స్నిగ్ధ వాళ్ళమ్మ

12404309_530098317141048_1332212735_n
లేత తీవెల చూపులతో మనసుల్ని కట్టి పడేసే మా పాపాయిని, (సరేలెండి ఇంకేమి పాపాయి! పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ) ప్రూనింగ్ చేసిన చెట్టువలె పెంచలేదని మా బంధు మిత్ర సపరివారగణంలో చాలామందికి నా మీదా చందు మీదా కంప్లయింట్. ‘చాలా తెలివైనది…మీరు శ్రద్ధ పెట్టి ఉంటే ఐఐటి కొట్టి ఉండేది. కెరీర్ చాలా ముఖ్యం…అది మీరు పట్టించుకోరు…బ్లా బ్లా బ్లా…’ అబ్బా! ఎంత బోర్. ఇపుడెట్లా ఉందో అదే అసలు స్నిగ్ధ. ఇన్నీ కవుర్లు చెప్పి ‘తయారీ స్నిగ్ధ’ ని లోకానికి ఇవ్వడమా? దేశభక్తి కన్నా హీనమైన పాపం. ఆత్మలోకంలో దివాలా. ఏం పిల్లలు డాక్టర్లో, ఐఐటి ఇంజినీర్లో మాత్రమే కావాలా? ‘జీవించే కళ’ తెలిసి లోకానికి భారం కాని పిల్లలు ఒద్దా!
ఇదిట్లా ఉంటే…
డిసెంబర్ 21వ తేదీ రాత్రి పదకొండున్నరకి మా అమ్మ నన్ను కంటే, డిసెంబర్ 21 అర్ధరాత్రి 1.05 కి (తెల్లవారితే 22వ తేదీ) నేను స్నిగ్దని కన్నాను. ‘రెండు గంటలు నువ్వో అదో ఎడ్జస్ట్ చేసుకుని, ఏదో ఒక తేదీలో పుట్టి ఉంటే ప్రతి ఏడాదీ నాకీ డబుల్ ధమాకా తప్పి ఉండేది కదా’ అంటూ ఉంటాడు చందు. పుట్టినరోజుల సరదాలు నాకేమీ లేవు కానీ నాస్తికత్వం వల్ల పండుగలూ ఉత్సవాలూ ఖాళీ అయిన జీవితాల్లోకి వద్దన్నా వచ్చి ఆక్రమించేవి ఇలాంటివే కనుక స్నిగ్ధ అస్సలు మిస్ కాదు.
చిన్నప్పటి నుంచీ క్రితం ఏడాది వరకూ పుట్టినరోజు అంటే దానికి, జస్ట్… కలల తీరం. అట్లాంటిది ఈ ఏడాది ఏమైందో ఏమో నా చిన్నితల్లి డిసెంబర్ 22 ని కాలదన్ని 21 వ తేదీని తన చేతుల్లోకి తీసుకుంది. కూతురు నవ్వితేనే మైమరచి పోయే నాన్నని సపోర్ట్ తీసుకుని రోజంతటినీ అలంకరించింది. స్నేహితుల సాయంతో అచ్చం అమ్మానాన్నా వండినంత కాన్ఫిడెంట్ గా వంటచేసి నా స్నేహితులతో సహా అందరికీ వడ్డించింది. ట్రెజర్ హంట్ వంటి కథలు రాసే అమ్మని ట్రెజర్ హంట్ ఆడించి బహుమతులు అందించింది. యూనివర్సిటీ యూత్ ఫెస్ట్ లో తన నృత్యాన్ని నేను చూడలేక బాధ పడ్డానని గ్రహించి అదే నృత్యం మా అందరి ముందూ చేస్తుంటే, అప్పటికే ఆనందంతో సోలిపోతున్న నేను ఆ బుజ్జినెమిలి ఆటని అడ్డుకుని గట్టిగా కావిలించుకున్నాను.
‘ఈ అమ్మా కూతుళ్ళ ప్రేమని తట్టుకోలేం’ ఏడిపిస్తారు చాలా మంది. సమస్యే లేదు ఆ పిల్లతో నాది నిర్నిబంధమైన ప్రేమ.
చేతిలో ఉన్న వందనోటుని గడవాల్సిన నెలాఖరుని చూసుకుని, పది రూపాయలకు డజను జాంపళ్ళు కొని నా కడుపున పడిన పిల్లకి ఇవ్వాల్సిన ఆహారం విషయంలో లెక్కలు వేసాను, ఎల్లుండి కంటానగా ఈ రోజు వరకు లెక్కలేనట్లు బస్సుల్లోనూ స్కూటర్ మీదా ఉరుకులు పరుగులు పెట్టాను. అందరూ ఉండి, విశాలమైన ఇళ్ళు ఉండి, కులాంతర ప్రేమ వివాహపు ఒత్తిళ్ళ వల్ల నా పాప ఎవరూ లేని చోట, నేనూ నా చందు, మా అమ్మ మాత్రమే ఉన్న పరిమిత లోకంలో కళ్ళు తెరిస్తే చూస్తూ ఊరుకున్నాను.
అయితేనేం…
పుట్టకముందే మమ్మల్ని క్షమించి, కేరుమంటూ ఏడుస్తూ పుట్టి మమ్మల్ని నవ్వించిది. ఆ క్షమ ఆ దయ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది…‘మీ అమ్మ ఇంటి పట్టున ఉండదు, నీతో ఎక్కువ టైం ఉండదు’ ఇట్లా ఎవరన్నా గిల్లబోయినా, టైంపాస్ చెయ్యబోయినా నా కన్నా ముందే అడ్డుపడిపోయి గొప్ప ఆరాధనతో నన్ను కావిలించేసుకుని ‘మా అమ్మ ఇట్లా ఉంటేనే నాకిష్టం’ నవ్వుతూనే చెప్పేస్తుంది. ఇంత ఫెవికాల్ బంధం కదా! ‘మీ అమ్మా నాన్నల్లో ఎవరంటే నీకు ఎక్కువిష్టం? అని నిన్న కూడా ఎవరో అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండా ‘మా నాన్నే ఇష్టం’ అంది. ‘అదృష్టవంతుడివోయ్!’ అన్నాను కాస్త కుళ్ళుకుని. ‘నువ్వూ అదీ వేరు కాదనీ దాని ఉద్దేశం, నీతో విడదీయరాని స్నిగ్దకి నేనంటే ఇష్టం. అదీ విషయం’ అంటూ కాస్త సంతోషంగా కాస్త నిష్టూరంగా తత్వం బోధపరిచాడు చందు.
మరిలాంటి చిన్నికన్నమ్మ పుట్టి ఈ రోజుకి 19ఏళ్ళు. మా చేతుల పోషణను మించి ఎదుగుతున్న ఈ మొక్క, వట వృక్షం కావాలని అమ్మానాన్నలని స్నేహితులను దాటి తన దయ క్షమలను లోకంలోకి విస్తరించాలనీ కోరుకుంటూ, చిన్నారి చిలుకా! పుట్టినరోజు శుభాకాంక్షలు.

