కొకు నవలల్లో మహిళా ఉద్యోగులు

కొడవటిగంటి నవలల్లో మహిళా ఉద్యోగులు
కొడవటిగంటి కుటుంబరావు నవలల్లో మహిళా ఉద్యోగుల పాత్రల్ని పరిశీలించడం అంటే స్త్రీ పురుష సమానత్వం దిశగా మధ్యతరగతి తెలుగుసమాజం సాగించిన నడకని గుర్తు పట్టడం వంటిది. కొకు నవలలు మూడు దశాబ్దాల పాటు (1941 – 1970 ) దేశ సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో వచ్చిన అనేక పరిణామాలకి ప్రత్యక్ష సాక్షులు. నవలా ప్రక్రియకి స్థల కాలాదుల నేపథ్యాన్ని విస్తృతంగా చూపగలిగే వెసులుబాటు ఉంది. చదువు, మారుపేర్లు వంటి నవలల్లో కొకు ఈ వెసులుబాటును సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. అందుచేతనేమో తన కథల ద్వారా పాఠకుల హృదయ పరివర్తనకు, నవలల ద్వారా పాఠకుల బుద్ధి పరివర్తనకు హెచ్చుగా తోడ్పడ్డారనిపిస్తుంది.
సంఘ సంస్కరణోద్యమం, స్త్రీవిద్య విషయంలో చేసిన కృషి సాహిత్య రంగంలో కూడా ప్రతిఫలించింది . అయితే ఈ కృషి ఫలితంగా ఏర్పడిన పరిణామాల్లో వివక్షా సాంప్రదాయాలకి లెజిటిమసీ ఏర్పడడం కూడా కనిపిస్తుంది. కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు వంటి సాహిత్య సంస్కర్తలు మినహా స్త్రీలకి విద్య వారిని మంచి తల్లులుగా మంచి భార్యలుగా తయారుచేయడానికి ఉపయోగపడుతుందన్న సంస్కర్తలు చాలా మంది ఉన్నారు. మధ్య యుగాల నాటి రాణులనూ ఒకరిద్దరు స్త్రీ మేధావులనూ ఆదర్శంగా చూపించి స్త్రీ విద్య ప్రయోజనాలకు పరిధులనూ పరిమితులనూ ఏర్పరచడానికి ప్రయత్నించారు. కొకు రాసిన ‘ఆడజన్మ’ నవలలో లక్ష్మి తను చదువుకోకపోవడం మూలంగా వచ్చిన కష్టాలన్నీ తన కూతురు పడకూడదని తనకి భరోసాగా ఉన్న ఆస్తిని అమ్మి అయినా కూతురుకి చదువు చెప్పించాలనుకుంటుంది . చదువు మీద అంత విశ్వాసం ఉన్న లక్ష్మి కూడా ఆడవాళ్ళకి దొరికే ఉద్యోగాలన్నీ అవినీతికరమైనవే అని బలంగా నమ్ముతుంది. స్త్రీ విద్యకీ, దాని ప్రయోజనాలకూ మధ్య సమాజంలో ఉన్న ఘర్షణ లక్ష్మి అంతరంగ విశ్లేషణ ద్వారా కొడవటిగంటి చెప్పారు.
