మోహ మకరంద – నిషిగంధ

Nishigandha Image Courtesy: Nishigandha
 
బ్లాగర్ పేరు: నిషిగంధ
 
బ్లాగ్ పేరు: మానసవీణ
 
బ్లాగ్ చిరునామా: http://nishigandha-poetry.blogspot.com/
 
పుట్టిన తేదీ: జనవరి 20
 
పుట్టిన స్థలం: విజయవాడ
 
ప్రస్తుత నివాసం: మయామి, అమెరికా
 
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)
 
విద్యాభ్యాసం: ఇంజనీరింగ్
 
వృత్తి, వ్యాపకాలు: ఐటి ప్రొఫెషనల్, గృహిణి, పుస్తకాలు, పాటలు, సినిమాలు… అతి ముఖ్యంగా, దగ్గర స్నేహితులతో బోల్డంతసేపు మాట్లాడుకోవడం
 
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ: July 16, 2007
 
బ్లాగ్ లోని కేటగిరీలు: నాలుగంటే నాలుగు!

 • జాజుల జావళి (కవితలు)
 • ఊసులాడే ఒక జాబిలట (నవల)
 • ఏదో ఎంతో చెప్పాలని (అవీ ఇవీ కధలు, ఆర్టికల్స్)
 • చిన్నారి సిరి (చిన్నపిల్లల సిరీస్)
 

నిషిగంధ కవిత్వం గురించి ప్రముఖ కవి,విమర్శకులు అఫ్సర్ ఇలా అంటున్నారు… 
                                                                                                        
 
పొద్దుటెండలోని మెత్తదనం
 నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు
తుంపులు తుంపుల జ్ఞాపకాలూ
గాఢమైన దిగుళ్ళూ
మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

ఈ వాక్యాలు నేరుగా రేవతీదేవికి కొనసాగింపు లాగానే అనిపించాయి మొదటి సారి చదివినప్పుడు- ఈ కవిత చదివిన తరవాతనే నాకు ‘నిషిగంధ’ నిజంగా పరిచయమయింది. ఈ కవిత తరవాత ఆమె ఇతర కవితల్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు, ఆమె బ్లాగు(‘మానస వీణ’) నాకు కొత్త కవిత్వ స్వరాన్ని వినిపించింది.  నిషిగంధ (కిరణ్మయి యలమంచిలి) నిజానికి వొక abstract painter తన  కవిత్వంలో! ఈ అనుభూతికి ఆకారం ఇవ్వలేము అనుకున్న abstract వస్తువుని తీసుకుని, దానికి వొక concrete రూపం తొడిగే పదచిత్రకారిణి నిషిగంధ. పైన ఉదాహరించిన పంక్తుల్ని చదివినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది మనకు! వొక ప్రతిభావంతురాలయిన చిత్రకారిణి తన రంగుల చిటికెన వేలు మనకిచ్చి వొక అనుభవ మహారణ్యంలోకి దారితప్పకుండా నడిపించుకు వెళ్తున్నట్టు కవిత అంతా అలవోకగా నడిపిస్తుంది నిషిగంధ. మచ్చుకి వొకటి:

ఆకాశదీపాలన్నీ వెలిగాక

నీ ఆనవాలేదో
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది..

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది…
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

ఈ కవిత చదువుతున్నప్పుడు దాన్ని వెంటనే నేనొక పెయింటింగ్ లోకి  తర్జుమా చేసుకున్నా. నిషిగంధ బ్లాగులో మొత్తం కవిత్వమే వుంటే ఎంత బాగుణ్ణు అనిపించేలా వొక్క రోజులో ఆమె కవితలన్నీ చదివేశాను. వొక్క వాక్యంలో ఆమె కవిత్వ విజయాన్ని గురించి చెప్పాలంటే: ప్రతి కవితలోనూ వొక కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తూనే, తన/మన మనసులోని అవ్యక్త భావాలకు ఫ్రేమ్ కట్టే ప్రయత్నం చేస్తుంది నిషిగంధ. వొక ఇంప్రెషనిస్ట్ చిత్రశిల్ప రహస్యం ఇది.

(వాకిలి అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో… )

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

2005-2006 లలో తెలుగుపీపుల్.కామ్ అనే ఫోరమ్ లాంటి సైట్‌లో కవితలు రాసేదాన్ని.. అక్కడ డిస్కషన్స్‌లో ఒకసారి ఒక స్నేహితుడు చెప్పాడు, ఇలా బ్లాగ్స్ అనే ప్రపంచం ఒకటి ఉందనీ, మన ఓన్ వెబ్‌సైట్‌లాంటిది, మల్లెపూల నించీ ములక్కాయ పులుసు వరకూ మనక్కావల్సినవన్నీ రాసుకోవచ్చనీ, దానిమీద సర్వహక్కులూ మనవే ఉంటాయనీ! అలా తను ఇచ్చిన కొన్ని బ్లాగ్ లింక్స్‌లో నన్ను వెంటనే ఆకట్టుకుంది, స్నేహమా బ్లాగ్! రాధిక కవితలే కాకుండా అలా కవితలన్నీ ఒకచోట ఉండటం కూడా నాకు చాలా నచ్చేసింది. అలా అప్పటికప్పుడు నేనూ ఒక బ్లాగ్ ఓపెన్ చేసి పాత కవితలన్నీ పోస్ట్ చేశాను.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

సానుకూల అంశాలు….

