
*********
విలువల్లో కలకలం రేపిన ‘నీల’
డాక్టర్ కె.ఎన్. మల్లీశ్వరి పుట్టింది ఏలూరు దగ్గర పల్లెటూరు. నివాసం విశాఖపట్నం. గత పాతికేళ్లుగా విశాఖపట్నంతో వున్న అనుబంధం ఆమెలో సృజనశీలిని విస్తీర్ణం చేసిందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర నాడిని పట్టుకున్న సృజనశీలి.కథకురాలుగా ఎంత ప్రసిద్ధమో జాజిమల్లి బ్లాగ్ కథలతో బ్లాగర్‌గా అంతే సుపరిచితం. వివిధ ప్రక్రియల్లో పదిహేను పుస్తకాలు ప్రచురించారు. ‘సోషలిస్ట్ ఫెమినిస్ట్‌ని నేను – నా ఆచరణ రంగం అదే’ అని చెప్తారామె. ప్ర.ర.వే జాతీయ కార్యదర్శిగా క్రియాశీలక పాత్రని నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల పరిశ్రమ తర్వాత వచ్చిన ‘నీల’ ఆమె ఇటీవలి సృజన. ఆ నవల్లో విప్లవోద్యమ సృ్పహని అందించారు. ఒక విశాలమైన జీవితాన్నే కాదు, ఆ జీవితంతో ముడిపడిన అనేక విస్తృత జీవిత శకలాలను పరిచయం చేసిన గొప్ప నవల. తానా బహుమతి పొందిన నవల. ఈ నేపథ్యంలో మల్లీశ్వరితో ముఖాముఖి…
**********
‘నీల’ నవల రాయటానికి తొలి ప్రేరణ ఏమిటి ? ‘నీల’ నవల రాయడం వెనుక జరిగిన అంతర్మథనం ఏమిటి?
తొలి ప్రేరణ అనేది ఫలానా ఘటన ద్వారా జరిగింది అని చెప్పలేను. కథలూ విమర్శ ద్వారా నేను మాట్లాడు తున్నవి నాకు అసంపూర్ణంగా ఎపుడు అనిపించాయో కూడా చెప్పలేను. కానీ లోకం నుంచి నేను గ్రహిస్తున్నదాన్ని మళ్ళీ లోకంతోనే పంచుకోవడానికి నాకు విస్తృతమైన కాన్వాస్ కావాలనిపించింది. స్త్రీల జీవితాల్లో ఈ మూడు దశాబ్దాలుగా చాలా మార్పులు వచ్చాయి. అందులో కొన్ని మార్పులకి నే నూ లోనయ్యాను. ఈ మథనం బహుశా పదేళ్ళ కిందట మొ దలై ఉండొచ్చు. నన్నూ నా చుట్టూ ఆడవాళ్ళని మరింతగా ప్రేమించడం నాకొక అవసరంగా మారింది.
‘నీల’ నవల రాస్తూ వున్నప్పుడు మీ ముందు మీరెదుర్కొన్న ప్రశ్నలు, మీలో కలిగిన ప్రకంపనలు ఏమిటి?
వాస్తవభ్రాంతిని కలిగించే కల్పన చేయడం అంటే అస లు ముందు వాస్తవం గ్రహించగలగాలి. ఒకోసారి వాస్తవమే కల్పన కన్నా చిత్రంగా ఉంటుంది. నమ్మగలగాలి. సత్యాన్వే షణలో అప్పటివరకూ నమ్మిన విలువలు, విషయాలు దూదిి పంజెల్లా తేలిపోతాయి, తట్టుకోవాలి, పాత్రల కల్పనలో ప్రతి పాత్ర వద్దా రోజుల తరబడి నిల్చుని, ‘ఇక్కడ నువ్వు ప్రవే శించావా?’ అన్న ప్రశ్నని తరుచుగా ఎదుర్కొన్నాను. నేను, నన్ను నడిపించే సైద్ధాంతిక అంశాలు కేవలం అంతర్గత అవ గాహనగా మాత్రమే ఉండటానికి నిరంతరం హెచ్చ రించుకున్నాను.
