భాండాగారం

నానీ ని విందాం రండి

 

బ్లాగర్ పేరు  ;రాధిక (నాని) .అసలుపేరు  రాధిక పిన్నమనేని ,ముద్దుపేరు నాని.

బ్లాగులు   ;  సత్యప్రియ ,చిత్తరువు

బ్లాగుల చిరునామాలు   ;  http://saisatyapriya.blogspot.in/
                
                                    http://palleturipaduchu.blogspot.in/
          
పుట్టిన తేదీ  ; సెప్టెంబర్ 15

పుట్టిన స్థలం ; గాంధీనగరం ,పశ్చిమ గోదావరి జిల్లా

ప్రస్తుత నివాసం   ; గాంధీనగరం

 విద్యాభ్యాసం  ;  డిగ్రీ  .లాసెట్ లో మంచి రాంక్ వచ్చినా చేరలేదు . ఎందుకు చదవలేదు ? చదివి ఉంటే లాయర్  అయ్యేదానివి.మా అమ్మ “లాయర్” అని మేము చెప్పుకునేవాళ్ళము అని పిల్లలు అస్తమాను అంటూ ఉంటారు .నాన్నగారితో కూడా ఎందుకు చదివించలేదని? పోట్లాడుతారు 🙂

 వృత్తి ,వ్యాపకాలు;  పల్లెటూరి గృహిణి .కుట్లు ,అల్లికలు ,ఫాబ్రిక్ పెయింటింగ్ ,పుస్తకాలు ,సంగీతం ,తోటపని ,ఫోటోలు తీయడం ,కోన్ తో  మెహంది పెట్టడం ఇవన్నీకూడా చిన్నప్పటినుండీ   ఇష్టమైన వ్యాపకాలు .వాటితో పాటు ఈ ఐదేళ్ళ నుండి బ్లాగ్ రాయడం   నా వ్యాపకాలలో ఎంతో ముఖ్యమైనదైపోయింది ..

 బ్లాగ్ మొదలుపెట్టిన తేదీ ; ఆగస్ట్ 25 ,2009

 బ్లాగ్ మొత్తం పోస్ట్ లు  ;  సత్యప్రియ   –       172
                      
                                     చిత్తరువు    –        117

బ్లాగ్ లో కేటగిరీలు  ;  మా ఊరి విషయాలు,హాబీలు ,వ్యవసాయం ,మా కబుర్లు ,అవి ఇవి ,శుభాకాంక్షలు,సీరియళ్ళు  వగైరా ..వగైరా ..

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎప్పుడు గుర్తించారు?

బ్లాగులు  తెలుగులో కూడా రాయొచ్చని ఈనాడులో రాసిన  ఆర్టికల్  చదివాక   బ్లాగుల పై ఆసక్తి కలిగింది. 2008 చివరలో   మా ఊరుకి   బ్రాడ్ బాండ్  కనెక్షన్ వచ్చాక  అప్పటి వరకూ పోస్ట్ పైడ్ లో నెట్ వాడే మేమూ  బ్రాడ్ బాండ్ కనెక్షన్ తీసుకున్నాం.మొదట్లో సరదాగా అందరూ రాసే బ్లాగులు చదివేదానిని .తరువాత  నాకూ రాయాలనిపించింది .

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు ?

బ్లాగ్  మొదలు పెట్టేక మొదటి  పోస్ట్లో ఐతే  ఎమీ రాయలేదు .నేనూ బ్లాగ్ రాస్తున్నా అని రాసానంతే 🙂 మొదటి రెండు మూడు పోస్టుల్లో   ఏమి రాయాలో తెలియక  ఏవో పుస్తకాల్లోవి చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేదానిని ..అవిఎవరైనా పుస్తకాల్లో చదివేవే కదా అని  అలా అలా  నే రాసే పద్దతి మార్చుకున్నా .

మొదట్లో ఇలా పోస్ట్ రాయగానే అలా కామెంట్ల కోసం చూసేదానిని .నేను చదివిన బ్లాగుల్లో కామెంట్లు చూసి చూసి నాబ్లాగు లో కూడా  అలా రాసేస్తారు అనుకున్నా 🙂 ఒక్క కామెంట్ వచ్చినా ఎంతో సంబరంగా అనిపించేది .తరువాత తరువాత చాలామంది  తమ తమ కామెంట్ల తో నన్నెంతో ప్రోత్సాహించారు.ప్రోత్సాహిస్తున్నారు .
బ్లాగ్ చాలా మంచి అనుభవమే .ఇలా బ్లాగ్  రాయడం వలనే కదా ఎక్కడో పల్లెటూర్లో ఉండే నేను చక్కని  స్నేహితులను సంపాదించుకున్నాను . ఎంతో  ఆనందంగా అనిపిస్తుంది.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు ?

సానుకూల అంశాలూ ……. మనం ఏమైనా మనకు నచ్చినవి ,చూసినవి రాసుకోవచ్చు.అభిప్రాయాలు వెంటనే తెలుసుకోవచ్చు . ఇలా రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు  . బ్లాగ్ వలనే కదా నేనూ రాయగలను,నా రాతలు కొద్దిమందైనా చదువుతారు అనితెలిసింది .కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి …ఏర్పడుతున్నాయి .తెలియనివి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను.

పరిమితులు … మన బ్లాగ్ మనిష్టం ఏమైనా రాయొచ్చు ,అననుకోకుండా   ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనుకుంటాను.

 మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత ?

ప్రత్యేకత ఉందని  ఏమీ అనుకోను.పల్లెటూరులో ఉండే నేను కూడా ఓ బ్లాగర్ ని ,నేనూ రాస్తాను ,రాయగలను అది చాలు నాకు.

సాహిత్యం తో మీ పరిచయం ?

సాహిత్యం ! ఇంత పెద్ద పదాలు వద్దులెండి . కానీ నాకు చిన్నప్పటినుండి చదవడం చాలా ఇష్టం .మా ఇంట్లో అందరూ బాగా  చదువుతారు.