ప్రకటనలు

8 thoughts on “స్నిగ్ధ వాళ్ళమ్మ

 1. స్నిగ్ధకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. స్నిగ్ధ వాళ్ళమ్మ గారికి కూడా కాస్త ఆలశ్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు 🙂 పోస్ట్ చాలా నచ్చిందండీ.. ఇలాంటి సంతోషాలు మరెన్నో మీ సొంతమవాలని కోరుకుంటున్నాను.

  పోస్ట్ టైటిల్ చూడగానే చిన్నపుడు చుట్టుపక్కల వారు బంధువులు అందరూ మా అమ్మగారిని పాపాయ్ వాళ్లమ్మ అని, మా ఇంటిని పాపాయ్ వాళ్ళ ఇల్లు అని పిలుస్తూ మా చెల్లాయినే తప్ప మమ్మల్ని గుర్తించట్లేదని నేనూ తమ్ముడు ఫీలైపోవడం గుర్తొచ్చింది 🙂

 2. మా అబ్బాయి పేరు సిద్ధార్థ్,అమ్మాయి పుడితే స్నిగ్ధ అని పెట్టాలి అనుకున్నా…ఎంత పెద్ద రచయిత్రి అయినా స్నిగ్ధా వాళ్ళమ్మే కదా ? నన్ను” సిద్ధూ కీ మా” అని పిలుస్తారు.ఆడపిల్లలు ఎపుడూ నాన్న పార్టీ కదా ? మావాడు కూడా నాన్న పార్టీ 😦

  • నీహారిక గారూ,
   భలే చిత్రం నాకు బాబు పుడితే నేను గౌతమ బుద్ధుడి పేర్లలో ఏదొకటి పెట్టాలనుకున్నా.
   నాలుగేళ్ళు పోతే సిద్ధార్థుడు అమ్మ పార్టీ లోకి జంప్ చేసేస్తాడు చూడండి. 🙂

 3. మా అమ్మయి పేరు కూడ స్నిగ్ధ. తన పుట్టిన రోజు జులై 19. వాళ్ళమ్మది కూడ జులై 19. మా స్నిగ్ధ కూడ అంతే.

  ‘చాలా తెలివైనది…మీరు శ్రద్ధ పెట్టి ఉంటే ఐఐటి కొట్టి ఉండేది. కెరీర్ చాలా ముఖ్యం…అది మీరు పట్టించుకోరు…బ్లా బ్లా బ్లా…’ అబ్బా! ఎంత బోర్. ఇపుడెట్లా ఉందో అదే అసలు స్నిగ్ధ. ఇన్నీ కవుర్లు చెప్పి ‘తయారీ స్నిగ్ధ’ ని లోకానికి ఇవ్వడమా? దేశభక్తి కన్నా హీనమైన పాపం. ఆత్మలోకంలో దివాలా. ఏం పిల్లలు డాక్టర్లో, ఐఐటి ఇంజినీర్లో మాత్రమే కావాలా? ‘జీవించే కళ’ తెలిసి లోకానికి భారం కాని పిల్లలు ఒద్దా!

  కాకపొతె వాళ్ళమ్మ నాస్తికవాది కాకపొవదం వల్ల కొంచెం తేడా!

  పుట్టినరోజుల సరదాలు నాకేమీ లేవు కానీ నాస్తికత్వం వల్ల పండుగలూ ఉత్సవాలూ ఖాళీ అయిన జీవితాల్లోకి వద్దన్నా వచ్చి ఆక్రమించేవి ఇలాంటివే కనుక స్నిగ్ధ అస్సలు మిస్ కాదు.
  చిన్నప్పటి నుంచీ క్రితం ఏడాది వరకూ పుట్టినరోజు అంటే దానికి, జస్ట్… కలల తీరం.
  ఇప్పుడు పుట్టిన రొజు అంటే తనకి చాలా బోరు.

  నాకు ఈ టపా లు రాయడం తిలియకున్నా..స్నిగ్ధ, పుట్టిన రొజు, కెరీర్, నాస్తికత్వం… ఈ పదాల వల్ల ఇలా రసేసను. జాజిమల్లి గారికి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s