పొగరుకీ కుంటాటకీ మధ్య

( పది నెలల కిందట రాసినది.)

‘మల్లీశ్వరీ! ఈ మధ్య నువ్వు ఎక్కడికీ రావడం లేదు. నీకు పొగరని చాలా మంది అనుకుంటున్నారు’ చాసో శత జయంతి ముగింపు సభలో కలిసిన ప్రియమిత్రురాలు  నా చేయి పట్టి పక్కన కూచోబెట్టుకుని ఒకింత ఆందోళనగా అన్నపుడు భావం తలకెక్కలేదు సరి కదా అయ్యో తను నవ్వకపోతే ఎలా బుగ్గల్లో సుడిగుండాలు చూసేదెలా ఒకటే గింజుకుపోయాను. ఆ పొగరనే పదార్ధం హృదయాన్ని గట్టిగా పట్టి ఉందేమోనని ఓ సారన్నా చూడాలని అస్సలు అనిపించలేదు.
కానీ ఈ మధ్య నా మీద నేను కొన్ని ప్రతీకలు కట్టుకుంటుంటే అవి ఇలా ఉన్నాయి .నత్తగుల్ల తనలోకి తాను ముడుచుకున్నట్లు, కుందేలు పచ్చిక కొరకడం ఆపి బెదురుగా చుట్టూ చూసినట్లు, ఆకాశమంతా తెల్లగానో నల్లగానో ఉంటే నేను ఒంటరి మేఘంలా చుక్కలా మెల్లగా కుంటుతూ నడుస్తున్నట్లు…చందు వినీ వినగానే ‘చాల్లే ఇక… మీ కవులూ రచయితలకి ఉన్నంత పైత్యం ఎవరికీ ఉండదు.’ అనేసి బాగానే కోప్పడ్డాడు.
ఆ పొగరుకీ, ఈ కుంటాటకీ మధ్య ఏమైందంటే…అదో చిన్న కథ
నేను పంతులమ్మ ఉద్యోగం మానేసాను. ఎంచేతనంటే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పొందడం వల్ల అయిదేళ్ళ పాటు ఉద్యోగం చేయకూడదు. పూర్తిగా పరిశోధనకే సమయం కేటాయించాలి. ఉద్యోగంలో ఉన్నంత ఒత్తిడి ఉండదు.మధ్యతరగతి జీవికి సరిపోయేంత స్టయిఫండ్ కూడా ఇస్తారు. మన ఆసక్తీ నెరవేరి జీవికకూ లోటు ఉండదు కనుక ఎంతో ఇష్టంతో అప్లై చేసాను. వచ్చింది. అంతా బానే ఉంది. తల్లీ కూతుళ్లిద్దరూ ఆంధ్రా యూనివర్సిటినే (స్నిగ్ధ ఏయు ఇంజినీరింగ్ కాలేజీ లో చేరింది )అని అందరూ అంటుంటే మనసు మొగ్గలు వేసింది.
వార్త తెలియగానే నాకెంతో ప్రియ మైన మా కొలీగ్ , వైస్ ప్రిన్సిపల్ 53ఏళ్ల జనార్దన మాస్టారికి చెప్పగానే భుజం తట్టి ‘’శుభం…శుభం…చాలా సంతోషం…మంచిదే కానీ మీరు లేకుండా పి.జి తెలుగు డిపార్ట్మెంట్ ని ఊహించలేకపోతున్నాం’’ అనేసి అక్కడ నిలబడ కుండా వెళ్లిపోతున్నపుడు ఆయన కళ్ళలో సన్నటి నీటి పొర కదలాడటం నేను గుర్తించానని ఆయనకి ఎపుడూ చెప్పను గాక చెప్పను. గత ఇరవయ్యేళ్ళుగా నా హృదయానికి గట్టిగా పట్టి ఉన్న పొగరు ఏంటో ఈ నెల రోజుల ఉద్వేగ సమయాలు బోధిస్తూ వచ్చాయి. నా ఉనికి పట్లా నలభై నాలుగేళ్ల నా వయసు పట్ల ఏ రోజూ అభద్రత లేకపోవడానికి రోజూ ఉరకలేసే వందలాది పరవళ్ళతో