నీల – అంజనీ యలమంచిలి

అంజనీ యలమంచిలి నా చిన్ననాటి స్నేహితురాలు, నాలుగైదేళ్ళ కిందట మళ్ళీ పరిచయంలోకి వచ్చాం. చిన్నపుడు ఇద్దరం కలిసి మెసిలిన ప్రాంతం నేపథ్యంగా రాసిన నీల గురించి పరిచయం చేయమని అడగగానే ప్రేమగా ఒప్పుకుంది. ప్రతీ సమీక్షకీ తనని తను మెరుగు పెట్టుకుంటూ ఉండే ఈ భావుకురాలికి జీవితం మీద ఉండే ప్రేమ చేతనే అక్షరాలకి అంత అందం.

 

Image may contain: 1 person

నీల’ పుస్తక పరిచయ సభలో నా ప్రసంగం
————————–

20-01-2018 సాయంత్రం
ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన
‘నీల’ పుస్తక పరిచయ సభ
నాకొక మరపురాని మధుర భావన.
రచయిత కుమార్ కూనపరాజు గారి నిర్వహణలో
చైతనవేదిక పూర్వాధ్యక్షులు, అడ్వకేట్ పి.ఎస్.చంద్ గారు అధ్యక్షతన
రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరితో పాటు లంకా వెంకటేశ్వర్లు, బాలాంత్రపు ప్రసూన,
కొమ్మన రాధాకృష్ణరావు, మంతెన సీతారామ్ వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సభలో…
‘నీల’ నవలను పరిచయం చేయడం అత్యంత సంతోషకరం.
కొంతమందికే పరిమితమైన ఆ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని
10 రోజుల తర్వాత ముఖపుస్తక మిత్రులందరితో పంచుకునే అవకాశం దొరికింది.
ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకుంటూ…
‘నీల’ పుస్తక పరిచయ పూర్తి పాఠం…

***
అందరికీ నమస్కారం… good evening all…

‘ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. నా కళ్ళ లోగిళ్ళు’అని
సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టుగా…
ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, మము గన్న మావాళ్లు అంతా నడయాడిన చోటు ఇది.
జాజీ, నేను చిన్ననాటి స్నేహితులుగా చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఊరు ఇది…
ఎన్నో తీయని జ్ఞాపకాల కలబోత ఈ నేల.
అలాంటి గడ్డపై, ఈ వేదికపై మేమిద్దరం కలవడం…
జాజి రాసిన ఈ నవలను ఇందరు సాహితీ మిత్రుల మథ్య నేను పరిచయం చేయడం సంతోషంగా వుంది.
ఇంగువ కట్టిన గుడ్డకూ ఇంగువ వాసన అతికినట్లుగానే…
మా తాత గారు… సాహితీమూర్తి… శ్రీ వేగుంట కనక రాంబ్రహ్మం గారి సాహిత్య వారసత్వం
ఎంతోకొంత మాకూ అబ్బిందనే అనుకొంటున్నా…
వారు రగిలించిన స్ఫూర్తి, ఆ స్పర్శ.. మనసుకంటిన ఆ తడిని తడుముకోవడం
ఈ సందర్భంగా నా కర్తవ్యంగా భావిస్తున్నా…
తరుముకొస్తున్న చిన్ననాటి జ్ఞాపకాల ఉద్విగ్నతను బలవంతంగా పక్కకు నెట్టి,
నాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తా…

*** మిత్రులారా…

అధ్యక్షుల వారు ఈ పుస్తక నేపథ్యం, ప్రాముఖ్యత గురించి చెప్పారు.
‘తానా’ 40వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందిన ఈ నవలను, మా సొంత గడ్డపై ఇందరు సాహితీవేత్తల నడుమ పరిచయం చేసే సాహసం చేస్తున్నాను…