ఇక్కడ టివిలో ‘సెక్స్ అండ్ ద సిటీ’ అని ఒక సీరియల్ వస్తుంది. అందులో నలుగురు ఇండిపెండెంట్ అమ్మాయిలు, పూర్తిగా వేరే వేరే మనస్తత్వం ఉన్న వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఎపిసోడ్‌లో వాళ్ళ స్నేహాన్ని చూసినప్పుడల్లా అనుకునేదాన్ని, అసలు ఆ ఫ్రెండ్‌షిప్ రెసిపీ ఏంటో నాక్కూడా తెలిస్తే బావుండని! అదొక్కటి తెలిస్తే కాదు అలాంటి ఫ్రెండ్స్ కూడా దొరకాలి కదా!! ఆ కోరిక నాకు బ్లాగ్స్ వల్ల తీరిందని చెప్పొచ్చు.. ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ కంఫ్లీట్ లైక్‌మైండెడ్ వ్యక్తుల మధ్యనే ఉండక్కర్లేదు. యెస్, కొన్ని బేసిక్ అభిప్రాయాలు కలవడం వల్ల స్నేహం ప్రారంభమైనా once you like a person you will learn to respect the other opinions/qualities of that person — అనే విషయం ఇక్కడ ఏర్పడిన స్నేహాల వల్ల ఇంకాస్త స్పష్టంగా అర్ధమైంది.

ఎంత సాధించినా, ఎన్ని తెలిసినా మామూలుగా హంబుల్‌గా ఉండటమెలానో కొంతమందిని చూసి నేర్చుకున్నాను.

అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే…. నా కంటే వయసులో ఎంతో చిన్నవాళ్ళైన కొంతమంది బ్లాగర్స్‌లో ఉండే మానసిక పరిణితి, కాన్ఫిడెన్స్, పట్టుదల లాంటివి చూసి నాకెంతో సంభ్రమంగా అనిపిస్తుంది.. ఆ వయసులో నేను బావిలో కప్పలా కాలం గడిపేశానే అని కాస్త బాధ వేస్తుంది.. వాళ్ళిచ్చే ఇన్స్పిరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే!!

 

పరిమితులు…

నా వరకూ నేనేం పరిమితులని ఎదుర్కోలేదు…

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

మహిళగా అసలు ప్రత్యేకత ఏమీ లేదు కానీ, బ్లాగర్‌గా అంటే — భావుకత్వం.. అదే నా బ్లాగ్ మెయిన్ ఐడెంటిటీ!

సాహిత్యంతో మీ పరిచయం?

ఆ మధ్య పాదర్స్ డే నాడు ఫేస్‌బుక్‌లో రాసుకున్న పోస్ట్‌లో..
“నాన్న కంటే పెద్ద హీరో ఇంకొకరుండరు.. ముఖ్యంగా మా అమ్మాయిలకి!!” అనుకున్నాను..

నాకు సాహిత్యమంటే నాన్నే! చందమామ, బాలమిత్రల ఏడో తరగతిలోనే శరత్తునీ, జిడ్డు కృష్ణమూర్తినీ చేతిలో పెట్టి ఏది నచ్చితే అది చదువుకో అన్నారు.. ‘బడదీదీ’ చదివాను అప్పుడు.. ఆ తర్వాత ‘సంస్కరణ ‘ (ఎవరు రాశారో అస్సలు గుర్తు లేదు!) అనే నవల ఇచ్చారు.. అలా అని కావ్యాలూ, క్లాసిక్సూ లాంటివేవీ చదవలేదు! కానీ చదవడం అనే అనుభవాన్ని పరిచయం చేశారు.

జీవననేపధ్యం:

పెద్దగా చెప్పడానికేమీ లేదు. సాధారణ కుటుంబమే! అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగస్తులవడం వల్ల ఇంట్లో చిన్నప్పట్నించీ  ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, పనులు పంచుకోవడం, పంక్చువాలిటీ లాంటివి చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేశేవాళ్ళు.. మామూలుగా కొన్ని కుటుంబాల్లో ఉన్నట్టు ఒకళ్ళు గారాబం, ఇంకొకళ్ళు గాంభీర్యం.. ఇలా కాకుండా అమ్మా నాన్న ఇద్దరి భయం మాకు ఉండేది! కాకపోతే అమ్మ కాస్త ఎక్కువే స్ట్రిక్ట్.. నాన్న మాత్రం అప్పుడప్పుడు ఆటవిడుపు ఇచ్చేవాళ్ళు.. సినిమాలు, పుస్తకాలూ, పాటలూ, టెన్నిస్ మ్యాచ్‌లూ అంటూ పక్కన కూర్చోబెట్టుకుని చాలానే ప్రపంచాన్ని చూపించారు.

చిన్నవయసులోనే బోల్డన్ని సినిమాలు చూపించేసి మమ్మల్ని పాడుచేశేస్తున్నారని అమ్మ మొత్తుకునేది! అయినా సరే పాత బ్లాక్‌ అండ్ వైట్ సినిమాలు ముఖ్యంగా పౌరాణికాలు రీరిలీజ్ అయినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి చూపించేవరకూ ఆయనకి మనశ్శాంతి ఉండేది కాదు!

ఒకసారి ఇలానే భూకైలాస్ వచ్చిందని మమ్మల్నీ, మా మామయ్యగారబ్బాయినీ తీసుకుని బయలుదేరారు. అమ్మ ఎప్పట్లానే బ్లాక్&వైట్ బోర్ అని హాయిగా పడుకుంది. మేము ధియేటర్ దగ్గరికి వెళ్ళామో లేదో అక్కడ సెంటర్లో నాన్న బెస్టెస్ట్ ఫ్రెండ్ కనిపించారు. నాన్న ఇహ ఆయనతో బాతాఖానీ అనే మహత్తర అవకాశాన్ని వదులుకోలేక జేబులోంచి డబ్బులు తీసి మా కజిన్ కి ఇచ్చి (తనే మాలో కాస్త పెద్ద అన్నమాట), ‘అదిగో అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్లు తీసుకుని సినిమా చూసేసి, తిన్నగా ఇక్కడికే రండి ‘ అని చెప్పి కబుర్లలో మునిగిపొయారు.

