పి. సత్యవతి గారికి నచ్చిన పుస్తకం

Image may contain: 2 people, including Jaji Malli Jaji, people sitting and indoor

 

భిన్న దృష్టికోణాలను ఆసక్తిగా చూడగల నిబ్బరం సత్యమ్మ నైజం. నీల నవలని మీరు అర్థం చేసుకున్న తీరు, నాకు రిలీఫ్ ని ఇచ్చింది. ఇంత ఓపికగా సమీక్ష చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. Sathyavathi Pochiraju garu.

*******************

నచ్చిన పుస్తకం

సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో తెలిసిన మనిషి

నీల

బహుమతి పొంది, చర్చలోకి వచ్చిన ఒక పుస్తకం పైన అందరికీ ఆసక్తి వుంటుంది. అలాగే నాకు కూడా. అందుకే చదువుతాను.. అది నన్ను పట్టుకుంటే ఎవరికైనా చెప్పాలని ఆత్రపడతాను. ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా మళ్ళీ చదువుతాను.. నీల గురించి ఎక్కువమందితో పంచుకోవాలని. ఈ 540 పేజీల నవల ఎక్కడా విసుగు పుట్టకుండా చదివించింది నాచేత. పుస్తకం అంతా మనుషులు తమను తాము నిలబెట్టుకునే క్రమంలోని వైవిధ్యం.. ముఖ్యంగా స్త్రీలు. వాళ్ళు పితృస్వామ్యం సృష్టించిన మూసలు కారు. ఎవరి పరిధిలో ఎవరి చైతన్యంతో వారు నిలబడడానికి పోరాటం చేస్తున్న స్త్రీలు ఆంధ్రప్రదేశంలోని పాతిక సంవత్సరాల ఉద్విగ్న భరితమైన రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక పరిణామాల నేపధ్యం. ఊపందుకుంటున్నఅస్తిత్వఉద్యమాలు, ప్రేమికుల సహచరుల మధ్య స్వేచ్చతో కూడిన గౌరవం కోసం చేసిన ప్రయత్నాలు. విస్తృతమైన కాన్వాస్ మీద చిత్రించిన సాంఘిక జీవన చిత్రం ఇది. ఈ నవల వ్రాయడం వెనక రచయిత కృషి, శ్రద్ధ, తపన, అధ్యయనం, అవగాహన తెలిసిపోయింది.

కథలకు కవిత్వానికి వచ్చిన పాఠకాదరణ, గుర్తింపు నవలలకు రాకపోవడానికి, వస్తూన్న నవలల సంఖ్య తక్కువ కావడమో లేక అవి సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునే పాఠకులు ఆశించే ప్రమాణాలను అందుకోక పోవడమో ఏ కారణమో కాని అప్పుడప్పుడూ వచ్చే గుర్తించవలసిన నవలల ప్రస్తావన కూడా నలుగురు కలిసిన వేళల నోటిమాటల ద్వారా కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడం లేదేమో అన్పిస్తుంది. బహుళ ప్రచారంలో వున్న పత్రికల్లో పుస్తక సమీక్షలకు కొలతలుంటాయి. అంగుళాల లెక్కన. ముఖ పుస్తక పరిచయాలకు కూడా పైకి కనపడని సమీకరణాలుంటాయి.

జీవితం మొదటి కొసకే నిప్పు అంటుకున్న పిల్ల నీల. కుంచెలలో, కలాల్లో పంచవన్నెలూ, చల్లగాలులూ సుందర సోయగాలూ పోయే పల్లెటూరుకాదు ఆమె వుండేది. చీకట్లో గోతులతో దోమలు ముసిరే మురుగు కాలవల ఆలవాలం ఆమె వుండే చిన్నఇల్లు. ఏలూరును ఆనుకుని వుండే చోళదిబ్బ. తాగి వేధించే తండ్రి, కుట్టుపనితో కుటుంబానికి ఆసరా అయిన తల్లి, ఎక్కడా జీవితంలో ప్రేమకూ ఆదరణకూ కనీసపు ఆనందానికీ నోచుకోని ఆ తల్లి, ఒక చిన్న ప్రేమ నెలవు వెతుక్కున్న నేరానికి భర్త చేత హత్య చెయ్యబడి ఆ మచ్చను నీలమీద వొదిలి పోయింది. అప్పటి నించీ నీల జీవన పోరాటం మొదలైంది. తన జీవితమే ఒక పోరాటంగా బ్రతికిన నీల ప్రజా పోరాటాలను జీవితంలో బాగం చేసుకునే దాకా ఎదిగింది. పాతిక సంవత్సరాల ఉమ్మడి అంధ్రప్రదేశ చరిత్రతో పాటు నీల జీవిత గమనాన్ని ఆమె ఆలోచనల్లో ఆచరణలో వచ్చిన పరిణామాలనూ పెనవేసుకుంటూ సాగింది నవల.

ఇది నాయిక కేంద్రక నవల కాదు. ఒక జీవితం చుట్టూ కూడా అల్లిన నవల కూడా కాదు. ఇందులో చాలామంది స్త్రీ పురుషుల జీవితం వుంది. వాళ్ళు దానిని మలుచుకున్న తీర్లల్లో భిన్నత్వం వుంది.ఎవరి జీవితమూ వ్యక్తిత్వమూ నలుపు తెలుపు కాదు. వాళ్ళంతా జీవమున్నమనుషులు. జీవితాన్ని వారికి అనువైన తీరులో నిర్మించుకున్న వారు. అయితే రచయితకు గానీ పాఠకులకు గానీ కొన్నిపాత్రలు సన్నిహితంగా వస్తాయి. ఇంకొన్నిటిని చూసి జాలిపడతాం, వాటిలోని మానవ స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. అట్లా అర్థం చేయించడంలో రచయిత్రి సమతుల్యాన్ని సాధించింది. అందుకే పుస్తకం చివరిపేజీల్లో ఒకచోట “మనుషుల్ని ఎంత చివరికి వెళ్లి ప్రేమించవచ్చో తెలుసుకున్నాక…. తను గెలిచిన మజిలీలో నిలబడి గతాన్ని దయగా చూడ గలుగుతోంది.” అంటుంది నీల గురించి.

తల్లిని హత్య చేసి తండ్రి జైలుకి పోతే బంధువులెవరూ దగ్గరకు తియ్యని నీలని పాస్టర్ దంపతులు అక్కున చేర్చుకుని ఇంటర్ మొదటి సంవత్సరం దాకా చదువుకోనిచ్చారు. అందుకు కృతజ్ఞతగా ఆమె వాళ్లకి ఎంతో పని చేసి పెట్టేది. పొందికగావుండేది. పాస్టర్ దంపతులు ఆమెను అనాధగా చూడలేదు స్వంత బిడ్డలా చూసుకున్నారు. అందుకే వాళ్లకు స్థాన చలనం వచ్చినప్పుడు ఆమె భద్రత కోసం నీలని కావాలని కోరుకుని అడిగినవాడికి ఇచ్చి పదిహేడేళ్లకే పెళ్లిచేసి బాధ్యత నిర్వహించారు. అట్లా 1991 లో రాజమండ్రికి కాపురానికి వచ్చింది నీల. తన కన్న పన్నెండేళ్ళు పెద్దవాడైన అతను నిజంగా తనని మనసుతో కోరుకున్నాడని, అనాధ అయిన తనకు ఒక ఇల్లు అమరిందని ఇంక తన బ్రతుకు అతనితోనే ముడి వేసుకు పోయిందనీ తల్లిలా కాక తను ఒక్కరితోనే జీవితంలో ఇమిడిపోవాలనీ నిశ్చయించుకున్న నీల జీవితం అట్లా కొనసాగలేదు.

ఆమె భర్త ఆమెను వెతుక్కుంటూ వొంటరిగా రాలేదు. బోలెడు గతాన్ని దాచిబెట్టుకు వచ్చాడు. పైగా ఆమె తల్లి మచ్చను అతను మర్చిపోలేదు. ఆమె సంసారం నిప్పుల కొలిమి అయింది. పద్దెనిమిదేళ్ళకే తల్లి అయిన నీలకి ఆమె భర్త ప్రసాద్ గతం వర్తమానం అన్నీ ఒక్కొక్కటే అర్థం అయి బ్రతుకుని ఉక్కిరి బిక్కిరి చేసాయి. అయినా అందులోనే ఇమడడానికి అతన్ని సంతోష పెట్టడానికి చేతనైనన్ని విధాలుగా ప్రయత్నించింది. సునామీలను ఎదుర్కుంది. మానసిక శారీరక హింస అనుభవించింది.