ఇక కథలోకి వస్తే…
‘సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుందో తెలుసా నీల గారు’ అంటూ పరదేశి ప్రశ్నతో ప్రారంభమైన ఈ నవల ‘సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుందో మీకు తెలుస్తున్నట్టే వుంది నీల గారు’ అని పరదేశి పంపిన మెసేజ్ తో ముగుస్తుంది. దగ్గరదగ్గరగా 600 పేజీల ఈ నవలలో అచ్చంగా 547 పేజీలు ‘నీల’ కథ నడుస్తుంది. లెక్కకు పేజీల సంఖ్య 547 కావొచ్చు. కానీ ఇందులో మూడు తరాల చరిత్ర వుంది. మూడు తరాల జీవన విధానం వుంది. చంద్రకళ నుంచి మినో వరకు మూడు తరాల స్త్రీమూర్తుల అస్తిత్వ పోరాటం వుంది. స్వేచ్ఛ కోసం పడే ఆరాటం వుంది. 2011లో మొదలై.. 2017లో ముగిసిన ఈ నవల ద్వారా ఆరేళ్లపాటు ‘నీల’తో కలిసి ప్రయాణం సాగిస్తుంది మల్లీశ్వరి.

ఏలూరుకు సమీపంలోని చోళదిబ్బలో ప్రారంభమైన కథలో ముఖ్య పాత్రలు చంద్రకళ, పరంజ్యోతి. మన కథానాయకి ‘నీల’ తల్లే ఈ చంద్రకళ. చదువులేకపోయినా కష్టపడి పనిచేసి సంసారాన్ని గుట్టుగా నడుపుకొస్తున్న మహిళ. తన జీవితంలో ఇంకేదో కావాలనే తపన ఆమెలో అడుగడుగునా కనిపిస్తుంది. నీల తండ్రి పరశి (పరంధామయ్య) తాగుడుకు బానిసైన పరశి… తన సోదరి మాటలు విని భార్యను హింసిస్తుంటాడు. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ తల్లికి అండగా నిలబడుతుంది నీల. ఆటోరాజు, తన తల్లికి మధ్య వున్న సంబంధం ఏమిటో తెలియని వయసులో అయోమయంగా, కాస్త వయసు పెరుగుతున్న క్రమంలో అర్థమయ్యీ అర్థం కానట్టున్న ఆ బంధం పట్ల, తల్లి పట్ల తొలుత వ్యతిరేకత ప్రదర్శిస్తుంది. అదే సమయంలో జూట్ మిల్లు కార్మికుల ఉద్యమం నీలకు ఓ ఉత్తేజాన్నిస్తుంది. ఆ మీటింగులలో నినాదాలూ ఇస్తుంది. చంద్రకళకు ఆటోరాజు మధ్య వున్న సంబంధం తెలుసుకున్న పరిశి వారిద్దరినీ చంపి జైలు కెళతాడు. తల్లి చనిపోయి, తండ్రి జైలుకెళ్లి తమ్ముడితో కలిసి అనాధగా మారుతుంది నీల. తమ్ముడిని పిన్ని తీసుకెళితే, నీలను పాస్టర్ దంపతులు ఆదుకుంటారు. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలన్న తల్లి కోరిక నీలను వెంటాడుతూ వుంటుంది. పాస్టర్ దంపతుల సహకారంతో చదువుకుంటున్న క్రమంలో నీలను ప్రసాద్ ఇష్టపడతాడు. అందరినీ ఒప్పించి నీలను పెళ్లాడతాడు.
అమ్మలా కాకుండా, జీవితం అంతా ఒకళ్ళనే ప్రేమించి వారితోనే వుండాలన్న ఆలోచన, మూడో వ్యక్తి ప్రమేయం లేని వైవాహిక జీవితం వుండాలని నీల బలంగా కోరుకుంటుంది. ఈ రెండు కోరికలే చివరకు ఆమె జీవిత గమనాన్ని శాసిస్తాయి. కోరి పెళ్ళి చేసుకున్న ప్రసాదు పట్ల అనురాగం పెంచుకునే క్రమంలో- ఏ సంబంధమైతే తన జీవితంలో పీడకలగా మారిందో…అదే సంబంధం, మూడో వ్యక్తి ప్రమేయం సరళ రూపంలో తన జీవితంలోకి వస్తుంది. ఈ క్రమంలో ప్రసాద్ లో పెరిగిన అసహనం, శాడిజం, అనుమానాలను భరిస్తూ… ఆగిపోయిన చదువును కొనసాగించి పీజీ చేస్తుంది. లాయర్ వసుంధరతో యాదృచ్ఛికంగా జరిగిన పరిచయం గాఢమైన అనుబంధంగా మారుతుంది. వసుంధర ప్రోత్సాహంతో పుస్తక పఠనంతో పాటు పాటలు పాడటం, ప్రజా ఉద్యమాలలో పాల్గొంటుంది. ఒక బిడ్డకు తల్లవుతుంది. ఈ సందర్భంగా నీలకు ఏర్పడిన పరిచయాలు, ప్రసాద్ ప్రవర్తన, మూడో వ్యక్తి ప్రమేయం కారణంగా ఇల్లు వదిలేస్తుంది. వసుంధర ఆశ్రయాన్ని కోరుతుంది. విడకుల ప్రాసెస్ చాలా ఒత్తిడి పెంచుతుంది. తీరా అన్నీ ముగిసి ఒంటరిగా ప్రపంచంలోకి కాలు మోపగానే చుట్టూ అంతులేని స్వేచ్చ. ఏం చేసుకోవాలో తెలీనంత స్వేచ్చ.

