భాండాగారం

కరుణా టీచర్

ఈ వారం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నేను రాసిన కరుణా టీచర్ కథ పబ్లిష్ అయింది. ఏడాదిన్నర తర్వాత రాసిన కథ.

ఏదో పొరపాటు వల్ల బాక్స్ ఐటమ్స్ లో ఇచ్చిన వాక్యాలు టెక్స్ట్ లో మిస్సయ్యాయి.

‘కరుణ మాట్లాడుతుంటే మిగతా ముగ్గురూ అబ్బురంగా విన్నారు.’ పేరాకి ముందు మొదటి బాక్స్ ఐటం రావాలి.

“ఉలిక్కిపడి అద్దం ముందు నుంచి కదిలింది.” పేరాకి ముందు రెండో బాక్స్ ఐటం రావాలి.

లోకానికంతా ఇట్లా చేర్చుకుని చదవమని చెప్పలేం కానీ వీలైన చోట చెపుదామని ఈ ప్రయత్నం.

శతపత్ర సుందరి

“యుద్ధం ముగిసింది. ఒకరు విజేత. ఆ విజేతని నేను గెలిచాను…నేనే గెలిచాను…లోకం వెలి వేసిన ఈ స్వైరిణి, విజేతని గెలిచింది. ఆహ్హహ్హా ” నాటకం క్లయిమాక్స్ లో ఈ డైలాగ్ చెప్పి స్టేజ్ మీద నిల్చున్న చోటనే గిర్రున తిరిగి కూలబడిపోవాలి. ఆ తిరగడం అన్నది రొటీన్ గా కాదు ఆ పది సెకండ్ల లో రంగురంగుల పూసలతో కుట్టిన జలతారు కుచ్చుల చున్నీని ఓడి మరణించిన వాడి మొహం మీద పల్చని తెర కప్పినట్లుగ విసిరి, గెలిచి మరణించిన వాడి వద్ద కూలబడాలి. ఈ ఒక్క సీన్ కోసం ఇంచుమించు వారం రోజులు నాతో ప్రాక్టీస్ చేయించాడు గౌతమ్. నాలుగొందల మందితో కిక్కిరిసిన ఆ చిన్న ఆడిటోరియం ఊపిరి బిగబట్టింది.
నా కళ్ళ ముందు గౌతమ్ తప్ప ఎవరూ లేరు. మా ఇద్దరినీ కలిపి ఉంచే మహోద్వేగపు ప్రవాహమేదో నన్ను నడుపుతోంది. మేలి ముసుగు అంచు పట్టుకోవడం వరకే గుర్తుంది నాకు. ఒంటి మీదకి తెలివి వచ్చేసరికి చప్పట్ల వర్షం. చాలా మంది లేచి నిలబడ్డారు. కొంతమంది పరిచయస్థులు స్టేజ్ మీదకే వచ్చేస్తున్నారు. పక్కకి తిరిగి చూసాను. విస్మయంగా చూస్తూ గౌతమ్. రమ్మని చూపులతో పిలిచే ఉంటాను. చప్పున వచ్చేసి ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. ‘గ్రేట్! గౌతమ్…నీలవేణి నీ డిస్కవరీ’ ఎవరో పొగుడుతున్నారు తనని. ‘ నో నో షీ ఈజ్ వెరీ టాలెంటెడ్’ గాభరాగా క్రెడిట్ ని తోసేస్తున్నాడు.
నవ్వుకుంటూ తల తిప్పి చూసేసరికి స్టేజ్ మీద ఉన్న కోలాహలం మధ్య నుంచి నా వద్దకి రాకుండానే మెట్లు దిగిపోతూ కనిపించాడు సదాశివ. అతని మొహం జేవురించి ఉండడం చూసాను.