కొడవటిగంటి నవలల్లో ఉద్యోగులైన స్త్రీ పాత్రల్ని విశ్లేషించడానికి ముందు ఉద్యోగం అన్న పదాన్ని ఏ అర్ధంలో తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. ఉత్ + యోగం అన్నది వ్యుత్పత్తి అర్ధం. వందేళ్ళ కిందటికీ ఇప్పటికీ ఉద్యోగం అన్న పదానికి విస్తృతి చాలా పెరిగింది. సంఘటిత అసంఘటిత రంగాలను కలుపుకుంటే వేతనం తీసుకుని చేసే పనులు బహుముఖాలుగా విస్తరించాయి. చదువు నేపథ్యంగా ఉన్నవారూ కార్యాలయాల్లో, కర్మాగారాల్లో పని చేసేవారూ క్రమబద్ధీకరించబడిన ఉద్యోగనియమాలకు లోబడినవారూ చట్ట బద్ధత, చట్టాల రక్షణ ఉన్న ఉద్యోగాలు చేసేవారిని ఈ విశ్లేషణ కిందకి తీసుకోవడం జరిగింది. ఈ పనులు ప్రధానంగా మధ్యతరగతి తరగతి దిగువ మధ్యతరగతి వర్గాలకి చెందినవి. కొడవటిగంటి తన నవలల్లో ఎక్కువ శాతం చిత్రించినది కూడా ఈ వర్గాలనే. ‘ప్రేమించిన మనిషి’ నవలలో మంగి శ్రామిక వర్గ స్త్రీ . నెల వేతనానికి ఇంటిపనులు చేసే ఉద్యోగి. మంగి ఉద్యోగ జీవితంలోని శ్రమకి నియమావళి గానీ చట్టబద్ధత కానీ లేదు. శ్రమకి తగిన వేతనమూ విలువా లేవు. మంగి వంటి లక్షలాది శ్రామిక స్త్రీల జీవితాల్లోని బానిసత్వం పరాధీనత అమానవీయతని మార్క్సిస్ట్ సూత్రాల ఆధారంగా చెప్పారు కొకు. అయితే వ్యవసాయ కూలీలు, డొమెస్టిక్ లేబర్ వంటి రంగాల్లో పనులు చేసే వారి స్థితిగతులను విడిగా విశ్లేషించవలసి ఉంది. కొకు ఏయే రంగాల్లోని మహిళా ఉద్యోగులను ప్రధానంగా తన నవలల్లో చిత్రించారో వారినే పరిశీలనకి తీసుకున్నాను.
‘గడ్డు రోజులు’ నవలలో ఉద్యోగం లేక నానా ఇబ్బందులు పడుతున్న సత్యానికి దారిద్ర్య బరువు తోడు భార్య జానకి పాతివ్రత్యం కూడా అదనపు బరువుగా తోచింది . ఇటువంటి పాతివ్రత్యాన్ని సహించలేకనే నలుడు దమయంతిని అడవుల్లో విడిచి వెళ్ళాడేమోనని సందేహిస్తాడు కూడా. పోటీ పడి తన కన్నా ఎక్కువగా కష్టాలను అనుభవించి వాటిని తను గ్రహించేలా చేసే కన్నా కష్ట కాలంలో భార్య నెలకొక నాలుగు రూపాయలు సంపాదించి ఉంటె ఎక్కువ సంతోషం కలిగి ఉండేది అనుకుంటాడు. ఈ సందర్భంలో కొకు “ ఈ విధంగా సత్యం ఆదర్శ పత్నికి ఉండవలసిన – ఈ కాలంలో ఉండవలసిన – రెండు గుణాలు – భర్తతో సమానత్వమూ, ఆర్ధిక భారం వహించే శక్తీ – 1934లోనే గ్రహించడం గమనించదగిన విషయం .” అంటారు .
జీవితాన్ని గురించి లక్ష సత్యాలు తెలుసుకుని ఏం ప్రయోజనం ? ఒక్క చిన్న సత్యానికి అనుగుణంగా జీవితాన్ని మార్చే శక్తి లేనపుడు? అని ‘మారిన జీవితం’ నవలలో అంటాడు కొకు. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం ఉంటే అన్ని స్వాతంత్రాలూ అవే వచ్చేస్తాయని నమ్మిన ప్రకాశం తన కూతురు లీల చదువు విషయంలో చాలా పట్టుదలగా ఉంటాడు. చదువూ కళలూ అందుబాటులో ఉన్నా శ్రద్ధ పెట్టగలిగిన వాతావరణం లేకపోవడం మూలంగా లీల దేనిలోనూ ప్రజ్ఞావంతురాలు కాలేకపోయింది. చివరికి ఒక పల్లెటూళ్ళో పోలీసుల్నీ ప్రభుత్వాన్నీ తన పక్షానికి కట్టేసుకునే పెత్తందారుగా మారిపోయింది. పైన చెప్పిన తాత్విక వాక్యం తన కూతురు చదువుకుని ఉద్యోగస్తురాలు కావాలన్న ప్రకాశం ఆశకీ లీల జీవితానికీ మధ్య ఉండిన అంతరాల్ని సహజంగా చూపెట్టింది.