అయితే ఈ యుద్ధ కాలంలోనే ఆమె డిగ్రీ ప్రయివేటుగా చదువవుకోగలిగింది. సారా ఉద్యమంలో పాటలు పాడింది. లాయర్ వసుంధరతో పరిచయం అయింది. బయటి ప్రపంచాన్ని కొంత చూసింది. ఎం.ఎ లో కూడా చేరింది. భర్త అనుమానాలనీ అతను చేసే అవమానాలనూ పీకల మీదకు వచ్చే దాకా ఓర్చుకుని, తట్టుకుని చివరికి, ఇద్దరు స్త్రీలమధ్య నలిగిపోతున్న భర్తకు స్వేచ్చ ఇచ్చి తానూ ఆ బంధంలో నుంచీ తప్పుకున్నది. రాజమండ్రిలో ప్రసాద్ తో చేసిన ఆరేళ్ళ కాపురం, చిన్నప్పుడు అంటుకున్న నిప్పుతోనే పరుగు. ఎమ్మే చదివినా నీలకు సరైన ఉద్యోగం రాలేదు. పాస్టర్ మామయ్య చనిపోగా పాస్టరమ్మ ఎక్కడో కర్ణాటకలో కష్టాలు పడుతోంది. మళ్ళీ తను పుట్టి పెరిగిన చోళ దిబ్బకే 1997లో తిరిగి వచ్చింది నీల. తల్లి మరణానికి ముందు జ్యూట్ మిల్ కార్మికుల ఆందోళనలో నాయక పాత్ర వహించిన ఆరంజోతికి, తమ్ముడు స్టాలిన్ సూర్యం అదృశ్యం, నీల తల్లి చంద్రకళ హత్యతో మతి చెడిపోయింది. ఆరంజోతి తమ్ముడు స్టాలిన్ సూర్యం అంటే నీలకు గౌరవం. అతన్ని పోలీసులు ఏం చేసారో అని ఆరంజోతి అల్లాడి పోయింది. మతి చెడిపోయింది. పోరాటాలకి ఎప్పుడూ ముందు వుండే ఆమె రెక్కలు కత్తిరింప బడ్డాయి.

ఆమె కూతురు సంపూర్ణ నీలని ఆదరించి ఇల్లు ఇచ్చి బ్రతుకు తెరువుకు ట్యూషన్లు కుదిర్చింది. సంపూర్ణ ఇప్పుడు, గొడవలు జరిగితే కోళ్ళగంప చాటున దాక్కునే పిరికి పిల్ల కాదు. డ్వాక్రా సంఘాలకి పొదుపుసంఘాలకి నాయకురాలు. బుద్దిమాంధ్యపు భర్తనూ మానసికంగా ఎదగని కొడుకునూ మతిచెడిన తల్లినీ చూసుకుంటూనే ఊరి రాజకీయాల్లోకి వచ్చింది. అధికార పక్షం ఎంఎల్ ఎ ప్రాపకం సంపాదించింది. స్త్రీలను కూడగట్టింది.

సంపూర్ణ అంటే వ్యక్తిగా నీలకి ఇష్టం. కానీ ఆమె రాజకీయాలు ఒక్కొక్కసారి నీలకి నచ్చేవి కావు. భర్త రెడ్డయ్యతో ఆమె ప్రవర్తన, ఆరంజోతిని ఆమె చూసుకునే తీరులో మానవీయత కనిపిస్తుంది. అక్కడ కుల రాజకీయాలు మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, స్త్రీలకు అప్పులిచ్చి వాటిని వసూలు చేసుకునేందుకు అనుసరించే దారుణమైన మార్గాలు, అన్నీ కళ్ళకు కట్టిస్తుంది రచయిత్రి. అయితే ఈ పొదుపు అప్పుల వల్ల స్త్రీలు కూడా ఆర్ధికరంగంలో ప్రవేశించడం, తనఖా ఏమీ లేకుండా వాళ్లకి అప్పు దొరకడం ఆ అప్పు తీర్చుకోడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోడం అంతా అక్కడొచ్చిన మార్పుగా గ్రహించింది నీల. ఒక పొదుపు సంస్థకు వాయిదా చెల్లించలేక బియ్యం బస్తాలో దూరి దాక్కుని ప్రాణాలు పోగొట్టుకున్న నిండు గర్భిణి చావు, దానిని రాజకీయం చేసిన సంఘటన అప్పట్లో పత్రికల్లో వచ్చే వార్తలే.