మేము బుద్దిగా టికెట్లు తీసుకుని అప్పటికే చాలా లేట్ అయిందని పరుగులు పెడుతూ లోపలికెళ్ళాం.. చీకట్లో తెర మిద రంగులు రంగులు కనబడుతున్నాయ్!!! అదేంటీ సినిమా బ్లాక్&వైట్ కదా అనుకున్నా, మళ్ళీ ముందు వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లు ఏమో అని సీట్లో సెటిల్ అయిన ఐదు నిమిషాలక్కానీ అర్ధం కాలేదు, రాంగ్ థియేటర్.. రాంగ్ మూవీ అని! కానీ మాకు ఎంచక్కా కలర్ సినిమా చూడటమే ఇష్టం కాబట్టి చివరి వరకూ కదలకుండా (ఇంటర్వెల్‌లో కూడా) చూశేశాం.. ఇంటికొచ్చాక తెలిసింది, మేం చూసిన సినిమా శ్రీవారి ముచ్చట్లు అని!! దేవుడా, ఆ రోజు మా అమ్మ చదివిన దండకం సేవ్ చేయడానికి ఇవ్వాళ్టి గిగాబైట్ల మెమరీనే తక్కువయ్యేది! :))

ఆ సంఘటన తర్వాత మాకు చాలా రోజులు సినిమా కర్ఫ్యూ విధించబడినా నాన్నమాత్రం వాళ్ళు వెళ్ల్చొచ్చినప్పుడల్లా స్టోరీ మొత్తం భలే ఇంట్రెస్టింగ్‌గా చెప్పెవాళ్ళు! కానీ చదువులో కాస్త అటూ ఇటూ అయితే మా వీపులు విమానం మోత మోగించేదీ నాన్నే!! 🙂

 స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

నేను రాసేదే చాలా తక్కువ కాబట్టి పెద్ద ఇబ్బందులేవీ ఎదురుకాలేదు కానీ, కొన్ని రాతల్ని చదివి అవి నిజజీవితానికి అన్వయించేయడం చూసి అప్పుడప్పుడూ విసుగైతే కలిగేది!

 బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

ఊసుపోకో, వదిలేయలేకో రాసుకున్న మన భావాలు ఇంకొంతమందికి కూడా నచ్చడం, వాళ్ళు దానిమీద స్పందించడం అసలు నా దృష్టిలో పేద్ద అనుభవం. కొన్ని కొన్ని సార్లు కామెంట్స్ చూసి ‘రియల్లీ..’ ‘నో వే..” అనుకున్నాను! ఆ సంతోషం నిజంగా ప్రైస్‌లెస్!!

ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రతిస్పందన ఏంటంటే, నేను రాసిన శ్రీవారికి ప్రేమలేఖకి

“…. నీ పేరుతో ఉత్తరం మొదలెట్టాల్సి వస్తే.. చివరి దాకా నీ పేరే ఉంటుందని, మధ్యన ఇంకో పదానికి ఆస్కారం ఇవ్వదు నా మనసు..” అంటూ పూర్ణిమ శ్రీవారే బదులిస్తే..  ఎలా ఉంటుందో చాలా అందంగా సమాధానం చెప్పడం!!

ఇష్టమైన బ్లాగర్ నించి ఒక విలక్షణమైన ప్రతిస్పందన! ఒక అబ్బాయి మనసులోకి పరకాయప్రవేశం చేయడానికి తను చేసిన ఒక సిన్సియర్ ప్రయత్నం!! చాలా చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది ఆ పోస్ట్ చూసినప్పుడు.. అప్పుడు తన టపాలో అబ్బాయిలలో భావుకత్వం గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా నడిచింది. 🙂

 I really miss those days! 😦

 బ్లాగ్ కోసమే కాకపోయినా నా బ్లాగ్‌లో ఉన్న కవితల వలన నేను చేసిన రచన, ‘ఊసులాడే ఒక జాబిలట ‘ నవల. కౌముది కిరణ్‌ప్రభ గారు నా కవితలు, చిమటమ్యూజిక్‌ సైట్‌లో నేను రాసిన చిన్నచిన్న ఆర్టికల్స్ చదివి ఈ నవల రాయడానికి ప్రోత్సహించారు. నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రచన మాత్రం ఇదే!

మానవాళి క్షేమం కోరి అపుడపుడూ కాదు తరుచుగా వచనం రాయాలి మీరు. హ్యూమర్ బావుంది. కవిత్వం రాయడం బావుందా వచనమా నిషిగంధ ?

వచనం చదవడం ఇష్టం.. కవిత్వం రాయడం ఇష్టం..కవిత్వంతో అయితే చాలా చెప్తూనే ఏవీ చెప్పలేదన్న లేక అసలేం చెప్తున్నామోననే సందేహావస్థ కలిగే భావన తెప్పించవచ్చు.. నాకు అది చాలా ఇష్టం. 🙂
వచనంతో అలా కుదరదు. మనసులో కార్నర్స్ ని ఫ్లడ్‌లైట్ వెలుతురులో పెట్టి చూపిస్తున్నట్టనిపిస్తుంది.కానీ ఏ బద్దకపు మధ్యాహ్నమో, ముసురుపట్టి కాలు బయటపెట్టనివ్వని ఉదయాలలో ఏమన్నా చదవాలనిపిస్తే ఖచ్చితంగా అది వచనమే అయి ఉంటుంది.

 
నిషిగంధ అన్న పేరుని ఎంచుకోవడం వెనుక ప్రేరణ ?
 