ఈ క్రమంలోనే తన మకాం ను చోళదిబ్బకు మారుస్తుంది నీల. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. పరంజ్యోతి కూతురు సంపూర్ణ నీకు పూర్తి అండగా నిలుస్తుంది. సంపూర్ణ ద్వారా పరిచయమవుతాడు పరదేశి. స్వయం సహాయ గ్రూపులు, వాటి తీరు తెన్నులపై సర్వే చేయడానికి విశాఖపట్నం నుంచి చోళదిబ్బకు వచ్చిన పరదేశికి నీల సహాయం చేస్తుంది. అలా మరో బంధం నీల జీవితంలోకి ప్రవేశిస్తుంది. పరదేశికి సహాయం చేసేందుకు విశాఖఫట్నం వస్తుంది. పరదేశికీ నీలకు జాలరి జన జీవన సౌందర్యానికి ప్రతీకలా పరిచయమయ్యే పాత్ర పైడమ్మ. తన చుట్టూ వున్న పరిస్థితుల రాపిడికి రాటు దేలినా, జీవితపు సున్నితత్వం పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోని ధైర్యం అనిపిస్తుంది. పరదేశి, నీలల పరిచయం ప్రేమగా ఒక గాఢతను సంతరించుకునే క్రమంలో… పరదేశి జీవితంలో ఉన్న మరో అమ్మాయి ప్రస్తావన వస్తుంది. ఏ బంధమైతే తనను అనాధగా మార్చిందో, ఏ బంధమైతే తన వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందో- అదే మూడో బంధం… తన ప్రేమలోనూ కనిపిస్తుంది. మళ్ళీ జీవితంలో అలాంటి బంధాలకు సిద్ధంగా లేని నీల, విశాఖను వదిలేస్తుంది.