సుమారు ఆరేళ్ల పాటు ‘నీల’ రచన సాగింది. రచన స్థితి, రచన అందించే గాఢత ఏ కోశాన చెదరలేదు. ఆరేళ్లుగా ‘నీలతో’ మీ ప్రయాణం ఎలా సాగింది? ఇంతకాలం ఒక రచనని ఎలా బాలెన్స్ చేయగలిగారు?
నా వ్యక్తిగత, సాహిత్య జీవితాల్లో ఈ నవల పూర్తి చేయడం అనే అంశానికి ప్రథమ ప్రాధ్యాన్యతని ఇచ్చాను. రక్తమాంసాలని అంటిపెట్టుకుని కాపాడే చర్మపుతీరున నవల నన్ను అతుక్కుని ఉంది, అది నా ఆకాంక్షా, దానికి ఉన్న శ క్తా, లేక రెండూనా అన్నది తెలీదు. ఇంట్లో ఉన్నా బైటకి వెళ్ళినా బస్సులో కూచున్నా, యాంత్రికమైన ఏ పని చేసు ్తన్నా లోపల ఒక మననం సాగుతూ ఉండేది. దాని వల్లనే ఇన్నేళ్ళ ప్రయాణం సాధ్యపడింది.
‘నీల’ ఇలా రూపొందటం వెనుక మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏమిటి ?
సామాజిక రంగంలో అప్పటికి ఉన్న అవగాహనకి తోడు, నవల రాయడానికి ముందు, రాసే క్రమంలోనూ చాలా చోట్లకి తిరిగాను. సెలవులు వస్తే చాలు ఏలూరు వెళ్లి చుట్టుపక్కల గ్రామాలు తిరిగేదాన్ని. మా ఊళ్ళోనే చాలా చరిత్ర ఉంది. పంచాయితీ ఆఫీసులో కూచుంటే వర్తమాన గ్రామాలు నివ్వెరపరిచే నిజాలు చెపుతాయి. అట్లాగే పొదుపు సంఘాల గురించి చిత్రగారు (వేలూరి రామారావు) చాలా విషయాలు చెప్పడమే కాకుండా రెండుమూడు గ్రామాలు తిప్పి స్వయంగా ఆడవాళ్ళ నుంచి నిజాలు రాబట్టుకునేలా చేశారు. నారాయణ వేణు చోడవరం పరిసర గ్రామాలకి తీసుకువెళ్ళారు. ఈ పర్యటనలన్నీ రెండు ప్రాంతాల పొదుపుసంఘాల తారతమ్య పరిశీలనకి, అవగా హనని మెరుగు పరుచుకోవడానికి తోడ్పడ్డాయి.
నవలలో అన్నీ సజీవపాత్రలే. సంపూర్ణ, సరళ, అజితల వ్యక్తిత్వ తారతమ్యాలను ఎలా గ్రహించాలి?
ఆ మూడు పాత్రలూ వరుసగా శ్రామిక తరగతి, మధ్య తరగతి, మెట్రో తరగతి స్త్రీల జీవితాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. వర్తమాన సమాజంలో ఈ మూడుతరగతుల మధ్య భేదాలే నవలలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చే శాను. అయితే కులవర్గ ప్రాంతాల పరంగా ఉండే వైరుధ్యా లను గుర్తిస్తూనే జెండర్ ఏకసూత్రతని నిలబెటా ్టలనుకున్నాను.
‘నీల’ పాత్రని నడిపించే సైద్ధాంతిక చోదక శక్తిని తీర్చిదిద్దినదేది?
నవలలో విషయం మీరు అడిగి ఉంటే కనుక, నీలకి సైద్ధాంతిక అవగాహన కలగడానికి ప్రేరణ అయినవాళ్లలో వసుంధర, ఆ ఇంటి వాతావరణం, సదాశివ, అతని వ్యకి ్తగత, సామాజిక, రాజకీయ ఆచరణలు. కొంతమేరకి పరదేశి. మళ్ళీ దానినంతటినీ ఆమె జీవితాలకి అన్వయించి చూసు కుంటూ సాగింది.
ఇపుడున్న వాతావరణంలో ‘నీల’ నవల ఎలాంటి కదలికలను కలిగించాలని అనుకుంటున్నారు?