 
ప్రతిరోజూ మధ్యాహ్నం రేడియోలో ‘ఆప్ కీ ఫర్మాయిష్ ‘ కార్యక్రమం అనుకుంటాను ఒకటీ-ఒకటిన్నరకి వస్తుంది/వచ్చేది. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక ఆదివారం ఈ కార్యక్రమం వింటున్నప్పుడు ఒక పాట మొదలైంది… ఆ గాయకుడి వాయిస్, ఆ సంగీతం, అప్పటివరకూ వినని ఎన్నో కొత్త హిందీ పదాలు.. ఇదని చెప్పలేనితనంతో.. ఇష్టంతో రేడియోని ఇంకాస్త దగ్గరకి  జరిపి, తల టేబుల్ మీద వాల్చేసి వినడం మొదలు పెట్టాను.. అందులో చివర్లో వచ్చింది ‘నిషిగంధ కే సుర్ మే..’ అని! ఆ నిషిగంధ అనే పదం చాలా నచ్చేసి మానాన్నగారితో చెప్పాను, నా పేరు తీసేసి ఈ పేరు పెట్టుకుంటాను అని.. ఆయన నవ్వి, అలా కుదరదు కానీ ఊరికే కలం పేరుగా పెట్టుకో అన్నారు! అప్పట్లో కలం పేరు అంటే కాస్త కూడా అవగాహన లేదు. బట్, ఆ పేరుని మాత్రం డైరీల్లో మొదటి పేజీల్లో ‘Nishigandha’s…’ అని రాసుకుని చాలా సంతోషపడేదాన్ని. మొదట్లో అది ఒక రాగం పేరు ఏమో అనుకున్నాను.. ఎందుకంటే పాటలో ఈ లైన్ అలానే ఉంటుంది కదా!

తర్వాత నేను కాలేజ్ లో చదువుతున్నప్పుడు మా సీనియర్ ఒకమ్మాయి మొదటిసారి వాళ్ళింటికి తీసుకెళ్ళినప్పుడు, అక్కడ నేమ్ ప్లేట్‌మీద ఈ పేరు చూసి ఎంత ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యానో.. అప్పుడే తెలిసింది ఈ పేరు పుట్టు పూర్వోత్తరాలు..

అప్పట్లో నాకు నచ్చిన పాటలన్నీ మానాన్నగారికి నచ్చినవే! 🙂 కానీ ఈ పాట మాత్రం నాకు నేనుగా అంటే మా నాన్నగారి ప్రభావం ఏ మాత్రం లేకుండా ఇష్టపడ్డ పాట.. అందుకే నేను ఏదో రాస్తాను, రాయాలీ అనుకున్నప్పుడు అప్పటి మానాన్న మాట గుర్తొచ్చి ఇంకేమీ ఆలోచించకుండా ఈ పేరునే కలం పేరుగా పెట్టేసుకున్నా. ప్చ్, ఆయన చూసి ఉంటే ఎంత నవ్వుకునేవారో, ‘ఇంతోటి రాతలకి మళ్ళీ అంత చక్కని కలం పేరా!’ అనీ 🙂
ఉత్సవ్ లో ఈ పాట అన్నా, పాడిన సురేష్ వాడ్‌కర్ అన్నా ఎప్పటికీ స్పెషలాభిమానం నాకు. 🙂
 

సాహిత్యాన్నీ మియామీ ని కలిపి ఏవన్నా చెప్పండి ?

ఒక రోజు మధ్యాహ్నం డాక్టర్స్ ఆఫీస్‌కి ఆఘమేఘాల మీద వెళ్తూ, కార్లో రేడియో చానెల్స్ మారుస్తుంటే ఉన్నట్టుండి ఒకమ్మాయి గొంతు వినిపించింది, ఏదో చదువుతున్నట్టు.. ఖచ్చితంగా న్యూస్ మాత్రం కాదని రెండు సెకన్లకే అర్ధమైపోయింది.. తన గొంతు తప్ప ఇంకేమీ వినబడని స్వచ్చమైన semi silence అది!
 

“…I don’t watch telenovelas. I hate drama. That’s why I live in Doral. (In Doral, the most dramatic thing that happens is golf.) But. When my mother calls to tell me about the filming, I say, “ I’m coming!” “

అది ఒకమ్మాయి — తన పేరెంట్స్ ఉండే నెయిబర్‌హుడ్‌లో జరుగుతున్న ఒక టివిసీరియల్ షూటింగ్ గురించీ, అక్కడ నివసించే మనుషుల గురించీ, ఆ సమయంలోనే కొడుకుని ఆల్మోస్ట్ నీళ్ళల్లో ముంచేసి చంపేయబోయిన ఒక అబ్యూసివ్ తండ్రి గురించీ, దాని గురించి పెద్దగా పట్టించుకోని పోలీసుల గురించీ… చెప్తున్న కధ!

“… I know the camera only sees what it wants. But I keep trying to look outside the frame, to catch sight of the crowd watching from across the street. I want to see myself, living outside the drama.

But I can’t…”

ఇలా ముగిసేవరకూ నేను రియలైజ్ అవనే లేదు, నేను డాక్టర్స్ ఆఫీస్‌కి వచ్చేసి, పార్క్ కూడా చేసేసి, కదలకుండా ఆ కధ వింటున్నానని

మయామి అంటే పార్టీ సిటీ! బీచ్‌లు, క్లబ్‌లూ, ఓషన్ డ్రైవ్ మీద హిప్‌హాప్ బ్యాండ్లూ… ఇంతే నాకు తెలిసిన మయామి.. పెద్దగా ఆసక్తి కలిగించని మయామి! ఇక్కడ మ్యూజిక్‌కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగతా వాటికి ఇవ్వకపోవడంతో కొంచెం డ్రైగా అనిపిస్తూంటుంది. నా చుట్టూ ఉండేవాళ్ళు చదివేవి Twilight, 50 Shades of Gray, Inferno… లాంటి పుస్తకాలే కాబట్టి నాకు లోకల్ సీరియస్ లిటరేచర్ గురించి కానీ, ఆథర్స్ గురించి కానీ తెలీదు!

కానీ ఈ రేడియో కధ విన్నాక కొంచెం సంతోషం వేసింది, there is a thing called literature here in Miami! అని… ఇది కూడా సీరియస్ లిటరేచర్ కాకపోవచ్చు కానీ ఆ కధల్లో వాళ్ళ హృదయం ఉంది, నిజాయితీ ఉంది!