అప్పుడే పొదుపు సంఘాల మీద పరిశోధనకు వచ్చిన పరదేశి ఆమెకు స్నేహితుడయినాడు. అతనితో కలిసి బెస్త గ్రామాలను బెస్త వారినీ సముద్రాన్నీ దగ్గరగా చూసింది. సముద్రం ఎందుకు వెనక్కి పోతుందో అర్థమవుతోంది. ప్రసాద్ తో ఆమె జీవితం ఒక అనుకోని సంఘటన. కానీ పరదేశీని ఇష్టపడింది. అతనితో సాహచర్యాన్ని కోరుకున్న నీలకి అతనికీ ఒక గతం వుందని తెలిసింది. అతనే చెప్పాడు తను ఒక స్నేహితురాలితో రిలేషన్ షిప్ లో వున్నానని ఆమెతో బ్రేక్ అవుతానని. ప్రసాద్ తో అనుభవాల తరువాత పరదేశికి దగ్గర కావద్దనుకుంది నీల. కానీ చోళదిబ్బలో రాజకీయాలు పెద్దవాళ్ళ ప్రయోజనాలకు సంపూర్ణను బలిపశువు చెయ్యడం, తను ఎదగడానికి దాన్ని కూడా సహించిన సంపూర్ణ ప్రవర్తన నచ్చడం లేదు నీలకి. ఏదోపని మీద అక్కడకు వచ్చిన లాయర్ వసుంధర సాయంతో ఆమె 2000 సంవత్సరంలో హైదరాబాద్ మహా నగరం వచ్చి అక్కడ అజిత ఎన్జీవోలో నెలకి ఎనిమిది వేల జీతానికి ఒక ఉద్యోగంలో చేరి పాపతో కలిసి ఒక్కతే వుంటూ ఊపిరి పీల్చుకుంది.

అక్కడ నించీ ఆమెకి ప్రఖ్యాత లాయర్ సదాశివతో పరిచయం, అతని తల్లితండ్రులు నీతాబాయి ప్రకాష్ ల కథ, సింగిల్ వుమన్ గా అజిత జీవితంతో ధైర్యంగా తలపడుతున్న తీరు, నీల తరువాతి తరంలోకి వచ్చిన నీల కూతురు మినో అభిప్రాయాలు, తరాల మధ్య సంఘర్షణ, సదాతో నీల సహజీవనం, నీల అభిప్రాయాలలో ప్రపంచాన్ని చూసే తీరులో చైతన్యంతో కూడిన తాత్వకమైన మార్పులు, మానసిక సంఘర్షణలు, మళ్ళీ పరదేశితో కలిసి బెస్త గ్రామాల సందర్శన అక్కడ గంగవరం మొదలైన చోట్ల జరుగుతున్న అభివృద్ది తాలూకు విధ్వంసం, విస్తాపన అన్నీ నీల జీవితంపైన ప్రసరిస్తున్న ప్రభావాలు, మొత్తం పదకొండు సంవత్సరాల చరిత్ర. నవల అక్కడే ప్రారంభం అయి ఒకచుట్టూ తిరిగి అక్కడే ముగుస్తుంది. నవలలో కొన్ని వాక్యాలు మనసుకు పట్టుకుంటాయి. పాస్టరమ్మ ప్రేమని గురించి చెప్పినవి. రెక్కలు ఊడిన పక్షి గమ్మున వుండి తిరిగి రెక్కలు పొందడం, ప్రేమ గురించి సహజీవనం గురించి వ్యాఖ్యలు .