ఒకపుడు ఫ్యూడల్ సమాజమూ ఇపుడు పెట్టుబడిదారీ సమాజమూ స్త్రీల సౌందర్యాన్ని నిర్దేశిస్తున్నాయి. పురుషుడి అవసరాలకూ మార్కెట్ అవసరాలకూ అనుగుణంగా రూపొందిన ప్రమాణాలు మనుషుల అభిరుచులను తల్లకిందులు చేస్తాయి. కొకు కాలం నాటికి సంపూర్ణ స్త్రీత్వానికి శారీరక సౌందర్యం అతి ముఖ్యమైన ప్రతీకగా ఉన్నది. స్త్రీల సౌందర్యమనే అతి మామూలు భావన నుంచి ‘ ఈస్తటిక్స్’ లోకి పాఠకులను నడిపించిన ఘనత ‘కురూపి’ నవలదే. ఈ ప్రయాణం లో కురూపి అయిన సరస్వతి కనకం అనే రచయితకి తన వ్యక్తిత్వం ద్వారా కనువిప్పు కలిగించడం అనేది సెకండరీ అంశం. ఆ సందర్భంగా స్త్రీల వ్యక్తిత్వ సాధనకి అవసరమైన అనేక అంశాలు ఈ నవలలో అంతర్లీనంగా ప్రస్తావించబడ్డాయి. అందులో ఒకటి సరస్వతి ఉద్యోగస్తురాలు కావడం. సరస్వతి అనాకారితనాన్ని చూసి ఏవగించుకున్న కనకం ఆమె ఎం.ఎ చదివి లెక్చరర్ గా పని చేస్తోందని విని తేరిపార చూస్తాడు. అపుడు ఆమెలో ఎమ్మే జాడలూ లెక్చరర్ కవళికలూ కనిపిస్తాయి ‘’ ఒకసారి ఏదో పత్రిక తిప్పుతుంటే ఒక నీగ్రోవాడి బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ కింద ఆ నీగ్రో దక్షిణాఫ్రికా లోని ఒక ప్రసిద్ధ తెగకు నాయకుడని రాసి ఉంది. మళ్ళా ఆ బొమ్మ కేసి చూస్తే ఆ నీగ్రోవాడు మామూలు నీగ్రోవాడిలాగా లేదు. అతనిలో రాజ లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. వాస్తవం తెలపడానికి జ్ఞానేంద్రియాలు చాలవనీ, వార్తా పత్రికలు కూడా కావాలనీ “ కనకం అనుకుంటాడు. ఏళ్ల తరబడీ స్త్రీల వ్యక్తిత్వాలు ఫోకస్ అయిన విధానం నుండి కనీసం సమాచారం ద్వారా అయినా స్త్రీల జీవితాల్లో ముఖ్యంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో వచ్చిన పరిణామాలని గమనించాలని పై ఘటన హెచ్చరిస్తుంది.
కొకు అభిప్రాయంలో విద్యకు రెండు ప్రయోజనాలు, ఒకటి సార్ధకంగా జీవించడమూ, రెండవది జీవితాన్ని అవగాహన చేసుకోవడమూ. నిజానికివి విడదీయరానివి. అయితే చదువు ప్రధానాశయం, బతుకుతెరువు అయిన చోట ధనస్వామ్యం, పిత్రుస్వామ్యమూ కలిసి ఆ బతుకుతెరువుని తల్లకిందులు చేస్తాయి. ఉద్యోగం దొరకని వారు ఎంత చదివినా ఒకటే. అలాగే స్త్రీల ఉద్యోగాలపై నిషేధాజ్ఞలు ఉన్న చోట ఆమె చదువు కూడా శారీరక శ్రమ చేసే స్త్రీల కన్నా భిన్నంగా ఉండదు. ‘తిమింగలం వేట’ నవలలో ధన స్వామ్యమూ పిత్రుస్వామ్యమూ కలిసి ప్రభావితం చేసిన పాత్ర ఇందిర. నిండా పదహారేళ్ళు లేని ఇందిరకు చదువులో నమ్మకం లేదు. ఆడది ఉద్యోగాలు చేసి ఊళ్ళేలదు, ఇల్లాలు ఉద్యోగం పెద్ద ఉద్యోగమే, సరయిన వాడికి ఇల్లాలు కావడంలోనే ఉంది చాకచక్యమంతా అనుకుంటుంది.