మా ఊరు చాలా చిన్నది కావడంతో ఉళ్లో మా తాతయ్యల ఇళ్ళు,అత్తయ్య ఇళ్ళు అన్నిదగ్గర దగ్గరగా ఉంటాయి .మా చిన్నప్పుడు 80లు 90ల టైంలో విక్లీ ల్లో సీరియళ్ళు బాగా వచ్చేవి.ఆ సీరియళ్ళ కోసమే  జ్యోతి,ప్రభ,పత్రిక ,భూమి ఇలా అందరూ తలో పత్రికా కట్టేవారు .ఇంకా  పిల్లల కోసం బాల జ్యోతి ,చందమామ వచ్చేవి.ఆ పుస్తకాలు  ఆ ఇంటికీ ,ఈ ఇంటికీ తిప్పడం మా పిల్లల వంతనమాట .అలా తీసుకెల్తూ   చదవడం కుడా అలవాటు చేసుకున్నాం. సీరియళ్ళు ఉండే  పేజీలు జాగ్రత్తగా  అమ్మా వాళ్ళు బైండింగ్ లు కూడా చేయించారు.ఇప్పటికీ ఉన్నాయవి. అలా చేసిన బైండింగ్ పుస్తకాల్లో  యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల ఒకటి . చాలా చాలా ఇష్టమైన నవల .చాలా సార్లు చదివాను.ఇంకా చంటబ్బాయ్ ,రెండురెళ్ళారు ,డబ్బు డబ్బు డబ్బు ఇలా చాలా ఉన్నాయి ఇప్పటికీ .

మా అమ్మమ్మగారిది పెద్ద ఉమ్మడి కుటుంబం.మా బుల్లెమ్మమ్మ (మూడో అమ్మమ్మ) దగ్గర చాలా నవల్స్  ఉండేవి. పదో తరగతి సెలవల్లో అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు  నవల్స్ చదవడం అలవాటైంది .ఆ సెలవల్లో యండమూరి,యద్దనపూడి ,అరికపుడి కౌసల్యాదేవి,కొమ్మనాపల్లి  ఇంకా చాలా మంది నవలలు చదివేను .ఆర్ సంధ్యా దేవి నవలలు కూడా వదల్లేదు .అవి చదువుతుంటే అమ్మమ్మ అస్తమానూ నవలలే అని ,చిన్న పిల్లలు నవలలు చదవకూడదని తిట్టేది .ఆవిడ వస్తుంటే  తలగడ కింద దాచేసేదానిని 🙂 ఇప్పటికీ  నవల ఏదైనా చదువుతున్నప్పుడు  ఎవరైనా వస్తే  ఫ్రీగా ఉండదు.

ఇప్పుడు బ్లాగ్ వలన మంచి మంచి పుస్తకాల గురించి తెలుస్తుంది .కుదిరినప్పుడల్లా వాటిల్లో ఒక్కో పుస్తకం కొని చదువుతున్నా .

స్త్రీ గా రాయడం వలన మీకు ఇబ్బందులు  ఏవైనా ఎదురయ్యాయా?

ఎప్పుడో  బ్లాగ్ రాయడం మొదలెట్టిన కొత్తల్లో ఒకటి రెండు కామెంట్ల వలన కాస్త ఇబ్బందిగా అనిపించింది  కానీ  ఇప్పుడేమీ లేదు.

జీవన నేపధ్యం?

నాన్నగారిది వ్యవసాయ  ఉమ్మడి కుటుంబం .నాన్నగారు పియుసి  చదివి వ్యవసాయంలోకొచ్చేసేరు. అమ్మ ఇంటర్ మొదటిసంవత్సరం మాత్రమే చదివింది.ఇద్దరూ పుస్తకాలు బాగా చదువుతారు .నాన్నగారు మా చిన్నప్పుడు కొత్త సినిమా పాటలు ఏవి రిలీజైనా ఆ కాసెట్లు ,అలాగే అన్నమయ్య సంకీర్తనలు, ఎం ఎస్ సుబ్బలక్ష్మి కీర్తనల కేసెట్లు చాలా శ్రద్దగా రికార్డు చేయించి తెచ్చేవారు. కాస్తో  కూస్తో సంగీతాభిరుచి మాఅక్కాచెల్లెళ్ళకుందంటే అది అమ్మా ,నాన్నగారి వలనే .

పెళ్ళయ్యాక  ఆ ఉమ్మడి కుటుంబం నుండి ఇంకో ఉమ్మడి కుటుంబమైన మా అత్తయ్యగాంటికి వెళ్ళాను.అదీ మా ఊరిలోనే ..ఒకే వీధిలో 🙂 మా బావ BBM చదివి హైదరాబాదు లో రెండేళ్ళు ఉద్యోగం చేసి ఆ పట్నం  పొల్యుషన్  తట్టుకోలేక  వ్యవసాయం  అంత ఉత్తమం లేదని వచ్చేసేరు .తనకి కంప్యూటర్  అంటే చాలా ఇష్టమవడంతో మా అమ్మాయి పుట్టగానే కొన్నారు.అంటే ఆయన ఇష్టం వలన నేనిలా మీముందున్నానన్నమాట:)

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

నాకు రాయాలనిపించినన్ని  రోజులూ ….. రాయగలిగినన్ని రోజులూ ….

సరదాగా ఏమైనా చెప్పండి?