ఆ తర్వాత తన మజిలీ హైదరాబాద్ కు మారుతుంది. సదాశివతో పరిచయం ఇంతకుముందే వసుంధర సమక్షంలోనే జరిగివుండడంతో… అది మరింత చనువుగా మారుతుంది. ఆ చనువు కలిసి బతకాలనుకోవడం వరకూ వస్తుంది. సదాశివ తండ్రి ప్రకాష్, అతని తండ్రి మత్తయ్య, సదాశివ తల్లి నీతాబాయి, ఆమె తండ్రి సాంబశివరావు ఇలా కొన్ని పాత్రలు ఇక్కడ తారసపడతాయి. నీతాబాయి, ప్రకాష్ ప్రేమకథ వారి మధ్యనున్న అంతరాన్ని అధిగమించి వివాహంగా మారుతుంది. ఇదంతా మరింత ఆసక్తి కరంగా చెబుతారు రచయిత్రి. నీల-సదాశివ మధ్య జరిగే చిన్నచిన్న ఘటనలు వారి బంధాన్ని మరింత గాఢంగా మార్చుతుంది. ఇంతటి స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన మినో మరింత స్వేచ్ఛను కోరుకుంటుంది. తనకు కావాల్సిన స్వేచ్ఛ ఇక్కడ లభించడంలేదంటూ మదనపడుతుంది. ఇల్లువిడిచి పోతుంది. స్వేచ్ఛ గురించి నీల వేసుకున్న ప్రశ్నలే… ఇప్పుడు ఆమె కూతురు మినో వెయ్యడం కథను వర్తులం చేసింది. ఒకప్పుడు తన తల్లి కోరుకున్న సంతోషాన్ని అందుకునే స్వేచ్ఛను తాను దక్కించుకుంది. ఇప్పుడు అదే స్వేచ్ఛను, సంతోషాన్ని తన కూతురు మినో కోరుకుంటోంది.

క్లుప్తంగా ఇదీ కథ…. ఫంక్తూ ప్రేమ కథలా నవలను ప్రారంభించినా…. పైడమ్మ జ్ఞాపకాలు, గంగవరంలో జరిగిన హింస, పోలీసు కాల్పులను ప్రస్తావిస్తూ ‘ఏదోవుంది’ అనే ఆసక్తిని రేపుతూ… చదువుతున్న కొద్దీ ఈ విషయాలు ఇంకా రావేంటి అనుకునేలా ఉత్సుకతను కలిగిస్తారు. అంతేకాదు… స్త్రీ పురుషులు పెళ్లిని పక్కన పెట్టి కలిసి బతకాలనుకోవడం, ఆ క్రమంలో వచ్చే సమస్యలను, పరిష్కారాలను, ఉద్యమాల నేపథ్యంలో స్త్రీ పురుష సంబంధాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంగా ఈ నవల కనిపిస్తుంది.

నీల నవలలోని ముఖ్య పాత్ర పొందిన మానసిక పరిస్థితి ఎదిగిన క్రమం, అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబ నేపథ్యం నుండి జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదుడుకులు, ఆంక్షలు, కష్టాలను దాటి ఎదిగే క్రమంలో జీవితంలో ఎలా స్థిరపడింది అన్నది కథ. పెద్ద కేన్వాస్ కలిగింది. పాత్రలతోపాటు ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. దళిత స్త్రీ జీవిత నేపథ్యం నుంచి మానవ సంబంధాలను చూసే నవల. వ్యక్తి గత స్వేచ్ఛను ఆనందించాలనే స్త్రీ వాద కోణమున్నది. వర్ణనాత్మక శైలి పాఠకులను ఆకట్టుకుంది. ఒక స్త్రీగా ఓ వ్యక్తి తనను తాను కనుగొన్న వైనం ఈ కథాంశం.

