సప్త వర్ణ లేఖ – 1

పిట్ట వచ్చి చెట్టుని కొట్టేస్తే…

15-10-2014,

విశాఖపట్నం.

ప్రియమైన విమలా,

గత నాలుగు రోజులుగా కొన్ని వందల హృదయాలు ఎలా ఉన్నావంటూ తోచిన మార్గాల్లో పలకరింపులు పంపాక ఇక ఎవరినైనా ఎలా ఉన్నారంటూ అడగడం నాకే బోలుగా వినిపిస్తోంది. కొన్ని నక్షత్రాల వెలుగు జిలుగుల్లో, జాజిమల్లెల ఫ్రాగ్రెన్స్ తో  ఉల్లాసంగా ఉత్సాహంగా లేఖా పరంపర మొదలు పెట్టాలనుకున్నాను. కానీ కాసిన్ని కన్నీళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాను. సప్తవర్ణలేఖ కదా వివర్ణం కానిది ఏదైనా సరే ఆహ్వానించాలి మరి.

11వ  తారీఖు శనివారం ఎప్పట్లాగే నిద్రలేచి ఆకాశంలో ఏనుగు మబ్బుల్ని చూసి పోదురూ బడాయి అని మూతి విరిచి కాలేజికి వెళ్ళిపోయాను. టివి ఛానెల్స్ నీ పేపర్లనీ చూసి తుఫాను హోరు కన్నా మీ జోరు లావైంది కొంచెం  తగ్గమని మందలించాను కూడా. కాస్త చల్లగా మరి కాస్త వేడిగా ఉన్న వింత గాలులు భయపెట్టినట్లున్నాయి కాలేజి వారు మధ్యాన్నం నుంచీ అందరినీ ఇళ్ళకి పంపేసారు. ఇలా సడెన్ గా ఇళ్ళకి పంపినపుడు పిల్లల కన్నా మాకే ఎక్కువ సంబరం. కానీ బైట పడకూడదు కాబట్టి మెల్లగా అసలు ఉత్సాహమే లేనట్లు ఇంటికొచ్చి రాగానే ముసుగు తీసేసి  మా పిల్లతో కలిసి చిన్నపాటి నృత్యమే చేసాను. గాలిలో చల్లదనం మోపైంది. వెచ్చగా ఇంత వండుకుని తిని పుస్తకం పట్టుకున్నాను. ఈ లోకంలోకి వచ్చేసరికి కరెంట్ పోయింది. ఇన్వర్టర్ లోటు తెలియనివ్వలేదు. ఆ రాత్రి మామూలుగానే గడిచింది.

ఆదివారం ఉదయం దడదడ బడబడ శబ్దాలతో మెలకువ వచ్చింది. కిటికీలకి పెట్టిన బోల్టులు కూడా కదిలిపోతూ ఉన్నాయి. వాటికి గట్టి తాళ్ళు కడుతూ కనిపించాడు చందు. తలుపు తీసుకుని నిద్రమొహంతో కారిడార్ లోకి అడుగు పెట్టానో లేదో బలమైన గాలి తెర ఒకటి కమ్మేసింది. నాకు తెలీకుండానే పక్కింటి గుమ్మం వైపు నెట్టివేయబడ్డాను. అవీ ఇవీ ఆసరా చేసుకుని ఇంట్లోకి వచ్చి పడ్డాను. అది మొదలు 24 గంటల పాటు ఇంటి తలుపులు తీసే సాహసం చేయలేకపోయాము.

నాకు వూహ తెలుస్తున్న వయసులో దివి సీమ ఉప్పెన వచ్చినప్పటి భయానక  వాతావరణం ఇప్పటికీ గుర్తుంది. మా నాన్న పొట్టలో దూరిపోయి పడుకుని ఆయన్ని ఎటూ కదలనివ్వకుండా అంటిపెట్టుకుని తిరగడం, ఇంటిల్లపాదీ బిక్కుబిక్కుమని ఒక చోట చేరి రాత్రంతా గడపడం తరువాత పేపర్లలో హృదయవిదారక మైన దృశ్యాలు చూసి ఝడుసుకుని నాలుగు రోజులు జ్వరం తెచ్చుకోవడం గుర్తొచ్చాయి.

