భాండాగారం

తెలిసిందా?

 

సంబంధిత చిత్రం

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది. అచ్చంగా నీ గురించే

 

కొంచెం సిగ్గుగా బిడియంగా నవ్వుతావు!

మల్లిమొగ్గ సాయంసంజెని చాటు చేసుకుని రెక్కలు విప్పినట్లు ఉంటుంది 

వచనకారుడివై కొత్త దీపాన్ని సొంతంగా వెలిగించుకున్నావు

నీ అక్షరాన్ని ముద్దాడిన మోహశిఖ భగ్గున మండి మరింత వెలుగైంది

ఈడ్చికొట్టే తగవుగాలికి నీ కాళ్ళమీద నీవు నిల్చుంటావు!

అరికాలి కింద నేల నిన్నునిలబెట్టి కరువుతీరా కావిలించుకుంటుంది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

ఎవరి అరల్లో వారిని సర్ది తాళం వేసాననుకున్నావు!

తాళం చెవుల గుత్తి మంత్రగత్తె కొంగుకి లాఘవంగా ముడి వేసుకుంది

నువ్వు మీ ఊళ్ళో పదిలంగా ఉన్నాననుకున్నావు!

సాగరం నుంచి సాగరానికి కొత్తవంతెన మీద యాత్ర మొదలయింది

 

ఈ పూట నీ గురించి రాయాలని ఉంది, అచ్చంగా నీ గురించే

 

కానీ రాస్తున్నపుడు తెలిసింది 

నువ్వు నువ్వనుకునేది నువ్వు మాత్రమే కాదని

పరిమళం, ఐక్యరాగం, గడుసు చినుకు, కొత్త ఆశలు నీలో చేరి

నిన్ను ఖాళీ చేసాక

నువ్వంటే నువ్వు మాత్రమే కాదని

నీలో ఉన్నది నేనేనని తెలిసాక

ఇక ఈ పూట అచ్చం నీ గురించే రాయాలని ఉంది

నన్ను నేను ప్రేమించుకోవాలని ఉంది

 

 

వసీరా…మళ్ళీ ఇలాంటి కవిత్వం రాయరూ

ఈ ఆదివారం ఇంత గొప్పగా మొదలవుతుందనుకోలేదు.

పొద్దున్నే బద్దకం కాకుండా నరనరాల్లో ఇలా ఉరవళ్ళు తొక్కుతున్నదేంటి?

సంతోషమా,దుఃఖమా,ప్రేమా,తపనా,

పరిసరాల్లో ఇలా  పరవళ్ళు తీస్తున్నదేంటి?

ఇష్టమా,అద్భుతమా,మైమరుపా,సంతృప్తా

ఇది వసీరా కవిత్వం కాక మరేంటి?

వసీరా కవిత  ‘ దుఃఖం ‘

ఎంత మందిని జయించిందో ఏమో

మా చెడ్డ గర్వంగా నా మీదకి లంఘిస్తుంది దుఃఖం

సాచి లెంపకాయ కొడతాను

కళ్ళు తిరిగి నా కాళ్ళ దగ్గర కూలబడుతుంది

దుఃఖం భుజాలు పట్టుకు లేవనెత్తి

కళ్ళలోకి చూసి నవ్వుతాను

అసలే ఉడుకుమోతు

అందుకని దుఃఖం ఒళ్లంతా కితకితలు పెడతాను

అపుడు తడికళ్ళతో పకపకా నవ్వుతుంది

నేనూ దుఖమూ చెట్టాపట్టాలేసుకుని

హోటల్ కి పోయి టీ తాగుతాం

ఒకళ్ళమీదొకళ్ళు జోకులేసుకుంటాం

దుఃఖానికి వీడ్కోలు చెప్తూ అంటాను

మళ్ళీ ప్రయత్నించకేం

నువ్వే ఓడిపోతావు

కానీ సాటివాళ్ళు కష్టాల్లో ఉన్నపుడు

నేను మనిషినని గుర్తు చేయడానికి

తప్పనిసరిగా నా దగ్గరికి రా

నన్ను సాచి లెంపకాయ కొట్టి మనిషిని చెయ్యి

(1984)