ఇంకా చాలా స్టోరీలు ఉండాలి, ఫెడెక్స్ డ్రైవర్ గురించీ, కొత్తగా అర్జెంటైనా నించి వచ్చిన ఒకబ్బాయి ఇబ్బందుల గురించీ, ఇలా.. కొన్ని మాత్రం ఇక్కడ చదవొచ్చు — http://wlrnunderthesun.org/category/miami-stories/

మీ బ్లాగు టపాల్లో మీకు నచ్చినవి:

 అదే వాన… (కవిత)

http://nishigandha-poetry.blogspot.com/2009/11/blog-post_22.html

 అనగనగా ఒక రోజు…. (వచనం)

http://nishigandha-poetry.blogspot.com/2011/01/blog-post.html

******************************************************************

61 thoughts on “మోహ మకరంద – నిషిగంధ

 1. Nice. ఇంతకన్నా ఏమీ చెప్పలేనమ్మాయి!

  అసలు నువ్వు వ్రాసింది చదువుతుంటే ఏదో లోకాలకి వెళ్ళిపోతాం…ఎంతగా అంటే మళ్ళీ అక్కడినుండి తిరిగి రావటానికి ఇష్టపడనంతగా!

 2. నిషీ ,

  ఎంత సాధించినా, ఎన్ని తెలిసినా మామూలుగా హంబుల్‌గా ఉండటమెలానో కొంతమందిని చూసి నేర్చుకున్నాను.
  ————————-
  seriously ? హ హ అలా ఉండటం మీనుంచి నేర్చుకోవాలి అనుకుంటాను నేను, మీకు నేర్పిన గురువులు ఎవరబ్బా ? 🙂

  తెలిసినవే అయినా మళ్ళీ ఈ వివరాలు చదవటం చాలా బావుంది నిషీ ! బావుకత్వం చాలా మంది మాటల్లో చూపిస్తారు కానీ ఆచరణ లో కూడా అదే సున్నిత్వం చూడటం చాలా చాలా అరుదు . అలాంటి వ్యక్తి నాకు ఒకరు తెలుసు అనుకోవడం చాలా బావుంది ! కవిత్వం రాయడం నాకు ఇష్టం అంటే కుదరదు కాక కుదరదు అప్పుడప్పుడు ప్రజల సంక్షేమం కూడా పట్టించుకోవాలి 🙂

  Nice one Nishi ! Thanks to you too Malleswari gaaru !

   • హ హ 🙂 సరే మీరు ధన్యవాదాలు చెప్పారు కదా నన్ను సారీ చెప్పనివ్వండి ఆ పైన అలక ని డీలీట్ చేసేయండి 🙂

   • అడిగాను అలకని పోతావా అని డిలీట్ ఆప్షన్ లేదట శ్రావ్యగారూ… అలక తీరితే గానీ పోదట.. అయినా నేను వదలనుగా. ఈ సీరీస్ అయ్యేవరకూ నా బ్లాగ్ గీతం ఏంటంటే ‘నిను వీడని నీడని నేనే…’

 3. నీ టపాలంత అందంగా ఉంది నీ ఇంటర్వ్యూ కూడా! నీ అసలు పేరేదైనా నిన్ను నిషిగానే గుర్తుంచుకుంటా , ఫోన్లో కూడా అలాగే పిలుస్తాను చూడు.నీకు తగ్గ పేరదే! నువ్వదే!

  చల్లని సాయంత్రాలు కమ్మ కమ్మని పరిమళాలు వెదజల్లే రజనీ గంధవి

  • సుజ్జీ! హమ్మ్… ఇలా రాసేసి మాటల కోసం దిక్కులు చూశేలా చేసేస్తావు!

   బ్లాగులో పరిచయమైన డే వన్ నించీ నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం, చాలా మంది కొత్తవాళ్ళకి నా కవితల్ని పరిచయం చేయడం, ఎవరో రాసిన రాతల్లో నా మాటలు వెదుక్కుని ‘ఇది నిషి రాసినట్లు ఉందే!’ అనుకోవడం… ఇవన్నీనే ఇప్పటి ఈ అస్థిత్వానికి కొన్ని కారణాలు!

   THANK YOU SO MUCH!!

 4. అమెరికా లో ఆకురాలే కాలపు లేత సాయంకాలాలలోని అమ్మ కొంగు వెచ్చదనం మీ భావుకత్వం.

  అశాంతానిశ్చితాందోళనా కాలాల చలుల్లోనో, లైఫ్స్ కోల్డ్ స్టేర్ వణికించిన సమయాల్లోనో, తెలీకుండా తప్పిపోయివచ్చిన తోవల్నేవో వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ దార్లు మీవి, కల్ హార స్వాతి గార్ల లాంటి బాక్ యార్డ్స్ లోంచి వెళ్తూంటాయి.

  కాసేపు కూర్చుంటాను.

  చిన్నప్పుడెప్పుడో చదువుకున్న కండెన్సేషన్ , అనుభవమై కళ్ళల్లోకొచ్చాక, ఆర్ధ్రత అమ్మయి కళ్ళు మూస్తుంది. ప్రశాంత నిద్ర అమ్మకొంగయి కప్పేస్తుంది.

 5. మల్లీశ్వరిగారు, మీరీ సిరీస్ మొదలు పెట్టిన దగ్గరనుండి నిషిగారి ఇంటర్వ్యూ ఎపుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానండీ. మీరు ప్రశ్నలు లైట్ గా కస్టమైజ్ చేసి అడగడం బాగుంది.
  నిషి కవితల్లాగే తన జవాబులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అందరితో పాటు నాదీ అదే రిక్వెస్ట్ నిషీ.. మీరు కవితలతో పాటు అపుడపుడు వచనం కూడా రాస్తూ ఉండాలి. మీరు కౌముదిలో రాసిన చిన్నారి సిరి కూడా నాకు చాలా ఇష్టం.

