వేలాది కెంపుకంటి కోయిలల రొద

1908421_699290773458725_4570868109072651916_n

”గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం

తరలింది తనకు తానే ఆకాశం… పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే తన వాసం…వనవాసం”  పాట టివిలో వస్తున్నపుడు గభాలున కళ్ళు మూసుకుని చెవులకు పని పెడతాను. అడుగడుగునా ధనాతిశయాన్నీ, పనివాళ్ళని కాళ్ళతో తన్నుతూ పండించే అపహాస్యాన్నీ వంద స్ప్రింగులు ఒక్కసారే  మింగేసినట్లు మునివేళ్ళ మీద ఎగురుతూ అభినయించే   ఆ  పరమ వికారపు నటుడిని చూడలేక రాసిన కవిని తల్చుకుని దుఃఖపడతాను.
ఈ  మధ్య ‘తేరా నామ్ ఏక్ సహారా?!’  ‘naresh nunna new book’ అంటూ రకరకాల పేజీలతో ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తున్న నున్నా నరేష్ అనబడే పండితుడిని చూసాక, దుఃఖాన్ని ఉపశమింపజేస్తూ పై పాట సులక్ష్యార్ధ సిద్ధిని పొంది మరీ గుర్తొచ్చింది. అందుకే ఆకాశమై , నగమై… ఏ నీలిమబ్బు కోసం, ఏ  నీటిచుక్క కోసం ఇలా అంతర్జాలంలో తనకలాడుతున్నావని అడగబుద్ధేసింది. పోతే మానే ఈ అభినయాన్ని మాత్రం కళ్ళు విప్పార్చి చదవాలనిపిస్తోంది.
అపరిచితాన్ని బహుమతిగా అందుకున్నాక……. చదివాక వెంటనే ఏదొకటి రాసెయ్యాలన్న ఉద్వేగం ఏమీ కలగలేదు కానీ ప్రణయ కవిత్వం మీద క్లాసులో పాఠం చెపుతుంటే ముసిముసి నవ్వుల పిల్లల మధ్యకి నన్ను నెట్టేసి ఈ ఆధునికోత్తర భావకవి దూసుకొచ్చాడు. స్వచ్ఛంద ప్రణయం వియోగ శృంగారం విషాద మాధుర్యం ప్రేయసీ పూజ్యత  నా కన్నా ఎవరికి బాగా తెలుసునంటూ సవాల్ విసిరాడు. ఓకే ఓకే… ఒప్పేసుకున్నాం. కానీ అంత మాత్రమే కాడు కదా ఈ కవి రచయిత.. అంత మాత్రమే  కాని దానిలో కొన్ని విషయాల మీద నాకు పేచీ ఉన్నది కదా! బరి లోకి దిగితిమా అశ్శరభశ్శరభమంటూ వీరంగం వేయవలె. మరి ఇటు చూస్తే నానా దేశాల,కాలాల జాతుల సాహిత్యాన్నివిరగ చదివేసి తెగ ఉటంకింపులు చేయగల ఉద్ధండ పిండం. మనమా అంతంత మాత్రం…ఇతనితో మనకేలా.. కొంచెముండుటెల్ల కొదవు కాదు లెమ్మనుకుని కాస్త వినమ్రంగా సణగడానికి ప్రయత్నిస్తాను
ఏందివయ్యా నరేషూ నీ భాష చేసే దాష్టీకం!
అసలే స్త్రీలు తియ్యని వారు. వారికి అలంకారాల తేనె పూస్తావు. క్రొంగొత్త భావనల కోవా అద్దుతావు పనసతొనలు పంచదారలు పాల మీగడలు చెరుకురసాల  సారాన్ని లేపనం వలే రాస్తావు. దానికే చేదెక్కిపోయి ఉంటామా!ఒక పేజీ కాదు ఒక పేరానో ఒక వాక్యమో కాదు ఒక పదమూ కాదు ప్రత్యక్షరం లోనూ మొహం మొత్తే తీపి. ఝడిసి పోయిన  పాఠకులు పెడకన్ను వేస్తారన్న భయమూ లేదాయే.
అద్సరే గానీ నరేషూ
నచ్చని విషయాన్ని హీన పరిస్తే తప్ప మనం చెప్పేది తళతళ మెరవదంటావా?
మీ ప్రవాసి గారి ‘మార్క్సిస్టేతర తత్వబోధనం’ ఎలివేట్ కావడానికి ‘కరుడు కట్టిన వామ పక్ష మేధో నియంతృత్వాల చెలాయింపు, ‘కుడి – ఎడమ దొమ్మీ రాజకీయాల’ మీద ఒక వెక్కిరింత కావలసి వచ్చింది. నాగార్జున తన హీరోయిజం బాగా ఎలివేట్ కావడానికి బలమైన విలన్ ని ఎంచుకున్నట్లుగా లేదూ! హీరోలూ విలన్లూ తెగ పాత్రలు మార్చుకునే లోకంలో మీ విలన్ నాకు హీరో కావొచ్చు కూడా కదా. శత్రు వైరుధ్యాల పట్ల తీవ్రమైన సహనం, మిత్ర వైరుధ్యాల పట్ల ఓపలేని అసహనం చూస్తుంటే దిగులు పుట్టి ఇలా గొణుక్కోవాల్సి వచ్చింది నరేషూ..
‘ప్రేమయూ మతమేనంటాడు సౌదా’ ,స్త్రీ సౌందర్యమూ మతమే కాబోలును.అట్లాగైతే ఈ కవి రచయిత  ‘స్త్రీ సౌందర్య మత ఛాందస వాది’ అని తిడితే ఇపుడు ఈ నున్నా నరేష్ నా మీద కోపగిస్తాడా ఏమి!  అవును గానీ పుస్తకం చదవగానే  he is every body and at the same time no body  అనిపించింది ఎందుకంటావూ!
అపరిచితం లో ఇది చాలా బావుంది…అది చాలా బావుంది  భలే రాసావంటూ భుజం తట్టే సాహసానికి పాల్పడను. ఇంద్రజాలికుడి కనికట్టు నుంచీ  మంత్రగాడి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల నుంచీ ఛెంగుమని అవతలికి గెంతి మరీ చదివినందుకు గానూ నా భుజం నేనే తట్టుకుంటున్నాను.
అయిననూ చెప్పి తీరాలి
కుచ్చులమీను నీళ్ళలో బరువుగా తోకాడించిన ఒయ్యారం
భయద సౌందర్యపు కాటుక చీకటి గుయ్యారం
ఈ పుస్తకం
ఏం ?
ఒక పుస్తకం చదివితే అయితే స్నేహమో లేదా వైరమో మాత్రమే కలగాలా!
నాకు మాత్రం రెండూ కలిసిన వైరస్నేహితం ఈ అపరిచితం
ప్రకటనలు

