నీల

నీల నవలపై కె. గంగాధర్ గారి సమీక్ష

నీల…నీల…నీల…
———————–
‘నీల’ త్వరగానే పూర్తి చేశాను. చాలా కాలంగా మంచి నవల చదవని లోటు తీరింది. స్త్రీ పురుష సంబంధాల మీద అంటే వివాహవ్యవస్థ మీద ఓ చర్చ ప్రారంభమైతే బావుణ్ణని చాలాసార్లు అనుకునేవాళ్ళం. చలం గారు మరికొంత కాలం ఆశ్రమ జీవితానికి వెళ్ళుండకపోతే, మరెవరైనా అందుకునే వరకూ కొనసాగించివుంటే, ఈ చర్చ అప్పుడే ప్రారంభమై వుండాల్సింది. కమ్యూనిస్టులకు సత్తా వుండి కూడా, వేరే ఎజెండా వల్ల సాహసించలేకపోయారు. ఒకరిద్దరు పరిమిత స్థాయిలో చర్చించారు. 

ఏలూరు జూట్ మిల్లు జీవితాన్ని కథావస్తువుగా ఓ నవల వస్తే బాగుంటుందని నేనూ ఏలూరు మిత్రులు అనుకునేవాళ్ళం. నాకు 1967 నుండి 1992 నెల్లిమర్ల కాల్పుల వరకూ జూట్ కార్మిక వ్యవహారాలతో బాగా సంబంధముంది. నవలలో ప్రస్తావించిన స్త్రీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే సమ్మె, మంచి ఎత్తుగడ. నవలకి సరైన కాలాన్ని ఎంచుకొన్నారు. దాదాపుగా రచయిత సృష్టించిన పాత్రలన్నీ రక్తమాంసాలతో సజీవంగా నాకు పరిచితులే. 

ఆ తర్వాతి కాలంలో మైక్రోఫైనాన్స్, డ్వాక్రాలు, ఇందిరాగాంధీ పాలన తర్వాత ఆడవాళ్ళని బైటికి లాక్కొచ్చిన అతి పెద్ద సందర్భం. వాళ్ళ జీవితాలను నిశ్శబ్ద తటాకంలో పెద్ద బండరాయిలా అల్లకల్లోలం చేసేసింది. కొందరు పూర్ణలు తయారయినా నష్టమే ఎక్కువ జరిగింది. నవల కొనసాగింపుకు అది కూడా మంచి ఘటన. మల్లీశ్వరి గారి నవలలో హీరోయిన్ నీల, నేనూ ఏలూరువాళ్ళం. 30 సంవత్సరాల తేడాతో మా ఇద్దరి సామాజిక నేపథ్యాలూ ఇంచుమించు ఒకటే. రెండు మూడు దశాబ్దాల తేడాతో స్థితిగతులు మారేటంత అభివృద్ధి మా ఊర్లో జరగకపోవడంతో, ఈనవల అర్ధం కావడానికి నేను గతం లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అందుకు నేను, ఏలూరు ను అభివృద్ధి కి ఆమడ దూరం లో వుంచిన స్థానిక రాజకీయ నాయకులకు ఎంతైనా క్రుతజ్ఞుడను.
నీల రక్తమాంస పరిపుష్టమైన పాత్ర. జూట్ మిల్లు కార్మికుల కుటుంబాలలో వుండే వాతావరణం, పాత్రల స్వరూప స్వభావాలు, రచయిత్రి బాగా పట్టుకున్నారు. మా పేటల్లో వాడే పారిభాషిక పదాలు కూడా జూట్ పరిశ్రమకు సంబంధించినవే. పోరీలు(షిఫ్ట్ లు), అగ్రిమెంట్ లు, బోనస్, లేఆఫ్, లాకౌట్ లాంటివి . చివరి మాట మాత్రం కార్మికులను భయబ్రాంతులను చేసేది. అక్కడి రాజకీయ వాతావరణం కూడా తీవ్రంగా నే వుండేది. నీల తల్లికి ఆటో డ్రైవర్ తో వున్న చనువు తండ్రి నరిసి కి నచ్చదు. నీలకు కూడా అసౌకర్యంగానే వుంటుంది. తన తండ్రి వటవ్రృక్షం లా వుండాలని కోరుకునే నీల, పసితనం లోనే, మంచి చెడుల ఎంపీకకు కొలమానం మనుషులను చూసే పద్ధతి లోనే వుంటుందని తెలుసుకుంటుంది.