సరదాగా అంటే!….నేను  బ్లాగ్ రాయడం మొదలుపెట్టినప్పుడు  ,గూగులమ్మ  చెప్పినట్టు అన్నీ ఫాలో అయిపోయి  బ్లాగ్ ఓపెన్ చేసేసా  ..పైన  చెప్పేగా అలా పోస్ట్ రాసేసి పోస్ట్ చేసా. రెండు మూడు   రోజులు అస్తమానూ కూడలిలో కి వచ్చిందేమో అని  దాన్ని   ఓపెన్ చేసి చూడటమే .దాన్ట్లో  ఎక్కడా నా బ్లాగ్ కనపడకపోతే నా బ్లాగ్  ఏమన్నా తేడాగా ఉందేమో అందుకే రాలేదేమో అని మళ్ళి  ఇంకో బ్లాగ్ అలా ఓ పది  బ్లాగ్లు ఓపెన్ చేసేసా …నా ఇష్టమొచ్చిన పేర్లతో .ఆఖరిగా మా అమ్మాయి పేరు తో సత్యప్రియ   ఓపెన్ చేసాక    ఎవరి బ్లాగ్ లోనో చూసాను  కూడలి లో కనపడాలంటే దానికి మెయిల్ చేయాలని .ఇదా సంగతి! అనుకుని మెయిల్ చేసా .  కూడలికి లంకె వేయండి అంటే కాసేపు అర్ధమవలేదు .రంకె వేయడంలా లంకె  వేయడమేంటో   అనుకున్నా 🙂

సీరియస్ గా ఏవన్నా చెప్పండి?

నేనంత సీరియస్ విషయాలు చెప్పలేనండి

గురజాడ – లక్షింపేట

గురజాడ  150 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వెలుగు మిత్రులు రాజాం లో జరిపిన రెండు రోజుల సాహిత్య సమావేశంలో..వరవరరావు,నందిని సిధారెడ్డి,గోరటి వెంకన్న,ఓల్గా, వి.చెంచయ్య,అక్కినేని కుటుంబరావు,సుంకిరెడ్డి నారాయణరెడ్డి,ప్రసాద్ వర్మ రమేష్ పట్నాయక్ మొదలైన సాహితీ మిత్రులు గురజాడ సాహిత్యం, ప్రభావాలపై ప్రసంగించారు.
సమావేశానంతరం లక్షిం పేటలో కుట్రపూరితమైన అమానుష హత్యాకాండకి గురైన దళితులకి సంఘీభావంగా…వరవరరావు,నందిని సిధారెడ్డి,వి.చెంచయ్య,సుంకిరెడ్డి నారాయణరెడ్డి,హేమలత,అనిత,ప్రసాద్ వర్మ, నారాయణవేణు,కె.క్యూబ్ వర్మ,మేడిశెట్టి రామకృష్ణ మల్లీశ్వరి,… లక్షిం పేట వెళ్లి బాధితులతో మాట్లాడారు.

 

nandini sidhareddy

gorati enkanna

malleeswari

varavara rao

lakshim peta badhithulato…

భూమి చెపితే ఆకాశం నమ్మదా?

వాకపల్లి గిరిజన మహిళల అత్యాచారం కేసులో కీలకమైన తీర్పు వెలువడిన సందర్భంలో  ఆంధ్రజ్యోతి దినపత్రికకి  రాసిన వ్యాసం.(మాటర్ పై క్లిక్ చేయండి.)

మర్లపోలమ్మ యుద్ధ జయకేతనం – ఉత్తరాంధ్ర మహిళ.

”ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అని వందేళ్ళ కిందట గురజాడ అన్నాడు.ఆధునిక మహిళ అంటే ఎవరు? అన్న ప్రశ్న అపుడు బలంగా రాకపోయి ఉండొచ్చు.ఎందుకంటే వందేళ్ళ కిందట సమాజంలో వైరుధ్యాల మధ్య ఉండే విభజన రేఖని స్పష్టంగా గుర్తించడానికి వీలుండేది.కానీ వర్తమానంలో ఆ గుర్తింపు కష్టం.అస్తిత్వాలు,ఉప అస్తిత్వాల స్పృహ పెరిగిన కొద్దీ సంఘర్షణ స్వభావం సంక్లిష్టమౌతోంది.

ఇలాంటి సందర్భంలో ఏ మహిళ చరిత్ర గతిని మార్చే ఆధునిక స్వభావాన్ని కలిగి ఉంది అన్న చర్చ జరగాలి… ఆధునికత్వాన్ని స్వభావ వాచిగా తీసుకున్నట్లయితే వివక్షలపై అవగాహన, పోరాడాలనే స్పృహ,పోరాడే చైతన్యం కలిగి ఉండడం కూడా ఆధునికతలో భాగమే…ఆ రకంగా సమాజ స్వభావాన్ని ప్రభావం చేయగలిగిన రీతిలో పోరాటాలు చేస్తున్న ఉత్తరాంధ్ర శ్రామిక వర్గ స్త్రీలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

 గత సంవత్సరం జూలై నెలలో సోంపేట కాల్పుల ఘటన తర్వాత అక్కడ వెల్లువెత్తిన ప్రజా చైతన్యం,ముఖ్యంగా మహిళా చైతన్యాన్ని చూసినపుడు భవిష్యత్తు పట్ల ఆశ కలిగింది.సగటు స్త్రీల నుంచి ఉత్తరాంధ్ర స్త్రీలను ప్రత్యేకించి చూపే ముఖ్య గుణం వారు తొంభై శాతం వరకూ శ్రామిక వర్గ మహిళలుగా ఉండడమే….ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ప్రజలు భూమి,సముద్రం,అడవి ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వాళ్ళే…జనాభాతో పాటు ఈ మూడు వనరుల ఆధారంగా జరిగే ఉత్పత్తి కూడా ఎన్నో రెట్లు పెరిగింది. ఈ మూడు రంగాల్లోని సంపద సృష్టిలో ఉత్తరాంధ్ర స్త్రీలకి ప్రముఖ పాత్ర ఉంటుంది…

1947 తర్వాత ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ మూలంగా వారి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి.ప్రభుత్వాలు అబివృద్ధి అని చెప్పే పదం నిజంగా అభివృద్ధిని సూచించేది కాదని, ఏ అభివృద్ధి అయినా ప్రజల సంపూర్ణాంగీకారంతో జరగాలనీ,ప్రజలు వ్యతిరేకించే అభివృద్ధిని ప్రభుత్వాలు బలవంతంగా రుద్దుతున్నాయనీ,అది విధ్వంసానికి దారితీస్తోందన్న అవగాహన ప్రజల్లో కలిగాక ఉద్యమాలు మొదలయ్యాయి…

 అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఉత్తరాంధ్ర స్త్రీలూ తీవ్రంగా వ్యతిరేకించారు….గంగవరం పోర్టు నిర్మాణం మూలంగా తమ వృత్తులనూ ,భూములనూ పోగొట్టుకున్నపుడు,ఎస్.కోటలో జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరులోనూ,సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కి వ్యతికేకంగా నడుస్తున్న పోరాటంలోనూ ఉత్తరాంధ్ర శ్రామిక వర్గ స్త్రీలు నిర్ణయాత్మకంగానూ,వ్యూహాత్మకంగానూ వ్యవహరించారు.ఈ చైతన్యం వెనుక అనేక ఆర్ధిక రాజకీయ,సామాజిక కారణాలు ఉన్నాయి.

 ఉత్తరాంధ్రలో గ్రామీణ స్త్రీలు తమ జీవిక కోసం చేస్తున్న అనేక వృత్తులు అభివృద్ధి మూలంగా విధ్వంసానికి గురౌతాయి.జీడిపిక్కలు ఒలవడం,పళ్ళ వ్యాపారం,చేపల అమ్మకం,కాయగూరల పెంపకం/అమ్మకం,చిన్న హోటళ్ళ నిర్వహణ,పశుపోషణ,అటవీ ఉత్పత్తుల సేకరణ/అమ్మకం,కొండ ఉత్పత్తుల(కొండ చీపుళ్ళు మొదలైనవి)సేకరణ/అమ్మకం,వ్యవసాయం,వ్యవసాయాధారిత పనులు వీటన్నింటినీ ప్రత్యక్షంగా పరోక్షంగా స్త్రీలు కోల్పోవాల్సి వస్తుంది.

 దిగువ తరగతిలో కుటుంబాల బాధ్యత ప్రధానంగా స్త్రీలదే…తమ సాంప్రదాయ వృత్తుల్ని నమ్ముకుని ఇంకే ఆసరా లేకపోయినా కుటుంబాల్ని నెట్టుకొచ్చే స్త్రీలు, అవి కోల్పోవాల్సి వచ్చినపుడు…అభద్రతకి లోనవుతారు.అప్పటివరకూ తమకి తెసిన చోటులో,తెలిసిన పనుల్లో అంతో ఇంతో ఉందనుకునే సామాజిక భద్రత కూడా ఉండదని గ్రహింపుకి వచ్చినపుడు ఆందోళన చెందుతారు.

నిర్వాసిత కుటుంబాల మీద ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువ. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం మీద కూడా పురుషుడి పెత్తనమే ఉంటుంది…ఆ రకంగానూ స్త్రీలకి ప్రత్యామ్నాయం కరువౌతుంది. అంతే కాకుండా నష్ట పరిహారం వచ్చిన తర్వాత స్త్రీలకి గృహ హింస పెరగడం,నిర్వాసితులైన స్త్రీలు వేరే ఆధారం లేక పడుపు వృత్తిలోకి దిగడం జరుగుతోందని అనేక సర్వేల మూలంగా తెలుస్తోంది. నష్ట పరిహారం భూముల్ని కోల్పోయిన వాళ్లకి తప్ప,భూముల మీద ఆధారపడిన ఇతర వృత్తుల వాళ్లకి కాక పోవడంతో తప్పనిసరై వలసలు వెళ్ళాల్సి వచ్చినపుడు కొత్త చోట్ల,కొత్త వృత్తుల్లో మళ్ళీ కొత్త నైపుణ్యాన్ని సంపాదించడం అంత సులభం కాదు.దీంతో మానసికంగా కూడా కుంగిపోవడం జరుగుతుంది.

 ఇక స్వదేశంలో విదేశాల్లాంటి సెజ్ ల్లో అమానవీయమైన పరిస్తితుల మధ్య స్త్రీలు పని చేస్తున్నారు.దోపిడీ వ్యవస్థ కొత్త రూపాలను గుర్తించే శక్తి లేకపోవడం మూలంగా పని చోట్ల మోసానికి గురైతున్నారు. ఇలాంటి చోట్ల స్త్రీలు అనార్గనైజ్ద్ సెక్టార్ ఉండడం మూలంగా తక్కువ వేతనాలు,కనీస సదుపాయాల కొరత,అమర్యాదగా వ్యవహరించడం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. వీటితో పాటు వారికి ఇచ్చే పనులు అత్యంత జాగరూకతతో, ఎక్కువ శ్రద్ధ పెట్టి చేయాల్సి వచ్చే డైమండ్ కట్టింగ్ లాంటివి కావడంతో ఆరోగ్యమూ దెబ్బ తింటుంది.విశాఖలో బ్రాండిక్స్ లాంటి సెజ్ ల పని తీరు పట్ల ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.

 ఇంత విధ్వంసకర వ్యూహంలో దేశమంతా చిక్కుకుని విలవిల్లాడుతున్నపుడు పోరాడి ఓడిన గంగవరం స్త్రీలూ,పోరాడుతున్న ఎస్.కోట,అరకు ప్రాంతాల స్త్రీలూ,పోరాడి గెలిచిన సోంపేట మహిళలూ,యావత్ మహిళా ప్రపంచానికే స్పూర్తినిస్తున్నారు.

 2010 జూలై లో రెండు సార్లు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరుపున నిజ నిర్ధారణకు సోంపేట వెళ్ళినపుడు అక్కడి స్త్రీల పోరాట చైతన్యం చాలా భరోసాని ఇచ్చింది.అంత మంది మహిళలు సంఘటితం కావడానికి డ్వాక్రా సంఘాలు,పర్యావరణ,మత్స్యకార సంఘాలు చాలా కృషి చేసాయి.సోంపేట లో సంవత్సం పైగా నిరవధికంగా సాగుతుతున్న రిలే నిరాహార దీక్షల్లో రోజుకి ఒకో గ్రామం నుంచి ఒకో పొదుపు సంఘం మహిళలు పాల్గొంటున్నారు.ముఖ్యంగా మత్స్యకార మహిళలు 4000 ఎకరాల బీలని,సముద్ర తీర ప్రాంతాన్నీ కాలుష్యం నుంచి తప్పించడం ద్వారా తమ జీవనాధారాన్ని నిలబెట్టుకోడానికి ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదన్న తెగింపులో ఉన్నారు.