****************************

ఇంటికి వచ్చీ రాగానే ఫ్రెష్ అయి కూచున్నాను. మళ్ళీ రేపటి నుంచీ ఆఫీస్. నాటకం మత్తు వదుల్చుకుని రొటీన్ లో పడిపోవాలి. సదాశివ వంటగదిలో మెసులుతున్న చప్పుడుకి కూడా కదలబుద్ధి కాలేదు. సన్ననూలుచీర ఒంటికి చుట్టుకున్నట్లు మనసుకు హత్తుకు పోయిన గౌతమ్ ఊహని విడదీయడం సాధ్యం కావడం లేదు. ఎలక్ట్రానిక్ కోయిల రెండుసార్లు కూసి ఊరుకుంది. ‘యక్షుడూ యక్షిణీ చెరొక వియోగ శిఖరం మీదా కూచున్నారు. మేఘమాలా రాత్రంతా అప్పండవున్ చేస్తావా?’ వాట్సప్ మెసేజ్…అర్ధం కోసం భావం కోసం ఒట్టి అక్షరాల కోసం అట్లా ఎంతసేపు చూస్తూ ఎన్నిసార్లు చదువుతూ ఉన్నానో. మొహం మీద చిటికెల చప్పుడు వినిపించేసరికి కావిలించుకున్న పూలతీగ నుంచి జర్రున కిందికి జారినట్లయి అయోమయంగా చూసాను. ఎదురుగా ఆరా చూపుల సదాశివ.
“ఏ లోకంలో ఉన్నావ్ నీలవేణీ?” మాటని కాస్త వంకర తిప్పి వదిలాడు. ఊనిక కూడా ఇట్టే అర్ధమైపోతుంది. ఖర్మ…ఈ బుర్ర కాస్త తుప్పుబట్టి మొద్దుబారితేనేం! బలవంతంగా నవ్వాను. “సారస లోచనకి రసభంగమైతే సాలోచన అవుతుంది కదా? ఏమి నీ ఆలోచన స్వైరిణీ?” దగ్గరగా వచ్చి గుసగుసగా అన్నాడు.
స్వైరిణి! నన్ను స్వైరిణి అంటున్నాడు సదాశివ. స్వైరిణులను గురించి మేమిద్దరం మురిసిపోయిన అర్ధంలో కాదు. లోకం ఏవనుకుంటుందో అట్లా అంటున్నాడు. ఏ అర్ధం లోంచయినా ఏ అద్దం లోంచయినా నేను స్వైరిణి కావడం నాకేం బాధ లేదు కానీ సదాశివ ఉత్తినే నన్ను పలకరించలేదు. చాలా వెంట బెట్టుకుని వచ్చాడు. అలసటగా ఉంది. వాదించాలని లేదు. పోట్లాడాలని అస్సలు లేదు. డబుల్ కాట్ మీదకి చేరి తల వైపు గోడకి అమర్చి ఉన్న డ్రీమ్ బుక్ షెల్ఫ్ లోనుంచి మాయా ఏంజిలో ఆత్మకథ తీసుకున్నాను. ‘ఐ నో వై ద కేజ్ డ్ బర్డ్ సింగ్స్’
పరిగెత్తుకొస్తున్న చిన్నపిల్లల చేతి గ్లాసులో ఉద్రేకంగా తుళ్ళి పడే నీళ్ళలా సదాశివ లోని సంచలనం నాకు తెలుస్తూనే ఉంది. ఇపుడు మాట్లాడితే చర్చలు కాక వాదనలే జరుగుతాయి. ఇబ్బందికర సత్యాలే వాదనలు. ఎవ్వరం భరించలేం.
“నువ్వు స్థిమితంగా లేవు సదా! అన్నం తిని పడుకోకూడదూ రేపు మాట్లాడుకుందాం” చెప్పి పుస్తకం తెరిచాను. ‘ లేదు. ఇపుడే మాట్లాడుకుందాం ’ అనొచ్చుగా! అట్లా చెప్పలేదు. గాజు కిటికీ దగ్గరున్న బార్ స్టూల్ ని ఒక్క తన్ను తన్నాడు. అది వెళ్లి టీపాయ్ మీద పడింది. దాని మీదున్న దంతపు ఫ్లవర్ వాజ్ కిందపడి భళ్ళున ముక్కలయింది. మా సాహచర్యంలో సదాశివ ఇంత వయొలెంట్ గా ప్రవర్తించడం ఇదే మొదటిసారి.
పెద్ద శబ్దం తర్వాతి నిశ్శబ్దానికి కూడా చెవులు అలవాటు పడ్డాక ఇద్దరం కలిసి శిధిలాలను ఏరుతుంటే అపుడు అడిగాడు మొహమాటంగా, “అతనితో తెంపుకోలేవా నీలూ?” అని. ఎవరన్నా ఏవన్నా అడిగినపుడు ఇచ్చేయడమే చాలా సులువు. కాదని చెప్పడం ఎంత కష్టమో చెప్పేవాళ్ళకే తెలుసు. గౌతమ్ నాకు సొంతమై ఉన్నాడా లేదా అని కాదు అతనంటూ ఈ లోకంలో ఉండడమే నాకు ఒక సెలబ్రేషన్ అయినపుడు గట్టిగా హత్తుకుని ఉండడమూ విడిచి పెట్టి ఉండడమన్నది రెండు కాదు ఒకటే. అయినా వచ్చేసిన పండగని వద్దు పొమ్మంటే పోతుందా? నేను గాజు పెంకుల కోసం మూలమూలలూ వెతుకుతుంటే తనే కంటిన్యూ చేసాడు.
