భాండాగారం

అమ్మమ్మ ‘నిర్జనవారధి’ కాదు…

అసంఖ్యాక పాఠక ‘జనవారథి’

 Posted By భూమిక on December 1, 2012
 మల్లీశ్వరి
 
కొండపల్లి కోటేశ్వరమ్మగారిని 2010 జనవరి 17 తేదీన మొదటిసారి కలిసాను. చాసో స్ఫూర్తి పురస్కార సభకి మేమిద్దరం కలిసి విజయనగరం వెళ్ళాం. ప్రయాణంలో ‘అమ్మమ్మా! నీ గురించి ఏవయినా చెప్పవూ? మాకు స్ఫూర్తిదాయంగా ఉంటుంది కదా!” అని అడగ్గానే, నిష్కపటంగా ఏమాత్రం రాగద్వేషాలు లేని స్వరంతో తన జీవితాన్ని తడుముకున్నారు. పలవరించారు.
 ఏళ్ళ తరబడీ ఎందరినో కదిలించిన ఆ పలవరింతలే ఆమె ఆత్మీయుల సహకారంతో  తన 92 వ ఏట ‘నిర్జన వారధి’గా మన ముందుకు తీసుకు రావడం ఆత్మకథాసాహిత్యంలో మేలిమలుపు. నిర్జన వారధి ఆత్మకథ మాత్రమే కాదు, ఈ కాలానికి అవసరమయిన ఒక చారిత్రక గ్రంథం కూడా.
 నిర్జన వారధిలో చాలామంది పాఠకులు గుర్తించి మెచ్చిన ప్రధానమయిన అంశం… అందులోని అంతస్స్వరం. నలుపు తెలుపులుగా కాక ఎంతో వైవిధ్యం, పోరాటం, దుఃఖం, విషాదం నిండివున్న జీవితాన్ని సమీక్షించుకుంటున్నపుడు ఆగ్రహ ప్రకటనలను నివారించి రాయడం అన్నది అంత సులువేమీ కాదు. మానవోద్వేగాల మీద ఎంతో పట్టు ఉంటే తప్ప అది  సాధ్యం కాదు. ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన ఓల్గా, అనురాధలు కూడా ఆ స్వరాన్ని కాపాడుతూ గౌరవిస్తూ సంయమనంతో రాయడం పుస్తకం ఔన్నత్యాన్ని మరింత పెంచింది.
 ప్రముఖుల జీవిత విశేషాలు, ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలోని వారి బలాలూ, బలహీనతలూ తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. ఒక్కోసారి సంచలనం సృష్టించే అవకాశాలూ ఉన్నాయి. నిర్జన వారధి కూడా సంచలనమే. అయితే ఆ క్షణానికి ఉర్రూతలూగించే సంచలనం కాదు. జీవితానుభవాల ఆధారంగా యిప్పటికీ సమాజంలో పెనగులాడుతున్న కొన్ని వర్గాల తరుపున నిలబడి ప్రశ్నించిన గ్రంథం. నిర్జనవారధి చదివి మొహమాటపడాల్సిందో, నొచ్చుకోవాల్సిందో, ఆశ్చర్యపడాల్సిందో ఏమీ లేదు. నేర్చుకోవాల్సిందీ, ప్రశ్నించాల్సిందీ మాత్రం చాలా ఉంది.
 కొండపల్లి సీతారామయ్యలాంటి విప్లవయోధుడి భార్యగా తను పొందిందీ, కోల్పోయిందీ నిష్పక్షపాతంగా అంచనా వేసుకునే క్రమంలో చాలా విలువయిన ఆలోచనలు చేశారు కోటేశ్వరమ్మ. తన సమస్తాన్నీ త్యజించి, జైలు జీవితానికీ, అజ్ఞాతవాసానికీ చలించక, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన విప్లవ పార్టీ రూపకర్తగా, సమరశీలిగా ఆయన సమాజానికి చేసిన సేవ నిరుపమానం… యింతటి త్యాగం ముందు ఆయనలోని ఒకటి రెండు వ్యక్తిగత బలహీనతలను పక్కన పెట్టడం సమాజానికి కష్టం కాదు… కానీ యిదే క్షమ కోటేశ్వరమ్మగారిలో కూడా ఉండాలని ఆశించడంలో అప్రయత్నంగానే పాతివ్రత్యకోణం చేరుతుంది. అందుకే ”మను సిద్ధాంతం, హిందూ మనస్తత్వం నాలో జీర్ణమై ఎన్ని బాధలు పడినా కూడా పతివ్రతలా భర్తను చూస్తానని నేనొకవేళ అంటే కూడా వద్దని కమ్యూనిస్టుల్లా వారించాల్సిన మీరు, అణచబడ్డ స్త్రీజాతికి అన్యాయం చేస్తావా అంటూ చీవాట్లు పెట్టాల్సిన మీరు ఆయనను చూడమని నాకు చెప్పడం వింతగా ఉంది” అంటారు కోటేశ్వరమ్మ.
 కొండపల్లి సీతారామయ్యని ఆయన వ్యక్తిత్వపు మొత్తంలోంచి చూసినపుడు అసాధారణ, మహోన్నత వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ స్త్రీల దృష్టికోణం నుంచి చూసినపుడు ఆయన కూడా పురుషాధిక్యతకి అతీతుడు కాదని తోచవచ్చు. యిది ప్రత్యేకంగా ఆయన పరిమితి కూడా కాదు. సమాజమే పురుషాధిపత్య భావజాలంలో ఉండటం ముఖ్యకారణం.కులం, మతం, వర్ణం, జెండర్‌ వివక్షలు అంత త్వరగా పోయేవి కావు. వాటిని తమలో గుర్తించి, వదులుకోవడం కోసం నిరంతరాయంగా పోరాటం చేయాల్సి వుంటుంది.
 ఈ పుస్తకం చదువుతున్నపుడు ‘వ్యవస్థలో మార్పు’ అన్న నినాదం యాంత్రికంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికమయిన అంశాలు మాత్రమే ఉండవనీ, ఉత్పత్తి సంబంధాలతో పాటు మానవ సంబంధాలను కూడా కలుపుకుని మార్పుకి కృషి చెయ్యాలని, లేనపుడు మార్పు సమగ్రం కాదన్న హెచ్చరిక కూడా ఈ ఆత్మకథలో ఉంది.
 పుస్తకంలో ఒకచోట ”పార్టీలో పురుషాధిపత్యం తక్కువే” అంటారు. దానర్థం లేదని కాదు. తాము అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకి కమ్యూనిస్ట్‌ పార్టీ కారణమంటూనే పురుషులని దాటుకుని స్త్రీలు వెళ్తే మాత్రం సహించలేకపోయేవారు అంటారు కోటేశ్వరమ్మ . మామూలు పురుషులకన్నా మెరుగే గానీ వారూ ఈ పురుషాధిక్య వ్యవస్థలో భాగమే కదా అన్న అవగాహన ఆమెది.
 కమ్యూనిస్ట్‌ పార్టీ చీలిక పట్ల కోటేశ్వరమ్మకి ఉన్న అసంతృప్తి, బాధ ఈ పుస్తకంలో చాలాసార్లు కనిపిస్తుంది. రాజకీయ ఆచరణల దృష్ట్యా పార్టీ చీలకుండా ఉండటం అసాధ్యమయిన ఆదర్శవంతమయిన ఊహ కావచ్చు కానీ ఒక ఆకాంక్షగా ఆమె చాలాకాలం ఉమ్మడి కమ్యూనిస్ట్‌ పార్టీకి కట్టుబడి ఉన్నారు. పార్టీ చీలిక తర్వాత ఒక పార్టీవాళ్ళు యింకొక పార్టీ వాళ్ళతో కలవడం ఉండేది కాదని చెపుతూ ”మగవాళ్ళకి మానవ సంబంధాల కన్నా రాజకీయాలే ప్రధానం కనుక ఆడవాళ్ళని కలవనిచ్చేవారు కాదు” అంటారు.
