గులాబ్ జామూన్ల వంటి పిల్లలు.

 

 

 

gulab jamun recipe

19/04/2015,

విశాఖపట్నం.

హెలో విమలా,

మనం ఉత్తరాలు రాసుకుని చాలా చాలా రోజులైపోయినట్లుంది కదూ! ఈ మధ్యంతా తీరికలు లేకపోవడం సంగతి అటుంచి మార్చి నెలలో మనం జమిలిగా మంచి బహుమతిని పొందాం కదా! చూసావా మధురాతి మధురం మన కొండఫలం ఇచ్చిన తియ్యదనం. వీరలక్ష్మి గారూ మీరలా సప్తవర్ణాల్లో భాగమై ఈ కాలమ్ లో తళుక్కున మెరవడం  చాలా బావుంది. మనమంతా చాలా విషయాల్లో ఒకలాంటి వాళ్ళమే కదా అందుకే మీ లేఖ మా పరంపరలో కుదురుగా అమిరిపోయింది. విమలా మనకు ఈ సర్ప్రైజ్ ని ఇచ్చినందుకు ఆమెకి మరీ మరీ థాంక్స్ చెపుదాం.

 

ఈ మధ్య ఇల్లు మారాము విమలా, లాసన్స్ బే కాలనీ లోకి వచ్చాము. ఆంద్ర యూనివర్సిటీకి దగ్గర. రోజూ వెళ్లి రావడం నాకూ పాపకీ సులువుగా ఉంటుందని. ఇహన ఇల్లు మారడంలో బోల్డన్ని భావోద్వేగాలు ఉంటాయి. అవి మరెప్పుడన్నా చెపుతాలే.  లాప్ టాప్ ఒళ్లో పెట్టుకుని మెట్ల మీద కూచుని  నీకు లేఖ టైప్ చేస్తున్నానా, నా వంటి ప్రేమికురాలిని ఉత్తినే వదులుతుందా ప్రకృతి! ఎదురుగా కొబ్బరి చెట్టు గలగలా మంటూ పిలిచింది. ఆ! పోదువూ బడాయి మమ్మల్ని మాత్రం పిలవదా ఏంటి అనుకుంటున్నావా అమ్మాయీ…నిజమేలే. ఈ చెట్లూ పుట్టలూ పిట్టలు   గొప్ప చాతుర్యం కలవి . ఒక కొబ్బరి కొమ్మ కొంచెం వంగి అడ్డంగా చాపలాగా పరుచుకుంది. దాని మీద వరుసగా మూడు పిట్టలు. ఒకటి కాకమ్మ, రెండు చిలకమ్మ, మూడు వడ్రంగి పిట్టమ్మ! ఓసి! ఏమి వీటి స్నేహమూ, వీటి వైనమూ…స్వజాతి కాకపోయినా రెక్కలు రెక్కలు రాచుకుంటూ ఇంత సొంపుగా కూచున్నాయీ!

 

ఈ మధ్య విశాఖలో పిట్టలు చెట్ల మీద అపార్ట్ మెంట్లు కట్టుకుంటున్నాయి. మా పిట్టమ్మలకి ఇపుడు ఇళ్ళ కొరత కదా! అందుకే అవీ టెక్నాలజీని వాడుతున్నాయి.  మా తోటికోడలు వాళ్ళింట్లో పెద్ద మావిడి చెట్టు ఉంది. ఘనమైన చెట్టులే. హుద్ హుద్ కూడా ఏమీ చేయలేకపోయింది. ఇపుడు రాత్రి పదింటికి వెన్నెల్లో ఆ చెట్టు చూసామంటే ఇంద్ర ధనుస్సు మరింత  వంపు దీరి  వరుసలుగా మారి చెట్టు మీద తిష్ట వేసిందా అనిపిస్తుంది. కింది వరుస కొమ్మల్లో పిచ్చుకలు, మధ్యలో ఒక వరుస చిలుకలు, ఆ పైన కాకులూ, బులుగు రంగు పిట్టలూ, నడి నెత్తిన కొంగలూ కూడబలుక్కుని సఖ్యంగా వేటి వరుసని అవి మీరకుండా రాత్రుళ్ళను వెళ్ళమార్చుకుంటున్నాయి . ఇలాంటపుడే పిట్టల వంటి పిల్లలు గుర్తొస్తారు.