“…ఈ పదేళ్లుగా మనం ఫామిలీ లైఫ్ లో స్థిరంగా ఉన్నాం కదా డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు? మనిద్దరం జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాం. నాతో సమస్యల్లోంచి కాక నీ ఇష్టత లోంచి నువ్వటు మొగ్గుతున్నావు. అది నాకు చాలా భయంగా ఉంటోంది. నాతో సమస్యే అయితే అది ఏదోలా తీర్చుకోవచ్చు. కానీ కాదు. చాలా ఒత్తిడిగా ఉంటోంది. గట్టిగా చెప్పాలని ఉంది. ఇట్లా వద్దు. అతనితో మానెయ్. మనం హాయిగా ఉన్నాం. ఎప్పటికీ ఇలాగే ఉండగలం. నాకెంత కష్టంగా ఉందంటే పిచ్చివాడిలా అయిపోతున్నాను. ఓర్చుకోలేకపోతున్నాను.” పెంకులు అక్కడే పారేసి, అంతటి సదాశివా నేల మీద విసిరేసినట్లు కూలబడిపోయాడు
అతని కష్టానికి నాకూ దుఃఖం వచ్చింది. తన చేతులు ఒళ్లోకి తీసుకుని నిమురుతూ కూచున్నాను. ‘నా వల్ల కాదు.’ చేతులు తోసేస్తూ అంటున్నాడు. మరి నా ఓర్పు నా భారం నా కష్టం సంగతేంటి? నాలో ఏదో రగులుతున్నట్లు అగ్ని పర్వతం బద్దలవుతున్నట్లు ఉంది. ఎలా ఓర్చుకోవాలో ఎలా భరించాలో అన్ని స్వేచ్ఛలనీ గట్టిగా నమ్మిన ఈ క్రిమినల్ లాయర్ సదాశివకి నేను చెప్పాలా? చెప్పాలి. చాలా గుర్తు చేయాలి. తనకి పోటీగా వెళ్లి సమర్దించుకోడానికి కాదు. నేనెట్లా నెగ్గుకుని ఈ మానవ సంబంధాన్ని నిలుపుకున్నానో తెలిస్తే అది తనకి సాయపడుతుందేమో అన్న ఆశతో చెప్పాలనిపిస్తోంది.
**************************
మా ఇద్దరి సహజీవనం మొదలయ్యేప్పటికే సదాశివ అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం ఒక గూటి కిందకి వచ్చీ రాగానే అతని హృదయంలోకి తొంగి చూసాను. ఎంత ఖాళీగా విశాలంగా ఉందో! నన్ను రారమ్మని పిలిచింది. వెంటనే ఒక రంగురంగుల చాప తీసుకుని పరిగెత్తుకు వచ్చి అతని హృదయమంతా పరిచి దర్జాగా దాని మీదెక్కాను. కాసేపు పరుగులు పెట్టాను…కాసేపు బాసింపట్టు వేసుకు కూచున్నాను. కాసేపు నడుం వాల్చాను. కాసేపు చెవొగ్గి తన సంచలనాలు బాధలు నవ్వులు విన్నాను. అట్లా కాలు మీద కాలేసుకుని ఏలుతున్నానా?! ఓ రోజు హటాత్తుగా ఇంతలేసి కళ్ళ పిల్ల, అదే…బాదంకాయ కళ్ళ పిల్ల నేను పరుచుకున్న చాప మీదకి వచ్చి ఉడత పిల్లలా మిటుకూమిటుకూ మని చూసింది. మీకు తెలుసా అపుడు ఉడత పిల్ల కూడా భయపెట్టగలదని. నిజానికి భయమో అభద్రతో ఏదో నాలో ఇంకే లోపే ఆ పిల్ల సదాశివ ప్రేమని వాత్సల్యాన్ని కొద్దిగా కొరికి చూసి పారిపోయింది.
కానీ లవ్లీ లాయరమ్మ అని సదాశివ ముద్దుగా పిలుచుకునే ఆమె మాత్రం గొప్ప మాంత్రిక శక్తితో సివంగిలా దూకింది. ఆ దూకుడు చూడగానే అర్ధమైపోయింది ఆమె శక్తి ఏంటో! సన్నగా తెల్లగా పొడవుగా ఉండే లాయరమ్మ, మృదువైన మాటల లాయరమ్మ తన సమస్తాన్నీ త్యజించిన ప్రేమతో సదాశివని ఆరాధించింది. సదాశివే ఆమెని తన హృదయంలోకి వెంట బెట్టుకుని వచ్చాడు. నేను నా రంగురంగుల చాప అంచుల్ని గట్టిగా బిగించి పట్టుకుని