ఇన్వర్టర్ ఆగిపోయింది. టివి మూగబోయింది. సెల్ ఫోన్ల సిగ్నల్స్ పోయాయి. మూసుకున్న తలుపులూ కిటికీల మధ్య క్షణాల లెక్కవేత. గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల మధ్య ఇళ్ళలో క్షణాలు యుగాలయ్యాయి. భయపెట్టేవి మాత్రం అందంగా ఉండవా విమలా ?

స్నిగ్ధ అంది ‘’అమ్మా! ఏం జరుగుతోందో చూడొద్దా ‘’ అని. నాలోనూ ఏదో ఆకర్షణ. సరేలెమ్మని  బాల్కనీ తలుపు తీసి గ్రిల్స్ ని గట్టిగా పట్టుకుని నిల్చున్నాం. మా ఇంటి పక్కనే కొండ ఉంది తెలుసు కదా? మామూలు రోజుల్లో  వర్షం వచ్చినపుడు కొండవైపు చూస్తే సాలీని దారాల వంటి నీటి చుక్కల వరుస అలా సన్నగా జలతారు తెరల మాదిరిగా కదిలిపోతూ   కనిపించేది. అలాంటిది  ప్రొక్లైనర్ తన భారీ ఇనుపహస్తంతో విసురుగా కళ్ళాపి జల్లినట్లు చిందరవందర జల్లులు. గాలి స్పర్శకే కాదు చూపుకూ అందడం తెలిసి వచ్చింది. నష్టం ఏదో జరుగుతోందని తెలుసు. ఊహలు ముందుకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి. గాలి ఎడాపెడా తనతో తనే కలియబడి ఉండచుట్టుకుని ఈల వేస్తూ గుండ్రంగా పైకి లేచినపుడల్లా చెట్ల ఆకులు కొమ్మలూ ఆ సుడిలోకి దూకేవి.

‘’అమ్మా! రేకుల ఇళ్ళ వాళ్ళ సంగతి ఏంటి !! ఇడ్లీ బళ్ళు,బడ్డీ కొట్లు వాళ్ళు ఎట్లా ఉండి ఉంటారు! కొండవాలు ఇళ్ళుఖాళీ చేసారో లేదో , అమ్మా చూడు చూడు కాకి గూడు పడిపోయి గుడ్లు చితికి పోయాయి,అమ్మా ఎదురింటి వాళ్ళ సింటెక్స్ డ్రమ్ము గాలిలోకి లేచింది, అంటూ స్నిగ్ధ ఆర్తనాదాలు చేస్తూ విలవిలలాడుతుంటే  పేరు గుర్తు రావడం లేదు కానీ శరత్ నవలలో ఒక దృశ్యం కళ్ళ ముందు కదలాడింది.   అందులో నాయకుడు ఓడ ప్రయాణం చేస్తున్నపుడు తుఫాను రావడం సముద్రపు అల్లకల్లోలం, తాడెత్తునలేచిన అల ముందు, ప్రకృతి ముందు మనిషి అల్పుడై పోవడం, ఆ స్థితి ఎట్లా ఉంటుందో అనుభవం లోకి వచ్చింది.

హుదుద్ తుఫాను తీరాన్ని తాకడానికీ దాటడానికీ మధ్య నంగనాచి నిశ్శబ్దం. గంట సేపు మాత్రమే. వంటిగంట తర్వాత గాలి దిశ మార్చుకుని వ్యతిరేకంగా వీచడం మొదలైంది. విశాఖలోని మిగతా మిత్రులు, బంధువులు, కుటుంబీకుల క్షేమం కోసం ఆత్రుత, అసలు మాకు ఏం జరుగుతోందో ఎవరైనా చెపితే బావుండునని ఆశ, కానీ తెలిసే మార్గం లేదు. అపార్ట్ మెంట్స్ కూలిపోతున్నాయని పునాదులు కదిలిపోతున్నాయనీ ఎవరో పుకారు మోసుకొచ్చారు. కొబ్బరి మట్టలు రాలినపుడూ, మావిడి కొమ్మ ఫెళ్ళున విరిగినపుడూ, సందు చివరి హోర్డింగ్ కి అతికించిన బానర్ తపతప కొట్టుకుని హోర్డింగ్ నే  వంచేసినపుడూ కరెంట్ వైర్లూ కేబుల్ వైర్లూ చిక్కుముళ్ళు పడి విద్యుత్ స్తంబాలని కూలదోసినపుడూ ఉలికులిక్కిపడుతూ మా అపార్ట్ మెంట్ కూడా కదులుతుందా అని భయపడుతూ చూసుకునేవాళ్ళం . అప్పటివరకూ ఈ విపత్తు అంతా మా వీధికే అనుకున్నాము.