 

పిల్లల్ని మనమే పెంచుతున్నామని మనకెంత అహమో!  మన గొప్పలూ మన ఆదర్శాలూ  తీరని మన లక్ష్యాలూ, చివరాఖరుకి మన కళలు కూడా బస్తాల కొద్దీ వాళ్ళ మీద పడేసి వాళ్ళు గానీ మోయలేకపోయారో, ఎంత విలవిల లాడుతామో. పిల్లల్ని మనం పెంచుతున్నామన్నది పాక్షిక సత్యం. వాళ్ళు పెరుగుతుంటారు చుట్టూ ఉన్న గాలిని పీల్చుకుంటూ…మనం స్వచ్చమైన గాలిని ఇవ్వాలని తాపత్రయ పడతాం. ఆ క్రమంలో ఒకోసారి కాలుష్యాన్నీ ఇస్తామేమో తెలీకుండా. కానీ మన మాయోపాయాలన్నీ కనిపెట్టి కూడా సులువుగా క్షమించి వేస్తారు. దొరికిన కొద్ది స్పేస్ లో వరుసలలో కుదురుకున్న పిట్టల వలే ఆ సమయాలను వెళ్ళమార్చుకుంటారు. కానీ విమలా ప్రతి రాత్రి చివరా ఒక సూర్యుడు ఉంటాడు కదా! అది అర్ధం చేసుకోకుండా  వెలుగు అలికిడికి కోలాహలంగా లేచి రెక్కలు బార్లా చాపి ఎగురుతూ పోయే చైతన్యాన్ని చూసి పిల్లల్ని కంటాం కానీ వారి తలరాతల్ని కాదు కదా తలపోతలతో నిట్టూర్చుతుంటాము.

 

పిల్లల తాలూకు ఈ కామన్ కష్టాల సంగతి అటుంచితే ఈ మధ్య కళాకారులు, బుద్ధిజీవులు, సమాజాన్ని తమ చైతన్యంతో ముందుకు తీసుకు పోగల ప్రభావ వర్గాల వారి పిల్లలు కొందరు నాకు తెలీకుండానే నా ఆలోచనా ప్రపంచంలోకి వచ్చి చేరారు. దేశాన్నే కుదిపేసిన ఒక విప్లవకారుడి అరెస్ట్ సందర్భంలో టీన్స్ లో ఉన్న అతని కూతురు అతన్ని చూసి గర్వపడే తీరాలని మన విలువలు అంత నిక్కచ్చిగా ఎలా శాసిస్తున్నాయి!! చక్కని అమ్మాయి కదా  విమలా, తొలి యవ్వనపు మిసమిసలతో తనకి అర్ధమైన తన ప్రపంచంతో సాగిపోవాలనుకునే పిల్ల కదా, అకస్మాత్తుగా ఓ రోజు పోలీసు పద ఘట్టనలతో ఇల్లు మార్మ్రోగిపోయి, అప్పటి వరకూ పిల్ల చుట్టూ ఆవరించి ఉన్న రక్షణ శ్రేణులన్నీ తునాతునకలై పోయి నిలువనీడ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, తన ఈడు స్నేహితులందరూ అపనమ్మకంతో చూసి తప్పుకు తిరుగుతుంటే వెయ్యి కళ్ళతో కాదు వేయి ముళ్ళతో లోకం కాసే కాపలాకి గాయాల పాలైన పిల్లని ఆరాధనగా చూసి ‘ నిన్ను చూస్తే అచ్చం నాన్నని చూసినట్లే ఉంది’. అన్నామనుకో. అవును ధైర్యం చెప్పడానికే అంటాం. గర్వ పరచడానికే అంటాం. నిలబెట్టడానికే అంటాం. కానీ  ‘ అది నా దురదృష్టం ‘ అని టకీమంటూ ఆ పిల్ల నుంచి  ప్రతిస్పందన వచ్చిందనుకో  నా మనసెందుకు చేదెక్కిపోయింది! అట్లా అనకూడదు అంటూ ఏదో చెప్పడానికి నేనెందుకు ప్రయత్నించాను ! అది తల్చుకుంటే నాకిప్పటికీ సిగ్గుగానే ఉంది. రేపో మాపో మనసు గట్టి పరుచుకుని ఓపికని సాగదీసుకుని దెబ్బలకి రాటు దేలి తత్వం గ్రహించాక ఆ అమ్మాయి సుశిక్షితురాలు అయిపోవచ్చు. మరి కాకపోతే, శక్తి లేకపోతే !! ‘ఇదంతా నేనెందుకు మోయాలీ!’ అనేస్తే !