కొన్నాళ్ళు బెట్టుగా బింకంగా ఉండిపోయాను. కానీ ఎక్కువ కాలం సాధ్యం కాలేదు. నాకు అక్కడ చోటు తరిగిపోతోంది. రంగుల చాప కుంచించుకుపోతోంది. నన్నెవరో నెట్టేస్తున్నట్లు ఎందులోనో కుక్కేస్తున్నట్లు ఇరుగ్గా ఉక్కిరిబిక్కిరిగా అయిపోయాను. కొండంత నన్ను పిడికిలంత చేస్తున్నందుకు ఎవర్నినిందించాలి? ఎవరితో పోట్లాడాలి? వచ్చినవాళ్ళే తిరిగిపొండి ఈ చోటంతా నాదే నాదే అని గొంతు పగిలేలా అరవాలనిపించింది. ఇతను నా ఒక్కదాని వాడు నువ్వు పో అని ఒక చింతరువ్వ తీసుకుని ఆ ఎల్లాపిగత్తె వెంటబడి తోలెయ్యాలనిపించేది. ఏడ్చి మొత్తుకుని సదాశివ మనసు మళ్ళించాలి అనిపించేది. కానీ అట్లా చేయడం నా వల్ల కాలేదు. ఒకరినొకరం వారి సమస్తంతో సహా అర్ధం చేసుకోవడం సాధన చేసినవాళ్ళం కదా!
ఏం చేయాలో తెలీని నిస్సహాయత లోనుంచి అపుడు నేనొక పని చేసాను. తనని లాక్కోడానికి పోటీ పడటం, నిందించడం, విడిపోవడం, ద్వేషించడం, కక్షతో వేరే సంబంధంలోకి వెళ్ళడం, అందరికీ చెప్పుకుని వాపోవడం లాంటివి చేయలేదు. ఏం చేసానంటే సదాశివని మరింత ప్రేమించడం మొదలు పెట్టాను. కోపం భయం ద్వేషం పగ అన్నింటినీ విసిరి కొట్టి ప్రేమించడం ఒకటే నాకు బాగా తెలుసునన్నట్లుగా ప్రేమించాను. లాయరమ్మతో పోటీ పడి కాదు. అప్పటివరకూ విశాలంగా పరుచుకుని హొయలు పోయిన రంగురంగుల నా ఆశల చాపని చుట్టగా చుట్టి తట్టాబుట్టా సర్ది చంకనబెట్టుకుని తన హృదయంలోనే ఓ వారగా నిలబడి అది ఆడుతున్న సయ్యాటల్ని చూస్తూ మరీ ప్రేమించాను. ఎందుకట్లా ఇదేం త్యాగం?! కోప్పడింది సన్నిహితురాలైన కామన్ ఫ్రెండ్. నన్ను ప్రేమించిన సదాశివని మాత్రమే నేను ప్రేమించలేదని చెప్పాను. సదాశివ అంటే ఉత్తి చేతులతో సాయం కోరే వారికి మేలు చేసే మంచి లాయర్ అనీ, సంస్కారవంతుడనీ, లోకాన్ని మెరుగ్గా అర్ధం చేసుకోగల సమర్ధుడనీ తను నాకు ఏదో ఒక స్థాయిలో తప్పకుండా కావాలి అన్నది అర్ధమయ్యాక ప్రేమించడం ఒకటే నేను చేయగల పనిగా తోచింది.
నా మాటలు మధ్యలోనే ఆపేసాడు సదాశివ. అతని మొహం ఎర్రబారిపోతోంది. భరించలేకపోతున్నాడు. తను పొందిన దానికి ప్రతిగా నేనేం కోరతానోనని భయపడుతున్నాడు. చటుక్కున లేచి గాజు పెంకులు చెత్తబుట్టలో వేసి స్టూల్ బాల్కనీ లో పెట్టి చేతులు కడుక్కుని వచ్చాడు. పడకగదిలో ఉన్న మినీ ఫ్రిజ్ తెరిచి సోడా బాటిల్ తీసాడు. పళ్ళెంలో ఉన్న మంచింగ్స్ నా వైపు తోస్తూ సజెస్టివ్ గా గ్లాస్ చూపించాడు.
“నాకు ఇపుడొద్దు” అన్నాను.
చిత్రంగా కళ్ళెగరేసి “కొత్త పాతివ్రత్యమా?” అనేసి తమాయించుకుంటూ సారీ చెప్పి, అయినా సరిపోనట్లు “అతనికి అలవాటు లేదా?” వేవరింగ్ గా ఉన్న గొంతుతో అన్నాడు.
“నీకు గౌతమ్ మీద కన్సర్న్ లేకపోయినా పర్లేదు. కానీ మనిషి అన్న గౌరవం అయినా ఉంటే తన గురించి ఇష్టంతో ఎంతైనా చెప్పుకోగలను. కానీ నేను ఇపుడేం మాట్లాడినా నీకు బాధ కలుగుతుంది. ఇక ఎందుకు చెప్పు?”