6 thoughts on “వేలాది కెంపుకంటి కోయిలల రొద

  1. మీ వైరస్నేహిత పరిచయం బాగుంది. నేనింకా పుస్తకం చదవలేదు కాబట్టి మాటాడకూడదు కామోసు. కానీ, స్త్రీని సౌందర్యానికే వదిలేసి పడదోసే సాహిత్యం వారికి వారితో పాటు మిగతా జీవులకు మంచి చేయదన్నది నా అభిప్రాయం. ఇంతకంటే ఇప్పటికి గప్ చుప్ మల్లీశ్వరి గారు..

    • సౌందర్యం అన్నది చాలా విస్తృతార్ధంలో వాడతారు నరేష్. అందుకే మతం అని కూడా అన్నాను. తన రచనల్లో స్త్రీలు ఎవరని వెతకడం గురించి ఎవరో ప్రస్తావించారు. నిజానికి తన రైటప్స్ నాలుగైదు చదివితే అర్ధమైపోతుంది. ఆలంబన కోసం భౌతిక రూపాల ప్రస్తావన తప్ప స్త్రీ తనకి సర్వనామం అనిపిస్తుంది నాకు. మంచి చెడుల ప్రస్తావన ఎలా ఉన్నా స్వీపింగ్ గా వ్యాఖ్యానించ సాధ్యం కాని స్కాలర్ తను.

    • ఇంకా వాచ్యం చేసి చెప్పడం ఏం బావుంటుంది! తన పొలిటికల్ స్టాండ్ (అసలు రాజకీయాలే లేవని అరాజకీయంగా కూడా ఉండగలరు 🙂 ) నచ్చదు. కానీ నేనొక సాహిత్య విద్యార్ధిని కూడా కనుక నరేష్ పాండిత్యం చూస్తే అబ్బురపాటు. తప్పించుకు తిరిగే లౌక్యమే ఉంటే ఏదొకటి రాసి తిట్లు తింటూ ఉంటానా చెప్పండి రాఘవా ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s