 అక్కడి స్త్రీలని కలిసినపుడు వారి భావోద్వేగాలు జానపద ప్రదర్సక కళల్ని తలపింపజేసాయి.వారి ఆవేశం,ఆక్రోశం,ఉద్వేగాలు,ఉద్రేకాలు,వ్యంగ్యం,నిష్కపటత్వం,పట్టుదల అసంకల్పితంగా కళాత్మకతని సంతరించుకోవడం కన్పించింది…పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావుకి ప్రభుత్వం 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది.ఈ విషయం జోగారావు భార్య జగదాంబ వద్ద ప్రస్తావనకి వచ్చినపుడు,ఆమె ఉద్వేగంగా ”లచ్చలూ కోట్లూ నాతో మాటాడవు గదా నా పక్కన కూకోని నాకు కబుర్లు సెప్పవు గదా”అంది.

 పోలీసులూ, పవర్ ప్లాంట్ గూండాల దౌర్జన్యాన్ని ఎదిరిస్తామని చెపుతూ ”ఆళు మూడు వేల మంది వత్తే మావు ముప్ఫై వేల మంది ఒత్తాం ….ఆళు పొగ బాంబులేత్తే మాం బురద మట్టితో కప్పెడతాం…ఆళు అగ్గి బాంబులతో వత్తే… మాం పెట్రోల్ జల్లడానికైన సిద్ధం” అని మత్స్యకార మహిళ బట్టి మోయినమ్మ ఆవేశంగా అంది…పలాసపురం మహిళలయితే ”భుక్తికోసం భూమి కోసం నిలబడ్డామని మా మీద నక్సలైట్లని ముద్రేత్తే మరేటి సేస్తాం….మావు అదే అవుతాం.”అని తేల్చి చెప్పేశారు.

 పోలీసు కాల్పుల ఘటన రోజు భూమి పూజని ఆపడానికి గొల్ల గండి గ్రామం లోని స్త్రీలంతా వెళ్తున్నపుడు 85 ఏళ్ల రాజమ్మ కూడా వంగిన నడుముని నిటారు చేసి ధైర్యంగా ముందుండి వారిని నడిపించింది.రాజమ్మని కలిసినపుడు ఆమె తన చేతి కర్రని తిప్పుతూ, ఉద్రేకంగా అక్కడ జరిగినవి వివరిస్తుంటే…..ఉత్తరాంధ్ర పోరాట స్త్రీలకి ప్రతినిధిలా, ఏడుగురు రాజులతో పోరాడి గెలిచిన మర్ల పోలమ్మ యుద్ధ జయకేతనంలా కనిపించింది.

 ఈ రోజు…. సోంపేట ఘటన తర్వాత అభివృద్ధి విధ్వంసం లో చిక్కుకున్న మిగతా ప్రపంచం సోంపేట వైపు ఆశగా చూస్తోంది…ఇంతటి స్పూర్తిదాయమైన పోరాటం చేస్తున్న ఉత్తరాంధ్ర మహిళలకూ,యావత్ మహిళా లోకానికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి వందేళ్ళు నిండుతున్న సందర్భంగా శుభాకాంక్షలు.

 (అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ‘వీక్షణం’ మాసపత్రిక లో ప్రచురింపబడింది)

అనుమతుల్లో అవకతవకలు

వడ్డి తాండ్ర,ఆకాశలఖవరం,సీరపువానిపేట,హనుమంతునాయుడు పేట ప్రజలు…. ఈస్ట్ కోస్ట్ ఎనర్జీస్ కంపెనీకి అనుమతులు
మంజూరు చేయడంలో ఈ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
 
 
* ఫాక్టరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రం గురించి….ప్లాంట్ పని చేయడం మొదలు పెడితే తేలినీలాపురానికి వచ్చే ముప్పు గురించీ, సర్వే లో ఏ మాత్రం ప్రస్తావించకుండా అక్కడికి 70  కిలోమీటర్ల దూరం లో ఉన్న తేలి కుంచి గ్రామం గురించి సర్వే లో రాసి….. దూరంలో ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఆపదా లేదని తేల్చారు.
 
 
*వడ్డితాండ్రలో రిజిస్టర్డ్ కంపెనీగా ఉన్న శ్రీ జగన్నాధ ఫిషర్ మెన్ కోపరేటివ్ సొసైటీకి 1948 సంవత్సరం నుంచీ చేపల వేటకి లీజ్ పర్మిషన్ ఉంది ..దాన్ని హటాత్తుగా అయిదేళ్ళ కిందట ఆపేయడమే కాకుండా మాన్యువల్ రికార్డ్  చేస్తున్నపుడు  ప్లాంట్ మూలంగా నష్టపోయే సొసైటీలు మీ లేవని తేల్చారు.
 
 
*రెండేళ్లనుంచీ తంపర భూముల్లో చేపపిల్లలు బతకడం లేదు.పేద ప్రజలకి ఆదాయవనరు అయిన బొరిసెగడ్డి ఎండిపోతోంది…ప్లాంట్ వాళ్ళు తంపరభూముల్లో మందు కలిపి అక్కడ ప్రజలకి ఉపయోగపడే వనరులు లేవని సర్వే బృందాలను నమ్మించడానికి ప్రయత్నించారన్నది ప్రజల ఆరోపణ.
 