 

కొంచెం దిగులుగానే ఉంటుంది విమలా! పండిత పుత్ర పరమ శుంఠ లాంటి సామెతలూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ వంటి లోకోక్తులూ వింటున్నపుడు. పిల్లల్ని మన నుంచి విడదీసి చూసుకోవడం ఇంత కష్టమా అనిపిస్తుంది. మర్రి చెట్టు లాంటి తల్లో తండ్రో ఉన్న పిల్లలకి వారి నుంచి తమని తాము పెకలించుకుని వ్యక్తులుగా ఎదగడం మరీ కష్టం. ఒక గొప్ప నటుడి కొడుకు తన జీవితాంతం తండ్రిని పదేపదే స్మరించడం సుఖంగానే ఉండొచ్చు. ఎందుకంటే అందులో ఆర్ధిక కోణం ప్రధానంగా ఇమిడి ఉంటుంది కనుక. యధా పెద్దలూ తధా పిల్లలూగా పేచీలు లేకుండా సాగిపోయే మనుషుల గురించి గొగోల్ అసంపూర్ణ నవల డెడ్ సెల్స్ బాగా చెపుతుంది. ఆ నవలలో ఒక సన్నివేశంలో తండ్రి చనిపోతూ కొడుకుని పిలిచి అప్పగింతలు పెడుతుంటాడు. ఈ లోకంలో తల్లిని గానీ భార్యని గానీ అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములు మిత్రులూ బంధువులూ ఎవరినీ దేనినీ నమ్మొద్దని కేవలం డబ్బుని మాత్రమే నమ్మమని చెపుతాడు. తర్వాత గొగోల్ ఆ తండ్రి,కొడుకుల గురించి ఒక మాట అంటాడు ‘ అతడు వేసిన విత్తనం గొప్ప సారవంతమైన క్షేత్రంలో పడింది’ అని. కొడుకు వ్యక్తిత్వపు సమస్తాన్నీ ఏక వాక్యంలో ఆవిష్కరించాడు గొగోల్.

 

జీవితేచ్ఛ అంతిమంగా ఉనికి దగ్గరకే చేరుతుంది. అందుకే మన ఉనికి మనకి అమేయంగా ఉండాలి. అది ఎంతటి ఉత్తమ త్యాగపూరిత ఆదర్శాలలోనైనా దాని కోసమే, మన ఉనికిని గౌరవంగా నిలుపుకోడానికే ఎన్నెన్ని పోరాటాలు చేస్తామో! పిల్లలూ అంతే. ఫలానా వారి అమ్మాయనో ఫలానా వారి అబ్బాయనో ఉండే టాగ్ ని విదిలించుకుంటూ ఉంటారు. సమాజం అంటగడుతూ ఉంటుంది. బేలలైన పిల్లలు ఆ బరువు కింద కుదేలై కొన ఊపిరితో మూలుగుతుంటారు. మరి కొందరుంటారు చిచ్చర పిడుగులు. వాళ్ళు మాత్రం ఏ నీడలోనూ ముడుచుకోరు. తనని ఎదగనివ్వని మర్రి చెట్టు పైన యుద్ధ ప్రకటన చేస్తారు. అంతర్ బహిర్లోక యుద్ధరావాలతో హోరెత్తి పోతూ ఉంటారు. వాళ్ళ పాటి కదే న్యాయం.

రాక్షస వంశంలో పుట్టి ఎగస్పార్టీ వాళ్ళని కీర్తించిన ప్రహ్లాదుడంటే మనకి తగని ముచ్చట. మన పిల్లలు మాత్రం మనం నిర్దేశించిన కొలతల్ని మీరి అడుగు పక్కకి జారినా క్షమించలేము. మహారాజు బిడ్డ మహారాజే అవ్వాలని లేదు. సమస్తాన్నీ త్యజించి అన్వేషకుడు ఆవొచ్చు. గొప్ప విప్లవకారుల కుటుంబంలో పుట్టిన బిడ్డ త్యాగాలకి రోసి ‘చిన్నీనా బొజ్జకి శ్రీరామా రక్షా’ అనుకోవచ్చు. పిల్లలు అనుకోవడాలన్నిటినీ పెద్దల ప్రమాణాల్లోంచి చూడటం వలన ఎంత అశాంతి !

 

చాలా కాలం  వరకూ స్నిగ్ధ విషయంలో నాకొక ఆశాభంగం ఉండేది విమలా.!  నేను చదివినంత తపనతో, దాహంతో పుస్తకాలు చదవనందుకూ, అట్లా చదవక పోవడం మీద పిసరంత పశ్చాత్తాపం కూడా లేనందుకు. నాకు తెలుస్తూనే ఉండేది నా విలువని ఆ పిల్లలో వెతుకుతున్నానేమోనని, ‘నాలాగా డాన్స్ చేయగలవా, నాలాగా లెక్కలు బాగా చేయగలవా, నాలాగా నవ్వు మొహంతో ఉండగలవా అని నేను నిన్ను అడగడం లేదు కదమ్మా’ అంటూ నవ్వుతూ నవ్వుతూనే జ్ఞానోదయం కలిగించాలని చూస్తుంది ఆ పిల్ల.