***

జాజి శైలిలో ఓ ప్రత్యేకత వుంది. వాక్యాన్ని ఒక సుందర శిల్పంగా చెక్కుతుంది. వర్ణనలు, పోలికలను అద్భుతంగా చెబుతుంది.
ఉదా:
– 11 ఏళ్ల తర్వాత చూస్తోన్న నీలకు పరదేశి ఎలా కనిపిస్తున్నాడంటే…
‘మెత్తని అలలు ఒకదానిని మరొకటి కప్పుకొని బద్దకంగా పడుకున్నట్లు ఉండే క్రాఫ్ చెరిగిపోయి నిర్లక్ష్యంగా చూస్తోంది’ అని నవల ప్రారంభంలో రాస్తారు.
అంటే… ఈ వాక్యం ద్వారా ఆ పాత్రను, ఆ పాత్ర యొక్క గాఢతను, ఆ పాత్ర యొక్క మానసిక స్థితిని పఠితులకు పరిచయం చేస్తారు రచయిత్రి.
అంతేకాదు… ఇంకాస్త ముందుకెళితే…
‘ఒకప్పుడు నిర్మలంగా కనిపించే అతని కళ్లలో ఇప్పుడు పారిజాత పూల కాడల వంటి ఎర్రజీరలు…’ అని రాస్తుంది.
– ‘ఒక బాంధవ్యానికి మరో బంధంతో పోటీ వుండదని, దేనికదిగా చూడాలని నమ్ముతాడు’(పేజీ 7)
– ‘నమ్మినప్పుడు నెప్పి ఏమీ వుండదు. నమ్మకానికి పరీక్ష ఎదురైనప్పుడే నొప్పి తెలుస్తుంది’(పేజీ 😎
– నలుగురూ నాలుగు దెబ్బలు వేసినప్పుడు ఏడవలేదు కదాని నువ్వ కూడా గట్టిగా ఒక దెబ్బ వేయొచ్చు అనుకుంటే ఎలా?’ (పేజీ 488)
– స్థిమితంగా ఒకచోట కూచుని కలవరంగా వున్న మనసుతో మాట్లాడుకోవాలని వుంది.
– సూర్యం గురించి చెబుతూ… ‘దీపావళి రోజు మగపిల్లలు గాల్లోకి గిర్రున తిప్పే దివిటీలు అతని గొంతులో ఖణఖణ మండేవి’(పేజీ 28)
– ‘అతని చెయ్యి పైకి ఉన్నప్పుడు మహావృక్షం. కిందికి వాలినప్పుడు పంచపాయల జలపాతం’(పేజీ 266)
– ‘సముద్రం చాలా అందంగా వుంటుంది. కానీ దాహం తీర్చదు’(పేజీ 281)
– ‘అతని మొహం చూసింది. ఏదో నొప్పితో సతమతమవుతున్నానడు’(పేజీ 298)
– ‘ఓటమిని పరాజితులు స్వయంగా వరించారు… నిస్సహాయంగా’
ఉదాహరణకు ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి వాక్యాలు ఇంకా చాలానే వున్నాయి.
వాక్యాన్ని ఇంత అందంగా చెప్పడం, మనసు వ్యక్తం చేయలేని భావాలను, అదిపడే సంఘర్షణను ఒక చిన్న వాక్యంలో చెప్పడం, ఆ వాక్యానికి అలంకారాలు జోడించి అలరించడం మల్లీశ్వరి సొంతం.

*** అదేవిధంగా… ఈ నవలలో అనేక ఉద్యమాలను, సమస్యలను ప్రస్తావిస్తారు.
సారా వ్యతిరేక ఉద్యమంతో మొదలుపెట్టి…
పొదుపు సంఘాలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయ సంస్థలు, వాటి పని విధానం, వాటిలో వుండే లొసుగులు, వాటిలో వుండే రాజకీయాలు, వాటి వెనుక వుండి నడుపుతున్న రాజకీయ పార్టీల నాయకుల గురించీ చెబుతారు..
ఏజెన్సీలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం, శ్రీకాకుళ గిరిజన పోరాటం గురించీ మాట్లాడతారు.
బాల్య వివాహాలు, సహజీవనం, సింగిల్ విమెన్, విమెన్ ట్రాఫికింగ్, క్యాస్ట్ – జెండర్ వంటి సమస్యలనూ లేవనెత్తడం ద్వారా…దీనిపై మీ స్పందనేంటి అని ప్రశ్నించినట్టుగా చర్చకు పెడతారు.
ఇసుక తవ్వకాలు, తెలంగాణ వాదం, గ్లోబలైజేషన్, హైదరాబాద్ మురికివాడల స్థితిపై సర్వే, – డ్వాక్రా గ్రూపుల సమస్యలపై ఏలూరులో సర్వే, ఎన్జీవోలు- వాటి తీరుతెన్నులు, కరువు తీవ్రత, ఆకలి చావులు… వంటి అనేక ఉద్యమాలు, సమస్యల ప్రస్తావన ఈ నవలలో వుంది.