 
*పర్యావరణ శాఖ నుంచి అధికారులు సర్వే కి వచ్చే ముందు  తంపర పరిసర ప్రాంతాలలో 50  మందికి బాణా కర్రలు డప్పులు ఇచ్చి పక్షుల్ని బెదరగొట్టారు
 
*అనుమతి లేకుండా ఫాక్టరీ స్థలం చుట్టూ భారీ బట్టీలు  తీయడం ద్వారా వరద నీరు గ్రామాలని ముంచెత్తుతోంది….బట్టీల లోతు తెలీక…అందులో దిగిన  అర్జాల ధర్మారావు,ఒకే కుటుంబానికి చెందిన మరి ఇద్దరు పిల్లలు చనిపోయారు
 
*ఇక్కడ గ్రామాలు,వాగులూ వంకలూ లేవని,ఇవి తంపర భూములు కావనీ ప్రభుత్వానికి నివేదికలు వెళ్ళాయి.
 

seerapu errayya bharya dhanalakshmi,pillalu santhoshi,paavani.

seerapuvaani petalo
seerapu errayya sodarudu

కాకరాపల్లి బాధితులకు సంఘీభావం తెలుపండి

కాల్పుల్లో మరణించిన జీరు నాగేశ్వరరావు భార్య లక్ష్మి

east coast company getu mundu

attada appala naidu,varma taditara rachayitalu

badhitulato rachayitalu

వడ్డి తాండ్రలో కాలి పోయిన ఇళ్ళు,దుస్తులు,డబ్బు.

మూడేళ్ళ క్రితం సిక్కిం వెళ్ళినపుడు భూమికి 14 వేల అడుగుల ఎత్తులో,మంచులో కప్పబడిన పర్వత శ్రేణులతో ఉండే ‘నాతుల్లాపాస్’ అనే ప్రదేశానికి వెళ్లాం.భారత చైనా సరిహద్దు ప్రాంతం అది..ప్రతి కిలోమీటర్ కీ భారత సైన్యం పహారా కాస్తూ కనపడింది.ఉద్రిక్తంగా ఉండే సరిహద్దు ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉంటాయో అక్కడ చూసాను. 
 
మార్చ్ రెండో తారీకు కాకరాపల్లి ఉద్యమకారులకి సంఘీభావంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరుపున నేను ఉత్తరాంధ్ర రచయితలతో కలిసి వడ్డితాండ్ర మొదలైన గ్రామాలు తిరిగినపుడు పైన చెప్పిన మాదిరి వాతావరణమే కనిపించింది.కోట బొమ్మాళి నుంచే పోలీసుల హడావిడి ఎక్కువగా కన్పించింది.ఆ చుట్టు పక్కల గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా మేం వెళ్ళిన రోజు నుంచీ కొంత సడలించారని  తెలిసింది.సుమారు 1000 మందికి పైగా పోలీసులు ఆ చుట్టుపక్కల గ్రామాలని తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు.
 
వడ్డి తాండ్రలో వాహనం దిగీ దిగగానే …సముద్రంలో మునిగిపోతున్న వాళ్లకి గడ్డిపోచ దొరికినా చాలన్నట్టుగా ఆ గ్రామస్తులు ఆత్రుతగా మా చుట్టూ చేరారు… పోలీసులు బాంబులు వేయడం ద్వారా కాలిపోయిన ఇళ్ళు,సామాను చూపించారు.
 
”మొగోడొచ్చి ఆడదాయిని కొట్టీసినట్టు ఆ పోలీసులొచ్చి మా ఇళ్ళని బాంబులతో కొట్టీసినారు”అంటూ ఉత్తమ్ అనే మత్స్యకారుడు వాపోయాడు.
 
నిజనిర్ధారణలో  భాగంగా మేం వడ్డితాండ్ర,ఆకాశలఖవరం,సీరపువాని పేట,హనుమంతునాయుడుపేట,ఈస్ట్ కోస్ట్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్న ప్రాంతం తిరిగాం …అనేక మంది మత్స్యకారుల్నీ,రైతుకూలీలని కలిసి విషయాలను సేకరించి  వాస్తవాలను  మా అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసాం.
 
అన్ని గ్రామాల్లో ప్రజలు థర్మల్ ప్లాంట్ నిర్మాణం పట్ల పూర్తి వ్యతిరేకత తోనూ, ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహంతోనూ ఉన్నారు.అక్కడి ప్రజల నుంచి మేం తెలుసుకున్న విషయాలను, వారు బయట ప్రపంచానికి చేసిన విజ్ఞప్తులనూ,వీలు వెంబడి పోస్ట్ చేస్తాను..
 
అట్టాడ అప్పల నాయుడు,వివిన మూర్తి,వర్మ,వేలూరి రామారావు,రామలక్ష్మి,చలం,దాసరి రామచంద్రరావు,బులుసు సరోజినీదేవి మా బృందంలో  ఉన్నారు.
 
మేం రచయితలమని తెలిసి  హనుమంతు నాయుడి పేటలో మహిళలు ” మాకిష్టం లేని ప్రాజెక్ట్ ని మా మీద రుద్దుతున్న ఈ ప్రభుత్వాన్ని,అక్రమంగా అనుమతులిచ్చిన వాళ్ళని,ఈ కలెక్టర్ ని,కంపెనీలో వాటాలున్న రాజకీయనాయకుల్నీ,ఇదుగో ఈ రోజు నీళ్ళు పట్టుకోడానికి వెళ్ళినపుడు మమ్మల్ని చూసి తొడ గొట్టిన పోలీసుల్నీ బాగా తిడుతూ రాయండి..మీకు ఏవన్నా భయంగా ఉంటే మా పేర్లు పెట్టి మరీ రాయండి….మీరు వచ్చి వెళ్ళినందుకు మాకు మేలు జరిగేది ఏవన్నా ఉందంటే అదే…మా అందరికీ చెప్పండి…”అని గట్టిగా చెప్పారు….     

ఇదొక ఇంటి పేరూ,ఊరు పేరూ కాదు..