సోమవారం ఉదయాన్నే కలత నిదుర వదిలించుకుని ఆరింటికల్లా బైటకి వచ్చి చూస్తే తెల్లటి వెలుగులో శిధిల విశాఖ, అబ్బూరి చెప్పిన దగ్ధనౌక విశాఖ, ఈ వీధి ఆ వీధి పిచ్చిగా తిరుగుతూ అయ్యయ్యో  మోడువారిన  కైలాసగిరి, ఇటు చూడు కళ తప్పిన అంధ్రవిశ్వకళాపరిషత్తు , అటు చూడు ఆ కూడలి మద్దిలపాలెమేనా!! జూ లో చెట్లన్నీ ఎవరు నరికారు!! విశాఖ నగరానికి ఆకుపచ్చని ఒడి పరిచిన కొండలన్నీ ఆకులు దూసిపోసినట్లు బోసిపోయాయి. కొండవాలు ఇళ్ళకి పరుగులు పెడితే రేకులు ఎగిరిపోయిన మొండి గోడల ఇళ్ళ ముందు పడిన చెట్టు కొమ్మల్నీ చెత్తనీ రేకుల్నీ  నిర్వికారంగా శుభ్రం చేసుకుంటూ, మార్గం చూపిస్తూ శ్రామికజనం.

హుదుద్ అంటే ఏదో భాషలో పిట్ట అని అర్ధం అట ! మరి పిట్టే వచ్చి చెట్లను కొట్టేయడం ఏవన్నా బావుందా విమలా!? సోమవారం సాయంత్రానికి ఏదోలా మార్గం చేసుకుని వర్మ ఇంటికి చేరుకున్నాము. మిత్రుడు  నారాయణ వేణు కూడా అదే సమయానికి అక్కడికి చేరుకున్నాడు. పిల్లాజల్లలాదిగా అందరం రోడ్డు మీదకి చేరాము.

ముని మాపు వేళ… నాలుగు వైపులా కూలిపోయిన చెట్లు, ఎదురుగా శిధిలమైన పార్కు. ఇళ్ళ మీద పడిన చెట్లని తొలగించడానికి నానా తంటాలూ పడుతున్న కుర్రాళ్ళ మాటలూ, సన్నగా ముసురుకుంటున్న చీకట్లు, అదో రకం ఉక్కపోత.  గుండెల్లో గుబులు దిగులు, 48 గంటలుగా అలవాటైన సన్నని గాలి హోరు వంటి భ్రాంతి మధ్య ఒక దృశ్యం చూసాను విమలా!!

వందలాది కాకులూ కొంగలూ గోరువంకలూ నేను గుర్తుపట్టలేని జాతుల పిట్టలనేకం రకరకాల అరుపులతో అయోమయంగా ఆకాశంలో గిరికీలు కొడుతున్నాయి, మధ్య మధ్య విరిగిన కొమ్మల మీదా ఒరిగిన విద్యుత్ స్తంభాల మీదా వాలబోయి పట్టు దొరక్క గోలగోలగా అరుస్తూ గూళ్ళ కోసం వెతుక్కుంటున్నాయి. నాకే గానీ శక్తి ఉంటే వాటి కోసం క్షణాల్లో పూలవనాలో, దట్టమైన అడవులో నిర్మించి ఉండనా!? చప్పున పక్కకి తిరిగి చాటుగా కళ్ళు తుడుచుకోవడం తప్ప ఈ నిష్క్రియాపరురాలు ఏమి చేయగలిగింది!. ప్రియాతి ప్రియమైన గురజాడా! దేశమంటే మట్టి కాదు మనుషులని ఎరుక చెప్పినపుడు అవును కదా అనుకున్నాము. మరి  నగరమంటే ఒట్టి మనుషులేనా!