ఒక గ్లాసు పక్కకి నెట్టేసి రెండో గ్లాసు బుగ్గకి ఆనించుకుంటూ ‘ఒంటరి గ్లాసువాడినయ్యానన్నమాట’ అన్నాడు. లావెండర్ కలర్ డావిన్సీ క్రిష్టల్ గ్లాసులవి. ఒక గ్లాసు మీదే లెక్క పెట్టలేనన్ని చిన్ని చిన్ని పలకలు. ప్రతి పలక మీదా సదాశివ రూపం కనపడుతోంది. అనేక సదాశివలు.
********************
మనుషులు బాగా నచ్చినపుడే కాదు. అస్సలు నచ్చక శత్రువర్గంగా మారిపోయినపుడు కూడా ప్రత్యేకమైన కుతూహలం ఉంటుందనుకుంటాను. అట్లాంటి కుతూహలంతోనే కాబోలు ఆ రోజు తన స్నేహితుడు ఏర్పాటు చేస్తున్న చిన్న గాదరింగ్ కి గౌతమ్ ని కూడా పిలిచాడు సదాశివ. పబ్లిక్ ఎటెన్షన్ బాగా ఉండి, గత పదేళ్ళుగా నలుగుతున్న ఒక కేసులో బాధితుల్ని గెలిపించగలిగాడు సదాశివ. ఆ సందర్భంగా అతన్ని అభినందించడానికి ఈ చిన్న కార్యక్రమం. ఈ కేసు గెలవడం మానసికంగా తనకి ఎంత సంతృప్తినిస్తుందో ఈ పదేళ్ళ కాలంలో అతని ఒత్తిడిని బట్టి గ్రహించగలను.
పార్టీకి తన సన్నిహితులు పాతికమంది వరకూ వచ్చారు. గౌతమ్ కూడా వచ్చాడు. ఈ కేసు సందర్భంగా తన అనుభవాలు చెపుతూ ఎవరెవరి నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయో తనెట్లా నలిగిపోయాడో చివరికి ఎట్లా స్థిరంగా నిలబడిపోయాడో చెపుతున్నపుడు చాలా మంది కళ్ళు తడి చేసుకుని దగ్గరకి వచ్చి మరీ తనని కావిలించుకున్నారు. అపురూపమైన వ్యక్తి కదా ఆ బహుమానాలు సహజమే. తనింకా చెపుతూ ఒకటి రెండు సందర్భాల్లో తనలో తీవ్రమైన డిప్రెషన్ సూచనలు కనిపించాయని అపుడు ఒక వ్యక్తి విలువైన స్నేహం ద్వారా తనని నిలబెట్టిందని చెపుతూ ఆగాడు…నేను లాయరమ్మ వంక చూసాను. ఆమె తలవంచుకుని చిన్నగా మురిపెంగా నవ్వుకుంటోంది. ఊహించని విధంగా సదాశివ దగ్గరగా వచ్చి నా నడుము చుట్టూ చేయి చుట్టి ‘థాంక్ యూ నీలూ!’ అన్నాడు. వావ్… అంటున్న అందరి చప్పట్ల హోరు లోంచి లాయరమ్మని చూసాను.
నా జీవితం లోకెల్లా అత్యంత అవమానంతో సిగ్గుపడిన క్షణాలవి. లాయరమ్మ మొహంలో కనిపిస్తున్న భావాన్ని నేను చదవగలనా? చూస్తూ చూస్తూ ఉండగానే మనకి తోడయిన మనిషి వేళ్ళ కింద ఇసుకలా మెత్తగా జారిపోతున్నపుడూ, అప్పటివరకూ మన మీదే స్థిరంగా ఉన్న మాటలూ చూపులూ నవ్వులూ నడకలూ ఉద్వేగాలూ మనల్ని ఖాళీ చేసో మరో పాయ తీసుకునో మరో వైపు పరుగులెడుతున్నపుడూ ఖాళీ అయినంత మేరా డొల్లబారి జవజవలాడే మనుషుల మొహాల్లో ఏ భావం ఉంటుంది!. బహుశా ప్రేమ లేకపోయినందుకు కాదేమో ‘ఎవాయిడ్’ చేయబడుతున్నందుకు, ‘నా జీవితానికి అతుక్కుపోయేంతగా ప్రేమించకు, ఆశించకు’ అని ఈ విధంగా తెలియజెపుతున్నందుకు, చిటికేస్తే రాలిపడే ప్రేమల కన్నా ఈ ఒంటరి మహా నగరాల్లో నా చిన్ని కుటుంబమే నాకు చాలా ముఖ్యం అని ప్రకటిస్తున్నందుకు, రోదసీ నుంచి భూకక్ష్య లోకి ప్రవేశించే వ్యోమనౌక ఫెయిలయ్యి పేలిపోయినంత భీభత్సం ఆమె మొహంలో.
‘నాకు ఇన్స్టిట్యూషనల్ గౌరవం బాగానే దక్కించావు.!’ తిరిగొస్తున్నపుడు కార్ లో ఈ మాట అనకుండా ఉండలేకపోయాను.
‘ఏం! గౌతమ్ ఉన్నందుకు ఇబ్బంది పడ్డావా?’ సదాశివ తాపీగా సమాధానం ఇచ్చినప్పుడు అర్ధమైనది గౌతమ్ ని ఎందుకు పిలిచాడో. ఇంటికొచ్చేవరకూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను.
