పన్నీరు శశి

Picture 049.jpg

బ్లాగర్ పేరు;శశి కళ.వి 

 

బ్లాగ్ పేరు;ఇది శశి ప్రపంచం 

 

బ్లాగ్ చిరునామా;itissasiworld.blogspot.com

పుట్టిన తేదీ;

పుట్టిన స్థలం;

ప్రస్తుత నివాసం;నాయుడుపేట,నెల్లూరు జిల్లా 

చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)

విద్యాభ్యాసం;MSc,MPhil,BEd.

వృత్తి, వ్యాపకాలు;P.G.Teacher in mathematics

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;1/05/2011

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);157

బ్లాగ్ లోని కేటగిరీలు;13

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

సిస్టం వచ్చిన కొత్తల్లో ఏవైనా మంచి రచనలు చూసినపుడు పత్రికలకు అభిప్రాయాలు పంపేదాన్ని.అప్పుడు అలాగే పూడూరి.రాజిరెడ్డి గారికి 
పంపినపుడు ఆయన మీకు ఇంట్రెస్ట్ ఉంటె నా బ్లాగ్ చూడండి అని ఐడి పంపారు.ఆయనెవరో నాకు తెలీదు.కాని ఇలాగా ఒక బ్లాగ్ లో 
రచనలు అన్నీ చూడడం నాకు ఇది   చాలా మంచి మాధ్యమం గా అనిపించింది.అక్కడ అన్నీ క్లిక్ చేసి చూసుకుంటూ నేను కూడా  బ్లాగ్ మొదలు పెట్టాలి అనుకున్నాను.

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
ముందు నాకు ఎలా వ్రాయాలో తెలీలేదు.కాని ఏదో ఒకటి తెలుసుకుందాము అనినెట్ సెంటర్ కి వెళ్లాను.వాళ్ళు మాకు ఫ్రెండ్స్.అక్కడ కూడా ఎవరికి బ్లాగ్ తెలీదు అని చెప్పారు.
నేను నిరాశగా కూర్చొని ఉన్నప్పుడు పక్కన ఒక అబ్బాయి  కంప్యూటర్ ముందు ఉన్నాడునాకు ఎందుకో అతనిని అడిగి చూద్దాము అనిపించింది.నాకు బ్లాగ్ కావాలి 
మీకు తెలిస్తే చెపుతారా?అని అడిగాను.ఆతను వెంటనే బ్లాగ్ ఓపెన్ చేసి పోస్ట్ లు వేయడం నేర్పించాడు.ఆ అబ్బాయి పేరు షాజహాన్.
బిటెక్ లో క్యాంపస్ లో జాబ్ వచ్చి చేరడానికి చెన్నై వెళుతూ ఆ కంప్యూటర్ సెంటర్ వాళ్ళతో రెండు గంటలు గడపడానికి వచ్చాడు.
ఆతను మెడిటేషన్ లో పెద్ద డాక్యుమెంటరీ లు తీసే మాష్టర్ గారు అని తెలిసి నాకు భలే సంతోషం వేసింది.చిన్న పిల్లలు ఇలాగే 
వినయంగా ఉండాలి అనుకొని అతనికి కృతఙ్ఞతలు చెప్పాను.
 
బ్లాగ్ మొదలు పెట్టాను.కాని ఏమి తెలీదు.అప్పుడే” వైలెన్ ”పోస్ట్ కి ‘కొత్త పాళీ”గారు ”ఇందు”ఇలా చాలా మంది కామెంట్స్ పెట్టారు.
వారికి ఎలాగా సమాధానం వ్రాయాలో కూడా అర్ధం కాలేదు.(ఇప్పుడు అదేముంది అనిపిస్తుంది కాని అప్పుడు అది సమస్యే)
 