నారాయణ వేణు తన  సోదరి పెంచిన పిచ్చుకల ముచ్చట ఒకటి చెప్పారు. చిన్నతనాన్ని వెలిగించి ఇపుడు దాదాపుగా కనుమరుగైపోతున్న సమయంలో ఎలానో మరి రెండు పిచ్చుకలు రోజూ తన సోదరి వాళ్ళింటికి వచ్చేవట. వాటికి గంట్లూ బియ్యం గింజలూ వేసి, మట్టి మూకుళ్ళలో నీరు పోసి వాటిని సాకి రెండింటిని కాస్తా ఇరవై  చేసారట. తుఫాను రోజు అవి బుద్ధిగా రెండు ఇళ్ళ మధ్య ఖాళీగా ఉన్న గట్టు మీద కూచునే ఉన్నాయట. చూస్తూ ఉండగానే రాకాసి గాలి తోసుకురావడంతో చెల్లాచెదురై ఎగిరిపోయాయి. రెక్కలు సరిగ్గా చాచుకుని ధీమాగా ఎగరడం రాని నాజూకు పిట్టలు కదా పిచ్చుకలు. ఎగరలేక ఏ గాలివాలుకి పడి కొట్టుకుపోయాయో మరుసటి రోజు తిండి సమయానికి తొమ్మిదే వచ్చాయట. పిల్లల వలే పెంచిన పక్షులు ఏమయ్యాయోనని ఆమె బెంగపడుతోంది.

మురళినగర్ లో ఉండే చందు వాళ్ళ పుట్టింటికి చేరుకునే సరికి అదొక విషాదం. రాత్రంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపామని అత్తయ్య మావయ్య చెపుతుంటే చందు కళ్ళల్లో నీళ్ళు. ఇద్దరమూ గిల్టీతో మాటలు మరిచిపోయాము. మా వైవాహిక జీవితం తొలి దశాబ్దానికి, దానికి ఉండే అనేక రంగుల జ్ఞాపకాలకి మూలమైన రెండతస్తుల మేడ మీది గది కుప్పకూలిపోయింది. గది తలుపులూ కిటికీలు పై కప్పు, లోపల ఉండే సామాను. ఆనవాలు దొరకని శిధిలాల కుప్ప మా ప్రేమ మందిరం.

సరే… అందరూ చెప్తున్నట్లు విషాదం గురించి కన్నా దాని నుంచి కోలుకోవడం గురించి మాట్లాడమే ముఖ్యం. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో నేర్చుకున్నంత కృతకంగా ఆత్మవిశ్వాస ప్రకటనలు చేయలేము కదా. వేగం అలవాటైన లోకానికి ప్రతీది వేగంగానే జరగాలి. విపత్తులు కురిపించిన విషాదమూ వేగంగానే సమసిపోవాలి. ఏం జరగనట్లు హుందాగా మెలగాలి . లేకపోతే రేసులో వెనకబడిపోమూ! బేలనో అబలనో ఏమైనా అనుకో విమలా కాస్త ఊరట దొరికేవరకూ కరువుతీరా ఏడవాలని ఉంది. ఎప్పట్లా నగరమూ కాలుష్యమూ మానవ తప్పిదాలూ అంటూ ఎగిరిపడాలని అస్సలు లేదు. బిడ్డల్ని కొట్టి మళ్ళీ తనే దగ్గరకి లాక్కుని దుఃఖించే అమ్మలా అనిపిస్తోంది విశాఖ నగరం.

చందు అంటే నాకు ఆకర్షణ కలగడానికి తను విశాఖలో పుట్టి పెరగడం కూడా ఒక కారణం అని చెప్తే తను చాలా ఉడుక్కునేవాడు. ఈ చోటంటే అంత పిచ్చి నాకు. వ్యక్తిగత నష్టం పెద్దగా నొప్పించేది కాదు కానీ ఇక బతికినంతకాలం విషాద నేపథ్య గానంలా కోల్పోయిన వాటిని వెంటేసుకు తిరగక తప్పదేమోనన్న దిగులూ, అంతలోనే శ్రమించే ఇక్కడి ప్రజల తత్వం మీదా, సాంకేతికతని సమర్ధవంతంగా వాడే నవతరం మీది ఆశా, పునర్ నిర్మాణం మీద భరోసాని ఇస్తున్నాయి.

ఎంతో మంది సాహితీ మిత్రులు, చిన్నప్పటి  స్నేహితులు, బంధువులూ, పూర్వ విద్యార్ధులూ మా క్షేమం తెలుసు కోవడం కోసం తపన పడ్డారు. నీకు రాస్తున్న ఈ లేఖ ద్వారా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మిగతా సమాజమూ మన  ప్రియ సాహిత్యం గురించి ఏవైనా చెప్పవూ విమలా!