  • వేణూ శ్రీకాంత్ గారూ
   నిషి ఇంటర్ వ్యూ పోస్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. కొంచెం తీరిక చిక్కగానే తనకి ప్రశ్నలు పంపాను .
   మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు

   • స్త్రీలని కూడా మోహ పరిచే రంగురంగుల పూలతేనె వంటి తియ్యని పిల్ల కదా నిషిగంధ!!అందుకే ఆ పేరు పెట్టాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు

  • థాంక్యూ సో మచ్, వేణూ… అసలంటూ రాయడమే నాకు కష్టం. మీ పవర్‌స్టార్ మాటల్లో చెప్పాలంటే ‘నాక్కొంచెం తిక్కుంది.. ‘ 🙂 🙂

   మూడ్, సమయాలు కలిసి వస్తేనే కాదు పక్కింటి కుక్క అరవకూడదూ, చెట్టు మీద కాకి కావ్ మనగూడదూ లాంటి చాలా విషయాలు కూడా సైమల్టేనియస్‌గా సంభవించాలన్నమాట!

   అవును, ప్రశ్నలు అలా కస్టమైజ్ చేయడం వల్ల నేనూ ఎంజాయ్ చేశాను, రాశేప్పుడు 🙂

 6. వావ్ చాలా బాగుంది ..మీ గురించి చాలా విషయాలు తెలిసాయి…. ..మీ కవితల్లో కొన్ని చదువుతుంటే వాటిలో బావననుండి తొందరగా బయటకు రాలేను ..నిషి గారు థాంక్స్

 7. కుమార్ గారు చెప్పేసిందే కాపీ పేస్టు:))సురేష్ వాడేకర్ అన్నా, నిషిగంధ అన్న పేరన్నా, ఆ పూలన్నా నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా నిషీ:))ఇంకేమి చెప్పను…ఏమి చెప్పాలో తోచడం లేదు:(((

 8. నిషిగంధగారు మొన్నీ మధ్యే ఓ మిత్రుడిస్తే ఊసులాడే ఓ జాబిలట చదివాను. పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని. మంచి నవలలు లేవని బాధపడుతున్న తెలుగు ప్రపంచానికి ఈ జాబిలిని చూపిస్తే చాలు. బాధ వీడి ఆనందాల వెన్నెల కురుస్తుంది. నిజంగా హాట్సాఫ్. అన్నింటికి మించి అందరికీ ఉండే 24 గంటల్లోనే మీరింత సాహితీ సృష్టి చేయటం నిజంగా గ్రేట్. అదీ మియామీలో ఉండి. గ్రేటో!

  • సంతోష్ గారు, చాలా హేపీగా అనిపించిందండీ ఆ జాబిలి మీక్కూడా నచ్చిందంటే! కానీ, మీరన్నట్టు నేను సమయాన్ని ఎఫీషియంట్‌గా ఏమీ ఉపయోగించుకోనండీ. నన్ను ఎరిగినవాళ్లందరికీ తెలిసిన విషయమే ఇది! 🙂
   థాంక్యూ సో మచ్, మీ చక్కని కామెంట్‌కి! 🙂

 9. నిషిగంధ గారు,మనసు దోచి భావలోకంలో విహరింప చేసే మీ కవితా జాజులు నన్నీ జగతి మీదకి రావద్దనే అంటాయి. ఎప్పటికీ ఆ భావుకత్వం లోని కమ్మదనమే కావాలనిపిస్తుంది.

  ‘ఊసులాడే ఒక జాబిలట’…అందులో లీనమైపోయాను.

  మల్లీశ్వరి గారు, మీకు నేను చెప్పాలనుకున్న థాంక్స్ చాలా తక్కువ.మరి, ఏం చెప్పాలో తెలీటంలేదు.

 10. ఒకప్పటి మాపక్కింటి చిన్నపిల్ల విజయలక్ష్మి టీచర్ గారమ్మాయేనా నిషిగంధ! అద్భుతంకదా, ఈ విజయవాడ సుగంధం! మమ్మల్ని ఇలా కలిపినందుకు మల్లీశ్వరనిషిగంధ పరిమళాన్నీ అబినందిస్తూ…

  • సత్యవతి గారూ,
   నిజంగా అద్భుతమే!!నాకే ఇంత సంతోషంగా ఉందంటే ఇక నిషిగంధకి…
   మీ ఇద్దరినీ ఇలా కలిపినందుకు మంచి బహుమతి నివ్వాలి మీరొక కధ.. నిషి ఒక కవిత…

  • ఇది ఎలా సాధ్యం!!!!!!!!!!!!!!!!!

   నాకెంతో నచ్చే, నేనెంతో ఇష్టపడే ‘దమయంతి కూతురు ‘ , ‘ఇల్లలకగానే’ సత్యవతి గారు నన్ను ఎరుగుదురా!!!!!!!!!
   అసలు ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదండీ..

   అమ్మ గురించి చెప్పేశారంటే ఇక సందేహాలకి తావే లేదు!! అసలు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను..
   సత్యవతి గారూ, ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలూ మీతో పంచుకోవాలి. అసలు అలా ఎలా గుర్తు పట్టేశారో !?!?!?

   మల్లీశ్వరి గారూ, మీ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు నాకు లభించిన పే…ద్ద బహుమతి ఇదేనండీ!! ఇంత సంతోషాన్నిచ్చినందుకు థాంక్యూ.. థాంక్యూ!!!

 11. పరిచయానికి టైటిల్ చాలా న్యాయం చేసింది. నిషిగంధ … ఈ పేరంటేనే ఎంత మోహమో నాకు. నీ అక్షరాలు నన్ను మోహపాశాల్లో బంధించి, మైమరుపులో ముంచుతాయి, అచ్చం హేమంతపు ఉదయాల్లో భానుకిరణాల కౌగిల్లో సేదదీరిన వెచ్చదనంలా. ఎన్నోసార్లు నాకు చేతకాని, అంతుచిక్కని భావాల అలజడిని నీ అక్షరాల్లో చూసుకుని సంతృప్తి పొందుతుంటాను. నీ రాతలా, నీ స్నేహమా ఏది నాకు ఎక్కువ ఇష్టం అంటే చెప్పడం కష్టం.