మన ఉద్దేశాలు ఏవైనా ఉండొచ్చు, ఫలితాల నుంచి మాత్రమే మాట్లాడుకోగలం. ఒక పుస్తకం వెంటనే దాని ప్ర భావం చూపకపోవచ్చు, కొన్ని పుస్తకాలు కాలాలు గడిచాక అవసరంలోకి రావొచ్చు. ఇరవై ఏళ్ల అమ్మాయిల నుంచి ఎన బై ఏళ్ల పెద్దల వరకూ నవలని ప్రేమగా చదవడం ఒక ఫలి తం. నా వరకూ వచ్చిన స్పందనల్లో ఆసక్తిగా అనిపించిన పరిశీలన ఒకటి ఉంది. ముప్పై నుంచి యాబై ఏళ్ల మ ధ్య వయసున్న స్త్రీలను ఈ నవల కలవరానికి గురి చేసింది. విలువల ఘర్షణ జరుగుతున్నదని గ్రహిం చాను. ఇది కూడా నేను కోరుకున్నాను.
సైద్ధాంతిక భూమికలోంచి నీలని ఎలా చూడాలి? ఈ కోణంలో నీల నవలకి వున్న పరిమితులేమిటి, దాని విస్తరణా స్వభావం ఏమిటి ?
ఒక నవల చదవడం కోసం సైద్ధాంతిక అంశాల అవసరాన్ని అందరు పాఠకులు కోరు కోరు. కొంతమందికి అది చాలా అవసరం, అ ట్లాగే విమర్శకి సామాజిక శాస్త్రాలు, సిద్ధాంతాలు, ధోరణులు పనిముట్లు. మార్క్సిజం, అస్తిత్వవాదా లలో నుంచి నవలని చూడొచ్చు. స్థూలంగా – మా ర్క్సిజం మానవాళికి మేలు చేసే సిద్ధాంతం అని నమ్మి నా, సూక్ష్మస్థాయిలో కూడా బలంగా వ్యాఖ్యానించగల శక్తి నాకు లేదు. అనేక సందేహాలు, సంఘర్షణల మధ్యన ఉన్నాను. ఈ స్వభావం నవలకి కూడా పరిమితిగా మారిం దని నా అభిప్రాయం. అస్తిత్వధోరణుల సంక్లిష్టతలను దాటి, వారంతా సమూహంగా సాధించిన చిన్న చిన్న విజయా లను ఎత్తి చూపడమే దాని విస్తరణ.
స్త్రీ వాద సాహిత్యానికి ‘నీల’ కొత్త చేర్పు అనుకోవచ్చా?
అది విమర్శకులు చెప్పాలి. ‘నీల – చివరికి మిగిలేది – నవలల తారతమ్య పరిశీలన’ అన్న అంశానికి ఎంచుకుని ఒక జెఆర్ఎఫ్ స్కాలర్ పరిశోధన మొదలు పెట్టాడు. చూద్దాం ఏం చెపుతాడో.
ప్రరవేలో పనిచేయడం అనేది ‘నీల’ పాత్రని రూపొందించడంలో ఎంతమేరకు దోహదపడింది?
ప్రరవేలో పనిచేయడం అన్నది నా వ్యక్తిత్వాన్ని చాలా మార్చింది. జాజుల గౌరి, రత్నమాలక్క, పుట్ల హేమలత, కాత్యామేడం లాంటి వారి భుజాల మీద చేతులు వేసుకుని స్నేహితుల మాదిరి వర్తించగల ప్రజాస్వామికతని పరిచయం చేసింది. నిర్మాణాల్లో ఉండటం వల్ల పనికిమాలిన అహాలు చాలా మేరకి నశించి, సహనంగా ఆలోచించడం అలవాట వుతుంది. సమూహంలో ఉంటూనే నాకు నేనుగా నిలబడ టానికి ప్రరవే ప్రణాళిక సాయపడింది. ఇట్లా గ్రహించింది ఏది ఉందో ఆ మేరకి ఆ ప్రభావం నీల పాత్ర రూపకల్పనలో కూడా ఉంటుంది.
‘నీల’ నవలలో దళిత, విప్లవకోణాలని మేళవించడం అనేది నవల పునాదిలోనే వుంది. దీనిని వర్తమానానికి అనువర్తింప
చేయడంలో మీ ఆలోచనలేమిటి ? నవల ఏ మేరకు సాధ్యం చేసింది?
