మంచి అనువాదకురాలు, IIT B ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయిన కల్లూరి శ్యామల గారి విమర్శనాత్మక సమీక్ష.
ఇంతకు ముందు నేను రాసిన ఒక నవలికని సాఫ్ట్ వేర్ ఫర్ లైఫ్ పేరుతో అనువాదం కూడా చేసారు.
******************
నీల:
కె.ఎన్. మల్లీశ్వరి
కె.ఎన్ మల్లీశ్వరి గారు, ‘ఎ సాఫ్ట్వేర్ ఫర్ లైఫ్’, ‘సి బాచ్ అమ్మాయి’, ‘జాజిమల్లి’ తదితర నవలలు, కథా సంపుటుల ద్వారా తెలుగు పాఠకులకు సుపరిచితులే! కేవలం నవలారచయిత్రి గానే గాక సాహితీ విమర్శకురాలిగా, స్త్రీ వాద సిద్దాంత దృక్పధంతో రాసిన అనేక వ్యాస, కథా, నవలా, పత్రికా రచయిత్రిగా తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నారు. ప్రస్థుతం విశాఖ నివాసి. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి విశాఖలో విద్యాభ్యాసం చేసి అక్కడే ఉద్యోగ రీత్యా స్థిరపడిన ఈమె ప్రజాస్వామ్య రచయిత్రుల వేదికకి నిర్మాణ స్థాయినుంచి సేవలందిస్తున్నారు. ఆమె క్రొత్త నవల నీలని అమెరికా సాహితీ సంస్కృతీ సంస్థ తానా గుర్తించి బహుమతినివ్వడం ప్రతిభని గుర్తించి గౌరవించడమే!
ఇక నీల గురించి: నీల అనే యువతి ముఖ్యభూమికగా వున్న ఈ నవలలో ఆమె సామాజికనేపధ్యం, పేదరికం, వెనుక బడిన జాతికి చెంది వుండడం వలన ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు, చదువుకోవాలనే ఆమె తపన, అణచివేతల నేపధ్యంలో అనాధగా మిగిలిన నీల జీవన సంగ్రామం అన్నీ కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించారు మల్లీశ్వరి. ఈ కథాకథన శక్తి చదువరులని పట్టి విడవకుండా పుస్తకాన్ని చదివిస్తుందనేది నిర్వివాదాంశమైనా కధాప్రవాహంలో కొట్టుకుపోతూ ఆలోచించలేని కొన్ని విషయాలు పుస్తకం మూసేశాక ప్రశ్నార్థకాలుగా మిగులుతాయి. మిగిలిన సమకాలీన రచయిత్రుల కన్నా మల్లీశ్వరి ధృక్పధంలో విశేషమైన దేమిటి అని ప్రశ్నించుకుంటే కొన్ని సందర్భాలు ప్రత్యేకంగా నిలబడతాయి.
నీల తల్లి తాగుబోతు భర్తని పిల్లలిని పోషిస్తూ నీల అంటే తల్లిగా మమకారాభిమానలతో వుంటుంది. అయితే అన్ని విధాల తన భర్తకి విరుద్దంగా వుంటూ తనపట్ల ప్రేమ చూపించటంతో ఒక అతనిని అభిమానించి దగ్గిరవుతుంది. దానిని అనైతిక సంబంధంగా ఆమె సమాజం తీర్మానించి నీలతో సహా కుటుంబాన్ని వెలివేస్తుంది. తల్లి పట్ల సమాజం వ్యవహరించిన తీరు పట్ల వివక్షతకి గురైన నీల తన జీవితంలో ఒక బంధానికి కట్టుబడి ఉండాలని అనుకుంటుంది. కాని ఒక రకంగా ఆమెని పెంచిన పెద్దలు ప్రసాద్ తో నిర్ణయించిన బంధం కనుక ఆమె తనంత తానుగా కోరుకుని చేసినది కాదు కనుక అతనితో పూర్వ పరిచయం లేదు కనుకా అతని స్వభావాన్ని అంచనా వెయ్యలేకపోయింది. దుర్మార్గుడు కాక పోయినా పితృసామ్య భావజాలంలో పెరిగినవాడు కావడం వలన తన ప్రవర్తనలో లోపాలు గ్రహించుకోలేక ఆమె బయటికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అభిమానం ప్రేమ పేరిట కట్టడి చెయ్యాలని ప్రయత్నించటమే కాక తనమాట నెగ్గితీరాలాని కూడా అనుకుంటాడు. ఇద్దరితో సంబంధాలను నడుపుతూ ఏ ఒక్కదాన్ని ఒదలలేక సతమవుతాడు. ఎప్పుడైతే ఆమె వదిలేసి వెల్తుందో అప్పుడే ఆమె భర్తకి మరొక్క స్త్రీతో వున్న సంబంధం మెరుగున పడుతుంది.
