ఈ రోజు పాతూరి పూర్ణచంద్రరావు అలియాస్ పూర్ణయ్యగారి కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలని గత పది రోజులుగా గట్టి నిశ్చయంతో ఉన్నాను. డెబ్భై నాలుగేళ్ళు నిండి డెబ్భై అయిదులోకి ప్రవేశిస్తున్న నా జీవనశిల్పికి నాలుగు అక్షరమాలలు అల్లుదామని ఇట్లా లాపీ ముందు కూచున్నాను. నేనంటే నేనంటూ దూసుకొస్తున్న ఆలోచనలను వరుసలో పెట్టలేక సతమతమవుతుంటే ఎందుకో చప్పున దుఃఖం ముంచుకొచ్చింది. ఏం ఆయన వయసు వెనక్కి పరిగెత్తకూడదా! ఇంత అన్యాయంగా ఏటికేడూ పరిపూర్ణతలోకి పయనించాలా! వద్దు గాక వద్దు. నేను పూర్ణయ్య గారి గారాలపట్టిగా ఉండగానే కాలం అక్కడే ఆగిపోవాలి. ఆయన వద్ద పదిలంగా ఉన్న బాల్యాన్ని ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండాలి.
డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పక్కనే నడిచినపుడు ‘మీ అన్నయ్యా?!’ అని స్నేహితులు అడిగితే ఆరడుగుల ఆ అందగాడిని చూసి ‘నాన్నగారూ మురళీమోహన్ మిమ్మల్ని సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు వద్దన్నారు?’ అని చిరుకోపంగా అప్పటికి నూటపదోసారైనా కొత్తగానే అడిగాను. చర్మం ముడతలు దేలి గూళ్ళు పట్టు సడలి జుత్తు పండిపోయినా ఇప్పటికీ హీరో అంటే మా నాన్నగారే! స్నిగ్ధ అంటుంది ఈ లోకంలో అందరి కన్నా మా నాన్నే గొప్ప అని. అపుడు నేనంటానూ ‘నీ మొహంలే సిద్దూ మా నాన్నగారి కన్నానా?’అని. ఎవరి నాన్న వాళ్లకి గొప్ప అని అనిపించనివ్వనంతగా ప్రేమిస్తారేంటో ఈ తండ్రులు!
ఇన్నేళ్ళ జీవితంలో నచ్చినవీ నచ్చనివీ బోల్డు ప్రేమలేఖలు అందుకున్నానా…
జాబిలిలోని చల్లదనం
జిలేబిలోని తియ్యదనం
కలిసి మా జాజి అని నాన్నగారు నా చిన్నపుడే చెప్పినంత బాగా ఇంకెవరూ చెప్పలేక పోయారు J సారీ చందూ
పల్లెటూరి రైతుకి ఉండే ఈస్థటిక్స్ తో బోల్డు వర్ణనలు చేసేవారు. చిన్నపుడు ఏం తోచకపోతే అక్కాచెల్లెళ్లు నలుగురం ఆయన చుట్టూ చేరి, నేనైతే నాన్నకూతురిని కదా మరీ హక్కుతో నాన్నగారూ నా చెవుల గురించి చెప్పండి, కళ్ళు గురించి చెప్పండి అనగానే ‘తాటికాయ ముచ్చు వద్ద చెక్కాక పైకి తేలిన తాటిముంజెలా ఉంటాయి నీ కళ్ళు’ అంటుంటే నోరావలించి వినేవాళ్ళం. ప్రేమ, గారాబాల సిరులొలికే బాల్యాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతేని రుణపడిఉన్నాము. అది మేము తీర్చలేనిది, మీరు ఆశించనిది.
నాన్నగారూ,
మేమిప్పటికీ మీ సందిట దాగున్న బిడ్డలం.
మీరు చిరకాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి.
మీకు పుట్టినరోజు జేజేలు
పూర్ణయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. జాజి గారికి అభినందనలు.
కొండల రావు గారూ, థాంక్యూ
తండ్రి కూతుళ్ళ అన్యోన్యతాక్షరాల
జాజిమల్లెలసౌరులు చదువు వారు
మైమరువ గుభాళించెను మల్లి గారు !
జన్మదిన శుభాకాంక్షలు జనకులకును .