అప్పుడు రాజ్ కుమార్.నీలం బ్లాగ్ చూడటం జరిగింది.నాకు ఇలాగా రావడం లేదు కొంచెం హెల్ప్ చేస్తారా అని కామెంట్ 
పెట్టాను.అప్పటి నుండి ఆతను,అతని ఫ్రెండ్స్, చెట్టు మీదకు ఒక్కో చిలక వచ్చి చేరినట్లు కిల కిలా రావాలే….అందరూ  సహాయం చేసేవారు.
తరువాత వలబోజు.జ్యోతి గారు కూడా రచన లో మంచి సలహాలు ఇచ్చేవారు.అందరికి ఇప్పుడు కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నాను .
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?
చాలా ఉన్నాయి.మనం చాలా విషయాలు పంచుకోవాలి అనుకుంటాము.అలాగే తెలుసుకోవాలి అనుకుంటాము.ప్రతీది పత్రికల వాళ్ళు వేయలేరు కదా.
దీనిలో అందరితో పంచుకోవచ్చు.ఇది దేశ విదేశాల మధ్య తెలుగు వారధి.కాని పంచుకునేటపుడు చదివే వారిలో అన్ని రకాల వారు 
ఉంటారు.ఎవరి గౌరవాన్ని భంగపరచకుండా మన అభిప్రాయాలు సహేతుకంగా తెలియచేయడం మంచిది.మన అభిప్రాయాన్ని రికార్డ్ చేస్తునాము అనే ఎరికతో 
చేస్తే మంచిది.
 
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
సామాజిక విషయాలు,రాజకీయాలు అందరు వ్రాస్తారు.కాని ఒక ఇల్లాలిగా ,భార్యగా అనుబంధాలను గూర్చి ఆడవాళ్లే బాగా వ్రాయగలరు అనుకుంటూ ఉంటాను.అందరిలాగే నేను. 

సాహిత్యంతో మీ పరిచయం?
చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు అమ్మా నాన్న ల నుండి వచ్చింది.ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.అమ్మ అప్పుడప్పుడూ దేవుని  పాటలు వ్రాస్తూ ఉంటారు.
కొత్త కధలు అల్లి చెపుతూ,మమ్మల్నీ చెప్పమని ప్రోత్సహిస్తూ ఉంటారు.పదో తరగతి నుండే కధల పుస్తకాలకు చాలా కాదు కాని కొన్ని వ్రాయడం అలవాటు.అవి స్నేహితుల తల్లి తండ్రులకు చూపినప్పుడు 
వాళ్ళు భలే మెచ్చుకొనేవారు.ఇప్పటి సంగతి అంటే…..కవితలకు జిల్లా,రాష్ట్ర స్తాయి లో బహుమతులు వచ్చాయి.
జిల్లా సాంస్కృతిక శాఖ వారిచే ఉగాది సన్మానాన్ని కూడా పొంది ఉన్నాను.ఇంకా వివిధ పత్రికలలో ఆర్టికల్స్ వచ్చి ఉన్నాయి.
”జాబిలి  తునకలు” మొదటి కవితా సంకలనం.”దశ దిశలు”మిగిలిన మిత్రులతో కలిసి వెలువరించాను.త్వరలో నానీల ప్రక్రియ మీద ”స్వర్ణ ముఖీ సవ్వడులు”వెలువడనుంది.
 
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
స్త్రీగా అని కాదు కాని ఉద్యోగినిగా టైం అనేది చాలా ఇబ్బంది.మాది గురుకుల పాటశాల కాబట్టి పిల్లలు అక్కడే ఉంటారు.ఆదివారాలు కూడా పనిచేయాల్సి వస్తుంది.టెన్షన్ కూడా 
అదే స్తాయిలో ఉంటుంది.ఒక రకంగా నా రచనా వ్యాసంగం నత్త నడక నడవడానికి అదే కారణం.కాని నా రచనలు,బ్లాగ్ నాకు టెన్షన్ రిలీఫ్ గా పనిచేస్తున్నాయి.ఇక ఇల్లాలి పని ఎలాగు ఉంటుంది.
కొంచెం మా పిల్లలను కూడా గమనించుకోవాలి కదా.ఇంత కంటే పెద్దగా ఇబ్బందులు లేవు.కాకుంటే ఏదైనా టెక్నికల్ సహాయం కావాల్సినపుడు 
ఎవరిని అంటే వారిని ఎలా అడగగలం ,ఆడవాళ్ళం కదా అనిఅనిపిస్తూ ఉంటుంది.ప్లస్సర్స్ బాగానే సహాయం చేస్తారు కాబట్టి కొంత వరకు పరవాలేదు.
 
జీవన నేపధ్యం?
అమ్మా ఇల్లాలు.నాన్న వ్యాపారస్తులు.దైవ భక్తీ ,సంస్కారం కలవాళ్ళు.వాళ్లకు మంచి పేరు తేవాలి అనుకుంటూ ఉంటాను.శ్రీ వారు టీచర్ .కాబట్టి వృత్తిలో,ప్రవృత్తి లో కూడా సహకరిస్తూ ఉంటారు.
పాప,బాబు ఇంజినీరింగ్ చదువుతున్నారు.