నిజానికి ఈ నవల విషయంలో సైద్ధాంతిక అంశాలు ముందుకు తోసుకు రాకుండా ఉండటానికి కఠిన నియమం చేసుకున్నాను. జీవితాలు అన్నీ మాట్లాడతాయి. పచ్చి వాస్త వికత ఉంటుంది. దానిని యథాతథంగా చెప్పేపుడు కళారూ పాలకి ఉండవలసిన ప్రాథమిక విలువల్ని గౌరవిస్తే చాలు. జీవితాలు మాట్లాడేవాటికి ఆకృతి కల్పించడంలో నాకున్న సైద్ధాంతిక అవగాహన అంతర్గతంగా పనిచేసి ఉండొచ్చు.
నవలలో హైందవ ఆధిపత్య భావజాలం చంద్రకళ చావు నుంచి సంపూర్ణ రాజకీయ ఎదుగుదల క్రమం వరకూ వుంది. ఈ
అవగాహనలో పూర్ణ పాత్ర విలువైనది. హైందవ ఆధిపత్య భావజాలాన్ని ధ్వంసం చేసే వ్యూహాన్ని నవల ఎంతవరకు సొంతం చేసుకుందనొచ్చు?
ఏ మతమైనా పితృస్వామ్యానికి భిన్నం కాదు. కాకపోతే భారతీయ సమాజంలో హిందూమతం, మెజారిటీ మతంగా ఉంది కనుక పితృస్వామ్యాన్ని అమలు చేయడంలో దాని పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చంద్రకళ మరణం విష యంలో అది పరోక్షశక్తి కావొచ్చు, పూర్ణ రాజకీయ ప్రయా ణంలో ప్రత్యక్షశక్తి కావొచ్చు. స్త్రీ పురుష సంబంధాల విషయంలో పైకి మేధావుల్లా మాట్లాడేవారు సైతం వ్యక్తిగతంలో ఎంత అల్పత్వంతో ఉంటారో చెపుతూ మా చందు ఒకమాట అంటాడు, ‘పైకి ఇన్ని కబుర్లు చెప్పే ప్రతి మగవాడి మనసు లోనూ ఒక భజరంగదళ్ కార్యకర్త ఉంటాడు’ అని. చంద్రకళ, పూర్ణ, నీల, వసుంధర, సదాశివ, మరీ ముఖ్యంగా అజిత – అటువంటి భావజాలాన్ని చావుదెబ్బ తీసిన పాత్రలే.
‘నీల’ నవలని ప్రధానంగా స్త్రీల సంఘర్షణలోంచి విస్తారంగా విశ్లేషణ చేసుకోవాల్సి వుంటుంది. మీరేమంటారు ?
ఆ గంటావీరులెవ్వరు?! అయినా అది నా పరిధిని దాటి న అంశం. నవలని అనేక మాధ్యమాల ద్వారా ఎక్కువ మందికి చేరేలా చూసుకోవడం కూడా రచయితల బాధ్యత అయింది. అదే పెద్దపని. విశ్లేషణలు వస్తే మంచిదేగా! లోకం గుర్తించే మంచీ చెడూ ఎట్లా ఉన్నాయో మనకీ తెలుస్తుంది.
స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామీకరణం చెందటం అనేది నేటి సామాజికావరణంలో ఎలాంటి పాత్రని నిర్వహిస్తుందను కుంటున్నారు?
మానవ సంబంధాలు ప్రజాస్వామీకరణ చెందడం అనేదే చాలా కష్టమైన విషయం. ఇక లైంగిక నియంత్రణ బలంగా ఉండే స్త్రీ పురుష సంబంధాల విషయంలో అది మరింత కష్టం. పెట్టుబడిదారీ సమాజం ఎంత దుర్మార ్గమైనదైనా దాని ప్రయోజనాల కోసం కొన్ని ప్రజాస్వామిక విలువలని అనుమతిస్తుంది. స్త్రీలూ పురుషులు తమ బంధా లను నిలుపుకోవడానికి చేసుకుంటున్న సర్దుబాట్లను అందు లో భాగంగా చూస్తున్నాను.