(లోహనది కవితా సంపుటి)

మంత్రిణీ మణుల్లారా ఎంత బాగా సెలవిచ్చారండీ !!!!!!!!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి  ఒక రోజు ముందు అన్ని పత్రికల్లో మీ స్టేట్మెంట్లు చూసి
మీ చైతన్యమే ఇంత గొప్పగా  వుంటే ఇంక ఆంధ్ర మహిళల చైతన్యం ఇంకెంత అద్భుతంగ ఉందోనని
ఒళ్ళు పులకించిందంటే నమ్మండి
అవును…….. మంత్రిణీ  శిరోమణుల్లారా…. అవునవును……..
మగవారు మహిళా రిజర్వేషన్ బిల్లుకి అడ్డు పడితే
“వంట చేయం…….. తిండి పెట్టం ”
అయ్యో …మన సహాయ నిరాకరణ ఇంత వరకేనా?
అంట్లు తోమం, ఇల్లు వూడ్చం, వాళ్ళ బట్టలు వుతకం, పిల్లల్ని శ్రద్ధగా చూడం
ఇంటిని ఒంటిని తళ తళ మెరిపించం
అపుడపుడు బహుకరించే తిట్లు, వడ్డించే తన్నులు  తీసుకోం
పొద్దున్న లేవగానే మంగళ సూత్రాలు కళ్ళ కద్దుకోం
వాళ్ళ అడుగు వెనక అడుగు వేసి నడవం
ఐతే అమ్మల్లారా నాకో సందేహం……..
మగవారు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సై అన్నారనుకోండి
అపుడు మనం చకా చకా వంట చేసేసి, తిండి పెట్టేసి
టకా టకా అన్ని పనులు మనమే చేసేసి అదనంగా వారి  ఔదార్యానికి
మరింత వంగిపోయి వెళ్లి చట్ట సభల్లో  ఒదిగి ఒదిగి కూర్చుందామా
ఢిల్లీ కి  రాణి అయినా వంట గదికి సేవకురాలేనని నిరూపించుకుందామా

అమ్మల్లారా
మీ రాజకీయ సర్దుబాట్ల మాటలు మీ దగ్గరే భద్రంగా  అట్టి పెట్టుకుని
మన వెన్నెముకల్నినిటారుగా నిలబెట్టే మార్గాలని గుర్తించండి

ముందు బెంచీ బుద్దావతారానికి కన్ను కొట్టడం బావుంది

ప్రియా….
రోజూ లాగే  ఈ రోజూ నిన్నోసారి తలచుకోవడం  బావుంది   
అలవి కాని   సౌందర్యంతో  గుబాళించిపోయే
నీ బాల్యాన్ని నా ఊహల రెక్కల గుర్రం పై ఊరేగించడం బావుంది
జ్ఞానం పై గురి పెట్టిన
ముందు బెంచీ బుద్దావతారానికి
కన్ను కొట్టడం బావుంది
చిన్నపుడు ఇంట్లో చెప్పకుండా సైకిలెక్కి
పక్కూరికి పారిపోయిన నిన్ను
చెవులు మెలేసి నా ముందు నిలబెట్టించుకోవడం బావుంది  
చింత బరికె తోనో, చీపురు కట్టతోనో 
కందిపోయిన నీ ఒంటిని
నా చూపులతో అప్యాయంగా నిమరడం బావుంది
సంత లో తప్పి పోయి బిక్కమొహం
వేసిన బుజ్జాయిని ఓదారుస్తూ
గుండెలకు హత్తు కోవడం బావుంది
నీ బాల్యాన్ని తడుముతూ ………తడుముతూ
నేను నీ తల్లిని కావడం మరీ మరీ బావుంది

ప్రేమ కధలు చెప్పుకుందాం-నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో అడుగుతావనుకుంటే……….హైదరాబాద్ ని అడిగావు

 ప్రేమ కధలు చెప్పుకుందాం   

ఇప్పటి వరకూ

కలసి వుంటే ఎంత సుఖము కలదో

విడిపోతే ఎంత దుఖమో

మీరు చెప్పారు……….