ఇన్ని అంశాలను ఒకే నవలలో చెప్పాలంటే… వీటన్నింటి పట్ల ఎంత లోతైన అధ్యయనం, పరిశీలన లేకపోతే రాయగలుగుతారు. ఒక అంశానికి అక్షర రూపం ఇవ్వాలంటే ఎంతో స్టడీ చేయాలి. వాటితో మమేకమై జీర్ణం చేసుకోవాలి. ఆ కృషి ఈ నవలలో కనిపిస్తుంది. ప్రతి అక్షరం వెనుక కనిపిస్తుంది. గోంగూర, మటన్ కూరను గుమగుమలాడిస్తూ నోరూరించేలా వండగలిగిన చాకచక్యం, పైడమ్మ చేపల కూర గుమగుమల్లా ఈ నవలలోని ప్రతి సన్నివేశం పాఠకులు రుచి చూస్తారు.

***

నవలకు పునాది వాస్తవిక జీవితమే. వాస్తవిక జీవితాన్ని ఆధారంగా చేసుకునే నవలలో పాత్రలు, సంఘటనలు, కథాసంవిధానం వుంటుంది. సమకాలీన సమాజపు లోతును విస్తృతంగాను, రమ్యంగాను, చిత్రించడానికి నవలా ప్రక్రియకున్నంత అవకాశం మరే ఇతర సాహితీ ప్రక్రియలకు లేదు. రచయిత్రే చెప్పినట్టుగా… ఒక కథ పరిధికి మించిన లోతైన, విస్తృతమైన క్యాన్వస్ వున్నందునే ఈ ఇతివృత్తాన్ని నవలగా ఎంపిక చేసుకున్నారు.
ఫ్రెంచి నవలా రచయిత మపాసాచెప్పినట్టుగా ‘నవల కర్తవ్యం మనల్ని ఆనందింపజేయడం కన్నా… అందులోని సంఘటనల ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఆలోచించేటట్లు చేయగల్గటమే’. ఆ పనిని ఈ నవల ద్వారా మల్లీశ్వరి చేయగలిగారు.

‘ఎక్కడైతే ఆధారపడటం వుంటుందో అక్కడ స్వతంత్ర్యం వుండదు. వ్యక్తిత్వం వుండదు’.
అందుకే… ‘సంకెళ్లలో నలిగిన స్త్రీ తిరుగుబాటు అనే ఆయుధంతో తన స్థానాన్ని దక్కించుకోవాలి’అని ఉద్బోధిస్తాడు చలం.
‘జీవితాన్నుంచి, సంఘాన్నుంచి అపజయాన్ని అంగీకరించవద్దు. మరణంలో, మర్యాదలో, జడత్వంలో, మామూలులో శరణ్యం పొందవద్దు. రణభూమిలోకిరా, గాయమయ్యిందా? అవయవాలే ఖండాలయినాయా? రక్తమంతా నేలపాలయిందా? హృదయమే ముక్కలయిపోయిందా పర్వాలేదు. ఆ సంసార మృత్యువుకన్నా అదేనయం’ అంటాడు చలం తన ‘మ్యూజింగ్స్’లో.