  రాఖీ ఎపుడో గుల్జార్ తో అందిట “నీ కవిత్వమే లేకపోతే నువ్వొట్టి పూలులేని జార్ వి మాత్రమే” అని. (ఇది నా పైత్యం లే. తనన్నది నువ్వు అతి మామూలు మనిషివే తప్ప, ఇంకే ప్రత్యేకతా నీకు లేదు” అని.) నీకా సమస్యే లేదు. మోహ మకరందాలు, స్నేహ సుగంధాలు కలిసి విరబూయించగల స్వభావం నీసొంతం. You sure live up to your name.

  • పద్దమ్మా, కొన్నిసార్లు మన ప్రతిస్పందనల్ని స్పెల్ అవుట్ చేసి పదానికి పదంగా లెక్కేసి బయటకి చెప్పక్కర్లేదంటా! సింపుల్‌గా ‘థాంక్యూ, యూ నో వాట్ ఐ మీన్!’ అని చెప్పగానే ఈ మనసులోని కృతజ్ఞతంతా అర్ధవంతంగా ఎదుటి మనసులోకి తర్జుమా అయిపోతుంది! అయిపోయింది కదూ!?
   నేనంటే నా చుట్టూ ఉన్న మీరే! ప్రత్యేకతలూ మీలోని మీ భావాలే!

   ఎప్పుడూ చెప్పనేలేదు, మన గుల్జార్‌ని రాఖి అంత మాటందా!!!
   అయినా నీకు ఆ హీరోయిన్ అంటే అంతిష్టమా? ఆ కభీ కభీ పాటని అన్ని సార్లు వింటావా?? 🙂 🙂 🙂

 12. Moha Makarandha = very appropriate. ఇంకా జాజిమల్లి తెరమీద కనబళ్ళేదేమిటా అనుకుంటున్నా. పూలకీ పూలకీ మధ్యలో ఏమన్నా ఉందేమో, లోహపు మనుషులం మనకేం తెలుసులే అను ఊరుకున్నా ..
  బైదవే .. మీరు రాధికని పట్టుకోవాలి!!

  • నారాయణ స్వామి గారూ,
   మంచి కవిత్వ వచనం చెప్పారుగా ధన్యవాదాలు…రాధిక గారిని పట్టుకోవడమా! సర్! బస్తీమే సవాల్ సారీ సారీ… యుఎస్ మే సవాల్ మీరు ఆమె ఇంటర్ వ్యూ సాధించి పెట్టండి చూద్దాం

  • నారాయణస్వామి గారూ, పూలకీ పూలకీ మధ్యలో ఏముంటుందండీ.. కాలమనే దారం తప్ప.. 🙂 🙂

   మల్లీశ్వరి గారు, ఏదో సవాలు చిన్నగా విసిరారు, ట్రై చేయకూడదూ… ప్లీజ్ 🙂

 13. మల్లీశ్వరి గారూ, అసలా టైటిల్ ఎక్కడ నించి, ఎలా ఆలోచించి పెట్టారండీ బాబూ!!! ఇప్పటివరకూ మిస్సైన సగభాగం సడెన్‌గా కనిపించినట్లనిపింది ఈ పేరు చూడగానే!! చాలా బావుంది అంటే మర్యాదగా అవమానించినట్టే! నో వర్డ్స్ ఎట్ ఆల్!!

  నన్ను పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు, ఆ పైన ఒక పెద్ద బహుమతిని అందించినంధుకూ మీకు బోల్డన్ని ధన్యవాదాలు..

  ఇది రాయడం సాధ్యమైంది ముఖ్యంగా ఇద్దరి వల్ల..

  ‘నీ ఇంటర్వ్యూ కూడా చదవాలనుంది, నిషీ’ అని ఎప్పటినించో అంటున్న రాధిక..

  ‘నా గురించి నేనేం చెప్తాను… నాకసలు సరిగ్గా రాయడం కూడా రాదు.. అందరూ బోర్ ఫీలౌతారు.’ అని నసుగుతుంటే ఈ కింద మాట చెప్పి ఒక హెల్తీ పుష్ ఇచ్చిన మధుర!

  “నువ్వు రాసేది నీకు గొప్పని ప్రతీసారీ అనిపించకపోయినా అది ఎంతమందికి ఎలా కనక్ట్ అవుతుందో, ఎంత సంతోషాన్నిస్తుందో నువ్వు ఊహించలేని విషయం. So, you’ve to respect it and let the readers take that happiness from your writings. ”

  Thank you, girls!!

  THANK YOU ALL!!

 14. ఊసులాడే ఒక జాబిలట (నవల) naaku chaalaa chaala istamaina navala edi…..taruvaate mi abhimaanini ayyaanu….kavitala gurinchi mi interview gurinchi paina andaru cheppindi malli nenu cheppaali kottagaa cheppadaaniki naakem migala ledu andi…….manasuni parichaaru mi bhaavaalato kalipi

 15. మొదటగా టైటిలే నన్ను లాక్కొచ్చింది. ఊసులాడే ఒక జాబిలట నిన్న కాక మొన్నే చదివిన హ్యాంగోవర్ అక్కడ నుండీ నడిపించింది. ఇక్కడ చేరిన అందరూ చెప్పిన మాటలు వింటే ఓ చల్లని సాయంత్రం వేడి కాఫీని ఆస్వాదిస్తూ జరిగిన సాహిత్యగోష్టిలా అనిపిస్తుంది.

  ఇక్కడ జరిగిన చర్చలో మరో విశేషం, కొన్ని అద్భుతమైన టపాలు దుమ్ము దులుపుకుని తిరిగి వెలుగులోకి వచ్చాయి.