 తన అత్తమామలు, కొడుకు కోరిక మీద ‘కొండపల్లి’ అనే ఇంటిపేరుని తన పేరుకి ముందు కొనసాగిస్తున్నానని చెపుతూ దాని మూలంగా తనకి ఒరిగేది ఏమీ లేదంటారు.
 భర్తతో విభేదాలు, కొడుకు, అల్లుడు, కూతురుల అకాల మరణాలు, చివరివరకూ తోడుగా నిలబడిన తల్లి అంజమ్మ మరణం, ఆర్థిక సమస్యలు యిన్నింటి మధ్యా స్త్రీ విద్యావంతురాలయి ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండాలన్న  పట్టుదలతో ముప్ఫయిఆరవ ఏట చదువు మొదలుపెట్టి ఆ తర్వాత ఉద్యోగంలో చేరారు.
 సీతారామయ్యగారు దూరమయ్యాక ఆయన్ని కలవడానికి ఏమాత్రం యిష్టపడని కోటేశ్వరమ్మ, ఈ పుస్తకంలో భర్తగా అతను విఫలమవడాన్ని గుర్తించి రాసారు గానీ వ్యక్తిగా ఆయన ఔన్నత్యాన్ని పలుసందర్భాల్లో ప్రేమగా తలుచుకుంటూనే ఉన్నారు. కొడుకు జైల్లో ఉన్నపుడు చూడడానికి వెళితే ‘చందూ’ చిరునవ్వుతో నిలబడి ఉండటం చూసి సీతారామయ్య ధైర్యసాహసాలే కొడుక్కి వచ్చాయి అనుకుంటారామె. అలాగే తండ్రి వాటాగా వచ్చిన ఆస్తిని సీతారామయ్య పార్టీకి రాసిచ్చేయడం గురించి ”సీతారామయ్య సంపన్నుడు కాకపోయినా త్యాగసంపన్నుడుగా మిగిలిపోయాడు” అని సంతోషంగా చెప్పుకుంటారు.
 కొండపల్లి సీతారామయ్య గారి చివరి రోజుల్లో ఆయన్ని కలవమని మిత్రులు ఒత్తిడి తెచ్చినపుడు తన అయిష్టతని వ్యక్తం చేస్తూ ‘ఆయన పాలిటిక్స్‌ ఆయనవి నా పాలిటిక్స్‌ నావి’ అని అనుకోగల ఆత్మవిశ్వాసం కోటేశ్వరమ్మగారిది. ఆఖరిదశలో కోటేశ్వరమ్మతో కలిసుండాలన్న ఆకాంక్షను సీతారామయ్య వ్యక్తం చేసినపుడు ‘యాజ్‌ ఎ ఫ్రెండ్‌గా ఉండటం వేరు. ఈ భార్యాభర్తల గొడవ నాకొద్దు’ అని సున్నితంగా తిరస్కరిస్తారు.
 కోటేశ్వరమ్మ గారి జీవితంలోని పలువిషాద సంఘటనలు కంటతడి పెట్టించి మనసుని ఆర్ద్రం చేస్తాయి. అయితే అది నిస్సహాయ దుఃఖం, నిరుపయోగశోకం కాదు.
 మనసుని పిండే విషాదంలోంచి జీవితేచ్ఛతో పదేపదే పైకి ఎగసే ఫీనిక్స్‌ కోటేశ్వరమ్మ. పార్టీలు, సంఘాలు ప్రజాస్వామీకరించబడాలంటూనే చచ్చేవరకూ ఉద్యమాన్ని వదలనన్న ధీర… కోటేశ్వరమ్మ, ఊపిరిసలపని కష్టాల్లోనూ స్త్రీగా, వ్యక్తిగా, ఉద్యమకారిణిగా, రచయితగా ఎక్కడా తలవంచని సాహసి… కోటేశ్వరమ్మ…
 ఈ పుస్తకం ద్వారా అనేకమందికి అమ్మగా, అమ్మమ్మగా కూడా కొత్త బాధ్యతని ఆనందంగా స్వీకరిస్తున్న కోటేశ్వరమ్మగారిని చదివాక జీవన పోరాటాలకి అవసరమయిన స్థితప్రజ్ఞత కళ్ళకి కడుతుంది. అంతర్లోకంలో వెలుగు నిండి నిలబడి పోరాడగలమన్న గట్టి భరోసా మన సొంతమవుతుంది.
 