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
వీలైనంత కాలం 

సరదాగా ఏవైనా చెప్పండి?
అడగాలే కాని,వినాలే కాని నా అంత చక్కగా కబుర్లు చెప్పేవాళ్ళు ఇక ఉండరు(గొప్ప కాదు.నిజం గానే నా కబుర్లు వింటే టెన్షన్ పోతుందని 
ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ అడుగుతుంటారు).కాబట్టి ”చెప్పమని నన్ను అడగవలనా….వినేవాళ్ళు ఉంటె చెప్పనా?”
 
ఒక విషయం చెపుతాను.మీకు  ప్రైజ్ లు వచ్చాయి అని,ఫ్రెండ్స్ చేసుకోమని కొత్త మెయిల్ ఐ.డి ల నుండి మెయిల్స్ వస్తే ఓపన్ చేయవాకండి.
తరువాత వైరస్ లు వస్తే మీ సిస్టం అంటిబయోటిక్ లకు మీ జేబు చిల్లు పడిపోతుంది.

సీరియస్ గా ఏవైనా చెప్పండి?
చరిత్ర లో నాకు నచ్చని పదం సీరియస్ గా చెప్పడం.సరే అడిగారు కాబట్టి చెపుతాను.”ఏ విషయం అయినా తెలీక పొతే తెలీదు అని ఒప్పుకోవడం బెటర్ 
అప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పే అవకాశం ఉంది.లేకుంటే అంత మంచి అవకాశం మనం కోల్పోతాము.”
 
మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు
మూడు…
 
నాకు ఏవి మంచివో తెలీదు.ఒక సారి జ్యోతిర్మయీ గారు ఈ పోస్ట్ బాగున్నది అన్నారు.

అకటా…ఏమంటిరి……ఏమంటిరి……

 
ఎమంటిరి?ఎమంటిరి?
రేణుకా చౌదరి గారు ఎమంటిరి?
 
“ఇదేమన్నా ప్రెషర్ కుక్కర్లో  వంటనా?అనియా?”
 
హెంత మాటా…..యెంత మాటా…….
 
ఇది ప్రాదేశిక వివాదము  కాని మా శక్తి వివాదము  కాదె ….
కాదు అదే నందురా….మా ప్రెషర్ లేకుండా ఈ రాష్ట్రం లో ఏ 
పనైనా జరుగునా….వాని గురువు ఢిల్లీ మాటేమిటి…..అక్కడ 
కూడా వెనక నుండి ప్రెషర్ పెడుతుంటేనే మాటలు బయటకు 
వస్తున్నవి కదా……………
 
అన్నియునూ కనపడని ప్రెషర్ తోనే జరుగుతుండ……….
నేడీ కుక్కర్ …..కుక్కర్ అని తేలిక మాటలేల………….
 
మరి మదీయ గొప్పదనము మీ కెరుక  అయిన అటుల వచింపబోదురు కదా?
 
సఖి….నా ప్రాణ నెచ్చలి …..శశి కళ…….మదీయ గొప్పదనము శతదా….సహస్రదా
….సహస్రదా……లక్షదా……..లక్షదా….కోట్లదా…… వీరికి వివరింపుము……..
 
అటులనే సఖా……..వినుడి ..వినుడి ….కుక్కర్ గాధా……వినుడీ మనసారా………
 
                           ఎవరిని ఎలా ఉడికించాలో 
                            బాగా తెలుసు ………..
                            కుక్కర్ తో 
                             సావాసం………….
 
మరి కుక్కర్ లేక పొతే యెంత మంది లేత వంటగాళ్ళు(ఆడ వాళ్ళ ను ఏమనాలో)
కు చేనక్కాయలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
మొక్కజొన్నలు ఎలా ఉడక పెట్టాలో నేర్పేది ఎవరు?
పప్పు ఎలా వండాలో……అన్నం ఎలా చిమడ పెట్టాలో 
నేర్పేది ఎవరు?ఎవరు?ఎవరు?…………………………..
 
                          గ్యాస్  బడ్జెట్ 
                           కిందకు దిగింది 
                           ప్రెషర్ ఉంటె 
                           అంతే………….
 
 
గ్యాస్ సబ్సిడీ లో కోత పెడుతూ……ఆరు సిలిండర్లె అని 
అరిచి గీ పెడుతూ…….ఉడకని అన్నం …….నానని పప్పు 
జాలిగా చూస్తూ…..కట్టెలు కొట్టుకొని బతకాల్సిన పరిస్తితిలో …….
ఆడవాళ్ళను ఆదుకున్నది ఎవరు?ఎవరు?ఎవరు?
 