సోంపేట ప్రజలు ఇంతగా పట్టుపడుతున్న ఈ బీల భూముల స్వరూప స్వభావాలు సాధారణ భూములకి భిన్నంగా వుంటాయి.తర తంపర భూములుగా కూడా వీటిని వ్యవహరిస్తారు.200 సంవత్సరాల కిందట చౌడు భూములుగా రెవిన్యూ రికార్డ్స్ లో నమోదయిన ఈ భూములపై రీ సర్వే జరగలేదు.పరిణామంలో చౌడు భూమి బీలగా మారిన విషయాన్ని ప్రజలు గుర్తించారు కానీ ప్రభుత్వానికి ఇంకా ఇవి చౌడు భూములుగా కనపడుతుండడం విశేషం.

మహేంద్రతనయ నది నుంచివచ్చే నీరు పల్లపు నేలలోకి ప్రవహించి నిలవ ఉండిపోతుంది సముద్రం పక్కనే వుండే బీల మంచి నీరు ఉప్పు నీరు కలయిక తో వుంటుంది. చేప గుడ్లు ఫలదీకరణం చెందడానికి బీల అనువుగా వుంటుంది రొయ్య చేప,బొంత చేప,బొంత నీటి చేప ఇక్కడ దొరుకుతాయి.

సముద్రపు ఆటుపోట్లని బీల అదుపు చేస్తుంది.బీల మూలంగా భూగర్భజలాలు సమృద్ధిగా వుంటాయి.పవర్ ప్లాంట్ వదిలే వ్యర్ధాలు బీలలోకి ఇంకినపుడు చుట్టు పక్కల బావుల్లో నీరు కలుషితమైపోతుంది. ఆస్ట్రేలియా .సైబీరియా నుంచి వలస వచ్చే 120 రకాల పక్షులు ప్లాంట్ ఏర్పడితే కనుమరుగవుతాయి.బీల గడ్డితో చాపలు గొడుగులు అల్లుతారు. సంవత్సరానికి రెండు పంటలు కూడా వేస్తారు.

మహేంద్రతనయ లో వర్షాలు వచ్చినపుడు బీల నిండి పోయి చేపలు చేతులకే అందుతాయి.బీలలో వున్న పాముల మెట్టలో 15 రకాల పాములు, అడవి పందులు,ఈత పందులు, తోడేళ్ళు,కూడా వుంటాయి.కలవ దుంపలు,దుద్డుందుంపలు దొరుకుతాయి.డెబ్భై శాతం కూలీలకి బీలే ఆధారం.భర్త చనిపోయినా బీలని నమ్ముకుని బతుకుతున్నానని,ఆ బీలే కలుషితమైపోతే ఎట్లా బతకాలని ఓ స్త్రీ ఆవేదన చెందింది.

అవును బీలంటే మనకి ఒక చిత్తడి నేల… మరి వారికి?

బీల…

ఇదొక ఇంటి పేరూ కాదు..

ఊరు పేరూ కాదు

ఒక ప్రాంత జీవన అస్తిత్వానికి సంకేతం.

బీల…

ఇదొక మాటా కాదు

పాటా కాదు..

‘నీరు నేల’ మాది అని నినదించిన

జీవజాల సామూహిక నినాదం

బీల..

ఇది నీటిలో ఈదే చేపా కాదు

గాలిలో ఎగిరే పక్షీ కాదు

ఏడుగురు రాజులతో పోరాడి గెలిచిన

మర్ల పోలమ్మ యుద్ధ జయకేతనం

(నారాయణ వేణు రాసిన కవిత ఇది)

సోంపేట పవర్ హంట్

జూలై 14 వ తారీఖున ఎన్.సి.సి, పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ మొదలు పెడుతోందని తెలిసిన సోంపేట ప్రజలు దానిని నిరసనల ద్వారా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు.అక్కడి పోలీసు యంత్రాంగం కూడా పరిస్తితి తీవ్రతని గుర్తించి మూడు రోజుల ముందు ఒక కరపత్రం ద్వారా శాంతి యుతంగా నిరసనలు తెలపవచ్చు గానీ హింసాయుత మార్గాలను అవలంబించవద్దని గ్రామగ్రామం తిరిగి ప్రచారం చేసింది.మూడు వేల మంది పోలీసులు ఒక యుద్ధరంగం మాదిరి ఎందుకు మోహరించాల్సి వచ్చింది? ఎన్.సి.సి పనుల కోసమని చెప్పి తెచ్చిన కిరాయి గూండాల మెడలకి బ్లూ స్కార్ఫ్ లు ఎందుకు కట్టాల్సి వచ్చింది?బీల మీది మమకారంతో,తమ జీవనోపాధిని  నిలబెట్టుకోవాలన్న తపనతో,పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న ఆరాటంతో వచ్చిన ప్రజల మీద లాఠీలు ఎలా విరిగాయి!!తుపాకి గుళ్ళు ఎలా దూసుకు పోయాయి!!

వెతికితే సమాధానాలు దొరుకుతాయి….
కొన్ని సమాధానాలు ఇంత అమానుషంగా …
ఇంత హృదయ విదారకంగా కూడా వుంటాయి.

ఇంకేం రుజువులు కావాలి?

సోంపేట పరిసర గ్రామాల ప్రజలు పవర్ ప్లాంట్ ని గుడ్డిగా తిరస్కరించలేదని,పవర్ ప్లాంట్ మూలంగా వచ్చే నష్టాల్ని స్వయంగా పరిశీలించాకే గట్టి నిర్ణయానికి వచ్చారని అక్కడి ప్రజలు,ఉద్యమ నాయకులు చెప్పారు.చేపల చెరువుల కోసం అని చెప్పి ముందుగా వ్యవసాయ భూముల్ని ప్రజల వద్ద కొనుగోలు చేసిన దళారులు వాటిని ఎక్కువ ధరలకి ఎన్.సి.సి (నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెని)కి అమ్మారు.ఆ తర్వాత ఆ భూముల్నీ,బీల ప్రాంతాన్నీ ఏక మొత్తంగా అత్యంత చవకగా కొన్న ఎన్.సి.సి, అక్కడ పవర్ ప్లాంట్ కట్టబోతోందని తెలిసి  మోసపోయామని ప్రజలు  అర్ధం చేసుకున్నారు.