డిల్లీ సదస్సు తర్వాత డిల్లీ నుంచి ఆగ్రా వస్తున్నపుడు బస్సులో మనందరం పాడుకున్న విప్లవ జానపద గేయాలూ ప్రేమపాటలూ…గుర్తున్నాయా? గొంతెత్తి పాడటం నాకు ఎపుడూ సిగ్గుగా ఉండేది. ఆ రోజు  ఏదో  కొత్త శక్తి వచ్చినట్లే నీతో గొంతు కలిపి పాడాను. బహుసా నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు.

సాహిత్యంలో నీ రెండవ రాకడ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. చాలా రోజులుగా అడగాలనుకుంటున్నాను… ఈ విషయమై నిన్ను  ప్రత్యేకంగా మూవ్ చేసిన అంశాలు ఏవన్నా ఉన్నాయా విమలా? ఎందుకంటే ఇపుడు కథలూ కవిత్వమూ రెండింటి మీదా సమాన మైన ప్రేమతో కొత్త ఉత్సాహంతో రాస్తున్నావనిపిస్తోంది.

నీ నుంచి రాబోయే ఉత్తరం కోసం నెల రోజులు ఎదురు చూడాలి. ఎదురు చూపులు మనం కోరుకున్నవే కనుక ముద్దుగానే ఉంటాయి. ఉండనా మరి?

మల్లీశ్వరి.

 

 malleswari

malleswari (1)

malleswari (2)

ప్రకటనలు

12 thoughts on “సప్త వర్ణ లేఖ – 1

 1. హుదుద్ గురించి మీ మంచి భాషలో బాగా తెలియచేసారు. విశాఖలో పుట్టిపెరిగిన, అన్దులొనూ యరదకొండ పక్కన, విసాకంటే ఎనలేని ప్రేమ. అందుకే జరిగిన ధ్వమ్సమంటే విచారం.

  • తృష్ణ గారూ
   థాంక్ యూ
   మొన్న కారా మాస్టారి మీటింగ్ లో రజనీ కాంత రావు గారి అబ్బాయి కనిపించి పలకరించారు.మల్లీశ్వరిని వారింట్లో ఎలా తలచుకుంటారో చెప్పారు.ఎందుకో ఈ విషయం మీకు చెప్పాలనిపించింది. మనకి రజని సంగీతం కామన్ ఇంటరెస్ట్ కావడం వల్లనేమో

 2. I am sorry to check how you are? As you do not respond to my mails, I am not forwarding nails and your name is completely switched from my mind. I am sorry. I hope you are all doing alright and recovered from great shock. I thought about Vijji and your parents, but my mind became blank about you.

  Wish you speedy recovery from the all the shock and agony of hud hud cyclone. D Madhusudana Rao

 3. ఇది ఇవాళే చూస్తున్నాను.12 వ తేదీన నేను పళని లో ఉన్నాను,తీర్థ యాత్రలలో. ఆ రో జు ఉదయం నుండి తుఫాను హెచ్చరికలను గురించి వింటూ ఆందోళన తో 10 గంటలకు శ్రీకాకుళం లోని మా మేన మామయ్యగారితో మాట్లడిందే ఆఖరు తర్వాత మరి లైన్లు దొరక లేదు..విశాఖలో బంధు మిత్రులనేకులుండడమే కాకుండా అక్కడే చదువుకున్న వాడిని కనుక విశాఖతో విడలేని అనుబంధం ఉన్న వాణ్ణి. విశాఖలో ఆ రోజు మీరు ప్రత్యక్షంగా అనుభవించిన దాన్ని మీరు చెబుతుంటే తెలిసింది. మన మీడియాలో సరైన కవరేజీ రాలేదనిపిస్తోంది. మీ లేఖ బాగుంది.

  • గోపాల కృష్ణ గారూ
   ప్రత్యక్షంగా అనుభవించిన విషాదం ఒకటైతే దూరంగా ఉండి టీవీ లలో చూస్తూ ఉన్న వారు ఎంత ఆందోళన చెంది ఉంటారో కదా
   మీడియా వార్తలను ఆవిష్కరించగలదు హృదయాలను కాదు మరి ఏం చేస్తాం 😦

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s