ఇబ్బంది ఎదురు కాలేదు…

జీవన నేపధ్యం? 

నాన్నకు సంగీత సాహిత్యాలతో…నాటకాలతో పరిచయం…రచయితా కూడాను…పేరున్న రచయిత కాదులెండి…అమ్మకు అస్సలు ఈ రాతలు ఇష్టం ఉండదు….ఎప్పుడు ఏంటా రాతలు అంటూ ఉంటుంది.

మాది మధ్య తరగతి రైతు ఉమ్మడి కుటుంబం. బంధాలు బాధ్యతలు ప్రేమలు అభిమానాలు, కోపాలు ఆవేశాలు  అన్ని కలిసున్న కుటుంబం. చదివింది ఇంజనీరింగ్ అయినా గురు లఘువులతో తెలుగు అంటే ఇష్టం మొదలై అది అలా పెరిగిపోయి తెలుగు అంటే ఉన్న అభిమానంతో రాష్ట్రాలు మారినా… దేశాలు తిరిగినా తప్పని స్థితిలో మాత్రమే తెలుగు మాట్లాడను. కూటి కోసం పరాయి భాష…ఆత్మ సంతృప్తి కోసం అమ్మ భాష అండి…

మా వారికి అస్సలు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇద్దరు అబ్బాయిలు చిన్నవాళ్ళే….తొమ్మిది…ఐదు  చదువుతున్నారు.

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని? 

నేను జీవించి ఉన్నంత వరకు…నాకు వీలైనంత వరకు…

సరదాగా ఏవైనా చెప్పండి? 

కామెంట్లకు జవాబిస్తూ నేను ఓ పెద్ద రచయితలా ఫీల్ అయిపోతు ఉంటాను….ఇదిగో ఇప్పుడు మీకు ఇంటర్వు ఇస్తూ కూడా భలే బావుంది నా గురించి కూడా చెప్పమని అడిగారే అని ఒకింత గర్వంగా ఫీల్ అయిపోతున్నాను.

సీరియస్ గా ఏవైనా చెప్పండి? 

జీవితం లో అన్ని చూసాను….మొత్తంగా జీవితాన్ని చూసాను..చూస్తున్నాను…. 

