నీల – శ్రుతకీర్తి

వెనుకటి తరాల సాహిత్యాన్నే కాకుండా వర్తమాన సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుంటూ తన విశ్లేషణలతో అందరినీ ఆకట్టుకుంటున్న కొత్త స్వరం శ్రుతకీర్తి. ఒక వాక్యం పట్టుకు చూస్తే చాలు మేలిమి తెలిసిపోతుంది. తను, క్రమేణా కవిత్వంలోకి ఫిక్షన్ లోకి వేగంగా ప్రవహించాలని, దానివల్లనే ఇక సాహిత్యపు దప్పిక తీరుతుందని ప్రేమగా చెప్పాలనిపిస్తుంది. ‘నీల’ ఎవరికి చేరాలని కోరుకున్నానో వారికి చేరుతోందని తెలియజెప్పిన శ్రుతకీర్తి సమీక్ష.

ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ఒక గొప్ప నవలగా “నీల”ను చెప్పొచ్చు.

మారుమూల పల్లెలో వెనుక పడిన కుటుంబంలో పుట్టిపెరిగిన సాధారణమైన నీలవేణి మెట్రోనగరంలో శక్తివంతమైన ప్రతిభాశాలిగా ఎదిగిన క్రమమూ, 1986 నుండి 2011 వరకు ఆమె జీవిత ప్రయాణమే ‘నీల’. ఈ నవలలో జీవం వుంది. ఎన్నో జీవితాల అనుభవసారం వుంది. ప్రతి పాత్రా కథలో భాగంగా మాత్రమే పరిచయం అవదు. తన అంతరంగాన్నీ , జీవన క్రమాన్నీ పరిచయం చేసి వెళ్తుంది. కథాకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాంఘిక, ఆర్థిక ,రాజకీయ అంశాలు వివిధ పాత్రల కథల్లో ఇమిడిపోయి వుంటాయి. కేవలం సామాజిక అంశాలకో, వ్యక్తి గత అంశాలకో ప్రాధాన్యత ఇవ్వకుండా అన్నీ కలుపుతూ బ్యాలెన్సింగ్ గా ఒక సంపూర్ణమైన పుస్తకాన్ని అందించిన మల్లీశ్వరి గారిని ఎంత అభినందించినా తక్కువే.

ప్రస్తుతం ఎవరికి తోచిన నిర్వచనాలు వారిస్తూ కొంచం ఎక్కువగానే దుర్వినియోగం అవుతున్న పదం “స్వేచ్ఛ”. అందుకే ఏమో స్వేచ్ఛను వెతికి చూపించడానికి 550 పేజీల్లో అడుగడుగునా ప్రయత్నించారు మన జాజిమల్లి. స్వేచ్ఛకు ఏ ఒక్క నిర్వచనమో ఇవ్వలేము, వ్యక్తికీ వ్యక్తికీ సైతం ఇది మారుతుంది. ఒకరికి స్వేచ్ఛ అనిపించింది మరొకరికి విశృంఖలత్వం అవొచ్చు, ఒకరికి బంధనం అనుకున్నది మరొకరికి ఆనందం కావచ్చు. ఎవరికి కావాల్సిన స్పేస్ వారు నిర్ణయించుకోవాల్సిందే అని చాలా పాత్రల ద్వారా ఎవరి పరిధిలో వారు కోరుకున్న స్వేచ్ఛనూ, దాని ఫలితాలనూ చూపించారీ పుస్తకంలో.