రాగానే సోఫాలో కూలబడి టీవీ పెట్టి దాని వైపు చూడకుండా సీలింగ్ చూస్తూ కూచున్నాడు. అరగంట అయినా అదే పరిస్థితి. “ మనుషులకి అన్ని రకాల స్వేచ్ఛలూ ఉండాలని అదే అంతిమవిలువ అనీ నువ్వే ఎన్నోసార్లు వాదించావు. ఇద్దరం నమ్ముతున్నాం కూడా కదా ? ఈ విషయాన్ని నా విజ్ఞతకే వదిలేయకూడదా? నిన్ను దాటి పోవాలని నాకేం లేదు. పోనీ అతన్నలా నా జీవితంలో ఓ పక్కగా ఉండనీయి. నీకేం అడ్డు సదా?” అతనికి ఎదురుగా కూచుని అడిగానేమో మరీ స్పష్టంగా కనపడుతున్నాడు. నా మాటలు వినగానే కాదన్నట్లు చేతులు గాలిలోకి విసిరాడు. తల అడ్డంగా ఊపుతూ ఆరోపణ ధ్వనిస్తున్న గొంతుతో –
“అతనేం పక్కగా లేడు. నిన్ను లాగేసుకుంటున్నాడు. లైక్ బ్లాక్ హోల్…అయినా నీలూ మనిద్దరం జీవితాంతం కలిసుండాలని సహజీవనంలోకి వచ్చాం. అపుడు మిగతా స్నేహాలు నో స్ట్రింగ్స్ అటాచ్డ్ గా ఉండాలి. కానీ నువ్వతనితో ఎమోషనల్ గా ఉంటున్నావు. బాహాటంగా ఓపెన్ అవుతున్నారు మీరిద్దరూ!.”
మన ఆచరణ శక్తి ఎంతవరకో అంతవరకూ ఉన్నదే విప్లవమన్న మేధావులను లోకం చాలానే చూసింది. సదాశివ ఇంతవరకూ రాగలిగాడు కనుక అతని పాటికిదే న్యాయం.
నేను మాట్లాడకపోయేసరికి నిస్పృహగా మొహాన్ని చేతులతో రుద్దుకుంటూ… “ఏం జీవితాలివి! అందరికీ ఏవో ఖాళీలు. ఏం చేస్తాం? ఎవరి మార్గాల్లో వాళ్ళు వెతుక్కుంటారు. కానీ ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఇబ్బందులు లేకుండా కాస్త తెలివిగా ఉండాలి కదా నీలూ? డ్యూయల్ వాల్యూస్ ఉండకూడదని నా సంస్కారం పదేపదే హెచ్చరిస్తుంది కనుక చెప్తున్నా. నీకు ఎవరి పట్లయినా ఆకర్షణ కలిగితే వన్ నైట్ స్టాండ్ తీసుకో…లేదూ కాదూ అంటే కాజువల్ రిలేషన్ షిప్ లో ఉండు…” గాయపడి రక్తమోడుతున్న పావురంలా విలవిల లాడుతున్నాడు సదాశివ.
చప్పున లేచి వెళ్లి తన భుజాల చుట్టూ చేతులు వేసి “అట్లా హింసించుకోకు సదా! ప్లీజ్…” నా నెప్పిని దాచిపెట్టుకుంటూ ఓదార్చబోయాను.
“…నాకే శక్తి ఉంటే నేనే నీకు సమస్తమూ అవ్వాలని ఉంటుంది. అది సాధ్యమైతే ఎంత బావుండేది నీలూ ! కానీ అట్లా కాలేదు. నా వల్లనే కాలేదు. నీకు నిలకడగా స్థిరంగా తదేకంగా ఉండే బంధం కావాలి నాకు తెలుసు. నేనట్లా కాలేకపోయాను. గౌతమ్ మాత్రం కాగలడా!? ”
లాజిక్ వరకూ అయితే తన ప్రశ్నకి తిరుగులేదు. “ నిజమే సదా! ” ఒప్పుకున్నాను.
“ ఇక ఇపుడు నేనేం చేయగలను.! ఏం చేస్తే ఈ నెప్పి పోతుంది నీలూ? ”
నా వంకే దీర్ఘంగా చూస్తున్నాడు. నేనూ చూపు కలిపాను.
ఎంత సేపో అలా…
తనకి చాలా ఇష్టమైన ఎడతెగని నా కంటిచూపుని తాడు వలే పేని మెడకి చుట్టుకుంటున్నట్లు అభినయించి ‘చచ్చిపోనా పోనీ?’ అన్నాడు.
“రా.”
వచ్చాడు. ఎప్పట్లాగా తెల్ల పూలదండ అంచుల సముద్రుడై రాలేదు. విలయం సృష్టించే సునామీలా వచ్చాడు. నా మనశ్శరీరాలతో సంభాషించడానికి రాలేదు. నా హృదయంలోని ప్రియమైన వ్యక్తి ఉనికిని నిర్మూలించాలన్న క్రోధంతో వచ్చాడు.
జీవితం నాటకం కాదు గదా తెర పడే లోపు యుద్ధం ముగియడానికి!
**************************