చంద్రకళ హత్యకు కారణమైన సామాజిక స్థితిగతులు ,మానవ సంబంధాలు నేనెరుగుదును. ఏమాత్రం కల్పన అవసరం లేకుండానే రచయతకి ఈ నవల లోని పాత్రలు తారసపడి వుంటాయి. ఆ కాలానికి నీలను, నీల లాంటి అభాగ్యులను ఆదరించేపాటి మానవతా వాదులకు కొదువ లేదు. మిల్లు కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డ సూర్యం లాంటి సామాజిక కార్యకర్తలను కార్మిక అవసరాలు సృష్టించుతూనే వుంటాయి..ఐతే తడిక మీద వాలిన పిచ్చకలను మురిపెంగానూ,పారే నీటిని ఉత్సాహంగానూ చూసే సూర్యం పాత్రను అర్ధంతరంగా ఎందుకు ముగించారో నాకర్ధం కాలేదు. ఆరంజోతి పాత్రను మరింత మానవీయంగా చూపించడానికే రచయత ఈ పాత్రను ముగించి వుండాలి.
నీలకు ప్రసాద్ తో వివాహం జరిగి రాజమండ్రి చేరుతుంది. సరళ తో ప్రసాద్ కున్న స్నేహం ఆమోదించలేక పోతుంది.బాల్యం నుండే తనకెంతో ఇష్టమైన చదువు రాజమండ్రిలోనే పూర్తి చేస్తుంది. అక్కడ లాయర్ వసుంధర, రవి లాంటి పాత్రలు నీల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి సహకరిస్తాయి. ప్రసాద్ సరళను పెళ్ళిచేసుకోవడాన్ని నిరసిస్తూ నీల బిడ్డతో సహా రోడ్డున పడుతుంది. బ్రతకడం కోసం అయిన అనుభవాలలోని చేదును భరించలేక, నీల తిరిగి ఏలూరు చేరుతుంది. 

అవి మహిళా సాధికారత పేరుతో ప్రభుత్వం, బ్యాంకులూ దిగువతరగతి మహిళలను లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టిన కాలం. డ్వాక్రా, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉదృతంగా కార్యక్రమాలు ప్రారంభించాయి. ఇంటి పనులు చేసుకుంటూ, వేన్నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టు చిన్నచిన్న కుట్లు,అల్లికలూ చేసుకునే మహిళలు, బ్యాంకులూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాలం. నిశ్చల తటాకంలో పెద్ద బండరాయి పడ్డట్టు మహిళల జీవితాల్లో ఇది చాలా అల్లకల్లోలం రేపాయి. వారి సామాజిక, బౌద్ధిక జీవితాలు పెనుమార్పులకు గురయ్యాయి. గ్రామాల్లో వున్న చోటా నాయకులు ఈ మహిళలకు నాయకత్వం వహిస్తూ ఆ క్రమంలో ఆర్ధిక, రాజకీయాలలో ఒక మెట్టు పైకెగబాకారు.
వీటికి ప్రతినిధులు రత్నకర్, శుభాంజలి, సంపూర్ణలు. పూర్ణక్క ఎవరో తమకోసం ఆడించిన, నాటకంలో పాత్రధారి మాత్రమేనని నీల బాధపడుతుంది. పూర్ణక్కకు సహకరించే క్రమంలో, పరదేశి నీల జీవితంలో ప్రవేశిస్తాడు. పరదేశి తనకు ఆలంబనగా వుంటాడని నీల భావిస్తుంది. తను జీవితంలో కోల్పోయిన ప్రేమనంతా , పరదేశి నుండి తిరగి పొందాలని ఆశిస్తుంది. పరదేశి నుండి ప్రేమను ఆశించడం తప్పే ఐతే ఆ తప్పే చేయాలనుకుంటుంది. అతని జీవితంలో చేతన తో వున్న లవ్ రిలేషన్ గురించి తెలుస్తుంది.

మూడోవ్యక్తి ప్రమేయం వున్న ప్రేమ బంధానికీ భయపడి, మళ్ళీ పూర్ణక్క గూటికే చేరుతుంది .
తన గురువు ,లాయర్ వసుంధర సలహాపై ,నీల హైదరాబాద్ చేరుతుంది. ఒక సామాజిక కార్యక్రమంలో ప్రముఖ లాయర్ సదాశివతో పరిచయమౌతుంది .సదాశివ కార్మిక హక్కుల కోసం పనిచేసే లాయర్. ప్రత్యేక తెలంగాణ నాయకుడు కూడా. సంపన్న కుటుంబానికి చెందిన అతని తలిదండ్రులు విధ్యాధికులు. తల్లి పనిచేస్తున్న యూనివర్సిటీ ప్రాజెక్ట్ లో పని చేయడానికి నీలను ఒప్పిస్తాడు సదాశివ. నీల తన జీవితాన్ని గురించి చెప్తూ ‘తనకూ,బిడ్డకూ బ్రతికే హక్కు’ వుందని చెప్పడం, సదాశివను బాగా ఆకర్షిస్తుంది. 