సుమారు డెబ్భై అయిదేళ్ళ కిందట ఉద్యోగాలు చేస్తున్న స్త్రీ పాత్రల్ని సృష్టించిన కొకు నవలలని విశ్లేషించాల్సి వచ్చినపుడు రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఉద్యోగినులకి తమ కుటుంబంతోనూ సమాజంతోనూ ఉండే ఘర్షణ, సంబంధబాంధవ్యాలు మొదటిది. స్త్రీలు పని చేసే చోట ఉండే వాతావరణమూ కష్టనష్టాల చిత్రణ రెండవది. మొదటి అంశం మీద అపారమైన శ్రద్ధ చూపిన కొకు రెండవ అంశం మీద పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం లోటు గానే అనిపిస్తుంది. దేశ విదేశ రాజకీయ పరిణామాలు, సైన్స్ , సినిమాలూ , పలు సిద్ధాంతాల తాత్విక భూమికా, చరిత్రా తెలిసిన కొకుకి పని చోట్ల స్త్రీల స్థితిగతులను చెప్పడానికి దానికి సంబంధించిన సమాచారం,అవగాహనల లోటేమీ ఉండదు. సినిమా నాటక రంగాలకి సంబంధించి పని చోట్ల ఉండే సమస్యలు కొన్ని నవలల్లో చిత్రించారు. ‘మారుపేర్లు’ నవలలో కార్యాలయం నేపథ్యంగా నడిచే సందర్భాల్లో లూసీ కేటర్స్ అనే ఆంగ్లో ఇండియన్ స్టెనోగ్రాఫర్ గా పని చేయడం గురించి కొంత ప్రస్తావించబడింది. ఆఫీసులో ఆడ స్టెనోగ్రాఫరుంటే గొప్పగా భావించే దొరలుంటారనీ లూసీ కేటర్స్ చక్కని ఇంగ్లీష్ లో ఉత్తరాలు రాస్తుందనీ ఇట్లా పరిమితమైన అంశాలు మాత్రమే తెలుస్తాయి.
ఉద్యోగం చేసే మహిళల్లో ఉండే స్వయం నియంత్రణాధికారం, ఆత్మ విశ్వాసం స్థిత ప్రజ్ఞత, మూఢ విశ్వాసాలను వదిలించుకోగలగడం మరీ ముఖ్యంగా రాజకీయ అవగాహన వంటి పాజిటివ్ లక్షణాలను చెప్పడం ద్వారా సమాజానికి వారి పట్ల ఉండే చిన్న చూపుని పోగొట్టే ప్రయత్నం చేసారు కొకు. ముఖ్యంగా సినిమా,నాటక రంగాల్లో పని చేసే స్త్రీల గురించి చాలా నవలల్లో ప్రస్తావించారు. కళల ద్వారా స్త్రీల స్థాయి పెరగక పోగా వారి పట్ల సమాజానికి ఉండే అవహేళనని కొకు చాలా నవలల్లో రాసారు. ఒకపుడు గ్రీసు దేశంలో లలిత కళలను కేవలం బానిసలే అభ్యసించేవారు. అలాగే ఆంద్ర దేశంలో నృత్యగానాదులకు దేవదాసీలు కళావంతులు పెట్టింది పేరు. అయితే వారికి సామాజిక గౌరవం లేకపోగా నటవిట గాయకులు అపాంక్తేయులుగా పరిగణించబడేవారు. ఇటువంటి సామాజిక నేపథ్యంలో స్త్రీ విద్య పట్ల అనుమానమూ మహిళా ఉద్యోగుల పట్ల నిరసనా ఉన్న సమయంలో వేతనం తీసుకుని సినిమా, నాటక సంస్థల్లో వేషాలు వేసిన స్త్రీల పక్షం వహించి రాసారు కొడవటిగంటి. చలన చిత్ర పరిశ్రమ తొలి రోజుల్లో ఎన్టీయార్ ,సావిత్రి వంటి వాళ్ళు కూడా వేతనం ప్రాతిపదికగా సినిమా కంపెనీలలో పని చేసిన వారే. ‘ప్రేమించిన మనిషి’ నవలలో పద్మ, ‘ఎండమావులు ‘ నవలలో సుందరం అనే అమ్మాయి లాంటి పాత్రలని సృష్టించి కళా రంగంలో మహిళా ఉద్యోగుల సమస్యలను, ముఖ్యంగా సమాజానికి అనాదరణీమైన వృత్తుల్లోని ఉద్యోగినుల సమస్యలని మొదటిసారిగా సాహిత్యంలో రికార్డ్ చేసారు కొడవటిగంటి.