( సంవత్సర కాలంగా ఈ కాలమ్ ని ఆదరించిన భూమిక, చదివి పలు చర్చలు చేసిన జాజిమల్లి బ్లాగ్ పాఠకులకు కృతజ్ఞతలు.)
 
 
 
                                                                                                                                                         అమ్మమ్మ ఫోటోలు
ammamma-kaara-chetty_002visakhapatnam-2011ammamma_trip-sklm-jan_3-2010_064ammamma-kaara-chetty_017

రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

రాజేశ్వరి నుంచి దమయంతి వరకూ…

Posted By on October 3, 2012

మల్లీశ్వరి

లేచిపోయినా’ నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో ఉంటుంది అని కదా అన్నావు రాజేశ్వరీ! ఎపుడో 1927లో నువ్వట్లా నీతివర్తనుల్లోంచీ, మర్యాదస్థుల లోంఛీ  బైట పడి, దినం తర్వాత దినం నువ్వు పొందాలనుకున్న వివిధ వర్ణరాగ సుందరానుభవాల కోసం అమీర్‌తో కలిసి మైదానంలో పరుగులు తీస్తుంటే నిన్ను చూడవచ్చిన మీ మావయ్య ”పశువులు-కుక్కలన్నా నయం. నీతీ జాతీ విచక్షణలు లేక కళ్ళు కమ్మి, వొళ్ళు కొవ్వి, ఇట్లా బట్టలు విప్పుకుని యీ అడవుల్లో పరిగెత్తుతో, సిగ్గు విడిచి…” అని కదూ అన్నాడు!

ఎనభై అయిదేళ్ళు గడిచాయి. లోకం చాలా మారిపోయింది రాజేశ్వరీ! కానీ రాజేశ్వరుల గురించి లోకం అంచనాలు ఏ మాత్రం మారలేదని ఇపుడు ‘దమయంతి కూతురు’ చెపుతోంది.

పి. సత్యవతి సొగసైన, గడుసరి కథకురాలు కదా! రాజేశ్వరికి పిల్లలు లేరు కదాని అంతో యింతో సరిపెట్టుకున్న విశాల హృదయాలని సవాల్‌ చేస్తూ దమయంతికి ఒక కూతురినీ, ఆ కూతురికి తల్లిలేని శూన్యాన్నీ, ఆ పిల్ల ఎదుగుతూ అనుభవించిన వేదనని కూడా కథలోకి తెచ్చారు. ఇపుడిక ముత్యాల్లాంటి పిల్లల్నీ, మంచి భర్తనీ, లక్షణమయిన, భద్రమయిన సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దమయంతి గురించి బుగ్గలు నొక్కుకోవడమే లోకం పని.
ఆ పనిని మౌత్‌వాష్‌లూ, బ్రూట్‌ పరిమళాల సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోట కూడా చేశాడు. ఎంక్వయిరీ అవీ అయ్యాక పెళ్ళి చేసుకోడానికి దమయంతి కూతురు నచ్చింది గానీ దమయంతి చచ్చిపోయిందా? లేచిపోయిందా? అనేదే తల్లి వంకన సమస్య అతనికి.