1.కబుర్లు 

నాలో నేను 

అమ్మో అప్పుడే మద్య వయసు వచ్చేసిందా!! ఈ నాలుగు పదుల జీవితంలోకి ఓసారి తొంగి చూసుకుంటే…!!
తప్పొప్పులు, తీపి చేదు అనుభవాలు, నిజాలు అబద్దాలు, కొన్ని చేదు నిజాలు, మనకిష్టం లేక పోయినా ఎదుటి వారి ఆనందం కోసం చేసిన పనులు, మనకోసం మాత్రమే…మనకి మాత్రమే సొంతమైన కొన్ని అనుభూతుల పరిమళాలు…..ఇలా ఎన్నో రకాల అనుభూతుల మాలికే దేవుడిచ్చిన ఈ జీవితం. మనకి మాత్రమే సొంతమైన, మనది మాత్రమే అయిన మన జీవితం.
జీవితాన్ని అందరూ అందంగానే మలచుకోవాలని, సంతోషంగానే వుండాలని మొదలు పెడతారు కాని అందరికి అన్ని దొరకవు కదా!! మన గతజన్మ ఖర్మ ఫలితాన్ని బట్టి మన నుదుటి రాతని మనం పుట్టే కొన్ని క్షణాల ముందే రాసేస్తాడు. ఈ లోకం లోకి రావడం మొదలు బతకడానికి పోరాటం మొదలు పెడతాము. అదృష్టవంతులు బంగారు స్పూను నోటిలో పెట్టుకు పుడితే, కొంత మంది వెండి, రాగి ఇలా జీవితాలు మొదలవుతాయి.
నేను బంగారు స్పూనుతో పుట్టక పోయినా అదృష్టవంతురాలినే చిన్నప్పుడు. అందరి ప్రేమ, ఆప్యాయతలు పుష్కలంగా దొరికేవి. మాది పల్లెటూరు అయినా మేము పెరిగిన వాతావరణం చాలా చాలా బాగుండేది. చదువు, పుస్తకాలు,ఆటలు, స్నేహితులు, బంధువులు, సినిమాలు, షికార్లు ఇలా అన్ని ఆనందాలు దొరికేవి. మరి మనకు నచ్చినట్లు వుండే అలాంటి జీవితం దొరకడం దేవుడిచ్చిన వరమే నాకు. చిన్నప్పుడు డాక్టరు అంటే చాలా ఇష్టం పెద్ద అయినంక అదే చదవాలని అనుకునేదాన్ని. సైన్సు బొమ్మలు కుడా బాగా వేసేదాన్ని, కొద్దిగా బాగానే చదివేదాన్ని. పిన్ని వాళ్ళు రికార్డులు రాసుకొంటుంటే నేను రాస్తాను ఇంతకన్నా బాగా అని అనుకునేదాన్ని. నాన్న ఇంటరులో సైన్సు వద్దు లెక్కలు తీసుకో అంటే సరే అని లెక్కలు తీసుకున్నాను. బొమ్మల మీద అభిమానంతో స్నేహితులకు వేసిపెట్టేదాన్ని. తెలుగు అంటే బోల్డు అబిమానం కాని స్పెషల్ తెలుగు తీసుకుంటానంటే ఒప్పుకోలేదు. సరే ఇక ఇంజనీరింగ్ మొదలు…..వెళ్తే క్లాసులకు వెళ్ళడం, లేదా క్లాసులు ఎగొట్టి సినిమాలకు వెళ్ళడం….ఇది అందరూ చేసే పనేలెండి నేనేం కొత్తగా చేయలేదు. కాకపొతే ఇంట్లో వాళ్ళని చూడకుండా ఎక్కువ రోజులు వుండటం అలవాటు లేదు అందుకే పది, పదిహేను రోజులకి ఇంటికి వెళ్ళడం. హోటల్ కి వెళ్తే ఓ మంచి కాఫీ, దోశ, ఐస్ క్రీం పార్లర్ కి వెళ్తే భేల్పూరి, వెనీలా తినడం, ఉత్తరాలు, హాస్టల్లో పుట్టినరోజు పార్టీలు, రాగింగులు, క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి, బస్సులో అంత్యాక్షరిలు, పరీక్షల్లో నైట్ అవుట్లు…. …..ఇలా బానే గడిచి పోయింది.
అస్సలు కత మొదలైంది చదువు అయినంక….నాకు, మా నాన్నకి చిన్న మాట తేడా వచ్చి నేను ఎంచుకున్న దారిలో నడవడం మొదలు పెట్టాను. కష్టమైనా, నష్టమైనా నేనే పడ్డాను చాలా రోజులు. ఇంట్లో వాళ్ళు కుడా నాతొ పాటుగానే అన్ని అనుభవించారు ఆ టైములో. మనం వాళ్ళని కాదన్నా వాళ్ళు మనల్ని వదులుకోలేరు ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా అక్షర సత్యం. మా అత్తింటి వాళ్ళు అందరూ వాళ్ళ స్వార్ధం కోసం అందరు బంధువుల్లానే తమ నిజ స్వరూపం చూపించారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరేగా వుంటారు, ఇది మానవ నైజం దీనిలో మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఏమి లేదు. కాక పొతే నమ్మకం మీద, మానవత్వపు విలువల మీద దెబ్బ కొట్టారు అది మర్చి పోలేను.
నేను నడుస్తున్న దారిలో ముళ్ళు, రాళ్ళు ఏరుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాను….కొన్ని కావాలంటే కొన్నిటిని వదులుకోవాలని పసి పిల్లలని( ఒకటినర్ర , ఆరు నెలల పిల్లలని) అమ్మ వాళ్ళ దగ్గర వదిలి….మరి బతకడానికి డబ్బులు కావాలి కదా!! దేశం కాని దేశం లో ఏదో ఒక తిప్పలు పడి కాస్త నిలదొక్కుకున్నాము. పెద్ద బాబు చచ్చి బతికినా కుడా రాని, కనీసం చూడని అత్తింటి వారికి డబ్బుల అవసరాలు తీర్చి, చిన్న ఆడబిడ్డకు పెళ్లికి డబ్బులు ఇచ్చి, పెళ్లి కుదిర్చి చేస్తే కుడా మామీద ఇంకా కోపమే వాళ్లకి.ఆ పెళ్లి కొడుకు ఆవిడకి నచ్చలేదంట. అది ముందు చెప్పలేదు.నేనేదో అబద్దం ఆ అబ్బాయి జీతం విషయంలో చెప్పానంట. నేను చెప్పలేదు, అడిగితే నాకు తెలియదు నాలుగువేలో,ఐదువేలో నాకు తెలియదు ఫోను నెంబరు ఇదిగో మీరే ఇంకా ఏమైనా అడగదల్చుకొంటే అడగండి అని చెప్పాను. అది జరిగింది. మరిది తోడికోడలు వాళ్ళని అమెరికా మేమే డబ్బులు కట్టి తీసుకు వెళ్లి మూడు నాలుగు నెలలు మా ఇంట్లోనే ఉంచుకుని అన్ని చేస్తే వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఈ రోజు మా డబ్బులు పదిహేను లక్షలు ఎగొట్టారు. ఇదండీ బంధువుల రాబందుల గోల!!
ఇక ఉద్యోగం అంటారా!! అది అంతేనండి. పని సంగతి ఏమో కాని రాజకీయాలు బాగా నేర్చుకోవచ్చు. మనం పని చేస్తున్నాము కదా, మళ్ళి దాని గురించి చెప్పడం ఎందుకు? వాళ్లకి తెలుసు కదా!! అనుకుంటాము కాని మనం చేసే పనిని వాళ్ళకిష్టమైన వాళ్ళు చేసారు అని, పని చేసిన మనం ఏమి చేయలేదని, మనకి ఏమి రాదనీ చెప్పడం….ఎవరి దగ్గర నాటకాలు వాళ్ళ దగ్గర వేయడం, చేతలు లేకుండా మాటలు కోటలు దాటించడం…ఇలా మనకు తెలిసిన అనుభవాలే అన్ని. కాదంటారా!! చదివి నవ్వు కుంటున్నారా!! మరి ఇవేనండి నా నాలుగు పదుల అనుభవాల అనుభూతులు కొన్ని.