అసహాయ స్త్రీలను పెళ్ళనే విధిలేని కూపం నుంచి రక్షించేది ఉద్యోగమూ, విస్తృతార్ధంలో ఆర్ధిక స్వాతంత్ర్యమేనని చలం కొడవటిగంటి ఇద్దరూ నమ్మారు. కొకు కన్నా ఇంచుమించు పదిహేనేళ్ళు ముందు రచనలు ప్రారంభించిన చలం నవలల్లో ఎక్కడా ఉద్యోగినులు కనపడరు. ఒకటి రెండు నవలల్లో నర్సు వంటి అప్రధాన పాత్రలు తప్ప. కాల్పనికేతర సాహిత్యం దీనికి మినహాయింపు. కొకు నవలా రచన 1941 లో మొదలు పెట్టారని అనుకున్నా అప్పటికి పదేళ్ళు ముందటి కాలంలో ఉద్యోగాలు చేసే స్త్రీల గురించి కూడా రాసారు. చలం కన్నా కొకు వస్తుపరిధి విశాలం. వాస్తవికం. సమాజ గమనాన్ని తార్కికతతో ఎప్పటికపుడు నిశిత పరిశీలనకు గురి చేయడం వల్లన మార్పుల్ని త్వరగా సాహిత్యంలోకి తీసుకురాగలిగారు. స్త్రీలతో సహా అణచివేతకి గురయ్యే వర్గాల బతుకు తెరువుకీ సమానత్వ సాధనకు పల్లెల కన్నా పట్టణాలే మెరుగని డెబ్భై అయిదేళ్ళ కిందటే గుర్తించి ‘ పల్లె యెల్లయె సర్వ ప్రపంచ సీమ’ మిత్ ని తిరస్కరించారు కొకు.
ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా కొంత మానసిక స్వేఛ్చ ఉండాలన్న కొకు. అటువంటి మానసిక స్వేఛ్చ కలిగిన మహిళా ఉద్యోగుల పాత్రల్ని అలవోకగా సృష్టించారు. ఆ పాత్రలు మనని గాభరా పెట్టవు, భయపెట్టవు, కోపాన్ని తెప్పించవు, పగలబడి నవ్వించవు, కరుణ రసాత్మకతతో మనల్ని కన్నీళ్ళలో ముంచెత్తవు. కానీ మనలను ఒప్పిస్తాయి. మార్పుల్ని ఇంత మానవీయంగా స్వీకరించవచ్చునని ఓపికగా బోధిస్తాయి, తొలి దశ ఉద్యోగినులు కుటుంబంలోనూ సమాజంతోనూ చేసిన పోరాటాలు ఎంత గొప్పవో ఈ పాత్రలు మనకి చెపుతాయి. వాటి పునాదుల మీద నిలబడి ఈ నాటి స్త్రీలు లింగ వివక్ష తాలూకు అవశేషాల మీద కొత్త సమస్యల మీద ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా దూసుకుపోవడం చూస్తే సమాజానికి తన రచనల అవసరం ఎంత తొందరగా తీరిపోతే అంతగా సంతోషిస్తానని వినయంగా పలికిన కొడవటిగంటి స్త్రీల విజయాలను పక్కన నిలబడి చూస్తున్నట్లే ఉంటుంది.

Displaying HYD_2015-03-30_maip9_2.jpg

ప్రకటనలు

6 thoughts on “కొకు నవలల్లో మహిళా ఉద్యోగులు

  1. మల్లీశ్వరి గారు ..కొకు స్త్రీ పాత్రలన్నింటిని జల్లించి మేలిమి ముత్యాల లాంటి మాటలని అందించారు . చాలా శ్రమించారు .ఆ ఫలితం ఇలా అందించిన మీకు ధన్యవాదములు . అన్ని వర్గాల స్త్రీల ఆలోచనలలో వచ్చిన మార్పులని చక్కగా చెప్పింది ఈ పరిచయం .
    నాకు నచ్చిన వాక్యం
    జీవితాన్ని గురించి లక్ష సత్యాలు తెలుసుకుని ఏం ప్రయోజనం ? ఒక్క చిన్న సత్యానికి అనుగుణంగా జీవితాన్ని మార్చే శక్తి లేనపుడు?

    ‘ థాంక్స్ మల్లీశ్వరి గారు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s