”నీ మొహాన పెళ్ళి బొట్టుతో పాటు ఒక తల్లి మచ్చ కూడా పెట్టేసి ఆ మచ్చని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు. నువ్వు నీ జీవితాంతం అతనికి కృతజ్ఞతా బద్ధురాలవై ఉంటావు. ఎపుడయినా నీ చదువూ, నీ తెలివీ, నీ ఉద్యోగం గుర్తొచ్చి నువ్వు ఎగిరి పడితే ఆ తల్లి మచ్చ ఒక పేపర్‌ వెయిట్‌లా పనిచేస్తుంది” అంటూ సంతోష్‌ ఫ్రమ్‌ సామర్లకోటని ఎందుకు తిరస్కరించాలో దమయంతి కొడుకు చెల్లికి చెపుతాడు.
కథలో ఎక్కడా దమయంతి కూతురు తప్ప దమయంతి రాలేదు. కానీ దమయంతి లేకుండా కథే లేదు. ఈ టెక్నిక్‌ ద్వారా కథని నడపడంలో రచయిత, స్త్రీల నిర్ణయాధికారం, మాతృత్వభావన అనే రెండు ప్రధానమయిన అంశాలను సమాంతరంగా చర్చకి పెట్టగలిగారు. స్త్రీలు అన్ని సంకెళ్ళను తెంచుకుని నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోవడమనేది సాహిత్యానికి కొత్త వస్తువు కాకపోవచ్చు. కానీ ఆ వెళ్ళిపోవడమనేది అనేక సందర్భాల్లో స్త్రీల లైంగికతతో ముడిపెట్టి చూడబడుతుంది. తద్వారా స్త్రీల లైంగికస్వేచ్ఛపై నలిగిపోయిన వారిలో వాదోపవాదాలు మొదలవుతాయి. అలాంటి పాత చూపుని బ్రేక్‌ చేసింది ఈ కథ.

దమయంతి కూతురు పెద్దయ్యాక ‘అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందని వాళ్ళ నాన్నని అడిగినపుడు ”నేను భూలోకపు మనిషినమ్మా, ఆమె ఊర్ధ్వలోకపు మనిషి. అందుకే ఈ లోకంలో ఉండలేక వెళ్ళిపోయింది” అని చెపుతాడు. దమయంతి వెళ్ళిపోయిన చాలా ఏళ్ళ తర్వాత ఆమె భర్త నుంచి ఈ సహనంతో కూడిన సమాధానం రాబట్టడంలోనే రచయిత కథా వస్తువు పట్ల చూపిన పరిణితి కనిపిస్తుంది.

స్త్రీలు నచ్చిన వ్యక్తి కోసం వెళ్ళిపోయినపుడు అనివార్యంగా పురుషుడు చెడ్డవాడు కాక తప్పని దుస్థితి నుంచి స్త్రీవాద కథని ఈ కథ ద్వారా రక్షించగలిగారు పి. సత్యవతి.
సమాజంలో భూలోకపు మనుషులతో పాటు అరుదుగానయినా ఊర్థ్వలోకపు మనుషులుంటారనీ ‘ఆయియే ఆప్‌కో సితారోఁ మే లే చెలూ!’ అంటూ తెగింపునీ సాహసాన్నీ కావలించుకుని నక్షత్ర వీధిలోకి ఒకరినొకరు నడిపించుకు వెళతారనీ, తప్పొప్పుల తూకాలు అక్కడ చెల్లవనీ, అర్థం చేసుకోవడమూ, అవగాహనలోకి తెచ్చుకోవడమనే కొత్త దృష్టే పరిష్కారంగా ప్రతిపాదించారు రచయిత

.
ఈ కథని తళుక్కుమనిపించిన మరో అంశం మాతృత్వబాధ్యతల మీద ఉండే అదనపు బరువుని తొలగించే ప్రయత్నం… ఒకవైపు పితృస్వామిక వ్యవస్థ కల్పించిన మాతృత్వపు మిత్‌ని బద్దలు కొడుతూనే మరోవైపు మాతృత్వానికి దానంతట దానికి సహజంగా ఉండే విలువనూ గుర్తించారు రచయిత. అందుకే దమయంతి కూతురు, తల్లిలేని పిల్లగా ఉండటంలోని వెల్తిని స్వంత కూతురిలాగా పెంచిన అత్తయ్య ద్వారా కానీ, రెండో తల్లి ద్వారా కానీ పూరించు కోలేకపోయింది.
పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యతగా గుర్తిస్తూనే, నచ్చినట్లుగా జీవితాన్ని మలుచుకునే హక్కు స్త్రీలకి ఉంటుందని అలవి మాలిన త్యాగాలు స్త్రీలకి అంటగట్టకూడదన్న సూచనా కథలో ధ్వనించింది.
కథని ముగిస్తూ- ”మరి నేను అనుభవించిన క్షోభ మాటేమిటి?” అంటుంది దమయంతి కూతురు.
”బహుశా మన దగ్గరే ఉండి ఉంటే ఆమె అనుభవించవలసి ఉండిన క్షోభ మాటేమిటి?” అంటాడు దమయంతి కొడుకు.
కూతురు దగ్గర జవాబు లేదు.
దమయంతి దగ్గర జవాబు ఉంటుందనుకోలేము..
మరి మన దగ్గరేం జవాబు ఉందో?!
(పి. సత్యవతి యిటీవల రాసిన ‘దమయంతి కూతురు’ కథ చదివి…)