ఇప్పటి వరకూ

మీరెట్లా మమ్మల్ని అణచి వుంచారో

మేమెట్లా అగ్నిజ్వాలలై ఎగిసామో

మేము చెప్పాము.

ఇక అనివార్యత లోంచి పంపకాల గురించి

మాట్లాడుకునేపుడు

నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో

అడుగుతావనుకుంటే……….

హైదరాబాద్ ని అడిగావు

నువ్వు ఇరానీ చాయ్ గురించో   హైదరాబాద్ బిర్యానీ గురించో

విచారిస్తావనుకుంటే

మా పెట్టుబడుల సంగతేంటి అన్నావ్

నీ సంగతి మా బాగా అర్ధమయ్యాక కూడా

ఒకటి చెప్పాలనిపిస్తుంది

మనమిపుడు ఎదురెదురుగా కూర్చుందాం

హృదయాలు తెరిచి ప్రేమ కధలు చెప్పుకుందాం

అనుభూతుల వనంలో వలిసె పూల వాన (కవిత)

ఈ రోజు సెలవే కదా
 సూర్యుడు హాయిగా మంచు దుప్పటి కప్పుకుని
వెచ్చగా పడుకోవచ్చుగా
ఏదో పనున్నట్లు హడావిడిగా ఆకాశ వీధిలోకి
పాక్కుంటూ వచ్చి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు.
అంతే ….
లోయల వంపుల్లోను,చెట్ల గుబురుల్లోను
సెలయేటి అలల మీద,పిట్టల రెక్కల మీద
బంగారు మిలమిలలు

ఈ రోజు అచ్చంగా హృదయానికే అంకితం చెయ్యాలని
ఓసారి తొంగి చూడగానే
మొన్నెపుడో కురిసిన వలిసె పూల వానకి
రాలిపడ్డ అనుభూతుల గుత్తులు కనిపించాయి

పదమూడేళ్ళుగా  ఓ పసితనానికి ఆటవస్తువయి 
యవ్వన  ప్రవేశపు అలజడి తో దూరంగా
తొలగిపోతున్న కూతురిని చూసి
బెంగటిల్లె తండ్రిలా మారింది మనసు
అరకును వదిలి వచ్చేస్తుంటే

రెండు(ఆంధ్ర, తెలంగాణ) ఒకటవడం కన్నా ఒకటి రెండవడం బాధాకరమే (కవిత)

కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు” అని నేను మునుపెప్పుడో చదివిన మాటలని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న ఈ కలిసుండటం , విడిపోవటం అనే వాదనలకు నా స్పందన…

రెండు ఒకటవడం కన్నా
ఒకటి రెండవడం బాధాకరమే
కానీ…….
ప్రియా
ఒకటయ్యేపుడు పెంచుకున్న నమ్మకాల్నీ
పంచుకున్న ఆశల్నీ
ధ్వంసం చేస్తూ
ఈ రోజు భవిష్యత్తుని
నా ఒడిలోని నవజాత శిశువుగా
నువ్వెంత అభివర్ణించినా
చెరిగిన విశ్వాసాలనూ
చెదిరిన స్వప్నాలనూ
మోసుకుంటూ నీతో కలసి ఎలా నడవను?
ఐతే
ఒకటి మాత్రం నిజం
నువ్వు ఎక్కడ ఐక్యతా రాగాల్ని ఆలపించినా
నా శిధిలాలఫై నువ్వు ఎప్పటికీ కోటని నిర్మించుకోలేవు.