అందుకే స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ వ్యక్తిత్వం అనగానే చలం గుర్తొస్తారు ఎవరికైనా…
అలాగే… కుటుంబం, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి రాస్తే… కొడటిగంటి,
సమాజం, శ్రామికులు, అభ్యుదయం వంటి విషయాలను తడిమితే శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, కుందుర్తి వంటి ప్రముఖులు స్ఫురణకొస్తారు.
ఎందుకంటే… వారి రచనల్లో వున్న సామాజిక స్పృహే అందుకు కారణం. వారు తమ రచనల ద్వారా లేవనెత్తిన అనేక అంశాలు నేటికీ మన కళ్లముందు సజీవంగా కదలాడుతున్నాయి. సమాజంపై వారి ముద్ర శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే వారింకా చిరంజీవులుగా మన మధ్య వున్నారు.
అలాగే… ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక విషయాలను, ఉద్యమ రూపంలో వున్న పలు సమస్యలను నుడివి, తడిమి ఈ నవలలో చొప్పించారు రచయిత. పూలచండులో దారంలా… అనేక అంశాలను ఈ నవలలో గుదిగుచ్చారు.
మన చుట్టూ వున్న సమస్యలను పట్టించుకున్నప్పుడు, ఆ సమస్యలకు స్పందించినప్పుడే మనిషి సంఘజీవి అవుతాడు. ఈ సంఘంలో బాధ్యత గల వ్యక్తిగా, ఒక రచయితగా మల్లీశ్వరి స్పందించారు గనుకే…
ఇదొక ప్రేమకథగానో… స్త్రీవాద రచనగానో మిగిలిపోకుండా…
సామాజిక స్పృహ కలిగి, పదికాలాల పాటు నిలిచిపోగలిగిన నవలగా ‘నీల’ను సృష్టించింది రచయిత.
ఒక అధ్యాపకురాలిగా తన అనుభవము, పరిశీలన, పరిశోధన, పరిణితి చెందిన వ్యక్తిత్వం- ‘నీల’కు ప్రాణం పోశాయని నేను భావిస్తున్నా…
అంతేకాదు… కొత్త రచయితలకు ఈ నవల ఒక స్ఫూర్తి. ఒక కథలో సామాజిక అంశాలను నేర్పుగా ఎలా చొప్పించి మెప్పించాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు మల్లీశ్వరి.

చివరిగా…
నా చిన్ననాటి నేస్తం రాసిన నవలను పరిచయం చేసే అవకాశం కల్పించిన జాజికి, ఇతర మిత్రులకు నా కృతజ్ఞతలు. ఇంతకుముందు కథలు, నవలలపై మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడినా… ఒక సభావేదికగా, ఇందరు సాహితీ మిత్రుల నడుమ మాట్లాడటం ఇదే మొదటిసారి. నా తొలి ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరించాలని కోరుతూ….

థ్యాంక్యూ…

మీ అంజనీ యలమంచిలి

2 thoughts on “నీల – అంజనీ యలమంచిలి

  1. రివ్యూ బావుంది, స్వేఛ్చ గురించి తెలుగు సాహిత్యం లో ఇలా నవలా సాహిత్యం లో స్త్రీ రచయితలు వ్రాయడం చాలా ఆలస్యం అయ్యింది అని బాఘా అలగాలని ఉన్నా…ఇప్పటికయినా ఒక అస్త్రం ఇచ్చ్చారు అదే పదివేలు.. ..ఇంకా ఏం వ్రాసారో .. జులై లో ఇండియా వచ్సినప్పుడు నీల కొనుక్కుని మా స్వంత ఊరిలో …నాకు పుస్తకాలు చదవడం అనే అలవాటు వచ్చిన ఆ పరిసరాల్లో వీలయితే అప్పట్లో కలసి చదివిన అత్తయ్యలతో కూర్చుని చదవాలి… వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి . అప్పట్లో వాళ్ళు హాయి గా పడుకొని చదువుతూ ఉంటె మనం కిందా మీదా అవుతూ వెనక నుండి చూస్తూ చదివా . మరప్పుడు నాకు పదేళ్లే !. ఇప్పుడు వాళ్లకి నవల్స్ ఎక్కడ తేవాలో కూడా తెలీదు ,మనది అప్పర్ హ్యాండూ …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s