విజయవాడలో పి.సత్యవతి గారింట్లో…

హింస ఒక వ్యాపారం

 

Posted By భూమిక on September 3, 2012
మల్లీశ్వరి

అదొక ఇ.ఎన్‌.టి డాక్టర్‌ క్లినిక్‌. ఛాంబర్‌ బైట వరుసగా వేసిన కుర్చీల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు పేషెంట్లు. తమ వంతు రాగానే లేచారు ఒక యువజంట. అబ్బాయి తలుపు దగ్గరే ఆగి ”మే ఐ కమిన్‌ డాక్టర్‌?” అలవాటయిన సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనలిజంతో చిన్న నవ్వుని జోడించి పొలయిట్‌గా అడిగాడు. పక్కనున్న అతని భార్య నవ్వుతూ నిలబడింది.
వారి విషెస్‌ అందుకుంటూ రమ్మన్నట్లు చూసింది డాక్టర్‌. పేషెంట్‌ ఎవరన్నట్లు యిద్దరి వైపూ ప్రశ్నార్థకంగా చూడగానే అప్పటివరకూ చున్నీతో ఎడం చెంపని కవర్‌ చేసుకుంటూ ఉన్న అమ్మాయి చున్నీ తీసింది. బూరెలా వాచిపోయిన బుగ్గని చూపించి.. ” చెవి నొప్పి కూడా… చాలా సివియర్‌గా ఉంది..” నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది.
చూడగానే చాలామట్టుకు అర్థమయింది డాక్టర్‌కి.

”దెబ్బేవన్నా తగిలిందా?..” కరుకుగానే అడిగింది డాక్టర్‌. సాఫ్ట్‌వేర్‌ యువజంట మొహమొహాలు చూసుకున్నారు. మొహంలోంచి ఎగిరి పోతున్న నవ్వుల్ని బలవంతానా ఆపుకుంటున్నారు.
”దెబ్బ ఏం కాదండీ! మొన్న నేనూ తనూ కబుర్లు చెప్పుకుంటుంటే మాటల మధ్యలో తను వూరికే… సరదాగా… చెంప మీద యిట్లా అనగానే…” సిగ్గుపడుతూ నవ్వబోతూ ఆ అమ్మాయి చెపుతుండగానే డాక్టర్‌ స్కానింగ్‌ తీసి చూపిస్తూ… ఊరికే.. యిట్లా అంటేనే కర్ణబేరి యింత డామేజ్‌ అవుతుందా?” అబ్బాయిని సీరియస్‌గా చూసింది డాక్టర్‌.

మొన్నటి నుంచీ ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు ఈ నొప్పినీ, ఈ అవమానాన్నీ దాచి పెట్టుకుంటూ వచ్చిందో డాక్టర్‌ కనిపెట్టేయగానే మొహం చేతుల్లో దాచుకుని ఒక్కసారిగా బావురుమంది అమ్మాయి. ”వారానికి రెండు మూడు యివే కేసులు… చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు… భార్యని కొట్టడమేంటి?… కొంచెం అటూయిటూ అయి నవరగంత మీద తగిలితే ప్రాణానికే ప్రమాదం యిట్లా అయితే పోలీసు రిపోర్టు యివ్వాల్సి ఉంటుంది.” గట్టిగా చీవాట్లు వేసింది డాక్టర్‌.