అందరూ చదివి ఎంజాయ్ చేయాల్సిందే అని కథ గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. నేనే నీలగా మారి సదా ప్రేమలో, సదాగా మారి నీల ప్రేమలో మునిగి పోయి వున్న ఈ స్థితిలో ఎక్కువ మాట్లాడాలని కూడా లేదు. ప్రేమ ఒక్కటే కాదు వాళ్ళ ఆలోచనలూ, ఆశయాలూ, మెరుగైన ప్రపంచం కోసం పడే నిరంతర తపనా అన్నీ గొప్పవే. అంత అద్భుతమైన వ్యక్తులు నీలూ, సదాలు. “సముద్రం ఎందుకు వెనక్కి వెలుతుందో తెలుసా నీలగారూ?” అని ప్రశ్నించే పరదేశిని నీల చూసినంత అబ్బురంగా చూడటం, అతని హృదయభారాన్ని మనమూ షేర్ చేస్కోడము బాగుంటుంది. కాసేపే కనిపించి మాయమైన స్టాలిన్ సూర్య నీల ఆలోచనల్లో దీపమై మనల్నీ వెలిగిస్తూనే ఉంటాడు.సారా వ్యతిరోకోద్యమంలో ఆరంజ్యోతి ధిక్కారస్వరం అబ్బుర పరుస్తుంది. పొదుపు ఉద్యమంలో, రాజకీయంలో, కాంట్రాక్టు పనుల్లో సంపూర్ణ సాహసమూ, ప్రయోగాలూ చదువుతుంటే కొన్ని బాధపెట్టే కోణాలున్నప్పటికీ మహిళల ముందడుగుగా చూసి ముచ్చటేస్తుంది. పేర్చి పెట్టుకున్నవన్నీ కోల్పోయినా మనుషులు ఎందుకు బతుకుతారో, ఎందుకు బతుకాలో చెప్పిన ప్రవక్త పైడమ్మ. తనకు జరిగిన అన్యాయం వేరే వాల్లకు జరుగొద్దని ఎన్జీవో స్థాపించిన అజిత, నీలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఎన్జీవోల పనితీరు, సామాజిక పరివర్తనలో వాటి భాగస్వామ్యం, వాటి లోపాలను లోతుగా చర్చించారిక్కడ రచయిత్రి. కలలు కన్న ఆదర్శాల కోసం పంటి బిగువున కష్టాలను ఓర్చుకుని, ఆ సహనం కోసం మౌనంలోకి మరలిపోయిన నీతాదేవి మరో అపురూపమైన స్ర్తీ. సాధారణ వ్యక్తులైన ప్రసాద్ , సరళలు పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తన మార్చుకుంటూ పోయినా వాళ్ళను అసహ్యించుకోలేము. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమని పంచే పాస్టరు మామయ్యా, పాస్టరమ్మలు గుండెచెమ్మని వెలికి తీస్తారు. ఇలా అందరూ మనసులో నిలిచిపోయే వాళ్లే..!!

ప్రతి చిన్న ప్రవర్తన వెనుక కారణాలను అన్వేషించే , ప్రశ్నించే నీల ద్వారా రచయిత్రి మనకు అర్థవంతమైన , లోతైన వివరణలు ఇస్తూ వెళ్తారు. నేను బాగా కనెక్ట్ అయిన అలాంటి కొన్ని మాటలు మీకోసం.

‘మంచికీ చెడ్డకీ కొలమానం ఎట్లా అంటే, అది మనుషుల్ని సారాంశంగా చూడటంలోనే తెలుసుకుంది నీల. అందమైన పాఠంలా కాక విధిలేని పరిస్థితుల్లో తప్పని గుణపాఠంగా నేర్చుకుంది.’ ఇలా బాధనుండి జీవితం నుండి నేర్చుకునే పాఠాలతో ఎదిగిన మనుషులు ఎంత అపురూపమో..!

‘ఒకే జీవితంలో అనేక జనన మరణాల తర్వాత కూడా జీవితం నుంచి పిండుకోవాల్సిన సారవంతమైన ప్రేమ ఏదో మిగిలే ఉంది.’.ఎంత భరోసా ఇచ్చే మాట..!

” నలుగురూ నాలుగు దెబ్బలు వేసినపుడు ఏడవలేదు కదాని నువ్వూ దెబ్బ వేయకేం?” ఇంతకంటే మనసును కదిలించే వేడ్కోలు వుంటుందా..!

‘ఏదైనా ఒక విషయం గురించో, ఒక మనిషి గురించో పదేపదే మాట్లాడి, తిట్టి, ద్వేషించేవారి అంతరంగాల్లో వాటి పట్ల ఉన్న వల్లమాలిన ప్రేమని గుర్తించింది.’ తము చెయ్యలేని పని ఎదుటోల్లు చేస్తే ఎంత అక్కసో..!