1.కవిత 

 ఇదీ బావుంది…!! 


చుట్టూ అందరున్నా నాకెవ్వరూ లేనట్టుగా
అన్ని బందాలున్నా ఏ బంధమూ నాది కానట్టుగా
నిస్పృహో….
నిట్టూర్పో..
నిస్సహాయతో…
ఏదో తెలియని…
నిశ్శబ్ద శూన్యం ..!!
ఒంటరితనంతో ఏకాంతమో….!!
ఏకాంతంతో సహవాసమో….!!
ఎలా ఉన్నా అన్నింటా నువ్వే…!!
వడి వడిగా పరుగులెత్తే  కాలం
ఎవరి కోసం దేని కోసం ఆగనట్లే…..
మెల్లగా తడిమి వదలి పోయింది….
నీ జ్ఞాపకాలతో నన్నుండమని….!!

2.స్వప్నమో కాదో…!!


కలో కలవరమో తెలియనిఅయోమయంలో నిదుర కాని

మెలుకువ లోని ఒక స్వప్నం

వేకువలో నిజమయ్యేనా!!

కమ్మని అమ్మ లాలి పాట

నను పరవశింప చేసేనా!!

అమ్మ చల్లని చేతి స్పర్శలోని

వెచ్చదనం నా కందేనా!!

కలైన ఈ కలవరింత లోని

కమ్మదనం, అమ్మదనం అచ్చంగా నాదైతే!!

మెలుకువలోని మరిన్ని నా స్వప్నాలు

వేకువ పొద్దులో నిజమౌతాయి….!!

సాహితీ సుమబాల – మాల

Inline images 1

 బ్లాగర్ పేరు; మాలా కుమార్

 

 బ్లాగ్ పేరు; సాహితి

 
 
బ్లాగ్ చిరునామా;  http://sahiti-mala.blogspot.in/
 
పుట్టిన తేదీ;  25- జూలై
పుట్టిన స్థలం;  గుంటూరు
 
ప్రస్తుత నివాసం;  హైదరాబాద్
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)   శ్రీనగర్ కాలనీ , హైదరాబాద్

విద్యాభ్యాసం; పి.జి ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ 

వృత్తివ్యాపకాలు;  ప్రీస్కూల్ టీచర్ , బ్యూటీషియన్ , ప్రస్తుతము గృహిణి . వ్యాపకాలు ఒకప్పుడు పేంటింగ్ , నిట్టింగ్ , టేలరింగ్ , రకరకాల వంటలు వండటం . ప్రస్తుతము పుస్తకాలు  చదవటం ,  తోటపని , వంటలో ప్రయోగాలు & బ్లాగింగ్ .

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;  డిశెంబర్ 27 , 2008.

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);  మొత్తం నాలుగు బ్లాగులు .

 1.       సాహితి – 215

 http://sahiti-mala.blogspot.in/

 2.కమ్మటికలలు -149,

 http://kammatikala.blogspot.in/

 3. చల్తేచల్తే -40,

 http://prayanamlopadanisalu.blogspot.in/

 4. ప్రభాతకమలం-44

 http://kamalamadapati.blogspot.in/
 బ్లాగ్ లోని కేటగిరీలు; అచ్చట్లు-ముచ్చట్లు , ఆర్మీలైఫ్, శుభాకాంక్షలు , అహా ఏమిరుచి , కథలు ,నా ఆలోచనలు , మహిళలూ- మహరాణులు వగైరా

 

 బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

 నేను కంప్యూటర్ నేర్చుకున్నకొత్తల్లో మా ఇంట్లోని పిల్లల ద్వారా తెలుసుకున్నాను .అదే రోజు మొదలు పెట్టాను .” సాహితి “ముందుగా మొదలు పెట్టాను . పాటలకోసం “ కమ్మటికలలు” , నా   ప్రయాణపు అనుభవాలు రాసుకోవటం కోసం ‘చల్తే చల్తే’ , మా ఇంట్లోనివారి కోసం” ప్రభాతకమలం” ఇలా నాలుగైపోయాయి .నాకు నచ్చినవి , నాకిష్టమైనవి , నా అనుభూతులు రాసుకోవటాని కి బ్లాగ్ ఒక మంచి వేదికగా అనిపించింది .