“ముందు మనకి మనం వుండాలి ఆ ధైర్యం నుంచీ స్థిమితం నుంచీ మనుషులను కోరుకోవాలి”

సముద్రంతో పైడమ్మ “ఒలె! అప్పా! నచ్చత్రాలు భూమండలము పుట్టినప్పుడు పుట్నావు. ఇన్ని తాపులు కాసినావు. రాచ్చసులంటి పడవల్ని బుజానేసుకుని మోసినావు. సెత్త సేదారాలన్నీ లోపట దాసుకున్నావు. నీ లోపట సంపదలు సత్తువలు తీసి మాకిచ్చినావు. ఇంకా ఈ జీవరాశికి ఎంత కాలం సాకిరీ సేత్తావు? బుడింగిన మునిగి మాయమౌదారని అనిపించట్లేదే నీకు?”

“ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైనవి సార్వజనీనమైన విలువలేవీ వుండవని తన జీవితం నుండే కనపడుతోంది నీలకి. స్త్రీగా వుండడం కన్నా మనిషిగా రూపొందడం కోసమే బ్రతకాలన్న భావం లీలగా తోస్తున్నది”

“నీ రక్షణలో నీ ప్రేమలో నన్నునేను కోల్పోతున్నాననిపించింది. మళ్ళీ నన్నునేను కూడగట్టుకోవాలని పించింది. నాకు కావలసింది నా ప్రయాణం ఆగక పోవడం.”

“నాకు నీ మీద కృతజ్ఞత వుంది సదా ! కానీ నేను నీ సహచరి నైనందుకు ఎప్పుడో ఒకప్పుడు నా మీద నీకు కూడా కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి”

“నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రేమలన్నీ ఏదో ఒక రూపంలో బందిఖానాలే. అట్లా కాకుండా మనుషుల కుండే అన్నిరకాల స్వేచ్చల్నీ గౌరవిస్తూ ప్రేమించుకోడం మంచి విలువ. దానర్థం లోకం అపోహ పడినట్లు అనేక లైంగిక సంబంధాలు ఏర్పరుచుకోడం కాదు…” వసుంధర చెప్పిన ఈ వాక్యం సుదీర్ఘ మైనది, ఆలోచింపజేసేది.

ప్రేమించడమే విలువైన పాస్టరమ్మ, అధికారం డబ్బూ పరపతీతో పాటు కుటుంబ సభ్యులను కూడా ప్రేమించే సంపూర్ణ, నీల మదిలో చిరకాలం నిలిచి పోయిన స్టాలిన్ సూర్యం, ఒంటరి మహిళగా జీవితపు సవాళ్ళను ఎదుర్కునే అజిత, మంచి లాయర్ అయిన వసుంధర, సరళ జీవన పోరాటం, నూతన తరం ఆవేశాలతో, ఆదర్శాలతో మినో, అందరినీ చుట్టుకుంటూ స్వేచ్చని మాత్రమే కాక సాహచర్యాన్ని కూడా కోరుకున్న నీల, అంతులేని ఒద్దికకీ అనంతమైన స్వేచ్చకీ మధ్య జీవించే కళ ఒకటున్నదని తెలుసుకున్న నీల, సముద్రం ఎందుకు వెనక్కి వెడుతుందో అర్థం చేసుకున్న నీల, పరమం అంటూ ఏమీ వుండదని తెలుసు. కానీ ఇప్పటికి ఇది మనుషులు చేరుకోవలసిన ఒక స్థితి అనిపిస్తుంది.

కథ ముగిసే సరికి. ఇవన్నే కాక పశ్చిమ గోదావరిలో కందా బందాగా నూరే పచ్చళ్ళు, ఆలగోలు బాలగోలుగా అరిచే జనం, దాపుడుకోకలు, గుంపు సింపులు. చీకటి గుయ్యారాలు – తెలుగు పలుకుబళ్ళు.

సాధారణంగా ముందుమాటలు చదివి పుస్తకం చదివితే ఆ మాటలు పాఠకులను ప్రభావితం చేస్తాయి. అందుకని నేను పుస్తకం చదివాకనే ముందుమాటలు చదువుతాను. అట్లా చదివినప్పుడు ఈ నవలకు విపులమైన విశ్లేషణతో కూడిన వాడ్రేవు చినవీరభద్రుడు గారు వ్రాసిన ముందుమాట ముందే చదవాల్సిందేమో అనిపించింది. ఏకే ప్రభాకర్ గారిది కూడా.

( మే 2018 చైతన్య మానవి లొ ప్రచురితం )

**********

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s