                       వంట 
                       తగలడింది…….
                       కుక్కర్ 
                       లేక………..
 ఒక పక్క వంట…..ఒక పక్క పిల్లల తంటా…..
శ్రీవారి ఆకలి మంట…..తకదిమి తొమ్…..తకదిమి తొమ్….
కదాకళి  ,   కూచి పూడి చేస్తుంటే……వంట మాడకుండా ఆడవాళ్ళను 
కాపాడింది ఎవరు?ఎవరు?ఎవరు?
 
                        అన్ని తనలో 
                       ఇముడ్చుకుంటుంది….
                       ఇల్లాలి 
                       ప్రేమ కోసం…………
 
శ్రీవారికి అన్నం సరే….బాబుకి పప్పు సరే…..తాతకి తాలింపు సరే……
పాపకి కంకి సరే…….ఎన్నున్నా…..ఏమి తెచ్చినా……నీ సుఖమే 
నే కోరుకున్నా …….నీ కోసమే నే ఉడుకుతున్నా…..అంటూ 
అనుక్షణం తన నెచ్చెలి సుఖం కోరుకునేది ఎవరు?ఎవరు?
                      మొగుడి ముందే 
                    విజిల్ వేస్తుందే……
                     ఆడవాళ్ళ సప్పోర్ట్ 
                     ఉందిగా………….
 
అమ్మ రేణుక ఎంతంటే…..యేమని చెప్పను….కుక్కర్ గొప్పదనాన్ని….
శ్రీమద్రమా రమణ గోవిందో…..గోవింద………
 
ఇంకా మాకేంత  ఇష్టమంటే………
 
“లామి లామినా…..జాన్ కారేగా……జింగా…..జింగా…….
లామి లామినా……హే…హే…..వక్క……వక్కా ……హే…హే….
it is the time for aaaaafricaaaaaaaaaa……………..”
 
(ఏమి అర్ధం కాలేదా?అది మా బాబుకు ఇష్టమైన పాట అన్న మాట.
వాడికి నిద్ర వచ్చేదాకా మేము కూడా చచ్చినట్లు వినాల్సిందే……..
పాపం బాబుకి ఎన్నేళ్ళు అంటారా?చిన్న పిల్లాడే ……సీనియర్ ఇంటర్….)
 
మా బాబుకి ఆ పాట యెంత ఇష్టమో…..నాకు కుక్కర్ అంత ఇష్టమన్న మాట.
 
కాబట్టి కుక్కర్ ని గాలితో పని చేస్తుందని గాలి తీసిపారెయ్య కండి.
 
కుక్కర్ లేనిదే సగటు ఇల్లాలికి నిమిషం గడవదని గుర్తించండి……..
 
ఇక మేమిద్దరం కలిసాము అనుకోండి…………
 
రావే చేద్దాం ……..భాండియా…….జరా 
లొట్టలు వెయ్యదా ఇండియా …………
 
మీ మాటలు వెనక్కు తీసుకొని కోట్ల మంది ఇల్లాళ్ల 
అభిమాన దనాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాము………
 
 
 
 

18 thoughts on “పన్నీరు శశి

 1. శశి కళ గారు మీరు బ్లాగు లలో కన్నా జి+ లో బాగా సంచరిస్తారు . మల్లీశ్వరి గారి మాటే నామాట. ఇకపోతే మీరు బ్లాగ్ లలో కన్నా బయటే చాలా ఫేమస్ ! కాస్త విరివిగా ఇక్కడ కూడా వ్రాస్తూ ఉండండి
  మీదైనా శైలిలో మీ పరిచయం చాలా చాలా బావుంది. అభినందనలు .

 2. శశి గారు, మీ అనుభవాలు చాలా బాగున్నాయండి. ఎంతో వివరంగా, సరసంగా వివరించారు.

  మల్లీశ్వరి గారు, మొత్తానికి శశి గారితో చక్కటి కబుర్లు చెప్పించారు.

 3. ఇంటర్వ్యూ బావుందండీ.
  శశిగారు, చాలా విషయాలు ప్రస్తావించారు. మీ పోస్టులు నిత్యం ద్విగుణం బహుళం కావాలి!
  ఇలా బ్లాగర్ల అంతరంగాన్ని ఆవిష్కరించడం బావుంది.
  ఇద్దరికీ అభినందనలు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s