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

చదవటము తప్ప వ్రాయటం అలవాటులేని వ్రాయటం నేర్చుకున్నాను . మంచి మితృలను సంపాదించుకున్నాను .మితృల ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకున్నాను . కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను . నాది అంటూ నాకొక ప్రపంచం సృష్ఠించుకున్నాను . నా బ్లాగు నాది , నా స్వంత కృషితో ఏర్పడ్డది అనుకుంటే గొప్పగా వుంటుంది . ఈ మద్య నా పోస్ట్ లన్నీ ప్రింట్ చేయించాను . వాటిని బైండ్ చేయించుకోవాలనుకుంటున్నాను .

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

సానుకూలత అంటే నా భావాలు నిస్సంకోచంగా తెలుపుకోవచ్చు . నాకిష్టమైనట్లు వ్రాసుకోవచ్చు .నలుగురూ చదివి వారి వారి అభిప్రాయాలు తెలుపుతారు . దానితో నా రచనలను మెరుగు పరుచుకోవచ్చు . ఏదైనా  వ్రాసుకోవచ్చు కదా అని , ఎవరి నీ కించపరిచేవి  వ్రాతలు కాని , వివాదాస్పదమైనవి కాని వ్రాయకుండా నాకు నేను పరిమితులు ఏర్పరుచుకున్నాను .

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

ప్రత్యేకత ఏమన్నవుందో లేదో నాకు తెలీదండి 🙂

సాహిత్యంతో మీ పరిచయం?

మా పుట్టింటి వైపు , మా అమ్మ ,పిన్ని , మామయ్యలు అందరూ రచయతలే . మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతే అందరూ కూర్చొని సాహిత్య గోష్ఠి జరుపుతారు . చర్చలు , వాదోపవాదాలు చాలా జరుగుతాయి .మా అమ్మ దగ్గర పెద్ద లైబ్రరీ వుండేది . మా నాన్నగారి ట్రాన్స్ఫర్ల తో తను మేంటేన్ చేయలేక పుస్తకాలన్నీ మా మామయ్యల కిచ్చింది . మా పెద్దమామయ్య గారు నెల నెలా వెన్నెల ను స్తాపించారు . వారి ఇంట్లో ఇప్పటికీ ప్రతినెలా అందులోని మెంబర్స్ ఐన రచయతలు వచ్చి వారి వారి రచనలు చదువుతారు . చర్చించుకుంటూ వుంటారు . అలా చిన్నప్పటి నుంచి సాహిత్య చర్చలు వినటము , పుస్తకాలు చదవటమూ అలావాటైంది .

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

ఏ ఇబ్బందులూ ఎదురుకాలేదు .

జీవన నేపధ్యం?

మామూలు మధ్యతరగతి వాళ్ళము . మావారు ఆర్మీ ఆఫీసర్ కావటము వల్ల ఎక్కువగా వూర్లు తిరగటం అలవాటైంది . సొసైటీ కి ఎక్కువగా ఎక్స్ఫోజ్ అయ్యాను .వివిధ యూనివర్సిటీలలో చదువుకున్నాను 🙂 ప్రస్తుతము అమ్ముమ్మగా , బామ్మగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను .

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

ఇన్నాళ్ళూ అని నేనేమీ అనుకోవటం లేదు . ఓపిక , ఆసక్తి వున్నన్ని రోజులు వ్రాస్తాను .

సరదాగా ఏవైనా చెప్పండి?

చలికాలం లో , అర్ధరాత్రి , మంచం మీద బాసింపట్టు వేసుకొని కూర్చొని , బ్లాంకెట్ కప్పుకొని , చల్లటి ఐస్క్రీం తింటే ఆ సరదానే వేరు 🙂

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎదుటివారిని బాధించేకన్నా నొప్పించక , తానొవ్వక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా వుండాలి .

మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ

నా బ్లాగ్ లోని నా రచనలన్నీ నాకు ఇష్టమైనవే . ఒకటి ప్రత్యేకం అనిలేదు . ప్రత్యేకం గా విడతీయాలంటే కష్టమే .ఐనా తప్పదు అంటే ఈ సీరీస్ అంటే కొంచం ఎక్కువ .

https://docs.google.com/file/d/0B3EHPUVz5hVAZGM0ZjU0MjEtODI3NC00ZDg1LTk4YzYtZjJjZDYyMTg1MjFj/edit?pli=1&hl=en