 

page44page45page46

సి బాచ్ అమ్మాయి

2006 నుంచి 2015 వరకూ నేను రాసిన  17 కథలను సి బాచ్ అమ్మాయి పేరుతో  సిక్కోలు బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఆ ముఖచిత్రం ఇది. సి బాచ్ అమ్మాయి నా మూడవ కథా సంపుటి, పదమూడవ పుస్తకం. ఆర్ధిక భారానికి వెరవకుండా పుస్తకం వేస్తున్నందుకు ఎస్.బి.టి వారికి, ముఖ్యంగా దుప్పల రవి కుమార్ గారికి మెని మెని థాంక్స్.  c batch ammaayi

స్త్రీ – ముక్తి కీ ప్రతినిధి తెలుగు కహానియ

ప్రముఖ అనువాదకులు జె.లక్ష్మారెడ్డి గారు అనువాదం,సంకలనం చేసిన పుస్తకం ఇది. 2005 లో నేను రాసిన మొదటి కధ ‘పోరాటం’ ని సంఘర్ష్ పేరుతో అనువాదం చేసి ఈ సంకలనం లో చోటు కల్పించినందుకు బ్లాగ్ ముఖంగా వారికి దన్యవాదాలు.ఈ సంకలనం లోని రచయితలు…
 
గోపీచంద్
చాసో 
బండారు అచ్చమాంబ 
పి.సత్యవతి
చాగంటి తులసి
రంగనాయకమ్మ 
కనుపర్తి వరలక్ష్మమ్మ 
జూపాక సుభద్ర 
ఎ.పుష్పాంజలి
అబ్బూరి ఛాయాదేవి
గోపీ భాగ్యలక్ష్మి  
చంద్రలత
షాజహానా 
రుబీనా పర్వీన్ 
మల్లీశ్వరి
జలంధర 
కుప్పిలి పద్మ 
 
 
 
 
 
 
 
 
  
 
 
 
 

వార్తలో నా కధ – టెంకి జెల్ల

అక్టోబర్ రెండవ తారీఖున వార్త ఆదివారం అనుబంధం లో ప్రచురితమైన టెంకి జెల్ల కధ,

ఒక రాజకీయ వ్యంగ్య కధగా నేను చేసిన తొలి ప్రయోగం.
“ఇన్నాళ్ళు నేను నోరు తెరవకపోవడానికి కారణం నాకు మాటలు రాక కాదు… నేనసలు మాట్లాడొచ్చని తెలీక…..”