అప్పటికీ ప్రభుత్వాన్ని ఎదిరించే చైతన్యం ప్రజల్లో కలగ లేదు.పవర్ ప్లాంట్ మూలంగా ఎన్ని నష్టాలు వస్తాయో వారికి అవగాహన లేదు.మానవ హక్కుల వేదిక,మత్స్యకారులసంఘం,పర్యావరణ పరిరక్షణ సమితి మొదలైన సంఘాలు ప్రజల్లో ఆ చైతన్యాన్ని కలిగించడం లో సఫలమయ్యాయి.

అందులో భాగంగానే విశాఖపట్నం దగ్గరలోని పరవాడ ఎన్.టి.పి.సి. థర్మల్ కర్మాగారం పరిసర ప్రాంతాలకు  సోంపేట ప్రజలు కొందరు పరిశీలన కోసం వెళ్ళారు.అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల్ని స్వయంగా చూసి, ప్రాణాంత వ్యాధుల బారిన పడిన అనేక మందితో మాట్లాడాక  పవర్ ప్లాంట్ వద్దే వద్దన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు.

సోంపేట పోలీసు కాల్పుల్లో చనిపోయిన గొనప కృష్ణమూర్తి గురించి వివరాలు తెలుసుకోడానికి అతని  కుటుంబీకులతో మాట్లాడినపుడు కృష్ణమూర్తి సోదరుడు ”పీల్చుకోడానికి ఇంత చల్లని గాలి,తాగడానికి తియ్యటి నీళ్ళు, కాలి కింద కాస్త బూవి చాలు మాకు..ఇవి పోగొట్టి వచ్చే ఏ అభివృద్ధి మాకు అక్కర్లేదు”అన్నారు.

పవర్ ప్లాంట్ల నిర్మాణం ప్రజా ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో  పరవాడ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కుంటున్న వ్యాధులు నిరూపిస్తాయి.ఫోరం ఫర్ బెటర్ విశాఖ (జె.వి రత్నం)నుంచి సేకరించినవి ఈ ఫోటోలు. వారికి కృతజ్ఞతలు.

లక్షలూ కోట్లూ నాతో మాట్లాడవు కదా…

మా సోంపేట పర్యటనలో భావోద్వేగంతో నిండిన ప్రజల మాటలు, వారి హావభావాలు జానపద ప్రదర్శక కళల్ని గుర్తు చేసాయి… ఆ పర్యటనల్ని సమీక్షిస్తున్నపుడు వారి ఆవేశం,ఆక్రోశం ,ఉద్వేగాలు,ఉద్రేకాలు,వ్యంగ్యం,నిష్కల్మషత్వం,పట్టుదల అసంకల్పితంగా కళాత్మకతని సంతరించుకోవడం కన్పించింది.

సామాన్య ప్రజానీకం మాట్లాడిన పదునైన మాటలు,తమ ఉద్యమాన్ని బలపర్చుకోడానికి గోడల మీద వారు రాసుకున్న నినాదాలు నా అనుభవం లోకి వచ్చినవి మీకు పరిచయం చేస్తాను. కాల్పుల్లో గున్నా జోగారావు ను చంపేసిన ప్రభుత్వం ఆయన భార్యకు ఐదు లక్షల పరిహారం ఇస్తానంటోంది.  ”లచ్చలు,కోట్లు నాతో మాట్లాడవు కదా …నా పక్కన కూకుని నాకు మంచీ సెడు సెప్పవు  కదా” అని జగదాంబ దీనంగా  కుమిలిపోతున్నది.
బీల భూముల్లో నీరు బురద చాలా ఎక్కువ గా ఉండి ఎంత లోతుఉండేది తెలీదు దీని మీద ఒక రైతు సామెతొకటి చెప్పారు.
“కళింగ స్వాముల్నీ,నాగు పాముల్నీ,బీల భూముల్నీ” నమ్మకూడదని.
గొల్ల గండి వూళ్ళో  కోదండరాం అనే రైతు ”బీల తల్లి లాంటిది -బిడ్డలం మాం ఊరుకోం ”తర్జని చూపించి మరీ గట్టిగా చెప్పారు.
పోలీసులు,పవర్ ప్లాంట్ గూండాల దౌర్జన్యాల్ని ఎదిరిస్తామని చెపుతూ ”ఆళు  మూడు వేల మందొస్తే మాం ముప్ఫై వేల మందొస్తాం….ఆళు పొగ బాంబులేస్తే మాం బురద మట్టితో కప్పెడతాం…ఆళు అగ్గి బాంబులేస్తే  మాం పెట్రోల్ జల్లడానికైన సిద్ధం”అని రామాయ పట్నం మత్స్యకార మహిళ బట్టి మోయినమ్మ(మోహిని) శివ తాండవం ఆడేసింది. పలాసపురం గ్రామస్తులైతే ”భుక్తి కోసం భూమి కోసం నిలబడితే మా మీద నక్సలైట్లని ముద్రేస్తే… మరేటి సేస్తాం….మావు  అదే అవుతాం”అని నిర్ద్వందంగా తేల్చి చెప్పేశారు.
ప్రజలు ఇంటింటా ఊరూరా రాసుకున్న నినాదాలు ఇలా వున్నాయి
బీల మాకు ముద్దు -పవర్ ప్లాంట్ వద్దు
ప్రాణాలైనా అర్పిస్తాం-పవర్ ప్లాంట్ ఆపుతాం
రుషి కుద్ద బీల-ప్రజలు నమ్ముకున్న నేల
బీల మనది-నేల మనది
పవర్ ప్లాంట్ ఇచ్చేవి ఉద్యోగాలు కావు-ప్రాణాలు తీసే వ్యాధులు
పవర్ ప్లాంట్ ఆపుదాం-భావి తరాలను కాపాడుదాం