కలియజుట్టుకుని ప్రవహించడమే కారణం అనుకుంటాను. ప్రతీ ఏడాదీ కొత్త బాచ్ లు కొత్తవిద్యార్ధి మిత్రులూ కొత్త నైపుణ్యాలూ,విభ్రమలూ జీవితం ఏ రోజన్నా నడిస్తే  కదా!! ఎపుడూ ఉల్లాసభరితమైన పరుగే. నన్ను చూడగానే మీరు ఫిజిక్స్ లెక్చరరా మాథ్స్ లెక్చరరా అని భయం భయం గా చూసిన పిల్లలు చదువై వెళ్లి పోతున్నపుడు మా మెంటార్ అని గర్వంగా చెప్పడం నా జీవితానికి సార్ధకతే అనుకుంటాను
ఇదుగో ఇపుడే మరి నాకై నేను వేసుకున్న అడ్డుకట్టని గౌరవిస్తూ కాలేజీ నుంచి బయటకి రావడమన్నది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతోంది. నా తరగతి గది నిండా మల్లె మొగ్గల గొడుగులూ వలిసె పూలవనాలే ఎపుడూ పరిమళిస్తూ ఉండేవి. నాకు వీడ్కోలునిస్తూ పిల్లలు రాసిచ్చిన కవితలూ ప్రేమగా ఇచ్చిన గులాబులూ,గట్టిగా తిడతానని చెప్పి నాకు తెలియకుండా తెచ్చి కప్పిన శాలువాలూ..అసలివి కాదు వాళ్ల వ్యక్తిత్వాలకి నేనేమిచ్చానో ప్రతి ఒక్కరూ చెపుతుంటే వాళ్ళు చెప్పేది నా గురించేనా అన్నంత మొహమాటం వేసింది.
బహుసా ప్రతి టీచర్ కీ ఇది అనుభవమేనేమో! సత్యవతి గారూ మీరెట్లా జయించారో ఈ దిగులుని, పాపినేని శివశంకర్ గారూ మరి మీరూ, కాత్యా మేడం…మీరెట్లా ఉండగలరో మరి !!
ఇదంతా విని నా ఫ్రెండ్ అన్నదీ ‘’ శిష్యులని మిత్రుల వలె చూసావు ఇన్నాళ్ళూ.. ఇక మిత్రులని శిష్యుల వలె చూద్దువులే. ఏం చేస్తాం పడక తప్పుతుందా నీతో’’ అన్నది 🙂
అలా కుంటుతూ యూనివర్సిటీకి వెళ్తున్నానా…మొన్నొక ఏయు అమ్మాయి వచ్చి ‘’మీరు మల్లీశ్వరి మేడం గారేనా! మీరు లెసన్ బాగా చెప్తారంట. మా అన్నయ్య మీ స్టూడెంట్.’’ అని నవ్వి ‘’మీతో ఎపుడన్నా మాట్లాడొచ్చా ‘’ అంది.ఒకబ్బాయి వచ్చి తన రీసెర్చ్ టాపిక్ కి సాయం అడిగాడు. రోజూ ఎవరో ఒకరు నా కధలో వ్యాసాలో ప్రస్తావిస్తున్నారు. ఆ చర్చని మెల్లగా మొత్తం సాహిత్యం మీదుగా పోనిస్తున్నాను. చిరు మొలకలు…జీవిత సడెన్ గా ఖాళీ అయిందని ఎపుడన్నా అనిపిస్తే అది తాజాగా నిండడానికేనని నమ్మమని నా మనసు చెపుతోంది  🙂

4 thoughts on “పొగరుకీ కుంటాటకీ మధ్య

  1. శిష్యులను మిత్రులుగ జూచు స్నేహ శీల
    మున్న టీచర్లు సక్సెసు పూల చెండ్లు ,
    చెడదు పరిమళమెన్నడు , కడ వరకును
    జాజి మల్లికి సౌహార్ద మేజు వాణి .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s