  కుమార్‌గారూ హ్యాట్సాఫ్ మీ కామెంట్‌కి

 16. A confession before I can say something about you.. ఇక్కడ చాలా మంది మహిళా బ్లాగర్ల ఇంటర్వ్యూలు చదివాను కానీ ఏదీ పూర్తిగా చదవలేదు. నాకు ఇంట్రస్టింగ్‌గా అనిపించని వాక్యాలు స్కిప్ చేసేసి అలా అలా అయిపించేసేవాడిని. మొదటిసారి ఒక ఇంటర్వ్యూ, దాని మీద పడిన కామెంట్లు అన్నీ ఓపిగ్గా చదవడం! మీరు చదివించేస్తారు మరీ! కుమార్‌గారి కామెంట్ ఒకమారు దా.వీ.శూ.క.లో ఎన్టీఆర్‌లా చదూకుని, నాలిక్కరుచుకుని, మళ్లీ ఎస్పీ బాలుడు కవిత్వం చదివినట్టు ఊహించుకున్నాను. 😉

  శ్రీమతి పద్మగారి కామెంట్‌తో ఏకీభవిస్తూ (అబ్బే.. మోహపాశాల గురించి కాదూ!!) yes, you live up to your name! May you be blessed with beauty and sheer pleasure of poetry for the rest of your life! 🙂

 17. అద్భుతః!

  ఓ కవిగారన్నట్లు…

  మంచి గుమ్మడికన్న, దంచిన ఎఱ్ఱని క్రొవ్వొడ్లబియ్యము కూడుకన్న
  మేల్ జహంగీరు మామిడిపండుకన్న, సుంకాఱిన లేసజ్జ కంకికన్న
  కమియపండిన ద్రాక్షకన్న, చక్కెర తగబోసి పండిన పాలబువ్వకన్న
  రసదాడి కన్న, పనసతొనకన్న, కజూరము కన్నను, జున్నుకన్న

  తీయనివి మీ మాటలు…మీరు రాసినవీ, మీగురించి రాసినవీ….

  మీ రచనలు ఇలాగే రసార్ధ్ర్రదరహాస చంద్రికలను వెదజల్లుతూ సాగిపోవాలని కోరుకుంటున్నాను.

  ఇన్ని రోజులుగా మీ రచనలు చదువుతున్నా, ఎప్పుడూ వ్యాఖ్య రాసే సాహసం చేయలేదు…భాషలోనూ, భావంలోనూ సమోన్నతంగా వుండే మీ రచనకు దిష్టిచుక్కగా నా వ్యాఖ్య మిగిలిపోతుందేమోనన్న బెరుకుతో! కానీ, జాజిమల్లి మోసుకొచ్చిన నిషిగంధ పరిమళం నన్ను మళ్ళీ మీ బ్లాగువైపు లాక్కొచ్చింది. ఈసారి ఊరుకోలేక, ఇంత ఆనందాన్నిచ్చిన మీకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.

  • గిరీష్ గారు, ఆలశ్యంగా స్పందిస్తున్నాను… క్షమించగలరు.
   మీకు కాదండీ, మీ కామెంట్‌కి తిరిగి ఏమన్నా రాయడానికి నాకు చాలా బెరుకు కలిగింది, రసాభాస చేస్తానేమోనని! ఇంత చక్కని భావవ్యక్తీకరణ తెలిసిన మీరు నా రాతల గురించి నాలుగు మాటలు చెప్పడమే చాలా సంతోషంగా ఉంది.
   ‘కొసరి కూసిన కోయిల కూత’ వంటి మీ అభిమానపూరిత వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙂

 18. ​@ మల్లీశ్వరి గారూ..
  ఎంత బాగా పెట్టారండీ టైటిల్.. నిషిగంధ పేరునే ఇంకోలా రాసినట్టుంది. 🙂
  తన కవితా సుగంధాలతో పాటు స్నేహపరిమళాలను కూడా తన చుట్టూ ఉన్నవారందరికీ ఆత్మీయంగా పంచే ఈ స్నేహగంధ మనసులో మాటలు కొన్ని వినడం చాలా బాగుంది. ​
  మహిళా బ్లాగర్లందరి గురించి మరింత తెలుసుకునే అవకాశం కల్పిస్తున్న మీరు అభినందనీయులు.

  • థాంక్ యూ మధురవాణీ…
   ఒక సారి వెనక్కి తిరిగి ముఖాముఖి పోస్ట్స్ అన్నీ చూసుకుంటే ఒక లోటు కనిపిస్తుంది. ఈ సుమధురానికి మంచి టైటిల్ పెట్టే శక్తి లేక కొటేషన్ ఇచ్చేసి వూరుకున్నానే అని వెల్తిగా ఫీలవుతాను. అది అచ్చంగా నాకు చెందిన భావన మాత్రమే. ఇంటర్ వ్యూ కి వచ్చిన లోటు కాదు. మీ ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది మధురా ….

 19. ఎంతో తెలుసనుకున్న మనుషుల గురించి కూడా తెలియంది చాలా వుంటుంది…అందులో కొన్నన్నా తెలుసుకోడానికి అప్పుడప్పుడూ ఇలాంటి వేదికలు కావాలి. జాజిమల్లి గారూ థాంక్యూ సో మచ్ అండి. ఇంటర్వ్యూకి మీ శీర్షిక మరింత అందాన్ని ఇచ్చింది. నిషీ నిన్ను ఇబ్బంది పెట్టి వుంటే సారీ. అభిమానిగా నిన్ను తరచూ ఇలా చూడడం నాకు ఆనందం….
  ఫ్రెండ్స్…..ఇంక ఎవరి కామెంట్లూ నేను చదవలేదు …మీరంతా నమ్మాలి….నేనింక జంప్

 20. “మనసులోని అవ్యక్త భావాలకు ఫ్రేమ్ కట్టే ప్రయత్నం చేస్తుంది నిషిగంధ” అఫ్సర్ గారు అన్న మాటలు నిజం కదూ అనిపిస్తుంటాయి మీరు రాసినవి చదువుతున్నప్పుడల్లా… మీ గురించి తెలుసుకోవటం బాగుంది.. అభినందనలు నిషిగంధ గారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s