ఆ విధంగా వివాహ వ్యవస్థ వల్ల వచ్చే సహజీవనం తనకి పనికి రాదనే నిర్ణయానికి వస్తుందని అనుకోవచ్చును. అంతకు ముందు దాకా తల్లి లాగా సమాజం గర్హించే వ్యక్తిగా మారకూడదనే తాపత్రయ పడుతుంది. తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన వాడు పరదేశి. దాదాపు ఒక నెల్లాళ్ళు ఏ సమస్యలేదు తర్వాత మాత్రం అతని ప్రేయసితో తెగతెంపులు చేసుకుని నీలతో వుండటానికి సిద్దపడతాడు. అయితే అప్పటికే ఒక బంధానికి కట్టుబడి వున్నవ్యక్తి జీవితంలోకి రెండవ స్త్రీ గా ప్రవేశిస్తే అందులో వుండే సాధకభాధకాలెరిగున్న వ్యక్తి కనుక అతన్ని వద్దనుకుని వచ్చేస్తుంది. తర్వాత చివరిగా ఆమె జీవితంలో ప్రవేశించిన వ్యక్తి సదాశివ అన్నిరకాలా ఉత్తముడు మంచి ప్రేమికుడు. నీలలా సరైన సహచర్యంకోసం అన్వేషిస్తున్న వాడు అయిన సదాశివతో చక్కని జీవితంలో స్థిరపడుతుంది. అయితే నీలే కాదు ఏ రకమైన చేదు అనుభవాలు ప్రేమపరంగా లేని సదాశివ కూడా సహజీవనాన్నేకోరుకుంటాడు కానీ వివాహాన్ని కోరుకోడు.
ఇక్కడే వివాహ వ్యవస్థ పట్ల రచయిత్రిలో ఒక రకమైన వ్యతిరిక్తత కనిపిస్తుంది. మానవ సమాజంలో సహజీవనానికి ఈనాటి సమాజంలో రెండు ముఖ్హ్యమైన పద్దతులున్నాయి – వివాహమొక్కటైతే ఈ ప్రక్రియలేకుండా సహజీవనం చెయ్యడం రెండవది. నేటికాలపు రచయిత్రులలో సహజీవనం పట్ల ఆకర్షణ పెరగటం చూస్తున్నాము. స్త్రీ స్వేచ్చకి ఇదొక మార్గంగా వాళ్ళు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ అవగాహన గూడా మల్లీశ్వరికి వున్నట్టే అనిపించినా స్పష్టత లోపించినట్టని పించింది. సమస్యలపరంగా చూస్తే రెండింట్లోనూ సమస్యలున్నాయి. ప్రేమ వత్తిడి బాధ్యతలు లేని జీవితం వలన రెండిటిలోనూ నష్టాలున్నాయి. ఒక సామాజిక కట్టుబాటు వివాహప్రక్రియతో వస్తుందనుకుంటే ఇది లేకుండా కూడా నియమబద్ధంగా బాధ్యతాయుతంగా వుండవచ్చునని సదాశివలాంటి వాళ్ళు చెపుతారు.