అబ్బాయి తలవంచుకున్నాడో  లేదో తెలీదు గానీ కుటుంబాల్లో ఎడతెగకుండా సాగుతున్న హింసకి ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా యింకా స్త్రీలు తలలు వంచుతూనే ఉన్నారు. రాన్రానూ సమాజంలో హింసపట్ల ఉదాసీనత, ఒప్పుదల పెరుగుతూ ఉంది. భౌతిక హింస ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా పిల్లలూ, స్త్రీలూ, దళితులూ, మైనార్టీ వర్గాలూ ముందుగా టార్గెట్‌ అవుతారు. గుర్తించవలసిన యింకో అంశం ఉంది. గృహ హింసకి పాల్పడిన వారిలో ఆపని తప్పనీ, బైటకి తెలిస్తే  చెడ్డగా చూడబడతామన్న సామాజిక భయమూ ఉంటుంది. అంత మాత్రానా అది ఉద్వేగాల పరిధిలోని చిన్న నేరమని గానీ సర్దుకుపోవచ్చుననీ చెప్పడం యిక్కడ ఉద్దేశం కాదు. చెంపదెబ్బల నుంచీ ప్రాణాలు తీసేవరకూ కుటుంబాల్లో హింసాపర్వం శతాబ్దాల తరబడీ సాగుతూనే ఉంది.

అయితే ఇపుడు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న మరో విషయం సమాజంలో బాహటంగా జరుగుతున్న హింస. దానికి నిశ్శబ్దంగా లభిస్తున్న అంగీకారం… అది గౌహతిలో పదిహేనేళ్ళ పిల్లమీద జరిగిన దాడి కావొచ్చు, లక్ష్మింపేటలో దళితుల్ని ఊచకోత కోయడం కావొచ్చు. ఉద్రేకంతోనో, కుట్రపూరితంగానో సమూహం ఒక వ్యక్తిని గానీ, సమూహం మరొక సమూహాన్ని గానీ హింసకి గురి చేయడం లోని అమానవీయతకి రకరకాల ఆధిపత్యాలు మూలం. కుల, మతాధిక్య, పితృస్వామిక స్వభావం ఉన్న సమాజానికి మంచీ చెడూ చెప్పాల్సిన ప్రభావ వర్గాలదీ అదే తోవ.

పాతిక ముప్పయ్యేళ్ళ కిందట జాతీయ వార్తాపత్రికలు విధిగా ఒక నియమం పాటించేవి. హింసనీ, బీభత్సాన్నీ రేకెత్తించే ఫోటోలను గానీ, వార్తలను గానీ మొదటి పేజీలో వేసేవారు కాదు. తర్వాతి పేజీలలోనైనా సమాచారం విశ్లేషణా ఎంత వరకూ అవసరమో అంతే తప్ప పాఠకులను భయకంపితులను చేసే ధోరణి ఉండేది కాదు.

కానీ యిపుడు ప్రింట్‌ మీడియా కూడా ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రభావానికి లోనయింది. హత్య ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టు చూపించే క్రైమ్‌ వాచ్‌ కార్యక్రమాలు, స్టింగ్‌ ఆపరేషన్ల పేరిట తప్పు చేసిన మనుషుల్ని, ముఖ్యంగా తప్పులు చేసే సామాన్యుల్ని పదిమంది కలిసి చావబాది ప్రాణాలు తీస్తుంటే వీడియో షూట్‌ చేసి బ్రేకింగ్‌ న్యూస్‌ ప్రచారం చేసే స్థాయికి మీడియా విలువలు పతనమయ్యాయి. మనిషిని వ్యాపార వస్తువు చేసిన ప్రపంచీకరణ దేనినీ వదలలేదు. చివరికి హింసకూడా వ్యాపారంగానే మారిపోయింది.

బలహీనులపై హింస వ్యవస్థీకృత స్థాయికి చేరుతున్న సమాజాల్లో దానిని నిరోధించడం వ్యవస్థల మౌలిక మార్పులలోనుంచే రావాలి. దానికి వ్యక్తుల్లో కొత్త సంస్కారం, సున్నితమయిన, తప్పనిసరిగా పాటించాల్సిన మానవీయ విలువల్ని బోధించే విద్య, వ్యక్తుల్ని ద్వేషించని సాహిత్యం, బాధ్యతగల మీడియా కూడా ఇపుడు చాలా అవసరం.