మాట్లాడుదాం

            —–కె.యన్. మల్లీశ్వరి

“ఈ రోజు నీ పంట పండింది………..” ఆఫీసు నుంచి యింటికి వస్తూనే భార్య శశితో అన్నాడు సురేష్.

          అతను అంత వుల్లాసంగా తనతో మాట్లాడటం చాలా రోజుల తర్వాత కావడంతో సంభ్రమంగా చూసిందామె. సోఫాలో రిలాక్స్ డ్ గా కూర్చుని కాళ్ళెత్తి టీపాయ్ మీద పెట్టాడు సురేష్. అలా స్వేచ్ఛగా కూర్చునే అదృష్టం తనకి లేకపోవడం మూలంగానేమో ఆ భంగిమ అంటే ఆమెకి ఎంతో యిష్టం…..

కథ పూర్తిగా చదవటానికి  మాట్లాడుదాం లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి.

మీరే కారణం (పెత్తనం కథల సంపుటం నుండి)

        మీరే కారణం

          రాధిక హుషారయిన పిల్ల. ఎపుడూ చిరునవ్వుతో వుల్లాసంగా ఆడుతూ, పాడుతూ కనిపిస్తుంది. ఆ రోజు ఎప్పటిలాగే స్కూలు నుంచి రాగానే వాళ్ళమ్మకిచెప్పి ఆడుకోవడానికి బయటికి వచ్చింది. ఆట పాటల్లో చురుగ్గా వుండే అమ్మాయి కావడంతో ఆమె మిత్ర బృందానికి అనధికారికంగా ఆమే లీడర్……….

పూర్తిగా చదవటానికి మీరే కారణం  లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి.
 
 

మమ్మల్ని మారనివ్వండి (పెత్తనం కథల సంపుటి నుండి)

మమ్మల్ని మారనివ్వండి

                       ఏ మాట కామాట చెప్పుకోవాలి. మా అమ్మ నన్నూ, మా చెల్లినీ బాగా పెంచింది. మా చెల్లి సంగతేమోగానీ నన్ను బాగా పెంచడం సమాజంలో దృష్టిలో బాగా’ పెంచకపోవడం ‘గా మారడమే బాధని కలిగిస్తోంది.

          మా అమ్మ స్త్రీవాది అని చాలా మంది అంటుంటారు. కొంతమంది పుల్లవిరుపుగా పురుషద్వేషి అని కూడా అంటారు. అమ్మ ఎంతో హుందాగా రెండింటినీ సమానంగా స్వీకరించింది తప్ప, పెంపకంలో మార్పులూ చేర్పులూ చేయలేదు………

పూర్తిగా చదవటానికి మమ్మల్ని మారనివ్వండి లింక్ క్లిక్ చేయండి.
చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి

స్త్రీలకు ప్రయాణం (పెత్తనం కథల సంపుటి నుండి)

స్త్రీలకు ప్రయాణం

                     నాకు అతనంటే ఎంతిష్టమో .. ఎంచగ్గా నవ్వుతాడో !! వెన్నెల పింజలు పింజలుగా రాలుతున్నట్లు వుంటుంది. ఎంత ప్రేమగా చూస్తాడో !! కాంతి వానలో నిండారా తడుస్తున్నట్లు వుంటుంది. ఎలా స్పర్శిస్తాడో !! మత్తెక్కించే అడవిపూల పరిమళం బరువుగా చుట్టుముట్టినట్లు వుంటుంది.  చూస్తున్న కొద్దీ అనందంతో, ప్రేమతో, అల్లరితనంతో నవ్వు వుబికి వుబికి వస్తోంది. మనోహర్ కి చెరోవైపు పడుకున్న బాబూ , పాప అతని మీద కాళ్ళూ, చేతులూ యిష్టం వచ్చినట్లు పడేసి నిద్రపోతున్నారు. భూభారాన్ని ఎంతో సహనంతో భరించే భూమాతలా నిద్రలోనూ పెదాల వంపులో చిందులేస్తున్న నవ్వుతో ఆనందంగా పడుకున్నాడు మనోహర్.

  అనురాగంతో అతని నుదుటిని చుంబించింది. మెలకువ వచ్చింది మనోహర్ కి . కళ్ళు విప్పాడు………

పూర్తిగా చదవటానికి స్త్రీలకు ప్రయాణం లింక్ క్లిక్ చేయండి.

చదివి మీ అభిప్రాయం మర్చిపోకుండా తెలియచేయండి