స్త్రీవాద సాహిత్యంలో ఏవైనా ఒకటి రెండు మూస దోరణులను ఈ నవల బద్దలు కొట్టిందనుకోవచ్చా?
తొలి అడుగులకి విభ్రమ గొలిపే ఆదరణ ఉంటుంది కనుక మూస ఏర్పడుతుంది. తదనంతర సాహిత్యానికి దాని ని బద్దలుకొట్టే శక్తి సహజంగానే ఉంటుంది. కాలంవల్ల కూడా అది సాధ్యపడుతుంది. సంపూర్ణ, సరళ, నీల, పరదేశి, మినో పాత్రల చుట్టూ ఉన్న జీవితాలను, ఘటనలను రాస్తున్నపుడు మూసకి భి న్నంగా ఉన్నట్లు నాకు తోచింది. వాస్తవాన్ని విశ్లేషకులు చెప్పాలి.
అనేకులు ఆర్థిక అసమ సంబంధాల వలలో వున్న నేటికాలంలో సదాశివలాంటి పాత్రని నిజజీవితంలో వూహించొచ్చా? సామాన్య పేదజనం నుంచి సదాశివలు రూపొందే అవకాశాలను గురించి చెప్పండి?
వ్యక్తులు ఉదాత్తంగా ఉండటానికి – స్వేచ్ఛకి, విలువల ప్రయోగాలు చేయడానికి-ఆర్థిక స్థితిగతులకూ దగ్గర సంబం ధం ఉందని గుర్తించినపుడు నా గుండె కదలబారింది. సామాన్య పేదజనం పేదగానే ఉన్నపుడు సదాశివలు అక్కడి నుంచి రావడం అత్యంత అరుదు.
చంద్రకళకి, మినోకి వారధి నీల. పురోగామి మార్గంలో పయనించే పాత్ర నీలది. మినో భవిష్యత్తుపై నీల, సదాశివల భయాన్ని నవల ఈ కోణంలోంచి ఎలా అంచనా వేయాలి?
నవలకి రాసిన ముందుమాటలో ఈ స్థితిని వీరభద్రుడు చర్చించారు. పరిణామం రేఖీయంగా ఉండటం ఆధు నిక భావన అని, అది వర్తులంగా ఉంటుందని చెప్పే అత్యాధు నిక దశలో ఉన్నామని, దానికి మినో పాత్రని ఉదాహరణగా చూపించారు. ‘స్వేఛ్చ గురించి నీల వేసుకున్న ప్రశ్నలే ఇపుడు ఆమె కూతురు మినో వెయ్యడం కథని వర్తులం చేసింది’ అంటారాయన.
‘నీల’ నవల వచ్చిన ఈ సందర్భం ప్రత్యేకమైనది. ఒక సామాజిక స్పృహని అందించిన నవల. ఈ సందర్భంలో రాబోయే మీ తదుపరి రచనలను ఎలా నిర్వహించబోతున్నారు? రాబోయే రచనలపై నీల ప్రభావం ఎంత వుంటుంది?
వర్తమానంలో గిరిజనుల జీవితాలు నాకు ఎలా అర్థమ వుతున్నాయో రాయాలని ఉంది. ఇంకా ఒకటి రెండు అంశా లు మనసులో మెదులుతున్నాయి. మరీ అవసరం పడితే తప్ప – కొన్నేళ్ళపాటు నవలా ప్రక్రియలోనే ఉంటాను. నీల గురించి చాలామంది మాట్లాడుతున్నారు, ఆ స్పందనల ప్రభావం, తర్వాతి రచనల మీద అసాధారణ స్థాయిలో అయితే ఉండదు. ఏ రచన నేపథ్యం, దానికది స్వతంత్రంగానే ఉంటుంది. నీలలో వచ్చిన చిన్నచిన్న తప్పొ ప్పుల స్పృహ మాత్రం ఉండొచ్చు.
చివరగా ‘నీల’ నవల ద్వారా మీరు ఆకాంక్షిస్తున్నది ఒక్క మాటలో చెప్పండి?
లైంగిక విలువల పేరుతో పురుషులూ స్త్రీలూ సాగించే, గురయ్యే హింస నుంచి విముక్తి పొందాలి.
ఇంటర్వ్యూ : బాల సుధాకర్ మౌళి
కవి, ఉపాధ్యాయుడు