సదాశివ నీల తొ సహజీవనం కోసం ప్రతిపాదిస్తాడు. నీలకు వచ్చే లాంటి పీడకలలతో స్నేహం చేయనని హామీ ఇస్తాడు. నీలకు జీవితం బాగా అర్ధమౌతుంది. ఆడా,మగా సంబంధాలలో సార్వజనీన విలువ లేమీ వుండవనీ, స్త్రీ గా వుండడం కంటే మనిషిగా రూపొందడమే ధన్యమని భావిస్తుంది. తన స్నేహితురాలు వస్తుందని ,రెండు రోజులు తనతో వుంటుందని సదాశివ చెప్పడంతో షాక్ అవుతుంది నీల. దానికి సమాధానం గా వ్యక్తిగత విషయాల బరువు తగ్గించుకుని సమాజం వైపు చూడమని చెప్తాడు సదాశివ.

సదాశివ నుండి వేరుపడడానికి నిర్ణయించుకున్న నీల, అజిత దగ్గరకు వెళ్తుంది. “మీరిద్దరూ పరస్పరం విశ్వాసం పెంచుకున్నారు. పెళ్ళి కూడా చేసుకున్నారనీ అనుకుంటున్నారు . ఇటువంటి పరిస్థితుల్లో నీ నిర్ణయం తప్పు” అంటుంది అజిత.

సదాశివ చెప్పిన స్నేహితురాలు తనకెంతో ఇష్టమైన వసుంధరే అని తెలిసి, నీల రాజీ పడుతుంది.
సదాశివ ప్రజలకోసం పని చేస్తాడనీ పరస్పర స్నేహాల్లో అనేక విషయాలుంటాయనీ, లైంగిక సంబంధాలు అతి చిన్న విషయమనీ చెప్తుంది వసుంధర. సదాశివతో తన ప్రవర్తన కు పశ్చాత్తాపపడుతుంది 28 ఏళ్ళ నీల.

రచయిత నీల పాత్రను అత్యంత శ్రద్ధగా మెట్టు మెట్టుగా నిర్మించారనిపిస్తుంది. పాత్రలన్నీవాస్తవంలోనే వున్నాయి. నరిసి, చంద్రకళ, ఆరంజోతి, సంపూర్ణ, పరదేశి, పైడమ్మ అంతా పాజిటివ్ పాత్రలే. వ్యతిరేక స్వభావాలు కలిగిన ప్రసాద్, సరళలు ఆయా పరిస్థితులలో అలా ప్రవర్తించారని నీల భావించడం లో మరింత ఔచిత్యం వుంది. ఈ నవలలోని పాత్రలన్నీ కథనం కోసం అవసరమే కానీ మత్తయ్య దంపతులు, ప్రకాష్-నీతూభాయ్ లు లేకపోయినా నవల ఔచిత్యానికి భంగం కలగదనిపించింది. కానీ వ్రృద్ధ దంపతులైన వీరు యాత్రలతో కాలక్షేపం చేస్తూ, యాత్రలలోఒకగది లో పడుకునే అలవాటు వల్ల ఇంటిదగ్గర కూడా ఒకే గదిలో వుంటున్నారని రచయిత రాసినపుడు సమంజసంగా అనిపించింది. మానవ సంబంధాలు ఎంత క్రూరమైన వో అంత ఆర్ధ్రమైనవి. మనుషులు తమ సంస్కారంతో, నూతన విలువలతో అన్నింటినీ ప్రేమభరితo చేయగలరు. సాటి మనుషుల మీద ప్రేమతో యుద్దాలు కూడా చేయగలరు……… ‘నీల’ ను స్రుష్టించిన మల్లీశ్వరి గారూ అభినందనలు.

 — with Jaji Malli Jaji.

 

ప్రకటనలు

2 thoughts on “నీల

  1. సదాశివ చెప్పిన స్నేహితురాలు తనకెంతో ఇష్టమైన వసుంధరే అని తెలిసి, నీల రాజీ పడుతుంది.
    సదాశివతో తన ప్రవర్తన కు పశ్చాత్తాపపడుతుంది 28 ఏళ్ళ నీల.

    ఈ రెండు వ్యాఖ్యలూ చూసి నీల రాజీ పడిందా అన్న సందేహం కలిగింది. రివ్యూలు చూసి ఒక నిర్ణయానికి రాకూడదనే పుస్తక వివరాలు అడిగాను. బుచికి ఇపుడు బ్లాగుల హాట్ ఫేవరెట్ భాష … మీకు తెలియదా ? బూతు కాదులెండి. కాస్త ముద్దుగా తిట్టడం అన్నమాట !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s