అతని అనుభవాలకి సంబంధించినంత మట్టుకు అతనికి వివాహాన్ని వద్దనుకోవాటానికి కారణాలేమీ లేవు, ఒక్క స్వేచ్చగా ఒకటి కంటే ఎక్కువ మందిస్త్రీలతో బాంధవ్యాన్ని పెంచుకుని తనకి మనస్సుకి నచ్చిన బంధం తారసపడినప్పుడు స్థిరపడదామనుకోవడం తప్ప. ఇలాంటి జీవనవిధానం వ్యక్తిగతంగా ఎవరో ఒకరికి నమ్మిన సూత్రంగా మారి దానికి కట్టుబడటంలోను వివాహవ్యవస్థకి దీనిని ఒక పర్యాయ వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకునే నేటి రచయిత్రుల ఆకాంక్షకీ చాలా తేడా వుంది. మొత్తం సమాజంలో దీనిని ఒక వ్యవస్థ గా తీర్చిదిద్దాలంటే ఎన్నో సమస్యలున్నాయి. ముఖ్యంగా ఈ బంధాలలో ఇమిడిన వ్యక్తుల సంతానానికి ఎలాంటి సమస్యలు రావచ్చో నీల జీవితమే ఒక ఉదాహరణ కదా! ఆమె కూతురు కథ చివర్లో కన్నతల్లినీ కనని తండ్రినీ కూడా లెక్కచెయ్యకపోవడమే కాక అవమానకరంగా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళ తర్వాత వస్తాను ఏ తప్పు చెయ్యను నమ్మండి అని చెప్పి మరీ వెళ్తుంది. ఆమె బాల్యంనుంచి జరిగిన సంఘటనల నేపధ్యంలో తప్పు అని ఆమె దేనిని అనుకుంటుందో స్పష్టమయిన అవగాహన ఆమెకి వున్నట్లు దాఖలాలు కనిపించవు. సదాశివని ఆమె తండ్రిగా భావిస్తున్నదా లేదా అనేది స్పష్టమవలేదు. అతనితో చిన్నతనపు బాంధవ్యంలో వున్న చనువు పెద్దయ్యాకా కనిపించవు. పేరుపెట్టి పిలుస్తుంది. దెబ్బలాడుతుంది అధికారంతో సాధించుకోవాలని చూస్తుంది, అప్పుడప్పుడు అవమానకరంగా కూడా మాట్లాడుతుంది. అవతల వ్యక్తికివాల్సిన మర్యాదని ఇవ్వని వ్యక్తిగా పెరుగుతుంది. బ్రతకడానికి కావాల్సిన సర్వైవల్ ఇన్స్ట్ంక్ట్క్స్ లా అనిపిస్తాయి. పోట్లాడయినా సాధించుకోవాలనే మనస్తత్వం రావడానికి కారణాలని విశ్లేషించాల్సిన అవసరముంది.
ఈ రకమైన మానవసంబంధాల విశ్లేషణ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు చదివిన అయాన్ రాండ్ నవలలు గుర్తొచ్చాయి. అమె రచించిన రెండు ప్రసిద్ద నవలలో ఈ రకమైన ఆదర్శప్రాయమైన సహచరుల వెతుకులాట అన్వేషణ కనిపిస్తాయి. ఫౌంటెన్ హెడ్ లో అట్టడుగు విలువలు కలిగిన వ్యక్తి నుంచి నాయిక విలువలు ఆదర్శ ప్రేమ వున్న అత్యున్నత స్థాయి వ్యక్తి దాకా ఎదుగుతుంది ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రతిభా వంతులు సృజనాత్మకంగా ఉద్దండులు మొదటివాడు తప్ప. అయితే పరాన్నబ్రుక్కులుగా ప్రక్కవాడి ప్రతిభ మీద బతికెయ్యాలనుకునే ఆశతో వున్నబ్రతికే సమాజం, పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతిభకి స్వేచ్చగా బ్రతికే వెసులుబాటు వుండదు. రెండవ నవలలో అందరూ సమానమైన ప్రతిభ వున్నవాళ్ళే! అయితే ఒకణ్ణి మించిన వ్యక్తిత్వం మరొకడిది. ముగ్గురు నాయకులు. నాయిక తన అన్వేషణలో చివరికి కావాల్సిన వాణ్ణి చేరుకుంటుంది. ఈ రకమైన యుటొపియన్ సమాజంలో జీవితంలో వుండదు, రాదు, ఎందుకంటే ప్రతిమనిషిలో మంచీ చెడూ రెండూ వుంటాయి. మానవసంబంధాలు ఈ ఆర్థికపరమైన సూత్రాలకి అతీతంగా వుంటాయి. వుండాలి కూడా. మొత్తానికి చదించే ఆలోచింపచేసే నవల మల్లీశ్వరిగారి “నీల”. మన మధ్య చాలాకాలం వుంటుంది.