 

ఇంకా కొందరు బంగారు బిడ్డలు ఉంటారు. ఎవరు చూసినా అక్కున చేర్చుకోవాలనిపించే వాళ్ళు. మొన్న యూనివర్సిటీలో  జె ఆర్ ఎఫ్ స్కాలర్ ఒకబ్బాయి కలిసాడు.  పుట్టుకతోనే  75 శాతం అంధత్వం. కళ్ళ ముందు లీలగా ఆకారాలు కనపడతాయి తప్ప రంగులతో సహా దేనినీ గుర్తించ లేడు. మరి ఎలా చదువుతావు నాయుడూ అంటే జేబులోంచి పుటాకార దర్పణం తీసి చూపించాడు . మైనస్ 25. ఆ దర్పణాన్ని ఒక కంటికి మాత్రమే ఆనించి చదవాల్సిన అక్షరాలను మొహానికి అతి దగ్గరగా చేర్చుకుని ఒక్కో పదాన్నీ ప్రత్యేకంగా చూసుకుంటూ అట్లా కొన్ని వేల పేజీలు  చదువుతూ, చదివినపుడల్లా పార్శ్వభాగంలో వచ్చే నెప్పిని తగ్గించుకోడానికి మందులు వాడుతూ, ఈ రోజు  పిహెచ్.డి వరకూ రాగలిగాడు. ఎలా ఇదంతా ! అంటే ‘ మా నాన్నకి నేను డాక్టర్ ని అవ్వాలని ఉండేది మేడమ్…అది కుదరదని చెప్పి ఇలా డాక్టర్ అవ్వాలనుకున్నా..మంచి ఉద్యోగంలో చేరి మా నాన్నని సంతోష పెడతా అన్నాడు. నాయుడిని ఇంత వరకూ నడిపింది వాళ్ళ నాన్న కోరికే. చాలా మంది తండ్రులకి పిల్లల మీద ఉండేటువంటి కోరికే. పరిస్థితులో పట్టుదలో శ్రమించడానికి వెనుక నడిపే ఆలంబనో మొత్తానికి నాయుడు దానిని తన హృదయంలోకి తీసుకున్నాడు. అట్లా దృష్టిని విశాలం చేసుకున్నాడు.

అసలట్లా కాదు.

నాయుడనే కాదు.

పిల్లలే  బహు తియ్యనివారు.

విమలా! ఇక్కడ ఎండలు బాగా ముదిరాయి. ఉక్కపోత. ఉన్నట్లుండి నిస్సత్తువని ప్రదానం చేస్తుంది శరీరం. ఈ ఎండాకాలం  మహా కానిది సుమా. మల్లె పూలూ మావిడి పళ్ళూ లేకపోతే ఎండాకాలాన్ని క్షమించడం ఎట్లా చెప్పు?

ప్రేమతో, మల్లీశ్వరి

 

 

 

 

 

 

4 thoughts on “గులాబ్ జామూన్ల వంటి పిల్లలు.

 1. ఒకప్పుడు పుస్తకాలు నేస్తాలయితే ఇప్పుడు ఎన్నో నేస్తాలున్నాయి. అమ్మే పుస్తకాలు వ్రాస్తున్నపుడు అమ్మని చదవకుండా ఉండగలమా? ‘అమ్మ లోకాన్ని’ చదవకుండా ఉండడం కుదురుతుందా . ఇంకా పుస్తకాలంటే మొహం మొత్తదూ 🙂 .. డాన్స్ లో సంగీతం ..పాట ఉండదా ?

  >>>>తనని ఎదగనివ్వని మర్రి చెట్టు పైన యుద్ధ ప్రకటన చేస్తారు.

  నాకు ఈ వాక్యం చూస్తుంటే ఆపకుండా నవ్వొస్తూనే ఉంది … కానీ ఆ యుద్ధం ప్రచ్చన్న యుద్ధం అవుతూ ఉంది చాలా చోట్ల. 😦

  >>పిల్లలే బహు తియ్యనివారు.

  ఒక్కరినే వందమంది లా చూడగలగిన మిమ్మల్ని అభినందిన్చాలనిపిస్తుంది

 2. మల్లె మొగ్గలు కద పిల్లల ప్రతిభలు
  దారి జూప వచ్చు తగు విధముగ
  మఱ్ఱి చెట్ల క్రింద మల్లెలు విరియవు
  తల్లి దండ్రి కాస్త తడయ వలయు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s