‘ చాటుగా చేసే దౌర్జన్యాల్లో కనీసం సంఘభీతి ఉంటుంది. తప్పేమో అన్న స్పృహ ఉంటుంది. బాహాటంగా చేసేవి, దౌర్జన్యానాకి గురయినవారిని పూర్తిగా బెదరగొడతాయి.’ భయపడే వాళ్ళను మరింత భయపట్టడం నిజమే కదా..!

‘ ఈ అంచు నుంచి ఆ అంచుకి ప్రశ్నల ప్రయాణంలో విపరీతమైన అలసట. తట్టుకోలేక రెండు అరలు తయారు చేసుకున్నది. పుస్తకాలు చదువుతూ ఉద్యమగీతాలు పాడే నీల, సామాన్య గృహిణి నీల రెండు అరల్లో కలవరం లేకుండా సర్దుకుంది’. ఇది కదా అస్తిత్వాన్ని కాపాడుకోడానికి చేసే పోరాటం..!

బాగా బతకడానికి డిజర్వ్ అయి ఉన్నాను అనే నీలకు సదా చెప్పిన రెండు మాటలు ” మీలో ఉన్న మిమ్మల్ని గుర్తించటం లేదని అనిపించింది. మానవ సంబంధాలు ఏవైనా అవి స్నేహాలైనా, ఉద్యోగ సంబంధాలైనా మనుషుల్లో ఉండే వికాసాన్ని విస్తృతం చేయాలి, వేగవంతం చేయాలి. మీ విచక్షణ, అవగాహన ప్రాతిపదికగా సాగాలి. మీకు ఏది ముఖ్యమో ఏది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిని చేస్తుందో దాని కోసం మీ ఎంపికలు ఉండాలి. ఇది స్వార్థం కాదు. మనుగడకు అవసరమైన ఆదిమ జ్ఞానం.”

‘పదిమంది అండ ఉండాలనుకోడం మానవసహజం. ఒక్కరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోడం బేలతనం. ముందు మనకు మనం ఉండాలి. ఆ ధైర్యం నుంచి, స్తిమితం నుంచి మనుషులను కోరుకోవాలి.’ తన సందేహాలకు తనే సమాధానాలిచ్చుకున్న నీల మాటలివి.

‘మానవ సంబంధాలు ఎంత క్రూరమైనవో, అంత ఆర్ద్రమైనవి. మనుషులు తమ సంస్కారంతో, నూతన విలువలతో అన్నిటినీ ప్రేమభరితం చేయగలరు. అటువంటి మనుషులే, సాటి మనుషుల మీద ప్రేమతో పెద్ద యుద్ధాలు చేయగలరు. మనుషుల్ని ఎంత చివరికి వెళ్ళి ప్రేమించవచ్చో తెలుసుకున్నాక దేన్నైనా, ఎవర్నైనా క్షమించగలం’ .

ఇలా పుస్తకం నిండా చాలా ఆలోచనాత్మకమైన, కవితాత్మకమైన వాక్యాలు ఎన్నో వున్నాయి. అవన్నీ ఇవ్వలేక పోతున్నానిక్కడ. చినవీరభద్రుడు గారు రాసిన అద్భుతమైన ముందుమాటలో మళ్ళీ మళ్ళీ చదువుకునేలా అన్నీ వచ్చేసాయి చదవడం మిస్ అవొద్దు మరి.

స్వేచ్ఛగురించి నీల వేసుకున్న ప్రశ్నలే తన 19 ఏళ్ల కూతురు మినో వేయడం ఈ కథకి కొనసాగింపు.

“ఇక ఇప్పటి తన నుంచి కొత్తతనను నిర్మించుకోవాలి, తనలాంటి నీలవేణులకు జీవిత ప్రస్థానాన్ని సులువు చేయాలి” అనుకుంటున్న నీలకి మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం ..!!

2 thoughts on “నీల – శ్రుతకీర్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s